లేతకౌగిలి

 మధ్యాహ్నం మూడు మూడున్నర మధ్యలో వీధిలోని అపార్ట్‌మెంట్‌లలో నుండి అమ్మలూ నాన్నలూ అమ్మమ్మలూ తాతయ్యలూ ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఉంటారు. స్కూల్ బస్‌లు వచ్చే సమయం కదా- బయలుదేరిన వేళను బట్టి, కొందరు కంగారుగానూ, కొందరు నింపాదిగానూ నడుస్తూంటారు. ఇంకా బడికెళ్ళే వయసు రాని పిల్లలు మిగిలున్న అదృష్టమంతా ఇసుక గుట్టల మధ్య దొర్లించుకుంటూ ఉంటారు. ఆ వేళకి ఆఫీసు కాల్స్ ఏవో నడుస్తూ ఉంటాయి నాకు. ఈ రోజుకి మిగులున్న పనుల గురించీ, రేపటి పనుల గురించీ కూడా ఆఫీసు వాళ్ళతో ఆ టైంకి మాట్లాడటం ఒక అలవాటు. వీధి మలుపులో అందరూ ఎదురుచూపులతో నిలబడి ఉంటారు. నేనూ అలాగే..అందరిలాగే. ఆ చెట్ల కిందే ఎక్కడో ఓ చోటు చూసుకు బస్ కోసం చూస్తూ ఉంటాను.

ఒకదాని వెనుక ఒకటిగా పసుపుపూల రథాల్లా ఆ బస్సులు రానే వస్తాయి. ఒక్కో రోజు కోలాహలంగా దిగుతారందరూ. అన్ని స్కూల్ బస్సుల వాళ్ళూ. అడిగితే, ఏవో ఆటలాడుకున్నామని చెప్పాడు ప్రహ్లాద్ ఒక రోజు. ఇంకోరోజు పెద్ద క్లాసుల పిల్లలు బస్‌లో క్విజ్ పెట్టారుట. ఇంకో రోజు స్పోర్ట్స్ క్లాస్ అవగానే బస్ ఎక్కామన్నాడు. వాళ్ళ ఆనందాన్ని నిలిపి ఉంచుతున్న రహస్యాలేవో ఈ నెల రోజుల్లో నాకూ కొంతకొంతగా అర్థమవుతూనే ఉన్నాయి. సోమవారాలు రొటీన్ తప్పినందుకో ఏమో కాస్త బద్ధకంగా ఉంటారు. కొందరు చంటివాళ్ళు నిద్రకళ్ళతో దిగుతారు. కొందరు కోపంగా. కొందరిని బస్‌లోని ఆయా దింపుతూ.."జాగ్రత్త, పడుకుంటే లేపాను.." అని చెప్పి మరీ అందిస్తుంది.
నిన్న అట్లా బస్ ఆగగానే, కాస్త హుషారు మొహంతో కిటికి లో నుండి నాకు చేతులూపుతున్న ప్రహ్లాద్ ని చూస్తూ బస్ దగ్గరికి వెళ్ళాను. లంచ్ బాక్స్ ఎత్తి ఊపి చూపించాడు -ఖాళీ అన్నట్టుగా. చెప్పద్దా..ఎంత సంతోషం వేసిందనీ..వేళ్ళన్నీ ముడిచి గాల్లో ఓ ముద్దు విసిరాను. పిల్లలొక్కొక్కరిగా దిగుతున్నారు, వాడినీ లేచి రమ్మని సైగ చేశాను.
ఈ లోపు..ఉన్నట్టుండి, నా చేతికి ఒక బుజ్జి లంచ్ బాక్స్ వేలాడేసి, అమాంతం నన్ను చుట్టుకుందో చిట్టి ప్రాణం. ఉలిక్కిపడి చుట్టూ చూశాను. "బేటా..బేటా.." వాళ్ళమ్మ...సారీ చెప్పి తీసుకుపోయింది.
నిన్నెందుకు హగ్ చేసుకుంది?
రోడ్ దాటుతుంటే అడిగాడు.
"బేబీస్ కి తెలీదమ్మా..." వాడే చెప్పాడు, చొక్కా సర్దుకుంటూ.
ఇసుక గుట్టల మీద ఆడుకుంటున్న పిల్ల మూక నా నవ్వుకి చెదిరి మాటలాపి వెనక్కు తిరిగింది.
ఒక్క క్షణం వీధి వీధంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఊగుతున్న మా ఇద్దరి చేతుల మధ్య నుండి మిగతా లోకమంతా జారిపోయింది. ఆ లేత అమాయకపు కౌగిలొక్కటే చాలా సేపు నాతో నిలిచిపోయింది. ❤

పరవశ

 My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book "ParavaSa" and it is out in the market now.
**
"I like the beginings they are so full of promises; I like the beginings because I know there is always more to come" - ఎప్పుడో చదివిన కవిత గుర్తొస్తోందీ రోజు. నా కవిత్వ సంపుటి "పరవశ" ఈ రోజు విడుదలైందంటే, నాలో ఎక్కడో చిన్నగా రెక్క విప్పుతోన్న సంబరం. బహుశా, అచ్చులో ఈ మొదటి అడుగు, ఇలాంటి ఇంకొన్ని కొత్త కబుర్లకు నాంది పలుకుతుందనేనేమో!
దాదాపు పదేళ్ళుగా రాస్తున్న కవిత్వంలో నుండీ ఎంపిక చేసిన కవితలతో ఈ సంపుటిని ప్రకటించారు అనల్ప బుక్స్ వారు. పోయినేడు ఆగస్టులో మొదట వీరలక్ష్మి గారు ఈ ప్రపోజల్ నాకు చేరవేయగానే - వారి మాట మీద ఉన్న గౌరవం వల్లనో ఇంకేమైనానో కానీ, ఎన్నాళ్ళుగానో వద్దనుకున్న పనికి వెనువెంటనే సరేనన్నాను. బలరామ్ గారు పుస్తకం పట్ల ప్రేమ, దానిరూపురేఖల పట్ల తనదైన ఓ మొండిపట్టుదల ఉన్న మనిషి. ఈ పుస్తకాన్ని ప్రచురించదలచినందుకు, సూచనలనిస్తూనే ఎన్నో విషయాల్లో నా నిర్ణయాలకు ఊ అన్నందుకు, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ పుస్తకానికి తన ముందుమాట ద్వారా అదనపు శోభనిచ్చిన నా అభిమాన కవి శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడి కి నా ధన్యవాదాలు. అది నాకొక ఊహించని కానుక. ఇందులో కవితలను ప్రచురించిన పత్రికా సంపాదకులు మెహర్, అఫ్సర్, నరేశ్ నున్నా, రవి వీరెల్లి, కుప్పిలి పద్మ, గుడిపాటి వెంకట్ ..అందరికీ మనస్పూర్తిగా థాంక్స్. ఈ సంపుటి ప్రచురించక మునుపే, నా కవిత్వానికి ఇస్మాయిల్ అవార్డు అందించి ఈ కవిత్వాన్ని అందుకునే హృదయాలున్నాయన్న భరోసానిచ్చిన భూషణ్ గారికి థాంక్స్. ఎక్కువ కవితలు రాసిది ఈమాట పత్రికకే, మాధవ్ గారి సూచనలు, సలహాలు లేకపోతే నా సాహిత్య ప్రయాణం వేరుగా ఉండేది. ఆ స్నేహాన్ని తల్చుకోకుండా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తేలేను.
నాతో చదువుకున్న మిత్రులు, నా సహోద్యోగులు, ముఖపరిచయం లేకపోయినా ఈ ముఖపుస్తకం ద్వారా పరిచయమైన మిత్రులందరూ ఈ లోకం చిన్నదనీ, జీవితం పెద్దదనీ నాకెప్పుడూ కొత్త ఉత్సాహాన్నిస్తూనే ఉన్నారు. ఈ "పరవశ" వాళ్ళందరినీ మరింత ప్రేమగా పలకరించే అవకాశం ఇచ్చిందని అనుకుంటున్నాను.
ఈ పరవశం, సంతోషం నాలో ఈ రోజు మొదలైనవి కావు కానీ, అనిల్ నా జీవితంలోకి వచ్చాకా, ఈ జీవితానికి అందిన నిశ్చింత మాటల్లో కొలవలేనిది. కవిత్వం చదవడానికైనా, రాయడానికైనా, మనిషిలో ఉండాల్సిన సున్నితత్వాన్ని, ప్రేమని పదిలపరిచి పెంచుతూపోయే తోడున్నందుకు జీవితానికెప్పుడూ ఋణపడే ఉంటాను. ❤
నేను జీవితంలో ఏం సాధించినా, దాని వెనుక మా అమ్మ కోరికే గట్టిగా నిలబడి ఉంటుందని ఈ రోజు నేను నిశ్చయంగా చెప్పగలను. నావల్ల ఏమీ కాదనుకున్న రోజుల్లో కూడా, నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇది చెయ్యలేరు- అని నమ్మిన అమ్మ. చిన్నప్పటి నుండీ అన్నింటిలోనూ నాన్నపార్టీ అనే నేను ఇలా రాయడం కొంచం చిత్రమే కానీ, అమ్మ- నేను వేరు వేరు కాదు అని మా నాన్నగారెలాగూ హాయిగా పక్కకు తప్పుకుంటారు కనుక,
అమ్మా! నీ దగ్గర లేనిదీ, నేను నీకు కొత్తగా ఇవ్వగలిగిందీ ఏమీ లేదు. ఇంకేదీ నీకింత సంతోషాన్ని ఇవ్వదని నాకు తెలుసు. అమ్మా.. I love you! ❤ ❤ ❤ This one is for you!

ఒక మామూలు సాయంత్రం

 రోజూ పొద్దున అందరి స్నానాలూ అయ్యాక ఏదో ఒక టైం చూసుకుని వాషింగ్ మెషీన్ వెయ్యడమూ, పొద్దుటి మీటింగ్‌ల హడావుడి, పిల్లాడి లాగిన్ అయ్యాక ఓ పది నిమిషాలు దొరగ్గానే ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి ఆరేయడం- నా దినచర్యలో భాగమైపోయింది. బాల్కనీల్లో ఆరేసే కన్నా పైన ఎండకి చప్పున ఆరతాయనిపిస్తుంది. కొరోనా మొదలయ్యాక, అసలు బయటకెళ్ళేందుకు మిగిలిన చిన్న చిన్న దారుల్లో ఇదొకటి కనుక, నేనే కాదు, అపార్ట్మెంట్‌లో అంతకు ముందు ఎన్నడూ కనపడనట్టున్న చాలా మంది ఇలాగే పైకి వచ్చి ఆరేయడం చూస్తున్నాను. సాయంత్రం నా టీ అయిపోగానే పిల్లాడిని అనిల్ కి అప్పజెప్పి మళ్ళీ పైకి వచ్చి ఆ ఫెళఫెళలాడే బట్టలు దులిపి మడతపెట్టడం నాకిష్టమైన వ్యాపకం. కాస్త అటూఇటూగా పొద్దున ఆరేసిన అందరం మళ్ళీ ఆవేళకే అక్కడికి చేరతాం. మాస్క్‌లు తీసేసిన నవ్వు ముఖాలు, అస్సలే ప్రత్యేకతా లేని రోజువారీ ముచ్చట్లు ఇప్పుడిప్పుడే దక్కుతోన్న స్నేహఫలాలు.

మడతలు పెట్టిన బట్టలను బొత్తిలా అక్కడే పక్కన పెట్టుకుని, క్లిప్స్ అన్నీ చిన్న బుట్టలో వేసి దాని మీదే సర్దుకుని, ఓ అరగంట అక్కడే నడిచి...మళ్ళీ కిందకి. అమ్మా, అక్కా, అత్తగారూ, తోడికోడలూ..దాదాపు అందరికీ ఆ టైంలో నేను ఖాళీ అని తెలుసు కనుక ఫోన్‌లో పలకరిస్తూంటారు.
ఈ రోజు ఒక నేస్తం కాల్ చేస్తానంటే కాస్త ఆలస్యంగానే పైకి వెళ్ళాను. మసక మసక వెలుతురు పోగుపడుతోంది. వెళ్తూనే బట్టల వైపు నడిచాను. పగలు ఆలస్యంగా ఆరేశానేమో తడి ఆరలేదు. అలమరాల్లోనూ వాసనొస్తాయ్ మళ్ళీ. అన్నీ తాకి, వాసన చూసి వదిలేశాను. వస్తుందనుకున్న ఫోన్ రాలేదు.
ఒక్క నక్షత్రమే అంత ఆకాశాన్నీ వెలిగిస్తోంది. చిట్టి పిట్ట ఒకటి టాంక్ మీద కూర్చుని లోకమంతా పరికిస్తోంది. అవతలి డాబా మీద ఫోన్ లో మాట్లాడుతూ ఒక్కడే ఆ నిశబ్దాన్నంతా ఉండుండీ చెదరగొడుతున్నాడు. వీధికవతలి డాబాలన్ని క్రిస్మస్ దీపాల సౌందర్యాన్ని మోస్తున్నాయి.
చలి గాలి మొదలైంది. చెవుల్లోకి పాకుతోన్న ఇబ్బంది. చల్లబడుతోన్న చెంపలు. వేళ్ళు. ఊపిరి.
అయస్కాంతంలా నా చూపుల్ని పట్టుకుంటోన్న ఆకాశాన్నే చూస్తూ అటూ ఇటూ తిరిగాను కాసేపు. ఇంకా చీకట్లు ముసురుకున్నాయి. కోలాహలంగా నా తల మీద నుండే పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఇందాకటిలా విడదీసి చూపలేనంతగా వెలుగూచీకట్లూ నా కళ్ళ ముందే అందంగా అల్లుకుపోతున్నాయి.
ఎన్నాళ్లైంది నేనెవరికోసమన్నా ఎదురుచూసి. ఏ గొంతు విందామనైనా ఓపిగ్గా కూర్చుని. అవకాశం సరే, అవసరం కూడా లేదుగా. బస్‌స్టాప్‌ల దగ్గారా, ఆఫీసు ఫూడ్‌కోర్ట్స్ లో, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏ హోటల్స్ దగ్గరో, పెట్రోల్ బంక్ ల బండ గుర్తుల దగ్గరో...
"సారీ, ఇంకా లేట్ అయ్యేట్టుంది..రేపు చేస్తాను.." చడీ చప్పుడు లేకుండా కూర్చున్న ఫోన్ ఒక్కసారిగా వెలిగింది.
"థాంక్యూ.." బీటింగ్ హార్ట్ కలపకుండా వేళ్ళూరుకోలేదు.

పరవశ

 


మహానదులనూ లోయలనూ
మత్తుగా నిదరోతున్న అరణ్యాల హొయలునూ
సరోవరాలనూ సంధ్యలనూ
చప్పుడు చెయ్యని సౌందర్యప్రవాహాలనూ
చకచకా పిక్సెల్స్‌లో కుదుర్చుకునే నీ కళ్ళలో
ఒంగి వెదుక్కుంటూ ఉంటాను
మనవైన క్షణాలకు నువ్వద్దే అందాల రహస్యాల కోసం.
 
వలుపుగాలులు వీయగానే చిగుర్లేసే జీవితం నుండి
ఒక్క రేకు తుంచితే వేయి స్టేటస్ అప్డేట్‌లు.
ఏంటి స్పెషల్ అని అడిగేవాళ్ళకు ఏం చూపెట్టను?
అలవాటైన స్పర్శలోని సౌఖ్యం లాంటి నిన్ను
ఎవరికీ ఏమీ కానివై రాలిపడే క్షణాలను
హృదయంలోకి ఒంపి పారిపోయే నిన్ను..
 
నా ఉదయపు హడావుడిని నింపాదిగా లాలించే నీ గొంతునీ
నీ ఒక్కో సంబరానికీ ఒక్కో తునకై రోజంతా వెలిగే నా పేరునీ
మాటలు నేర్చిన చూపై, బుగ్గలు కందే ముద్దై
ఆదమరపు క్షణాల్లో కౌగిట్లో ఇరుక్కునే నీ ప్రేమని,  
కాఫీ మగ్గుల పైని బద్ధకపు మరకై
మాసిన గడ్డమై ఇంట నీదైన వాసనై
క్షణక్షణం గుచ్చే ఉనికిని,      
ఏ టైంలైన్‌లో దాచుకుంటూ పోను?
 
సాలెగూడంటే భయం కాదు కానీ
సెర్చ్ ఇంజన్స్‌కి దొరకని ప్రేమంటే మోజు.
ఎన్ని మెమరీ కార్డ్‌లు ముడేస్తే ఒక్క మనసు-
అంతా నీదే పిల్లా అని నువ్వంటుంటే
నా బ్రతుకంతా చిందే సందడి మీద మోజు.

ఆనవాలు

 ప్రేమసందేశాన్ని దాచి

సముద్రంలోకి విసిరిన గాజుసీసా
మళ్ళీ విసిరినవాడి పాదాలకే తగిలినట్టు
వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరెళితే,
లోపల చిత్రమైన కుదుపు

ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా
అనాది నేస్తం లాంటి ఆకాశం
చందమామను వొంపి
ఈ పిట్టగోడల మధ్య పుట్టిన
ఎలప్రాయపు పాటల్ని గుర్తుచేస్తోంది.

కొబ్బరి ఈనెల మధ్య కదలే నీడల్లాంటి పురాస్మృతుల్లా
ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా, యవ్వనం.

మాటుమణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి.

మునిచీకటి వేళల్లో రహస్యంగా మెరిసి
నడిరేయి సౌందర్యానుభవాన్ని మాటిచ్చిన నక్షత్రమేదో
అదను చూసి తలుపు తెరిచినట్టు -పైనంతా
వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లాచెదురైన కాంతి
దిగంతాల్లో నుండి జలజలా రాలుతోన్న స్వర్ణధూళి

“తూ సఫర్ మేరా..తూ హీ హై మేరీ మంజిల్”
హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి
ప్రాణం పెనుగులాడుతోంటే జీరగా కునికే ఆ గొంతు-
గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని
కారుణ్యపుచందనప్పూతలా ఊర్కోబెడుతోంది.

రజనీడోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం
కలతో పాటుగా మెల్లిగా కరుగుతోంది.

మేల్కొన్న రెప్పల నంటి – ప్రత్యూషహేమరాశి
గుండెల మీద, అయాచితంగా రాలిపడ్డ
పసుపుపూల సౌందర్యరాశి.

అమృతానుభవానికి ఆనవాళ్ళను వెదుక్కుంటూ
ఈ ఉదయం.

*

సిరివెన్నెల చిందాడిన తావుల్లోకి...

with Public
మా చైనా కాలేజీలో ప్రతి ఆదివారం పరీక్షలుండేవి. కాలేజి ఇందిరా గాంధి స్టేడియం పక్క బిల్డింగ్లో ఉండేది. ఆదివారమొచ్చిందంటే అక్కడి కోలాహలాన్ని పట్టలేం. దానికి గుర్తుగా మా పరీక్ష సాగినంతసేపూ కిటికీల్లో నుండి పెద్ద పెట్టున పాటలు వినపడుతూనే ఉండేవి. ఆ పాటల్లో ఇంకా పెద్ద పరీక్షలుండేవి.
నీ కన్నుల్లో కలని అడుగు అతడు ఎవరనీ?
ఎవడ్రా వాడసలూ! దేవుడా, మా పై పగబట్టావా! మా ముందున్న శతకోటి ప్రశ్నలు చాలవన్నట్టు ఇది కూడానా అని తలలు బాదుకోని ఆదివారాల్లేవు ఆ ఏడాదంతా! ఇట్లా మా నిదురించు యవ్వనానికి మేలుకొలుపై ఒకడొచ్చాడని వింటే ఇంట్లో బాజాబజంత్రీలేగా!
*
గాలిలోనా మాటిమాటికీ వేలితో నీ పేరు రాయడం
రాతిరంతా చందమామతో లేనిపోని ఊసులాడటం
ఏమయిందో ఏమిటో...నాకేమయిందో ఏమిటో...
మాటలు వెదుక్కుంటోన్న ఎలప్రాయాన్ని సుతిమెత్తగా హత్తుకున్న పాట అతనిది. అన్ని వైపులా మధువనం..పూలు పూయదా అనుక్షణం అంటూ తేనెలూరే గొంతుతో ఓ లాలి పాట ఈ జీవితాన్ని తాకిన క్షణం ఇప్పటికీ భద్రంగానే ఉంది.
ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎలా పెట్టడం అని ఎక్కడో అన్నారు కానీ, ప్రేమకున్న ఎన్నో ఛాయలను ఎన్నో రీతుల్లో తన పాటల్లో అవలీలగా పట్టుకోగలిగాడనిపిస్తుంది. గాలికి గంధం పూయడమే పూలకు తెలిసిన ప్రేమకథ అన్న రహస్యం అర్థమైనవాడికి, ప్రేమ గురించి రాయడమేమంత కష్టం!
ప్రేమని, ప్రేమలోని ఉత్సాహాన్ని బిగ్గరగా సంబరంగా ఉత్సవంగా చెప్పుకోవడానికి ఒక మోమాటమక్కర్లేని మార్గంగా చూస్తానతని పాటని. "గుండెలో గుట్టుగా ఉండనంటోన్న వేడుక- అంతటా నవ్వులే పలకరిస్తోన్న పండుగ" - మైకం కాదిదీ నిన్నటి లోకం కాదిదీ అని అరిచి చెప్పడంలో ఎంత సంతోషం!
ఊహలన్నీ ఊసులేవో మోసుకొస్తుంటే ఊరు పూలరధమల్లే మారి ఎదురుచూస్తోంటే - ఏం చేస్తాం? మైమరపు క్షణాలన్నిటినీ పాటలుగా మార్చుకుని చూసుకోవడమొక సరదా అయిపోయింది.
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పానో ఏమనుకున్నానో... ప్రేమ తాలూకు అయోమయాలు, ఇంత క్లాసిక్‌గా ఒక లయకి ఒదుగుతాయంటే, ఏమో, ఇది ముందు లేనిదే నేనైతే నమ్మలేను .
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి... అని అల్లప్పుడెప్పుడో ప్రేమపావురాల్ని మేఘాల్లో పరువులెత్తించిన ఆ కలానికి, ప్రేమ రేపొద్దు మాపొద్దు ఈ పొద్దునాపొద్దు అనే కంగారప్పిల్లని తెలుసు. ఆగిపోనీకు వేగాన్ని, ఏది ఏమైనా కానీ అనే ప్రేమ పంతాన్ని పట్టుకున్న నిత్య యవ్వనానికి - నమో నమః!
వేటూరి గురించి రాస్తూ ఆ నాటుకొట్టుళ్ళు మా వల్ల అయ్యే పనులు కావని తప్పించుకున్నార్లే కానీ, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ అన్న ఈయనేం తక్కువా!

కృష్ణవంశీ సిగ్నేచర్ పాటల రహస్యం పట్టుకుని పొత్తిళ్ళలో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు/వెక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ... అని రాసిందెవరో మరి!
కళ్ళతో ఒళ్ళంతా నమిలీ చూపు ఎర్రబారిందే నెమలీ.. అంటూ చిన్నారి అందాల సందోహాన్ని అల్లరి పట్టించడం నేర్పించిదెవరూ?
నా కళ్ళతోటి నీ అందం, నువ్వే చూడు ఒకసారీ అని కవ్వించినప్పుడూ,
నిద్ర రాని చూపు తపనే నిలవనీదే ఈడునీ అని వాపోయినప్పుడూ,
తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నీవిలా/సందేహమేదీ లేదుగా సంతోషమంతా నాదిగా అని తీర్మానించుకున్నప్పుడూ - ఏం ప్రేమ నిజంగా అని అబ్బురపడటమే నావంతు.
నేను అనీ లేను అనీ చెబితే ఏం చేస్తావూ? నమ్మననీ నవ్వుకునీ చాల్లే పొమ్మంటావూ - ఒకే ఒక మాట అంటూ గుండెను చీల్చి చూపిన మాటలు. తన వాడి గుండెపై తల ఆన్చితే తన పేరే వినపడుతుందని నమ్మబలికిన పాట.
`ఏమైపోతాం అనుకున్నామా...జత పరుగుల్లో ఏం జరిగినా...`

ఎవరికి పట్టింది? నిండా ప్రేమలో మునిగాక. నాతో నువ్వే ఉంటే లోకంతో పనిలేదు అన్న రికామీ పాటలోని వివశత్వం ఎప్పుడూ నన్ను గెలుస్తూనే ఉంటుంది.
నన్నే మల్లె తీగలా నువ్ అల్లుకుంటే...నిలువెత్తు ప్రాణం నిలవదటే!
అల్లెయ్ అల్లెయ్.. పుప్పొడి తునకా గాలై అల్లెయ్... అంటే ప్రాణం గింగిరాలు తిరుగుతున్నట్టే ఉంటుంది.
My heart is beating.. అదోలా.. .పాటను ఆఫీసు ఐ.డి కి పంపి, ఇది పాడటానికైనా నా బతుక్కి అర్జంటుగా ప్రేమ కావాలి అన్న ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. ప్రేమ అట్లా చెప్పి రాదులే, పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా - అని తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదువ్ గాని అని చెప్పి నవ్విన గుర్తు 🙂
ఏవేవో పాటలు కళ్ళముందుకొస్తున్నాయ్. తుళ్ళిపడ్డ యవ్వనం తూలిపడకుండా ఆసరాగా నిలబడ్డ పాటలు. ఆటోల్లోనూ, పెద్ద పెద్ద కోలాహలపు గుంపుల్లోనూ, కాలేజీ మిత్రుల మధ్యలోనూ నాతో నేనూ వినీ వినీ అరిగిపోయిన పాటలు. వెదుక్కుని విన్న పాటలు. నా ఊరి దారుల్నీ, కాలేజీ బస్సుల్నీ, చేయి విడవని స్నేహాల్నీ, చూపు కలపని ప్రేమల్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయ్ ఈ పాటలు. తేనెవు నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా..వెన్నెల నువ్వో వెండిమంటవో తాకే తెలుసుకోనా- స్పీకర్‌లు అదిరిపడే పాటలకు చిందులేసిన పాదాలు మళ్ళీ కళ్ళ ముందు ఆడుతున్నాయ్.
కలలు కనే కన్నె కళ్ళ లోతుల్లో చిందాడిన సిరివెన్నెలగానే నా వరకూ అతని ఉనికి. ఆ లోతుల్లో నుండి అతన్నింకో లోకానికి తీసుకెళ్ళగలిగే శక్తి - ఉందా?

గాలిపల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె/ గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె...

రాసిచ్చిన ప్రతి పాటకూ తన హృదయమే తల్లి అంటూ ఆర్తిగా అప్పగింతలు చెప్పుకున్న కవీ- నువ్వుంటావ్! 

(My Sirivennela love songs playlist :
https://www.youtube.com/playlist?list=PL1FnHf9geiHO8xoLDS3K1aHuSG-bI4H9t)

అఫ్సర్ కవిత్వంలో అమూర్తభావనలు

 ఈ సాయంత్రానికి

ఈ చలీ ఈ వానా కలగలిసి
ముంచుకొస్తున్న చీకటిలోకి
కాస్త నిబ్బరంగా నడిచివెళ్ళడానికి
ఏదో ఒక సాకు వెదుక్కుందాం
ప్రస్తుతానికి దాని పేరు కవిత్వం అనుకుందాం


అంటాడు అఫ్సర్. నిజమే, చాలా మందికి ముసిరే చీకట్లలోకి నిబ్బరంగా నడిపించే తోడు కవిత్వం. మన లోపలి ధైర్యాన్ని తోడు పిలుచుకోవడానికి ఒక సాకు కవిత్వం. ఈ లోలోపలి భావనలను పిలిచే ఒడుపు తెలిసిన అరుదైన కవిగా అఫ్సర్ కనపడతాడు.


అఫ్సర్ పేరు వినగానే చాలా మందికి అస్తిత్వవాద కవిత్వం గుర్తొస్తుంది. తొలినాళ్ళ కవిత్వంలోని రాజకీయ భావాలు, ధిక్కార స్వరమూ గుర్తొస్తాయి. నాకు వీటిని దాటుకుని "ఇంటివైపు" మళ్ళిన కవిత్వంలోని సుతిమెత్తని కొత్త గొంతే స్పురణకొస్తుంది. అది అన్ని అస్తిత్వాలనుండీ విడివడి, అంతర్యానం చేసిన మనిషి గొంతు. నువ్వూ-నేనూ అంటూ మాట్లాడిన ఒక మిత్రుడి గొంతు. మామూలు చూపుకీ, మాటవరసకు సాగే సంభాషణకీ లొంగని అమూర్తభావాలను వాటి అతి నిర్మలమైన రూపంతో అక్షరాల్లోకి ఒంపిన కవి గొంతు. ఈ గొంతులో ఈ ధోరణితో అఫ్సర్ ఎన్నో కవితలు రాసిఉండకపోవచ్చు. కానీ, కవిగా అఫ్సర్‌లోని ఈ పార్శ్వం ఆకట్టుకున్నట్టు, మరే ఇతర పార్శ్వమూ నన్ను ఆకట్టుకోలేదు. పోలికలూ ప్రతీకల జోలికి పోకుండా, పదాలు బరువు చూసి వాడుతున్నాడా అనిపించేంత తేలిగ్గా రాసుకుపోయిన ఆ కవిత్వం లోతు తెలిసిన కొద్దీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చింది. "చెప్పకూడదు;చూపించాలి" అనే నినాదం కవిత్వాన్ని అసాధారణ స్థాయిలో ప్రభావితం చేసిన సాహిత్య వాతావరణాల్లో, ఏ ప్రతీకల సాయమూ లేకుండా మాట్లాడినప్పుడు, అది కవిత్వంగా గుర్తింపబడకపోయే ప్రమాదమూ ఎక్కువే. ఆ ప్రమాదానికి వెరవకుండా చేసిన ప్రయత్నం సహజంగానే నన్నాకర్షించింది. పొడిపొడి మాటలతోనే మానసికావస్థలను కళ్ళకు కట్టడం, ఆ సాదా పదాలకొక కవిత్వ పరిమళమద్దడం గొప్ప నేర్పుగా నన్ను తాకింది. 


అమూర్తమైనవి, అవ్యక్తమైనవి, కళ్ళకు కనపడనివీ అమూర్తభావనలుగా చెప్పబడతాయి. కళ్ళతో కొలవలేని అందం; అరిచి చూపించలేని నొప్పి; స్పర్శతో నిమిత్తం లేని దగ్గరితనం లేదా దూరం; మొదలైనవన్నీ ఇవే కోవలోకి వస్తాయి. ఇలా ఇంద్రియాలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రానివాటిని కవిత్వంలోకి తీసుకురావడం తేలికైన పని కాదు. ఎంత దిగులో చెప్పాలంటే ఎవరి దిగులు లోతునైనా కొలవగలిగి ఉండాలి. కన్నీటి చుక్క ఎవరికెంత బరువో ఊహించగలిగి ఉండాలి. ఇక్కడికిదే కవి సున్నితత్వానికి పరీక్ష అనుకుంటే, ఏ మూర్తమైన ప్రతీకల ఆసరా తీసుకోకుండా, ఈ అమూర్త భావనలను అమూర్త భావనతోటే నడిపించాలనుకున్నప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. తేడా ఏమిటో తేలిగ్గా అర్థమయ్యేందుకు వాల్మీకి రామాయణం నుండి, సుందరకాండలో హనుమ సీతను తొలిసారి చూసిన సందర్భాన్ని గమనించవచ్చు. ఇది భద్రిరాజు కృష్ణమూర్తిగారు మూర్తామూర్తభావనలను వివరించేందుకు తన వ్యాసంలో ఎంచుకున్న ఉదాహరణే.
అప్పుడు సీత మలినవస్త్రాలతో ఉంది, దుఃఖంతో ఉంది, రాక్షసస్త్రీల మధ్య చిక్కుబడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ఆమెను పద్మాలు లేని సరస్సులా ఉంది అనో, శుక్లపక్షపు నెలవంకలా ఉందనో అన్నప్పుడు, మనకు చప్పున పోలిక అందుతుంది. ఆమె కళావిహీనంగా ఉందనీ, కృశించిపోయి ఉందనీ అర్థమవుతుంది. ఇరవైకి పైగా పోలికలతో సాగిన ఆ వర్ణనలలో, సీత గుర్తు రాని జ్ఞాపకంలా, సడలిన నమ్మకంలా, అభ్యాసలోపంవల్ల శిధిలమవుతున్న చదువులా ఉందని అమూర్త ప్రతీకల సాయంతో కూడా వర్ణిస్తాడు వాల్మీకి. ఈ పోలికలు ముందువాటంత వేగంగా అందవు. ముందువాటంత స్పష్టమైన చిత్రాన్ని పాఠకుడి మనోఫలకం మీద ముద్రించవు.


అమూర్తకవిత్వాన్ని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, కవిత ఏం చెబుతున్నదో ఏం ప్రతిపాదించదలచిందో స్పష్టంగా చూపెట్టకుండా యథేచ్ఛగా నడిచే కవిత్వం. ఈ తరహా కవిత్వంలో పాఠకుడు శ్రమపడ్డా కవిని చేరగలడని చెప్పలేం, నిర్ధారించలేం. అలా కాకుండా, ఒక అమూర్తభావనను ఆధారంగా చేసుకుని, దాని తాలూకు ఆవరణను సృష్టించే లక్ష్యంతో సాగే కవితలు రెండో రకం. కవిత శక్తివంతమైతే ఆ ఆవరణ పాఠకుడిని తనలోకి లాక్కుంటుంది. ఆ మానసిక ఉద్వేగం తాలూకు బలమేదో పాఠకుడికీ అనుభవంలోకి వస్తుంది. ఇందులో అర్థం కానితనమేదీ ఉండదు కానీ, అర్థమవ్వడం ఈ కవిత్వానికి ముఖ్యం కాదు, కవి గొంతులోని తీవ్రతా, సున్నితత్వం పాఠకుడికి ఎంత బలమైన అనుభవంగా మారుతున్నాయన్నది ముఖ్యం. అదీ కవికి సవాలు. అఫ్సర్ కవిత్వంలో అర్థం కానితనమేదీ ఉండదు కనుక, ఇక్కడ చర్చించబోయే కవితలన్నీ రెండవరకానికే చెందినవని అనుకుంటాను. ఈ కవితలు బిగ్గరగా ఏమీ చెప్పవు, చూపెట్టవు. చేసేదల్లా ఒకానొక మానసిక ఆవరణలోకి పాఠకుడిని తీసుకుపోవడం, నిద్రాణమైన మానసికావస్థను మేల్కొల్పడం. 


నాస్టాల్జియా, విరహం, అకారణమనిపించే దిగులు లాంటి భావాలన్నీ లోపల ఎంత స్పష్టంగా సుడులు తిరిగినా వాటి మొదలూతుదీ తెలీవు కనుక వరుసలోకి లాక్కొచ్చి కాగితం మీద పెట్టడం కష్టం. ఒక్కోసారి కొలనులోకి విసిరేముందు రాయిని చూసినట్టు, ఈ భావనలకు ఒక ట్రిగ్గర్ పాయింట్‌లా ఒక సంఘటన కనపడుతూ ఉండచ్చు, కానీ దాని ప్రభావం అలలు అలలుగా తిరుగుతున్నప్పుడు ఆ వైశాల్యాన్నంతా పట్టుకోవడం కష్టం.
 
అఫ్సర్ కవిత రాసే పద్ధతిలో, ప్రత్యేకించి ఇట్లాంటి కవితలు రాసే పద్ధతిని గమనించినప్పుడు, ఆసక్తికరమైన పంథా కనపడుతుంది. ఈ ట్రిగర్ పాయింట్ అని దేన్నైతే అంటున్నామో, అది కవితకు శీర్షిక చేస్తాడు.(ఉదా: స్నేహితుడి దిగులు) ఈ మొదలూతుదీ పట్టుకోలేమనిపించే చెదురు మదురు ఊహలకు ఏకధాటిగా రాసే పద్ధతి ఎలాగూ నప్పదు కనుక, ఒకే కవితను ఖండికలుగా చేస్తాడు. 1. 2. 3. అంటూ ఆ ఖండికలకు అంకెలు వేస్తాడు. కవితను ఇట్లా విడగొట్టే పద్ధతి, అఫ్సర్‌కు ఉపయోగపడినట్టు చాలా తక్కువ మందికి, తక్కువ సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఈ అంకెలు వేయడం, ఖండికలుగా విడగొట్టడం, ఏదో ధ్యాసలో కొట్టుకుపోయే ఆలోచనలు మనసుల్లో ఎలా గంతులు వేస్తాయో, ఆ దాటు ని చూపించడానికి, పాఠకుడిని కూడా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు అలాగే అకస్మాత్తుగా లేపి తీసుకుపోవడానికి సాయపడతాయి. కొన్ని సార్లు ఈ భాగాలు ఒక దానికొకటి కొనసాగింపుగానూ కొన్ని సందర్భాల్లో ఒకదానినొకటి పెనవేసుకున్నట్టుగానూ ఉంటాయి. ఒకే రంగు పరిచే తీరును బట్టి ఒకసారి పల్చనై, మరొకసారి గాఢమై పూర్తిగా వేరే రంగులలోకి మారిపోయినట్టు, ఒక్కోసారి గుర్తుపట్టలేనంత దూరంలో, ఈ ఆలోచనలు ఎడంగా నిలబడి కనిపిస్తాయి. మనుషులు ఉండుండీ ఏదో ధ్యాసలో మునిగిపోయి కాసేపటికి అసలు విషయమేమిటో పూర్తిగా మర్చిపోయి వేరే జ్ఞాపకంలోకి, వేరే సందర్భంలోకి మేల్కొన్నట్టనమాట. ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సౌందర్యం అదేమి చెబుతుందన్న దాని కన్నా, ఎలా చెప్పినదన్న దాని మీదే ఆధారపడ్డట్టు, అఫ్సర్ కవిత్వంలో ఈ అమూర్తభావనల మీదుగా నడిచిన కవిత్వ సౌందర్యమంతా, ఆ చెదురుమదురు ఆలోచనలను పరిచిన తీరులోనూ, ఆ ఊహల మధ్య దూరమూ, దగ్గరితనంలోనూ, ఆ కలివిడితనం పాఠకులలో రేకెత్తించే స్పృహలోనూ ఉంది. 


స్నేహితుడి దిగులు అన్న కవిత పైన చెప్పిన పద్ధతికి చక్కటి ఉదాహరణ. ఇందులోని ప్రతి ఖండికా ఒకే సంఘటన తాలూకు రకరకాల స్థితులను పట్టిస్తుంది. "నీ నడకలోని ఉద్వేగాన్ని కొలిచేదేదీ నా దగ్గర ఉంటుందని తెలియక" అంటాడు మొదటి ఖండికలో. 


"ఎక్కడెలా గాయపడ్డావో
నిన్ను నొప్పించి అయినా అడగాలనుకుంటాను
తాకి చూడటానికి ఆ దిగులుకొక
శరీరం ఉంటే బాగుండనీ అనుకుంటాను
నువ్వు ఏ ఏ పదాల్లో దీన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తావా అని
ఎదురుచూస్తూ ఉంటాను


నీ కళ్ళల్లో
నీ కదలికల్లో
నీ పెదవివిరుపుల్లో
యీ గాయం ఎలా తెరుచుకుని
తన కథ చెప్పుకుంటుందా అని చూస్తూ ఉంటాను"


నొప్పించి అయినా అడగాలనుకునే తాపత్రయం, అతని కదలికలతో కారణాన్ని అందుకోవాలనే ఆత్రం, ఆ స్నేహితుడు మాటలతో ఏదో చెప్పడం, ఉండలేక వెళ్ళిపోవడం, అటుపైన ఆ దిగులును మోసుకుంటూ కవి ఒక్కడూ తెల్లవారుఝాములో "యే దిగులునీ యే గాయాన్నీ నేనెప్పటికీ యేమీ చెయ్యలేనని" అర్థం చేసుకోవడం - ఇలా దశలుదశలుగా సాగిన కవిత. పైన చెప్పినట్టు, ఒకే ఉద్వేగం రంగులు మార్చుకుంటూ ఒక కొత్త మెలకువగా ఉదయించిన కవిత. 


పికాసో అంటాడు - కళను అర్థం చేసుకోవాలని అందరూ అనుకుంటారు; పక్షి పాటను అర్థం చేసుకోవాలనుకోరేం? రాత్రినీ, పూలనీ, మన చుట్టూ ఉన్న అన్నిటినీ అర్థం చేసుకోకుండానే ప్రేమిస్తాం కానీ, కళను మాత్రం అర్థం చేసుకోవాలనుకుంటాం, ఎందుకూ? - అని. నిజమే, కళలు పాఠాలు కావు, చెప్పింది అర్థం చేసుకుని ఒకే రీతిన ఒక్కటే సమాధానమన్నట్టు మరెవరికో అప్పజెప్పాల్సిన అవసరమూ లేదు. ఒక అనుభవంగా అది మనను ఎంత బలంగా, లోతుగా తాకగలుగుతోందన్నదే ప్రశ్న. ఒక లాండ్స్కేప్ చూస్తే వెంటనే అర్థమైనట్టు, ఒక నైరూప్యచిత్రం అర్థం కాదు. మొదటి దానిలో మనం చిత్రంలో పొందుపరిచిన వివరాల ద్వారా తాకిన సౌందర్యాన్ని అనుభవంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే, నైరూప్య చిత్రం మొదటే ఒక అనుభూతిగా తాకుతుంది. ఇది ఏం చెప్తోంది? అన్న ప్రశ్న కళను అర్థం చేసుకోవడానికి పనికొస్తుందని కొందరంటారు కానీ, అది అవరోధంగానే ముందుకొస్తుంది. కనీసం అది మొట్టమొదటి ప్రశ్న అయితే కాకూడదని అనుకుంటాను. కవి అంటున్నాడు : నిర్వచనాలు కష్టం, కష్టపెట్టి ప్రతి క్షణాన్నీ విడమరచి చెప్పలేను/విడమర్చి చెప్పిన క్షణాన/అది ఒడ్డు మీద ఆత్మాహుతి చేసుకునే చేపపిల్ల.
 
అందుకే, "దగ్గరా దూరం" కవితలో, వొంటరిగా ఉన్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను అంటాడు.
 
ఆ ఒంటరి పక్షి అన్న మాట చదువుతుండగానే పాఠకుడి కళ్ళముందుకో చిత్రం వస్తుంది. పక్షి ఎక్కడైనా ఉండచ్చు, కానీ అది ఒంటరి పక్షి అనగానే దరిదాపుల్లో మరే ఇతర పక్షీ కనపడనంత మేర అన్నీ చెరుపుకోవడం అసంకల్పితంగా జరిగిపోతుంది. ఆ ఖాళీతనం మనలో కలిగించే సంవేదన- ఈ వాక్యం రహస్యంగా మన మీద పని చేసే తీరు. మామూలుగా ఉన్న మనమే ఈ ఖాళీతనపు స్పృహను మోసే ప్రయత్నం చేస్తుంటే, ముందే ఒంటరి అయిన కవి నేను ఒంటరి పక్షిని చూడనే లేను అనడమెందుకో మెల్లగా అనుభవమవుతుంది. సమధర్మమున్న రెంటిని కలపడంలో వచ్చిన బలమిది. కవిత మననొక కొత్త మానసిక ఆవరణలోకి తీసుకుపోవడం అంటే ఇదే. చదవడానికి బహుతేలిక వాక్యమే కానీ, వాక్యం ముగుస్తూండగానే కళ్ళ ముందుకొచ్చే ఏదో ఏకాకి పక్షి, ఒంటరితనం తాలూకు భయానకమైన నొప్పిని నోటకరుచుకుని కనిపిస్తుంది. "ఇదంతా ఇంకేమీ కాదు/నువ్వు దేనికీ అలవాటు పడలేదని ఇంకోసారి తెలుస్తుంది" అని కూడా అంటాడు వెంటనే. నిరాశకూ, భంగపాటుకూ, ఎదురుచూపుకూ, ఏకాకితనానికీ ఎలా అలవాటుపడాలి? ఎదురుపడ్డ ప్రతిదానిలోనూ మనలోపలి ఒంటరితనాన్ని గుచ్చి చూపే శక్తి కనపడుతోంటే, అలవాటుపడటం అయ్యే పనేనా? "అలా అని పెద్ద బాధా లేదూ.." అనుకున్నట్టే, "ఇదంతా ఇంకేమీ కాదు/కాస్త అలవాటుపడాలి, అంతే!" అనుకోవాలి. అంతే. అప్పుడు ఆ నిర్లిప్తత ఒప్పుకోలుగా మారి అడుగు ముందుకు పడేట్లు చేస్తుంది. 
 
దూరంగా ఉన్నప్పుడే/ నా వొంటిని నేనే తాకి తాకి / కొలుస్తూ ఉంటాను, నీ జ్వరాన్ని- అని ముగిస్తాడీ కవితను. కవిత మొత్తంలో ఈ నువ్వు ప్రస్తావన ఎక్కడా లేదు. ఉన్నదంతా నా ఒంటరితనమే. కానీ చివరిలో తెలుస్తున్నదేమిటి? ఇది తాను ఒక్కడై ఉండటంవల్ల కలిగిన ఒంటరితనం మాత్రమే కాదు. తనవాళ్ళెవరో జ్వరగ్రస్తులై ఉంటే, ఆ నుదుటిని స్వయంగా తాకలేని బెంగ కలిగించే ఉక్కిరిబిక్కిరితనం. ఆ ఇద్దరి మధ్యా దూరం పెంచిన దిగులు. తన వొంటిని తానే తాకి తాకి చూసుకుటూ అవతలి మనిషి జ్వరాన్ని కొలవాలనుకునే ప్రేమ. ఒంటరి పక్షి ఎవరో ఎందుకంత ఇబ్బంది పెడుతోందో ఇప్పుడు కదా అర్థమవుతోంది. కాబట్టి ప్రశ్నల నుండి, అంచనాల నుండి విడివడి కవితతో ప్రయాణం చేయగల హృదయం ఉంటే అప్పుడు ఆ కవిత స్పృశించే ఉద్వేగాలు, కదిల్చే అవస్థలు, జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా పాఠకుడిని కమ్ముకుంటాయి. మన లోపలి మనతో సంభాషణలా సాగే కవితలివన్నీ. ప్రయత్నపూర్వకంగా కాకుండా స్వాభావికంగా, ఆకస్మికంగా చెప్పుకుపోతున్నట్టు ఉండే ఈ కొన్ని కవితల్లోనూ, కవిగా నన్ను విస్మయపరచగల అఫ్సర్ కనపడ్డాడు. "ఇదంతా ఏమీ కాదు, కాస్త అలవాటుపడాలి, అంతే" అని పై కవితలో చూపెట్టిన తాత్వికత ఒక ఎత్తైతే, "కాస్త అలా లోపలికి వెళ్ళొద్దామా?" కవిత దాని తారాస్థాయి.


అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
యివాళ ఒక్క వానచుక్కయినా రాలలేదు
-పోనీ యెవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు
 
కనీసం ఒక్క అసహనపు చూపైనా దక్కి ఉంటే, ఆలోచన కాసేపు దాని చుట్టూ తిరిగేది. అయిష్టమైనదైనా నొప్పెట్టేదైనా సరే, తన ఉనికిని గుర్తించేవారికోసం, తనకే గుర్తుచేసేవారికోసం ఆ పూట అతని వెంపర్లాట. లోకంతో సంధి తెగిన ఏకాకితనాన్ని కవి ఇక్కడ సూచిస్తున్నాడు. మనం ఎవ్వరి దగ్గరికీ, ఎవ్వరూ మన దగ్గరికి రాని, రాలేని స్థితి. వానచుక్క కూడా రాలలేదు అనడంలో, ఇలాంటి ఒక పొడిబారిన, ఆశావిహీనమైన స్థబ్ధ వాతావరణపు స్పృహ మెదులుతోంది.
 
ఇట్లా మొదలైన కవిత "ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం" అనడం దాకా సాగింది. నాలుగు పాదాల కవితలో కవి సాగించుకున్న అంతర్యానం, సాధించుకున్న స్థితి ఇక్కడ గమనించాల్సినవి. 


ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబమంటే ఏమిటి? "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం.." అంటారు ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్త్రోత్రంలో. ఎవరు అంతర్ముఖులై లోతుల్లోకి ప్రయాణం చేసి ఆత్మసాక్షాత్కారర జ్ఞానం పొందుతారో, వాళ్ళకి ప్రపంచం అద్దంలోని ప్రతిబింబంలా కనిపిస్తుంది. కొండ అద్దమందు చిన్నదై ఉన్నట్లు, ఇంత సువ్యాప్తంగా కనపడుతున్నదీ అల్పమైపోతుంది. అంటే, దీనంతటికీ అతీతమైన, వీటికన్నా ఉన్నతమైన, స్థితికి చేరుకున్నట్లు. కవి చేరినది ఇట్లాంటి స్థితినే. మరొక విధంగా చూస్తే, ఎప్పుడు మనం ఒక మౌన స్థితిని (ఈ క్షణపు నిశ్శబ్దానికి ఏదో ఒక రంగు), చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమవగల్గిన ధ్యాన స్థితిని ( నా కంటి రెప్పపై/నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు) పొందుతామో, అప్పుడు బయట ఉన్నదానికీ, లోపల ఉన్న "నేను"కీ అభేదం. అప్పుడు నీలో ఉన్నదే బయటా ఉంటుంది. కాబట్టి బయటదేదైనా నీ ప్రతిబింబమే అవుతుంది. కవి ఇంకో మంచి మాటన్నాడు - "నువ్వు దాచేసిన" అని. కాబట్టి వెదికి చూస్తే కానీ తిరిగి కనపడదది.
 
ఎదురుచూపులతోనూ, ఏదీ లేదన్న వెదుకులాటతోనూ, ఒంటరి క్షణాల పట్ల నిరాసక్తతోనూ మొదలైన ఈ కవిత, ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలను ఒప్పుకుని, ఆ క్షణాలకు రంగులద్దుకోవడం ద్వారా , ఆ క్షణంతో మమేకమవ్వడం ద్వారా ఆ క్షణంలోకి మేల్కోవడం ద్వారా ఒక ధ్యాన స్థిని చేరుకుని, సమస్త విశ్వాన్ని తన ప్రతిబింబంగా చూసుకోవడంతో ముగుస్తుంది. సుప్రసిద్ధ సూఫీ కవి రూమీ అన్న“Do not feel lonely, the entire universe is inside you. Stop acting so small. You are the universe in ecstatic motion." మాటలను గుర్తు చేసే కవిత ఇది. సూఫీయిజం లోతులు పట్టుకోవడానికి అఫ్సర్ చేసిన కృషిని తల్చుకోవడం ఇక్కడ అసందర్భం కాదు. 
 
ఈ కవితలో నన్ను ఇబ్బంది పెట్టిందల్లా నస్రత్ పాట ప్రస్తావన. కొన్ని గొంతులు మనలోపలి లోకాలను కదిలిస్తాయి, కొత్త అనుభూతులేవో సాక్షాత్కారమయ్యేలా చేస్తాయి, నిజమే. కానీ, ముందు పాదంలో, "కొన్ని క్షణాలు ఇలాగే ఉండనీ, ఎవరూ రాని, ఎవరికీ ఎవరూ ఏమీ కాని క్షణాలు" అని చెప్పాక ఈ పాదాలు రావడమూ, తన లోపలి, తన చుట్టూరా ఉన్న నిశ్శబ్దాన్ని వినేంత సున్నితత్వంలోకి మేల్కొనే ప్రయాణంలో " నస్రత్ పాడుతూనే ఉన్నాడు" అనడమూ సముచితంగా కనపడవు.
 
ఇక్షుక్షీరగుడాదీనం మాధుర్యస్యాన్తరం మహత్ 
తధాపి న తధాఖ్యాతుం సరస్వత్యాపి శక్యతే 
 
పాలు, చెఱకురసం, బెల్లం అన్నీ మధురంగానే ఉన్నా, వాటిలోని మాధుర్యాలు వేరు వేరు. ఆ తేడా ఏమిటో సాక్షాత్తూ సరస్వతైనా చెప్పలేదంటాడు దండి. 
అఫ్సర్ ముస్లిం అస్తిత్వ వేదనలను కవిత్వం చేశాడు. సామాజిక సందర్భాలను తన పుస్తకాల్లో పాదాలుగా నడిపించాడు. తనకిష్టమైన గొంతులనూ, కవులనూ, కళాకారులనూ అక్షరాలలోకి వొంపుకుని దాచుకున్నాడు. ఇంత విస్తృతమైన వస్తు పరిధితో సాగిన అఫ్సర్ నలభయ్యేళ్ళ సాహిత్య ప్రస్థానంలో నుండి, వాటన్నింటినీ కాదని లెక్కకు ఎన్నో లేని ఈ తరహా కవిత్వంవైపే మనసు మొగ్గడం నన్ను కూడా ఆలోచనలో పడేసింది. `కవిత్వం ఎదుట నా భాష` అన్న కవిత చదివాక నాకొక సమాధానం దొరికినట్టైంది. అందులో, తన భాష `ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశమై వినపడుతుంద'ని అంటాడు. అదీ మాట. "శిశువు ఆక్రోశం"; పాలు అందని శిశువు ఆక్రోశం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు కాండిన్స్కీ కళను ఒక ఇన్నర్ నెసెసిటీ అని చెప్పుకుంటాడు. ఆ పదబంధం చిత్రకళను వ్యక్తీకరించే దారిలో ఒక ఉద్యమస్పూర్తిని నింపిందని అంటారు. తన పుస్తకం "The spiritual in art"లో అతనంటాడు : కళాకారుడికి రూపం మీద మాస్టరీ కాదు, తాను చెప్పదల్చుకున్నదేదో దానికి తగ్గట్టుగా రూపాన్ని దిద్దుకోవడమే ముఖ్యం అని.
 
కవిత్వంలో తన భాష ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశం లాంటిది అని అఫ్సర్ అన్నప్పుడు, అది అట్లాంటి తప్పనిసరి అవసరమని అర్థమవుతుంది. అందులో, అలా తప్ప ఇంకెలానూ చెప్పలేని అసహాయత, అవసరం వినపడతాయి. దానిని వివరించలేడు, నొక్కిపెట్టి తగ్గుస్వరంలోనో, రాద్ధాంతంగానో చెప్పలేడు. అది ఇంకా లౌక్యం నేర్చుకుని పసితనపు ఉద్వేగమేదో. దానిని ఎవరు అలక్ష్యం చెయ్యగలరు? ఇలాంటి ఉద్వేగం, అదనపు మాటలందించే ఏ భాషా ఇంకా నేర్చుకోని పసితనం, ఈ వ్యాసంలో చర్చించిన అమూర్తభావాలకు సంబంధించిన కవితల్లో స్ఫుటంగా కనపడతాయి. అందుకే ఆ కవితలు అలా ప్రత్యేకంగా నిలబడతాయి. శైశవ ఆక్రోశం విని ఎవ్వరూ ఊరడించకుండా తప్పించుకుపోలేనట్లే, ఈ కవితల దగ్గర ఆగకుండా ఈ సంపుటినీ పూర్తి చెయ్యలేరు. 


వీటిలో కనపడే ఈ ధోరణే, మొత్తం కవిత్వం గురించి మాట్లాడాల్సి వచ్చేసరికి, బలహీనతగా కూడా తోస్తుంది. పక్కవాద్యాల హోరుతో పాటలు వినడం అలవాటైన గొంతుకి, ఒక లేత గొంతేదో లయలో పాడుకుపోతుంటే వినడానికి సమయం పడుతుంది. కానీ, అందులో సౌందర్యం అర్థమైన కొద్దీ, వెనుకటి దారిలోకి వెళ్ళడం అసాధ్యమైపోతుంది. అఫ్సర్ కవిత్వంలో సరళతతో నిండిన పైతరహా కవిత్వం ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, అటుపైన ఏ కవితలో ఆర్భాటం చూసినా అది అబద్ధమనే అనిపిస్తుంది. ఒక్క పదం బరువుగా కనపడినా దాని లోతుతో నిమిత్తం లేకుండా, సారళ్యపు సున్నితత్వాన్ని వదులుకున్న వాక్యమై మొరటుగా వాడిగా పాఠకులను తాకుతుంది. వాడాలా వద్దా అన్న పెనుగులాట బహుశా కవికీ ఉంది.
 
అవతల నువ్వు చాలా మర్యాదగా,
ఎంతో గౌరవప్రదమైన పదాల మధ్య
ఒక్కో వాక్యమూ కొలుస్తున్నావ్, తెలుస్తూనే ఉంది!
..
 నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
యీ ఒక్కసారికీ మన్నించు.
 
యింకా నాకు రానే రాని
ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను.
 
కాని, నా బాధల్లా వొక్కటే:
ఆ తరువాతి తయారీ భాషలో నువ్వు వినిపిస్తావా?
 
పోనీ,
నాకు నేను వినిపిస్తానా?
 
తయారీ భాషలో కవి వినపడడనే నేనంటాను. అఫ్సర్ అయినా కాదనగలడని అనుకోను.
 
https://archive.org/details/TheSpiritualInArtByWassilyKandinsky 


https://eemaata.com/em/issues/201109/1814.html/6

లేతకౌగిలి

  మధ్యాహ్నం మూడు మూడున్నర మధ్యలో వీధిలోని అపార్ట్‌మెంట్‌లలో నుండి అమ్మలూ నాన్నలూ అమ్మమ్మలూ తాతయ్యలూ ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఉంటారు. స్కూల్ బస...