09 April, 2019

మిథిల


“ఇందూ, మీరు మాట్లాడి ఒప్పించాలి, ఇట్లా వదిలెయ్యలేం మనం, అరె, నాలుగేళ్ళ నుండీ ప్రోజక్ట్ లో ఉంది, ఇప్పుడు అవసరం పడితే వెళ్ళనంటే ఎట్లా!"

"తను వెళ్ళనంది. అయినా ఆల్టర్నేట్ రిసోర్స్ చూపించింది కదా, మీ ప్రోబ్లం ఏంటసలు?" ఎంతకీ తెగని ఈ మీటింగ్‌తో  పెరిగిన తలనొప్పితో కొంచం గట్టిగానే అడిగాను.

" ఏంటి ఆ ఆల్టర్నేటివ్, మూడేళ్ళైనా ఉందా ఆ సంజయ్‌కి ఎక్స్‌పీరియన్స్? ఆ పని, స్ట్రెస్ ఆ కుర్రాడెట్లానూ హేండిల్ చెయ్యలేడు.. ట్రస్ట్ మీ. మనకి మిథిల కావాలి. ప్లీజ్!  మీరామెతో మాట్లాడి ఒప్పించండి"

తల విదిలించాను.

"జరగదు. తనకి ఫేమిలీ కమిట్మెంట్స్ ఉన్నాయట. మూడు వారాలు కాదు, మూడు రోజులైనా ఆన్‌సైట్ వెళ్ళనని చెప్పేసింది. ఆ కొత్తబ్బాయిని తను ట్రెయిన్ చేసి, పనిలో హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఆ అబ్బాయేమో ఆన్‌సైట్ ఇవ్వకపోతే మానేస్తా అని బెదిరింపులు. ప్చ్, అసలే ప్రోజక్ట్ ఫేజ్ ఏం బాలేదు. మనమే ఓపిక పట్టాలి."

"మీ చిన్నప్పటి ఫ్రెండే కదా. ఏదోటి చెయ్యచ్చు కదా?"

మానిటర్ ఆఫ్ చేశాను. "మీరే చెప్పచ్చు కదా?!"

రాజేశ్ విసురుగా వెళ్ళిపోయాడు.
**********

"ఇందూ, దిస్ ఈజ్ అర్జంట్. అబ్దుల్‌తో మాట్లాడావా? నాకు రేపు సాయంకాలానికల్లా రిపోర్ట్ కావాలి."

"ష్యూర్ చంద్రా. ఆ పని మీదే ఉన్నాను"

"ఎన్ని మిలియన్ల ప్రోజక్టో ఎంతమంది రిసోర్స్‌లని పెట్టామో, బఫర్ కౌంట్,  అవర్ కాస్ట్ టీమ్ లీడర్‌లకి గుర్తు చెయ్యొకసారి."   
"ష్యూర్!"

కాబిన్ డోరు తన వెనుకే ఊగుతూ ఊగుతూ మూసుకుపోయింది.

డెస్క్‌టాప్ మీద చాట్ విండోస్ ఒక్కొక్కటిగా మెరుస్తూనే ఉన్నాయి.

"మీ టీమ్  లీడ్స్ ప్రమోషన్ లిస్ట్ రాలేదింకా!  ఎప్పుడు పంపిస్తారు? ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ డిస్కషన్ అవ్వాలి. గుర్తు చెయ్యడానికి పింగ్ చేస్తే రెస్పాన్స్ లేదు?”   హెచ్.ఆర్ టీమ్ నుండి కాల్.

"కొంచం అర్జంట్ మీటింగ్‌లో ఉన్నాను. రేపటికల్లా పంపేస్తాను." థాంక్స్ చెప్పి పెట్టేశాను.

ఇంతలో మళ్ళీ చంద్ర నుండి పింగ్. "ఇందూ. ఈ ప్రాజెక్ట్ మీద మనం జాగ్రత్తగా పనిచేసి రిపోర్ట్ పంపకపోతే ఇది చాలా దూరం వెళుతుంది. ఐ నో, మన టీమ్ కొత్తది. ఫ్రెషర్స్ అయినా మెరికల్లాంటి పిల్లలు, కాదనను కాని, క్లయింట్‌ని బట్టి టెక్నాలజీని బట్టి మారడం ఇంకా చాతకాటల్లేదేమో. ఎనీవే, అబ్దుల్‌తో మీటింగ్ మినిట్స్ అన్నీ నాకు అప్పటికప్పుడు తెలుస్తుండాలి. రేపు సాయంత్రానికల్లా నాకు ఫుల్ రిపోర్ట్ కావాలి."
అప్రైజల్స్ షీట్ పక్కన పెట్టి,  ఎవరెవరి మీద కంప్లయింట్స్ ఎస్కలేట్ అయ్యాయో, ఎందుకయ్యాయో రిపోర్ట్ తీసి చదివాను. రెండు నెలల్లో మొత్తం పదహారు. ఏ లెక్కన చూసినా, సర్వీసెస్‌లో ఈ అంకె చాలా పెద్దది. ఆఫ్టరాల్ రీజినల్ హెడ్‌ను, నాకే చదువుతుంటే ఇంత గాభరా పుడుతోందంటే, టాప్‌లెవెల్ మేనేజ్‌మెంట్ ఎలా రియాక్టవుతారో ఊహించగలను, అర్థం చేసుకోగలను.

లీడ్స్ అందరికీ ఏం జరుగుతోందో, వాటిని ఎలా టాకిల్ చెయ్యాలో కొన్ని పాయింట్స్ రాసి, రాత్రి మీటింగ్‌కి అందరూ ఏ టైమ్ జోన్ అయినా సరే అటెండ్ అవాల్సిందే అని మెయిల్ పంపాను.

మిథిల వెంటనే పింగ్ చేసింది.

"ఇందూ..నేను ఇంటి నుండి రిపోర్ట్ చేస్తాను."
"సాయంకాలం మన బెంగళూరు లీడ్స్‌తో మీటింగ్ ఉంది మిథిలా. నువ్వూ ఉండాలి, నాక్కొన్ని డిటెయిల్స్ కావాలి."
"నేను కాల్ అటెండ్ అవుతాను ఇందూ. ఇది షార్ట్ నోటీస్, నాకు వీలుపడదీ రోజు"

తలపట్టుకున్నాను. ఎలా అంటుందిలా, పద్దెనిమిది మంది రిపోర్ట్ చేస్తున్నారు తనకి. ఈ అకౌంట్లో నాలుగు సంవత్సరాలుగా పని చేస్తోంది. నేను అవ్వడానికి పై అధికారినే కానీ వచ్చి ఏడు నెలలు కూడా నిండలేదింకా. తను మీటింగ్‌లో ఉంటే చర్చించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ నాకు తెలుసు, నేను శాసించలేను. నిజానికి  నాకా అధికారం లేదు.

అయిష్టంగానే "ఓకే" అన్నాను.

అప్రైజల్ షీట్‌లో ప్రమోషన్స్ లిస్ట్‌లో మిథిల పేరు చుట్టూ అప్రయత్నంగానే ఎర్ర సున్నా చుట్టాను.

ఎదురుగ్గా ఉన్నా టీమ్ ఫొటోలో మిథిల మీదకి పోయింది నా చూపు. నల్లటి టీషర్ట్, మా కంపెనీ పేరున్నది. టీమ్ అందరికీ ఆర్డర్ చేసినా సైజులు కొంచం అటూ ఇటూ అయ్యాయి. చాలా మంది సరైన సైజ్ షర్ట్ రాలేదని , అసలు వేసుకోకా, వదిలేసీ, విసిరేసీ చేశారు. మిథిల అదో సంగతే కాదన్నట్టు, తనకు సరిగానే వచ్చిన షర్ట్ గొడవ చేస్తున్న ఇంకో అమ్మాయికి ఇచ్చేసి, పెద్ద సైజ్ షర్ట్ తీసుకుని వేసేసుకుంది. ఆ వదులు షర్ట్ లో తనని చూసి, "యు లుక్ సో కూల్" అని పొగిడారంతా. మిథిల అందం తన బట్టల్లో ఉండదు, లిప్‌స్టిక్ అంటని పెదాల్లోనూ, కాటుక తగలని తన కళ్ళల్లోనూ ఉండదు. మాట్లాడితే తన గొంతులో వినపడే స్థిరత్వం, పనిచేసే చోట తన నడవడిక-  మిథిల లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారంటారు మా నాన్న.  తనని పక్కింటి మనిషిలానే కాక, పదేళ్ళు చదువు చెప్పిన మేష్టారిగా కూడా చూసిన  ఆయన మాట కాదని తిప్పికొట్టలేను కానీ..ఎట్లా ఉండేదీ పిల్ల!

***********
"మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? "యశోదలా ఎలా కూర్చోవాలో, కృష్ణుడిని ఎలా నిగ్గదీయాలో పద్యాలు పాడిస్తున్నారు మేష్టారు.

పెద తెలుగు మేష్టారి గొంతు గదిలో ఉన్నట్టుండి ఖణీమని మోగేసరికి అందరం పాడే పద్యాలు ఆపి తలలు తిప్పి చూశాం.

"రెండు వారాల నుండి చచ్చేట్టు నీకీ పద్యాలు పగలూ రాత్రీ నేర్పిస్తుంటే, ఇప్పుడు...ఇక వారంలో ఫంక్షన్ ఉందనగా, మీ అమ్మ వద్దంటుందా? తమాషానా నీకిదంతా, నువ్వు ముందు చెప్పలేదూ ఇంట్లో?"

నొసలు చిట్లించి భూమిలోకే చూస్తూ నిలబడి ఉంది మిథిల.

"క్లాస్‌కి పో ఇక ఇక్కడెందుకు! అంతా టైం వేస్ట్ వ్యవహారం, గొంతెత్తి పద్యాలు పాడుతున్నావని మీ క్లాస్ టీచర్ చెప్పబట్టి కానీ..." అంటూ మా వైపు తిరిగి " ఆ తొమ్మిదో తరగతిలో స్వాతిప్రియని పిలుచుకురండి, ఇక్కడున్నట్టు రావాలి"  ధుమధుమలాడిపోతూ చెప్పారాయన.

కారిడార్‌లోకి పరుగు తీశాను. మిథిల బుగ్గ లోపలివైపు కొరుక్కుంటూ అక్కడే ఒక స్తంభాన్ని ఆనుకుని నిలబడిపోయి ఉంది. తలెత్తి నన్ను చూసింది. ఆగబోతూ వెనుక నుండి మేష్టారు చూస్తున్నారనిపించి మళ్ళీ పరుగందుకున్నాను.

ఎక్కువ రోజులు వేసుకోవచ్చని,  ఒక సైజు పెద్ద బట్టలే కుట్టించేవాళ్ళు వాళ్ళ అమ్మగారు. ఆ వేలాడిపోయే యూనిఫారంలో, సనసన్నటి చేతులతో, దోసగింజ బొట్టుతో, మెడ దాటీ దాటనట్టుండే జడని అందంగా అల్లుకుని, ఎప్పుడూ ఒకేలా కనపడేది మిథిల. పక్కపక్క ఇళ్ళవడంవల్లో, బాగా చదివే పిల్లల్ని కలిపి ఎప్పుడూ బళ్ళో ఏవో ఒక పనులు చెయ్యమనడం వల్లో, మేం కలిసే సమయాలు ఎక్కువే ఉండేవి కానీ, ఎందుకో ఆ నాటకం తర్వాత తనకు తానుగా దూరం వెళ్ళిపోయింది. పలకరించినా ముభావంగా నవ్వి ఊరుకునేది తప్ప మునుపటిలా ఆటలకి కలిసేది కాదు. ఆ వయసులో దాన్నేం అనాలో తెలిసేది కాదు కానీ, మిథిల అందరు పిల్లల్లా ఉండేది కాదు. ఏడాదికొకసారి మా బళ్ళో పిల్లల కోసం స్టాల్స్ పెట్టే పద్ధతి ఒకటి ఉండేది. సీజన్ బట్టి దొరికే పళ్ళు,  చిరుతిళ్ళు, బొమ్మలు, పుస్తకాలు, ఇలా చాలా ఉండేవక్కడ. కాస్త ధర తక్కువలో అన్ని పిల్లల వస్తువులూ దొరికే ఆ సంత ఒక వారం రోజులు మా బడి గ్రౌండ్ లోనే జరిగేది. అందరమ్మానాన్నలు  ఎంతోకొంత డబ్బులూ ఇచ్చేవారు వాటికోసం. మేమంతా మా దగ్గరున్న డబ్బులతో ఏం దొరుకుతుందోనని అటూ ఇటూ పరుగులు పెడుతుంటే, మిథిల మాత్రం నేరుగా, ముందే నిర్ణయించుకున్న స్టాల్ దగ్గరకు వెళ్ళి, నచ్చింది కొనుక్కుని వచ్చేసేది. మిగతా వాటి వైపు చూడనైనా చూసేది కాదు. మిగిలిన వాళ్ళందరూ పక్క వాళ్ళేం తెచ్చుకున్నారోనన్న కుతూహలంతో కిందామీదా అయిపోతున్నా, తను మాత్రం తెచ్చుకున్న వాటిని నింపాదిగా చప్పరిస్తూ కూర్చుండిపోయేదే తప్ప పట్టించుకునేది కాదు.
ఎవరింటికీ ఆటలకీ రాదనీ, తను పిలవదనీ, పుట్టినరోజులకు వచ్చి బహుమతులివ్వదనీ ఆమెకు స్నేహితులు తక్కువగా ఉండేవారు. చదువులో ఎప్పుడూ  ఫస్టే ఉండేది కనుక, పరీక్షలప్పుడు అన్నాళ్ళూ ఎడం పెట్టిన వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో ఆమె దగ్గరకు చేరేవారు. కానీ, మిథిల ఏడాది పొడుగూతా వాళ్ళు తనని వద్దనుకున్న విషయం గుర్తులేనట్లే సంతోషంగా అందరికీ సాయపడేది.

పరీక్షల్లోనూ అంతే, మేమందరం ఎన్ని రకాల ఎంట్రన్స్ పరీక్షలు రాసేవాళ్ళమో, ‘ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది'  అన్నట్టు, తనసలు రెండు మూడు ఆలోచనలు చేసేదే కాదు. ఒక్కటే పరీక్ష రాస్తానని ముందు నుండీ అనేది, అన్నట్టే ఎంసెట్ ఒక్కటే రాసింది. రాంక్ కూడా కొట్టింది. ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్ చదువుతుందని మిత్రుల దగ్గర అప్పటికే విని ఉన్నాను నేను.
"అందరూ ఆ కాలేజీల్లో సీట్ కోసం ఎగబడుతుంటే వాళ్ళ నాన్న చూశారా, ర్యాంక్ వచ్చిన పిల్లని ఉన్న ఊళ్ళోనే ఎట్లా నిర్భందించేశాడో!"  కౌన్సిలింగ్ అయ్యాక, మాటల మధ్య మా అమ్మ ఎవరితోనో అనడం విని అవాక్కయిపోయాను నేను. తన స్వభావం వెనుక, ఇంట్లో వాళ్ళ బలవంతం కూడా ఉందేమో అని అన్నేళ్ళ తర్వాత అప్పుడనిపించింది నాకు. 

ఆ మర్నాటి మధ్యాహ్నం మా ఇంటి దగ్గర షాపులో కనపడింది తను. కలిసి ఇద్దరం ఇళ్ళవైపు మళ్ళాం. మిట్టమధ్యాహ్నం ఆ సన్నటి సందుల్లో ఎవరూ లేరు. కిర్రుకిర్రుమంటూ మా చెప్పుల చప్పుడు, అప్పుడప్పుడూ కాకుల కావు కావులు. తనతో మాట్లాడాలని నా మనసెందుకో తపించిపోయింది.

మిథిల మొహం కొన్ని ప్రశ్నలడగనీయదు. అసలు దగ్గరకే రానీయదు. అయినా ధైర్యం కూడదీసుకుని అడిగాను.

"మిథిలా, నిన్నోటి అడగనా?"చటుక్కున తల తిప్పి చూసింది. నా గొంతులో వినపడ్డ సంశయాన్ని చదివినట్టుంది.బదులివ్వక పోగా నన్నొదిలేసి అంగలుపంగలుగా నడిచింది.
"మిథిలా, మిథిలా...ఆగు."
"నీకు మంచి కాలేజీలో చదవాలని ఉందని తెలుసు. ఏమైంది? ఇంట్లో ప్రాబ్లమా, నాకు చెప్పవా మిథిలా? ఎన్ని బళ్ళు, కాలేజీలు మారినా మనిద్దరం కలుస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి స్నేహితులం. నా దగ్గర కూడా దాస్తావా? మిథిలా!" ముందుకు నేనూ పరుగెత్తి ఆమె చెయ్యి పట్టి ఆపాను.

"ఏయ్!" ఉరిమినట్టే నా వైపు తిరిగింది. "నాకే కష్టమూ లేదు. ఉన్నా నేను నీతో చెప్పను. చెప్పినా నువ్వు తీర్చగలిగిన మొనగత్తెవీ కాదు. అసలైనా మనం ఫ్రెండ్స్ ఎప్పటి నుండి అయ్యాం? నీ మనుషులు, నీ గ్రూపులు వేరే. నా చదువూ, నా లోకం వేరే! నాకిష్టమయ్యే చేరుతున్నానిక్కడ. వదులు ముందు"

కొట్టినట్లే మాట్లాడి, చేయి గుంజుకుని, వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా వెళ్ళిపోయింది.నా కళ్ళమ్మట బొటబొటా నీళ్ళు కారిపోయాయి. అంత నిర్లక్ష్యం, అంత పొగరు, అసలు మేమిద్దరం ఎవరికి ఎవరమో అన్నట్టు ఎడం పెట్టడం - ఏదీ తట్టుకోలేకపోయాను.  అటుపైన ఆమెనెప్పుడూ మళ్ళీ పలకరించే ప్రయత్నం చెయ్యలేదు. ఎనిమిదేళ్ళ తర్వాత, ఇదే కంపెనీలో నేను చేరేదాకా.

**********
చిత్రంగా మిథిల గతం గుర్తు లేనట్టే మాట్లాడింది. నాకు మొదట్లో ప్రాజెక్ట్ వివరాలు చెప్పడంలోనూ, క్లయింట్ మీటింగ్స్ ప్రిపరేషన్‌లోనూ అడక్కుండానే ఎంతో సాయపడింది. నెల రోజుల్లో అన్ని మీటింగ్స్, రిపోర్ట్స్, ఎవ్వరితో ఏ డిపెండెన్సీ లేకుండా నాకు నేనుగా ఆర్గనైజ్ చేసుకునే స్థితికి వచ్చానంటే మిథిలే కారణం. వయసు పెరిగాక, వృత్తి రీత్యా ఏర్పడే స్నేహాల్లో ఉండే కనపడని దూరాలు, తెలిసీ మనం తెలియనట్టే నటించే భయాలు, అనుభవంలోకి వచ్చాక, మళ్ళీ అన్నేళ్ళ తర్వాత మిథిలను కలిసి తన మాటలను వింటుంటే, ఏ బదులూ ఆశించకుండా తను చేసే చిన్న చిన్న సహాయాలు చూస్తుంటే, నాలో అన్నేళ్ళుగా గడ్డకట్టుకుపోయిన కోపమో ఉక్రోషమో మెలిమెల్లిగా కరగడం మొదలైంది.

కానీ, మిథిలతో కొన్ని సమస్యలున్నాయి. తను రోజూ ఒకే వేళకొస్తుంది, ఒకే వేళకి వెళ్ళిపోతుంది. పని చెయ్యదని కాదు, పద్నాలుగు గంటలిక్కడే ఉండేవాళ్ళకన్నా, ఉన్న తొమ్మిది గంటల్లోనే తను చేసే పని తక్కువేమీ కాదు. కానీ, మేనేజర్లుగా మేం కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుండనుకుంటాం. అవసరమైనప్పుడు ఏ వేళల్లోనైనా అందుబాటులో ఉండాలనుకుంటాం. మూణ్ణెల్లకోసారైనా, టీమ్ పార్టీల్లో అందరం కలవాలనుకుంటాం. మిథిల వీటికొప్పుకోదు. పనివేళలు పొడిగించుకోదు, పార్టీలకి రాదు. మేనేజ్మెంట్ లీడ్స్‌తో మాట్లాడటానికి, ఇష్యూస్ కనుక్కోవడానికి ఏదైనా మీటింగ్ రాత్రిళ్ళలో పెడితే ఇంటి నుండి అటెండ్ అయి, తన అప్డేట్స్ చెప్పి పెట్టేస్తుందే తప్ప కాల్ అయ్యేదాకా ఉండదు. అలా చేసి, చివర్లో మా అప్‌డేట్స్ మిస్ అయిన  రోజులూ లేకపోలేదు. ఒకసారి నేనిదే విషయం వివరించి చెబితే, ఆ నిముషానికి నాకు సారీ చెప్పినట్టే చెప్పి, మర్నాడు, నాకూ, నా బాస్‌కి కూడా కలిపి మెయిల్ చేసింది. ఇలా ముఖ్యమైన అప్డేట్స్, కాల్ మొదట్లోనే చెప్పుకుంటే డ్రాప్ అయినవాళ్ళకి ఇబ్బంది ఉండదని. చిత్రంగా, ఆమె చెప్పినదాంట్లో పాయింట్ ఉందని ఒప్పుకుని, తాను ఇంకొంచం ఆర్గనైజ్డ్‌గా ఉంటాననీ, భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బంది రాదనే అనుకుంటున్నా అనీ, ఏమైనా చివరి అప్డేట్స్ ఉంటే అవి మర్నాడు వచ్చి చూసుకోవచ్చు, పర్లేదనీ నా బాస్ ఆమెకు బదులిచ్చాడు.

నాకది నచ్చలేదు. అట్లాంటి ఆలోచనేదో నాకే వచ్చి, నేనే చెప్పగలిగితే బాగుండనిపించింది.

"మిథిల ఎప్పుడూ ఒక సమస్యతో వస్తుంది కదా ఇందూ" ఒకసారి ఓ పార్టీలో అన్నాడాయన.
నేనేదో మాట్లాడబోయేంతలోనే, "చిత్రమేమిటంటే, ఆ అమ్మాయి సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. తన ఆలోచన ఎప్పుడైనా అబ్జర్వ్ చేశావా? " కుతూహలంగా చూస్తూ అడిగాడు.

అవునూ కాదన్నట్టు తలూపి, అతికష్టమ్మీద ఆ సంభాషణంతా దాటవేసి అక్కడ నుండి వచ్చేశాను.

అన్ని సమస్యలకీ పరిష్కారం వెదుక్కునే మనిషి, అన్నింటి గురించి అంత ఆలోచించే మనిషి, అన్నిటిలో ఊరికే తృప్తిపడిపోయి, సర్దుకుపోయే మనిషి, ప్రేమించానంటూ వెంటబడ్డ ప్రజ్వల్‌ని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఎందుకు దూరం నెట్టిందో నాకర్థం కాదు.  


********
బెంగళూరులోని మా టీమ్  మొత్తం మర్నాడు ఉదయాన్నే లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సెషన్‌కి వెళ్ళాలని, అన్ని రీజియన్ల టీములకూ అప్డేట్ చేసి, మీటింగ్ అజెండా నా  సుపీరియర్స్‌కు పంపించి కాల్ ముగించేసరికి పది దాటిపోయింది. హెడ్‌ఫోన్స్ తీసేసి నేను బయటకు వచ్చేసరికి అమ్మా, నాన్న అన్నం తినేసి వక్కపొడి నములుతూ టి.వి చూస్తున్నారు.

"సారీ అమ్మా, లేట్ అయిపోయింది.." కంచంలో అన్నం వడ్డించుకుంటూ చెప్పాను.

అమ్మ రిమోట్ నాన్నగారికిచ్చేసి, టేబుల్ దగ్గరికి వచ్చింది.

"రఘు పడుకుండిపోయాడా? ఊరలేదు కానీ, ఊరికే రుచి చూడు కాస్త" టొమేటో పచ్చడి వడ్డించింది.

"నేనే పడుకుండిపొమ్మన్నానమ్మా, రేప్పొద్దున్నే ఎనిమిదింటికే మీటింగ్ ఒకటి ఉంది. లేవలేనేమోనని, తనకి చెప్పాను, బ్రేక్‌ఫాస్ట్  సంగతి చూడాలిగా"

బుగ్గలు నొక్కుకుంది అమ్మ.

"అర్థముందిటే ఇందూ, ఇక మేం రావడం దేనికే? మీ తిప్పలేవో మీరే పడేకాడికి. పో, ముందు పోయి అబ్బాయికి చెప్పు, కంటినిండా నిద్రపోనీ పిల్లాణ్ణి. నువ్వు చెప్పడమూ, ఆ అబ్బాయి వినడమూ. బానే ఉంది"

"ఉండక..?" తింటున్న దాన్ని ఆపేసి అమ్మ వైపు తిరిగాను.

ఆశ్చర్యంగా చూసింది అమ్మ.

"కాకపోతే ఏంటమ్మా! ఆ మాత్రం సర్దుకోలేరా, చేసుకోలేరా, ఇంతింత చదువులు చదివినవాళ్ళం, నెల తిరిగేసరికి రెండేసి లక్షల జీతాలు తెచ్చిపోసేవాళ్ళం, ఆఫీసులో పనుంటే చెయ్యద్దా! మేం చెయ్యాల్సిందే, రెండోవాళ్ళు సద్దుకోవాల్సిందే. ఆ మాత్రం ముందు లేచి తను వంట చేస్తే కొంపలేం అంటుకుపోవులే.

"మిథిల గుర్తుందిగా! ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా అమ్మా. మా అత్తగారికి హెల్ప్ కావాలి, పిల్లాడికి బాలేదు, మొగుడొప్పుకోలేదూ...వాట్ నాన్సెన్స్! పని మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా!! అబ్బే, ఈవిడకీ, ఆ ఇంట్లోవాళ్ళకీ కూడా డబ్బు కావాలి. పని మాత్రం వద్దు. ఎన్ని ప్రశ్నలేసిందో , ముందెందుకు పెడుతున్నారు మీటింగ్, ఇంత షార్ట్ నోటీస్ అయితే ఎలా కుదుర్తుందీ అనుకుంటూ. యే, నాలుగిళ్ళ దూరంలోనేగా నేను ఉంటోందీ, నేను వెళ్ళట్లే?"

"అందరికీ నీకు కుదిరినట్టు కుదరద్దటే, మరీ మాట్లాడతావు కాని? రఘూ, నీ అత్తమామలూ మంచివాళ్ళు కాబట్టి, నీకిట్లా సాగుతోంది కానీ..."

" మాట్లాడితే ఇంత అహం పొడుచుకొస్తుంది, మేమేమైనా మాటంటే పులిలా లేస్తుంది! ఈ డిపెండెన్సీలు, రిస్ట్రిక్షన్లూ తనెలా భరిస్తోందో, ఎందుకు భరిస్తోందో అర్థం కావట్లేదమ్మా"  చేయి కడుక్కొని సోఫాలో కూర్చుంటూ అన్నాను.

"మిథిల నా దగ్గర చదువుకున్న పిల్ల. తను పాఠాలనూ, జీవితాలనూ కూడ శ్రద్ధగా చదువుకునే పిల్ల. ఏదో ఆలోచన ఉండే ఉంటుందిలేమ్మా.." నాన్నగారు.

"మీరు చిన్నప్పటి నుండి అదే మాట చెబుతున్నార్లెండి. అంత తెలివైనదే అయితే ప్రేమించా ప్రేమించా అని కాళ్ళవేళ్ళా పడ్డ వాడిని ఎందుకు వద్దంది? ఒక్క మంచి కారణం చెప్పమనండి. సుఖపడే జీవితం కోరుకోవాలి కదా ఎవ్వరైనా!"

"మనకేం తెలుసమ్మా, తన కారణాలు తనకుంటాయ్. ప్రేమ ప్రైవేట్ వ్యవహారం తల్లీ..."

"ఉద్యోగం కాదు కదండీ!  పూటపూటా ఆ గొడవలేంటీ మాకీ తలనొప్పులేంటీ! సరేలే నాన్నగారూ! ఇప్పుడు మిథిల గురించి మనకి గొడవలెందుకు? వదిలేద్దాం. దాని తిప్పలేవో అది పడుతుంది."

చకచకా లేచి లోపలికొచ్చేశాను.

రఘు పక్కకు ఒత్తిగిల్లి పడుకుని ఉన్నాడు. ఫేన్ గాలికి ఊగుతూ జుత్తు. నేను అలారం పెట్టుకుని లైట్ తియ్యగానే నా వైపు తిరిగాడు. దగ్గరగా జరిగి చీకట్లోనే నా చెంపలు తడిమాడు.

"ఆఫీసులో పనెక్కువుంటోదా ఇందూ " ప్రేమగా అడిగాడు.

"ఊహూ...ఓ రెండ్రోజులు...అంతే. నువ్వు బజ్జో."

ముద్దుపెట్టుకున్నాడు. నడుం చుట్టూ తన చెయ్యి బరువుగా తగుల్తోంది.

మిథిల, వాళ్ళాయన రోజూ ఆఫీసు బస్సు ఎక్కే సందు చివర బండాపి గొడవలు పడే సీన్ కళ్ళ ముందు మెదిలింది. రోజూ అతనేదో చెబుతూనే ఉంటాడు. మిథిల నవ్వు ముఖంతో కొట్టిపారేస్తూనే ఉంటుంది. "రోజూ నా వల్ల కాదు!" అని తను గట్టిగానే చెప్పడం నేనే ఎన్నో సార్లు విన్నాను. నాన్నగారెందుకు నా మాట తీసిపారేస్తారు? మిథిలని వెనుకేసుకొచ్చినప్పుడల్లా చాలా అసహనంగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు, నేను ఓడిపోయాననిపిస్తుంది.

ప్రేమంటే ఏమిటసలు?

రఘు చేతిని ఇంకా గట్టిగా దగ్గరకు లాక్కుని మిథిల ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను.

*******
మా కమ్యూనిటీ దాటుకుని బయటకొచ్చి పదడుగులు వేస్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. చిన్న సందు అది. మిథిల వాళ్ళ ఇల్లుండే దారి, ఈ సందుతోనే కలుస్తుంది. ఒక పది నిమిషాలో పావుగంటో నడక తనకి. నేను మా ఆఫీసు బస్సొచ్చే టైం చూసుకుంటూ నడుస్తున్నాను. సందు చివరి చెట్టు కింద బండి ఆపేసి మిథిల, వాళ్ళాయన కనపడ్డారు.

"ఒక్క పది నిముషాలు ముందు బయలుదేరమంటే అసలెందుకు వినవ్ మిథిలా?" అతని గొంతు నిష్ఠూరంగా వినపడుతోంది

"రోజూ నాకెలా కుదుర్తుందీ? కాస్త దూరమేగా. ఆ మాత్రం..." అతని మాట పూర్తవకుండానే నేను ముందుకొచ్చేశాను.

మా బస్సు వచ్చేసింది. నేను చివరి సీట్‌కి వెళ్ళిపోయాను.  నా వెనుకే వచ్చి, నా ముందు సీట్‌లో, అవతలి వైపున కూర్చుని, రెణ్ణిముషాలలో నిద్రపోయింది మిథిల .

జాలేసింది తన మీద.

ఎంత పని. ఎంత అలసట. బండి మీద దింపేపాటి సమయం లేదా ఆ భర్త దగ్గర. చెంపల పక్క నుండీ చెమట కారే మిథిల రూపం నన్నెందుకో ఇబ్బంది పెట్టింది.
**********
బస్సు దిగుతూనే మా దారులు మారిపోయాయి. రేగిన జుట్టుని క్లిప్స్ కిందకి నెట్టి సరిజేసుకుంటూ, డెస్క్ దగ్గరికి వెళ్ళి, ఏవో మెయిల్స్ పంపి వస్తానంది మిథిల. నేను నేరుగా సెమినార్ హాల్‌కి వెళ్ళిపోయాను.

అక్కడ అబ్దుల్ నాకోసం ఎదురు చూస్తున్నాడు. తను లీడర్‌షిప్ కౌన్సిల్‌లో సీనియర్ మెంబర్. ఈమధ్య కాస్ట్ కటింగ్ కోసం,అప్పుడప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళను తీసుకుని, మేమే ట్రెయిన్ చేసి ప్రాజెక్ట్ లోకి పంపుతున్నాం. ఎప్పుడూ లేనిది మా జర్మన్ క్లయింట్స్ నుంచి ఫిర్యాదులు. అన్నీ చిన్న చిన్నవే. కానీ పదే పదే వస్తున్నాయి. ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది, అదేంటో తెలియడం లేదు.

ఇలాంటివి ముందూ ఎన్నో చూశామని దిద్దుకున్నామని, క్లయింట్స్ కూడా కంప్లెయిన్ చేయలేదనీ మిథిల లాంటి లీడ్స్ చెప్పారు. కాని, ఈసారి హయ్యర్ మేనేజ్మెంట్ చాలా సీరియస్‌గా తీసుకుంది. సమస్య ఏమిటి, సొల్యూషన్ ఏం ప్రయత్నిస్తున్నారు, ఇలా డిటెయిల్డ్ రిపోర్ట్ కావాలనడం ఆశ్చర్యం అనిపించింది. ఇందుకోసమే అబ్దుల్ బెంగలూరు రావడం, ఈ ఓపెన్ హౌస్ మీటింగ్ పెట్టడమూనూ.

అబ్దుల్ చూపు కొత్తగా ఉంటుందనీ, తను సమస్యలను సమీపించే తీరులోనే ఒక ప్రత్యేకత ఉంటుందనీ, ఎంతో ముఖ్యమైనవైతే తప్ప అతనిదాకా తీసుకెళ్ళకూడదనీ, అతని గురించి ఎంతో విని ఉన్నాను నేను. కానీ సెషన్ మొదలై మూడు గంటలు దాటిపోయినా నాకే ప్రత్యేకతా కనిపించలేదు. అతను అందరితోనూ మామూలు మాటలే మాట్లాడుతున్నాడు. లెక్కలు, కామన్సెన్స్, ఇంగ్లీషు, ఇంకా వాళ్ళ మూలాల గురించి తెలియజేసే ప్రశ్నలే అడుగుతున్నాడు. నాకైతే అతను టైం వేస్ట్ చేస్తున్నాడనిపించింది. లంచ్‌కి ఇంకో గంటే సమయం ఉంది. అన్యమస్కంగా వింటున్నాను, మా సమస్య నుండి మేం బయటపడే దారేంటని.

అబ్దుల్ వాచ్ చూసుకున్నాడు. "ఇప్పుడొక చిన్న నాటిక వెయ్యాలి మనం. నాతో పాటు నటించడానికొక ఫిమేల్ ఎంప్లాయీ కావాలి. ఎవరొస్తారు?"  ఉన్నట్టుండి చేతులు రుద్దుకుంటూ, అందరినీ చూస్తూ అడిగాడు.

మిథిల మీద అతని చూపు నిలిచిపోయింది. అతన్నే చూస్తున్న మేం కూడా అప్రయత్నంగా తలలు తిప్పి చూశాం. కాటన్ బట్టలు. శాలువాలా కప్పుకున్న చున్నీ. చెవులకు దిద్దులు. రేగి నుదుటిపై పడుతోన్న జుట్టు. నుదుటిన చిన్న బొట్టు. కానీ, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆ రెండు కళ్ళల్లోనూ మిరుమిట్లుగొలిపేలా కనపడుతూనే ఉంటాయి. దాన్నే అంగీకారంగా అనుకున్నట్టున్నాడతను.

మిథిలని హాల్ బయటకి తీసుకెళ్ళాడు. లోపలంతా ఒక్కసారి కోలాహలమైపోయింది."నాటకమా?" "ఇప్పుడేం నాటకం" "ఏం చెప్తాడు?"  "అబ్బా, ఇంకెంత సేపీ సోది?" రకరకాల గుసగుసలతో, రకరకాల భాషలతో హాల్ అల్లరల్లరైపోయింది.

మరో రెండు నిమిషాల్లో అబ్దుల్ తలుపు తట్టాడు. కాసేపట్లో మిథిలా-తానూ లోపలికి వచ్చి, మాటల్లేకుండా చిన్న నాటకమాడబోతున్నామనీ, దాని మీద అతను చివర్లో కొన్ని ప్రశ్నలడగబోతున్నాడనీ, వాటికి సరైన సమాధానాలు రాబట్టడం మీదే ఈ సెషన్ ముగింపు ఆధారపడి ఉంటుందనీ చెప్పి, వెనక్కి వెళ్ళిపోయాడు.

మేం మొహమొహాలు చూసుకున్నాం. అందులో ఏదో ఉందని అర్థమైంది కనుక, నిటారుగా కూర్చున్నాం.

ఆ గదికి రెండు చెక్క తలుపులు. మామూలుగా వచ్చిపోవడానికి అందరం ఒక్క తలుపే వాడతాం. అబ్దుల్ రెండో తలుపు బోల్టు కూడా వేసి డయాస్ దగ్గరున్న చిన్న లైట్లు తప్ప మిగిలినవన్నీ ఆపేసి వెళ్ళాడు.

మా కళ్ళు తగ్గిన వెలుగుకి అలవాటు పడుతుండగానే, తలుపు మీద చిన్నగా తట్టిన చప్పుడు.

మిథిల తల చుట్టూ చున్నీ కప్పుకుని ఉంది. ఇద్దరూ చెరో తలుపు తోసుకుని ఒకేసారి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. అతను చూపులతోనే ఆమెను నిలిపివేశాడు. ఆమె నిలబడిపోయింది. అతడు ముందడుగు వేశాడు. అతడి కళ్ళు కౄరంగా నలుదిక్కులూ చూస్తున్నాయి. ఆమె అనుసరించింది. అతడు ఆగిన చోటల్లా, దారి కనపడ్డా, అతని వెనుకే ఉండిపోయింది. రెండు మూడు దారుల్లో తిరిగి, తలుపు తీసినట్టుగా అభినయించి, అతనొక ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ రెండు కుర్చీలున్నాయి. అతడు ఒకదాన్ని గది మూలకు జరిపాడు.

ఆమె అతని వెనుకే నిలబడి ఉంది.

అతను రెండవ దానిలో కాళ్ళు రెండూ మడుచుకుని కూర్చుండిపోయాడు. ఆమెను చూశాడు. ఆమె ఒక క్షణం ఆగి, నేల మీద, కూర్చుండిపోయింది. ఆమె చూపులు నేలను అంటిపెట్టుకుని ఉన్నాయి. ఆమె భూమి మీద మోకరిల్లింది. అతనామె తల మీద దీవిస్తున్నట్టుగా తట్టాడు. అంతలోనే ఎవరో వచ్చినట్టు చకచకా కదిలి, రెండు చేతులతోనూ పళ్ళేలు తీసుకువచ్చాడు. ఒక్కో పదార్థమూ ఎంగిలి చేసి ఆమెకు ఇచ్చాడు. ఆమె దాన్ని అలాగే తలెత్తకుండా తీసుకుని తిన్నది. తినే ముందు, తిన్న తర్వాత నేల మీద మోకరిల్లింది. అతడు అలాగే, ఆమెను దీవిస్తున్నట్టే తల మీద తట్టాడు.

అటుపై అతడు లేచి బయటకు నడిచాడు.. ఆమె లేచి అతన్ని అనుసరించి వెళ్ళిపోయింది.

ఇద్దరూ గది బయట తమ పాత్రలను వదిలించుకుని, మళ్ళీ లోపలికి వచ్చారు.

గదిలో లైట్లన్నీ ఒక్కొక్కటిగా వెలిగాయి. అబ్దుల్ పోడియం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. వాతావరణం గంభీరంగా మారిపోయింది.
"చెప్పండి. ఏం చూశారిక్కడ?" సూటిగా చూస్తూ అడిగాడు.
"అన్యాయం". "వివక్ష". "అపరాధం". "చేతకానితనం"
ఎన్నో గొంతులు కలగాపులగంగా పలికాయి.
క్లాసులో ముప్పై మంది దాకా ఉన్నాం. అబ్దుల్ చేయి పెట్టి వారించి, ఒక్కొక్కరి చేతా విడివిడిగా చెప్పించాడు. తాను నటించింది కనుక మిథిలకి చెప్పే అవకాశం లేకపోయింది. అందరం చెప్పడం పూర్తయ్యాక గొంతు సవరించుకున్నాడు. "మీరంతా జవాబులు చెప్పారు. కొందరు అతని తరఫున, కొందరు ఆమె తరఫున. కొందరు అతనిది దుర్మార్గమన్నారు. కొందరు ఆమెను చూసి జాలిపడ్డారు. అయితే, మీ అందరూ ఈ సంఘటనను చూసిన దృష్టి ఒక్కటే. వీళ్ళని మీరెంత సరిగా పట్టుకున్నారో చెప్తానిప్పుడు.

" వీళ్ళిద్దరూ మన సమాజానికి చెందిన వారు కాదు. మన సమాజంలోకి నేను తీసుకొస్తే వచ్చిన వారు. ఒక ఆటవిక తెగకు చెందినవారు. వాళ్ళ తెగలో మగవాడికి స్త్రీ పట్ల ఎలాంటి హక్కూ ఉండదు. బాధ్యత తప్ప. అందుకే, ఓ కొత్త ప్రదేశంలోకి వచ్చినప్పుడు, అతడే ముందడుగు వెయ్యాలి. వేసి, అక్కడ ఆపదలుంటే అడ్డుకుని, లేదా యుద్ధం చేసి, అప్పుడు ఆమెను రమ్మని అభ్యర్థించాలి. మీరనుకున్నట్టు, ఆమె అతడిని వెంబడించలేదు. అతడు ఆమెను కాపాడే పరివారకుడై, సైనికుడై ముందు నడిచాడు.

వాళ్ళ ఆచారం ప్రకారం, భూమి సమున్నతమైనది కనుక, దాని మీద నేరుగా కూర్చునే అధికారం ఒక్క స్త్రీ మూర్తికే ఇవ్వబడుతుంది. ఆమె శిరస్సును తాకడం, ఆమె ద్వారా అతడు భూమిని స్పృశించి ధన్యవాదాలు తెలుపుకోవడం.

క్షణాల్లో స్వభావం చూపే అడవిలో ఆహారాన్ని, అతడు మొదట తిని పరీక్ష చేసి ఆమెకు అందిస్తాడు. అది వాళ్ళ దృష్టిలో ఎంగిలి కాదు. ఆమె పట్ల అతడు చూపే శ్రద్ధ.

ఇప్పుడు చెప్పండి. మీ అభిప్రాయాలూ, మీ తీర్పులూ."

చేతులు కట్టుకు నిలబడ్డాడు అబ్దుల్.

ఒక నిమిషమాగి, ఎవ్వరమూ మాట్లాడకపోవడంతో తిరిగి తనే కొనసాగించాడు.

"మీరంతా సమర్ధులు. ఎన్నో పరీక్షలు దాటితే తప్ప మీరున్న కుర్చీలు మిమ్మల్ని అక్కడ స్థిరపడనీయవని నాకు తెలుసు. మీలో తెలివుంది, తపనుంది, ఏదైనా సాధించగల ఆకలి ఉంది, ఆవేశమూ ఉంది. స్వేచ్చగా వాదించగలమునుకుంటారు, హక్కుగా కొన్నింటిని గెలవగలమనుకుంటారు. ఒక సైంటిస్టునీ, ఒక మానవతావాదినీ, ఒక విద్యావంతుడినీ, ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేసే ఒక వైద్యుడినీ మీ ముందుంచి, వాళ్ళల్లో ఎవరో ఒక్కరే బతికే అవకాశం ఉందనీ, అలా బతికించే శక్తి మీకే ఉంటే మీరెవర్ని బ్రతికిస్తారనీ నేను పొద్దున అడిగినప్పుడు, ఎంత తెలివిగా ఆలోచించారు మీరంతా! ఎన్ని వాదనలు చేశారు? ఎట్లాంటి ప్రతిపాదనలు చేశారు?! మరిప్పుడు నేను చూపెట్టిన మనుషుల పట్ల మీకెందుకు రెండో ఆలోచన రాలేదు? ఆలోచించారా?

డియర్ ఫ్రెండ్స్, కొన్ని సార్లు, చాలా కొన్ని సార్లు, మన మేధనూ, మనసునూ కూడా ఇబ్బంది పెట్టే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయ్. వాటిని ఢీకొట్టేందుకు మనకున్న శక్తులకు అదనంగా మరికొన్ని కావాలి. అనుభవం, సహానుభూతి --వీటిని ఓపిగ్గా సాధించుకోవాలి. సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఇంత మంది కొత్తవాళ్ళని తీసుకున్నారని తెలిసినప్పుడు, నేను ఊహించాను, సమస్య ఎలా ఉండిఉండవచ్చో.
మనం పదిహేను దేశాల వాళ్ళతో కలిసి పని చేస్తున్నాం, మన మధ్య చారిత్రకంగానూ, సాంస్కృతికంగానూ ఎన్నో వైరుధ్యాలున్నాయి. వాటిని చర్చల్లోకి రానివ్వడం, గొడవలకు దారి తీయడం మన ఉద్యోగ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. మీరంతా మీ మేనేజర్లతో ఇప్పుడు మాట్లాడి చూడండి. ఎవరెవరు ఏమేం పొరబాట్లు మాట్లాడారో వాటిని ఎందుకు మాట్లాడి ఉండకూడదో, మీకిప్పుడు తెలుస్తుంది. టెక్నికల్ విషయాలంటారా - అవన్నీ సర్దుకుంటాయ్. మీకు సాయం చెయ్యడానికి మీ లీడ్స్ ఉన్నారు.

కొన్ని ప్రశ్నలతో నేనీ సెషన్ ముగిస్తున్నాను . వాటికి మీరు వెదుక్కునే సమాధానాల్లోనే మన మీటింగ్ అజెండా మొత్తం ఉంది. మీకర్థమవుతుందనుకుంటున్నాను."

ప్రజెంటేషన్‌లో చివరి స్లైడ్ అయిపోగానే మిథిల లేచి నిలబడింది. నేను తననే చూస్తుండిపోయాను.

*****
బస్సు ఇక కదిలిపోతుందనగా వచ్చింది మిథిల. ఎప్పుడూ కిటికి పక్కనే కూర్చోవడం అలవాటు తనకి. ఈ రోజెందుకో నా పక్కన వచ్చి కూర్చుంది.తన చేతిలో ఫోన్ మోగింది.

"త్వరగానే వచ్చేస్తానత్తయ్యా. ఆలస్యమవ్వదు. ఊహూ - మీరేం ఇబ్బంది పడద్దు. సారీ, సారీ..."ఇలా సాగిందా సంభాషణ.
అర్థమవుతూనే ఉంది. ఎందుకో మనసాగలేదు.

"ఆన్సైట్ అసైన్మెంట్‌కి నీ పేరు తీసేశాను. నువ్వు చెప్పిన అబ్బాయి పేరే నోమినేట్ చేశాం, ఓకే అయింది"

ఫోన్ బేగ్‌లో పెట్టేసి నా వైపు తిరిగింది. చిన్నగా నవ్వింది.

"నీకు నిజంగానే వెళ్ళాలని లేదా? మనసుకు కష్టంగా లేదా? ఇలా ఎన్నని వదిలేసుకుంటావ్ మిథిలా?"


"ఎందుకుండదూ, అలవాటైపోయిందంతే. చిన్నప్పటి నుండీ చదువుకోవడమే పెద్ద యుద్ధమైపోయింది. స్నేహితులు ఉండకూడదు, పెత్తనాలు చెయ్యకూడదు, డబ్బులు పోసి చదివించే ప్రసక్తే లేదూ, ఉద్యోగమైనా గంట కొట్టినట్టే ఒకేవేళకి ఇంటికి చేరాలి, ఇంటి పనంటే మొత్తం నోరెత్తకుండా నేనే చెయ్యాలి, నొప్పైతే ఉద్యోగం మానెయ్యాలి..
- ఒక్కో వయసులో ఒక్కో రకమైన ఆంక్షలు. నాకని ఏముంది? మా అమ్మమ్మకీ అంతే, అమ్మకీ అంతే. ఆ మాటకొస్తే మా ఇళ్ళల్లో చాలా మంది ఆడవాళ్ళకిప్పటికీ ఇంతే"

"పెళ్ళయ్యాక?"

"తెలిసిన కుటుంబమే, దూరపు బంధువులు. అవే రూల్స్-కొంచం వేరే రూపాల్లో. ఆడపిల్ల ఉద్యోగం చేస్తే ఇల్లెవరు చూస్తారు, పిల్లల్నెవరు పెంచుతారు? మగాడు వండటమేంటి? ఇంటిపని మొగుడు చెయ్యడమేంటి? ఇట్లా! వాళ్ళకన్నీ భయాలు ఇందూ. మా పెద్దత్తయ్య మనవరాలు ఇట్లాగే ఉద్యోగం ఉద్యోగం అని తపించిపోయేదట. ఆఫీసు పని మీద తిరగాల్సి వచ్చేదట. ఇంట్లో ఎరగని గౌరవం బయట దొరికేసరికి ఆశ వదులుకోలేకపోయేదేమో - ఏదో కాలంలో చిక్కుకుపోయిన మొగుడు సాయం చెయ్యలేదు- పిల్లలేమో మెల్లిగా గాలి తిరుగుళ్ళు మొదలెట్టి అసలిప్పుడు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలీదుట. ఆడది ఇల్లు పట్టించుకోకపోతే ఇంతేనంటూ ఎప్పుడూ ఈ కథతోనే మొదలెడతారు.

ఇంకో మేనకోడలుంది, చిన్నదే. పెళ్ళయ్యాక చదువుకుంటానని ఆ బస్సులూ ఈ బస్సులూ పట్టుకు ఊరవతల కాలేజీకి వెళ్ళి చదువుకుని, ఏదో ఓ పూట ఇంటికి రాగానే ఆ వెర్రి అలసటలో మొగుణ్ణి మంచినీళ్ళు అడిగిందట. అంతే. ఆ ఒక్కమాటే! చదువు నేర్పిన పొగరు అని అందరూ ఎగదోసేసరికి పెద్ద యుద్ధమై జంట విడిపోయారు.

మన ఊళ్ళోనే లైబ్రరీ పక్క వీధిలో ప్రసాద్ స్టూడియో ఉండేది గుర్తుందా?"

"ఊఁ"

"దాని ఓనర్ మా అత్తగారికి స్వయానా మేనల్లుడు. పెళ్ళాం మోజుపడి ఆ కెమెరా పని తనకూ నేర్పమందని, పాపం అతను ప్రేమగానే నేర్పాడు. ఆ పిల్ల అల్లుకుపోయిందిట. ఇద్దరూ కలిసి పనిచేస్తే కుప్పలుతెప్పలుగా అవకాశాలు వచ్చిపడ్డాయిట. అంత సందట్లోనూ ముగ్గురు పిల్లల్ని కని అమ్మనాన్నల మీదకీ, అత్తమామల మీదకీ వదిలేసి, వాళ్ళు షూటింగ్ ఉందని ఊరూరూ తిరొగెచ్చేవారట. మా అత్తగారి అన్నయ్య ఇంటికొచ్చి భోరున ఏడుపు. ఇదేమి తల్లి, పిల్లల్ని కని మా నెత్తిన పారేసి పోయింది, చూస్తూ చూస్తూ వదలాలేం, చాకిరీనా చెయ్యలేం-- ఈ వయసులో మాకిదేమి హింసో అని“

“ అయితే ఏమంటారూ? నువ్వూ ఇలా చేస్తావంటారా? ఏ కాలంలో ఉన్నారూ?" ఆవేశం తన్నుకొచ్చింది నాకు.

“ఇందూ, నీకూ నాకూ తెలుసు, వాళ్ళవన్నీ అర్థంలేని భయాలేనని. వాళ్ళ అనుమానాలన్నీ అబద్ధాలేనని. కాలం మారిందనీ, ఇంకొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనీ మనకి తెలుసు. వాళ్ళకి తెలీదు. వాళ్ళవి ఆరోగ్యకరమైన ఆలోచనలు కావనీ, వాళ్ళ మగపిల్లల పెంపకం మారితే సమస్య చాలామటుకు తీరిపోతుందనీ నాకూ చెప్పాలనే ఉంటుంది. కానీ సమయం పడుతుంది. “

"సమయమా? ఎంత? నోరు విప్పి నీ కష్టమేంటో, ఇంటికి నువ్వేమిటో చెబితే ఇప్పటికిప్పుడు కాళ్ళబేరాలకొస్తారు"  

"కుటుంబం కాళ్ళబేరానికి రావడం నాకక్కర్లేదు ఇందూ. అది నాకదొద్దసలు. నాకు కుటుంబాలు ప్రేమగా మసలుకోవడం కావాలి. వాళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు.కష్టమే, కోరుకున్న మనుషులతో తిరగలేకపోవడం కష్టమే, కోరుకున్న చదువు, కోరుకున్నట్లుగా ఉద్యోగం, కోరుకున్నట్టుగా బతకడం, ఏదీ దక్కట్లేదు. కానీ, నేను కష్టమని ఆగిపోతే నా ఇల్లు నేను బతికున్నన్నాళ్ళూ ఇలాగే ఉంటుంది. వాళ్ళ భయాలు పోగొట్టే ఒక్క దారినీ నేనే మూసేసుకుంటే, ఇంకో వందేళ్ళు మా వాళ్ళట్లా ఇవే ఆలోచనలతో నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు."  

"తిరగనీ, నీకేంటి నష్టం? వాళ్ళకీ తెలియాలి కదా, నువ్వు పనిచెయ్యడం నీ ఒక్కదాని కోసమే కాదని"

తల అడ్డంగా ఊపింది మిథిల.

"పచ్చి పల్లెటూర్లో పుట్టిందట మా అమ్మమ్మ. పదిహేను మంది ఇంటిజనమూ, పాడీ, పొలమూ, అన్నీ చూసుకుని అర్థరాత్రిళ్ళు దొంగతనంగా అ ఆ ఇ ఈ లు దిద్దేదట. ఊరిజనానికి ఎదురు నిలబడి, మా అమ్మని బడికి పంపిందట. మా అమ్మ పదో తరగతి దాకా చదివింది కాబట్టి, ఆశ కొద్దీ నన్ను పై చదువులు చదివించింది. ఇంట్లోనూ బయటా మగపిల్లాడితో పాటుగా నాకు అవకాశాలు ఇప్పించడానికే మా అమ్మ ఎంతో పోరాడింది. మనకొక్కోసారి బతుకంతా గడిచిపోయినా జీవితం విలువ తెలీదు ఇందూ, అసలు మనమిట్లా బతకడానికి ఎవరెన్ని త్యాగాలు చేశారో, ఎవరెంత కష్టపడ్డారో, మనమసలు ఊహించం, ఆలోచించం, ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటాం కదా లైఫ్‌ని, ఎంత సెల్ఫిష్ మనం.
నువ్వు చెప్పు - నేనిప్పుడు నా సుఖం కోసం ఆగడం అంటే, నా వెనుక ఉన్న ఇట్లాంటి ఆడవాళ్ళ కలలన్నీ నా చేతులతో చంపెయ్యెడమే కదా?" జాలిగా అడిగింది మిథిల.

ఏమనాలో తెలీలేదు.

"నేనేం చెయ్యలేనని ఇప్పుడు నా చుట్టుపక్కల మనుష్యులు భయపడుతున్నారో, భయపెడుతున్నారో, అది చేసి చూపించడమే కదా అసలు పరీక్ష"

రెడ్‌సిగ్నల్ పడి బస్ ఆగింది. కిటికి అద్దాల మీద మల్లెపూల తట్టలో నుండి మూర ముప్పై రూపాయలని పూలు చూపెడుతూ కొనమని బతిమాలుతోందో పదిపన్నెండేళ్ళ పిల్ల.
వద్దని తల అడ్డంగా ఊపింది మిథిల. పూలు తీసుకోకుండానే పది రూపాయలు ఆ పిల్ల చేతిలో పెట్టింది.

"ఇట్లా రూపాయి రూపాయి దాచి చిన్నచిన్న సుఖాలు కూడా అనుభవించకుండా అన్ని బేంకుల్లో వేసి, పైపెచ్చు వాళ్ళ నుండి వీసమెత్తు హెల్ప్ లేకుండా బతుకుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యమూ, జాలీ కలుగుతున్నాయ్ మిథిలా! మరీ మీ పర్సనల్ విషయాల్లోకి దూరి వచ్చి అడుగుతున్నాననుకోకు, ఇప్పుడు నీ జీతమంతా ఇంట్లో ఇవ్వవా? అది తీసుకుంటూ వాళ్ళెలా నిన్ను నిర్బంధిస్తారు? అది అన్యాయం కదా? వాళ్ళకి సిగ్గనిపించదా?"

"జీతం తీసుకుంటారు. నిజానికి వాళ్ళడగరు, నేనే ఇస్తాను. నా ఇంటి లోన్ అయిపోతే మేం కొంచం ఫ్రీగా ఉండచ్చని. పిల్ల పెళ్ళికి ఫిక్షెడ్ డిపాజిట్‌లనీ, మా పెన్షన్ డబ్బులకనీ, ఏవో ఉంటూనే ఉంటాయ్ కదా. వాళ్ళేమంటారు? నీ జీతం లేకపోతే ఏం కొంపలంటుకుంటాయి, ఉన్న దానితోనే సద్దుకుంటాం అంటారు. అవును, లేని రోజున ఏం చేస్తాం, ఎవరమైనా? సర్దుకు తీరతాం. కాకపోతే, ఇప్పుడొక మనిషికి నాలుగు రూపాయలు అప్పుగానో దానంగానో ఇస్తున్న తృప్తి ఇక ఉండదు. రేపేమైనా మెడికల్ ఖర్చులొస్తే, బాంక్‌లో నాలుగు లక్షలున్నాయిలే, తీసి పారేయొచ్చన్న భరోసా అప్పుడుండదు, అంతే. అవి వాళ్ళకర్థం కావు..."

బస్ ముందుకు కదిలింది.

"ఎన్నాళ్ళిలా? ఎన్నని వదిలేసుకుంటావ్? ప్రమోషన్లూ, ఆన్సైట్లూ, స్నేహాలూ, ప్రేమా..ప్రజ్వల్ ని పెళ్ళి చేసుకుని ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడూ అనిపించదా?"  ఐ.డి కార్డును పట్టుకుని ఉన్న ఆమె వేళ్ళ వైపే చూస్తూ అడిగాను, తల వంచుకుని.

తన చూపుడువేలు పైభాగమంతా చుట్టుకుంటూ ప్లాస్టర్స్. వేళ్ళ మీదా ముంజేతుల మీదా చిన్న చిన్న కత్తి గాట్లు, బహుశా ఏ కూరలు తరిగేటప్పుడో తెగినవి. ముంజేతి లోపలి వైపు పెద్ద కాలిన గుర్తు. సగం సగం ఊడిపోయిన గోళ్ళరంగులు. ఈ హడావుడి బతుకు మిగిల్చే కనిపించని దెబ్బలు. పట్టించుకోవాల్సింత పెద్దవేం కావు కానీ...ఇదుగో ఇట్లా అన్ని దెబ్బల్నీ ఒకేసారి చూసుకునే క్షణమొస్తే, అప్పుడూ నొప్పనిపించదా?

నా చూపులు గమనించి, దూరంగా చూస్తూ చెప్పింది "ఎప్పుడూ అనిపించదు. నా జీవితంలో నేను చేసిన ఒక్క మంచి పని చెప్పమంటే అది ప్రజ్వల్‌ని కాదనుకోవడమేనంటాను. కుటుంబాల్లో స్థిరపడ్డ సమస్యగా, ఇది అత్తమామల భయంగా నాకెదురుపడితే, నేను నిలబడి సాల్వ్ చేసుకోగలను కానీ ప్రజ్వల్ ప్రేమ ముసుగేసి, ఇవే కండిషన్స్ పెట్టాడు నాకు. తట్టుకోలేకపోయాను. వద్దనుకున్నాను. అదంతా వేరే కథ. మా అమ్మ ఆగిపోయిన చోట నుండి నేను మొదలెట్టాను. మా నాన్నకీ, మా అన్నయ్యకీ కుటుంబాన్ని చూసే పద్ధతిలో తేడాని నేను కనిపెట్టగలను ఇందూ. ఓ ఇరవయ్యేళ్ళు ఆగాక, మా అన్నయ్యని మించిన కంపాషన్ నా కొడుకులో చూస్తాను. నాకు కావలసినది అది. ఈ మధ్యలోవన్నీ బుడగల్లాంటివి. అవే పోతాయ్. పోవా, నిలబడి ఎంత శ్రమైనా భరించి తోలేస్తాను."

"శ్రమ అని కాదు, అలసటలో కోపం రాదా? కోపంలో పిల్లల్ని కొట్టవా? వాళ్ళ గురించి వదిలెయ్, నీ ఆరోగ్యం? ఈ విసుగులూ కోపాల కొంపల్లో సంతోషమేముంటుంది మిథిలా?"

"అలసటైతే ఉంటుంది, అసహాయతా ఉంటుంది. కోపాన్ని పిల్లల మీద చూపించకూడదన్నది నా నియమం. నేనిదంతా సమస్య అనుకోవడం లేదనీ, గెలుపు అనుకుంటున్నా అని నువ్వు మర్చిపోతున్నావ్" నవ్వింది మిథిల.

"అసలు నాకొకటి అర్థం కావట్లేదు, ఏదీ నువ్వు కోరుకున్నట్టు జరగని జీవితంలో, నువ్వు దేని కోసం ఇంత అణిగీమణిగీ కుటుంబం అని పాకులాడుతున్నావ్, పోనీ, ఉద్యోగం మానేసి మొత్తం వాళ్ళని సుఖపెట్టే పనులే చెయ్యచ్చు కదా. అప్పుడు ఇద్దరికీ స్ట్రెస్ తగ్గుతుంది కదా?"

"ఉద్యోగం ఒక హక్కుగా నేను కోరుకోవట్లేదు ఇందూ. అది లేకపోతే నా ఉనికి లేనట్టు కాదు. ఇంట్లో ఉండటం నాకు నామోషీనూ కాదు. కానీ, మనుషులుగా మనమంతా ఒకే ప్రేమతో, అర్థం చేసుకునే మనసుతో ప్రవర్తించాలన్నది నా కల.  అట్లా మసలుకునే రోజొస్తే నాకసలీ ఉద్యోగం పెద్ద పట్టింపేం కాదు.

తిట్టో తిట్టుకునో అసలంటూ నన్ను చదివించారు. వాదించో, విభేదించో ఉద్యోగమంటే పంపిస్తున్నారు. అక్కడికి నేను అదృష్టవంతురాలిననే అనుకుంటాను, కానీ మన ఇళ్ళల్లో బయట పన్నెండు గంటలు పని చేసి వచ్చిన ఆడవాళ్ళు మళ్ళీ ఇంట్లో ఉన్నన్ని గంటలూ నడుం విరిగేలా చాకిరీ చేస్తుంటే--అది వంటవనీ, పిల్లల పనులవ్వనీ, అత్తమామల సేవలవనీ--మగవాడు మాత్రం ఉద్యోగమొక్కటీ చేస్తే చాలన్న అపోహ ఎందుకు మనం చెరపలేకపోతున్నాం?

స్వేచ్ఛ కోసం ఒక తరం పోరాడినట్టే, గౌరవం కోసం, ప్రేమ కోసం కూడా పోరాడాలి మనం!"

"ఉద్యోగం వదులుకోనంటావ్?”
"వదులుకోను. నా పిల్లలు నేను పడే కష్టం చూడాలి. అర్థం చేసుకోవాలి. మార్పు అలానే వస్తుంది. అయినా ఉద్యోగం చేస్తే కదా, మానేసే హక్కు మనకొచ్చేది. ఈ ఛాయిస్ మన చేతిలో ఉందన్న ఊహే కొండంత బలం, దానికోసమైనా  మనం చదవాలి, ఉద్యోగం చెయ్యాలి. మానేయడం, ఇంటి పట్టు నుండి వాళ్ళని సాధించడం నువ్వన్నట్టు ఎప్పుడైనా చెయ్యగలిగిన పనులేగా. "మా స్టాప్ వచ్చే వేళైంది. ఇద్దరం లేచి ముందుకు నడిచాం.
"ఎప్పటిలాగే ఏం అడగనివ్వకుండా నిద్రపోతావ్ అనుకున్నాను”

" ఇన్నేళ్ళూ నేను చెప్పలేను అనుకునేదాన్ని, ఈ రోజెందుకో నువ్వు వినగలవు అనిపించింది"
"నేనేప్పుడూ రెడీగానే ఉన్నాను, నీకే అబ్దుల్ చెబితే తప్ప చెప్పాలనిపించలేదు" ఉక్రోషంగా అన్నాను.  

*********
 "బస్సు దిగుతూనే ఫోన్‌లు వచ్చేస్తాయ్ నీకు!"

నవ్వాను " హెచ్ ఆర్ కాల్..ప్రమోషన్ లిస్ట్‌లు ఫైనల్ చెయ్యాలి, నీ సంగతే తేల్చాలి" కవ్వింపుగా అన్నాను.

"తేల్చు మరీ, ముంచెయ్యకు" ఐ.డి కార్డ్ మెడలో నుండి తీసేసి హేండ్ బేగులో దోపుకుంటూ చెప్పింది. తన గొంతులో సరదా ఇప్పుడు మొకంలోకీ పాకింది.

మిథిల కళ్ళల్లో నాకెంతో అపురూపంగా అనిపించే మెరుపు నవ్వు.

"నువ్వంటే నాకు చిన్నప్పటి నుండీ ఇష్టం" కలవని దారుల కూడలిలో ఆగి నిలబడి చెప్పాను.

 ( "TAGS తెలుగు వెలుగు పత్రిక ఉగాది సంచికలో ప్రచురితం".)
  * 

6 comments:

 1. మనసును తట్టి లేపింది మానసా.....నిజమే అసలు ఉద్యోగం చేస్తేనే కదా అది మానేసే హక్కు మన చేతిలో ఉంది అనే ధైర్యం వచ్చేది ....ఉద్యోగం మానేసి అందరిని జీవితాంతం సాధిస్తూ బతికేకన్న మనుషుల్లో మార్పును సాధిస్తే అది చాలదూ.....Good one really loved it....

  ReplyDelete
 2. వావ్. గుడ్ జాబ్. Conflict ని ఎంత బాగా రాసారు. మచ్ లవ్.

  ReplyDelete
 3. మిథిల పాత్ర యండమూరి నవల "ధ్యేయం"లో ధాత్రి పాత్ర లాగ అనిపించింది. అటువంటి వాళ్ళు చాల అరుదు. అంత ధైర్యంగా ప్రతికూల పరిస్థితుల్లో మార్పుకోసం, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే స్త్రీ పురుషులెవరైనా ఆదర్శమూర్తులే. అద్బుతమైన కథనం.

  ReplyDelete
 4. నాయిక పాత్ర చుట్టూ అల్లిన కథ ఆసాంతమూ చదివించిందండీ.. నిజానికి దీన్ని గ్లోబల్ కథ అనొచ్చేమో.. బెంగుళూరు కన్నా మల్టీనేషనల్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా కనిపించింది..

  ReplyDelete
 5. నీ కథలో మిథిల నచ్చింది, మానసా :) అలాంటి అమ్మాయిలు చాలా అరుదు.

  ReplyDelete
 6. "నేనేం చెయ్యలేనని ఇప్పుడు నా చుట్టుపక్కల మనుష్యులు భయపడుతున్నారో, భయపెడుతున్నారో, అది చేసి చూపించడమే కదా అసలు పరీక్ష"

  మిధిలలో మార్పు వచ్చేవరకూ ఈ కధ ఇలా సాగుతూనే ఉంటుంది.

  ReplyDelete