బేలూరు-హళేబీడు-చిక్కమగలూర్

కొన్ని ప్రాంతాలకు వెళ్ళడమంటే స్మృతుల తీగలను పట్టి ఊయలలూగడం. మన కలల మాలికలో నుండి రాలిపడ్డ పూలన్నీ దోసిలి ఒగ్గి ఏరుకోవడం.

హోయసలుల శిల్పకళారీతులకు కాణాచిగా పేరొందిన బేలూరు-హళేబీడులను చూడటం నాకు అచ్చంగా అలాంటి అనుభవమే మిగిల్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం, కొత్తగా పరిచయమైన మిత్రులతో కలిసి ఈ ప్రాంతాలన్నీ తిరిగి తిరిగి ఎంత మైమరచిపోయామో. అప్పుడు మేము తీసుకున్న ఫొటోల రీలులో ఏదో ఇబ్బంది రావడంతో, ఒక్క ఫొటో కూడా రాక, అన్ని గుర్తులూ చెరిగిపోయాయి (అప్పట్లో డిజి కెమెరాలు లేవు మా దగ్గర). ఓ గొప్ప చారిత్రక ప్రదేశం తాలూకు జ్ఞాపకాలను మాకు మిగలకుండా చేసాడని, కెమెరా తెచ్చిన నేస్తాన్ని మైసూర్‌లో ఉన్నంతకాలమూ మాటలతో హింసించేవాళ్ళం . అది మొదలూ మళ్ళీ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలనీ, కెమెరా కళ్ళతో కూడా ఆ అందాలను బంధించాలని నాకో కోరిక అలా మిగిలిపోయింది. మొన్న అనుకోకుండా మా వారి మేనత్త వాళ్ళు బెంగళూరు రావడంతో బేలూరు-హళేబీడు- చిక్కమగలూర్ వెళితే బాగుంటుందనిపించింది.     

నాలుగు గంటలకల్లా ఇంటి నుండి బయలుదేరాలని గట్టిగా తీర్మానించుకున్నాం.  ఈ తెల్లవారుఝాము చలిగాలుల్లో మొదలయ్యే ప్రయాణాల్లో ఓ గమ్మత్తైన మజా ఉంటుంది - నాకు వాటి మీద ఓ ప్రత్యేకమైన మోజు. షరామామూలుగా ఆరు గంటల దాకా మా వీధి మలుపు కూడా తిరగలేకపోయాం. సర్జాపూర్ నుండి బయలుదేరి హళేబీడు చేరేసరికి 10:30 అయిపోయింది. అక్కడ అడుగుపెడుతూండగానే మనమొక మహా సౌందర్యాన్ని కొన్ని క్షణాల్లో దర్శించబోతున్నామని తెలుస్తూ ఉంటుంది. నక్షత్రాకారంలో ఉన్న ఎత్తరుగు మీద ఠీవిగా కనపడే నిర్మాణం, అల్లంత దూరం నుండే మనసులను పట్టి లాగేస్తుంది. మహాలయ నిర్మాతలకు కేవలం శిల్ప పారీణత ఉంటే సరిపోదు, అంతకు మించినదేదో కావాలి. ఒక్కొక్క ఉలి తాకుకూ ఒక్కొక్క కవళిక మార్చుకుంటున్నట్లున్న శిల్పాలతో సందర్శకులను రంజింపజేయడానికి ఆ శిల్పులు ఎన్నెన్ని రాత్రులు నిద్రకు దూరంగా గడిపి ఉంటారో అన్న ఆలోచనే మననొక ఉద్వేగపూరిత లోకంలోకి నెట్టేస్తుంది. వాళ్ళు విశ్వకర్మను గుండెల్లో నింపుకు అహరహం ధ్యానించి ఉంటారు. నృత్యశాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ తిరగేసి ఉంటారు. శిలల్లో సంగీతాన్ని పలికించగల విద్యను ఏనాడో ఏ జన్మలోనో అభ్యసించి ఉంటారు. ఆ శిల్పులు, బహుశా భావుకులై ఉంటారు, ఒంటరులై ఆ కొలను ఒడ్డున కూర్చుని వ్రాసుకున్న కవిత్వాన్నే, మళ్ళీ శిలల్లో చెక్కి ఉంటారు.   

ఆ శిలలు ? 
వాటిని రాళ్ళనడానికి మనసొస్తుందా ఏనాటికైనా? రాతిలో అన్ని వందల మెలికలు మెరుపులు చూపించడం సాధ్యమవుతుందా ఏ సామాన్యుడకైనా? అది నవనీతమో మధూచ్ఛిష్టమో అయి ఉండాలి. అక్కడున్న స్త్రీమూర్తులందరూ గంధర్వలోకం నుండి శాపవశాత్తూ భూమి మీదకు వచ్చి శిలలైపోయుండాలి. ఎన్ని గంధపు చెక్కల్ని చుక్కల్లా మారేదాకా అరగదీసి శిలలను పరీక్షించి ఉంటారో కానీ, ఏ పసరులతో ఇనుపగుండ్లతో వాటికి ఒరిపిడి పెడుతూ రుద్దారో కానీ, ఈనాటికీ అన్ని విగ్రహాలూ నున్నటి నునుపుతో నలుపుతో నిగనిగలాడుతూంటాయి. హళేబీడులో పక్కన నీలాకాశాన్ని నిండుగా ప్రతిబింబిస్తోందే...ఆ కొలనులోనే అరగదీసిన గంధాన్ని ఒండ్రుమట్టిలా నింపి శిలలను ఒకటికి పదిసార్లు పరీక్షించారేమో!  లేదూ, ఆ కళాకారులంతా పగలల్లా పని చేసి రాత్రి ఆ నీటి ఒడ్డున పడుకుని ఆకాశంలోకి చూస్తూ, కనపడ్డ నక్షత్రాలకు లెక్కలు కట్టి, మర్నాడు అన్ని మెలికలతో జిలుగులతో కొత్త శిల్పాన్ని సృజించాలని కలగనేవారేమో!  ఇటువంటి ప్రేరణ ఏదీ లేకుండా, ఆ గర్భగుడి ముఖద్వారం, నంది భృంగి విగ్రహాలూ, ఆలయం లోపలి భాగంలో కనపడే పైకప్పుల్లోని సౌందర్యం అంత అద్భుతంగా చెక్కడం ఎలా సాధ్యం?!  


అక్కడ తిరుగాడుతున్నంతసేపూ మనసు మనసులో ఉండదు. అంత సౌందర్యాన్ని ఎలా దోచుకోవాలో, దాచుకోవాలో తెలిసిరాదు. బహుశా ఆ అయోమయంలో పడే ఈ ప్రాంతం మీదకి దండయాత్రలకు వచ్చిన ముస్లిం ముష్కర మూకలు ఈ ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసి వదిలెళ్ళిపోయారేమో. వాళ్ళ దౌర్జన్యానికి గుర్తుగా తలలు తెగిపడిన విగ్రహాలు, మొండేలు లేని దేవతా రూపాలు కనపడడం ఒక అపశ్రుతిలా ఇబ్బంది పెట్టినా, మొత్తం అనుభవానికి కలిగే నష్టమైతే ఏమీ ఉండదు. 

బేలూరు, హళేబీడు రెండు చోట్లా ఆలయాలకి చుట్టూ విశాలమైన ప్రదక్షిణ పథం ఉంది. హళేబీడులో బాహ్యసౌందర్యానిది పైచేయి ఐతే, బేలూరులో ఆలయం లోపలా వెలుపలా కూడా సౌందర్యమే.  ఈ ఆలయాల బయటి వైపున స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహరమైన శిల్పాలలో ప్రతి ఒక్కదాన్ని గురించీ ప్రత్యేకంగా చెప్పుకు తీరాల్సిందే [ రామప్ప గుడిలోని మదనికా శిల్పాలను పోలివుంటాయవి]. వాటిలో దర్పణ సుందరి, వికట నర్తకి, రసిక శబరి, మయూరశిఖే లాంటివి చూపు తిప్పుకోనివ్వవు. రామాయణ ఘట్టాలూ, దశావతార ప్రదర్శనా, శివపార్వతులూ, వామనావతారం సరేసరి. ఆ శిల్పులు ఆయా ఘటనలకు సంబంధించిన ప్రతి చిన్న విశేషాన్నీ ఎంత జాగ్రత్తగా, ఎంత రమణీయంగా చెక్కారో గమనిస్తూంటే, ఒక అలౌకిక ఆనందానికి లోనవుతామంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గజాసురవథను చెక్కడంలో శివుడు ఆ ఏనుగు పొట్టను చీల్చడంలో కొనదేలిన గోళ్ళు చర్మాన్ని దాటుకు బయటకు రావడం...ఆహ్...అమోఘం! అలాగే నరసింహ స్వామివి, దాదాపు 34 విగ్రహాలు (హోయసల రాజుల కులదైవం కదా - అందుకు!), అన్నీ హిరణ్యకశిప వథ చేస్తున్న ఉగ్రనరసింహావతారాలే.  వజ్రనఖాలతో హిరణ్యకశిపుణ్ణి చంపి, ప్రేగులు మెడలో వేసుకున్న స్వామి ఉగ్ర రూపాన్ని ఎంత గొప్పగా మలిచారనీ..."సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు" అని ఇందుకు కదూ అంటారు..!

ఉగ్రనారసింహావతారం


"సురరాజవైరి లోబడె, బరిభావిత సాధుభక్త పటలాంహునకున్
నరసింహునకు నుదంచ, త్ఖరతరజిహ్వునకు నుగ్రతరరంహునకున్" 

-అని నరసింహావతారం గురించి భాగవతంలో ఓ పద్యం ఉంటుంది. ఈ శిల్పాన్ని చూడండి..." అత్యంత భయంకరంగా కదులుతున్న నాలుక"తో ఉన్న ఆ  స్వామి రూపాన్ని ఎంత గొప్పగా మనకు సాక్షాత్కరింపజేస్తోందో!!   





హళేబీడులోని హోయసలేశ్వరుడిగా (మహరాజు పేరు మీదుగా నెలకొల్పబడినది), శాంతలేశ్వరుడిగా( మహరాణి శాంతలాదేవి పేరు మీదుగా) పూజలందుకుంటోన్న శివలింగాలకు ఎదురుగా, రెండు నంది విగ్రహాలు ప్రతిష్టించారు. ఇవి రెండూ దేశంలోని అతి పెద్ద నంది విగ్రహాల్లో వరుసగా ఐదూ ఆరూ స్థానాల్లో ఉన్నాయి. వీటిని చూడగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చే విషయమొకటి ఉంది. మా అక్క, అమ్మ టీచరుగా పని చేసిన బళ్ళోనే చదువుకుంది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడొకసారి వాళ్ళిద్దరూ బళ్ళో విహారయాత్రకని  ఈ ఊళ్ళన్నీ తిరిగారు. లేత పసుపు లక్నో చుడీదార్‌లో మెరిసిపోతూ అక్క ఈ నంది మీద చేతులు పెట్టుకు దిగిన ఫొటో ఒకటి చూసి చాలా కాలం నాలో నేను తెగ బాధపడిపోతూ ఉండేదాన్ని. నన్ను ఒక్కదాన్నీ వదిలి వెళ్ళిపోయారన్న బెంగ కంటే నిలువెత్తు నంది దగ్గర అంత ఠీవిగా నిలబడి అక్క దిగిన ఫొటోనే అప్పట్లో నా కడుపుమంటకు కారణం :). అప్పుడేమో అది ఒక్కతే వెళ్ళిపోయిందనీ, ఇప్పుడు అది కూడా నా పక్కన ఉంటే బాగుండుననీ - బెంగ పడేందుకు మనుషులు ఎప్పుడూ కారణాలు వెదుక్కుంటూ ఉంటారేమో అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ. ఆ మాట వదిలేస్తే, ఈ నందులు నిజంగా ఎవరో చెక్కినట్టు ఉండవు. కాస్త ఎత్తి ఉన్న కంఠదేశంలో మూడు పట్టెడలు, క్రింద మువ్వల గొలుసు.., రెండు కొమ్ములనూ చుడుతూ ముత్యాల పట్టికలు, నడుము పైభాగం నుండీ బెత్తెడు బెత్తెడు వెడల్పుతో జిలుగు పనులతో నిండిన పేటల గొలుసులు...గిట్టల పైభాగాన కడియాలు...శివుని ఆజ్ఞతో సాక్షాత్తూ ఆ మహావృషభరాజమే నేలకు దిగివచ్చినట్టుంటుందది. తనివితీరేదాకా నిలబడి తప్పక చూడవలసిన పనితనమది.


గైడ్ లేకపోతే ఐదు నిముషాల్లోనూ, మంచి గైడ్ దొరికితే గంటా- రెండు గంటల్లోనూ చూసేయగలమనిపిస్తే, అంతకు మించిన భ్రమ వేరొకటి లేదు. పైగా ఇలాంటి ప్రాంతాలకొచ్చి, గైడ్ అడిగే వంద రూపాయల దగ్గర కక్కుర్తి పడి, "మనకు కనపడనివి వాళ్ళేం చూపిస్తారటా.." అని దీర్ఘాలు వాళ్ళని  చూస్తే ఎంత జాలేస్తుందో! రెండు రోజుల సెలవలూ, ఈ రెండు కళ్ళూ ఆ అందాన్ని లోలో ముద్రించుకోవడానికి సరిపోవు. ఆ ఒక్క మకరతోరణం చాలు - ఓ పూటంతా గడిపేయడానికి. ఆ జయవిజయుల మెళ్ళోని హారాలనూ, వాటిలోని నొక్కులను లెక్కబెట్టే పనిలో పడితే చాలు - మీకో రోజు రోజంతా సరిపోదు. కొన్ని వందల రకాల కేశ సౌందర్యాలతో కనిపించే ఆ కాలపు సామాన్య స్త్రీల అందం-అతిశయం, ఓ జాతి సంస్కృతీ, ఒక రాజవంశపు చరిత్రా, ఆంగ్లేయుల సొత్తని భావించే అనేక పరికరాలను ఆ కాలంలోనే వాడిన మన పూర్వీకుల ప్రజ్ఞ, ఈ దేశం నిలబెట్టుకోలేకపోయిన అనుపమాన శిల్పకళాచాతుర్యం....వీటన్నింటికీ కాలాలకతీతంగా నిలబడ్డ మూగసాక్షులు బేలూరు-హళేబీడు నిర్మాణాలు. 


చిక్కమగలూర్

మలుపుల కొండ దారి మీద జలపాతాలను వెదుక్కుంటూ..(ఊ..వెదుక్కుంటూనే...కనపడలేదు..:)) పైకి చేరేసరికి ఆలస్యమైపోయింది. జలపాతాలు నిరాశపరిచాయి సరే, అక్కడ దత్తాత్రేయపీఠం ఒకటుందని, తప్పకుండా చూడమనీ దారిలో ఎదురొచ్చిన వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళాలా వద్దా అని లెక్కలు వేసుకుంటూ.."ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో.." అనుకోవడానికి ఏనాటికైనా ఏమైనా ఉండాలి కదా అని నచ్చజెప్పుకుని అక్కడికి ఓపిక చేసుకుని వెళ్ళాము. దత్తాత్రేయ మఠము అని వ్రాసి ఉన్నా, నిజానికి, అది ఒక ముస్లిముల దర్గా. ఒక వంద మెట్లు క్రిందకి దిగాక, గుహలాంటి ప్రదేశంలో సమాధులు, మట్టి ఉన్నాయంతే. అక్కడి వాళ్ళు ఉర్దూలో ఆ ప్రాంతం యొక్క గొప్పదనం ఏమిటో చెప్పబోయారు...నాకర్థం కాలేదు. 

ఆ గుహ నుండి బయటకు వచ్చేసరికి రాత్రి కావస్తోంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. ప్రసూన సువాసనాలహరీ సంయుతుడై గంధవహుడు మెల్లగా తిరుగుతున్నాడు. ఆగీఆగీ ఏవో పక్షుల కలకల రుతులు వినపడుతున్నాయి. లేలేత ఆకుల మీద వెన్నెల ప్రసరించి మిలమిలా మెరుస్తోంటే, గరుడ పచ్చలు పొదిగారా అన్నట్టు..మాటల్లో పెట్టలేని మహాసౌందర్యం. ఎవరూ భగ్నం చేయాలనుకోని నిశ్శబ్దం. 

మేం ఆరుగురం కాసేపు మాటలు రానివాళ్ళమైపోయాం. బేలూరు-హళేబీడు చూశాక కలిగిన ఉద్వేగం మా నోట వేయి మాటలుగా రాలిపడితే, చిక్కిమంగళూరు శిఖరపు అంచు మీద నిలబడ్డ క్షణాల్లో అక్కడి పొగమంచులా కమ్ముకున్న పారవశ్యం మమ్మల్ని ఓ మౌన ప్రపంచంలోకి రెక్కపట్టుకు లాక్కెళ్ళింది. ఇన్నేసి మైళ్ళ ప్రయాణంలో మనం వేటిని వెదుక్కుంటూ వెళ్తామో, వాటిని దొరకబుచ్చుకున్న సంతృప్తి ఉంది కానీ..ఏనాడో చెప్పాడో జ్ఞాని... 

"రూప్‌కే పావ్ చూమ్‌నే వాలే సున్‌లే మేరీ బానీ
ఫూల్కీ డాలీ బహుత్ హీ ఊంచీ, తూ హై బహతా పానీ"    ( "సౌందర్య చరణాలను ముద్దాడేవాడా! నా మాట విను. పూలకొమ్మేమో చాలా ఎత్తైనది. ప్రవహించే నీటివి నువ్వు")  

20 comments:

  1. Awesome Maanasa gaaru....Krishna

    ReplyDelete
  2. we are also planning to go there this weekend. Howz the road. Can we drive or is it better to in bus? btw, i drive honda city, so i have to be extra cautious about road :-)

    ReplyDelete
    Replies
    1. You can surely try; It;s a smooth drive all the way. Just be careful as you reach western ghats and as you drive up the hill, the road is quite narrow. Scary at times ( atleast for me :-) ). So, please take care and enjoy your trip.

      Delete
  3. మీ అక్షరాల వెంట పరుగులు తీసే కళ్లెప్పుడూ టపా చివర్లోని ముగింపుని సహించలేవెందుకో...:))
    (ఎప్పట్లానే) చాలా బాగా రాసావు మాన్సా! మేము 6th క్లాస్ లో ఉన్నప్పుడు మైసూరు,బెంగుళూరు వెళ్ళాం. అప్పుడు తీసుకున్న ఫోటోల రీలు తెల్సినవాదని ఓ ఫోటో స్టూడియో అతనికి ఇస్తే అవి మాయమైపోయాయి... ఎన్నెన్ని మధుర స్మృతులో ఆ ప్రయాణంలో... ఇప్పటికి గుర్తొచ్చినప్పుడల్లా అతగాడిని తిట్టుకుంటూనే ఉంటాం..

    ReplyDelete
    Replies
    1. తృష్ణగారూ, :)) థాంక్యూ! :)

      Delete
    2. మీ మధుర సాహిత్యంలో మా మనసులను ప్రకృతి మైకంలో ముంచెసారు. ఎంత చక్కగా వర్ణించారు ఆ శిల్పాల అందాలు మీ సాహిత్యంలా.
      superb....:-):-):-)

      Delete
  4. “ఈ తెల్లవారుఝాము చలిగాలుల్లో మొదలయ్యే ప్రయాణాల్లో ఓ గమ్మత్తైన మజా ఉంటుంది - నాకు వాటి మీద ఓ ప్రత్యేకమైన మోజు”

    నాకు మహా ఇష్టం.అలా బండి మీద వెళ్తూ ఆ చల్లగాలిలో మజాని ఆస్వాదిస్తూ భలే ఉంటుందిలెండి.


    “రాత్రి ఆ నీటి ఒడ్డున పడుకుని ఆకాశంలోకి చూస్తూ, కనపడ్డ నక్షత్రాలకు లెక్కలు కట్టి, మర్నాడు అన్ని మెలికలతో జిలుగులతో కొత్త శిల్పాన్ని సృజించాలని కలగనేవారేమో”

    ఆ శిల్పాల్ని చెక్కేవాళ్ళ గురించి సుమంగళి సినిమాలో ఓ పాట రాస్తూ ఆత్రేయ అంటారు"తీరని కోర్కెలు తీర్చుకున్నాడేమో" అని.

    http://www.raaga.com/player4/?id=194761&mode=100&rand=0.18459503771737218

    "బెంగ పడేందుకు మనుషులు ఎప్పుడూ కారణాలు వెదుక్కుంటూ ఉంటారేమో అనిపిస్తూంటుంది"

    మరే

    "ఓ జాతి సంస్కృతీ, ఒక రాజవంశపు చరిత్రా, ఆంగ్లేయుల సొత్తని భావించే అనేక పరికరాలను ఆ కాలంలోనే వాడిన మన పూర్వీకుల ప్రజ్ఞ, ఈ దేశం నిలబెట్టుకోలేకపోయిన అనుపమాన శిల్పకళాచాతుర్యం....వీటన్నింటికీ కాలాలకతీతంగా నిలబడ్డ మూగసాక్షులు బేలూరు-హళేబీడు నిర్మాణాలు."

    బా చెప్పారు

    “శిఖరపు అంచు మీద నిలబడ్డ క్షణాల్లో అక్కడి పొగమంచులా కమ్ముకున్న పారవశ్యం మమ్మల్ని ఓ మౌన ప్రపంచంలోకి రెక్కపట్టుకు లాక్కెళ్ళింది. ఇన్నేసి మైళ్ళ ప్రయాణంలో మనం వేటిని వెదుక్కుంటూ వెళ్తామో, వాటిని దొరకబుచ్చుకున్న సంతృప్తి ఉంది కానీ..ఏనాడో చెప్పాడో జ్ఞాని”

    ఇలా రాయడం మీకు మాత్రమే సాధ్యమండీ(ఎప్పుడూ ఇదే చెప్తాననుకోకండీ,నిజం కదా అలానే ఉంటుంది మరి)

    నేనయితే ఇటువంటి ప్రదేశాలకి ముందు మిమ్మల్ని పంపి వాటి గురించిన సౌందర్యపిపాస భాషణలు మీరు వ్రాసాక అవి చదివి ఆ ప్రతులు పుచ్చుకుని అప్పుడు ఆ స్థలాల్ని చూడడానికి వెళితే పూర్తి సంతృప్తిగా మేమూ చూడచ్చేమో అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. పప్పు సర్, థాంక్యూ! :)))
      ఐనా నేను ముందు చూడటం, మీరు నా మాట పట్టుకు వెళ్ళడం ఎందుకు? మీరు నాకెలాగూ ఓ కోనసీమ ట్రిప్ బాకీ ఉన్నారు కదా, కలిసి అందరం ఓ ట్రిప్ కి ప్లాన్ చేస్తే సరి :)))

      Delete
  5. అందం అనేది చూసే కళ్ళలో ఉంటుందంటారు. అందమైన శిల్ప చతుర్యాన్ని, అంత కంటే రమణీయమైన ప్రకృతి సౌందర్యాన్ని నా కళ్ళతో చూసినప్పుడు ఇంత అనుభూతి పొందలేదేమో నేను. కాని నీ టప చదువుతుంటే ఇంత గొప్ప ప్రదేశాన్ని నేను చూసానా అనిపించింది. చాలా చాలా చాలా బాగా రాశావు మానస -- Subbu

    ReplyDelete
    Replies
    1. :)))) :p, I shall remind you about our Munnar-Kerala house boat trips also! :p- Thanks a lot!

      Delete
  6. చిక్క మగళూరు నాకు చాలా ఇష్టం! అక్కడి ఒక గోల్ఫ్ రిసార్ట్ కి తరచూ వెళ్ళేవాళ్లం ..బెంగుళూరులో ఉన్నపుడు. అవునూ... వరకు వెళ్ళిన దానివి నాలుగడుగులు అటేపు వేసి కెమ్మణ్ణు గుణ్ణి చూడక పోయావా? కెమ్మన్ను గుణ్ణి అంటే ఎర్రమన్ను గుంట అని అర్థం ట (కెంపు+మన్ను అన్నమాట). ఎన్ని పూవులెన్ని రంగులులెన్ని సొగసులిచ్చాడు. అన్నిటినీ నీలో చూడమన్నాడు.. ఎంతో రసికుడు దేవుడు అని పాడబుద్దేస్తుంది.

    మెలికలు తిరిగే రోడ్లు, అడుగు తీసి అడుగేస్తే జారి పోయే లోయలు..ఒక అద్భుత సౌందర్య ప్రపంచం.

    బేలూరు హళేబీడు లో కుడ్య శిల్పాల తర్వాత మనసు దోచేవి, పర్సు ఖాళీ చేసేవి బయట చెక్కి అమ్మే బుల్లి బుల్లి రాతి శిల్పాలు. Love them



    ReplyDelete
    Replies
    1. :)) అవునండీ, ఆదరాబాదరా ట్రిప్ కదా, అన్నీ సరిగా ప్లాన్ చేసుకోలేదు, అయినా పర్లేదు - ఎవరో ఒకరు మళ్ళీ వెళ్దాం అంటారు మేం మళ్ళీ బయలుదేరతాం ;) - ఈ సారి చూస్తాం మీరు చెప్పిన ప్రాంతమంతా.

      ఆ బొమ్మలు - నిజం నిజం! ఇంటికి తెచ్చాక ఏం చెయ్యాలో అర్థం కాదు కానీ, అక్కడ చూస్తే అన్నీ కొనబుద్ధేస్తుంది. ఎనిమిదేళ్ళ క్రితం నా ఫ్రెండ్ ఇచ్చిన నలుపు-తెలుపుల వినాయక విగ్రహం ఒకటి ఇప్పటికీ నా దగ్గర ఉంది. :)

      Delete
  7. మీతో పాటు మరోసారి తీసుకుపోయారు.. మీరు దర్శించిన సౌందర్యభరితమైన ఉద్వేగాల్లోకీ.. ప్రశాంతతలోకీ.. ఆ శిల్పాల్నీ, శిల్పాల లోతుల్లోకి చూస్తున్న మిమ్మల్నీ చూస్తున్నట్టే అనిపించింది. :)

    ReplyDelete
    Replies
    1. మీలా ఆకాశాన్ని అరచేతిలో చూపించడం చేతనయ్యే దాకా నాకు తృప్తి లేదు..:-) :-) :-)

      Thank you very much, Sir...

      Delete

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...