నేల రాలిన నక్షత్రం


ఆమె
ఆకుపచ్చ గీతమై
అడవి గుండెల్లో ఒదుగుదామనుకుంది.
వాన చినుకులా
సముద్రమంత ప్రేమలో కరుగుదామనుకుంది
ఆకాశమై అతను కవ్విస్తే
చుక్కలా చెక్కిలిని ముద్దాడుదామనుకుంది. 
అతడు
అడవి కాడు
వసంతం.
సముద్రమూ కాదు 
ప్రవాహం.
ఆకాశమైనా అయి ఉంటే,
నక్షత్రం నేల రాలేది కాదు
  
--------------------------------------------
తొలి ప్రచురణ, వాకిలిలో.

ఒక్కో రోజు


అరవిరిసిన పూవులేవో మంచు మత్తులో తూలుతూండగానే
మసక వెన్నెల వానలో లోకమింకా తడుస్తూండగానే
విశాల శాద్వలాల్లో స్వప్నసంచారాన్ని అకస్మాత్తుగా ముగించి
దేని కోసమో దిగులుపడుతూంటుంది హృదయం
జీవన పయనాన్ని లయగా నడిపించే
నిర్వికల్ప సంగీతమేదో ఆగిపోయినట్లై
సంకల్ప వికల్పాలన్నీ ముళ్ళుపడుతుంటే…
కాలపు కుండకు చిల్లులు పెట్టి
అట్టడుగున పేరుకున్న అనుభవాలేమిటని
దోసిలితో పైకెత్తి చూస్తాను
మానస సరోవరాన స్వేచ్ఛగా మసలే
రాజహంసల సమూహాలను దాటుకుని
లోతులను తాకే ప్రయత్నమొకటి చేస్తాను
ఏదో రహస్యం.. అర్థమయ్యీ కానట్టు
ఏదో వెలుగు లోలో మిణుకు మిణుకుమంటూ
ఇన్నాళ్ళెందుకు సాగిందీ ప్రతీక్ష!
జీవితం పునరావృతమవుతున్న పురాగీతమేనన్న స్పృహ కలిగాక
చరణాల మధ్య నిశ్శబ్దమెందుకో తేలిగ్గానే తెలిసొస్తుంది
ముందు వెనుకలకు కాని మలి ప్రయాణం మొదలయ్యాక
లోలోపలి లోకాల్లో సంగీతం తిరిగి నిండుగా పరుచుకుంటుంది.
________________________
**తొలి ప్రచురణ.. ఈమాటలో.

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...