"నిర్వికల్ప సంగీతం"- వాడ్రేవు చినవీరభద్రుడు


విమర్శలకు, విశ్లేషణలకూ దోసిలి ఒగ్గి నిల్చోవడం, నా దృష్టిలో కవిత్వపు లక్షణమే కాదు. కనుక, ఈ వ్యాసం నేనెంతగానో అభిమానించే ఒక పుస్తకానికి ఆత్మీయ పరిచయమే తప్ప వేరొకటి కాదు.

సాహితీ ప్రక్రియలన్నింటిలోకీ నాకు సమున్నతంగా కనిపించేది కవిత్వం. కథలు, కథానికలు గురించి బాగా వ్రాశారనో, వ్రాయలేదనో, మరింత మెఱుగ్గా వ్రాసేందుకు అవకాశముందనో తేలిగ్గా చెప్పేయగలం కానీ, కవిత్వం దగ్గరకొచ్చేసరికి, ఈ లెక్కలేవీ సరిపోవు. ప్రతిపాదించబడ్డ సిద్ధాంతాలూ, కవితలంటే ఇలానే ఉండాలన్న సంకుచిత భావాలూ, పదాడంబరాలకు ప్రజలు పెట్టుకున్న తప్పుడు తూనిక రాళ్ళు, అన్నీ, ఇవన్నీ కవితను చదవడం పూర్తయిన క్షణంలో మనకు కలిగే అనుభూతి ముందు తేలిపోవాల్సిందే, ఆఖరు స్థానాలు పొందాల్సిందే!

కవి ఏ అంతర్మథనానికి లోనయ్యి కవిత్వాన్ని సృజించాడో, కవిని, ఆ అక్షరాలను అర్థం చేసుకుంటే తప్ప మనకు అవగతమయ్యే అవకాశం లేదు. మనకు చప్పగా తోచింది మరొకరికి మహాద్భుతంలా కనిపించవచ్చు. మనకు కంట నీరు తెప్పించిన పంక్తులు, వేరొకరికి తోచీ తోచని పదాల అల్లికలా కనపడవచ్చు. ఒక్కోసారి సదరు కవికే తాను చెప్పదల్చుకున్నది చెప్పగలిగానా లేదా అన్న సందేహమూ కలుగవచ్చు - నా కవితలో నిజంగా ఇంత భావవైశాల్యం ఉందా అని తత్తరపడనూవచ్చు.

అయితే, నాకు సంబంధించినంతవరకూ, ఇవన్నీ పాఠకులకు అనవసరమైన విషయాలు. (సాధికారంగా విమర్శలు చేయగల సాహితీవేత్తలకు మాత్రమే మినహాయింపు). కవితలు వ్రాయడంలో మనిషి మనిషికీ శైలి మారుతూ పోయినట్లే, కవితను చదవడమూ, అనుభవించడమూ కూడా ప్రతి పాఠకునికీ ప్రత్యేకమైనవే. ఇది నేను బలంగా నమ్మిన కారణానికేమో, మరికాస్త ధైర్యంగా ముందడుగు వేసి, కవితల అందం ఇనుమడించేది, అందులోని సౌందర్యాన్ని దొరకబుచ్చుకు అనుభవించగల పాఠకుల వల్లనే నని మిత్రులతో అంటూ ఉంటాను.


ఒకటికి పది సార్లు చదువుతూ పోతుంటే, మెల్లగా మనసు పొరల్లోకి ఇంకుతూ, రసాస్వాదనకు ప్రేరేపించే కవితలు కొన్నైతే, చదివీ చదవగానే హృదయాంతరాల్లోని అనిర్వచనీయమైన భావాలను కుదిపి,  మనను సంతోషపు తరంగాల్లో తేలియాడించేవి మరి కొన్ని. వాడ్రేవు చినవీరభదుడి కవిత్వం చదువరులను ఆట్టే శ్రమపెట్టదు. తొలి పఠనాల్లోనే ఆకట్టుకోగల చక్కని సంకలనాల్లో వారి "నిర్వికల్ప సంగీతం" ఒకటి.

ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి కొన్ని ఉన్నాయి.


" నిజానికి ఇవాళ ఈ పూలతోటకి నేను మార్గ నిర్దేశకురాలిని కానక్కరలేదు కానీ ఒక ఉత్సాహం - నా ఆనందానుభూతి అందరికీ పంచాలన్న ఉత్సుకత -ఇలా చేయిస్తోంది" అంటూ ఆపేక్షగా మొదలెట్టి, "పూల సువాసనలోంచి తాకే అసోసియేషంకి ట్యూన్ కావడానికే కొంత అనుభూతి కావాలి. అలాంటిది, జీవితంలో కలిగిన అనేక సుఖదుఖానుభవాల స్మృతులు ఒక్కమాటతో, ఒక్క వర్ణనతో వచ్చి హృదయపు ముంగిట వాలేలా చేసిన కవిత్వానికి ట్యూన్ కావాలంటే ఎంత అనుభూతి గాఢత కావాలి?" అంటూ ప్రశ్నించి, కళ్ళను తరువాతి పేజీల వైపి పరుగులెత్తించిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి ముందుమాట, వాటిలో మొదటిది.

రెండవది, ఈ సంకలనం మొత్తం కవితలే కాదు. చక్కటి, చిక్కటి వచనం - కొన్ని ఉత్తరాల నుండి, కొన్ని డైరీలో మాటలు - బహుశా గుర్తుంచుకోదగ్గవి అని కవి భావించిన కొన్ని ఆలోచనలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిని కవితలు అనకపోయినా, ప్రతి అక్షరంలోనూ నిజానికి నిండి ఉన్నది మాత్రం కవిత్వ ధోరణే!

మూడవదీ, నాకు బాగా నచ్చినదీ ఏమిటంటే, అనేక భాషా సాహిత్యాలకు చెందిన కవిత్వాన్ని, తాత్వికతనూ కవి తనదైన రీతిలో అనుభూతి చెందుతూ, తెలుగులో వ్రాయడం. మూల కవితల రచయితనూ, చిరు పరిచయాన్నీ మాత్రమే ఈ కవితలతో పాటు ప్రచురించినా, కవితల్లోని గాఢత వల్ల, మూల కవితను చదువలేకపోయామన్న దిగులేదీ కలుగలేదు.

"ఇంటికున్న కిటికీలన్నీ తెరిచి అన్ని పవనాల్నీ ఆహ్వానించు
నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి చించుకుని రావాలి"   అన్న తిలక్ కవితా తత్వం నాకు చాలా చోట్ల ఈ సంకలనంలో స్ఫురణకొచ్చింది - ముఖ్యంగా ఈ అన్య భాషా కవితలను మన భాషలోకి చినవీరభద్రుడు తీసుకువచ్చిన పద్ధతిని చూస్తే - ఎందుకంటే అక్కడ భాష, మూలం ఎవరివైనా, అనుభూతి ఈ కవిదే. అక్షరాలు ఇతని గుండెల్లో నుండి వచ్చినవే.

బతికిన క్షణాలే బ్రతుకును గెలిపిస్తాయని నమ్మే కవి ఇతడు. అందుకే కాలం ఎంత కర్కశమైనదో చెబుతూ - దానిని ఎప్పుడు ఎలా ఆపగలడో కూడా ఈ కవితలో ఇలా వివరిస్తారు-

" యంత్రం నిర్దాక్షిణ్యంగా తిరుగుతూంటుంది.
<...>
కాని నిద్రకుపక్రమించే వేళ నా అనుభూతిని ఇష్టంగా పరిస్పర్శించినప్పుడు
దేహాల మృత్తికలోంచి నూత్న సృజనాంకురాలు ప్రభవించినపుడూ..
అప్పుడు మాత్రం యంత్రం ఒకసారి ఆగుతుంది.
పూవులు వికసిస్తాయి, వెన్నెల వర్షిస్తుంది"

" ఆత్మ హననం"లో మానవ సహజమైన నిరాశను, నిస్పృహను, గెలవాలన్న తపన నిలువెత్తూ ఉన్నా అనేకానేక సమస్యలకు లొంగిపోయి ఓటమిని ఒప్పుకునే మానవ ప్రవృత్తి గురించీ అద్భుతంగా చెప్తారిలా -

" ప్రతి హృదయం ముందు రాగోన్మత్తతతో కలల విపంచిని మీటి జీవన గాంధర్వంలో రాగనౌకా విహారం చేయాలనే ఉంటుంది. కానీ మాటల్లో దూసే కత్తుల్ని ఆపలేను; మనసు లోపలి పొరల్లోని మరకల్ని చెరపలేను.
ఉజ్వల కాంతితో, జ్ఞానపూర్ణత్వపు అర్థనిమిలీత నేత్రాలలో సత్యప్రవచనపు పెదాల్తో ప్రకాశించే నా ముఖచిత్రాన్ని గీయాలని కదా ఆశపడ్డాను. మరి ఈ చిత్రమేమిటి? భీతితో నిస్పృహతో నన్ను నేను కప్పిపుచ్చుకుంటున్నాను"

మనిషి మనిషికీ ఒక సంఘర్షణ ఉంటుంది. అంతర్లోకాలను స్వప్నించి, దర్శించి, తనేమితో తాను తెలుసుకోవాలన్న తపన, తానేమై నిలబడాలనుకుంటున్నాడో, ఆ స్థాయికి చేరాలని, ఆ అంచనాలకు తగ్గట్టుగా నిలబడాలని, పరిపూర్ణ వ్యక్తిగా ప్రపంచం ముందు సగర్వంగా అడుగిడాలనీ ఉంటుంది. ఆ సంఘర్షణల ఫలితమేమీ వృథా పోదు. స్వప్నం స్వర్గమై మన ముందు సాక్షాత్కరించడానికి - ఏమేం చేయడమో - ఈ కవి మాటల్లో -


"నన్ను నేను తవ్వుకోవాలి నాలోకి. తోడుకోవాలి నాలోంచి.
ఒక్క చుక్క మంచినీటి కోసం. ఒక్క మంచి మాట కోసం.
-
నా మానవ ప్రపంచమంతా దుర్భర వేదనలో సెగలో నలిగి రగిలి
నప్పుడు కానీ ఒక ప్రవక్త కన్నీటి కొలకులో కారుణ్యపు ముత్యం
తొనకాడదు, ఒక కవిత ప్రభవించదు.
ఒక నూతన యుగావిష్కరణకై తెర తొలగదు"

మానవ జీవిత సంవేదనను, పేరుకుపోయిన నిరాశలోనూ తలపైకెత్తి చూసే జీవి సహజ ఆశాప్రవృత్తినీ, యాంత్రిక జీవనంలో నుండి అమాంతం బయటపడాలన్న తపననూ, నిరీక్షణనూ రసరమ్య పదాలలో కూర్చి రాసి, "నిర్వికల్ప సంగీతా"న్ని తప్పక దాచుకోవగల పుస్తకంగా చేశారని నా అభిప్రాయం. వీటన్నింటికి తోడు, తావోచిన్, లీ పో ల చైనా కవితలకు అనువాదాలు, బోరిస్(రష్యన్), ఎమిలీ డికిన్సన్(అమెరికన్), దేవిడ్ డియోప్(సెనెగల్), లోర్కా(స్పానిష్), బాద్లేర్(ఫ్రెంచ్), జార్జి సెఫారిస్(గ్రీక్), నెరుడా(లాటిన్ అమెరికా) తదితరుల కవితలను తెలుగులోకి అనువదించి చివర్లో పొదగడం ఈ పుస్తకానికి అదనపు శోభనూ, విలువనూ ఆపాదించాయి.

నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టిన విషయాలు -

పుస్తకంలో చాలా మటుకు శుద్ధ వచనమే ఉంది తప్ప కవితలు కాదు. అది అలాగే ఉండాలనుకోవడం కవి ఆంతర్యం కావచ్చును. అలా ఉండడం బాగుండడం తరువాతి సంగతి.

స్త్రీలకు ఉద్దేశించిన రెండు పద ప్రయోగాలు ప్రశాంత నౌకా విహారానికి బండ రాళ్ళు అడ్డుపడ్డట్టు తగిలి, చిరాకు పెట్టాయి. ఆ పదాలు ఏమంత గాఢత తెస్తాయనీ, వాటిని వాడటం?  సుప్రసిద్ధ కవులు, మృదు పదాలతో మనసును మైమరిపించే శక్తి కలవారు అకస్మాత్తుగా ఇటువంటి పదజాలంతో విరుచుకుపడటానికి అసలు కారణం ఏమయ్యుంటుందో నాకు బోధపడదు. లోతుగా ఒక ఆవేశాన్ని పలికించడమా? దానికి ఇంతకు మించిన మార్గమేమీ లేనే లేదా?

అన్య భాషా కవితలకు సంబంధించి, భావాన్ని అనుభవించడం వరకూ పాఠకులకు ఏ ఇబ్బందీ కలుగదని ఘంటాపథంగా చెప్పగలను కానీ, ఔత్సాహికుల కొరకు, కనీసం కవిత పేరైనా ఇచ్చి ఉంటే, అంతర్జాలంలో వెదకడానికీ, అలాగే, వాళ్ళూ ఒకసారి అనువాదాల్లో తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకుని, కవి అనువాదంతో పోల్చుకుని, అవసరమైతే మరింత కసరత్తు చేయడానికి వీలుగా ఉండేదని అనిపించింది.

అలాగే, జపనీస్ హైకూల ఎంపిక పేలవంగా అనిపించింది. ఈ కవిదే, మత్సువో బషో హైకూ యాత్ర అని మరొక పుస్తకం ఉంది. అందులో కొన్ని హైకూలకు అత్యద్భుతమైన అనువాదాలున్నాయి. ఆ హైకూల ఆత్మను పట్టుకోవడమనే విద్యలో వారు ఆరితేరారా అనిపించిన సందర్భాలున్నాయి. అయితే, నిర్వికల్ప సంగీతంలో ఉదహరించిన హైకూలేవీ బలమైన పద చిత్రాలు కావు. హైకూలతో మనను అమాంతగా ప్రేమలో పడవేయగల శక్తి అక్కడి వాటికి లేదనిపించింది.

"మందిరంలో నిద్రించినందుకు,
చంద్రుణ్ణి చూస్తూ కూడా
గంభీరంగా ఉన్నాను

రైతు బిడ్డ ఆగీ ఆగీ
ధాన్యం దంచుతున్నాడు
చంద్రుణ్ణి కూడా చూడాలి మరి"  ( మత్సువో బషో )

 - - మొదలైన హైకూల్లో ఉన్న అందం, ఆకర్షణ, ఉన్నట్టుండీ క్షణంలో చంద్రుణ్ణి చూపెట్టగల శక్తి, నేర్పు, నిర్వికల్ప సంగీతంలో ఎంచుకున్న హైకూల్లో కనపడకపోవడం నిరాశపరచింది.

వీటికి అతీతంగా, మంచి కవిత్వాన్ని చదవడం, ఏకాంతంలో చేసే ధ్యానం కన్నా అత్యుత్తమ ఫలితాలనిస్తుందనే నా విశ్వాశాన్ని బలపరచినందుకు "నిర్వికల్ప సంగీతం" నన్ను వెన్నాడుతూనే ఉంటుంది.

23 comments:

 1. మంచి కవిత్వాన్ని చదవడం, ఏకాంతంలో చేసే ధ్యానం కన్నా అత్యుత్తమ ఫలితాలనిస్తుందనుకునే.... చాల బాగుందండీ ,చినవీరభద్రుని విశ్వరూపం చూడాలంటె ఆయన
  ''పునర్యానం''చదవండి.
  ధన్యవాదాలు,
  వేలమూరి శ్రీరామ్

  ReplyDelete
 2. శ్రీరామ్ గారూ,

  ఇదే మాటను ఇంకొందరు సాహితీ మిత్రుల వద్ద విని వున్నాను. చదివే అవకాశమింకా లభించలేదు. చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఈ పేరునొక పది మెట్లు పైకెక్కించాలిక.

  ధన్యవాదాలు.

  ReplyDelete
 3. వాడ్రేవు గారు మంచి రచయిత,కవే గాక మంచి వక్త కూడా!మీ విశ్లేషణ చాలా గొప్పగా వుంది.

  ReplyDelete
  Replies
  1. రవిశేఖర్ గారూ - నాకు వారి రచనలంటే చాలా ఇష్టమండీ. వారి పుస్తక పరిచయాలతో సహా ప్రతి రచననూ ఆసక్తిగా చదువుతూంటాను. మీ అభినందనలకు నెనర్లు.

   Delete
 4. అందమైన కవితలకు ఆత్మీయ పరిచయం మరింత అందంగా రాసారు. ఇంత విశదమైన వ్యాసం వలన దూకబోతున్న లోతులమీద నామమాత్రపు అవగాహన కంటే ఎక్కువే కలిగించగలిగారు. ధన్యవాదాలు.. అభినందనలూ!

  "కథలు, కథానికలు గురించి బాగా వ్రాశారనో, వ్రాయలేదనో, మరింత మెఱుగ్గా వ్రాసేందుకు అవకాశముందనో తేలిగ్గా చెప్పేయగలం కానీ, కవిత్వం దగ్గరకొచ్చేసరికి, ఈ లెక్కలేవీ సరిపోవు." కవిత్వం పట్ల మీకున్న అపరిమితమైన ప్రేమ కనిపించింది. :)

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ...:). అపరిమితమైన ప్రేమా, పక్షపాత ధోరణీ కూడా ఉన్నాయనుకుంటా :)). మీ మాటల్లో మీకు నచ్చిన కవిత్వాన్ని గురించి చదవాలని ఉందండీ!

   Delete
 5. కొత్తావకాయ గారన్నట్టు దూకబోతున్న లోతుల మీద అవగాహన లాంటిదే కల్గింది నాకు కూడా! కవిత్వపు తడిని మెత్తని చేతులతో రాతలతో గుండె మీద అద్దావు మానసా!పుస్తకాన్ని కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తామేమో చదివితే!

  వీరభద్రుడి గారి పేరు వినగానే నాకు ఆయన అరకు మీద ఇండియా టుడే లో రాసిన ట్రావెలాగ్ లాంటి అన్వేషణా వ్యాసం గుర్తొస్తుంది మొట్ట మొదట.

  థాక్స్! గ్రేట్ జాబ్

  ReplyDelete
  Replies
  1. సుజాత గారూ - ధన్యవాదాలండీ...!ఆయన చాలా మందికి అలాగే పరిచయమనుకుంటాను. పునర్యానం ఇంకా చాలా బాగుంటుందని కొందరు మిత్రుల వద్ద విని ఉన్నాను. మత్సువో బషో హైకూ ప్రయాణం అనే మరో పుస్తకం కూడా బాగుంటుంది.

   Delete
 6. అభినందనలు మానసా. ఈ అక్షరాలకీ అందం వచ్చింది కవిత్వం గూర్చి కనుక. కవైనా, విమర్శకులైనా, సమీక్షకులైనా మీలా ఆనవాళ్ళు వదులుతూ వెళ్తే చదువరికి సులువు.

  "కవి ఏ అంతర్మథనానికి లోనయ్యి కవిత్వాన్ని సృజించాడో, కవిని, ఆ అక్షరాలను అర్థం చేసుకుంటే తప్ప మనకు అవగతమయ్యే అవకాశం లేదు."

  కవిత్వం మీద విమర్శకి ఇదే సూత్రం. కవి లోనైన ఉద్వేగం యధాతధం గా మరొక మనసు లోనవగలదా? అందుకే ఎంత ఉత్తమ కవిత్వానికైనా ధీటైన విమర్శ రాలేదేమో.

  కవిత్వం లో ఎక్కువగా ధ్వనించేది అతిశయోక్తి. దానికి పాఠకులు కట్టే రాగాల్లోనే దాని అందం ఆవిష్కరించబడుతుంది.

  "మంచి కవిత్వం వింటే మనస్సుకి జ్వరం వచ్చినట్టు ఉండాలి" అంటారు ఆరుద్ర. నిజానికి ఎంతో చలించి, జ్వర లక్షణాలతో కృశిస్తేనే కవిత్వ సృజన సాధ్యమని నాకనిపిస్తుంది. ఈ కవిత్వం లో ఆ జాడలు గోచరిస్తాయి.

  ReplyDelete
  Replies
  1. ఉష గారూ,

   కవితను అనుభవించడంతో పాటు, అన్ని ఇజాలకు సంబంధించిన కవిత్వాలనూ, వచనాన్నీ, దేశవిదేశాలకు చెందిన సాహిత్యాలనూ, కవులనూ చదివిన వారే, సాధికారంగా కవితలపై విమర్శలు చేయగలరేమో అనిపిస్తుంది నాకు. వ్యక్తిగతంగా, టి.ఎల్ కాంతారావు గారు ఒక్కరే ఆ స్థాయిలో అన్నేసి కవితా సంకనాల మీద సద్విమర్శలు చేశారని నా అభిప్రాయం. కొత్తగా కవిత్వాన్ని చదువుతున్న వారికీ, ఔత్సాహిక రచయితలకూ, వారి "కలాలూ - సంకలనాలూ", "కొత్త గొంతులూ" వంటి రచనలు ఎంతగానో సాయం చేస్తాయి.

   మీరు ప్రస్తావించిన ఆరుద్ర మాటలు( మీ మాటలు కూడా..) భలే రుచించాయి. పంచుకున్నందుకు నెనర్లు. అవున్నిజమే కదూ - ఎంత ఆహ్లాదకరమైన అనుభవమైనా, కవిత్వంగా కొందరు పాఠకుల ముందుకు వచ్చే మునుపు ఎన్నెన్ని అలజడులకు గురయ్యిందో, అక్షరాలు ఎంతలా సానపెట్టబడ్డాయో మనకు చెప్పేదెవ్వరు - ఆ కవి బ్రహ్మ వినా!

   Delete
 7. మానసగారూ,
  విమర్శలు సాధారణంగా మొదటి కొన్ని వాక్యాలు చదవగానేఅర్థమైపోతుంటాయి విమర్శకుడు నిగ్రహంతో విమర్శతో చేస్తున్నాడో, ఆరాధనతో చేస్తున్నాడో లేదా అసూయాద్వేషాలతో చేస్తున్నాడో. కవిత్వవిమర్శ ఎంతో నిజాయితీతో, విశ్లేషణాత్మకంగా ఉంటూ, మంచిచెడులను (లేదా నచ్చినవీ నచ్చనివీ అందాము) మీ అంత dispassionateగా రాయడం ఈ మధ్యకాలం లో నే చూసినట్టుగాని, చదివినట్టు గాని గుర్తులేదు. అందుకు మీకు నా మనఃపూర్వక అభినందనలు. కవిత్వం పట్ల, విమర్శపట్ల మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను చాలవరకు ఏకీభవిస్తున్నాను. మంచి పరిచయాన్ని అందించినందుకు అభినందనలతో

  ReplyDelete
 8. మూర్తి గారూ,

  అద్భుతమైన అనువాదాలతో ఎన్నో మంచి కవితలకు పునర్జన్మ నిస్తున్న మీ వంటి సాహితీ మిత్రుల నుండి, ఈ సమీక్షకు సంబంధించి కొన్ని మంచి మాటలు వినడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ..!

  ReplyDelete
 9. మీ clarity of thought, మీ sensibilty రెండూ బాగున్నాయి. మీ రన్నట్లు ఇలాంటి పాఠకులు చదివినపుడు కవిత్వపు అందం ఇనుమడిస్తుంది. మంచి రచనకు అభినందనలు. బివివి ప్రసాద్

  ReplyDelete
  Replies
  1. ప్రసాద్ గారూ - మీ వంటి కవి మిత్రుల అభిప్రాయాలు నాకెంతో అమూల్యమైనవి. మీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు.

   Delete
 10. marvelles.spelling tappe..kani aa nirvikalpa sangeetham kanna kuda varninchina mi matalu manasuki hathukunnayi..manasu lopali rathi pora karigindi o sari..malli ghanibhavinchindilendi..concrete jungle lo kada batukuntundi

  ReplyDelete
 11. marvelles.spelling tappe..kani aa nirvikalpa sangeetham kanna kuda varninchina mi matalu manasuki hathukunnayi..manasu lopali rathi pora karigindi o sari..malli ghanibhavinchindilendi..concrete jungle lo kada batukuntundi

  ReplyDelete
  Replies
  1. ఇలా రాయడానికి నన్ను ప్రేరేపించిన కవిత్వానిదే ఆ గొప్పదనమంతా-స్పందించిన మీ సహృదయానికి ధన్యవాదాలు.!

   Delete
 12. మానసా జీ...కవి వీరభద్రుడిగారి గురించీ తెల్సూ మీగురించీ తెల్సూ కానీ ఆ తెల్సింది చాలా తక్కువనీ ఇప్పుడె తెల్సింది. రివ్యూ అంటే ఇలా ఉండాలని అనిపించేలా రాసారు.వెంటనే కొని చదవాలి కానీ చాలా సాంకేతిక కారణాలవల్ల అది వీలుపడదు కానీ మంచి పుస్తకాన్ని పరిచయం చేసి నన్నొక పుస్తకం వాణ్ణి చేసారు. ధన్యోస్మి

  ReplyDelete

ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల ...