అద్దేపల్లి కవిత్వం - "కాలం మీద సంతకం"

( అద్దేపల్లి కవిత్వ సంపుటిపై చిరు పరిచయ వ్యాసం; తొలి ప్రచురణ సారంగ వార పత్రికలో..) 

సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతున్న అనేకానేక పరిణామాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య, విమర్శనాత్మక కవితా బాణాల సంపుటి - "కాలం మీద సంతకం". అద్దేపల్లి కవిగా కంటే విమర్శకులుగా, అద్భుతమైన వ్యాసకర్తగానే నాకెక్కువ పరిచయం. పత్రికల్లో చదివిన వారి సాహిత్య వ్యాసాలు, "సాహిత్య సమీక్ష" వంటి పుస్తకాలు, "మా నాయిన" లాంటి ఎన్నో కవితా సంపుటాలకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వ్రాసిన ముందు మాటలూ, ఈయన కవిత్వం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయి.

మూఢత్వం మూలంగా నిస్తేజంగా మారిన జనజీవితాల్లోకి వెలుగు రేఖలను ప్రసరింపజేయడమే అభ్యుదయ కవుల లక్షణం. భారతీయ సాహిత్యానికి సంబంధించి, 1935వ సంవత్సరంలో భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అలహాబాదులో ఏర్పాటు చేయబడింది. 1936 ఏప్రిలులో ప్రసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన ప్రథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ లక్నోలో జరిగింది.  అదే సంవత్సరం సెప్టంబరులో ఈ కవి జన్మించాడు. అద్దేపల్లి 1960లలో కవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టారూ అనుకుంటే, అప్పటికి రాష్ట్రంలో అభ్యుదయ కవిత్వోద్యమ తీవ్రత మెల్లిగా సన్నగిల్లి, దిగంబర కవిత్వం ఉద్యమంగా మారుతోంది. (1965 లో దిగంబర కవులు తమ తొలి సంకలనాన్ని విడుదల చేశారు). 70-80 విప్లవ కవిత్వమూ, 80 తరువాత అనుభూతివాదమూ, మినీకవితలూ ఇతరత్రా జోరందుకున్నాయి. ఇన్ని ఉద్యమాలనూ దగ్గరి నుండీ గమనిస్తూ కూడా, అద్దేపల్లి కవిత్వం తొలినాళ్ళలో వ్రాసిన "అంతర్జ్వాల" మొదలుకుని, ఈనాటి "కాలం మీద సంతకం" వరకూ, శైలి-శిల్పంపరంగా అనివార్యమైన భేదాలు, అభివ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే పరిణతీ మినహాయిస్తే, మొత్తంగా అభ్యుదయ కవిత్వ ధోరణిలోనే సాగడం విశేషం.  "సమాజంలో ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు ప్రథానంగా ఉన్నంతకాలం అభ్యుదయ కవిత్వం ప్రథాన కవితా ధోరణిగా ఉండక తప్పదు" అని ఉద్ఘాటించిన ఈ కవి, దశాబ్దాలు దాటినా ఆ మాట మీదే నిలబడి కవిత్వ సృజన చేయడం ఆసక్తికరం.  నమ్మిన కవిత్వోద్యమం పట్ల ఈ కవికున్న నిబద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం. 


ఇక ఈ సంపుటిలోని కవితల విషయానికి వస్తే - మొత్తం యాభై కవితలు. అత్యధికం సమాజంలోని అసమానతలను ఎండగడుతూ, రోజురోజుకీ హెచ్చరిల్లుతోన్న విష సంస్కృతులను విమర్శిస్తూ, సమసమాజాన్ని స్వప్నిస్తూ సాగేవే.  మన భాష గురించీ, సంస్కృతి గురించీ, పశ్చిమ దేశాల ఎఱలకు లోబడుతున్న ఇరుకు మనస్తత్వాల చిత్రీకరణకు సంబంధించీ కొన్ని చిక్కటి కవితలున్నాయిందులో.

"ఉగాదికి తెలుగు దూరంగా పరుగెత్తుకు పోతున్నప్పుడు
గంగిరెద్దు మూపురం మీద నించి
జానపదం జారిపోతుంది
హరిలోరంగ హరీ అని
నెత్తి మీద పాత్రలోని బియ్యం కారిపోతుంది
వసంతుడికీ వనానికీ మధ్య ఉన్న వలపు
కోకిల పాటలోంచి పారిపోతుంది "                                           (పు:71)

అలాగే ఈ సంపుటిలో అనేక కవితలకు, చెట్లూ - మనం మినహాయించుకొంటోన్న ఆకుపచ్చందనం వస్తువుగా నిలబడ్డాయి. " ఏ గడ్డిపరకను చూసినా/మంచు కన్నీటి బొట్టు/సూర్యుడి చూపుల్ని కలగంటోంది/తోటలోని చెట్లన్నీ/పరిశ్రమల దుమ్ములో మాసిపోతున్నాయ"ని ఆవేదన వ్యక్తం చేస్తూ,

"రాతి మేడల నీడలు
తోటల్ని దూరంగా విసిరేస్తున్నప్పుడు
పంచమ స్వరం వినపడని వారికోసం
నా కవిత్వ బంధంతో కోకిలను పట్టి తెచ్చి
ప్రజల గుండెలపై ప్రతిష్ట చేస్తాను
నాకొక్క కొత్త చిగురు చాలు
అరుణారుణ స్పర్శతో
నూతన వసంతోత్సవంలో
తోటంతటినీ జలకాలాడిస్తాను" అంటారు. ( "నాకొక్క చిగురుటాకు చాలు" )


ఈ కవికి పశ్చిమ దేశాలు ప్రాక్దేశాల మీద చూపిస్తోన్న ప్రభావం పట్ల ఖచ్చితమైన దురభిప్రాయం ఉంది. మార్పు అభిలషణీయమని అంగీకరిస్తూనే, మన మూలాలను కదుపుతోన్న భావజాలాలను మాత్రం అడ్డుకుందామంటారు. ఈయన కవిత్వంలో ఆవేశంతో పాటు ఆర్ద్రత కూడా సమపాళ్ళలో మిళితమై ఉండి పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

"వేకువ ఝామున అరుణకాంతి వలయాల మధ్య
నేనొక దృశ్యాన్ని చూస్తాను-
దేశాన్ని తలపాగా చుట్టుకుని
భుజాన ప్రాణశక్తిని నాగలిగా పట్టుకుని
కళ్ళనిండా నీటిపొరలు పేర్చుకుని
కాళ్ళకి బురద కడియాలు పెట్టుకుని
గుప్పిట్లోని విత్తనాలు చల్లుకుంటూ
తూర్పు నుండి ఒక రైతు నడచి వస్తున్నాడు-
పెద్ద పండుగ వచ్చేసిందని
అరిచే పిట్టల ఆహ్వాన గీతల మధ్య
రైతు నడచిన అడుగుజాడల్లో
భారతీయ సుక్షేత్ర నిర్మాణం జరుగుతుంది"           ("ఇది హాలికుని అడుగుజాడ")


ఈ వర్ణన నిజంగా ఏ ఏటికాయేడు తమ ఆకుపచ్చ కలలను మబ్బుల దాకా పంపే హాలికులను సజీవంగా కళ్ళ ముందు నిలబెట్టడం లేదూ? పైన ఉదహరించిన మొదటి పాదంలోనే, - ఇతను దేశానికేదో అవ్వడం కాదు - ఈ బక్కపచ్చ కలల హాలికుడే దేశాన్ని తలపాగాగా ధరించాడుట! ఎంతటి బాధ్యత కల్గిన వాడు, ఎంత అభిమానధనుడు ఈ దేశపు రైతు - కవి మాటల్లో నుండి ఎంత హుందాగా చదువరుల గుండెల్లోకి నడిచొస్తున్నాడో గమనించారా?!

కవిత్వం నరనారానా జీర్ణించుకున్న వారు దేని మీదైనా అలవోకగా కవితాత్మకంగా వ్రాసేయగలరు. "బీడీ" నుండి "చకారం" దాకా, గాంధీ మొదలుకుని బిస్మిల్లా దాకా, "కాదేదీ కవిత కనర్హం". ఎంత అభ్యుదయవాది అయినా, అనుబంధాల గురించి మాట్లాడవలసి వస్తే - ఆవేశం పాలు తగ్గడమూ అనురాగం మరింత శోభాయమానంగా వ్యక్తీకరింపబడటమూ సహజమే కదా! వైయక్తికమే అయినా, మనసును తడిమిన కవితలోని భాగమొకటి :

"అర్థరాత్రి వేళ గంగానది
నీ షెహానాయి స్వరాల్ని నెమరు వేసుకుంటూ
ప్రవహించడం మానేసి
నిశ్శబ్ద వేదనతో
ఆకాశ ప్రతిబింబాన్ని హత్తుకుంటుంది
...... <...>

నీ షెహనాయి
ఒక్కసారి మనసు కందితే చాలు
ఈ దేశం సంగీత సంస్కారంతో
సమగ్ర వాయువీథుల్నినిర్మిస్తుంది
దేహాన్ని ఆత్మతో అనుసంధానం చేసే
సజీవ మానవుణ్ణి సృష్టిస్తుంది"


ఇవి కాక, కవికి ప్రియాతి ప్రియమనిపించే "బందరు"(మచిలీపట్నం) గురించీ , స్నేహాలూ ఇతరత్రా గురించీ మూణ్ణాలుగు కవితలున్నాయి. వాటిలోని పాదాలు ("గుండె వెనుక సముద్రం పిలిచినట్టుంది " వంటి శీర్షికలు కూడా) బాగున్నాయనిపించినా, ఈ పుస్తకంలో ఇమడలేదనిపించింది. వాటిని మినహాయించి ఉంటే ఈ సంపుటి మొత్తం ఒకే ఊపులో సాగినట్టై, ఒకేవిధమైన భావజాలాన్ని, తదనుభవాన్నీ చదువరులకు మిగిల్చేదేమో కదా అనిపించింది. అలాగే, "మార్కెట్ మగాడి రెక్కలు", "నెల్లిమర్లలో నెత్తుటి వేళ్ళు" తొలుత తేలిగ్గా అర్థం కాక, కవిత ఉదయించిన సందర్భమేమై ఉంటుందోనన్న మీమాంసకు గురి చేశాయి. 

అనుభూతివాద కవిత్వ ఝరుల్లో ఉల్లాసంగా ఓలలాడేందుకు అభిలషించే నవతరం కవిత్వాభిమానులను, అనేకానేక సామాజిక సమస్యలను స్పృశిస్తూ ఆవేశంగా విమర్శనాత్మకంగా సాగిన ఈ అభ్యుదయ కవిత్వం ఏ మేరకు అలరిస్తుందన్నది ప్రశ్నార్థకం. కానైతే, అనిసెట్టి అన్నట్టు "సాహిత్యం ఉద్వేగ మార్గాన జరిగే సత్యాన్వేషణ" అన్న మాటను నమ్మేవారినీ, వివిధ వైరుధ్యాలతో సతమతమవుతున్న సంఘం నాడిని కవిత్వంలో వాడిగా వేడిగా వినిపించడమొక అవసరమే కాదు, అరుదైన కళ కూడానన్న స్పృహ కలిగిన వారినీ- ఈ సంపుటిలోని వస్తు వైవిధ్యమూ, శిల్పమూ, గాఢతా అయస్కాంతాలై ఆకర్షిస్తాయనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

77 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొంటూ, కవిత్వాభిమానులతో ఆత్మీయ చర్చలు జరుపుతూ హుషారుగా కాలం గడుపుతోన్న మన అద్దేపల్లి, మున్ముందు మరిన్ని సంపుటులతో మన ముందుకు రావాలనీ, తెలుగు కవిత్వ చరిత్రలో చెరిగిపోని సంతకమవ్వాలనీ ఆకాంక్షిద్దాం!

2 comments:

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...