మహాలయం

ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఎవరి జీవితాల్లోని ఉత్సవ కోలాహలాన్నో
ఉరుకులు పరుగులతో మోసుకొస్తుంది గాలి
నల్లని రాత్రిని కన్నుల్లోకి ఒంపుకుంటూ
ఒంటరిగానే గాలిని నమ్మి నడచిపోతూంటాను
అడవి పక్షుల పాటలన్నీ పగటినీడలతో పారిపోయే వేళ
శరదృతునదులన్నీ సముద్రంతో సంగమించే చోట
నిశినీలి చెంపలపై నక్షత్రాలు కైపుగా నవ్వి
నిదురపోని లోకాలపై మెరుపుకలలు రువ్వే వేళ
వాళ్ళని చూస్తాను
కాగడా వెలుగుల్లో, కాళ్ళకు గజ్జెల్తో
జన్మాంతర దుఃఖాల్ని హేలగా
మంటల్లో విసిరే నిర్లక్ష్యంతో
యవ్వనంతో
చంద్రుని ఆవరించే ఎర్రని వెలుగులా వాళ్ళంతా
చితిమంట చుట్టూ చేరి చిందేస్తుంటే చూస్తాను
లోకాలు కంపించటమొక్కటే లక్ష్యంగా ఆ
చేతుల్లోని మంత్రదండాలు ఊగిపోవడం చూస్తాను.
ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
చీకటిని శ్వాసిస్తున్న లోకంలోనే
వెలుగేదో సుస్పష్టంగా కనపడ్డ రాత్రి
ఆ అడవి మంటల్లో, అవనీ ఆకాశాల్లో
సముద్రపు గాలిలో, నీటిలో
నిరంతరం మెదలే అనాది సంగీతమే
అనాగరికుల వాయిద్యాల్లో ప్రతిధ్వనించి
లోలోపలి సంచలనాన్ని శకలంలా ఎగరగొడుతోంటే
చుట్టూ ప్రతీ శబ్దమూ నిశబ్దమవడమూ
మహానిశబ్దమంతా సంగీతమవడమూ తెలిసి
నాలోపలి ఊపిరి లయను తొలిసారి వింటాను.
---------------------------------------------------
తొలి ప్రచురణ: ఈమాట, మార్చ్-2015 సంచికలో

శ్రీ

"మెలికలు తిరిగే నది నడకలకూ, మరి మరి ఉరికే మది తలపులకూ.." అలుపన్నదే ఉండదని, భలే 'లయ'గా చెప్పి ఒప్పించాడే అనుకున్నాను కానీ, అతని పేరేమిటో నాకప్పుడు తెలీదు. "ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసూ.." అని ఊగుతూ తూగుతూ పాడుకున్న మా యవ్వనం మీద అతని సంతకం పడుతోందనీ ఏమంత శ్రద్ధగా గమనించుకోలేదు.
"ఔననా..కాదనా...అతనేదో అన్నాడూ" అనిపించే తొలిప్రేమ తడబాటునీ, "వీచే గాలి నీ ఊసులై తాకుతూ ఉంటే..దూరం దిగులుపడదా నిన్ను దాచలేననీ" అని అదే హృదయం నమ్మకంగా పలికి, "ప్రతీ శ్వాసలో ఉయ్యాలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమా" అంటూ తీర్మానించడాన్నీ - మా మాటలు కాకపోయినా పాటలుగా పాడుకున్న క్షణాలు నిన్నా మొన్నా జరిగినంత స్పష్టంగానూ గుర్తు.
"అమ్మ కొంగులో చంటి పాపలా...మబ్బు చాటునే ఉంటే ఎలా?" అంటూ కవ్వించి వెండివెన్నెలను నేలకు దించి, ప్రణయ ఝంఝలో కంపించే చిగురుటాకు లాంటి మనసుని ఏడంటే ఏడే స్వరాలతో లాలించి ఊరడించిన శ్రీని - ఈ పాటల్తోనే గుర్తుంచుకుంటానెప్పటికీ..!

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....