19 April, 2019

పెళ్ళి కుదిరింది

"పెళ్ళి కుదిరింది" అనే మాట వినడానికి చాలా బాగుంటుంది. అమ్మాయి చెబితే అబ్బాయి గురించీ, అబ్బాయి చెబితే అమ్మాయి గురించీ అడిగీ అడగనట్టుండే మన ప్రశ్నలూ, రహస్యాలను దాచీ దాచకుండా వాళ్ళు చెప్పే సమాధానాలూ ఎక్కడ లేని ఆసక్తినీ మోసుకొస్తుంటాయి. "వీడని వియోగమున వేగు మ్రోడు మేను తలిరు తోరణమై సుమదామమాయె!" అంటూ పెళ్ళిపల్లకీ ఊహ మోసుకొచ్చే ఊసులన్నీ అమ్మాయిలు పంచుకుంటారని కాదు. "ఇదమిత్థమని నిర్ణయింపగారాని దే కోర్కియో రూపుఁగైకొన్నయట్లు, జన్మజన్మాంతర సంగతమ్మైన యాశా బలంబవధికి సాగినట్లు, ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకార మెనయించి దర్శనమిచ్చినట్లు.." అంటూ చూపులు కలిసిన శుభవేళల గురించి అబ్బాయిలు ఈకాలపు మాటల్లోనైనా వివరం చెప్పగలరనీ కాదు. కానీ, అసలు ప్రేమంటూ ఉంటే అది నిశ్శబ్దంలో పూచే నవ్వులగానో, కదిలిస్తే మాటల్లో మన్నన గానో, బయటపడుతూనే ఉంటుంది. దానిని గమనించడం బాగుంటుంది.
అబ్బాయి ఎవరు? ఎక్కడ చదువుతున్నాడు, యే ర్యాంక్ తెచ్చుకుంటాడు? లాంటి కాలేజీ రోజుల ప్రశ్నల్లోనే నేనింకా చిక్కుపడి ఉన్నప్పుడు, నాకన్నా ఏడెనిమిదేళ్ళు పెద్దదైన ఓ స్నేహితురాలు, తన జీవితంలోకి రాబోతోన్న మనిషి గురించి, "హి ఈజ్ ఎ జెంటిల్‌మాన్" అని చెప్పింది. ఆ సమాధానం ఎన్నాళ్ళో నాతో ఉండిపోయింది. చదువూ, ఉద్యోగమూ, కులమూ కుటుంబమూ కాక, ఎంత అనవసరమైందని నమ్ముతున్నా అందమూ కాక, మరొకటా? అని లోపల్లోపల ఆశ్చర్యంగా అనిపించేది.
అయినా చదువూ సంస్కారమూ వేరు కాదని అమాయకంగా నమ్మిన రోజులవి. పోకిరీవేషాలతో జులాయిగా తిరిగే వాళ్ళు ఎప్పటికప్పుడు మంచిమార్కులతో క్లాసులు దాటుకుంటూ పైచదువులకెట్లా పోతారంటూ పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలు చెవిన పడి, చెయ్యాల్సిన అన్యాయమంతా చేశాయి. పై చదువులు చదివేకొద్దీ, పెద్ద ఉద్యోగాలు, పదవులు దొరికే కొద్దీ, పక్కవాళ్ళని కష్టపెట్టకుండా, నెట్టకుండా బ్రతకడం, తోటివాళ్ళని గమనించుకుంటూ అవసరమైతే సాయం చెయ్యడం, గౌరవంగా, ఎవరి ముందూ ఉత్తపుణ్యానికి దేహీ అనకుండా బతకడం, - మనుష్యులకి ఇంత కష్టమైపోతాయా అన్న సందేహమూ మొదలైంది. చదువుతో ఇవన్నీ కలిసి రావని నేను కనుక్కునేసరికి నా చదువైపోయింది. కేరక్టర్ కనిపెట్టాలంటే కట్నం తీసుకుంటాడో లేదో తెలుసుకోవాలనీ, బుద్ధిమంతుడో కాదో తెలియాలంటే, మందూ సిగరెట్ అలవాట్లున్నాయో లేదో తెలిస్తే చాలనీ అమాయకంగా తీర్మానించుకున్న రోజులు గుర్తొస్తే, ఇప్పుడు భయమేస్తుంది.
ఈ కలలూ, మెలకువలూ పక్కన పెడితే, దగ్గర వాళ్ళైనా, కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉన్న వాళ్ళయినా, ఎవరైనా సరే, అసలు "పెళ్ళి కుదిరింది" అని చెప్పేటప్పుడు వినడం/ వాళ్ళని చూడటం, వాళ్ళ మాటలను బట్టి అవతలి మనిషి వ్యక్తిత్వాన్ని ఊహించుకోవడం నాకొక సరదా వ్యాపకం. బాగా గుర్తుండిపోయినవీ కొన్నున్నాయి -
ఏళ్ళకు ఏళ్ళు అవునూ కాదుల ఊగిసలాటలో గడిపిన ఒకమ్మాయి, ఓరోజున్నట్టుండి, పెళ్ళి కుదిరిందనీ, ఎట్టకేలకు 'ఎస్ ' చెప్పేశాననీ, సంబరంగా చెప్పింది. ఆ అమ్మాయిని ఒప్పించడానికి అతడెన్నెన్ని వాగ్దానాలు చేశాడో తెలియదు కానీ, చివరికి ఆమె నమ్మకాన్ని గెలిచిన మాటలో మటుకు, వాళ్ళిద్దరికీ సంబంధించిన సంగతులేవీ లేనేలేవుట. తన కుటుంబమూ జీవితమూ మరింత విశాలం కానున్నాయన్న భరోసా ఇచ్చే ప్రేమ, షరతుల్లేకుండా విస్తరించుకుపోయే ప్రేమ, ఎవరికి చేదు? మనసిచ్చిందంటే ఇవ్వదా మరీ? నేనైతే ఫిదా అయిపోయాను.
స్నేహమో ప్రేమో, రెంటికీ మధ్యనున్నదో, రెంటికీ మించినదో తేల్చుకోలేక ఎప్పుడు పలకరించినా "ఇప్పుడు నేనేం చెయ్యనే?" అని గోళ్ళు కొరుకుతూ ఆలోచనలో పడిపోయే నా ప్రాణస్నేహితురాలొకతె, ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి, " పెళ్ళి కుదిరిందే! నువ్వు అక్టోబరులో సెలవు పెట్టి వచ్చెయ్యాలి, సరేనా?" అని ఆరిందా పిలుపు మొదలెట్టింది. బొట్టూ కాటుకా తీసుకుని ఇంటికొచ్చి పిలుద్దువు కానీ, ముందా చిక్కుముడి విప్పిందెవరో చెప్పమన్నాను. అప్పటికింకా ఎంతో మందికి చెప్పలేదనుకుంటాను, ఇష్టంగానే గుర్తు చేసుకుంటూ విసుక్కోకుండా వివరంగా చెప్పింది. "నిన్ను గాక వేరే అబ్బాయిని చేసుకుని నేనెట్లా బతుకుతానసలు?" అని అమ్మయీమణి ఫోన్‌లో విరుచుకుపడితే, "నువ్వు నిజంగా ఆ మాటంటే నా అంత అదృష్టవంతుడు లేనట్టే" అని గొణిగాట్ట ఆ మిత్రరత్నం. "గట్టిగా ఏడవరాదూ..?" అని ఇది తిడుతుండగానే ఫోన్ కట్. కట్ చేస్తే, కోయంబత్తూర్‌లో ఉండాల్సిన మనిషి, అప్పటికప్పుడు ఫ్లైట్ తీసుకుని హైదరాబాదులో ప్రత్యక్షం. ఎదురుచూపులు పండాక, ఇంకేమవుతుందీ..పీ పీ పీ..డుం డుం డుం.."అతగాడొస్తాడాహా..." పాట వెయ్యి గొంతులతో దాని చెవుల్లో మోగింది.
నిన్న గాక మొన్న, ఆఫీసులో మాతో పని చేసే అబ్బాయికి పెళ్ళి కుదిరింది. మానిటర్ మీదకి ఎగిరెగిరి చూసి అందరినీ పలకరించే ఆ కళ్ళు, కీబోర్డ్ పక్కనే సర్దుకున్న ఫోన్‌లో నుండీ బయటకు రాకపోవడం, కళ్ళున్న అందరం గట్టిగానే గమనించాం. వేళాపాళా లేకుండా మోగుతున్న ఫోనూ, మారిన రింగ్‌టోన్, కాంటీన్‌లో కూర్చుని రమ్మని ఫోన్ చెయ్యబోతే కొత్తగా వినపడ్డ కాలర్‌ట్యూన్, అకారణంగా రోజంతా వెలిగిపోతోన్న అతని ముఖం, అసలు సంగతిని అతను చెప్పకపోయినా ఇట్టే పట్టించేశాయి. డెడ్‌లైన్లు మీదకొస్తున్నా, "బేచిలర్ గాణ్ణి, నేను గట్టిగా ఆదివారం ఓ గంట కూర్చుంటే సోమవారం పొద్దుటి మీటింగ్‌కి రెడీ అయిపోతుంది" అంటూ సాయిలాఫాయిలాగా తిరుగుతూ మా బి.పి లు పెంచిన మనిషి, శుక్రవారం మధ్యాహ్నానికల్లా పని ముగించి మా చేతిలో పెట్టి, ఎవరో పిలిచి సెలవిచ్చినట్టే అజాపజా లేకుండా తప్పించుకుపోవడమూ మొదలెట్టాడు. అట్లా చుట్టూ ఉన్న లోకం మొత్తాన్నీ దూరం పెట్టినన్నాళ్ళు పెట్టి, ఓ శుభముహూర్తాన స్వీట్‌బాక్స్‌తో వచ్చి, మళ్ళీ జనజీవనస్రవంతిలో కలిశాడు. ఫ్లోర్‌లో ఉండగానే ఫోన్‌లో దాచుకున్న ఫొటోలు కొన్ని చూపిస్తూ పెళ్ళి కబుర్లు చెప్పాడు. సెలవి నవ్వుతో, సిగ్గుతో, వాల్జడ బరువుతో ఒకింత వాలిన తలతో, చివరికంటా విచ్చిన పసిమొగ్గలను బంతిలా చుట్టి బుట్టలో కూర్చోబెట్టినట్టుందా పిల్ల. పారాణి పాదాలతో, కర్పూరహారాలతో పక్కపక్కన చేరి నిల్చున్న జంటను చూడగానే, ఘాటైన జ్ఞాపకాల పరీమళాలేవో చూస్తున్నవాళ్ళనీ చట్టున చుట్టుముట్టాయి.
ఆ సాయంకాలం నాలుగింటి వేళ కాంటీన్‌కి లాక్కెళితే, చాట్- / చాయ్ ఛోటా ట్రీట్ అన్నాడతను. టేబుల్ చుట్టూరా ఓ నలుగురం సర్దుకు కూర్చున్నాకా మళ్ళీ పెళ్ళికబుర్ల మీదకి గాలిమళ్ళింది. అయిన వాళ్ళని కూడా నిద్దర్లలో లేపి అక్షతలేయించుకోవాల్సిన అర్థరాత్రి ముహూర్తం కాక, హాయిగా రాత్రి ఎనిమిదింటికి సుముహూర్తమట. బంధువులూ స్నేహితులూ ఆత్మీయులూ అందరూ నిండి ఉండి, ఇసకేస్తే రాలనట్టైందట పందిరి. అమ్మాయి తరఫు వారూ, అబ్బాయి తరఫు వారూ అందరూ కూడి ఖణాయించి ఉండగా, "కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం" మంత్రాలు వినపడుతోండగా, సూత్రాలు కట్టాల్సిన పెళ్ళికొడుక్కి మాత్రం, చేతులు సన్నగా వణికాయట.
మాతో చెప్పడానికి తెలియని ఇబ్బందితో తలొంచుకుని, కాఫీ గ్లాసు అంచులను తడుముతున్న అతని వేళ్ళని, తదేకంగా చూస్తుండిపోయాము. ఇబ్బందిబ్బందిగా ముక్కలుముక్కలుగా చెప్పుకుపోయాడతడు. తన ప్రాణం పరవశమవుతోందనో, తనకంటూ శరత్తులిక విడిగా ఉండబోవనో కాదుట, అమాయకంగా తలొంచుకు కూర్చున్న ఆ అమ్మాయి సన్నని మెడ మీద, ఇదిగో - ఇతగాడి బరువేదో మోపుతున్న బెరుకట; బెంగట. తొలిచేస్తున్న దిగులునీ, తామిక ఒకరికొకరమని ఆసరికే కుదిరిన నమ్మకాన్నీ, కష్టమ్మీద మాటల్లోకి మార్చి అతను చెప్తుంటే అనిపించింది - సౌఖ్యజ్వాల అంటే ఇదేనేమోనని. కాసేపు నోటమాట రాలేదు. కులపాలికా ప్రణయపు మాధుర్యమేదో మాటల్లో తుంపుకున్నట్టైంది.
ఆ గొంతులో నిజాయితీనో, అసలట్లా ఎప్పుడూ ఎక్కడా ఏ మగవాడి దగ్గరా విని ఉండకపోవడమో తెలీదు కానీ, పాపం పొద్దున లేస్తే ఇట్లాంటి మొగుళ్ళ మీదేగా "జస్ట్ ఫర్ లాఫ్స్" అంటూ పిచ్చి ప్రేలాపనలన్నీ చేతులు మారేదీ అని, జాలిగా అనిపించింది. ఆ జాలిలో నుండి ఏమైనా మాటలు పొడిగించుకునేలోపే అక్కడికొక డిల్లీ స్నేహితుడొచ్చి చేరాడు. రావడంతోటే కొత్త పెళ్ళికొడుకు జబ్బ చరిచి, కన్ను గీటి, కొత్త జీవితమెలా ఉందీ, పెళ్ళాం వస్తే బ్రతుకెలా మారిందీ అని కుదిపి కుదిపి అడిగాడు.
"ఎక్కడ బాస్! ఇంకా బ్యాచిలర్ లైఫే, ఏం మార్పు లేదు" - "ఈ నెలంతా ముహూర్తాలు లేవుట" ఇకిలిస్తూ చెప్పాడీ అబ్బాయి.
తీరి కూర్చుని పానీపూరీలో రగ్డా, టీకామీటా జాగ్రత్తగా కలుపుకు వొంచుకు తింటోన్న నాకు పొలమారినట్టైంది. ఓరకంట చూస్తే ఆలూ సమోసా నోటి నిండా కొరికిన నా స్నేహితురాలూ ఉక్కిరిబిక్కిరవుతోంది.
క్షణాల్లో మా ఇద్దరి ముఖాలూ మాడిపోయాయ్. వాళ్ళ లోకంలో నుండి తలలు తిప్పి చూస్తే, ఓ మాట చెప్పి అర్జంటుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలని ఉంది మా ఇద్దరికీ. వాళ్ళ మాటలా, తెగట్లేదు.
"మరి హనీమూన్‌కి ఎక్కడికి వెళ్ళారు?" డిల్లీ అబ్బాయి ఆమాటాఈమాటా కానిచ్చి మళ్ళీ అడిగాడు.
ఈ అబ్బాయి తన ధోరణిలో తానున్నాడు. నా కుదురు తక్కువ స్నేహితురాలు నన్ను చూసి కిసుక్కున నవ్వింది. చెప్పేదీ, వినేది ఆపేసి, ఎదటి ఇద్దరూ మాకేసి చూశారు. ఎంత అదిమినా ఆగలేనట్టు మా ఇద్దరికీ నవ్వు తన్నుకుతన్నుకొచ్చింది.
"ఏమైంది మేడం?" కొత్తపెళ్ళికొడుకు కినుకగా అడిగాడు.
నేను మాట్లాడకుండా నా పానీపూరీ ప్లేటూ, టీ గ్లాసూ సర్దుకుని, టిష్యూతో టేబుల్ మొత్తం బరబరా తుడిచే పనిలో పడ్డాను.
"మేడం!" అతను రెట్టించాడు. ఎన్నడూ లేని ఆ కొత్త పిలుపులో కోపం, ఉక్రోషం, తెలుస్తూనే ఉన్నాయి.
"నువ్వు మార్పేం లేదని చెప్పినప్పటి నుండీ ఇద్దరూ నవ్వుతూనే ఉన్నార్రా!" ముందు నుండీ మాతో కూర్చున్న నాలుగో మనిషి కుతూహలంగా మమ్మల్ని మార్చి మార్చి చూస్తూ చెప్పాడు.
కోపంతో నోరెళ్ళబెట్టాం, "మేమా?" అన్నట్టు.
అన్న మాటలన్నీ అరక్షణంలో గుర్తుచేసుకుని, పెళ్ళికొడుకు తలపట్టుకున్నాడు.
"నేనన్నది బెంగళూరులో, ఇంటికి. అమ్మాయి గృహప్రవేశం చెయ్యడానికి ముహూర్తం చిక్కలేదని" ఎర్రగా కందిన ముఖంతో ఛీ కొట్టి కుర్చీ బర్రున తోసి అంగలు పంగలుగా వెళ్ళిపోయాడతడు.

6 comments:

 1. Nice one Manasa Garu.
  Brought back so many memories of my friends and cousins in similar situations

  ReplyDelete
  Replies
  1. Dear Surabhi Garu, Thank you. Glad this could strike a chord.

   Delete
 2. "కులపాలికా ప్రణయపు మాధుర్యమేదో మాటల్లో తుంపుకున్నట్టైంది." - ఇక్కడి వరకు భలే నడిచింది, నచ్చింది.

  ReplyDelete
 3. అమాయకంగా తలొంచుకు కూర్చున్న ఆ అమ్మాయి సన్నని మెడ మీద, ఇదిగో - ఇతగాడి బరువేదో మోపుతున్న బెరుకట; బెంగట. తొలిచేస్తున్న దిగులునీ, తామిక ఒకరికొకరమని ఆసరికే కుదిరిన నమ్మకాన్నీ, కష్టమ్మీద మాటల్లోకి మార్చి అతను చెప్తుంటే అనిపించింది - సౌఖ్యజ్వాల అంటే ఇదేనేమోనని ఇది మాత్రం చాలా బావుంది.. ఇంత సుకుమారంగా ఆలోచించే మగవారు ఇంకా ఉన్నందుకు i am very happy.

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా ఉన్నారండీ. బహుశా రాయాలనిపించడానికి అదీ ఒక కారణమే..
   Thank you!

   Delete