09 September, 2012

చిలుకలు వాలే చెట్టు

పరుగాపి నిలబడ్డ ప్రతిసారీ
పసితనం పసందైన జ్ఞాపకాలతో
మానసాన్ని పెనవేసుకుపోతుంది
అప్పుడు సంతసపు సంద్రములో
తీరం గురించి తపన లేని వాడిలా,
హాయి కెరటాల తేలిపోతుంటాను.

ఇంకొన్ని సార్లు ఏమీ తోచని ఏకాంతంలో
నా స్వార్థ చింతనకు లోబడ్డ  నిర్ణయాలేవో
స్వాంత సరోజాన్ని రేకులుగా విడదీస్తుంటే
కల్లోల కడలిలో మార్గం తప్పిన సుమనస్సునై
ఆసరా ఇవ్వగల పట్టుకొమ్మకై అన్వేషిస్తూ
ఆర్తిగా నిరీక్షిస్తుంటాను.


సరిగ్గా అలాంటప్పుడే గుర్తొస్తుంది -
అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు
పెరిగి బాల్యమంతా పరచుకున్న
చిలుకలు వాలే జాంచెట్టు
అది చిన్ననాటి చెదురని స్మృతుల్లో
చంపక  వృక్షం  చెంగట  ఠీవిగా
సతతము పచ్చగా, పదిలంగా
ఆలింగనాభిలాషిగా నిలబడ్డ గుర్తు!

చిట్టి పొట్టి చేతులతో నీళ్ళు పోసి,
మొక్క మొదట్లో మన్ను మార్చి,
ఆకు  లొచ్చాయనీ, పిందె  కాసిందనీ
మెరుస్తోన్న కళ్ళతో విరుస్తోన్న నవ్వుల్తో
చాటింపేసిన నాటి చెంగనాలు గుర్తొస్తుంటే
గుబులు ఊబిలోకి గుండె పరుగులిడుతుంది.

ధృఢంగా నిలబడ్డ కొమ్మలకు
అట్లతద్ది నాడు ఉయ్యాలలేసి
ఆకాశం వైపుకి ఈడ్చి విసిరేస్తే
పసిపాపల్లే  మారిన అమ్మ
కేరింతలు తుళ్ళింతలు
సెలయేరు గలగలల్లో కలగలసిన
అలనాటి మా నవ్వులు
దిగంతాల తేలి వచ్చే దివ్యగానంలా
అప్పుడప్పుడూ తాకిపోతుంటాయి.

నడి వేసవి రోజుల్లో నేస్తాలను వెంటతెచ్చి
వేళ కాని వేళల్లో పంతంగా చెట్టు దులపరించి
పచ్చి జాంపళ్ళ వగరు రుచికి వెరసి
వాటన్నింటినీ వంతులేసుకు విసిరేసి
చెరువులో వలయాలు చూసి
విరగబడి నవ్విన రోజుల తలపోస్తే
ఈ క్షణాన హృదయ తటాకాన
విషాదపు సుళ్ళు తిరుగుతున్నాయి.

పసితనం దొర్లిపోయి యుక్తవయసు
ఉరకలేస్తూ వద్దకొచ్చాక
ఓ నిశ్శబ్దపు శారద రాతిరి
ప్రేయసిని బిడియంగా  పిలిచి
అక్కడే, ఆ చెట్టు క్రిందే,
విరబూసిన వెండి వెన్నెల కౌగిట్లోనే
దోరపండు కాకెంగిలి చేసుకుంటూ
ఆ అచ్చరకు మనసిచ్చిన స్మృతులు
తాకీ తాకని తనువుల స్పర్శకి మేం
తడబడి ఒణికిన క్షణాల గుర్తులు
వర్తమానంలోని నిప్పచ్చరాన్ని
నిర్దయగా చూపెడుతున్నాయి..!


కాలం కొలిమిలో కలలూ క్షణాలూ  కరిగాయి
నేను పెద్దవాడినవుతూనే పేదవాణ్ణయ్యాను
తల్లీ తండ్రీ అన్నీ తానై పెంచిన అమ్మను
అద్దె కొంపకు పొమ్మంటూ వెళ్ళగొట్టినప్పుడే,
ఇల్లు కూలగొట్టి మేడలు కట్టాలన్న దురాశతో
పొదరింటిని చేజేతులా పోగొట్టుకున్నప్పుడే
నేను నిరుపేదనయ్యాను.

పసితనపు తొలి సంతకాన్నీ
తొలివలపు తీపి గురుతునీ
మళ్ళీ దొరకని అమ్మ ప్రేమనీ,
అమృతాన్విత తరువునీ
అన్నింటినీ కోల్పోయిన
అభాగ్యుడనయ్యాను.

చెరువొడ్డున చల్లగాలికి ఆటలాడిన గతం
ఈ ఎ.సి గాలుల్లోని కృత్రిమత్వానికి
ఉక్కపోతకి గురై ఉక్కిరిబిక్కిరవుతోంది
మలయమారుతం కలలోలా స్పృశిస్తుంటే
మనసంతా స్పష్టాస్పష్ట భావాల హేలతో
సతమతమైపోతోంది.

చెట్లెక్కి పుట్టలెక్కి ఆటలాడి అలసిన బాల్యం
అడుగు మేర కూడా మట్టి లేని ఇంటిలో
కంప్యూటర్ల ముందు కళ్ళద్దాలతో కూర్చుని
తోడక్కర్లేని క్రీడలాడుతున్నమనవళ్ళను చూసి
మాటలు మరచిన మర మనుష్యులను చూసి
బెంగగా నిట్టూరుస్తోంది

వెర్రి ఆటలాడుతూ, యంత్రాలతో పోటీలు పడుతున్న
పసికూనలను చూసిన ప్రతిసారీ బరువెక్కిపోయే గుండె,
చెరువు మీదకి నిండా వంగిన చిట్టచివరి కొమ్మనెక్కి
పళ్ళూ కాయలూ కోయడానికి కావలసిన అబ్బెసమూ
పట్టు తప్పి పడితే,తడిసిన మనసు ఆరదన్న సత్యమూ
తెలియజెప్పాలని తపన పడుతోంది!

కానీ ఎలా..
ఇప్పుడా చెట్టు లేదుగా..
నే కట్టిన మూడంతస్థుల మేడ తప్ప!
ఆ చెరువూ కనరాదిక,
తప్పు  కప్పేందుకు మేం  పోసిన
మూడు  లారీల మట్టి  తప్ప!

అందుకే ఈ ఆఖరు మజిలీలో,
నా జీవితపు చివరి   రోజుల్లో..
ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది
ఎవ్వరైనా, నడవలేని నవ్వలేని
ఈ ముసలివాడికి
తప్పుల తలచి
కన్నీళ్ళ కరిగే
పశ్చాత్తాపానికి
ఒక్క విత్తివ్వండి...

కాంక్రీటు కట్టడాల వికృత లోకపు నడుమన
అణువణువూ యంత్రాలు కుతంత్రాలు నిండిన
నాగరిక ప్రపంచాన ఎక్కడైనా..ఏ మూలైనా..
గుండె ఉన్న మనుష్యులారా...
గుప్పెడు మన్నున్న చోటుంటే కాస్త చూపెట్టండి.

విత్తులు విచ్చుకు విరిసే బృందావనాల నూహిస్తూ..
పూప్రదక్షిణాల అలసే తుంటరి ఎలతేంట్లను తలపోస్తూ..
జగాన పచ్చందనాల సిరులు కురవాలని
ఆపై నేనిక కొమ్మల మసలే చిలుకనవ్వాలని
వినతిపత్రాన్నెగురవేస్తూ నిష్క్రమిస్తాను.

*తొలి ప్రచురణ హంసినిలో..

13 comments:

 1. <>

  కొత్తగా చెప్పడానికేముంది యధావిధిగా మానసకృతిలాగే ఉంది.

  ReplyDelete
 2. విత్తులు విచ్చుకు విరిసే బృందావనాల నూహిస్తూ..
  పూప్రదక్షిణాల అలసే తుంటరి ఎలతేంట్లను తలపోస్తూ..
  జగాన పచ్చందనాల సిరులు కురవాలని
  ఆపై నేనిక కొమ్మల మసలే చిలుకనవ్వాలని....

  అద్భుతమైన ముగింపు మానస గారూ!
  చాలా బాగుంది...అభినందనలు...
  @శ్రీ

  ReplyDelete
 3. మానస గారు చాల చాల బాగుంది

  ReplyDelete
 4. మానస హరితంలాగా ఉంది.. మీ కవిత.
  "అమ్మ నాటించిన ఆ చిన్న విత్తు
  పెరిగి బాల్యమంతా పరచుకున్న
  చిలుకలు వాలే జాంచెట్టు"

  ఎంత నచ్చిందో!

  అవని పై అమ్మ బిడ్డలతో.. చేయించాల్సిన విధి ..ఇది.
  కవిత్వపు జాలు లో తడిపినందుకు అభినందనలు మానస.

  ReplyDelete
 5. మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  ReplyDelete
 6. రెండు పరస్పర విరుద్ధ భావాల పోటీలో, ఇంకా గెలుపెవరిదో తేల్చుకోలేని పరిస్థితి..

  పసితనపు పసిడి జీవితం కాంక్రీటు ఇరుకు గోడల మధ్య వయసు మళ్లిన వైనాన్ని చూసి, మనకి సంబంధించిన సంగతి కాదులే అనుకుని దూరంగా జరిగేంత దూరమైన విషయం కాదు. అచ్చంగా "గుబులు ఊబిలోకి గుండె పరుగులిడుతుంది"

  అచ్చమైన, అందమైన తెలుగు పద కన్యల అలంకరణ చూసి మామూలేలే అనుకుని పక్కకి తప్పుకునేంత అతిమామూలు పద పొందికా కాదు. నిజంగా "హాయి కెరటాల తేలిపోతుంటా(న్నా)ను"

  ఒక మంచి కవితను చదివిన సంతృప్తి, అందులోని చేదు నిజాన్ని అనుభవించిన బాధ ఒకేసారి గుండెని బలంగా తాకుతున్నాయి. దేనికి స్పందించాలో తెలియని అయోమయ స్థితిలో కాసేపు మౌనాన్ని ఆశ్రయించి, ఇలా బయటికొచ్చాను:). మొత్తంగా కవిత మాత్రం అద్భుతానికి మోస్తరు ఎక్కువలోనే ఉంది.

  ReplyDelete
 7. చాలా బాగుంది మీ కవిత మానస గారు..హంసినిలో ప్రచురితమైనందుకు అభినందనలు!

  ReplyDelete
 8. అపర్ణా, ఈ కవితలో ఇంతలా మమేకమై మంచి మాటలతో నన్ను సంతోషపెట్టినందుకు థాంక్స్. అంతకంటే ఎక్కువగా, నీ మౌన వ్రతాన్ని నా మాటకు విలువిచ్చి భంగపరచుకున్నందుకు మరోసారి థాంక్స్! :)

  సురేశ్ గారూ, శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలండీ!

  ReplyDelete
 9. విజయాన్ని ,అపజయాన్ని నిర్ణయించేది విధి, కాదు, అదృష్టం కాదు, కేవలం మీ చేతులే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి,
  very nice...,

  ReplyDelete
 10. edo teliyani anandam mariyu ade samayam lo badha kaligayandi mee kavitha chadavagane, chala chala baundi, enno balya smrutlni kooda gurtu techindi.

  ReplyDelete
 11. కవిత బావుంది.

  ReplyDelete