16 October, 2019

మెహెర్ కు అభినందనలు..

2010 లో..

బ్లాగింగ్ మొదలెట్టిన తొలినాళ్ళలో..

కూడలి, మాలిక ఈ రెండింటిలో మంచి బ్లాగ్ కోసం వెదుక్కోవాలని ఎవరో చెప్పాక -
అట్టే వెదక్కుండానే కళ్ళబడ్డ బ్లాగు - "కలంకలలు"

నారింజ రంగు హెడర్..ఎవరో తీరి కూర్చుని దిద్దుకుంటున్నారా అన్నట్టున్న అక్షరాలు, ఇటాలిక్స్, బోల్డ్ ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్న బ్లాగ్. చూడగానే ఆ బ్లాగులో ప్రేమతో పడిపోయాను. అది మొదలూ ఈ తొమ్మిదేళ్ళుగా పూట పూటా కాకపోయినా కొన్ని సార్లు కొన్ని వ్యాసాల కోసం, చాలా సార్లు ఊరికేనూ ఆ బ్లాగ్ చదువుతూనే ఉన్నాను.

ఇన్నాళ్ళకు, ఆ బ్లాగులోని కథలన్నీ పుస్తక రూపంలో వచ్చాయని తెలిసి - సంతోషంతో ఆ రోజుల గురించి తల్చుకుంటుంటే, చాలానే గుర్తొస్తున్నాయి. తన కథలన్నీ చూసి ఇష్టమైన వాక్యాలు ఎత్తి రాయాలనుంది కానీ, బ్లాగ్ లేదిప్పుడు. కథల పుస్తకమూ నా ముందు లేదు. అందుకని, అజంతాలా, స్మృతి పీఠం ముందు కూర్చుని, ఈ నాలుగు మాటలూ.

మొట్టమొదటగా చదివినదేదో గుర్తు లేదు కానీ, "సరిహద్దుకిరువైపులా" అలా పాత జ్ఞాపకంగా మనసులో మెదులుతోంది. గొడవపడ్డ భార్యాభర్తలు -  మొదటంతా అబ్బాయి వైపు నుండి, మళ్ళీ అవే సన్నివేశాలు అమ్మాయి వైపు నుండి, తర్వాత అసలు గొడవ - ఇలా సాగుతుందా కథ.

మెహెర్ మొదట్లో రాసిన కథల్లో, చిత్రీకరణ చాలా బలంగా ఉండేది. అంటే అది ఒక కెమెరాని స్లో మోషన్‌లో తిప్పుకుంటూ వెళ్ళడం లాంటిది. ఆ గది ఉన్నదున్నట్లు మనకు కనపడి తీరాలన్నట్లు రాసేవాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసిన వెలుగులో, ఆమె తలెత్తి బాటిలో నీళ్ళు గుక్క గుక్క తాగుతుంటే గుటక పడటం లాంటి వర్ణనలు, నాకిప్పటికీ అలా గుర్తుండిపోయాయి. అంత స్పష్టమైన వెలుగుతో ఉంటాయి తన వర్ణనలు.

"రోడ్ మీద కోక్ టిన్‌ని లాగి పెట్టి తన్నిన అనుభవం.." లాంటిది ఇంకోటి. అందులో కథగా ఏమీ ఉండదు. వాళ్ళేదో సినిమా తాగి (మెహర్, తన స్నేహితుడూ) ఓ గుట్ట లాంటిదేదో ఎక్కాక, స్నేహితుడు ప్రేమకథ చెప్తాడు. హైదరాబాద్ రాత్రి గాలి మన మీదకొచ్చినట్లు హాయిగా అనిపిస్తుంది మొత్తం చదివేశాక.  రచయితకు ప్రత్యేకమైన గమనింపు అనేది ఉంటే ఇష్టమన్నట్టు, అతను రాసే కొన్ని కొన్ని వాక్యాలు భలే ఉంటాయి. స్నేహితుడు ప్రేమ కథను చెబుతుంటే, ఊఁ కొడుతూ, అది మరీ ఆసక్తి లేకుండా వింటున్నట్టు అనిపించకుండా, మధ్యలో ఊరికే ఏవో ప్రశ్నలడిగానని రాస్తాడిందులో. భుజాలు తడుముకున్నాను నేను కూడా.

ఇంకో కథలో నాకు పరిచయమే లేని హైదరాబాదు గల్లీల్లో గొడవల గురించి - అందులో ఓ హొటల్ లో అయిన చిన్న గొడవ గురించి వర్ణన ఉంటుంది.   హోటల్ లో మిగిలిన వాళ్ళు, సమోసా ప్లేట్లతో సహా లేచి దూరం జరిగి చూస్తూ ఉంటారని రాస్తాడు. నాకెప్పుడూ ఆ సీన్‌లో ఆ సమోసా కొరుకుతూ గొడవ చూస్తున్నదాన్ని నేనే అనిపిస్తాను. అక్కర్లేని వాళ్ళు ఎడం జరిగి చూడండి - అని చెప్తున్నట్టే ఉంటాయి మెహెర్ గొడవలన్నీ.

మాలికలోనో కూడలిలోనో చూసి, ఒకసారి చదివి, మళ్ళీ చదివి, లాప్టాప్ మూసేసి మళ్ళీ చదివి, మళ్ళీ ఎవరికో చెప్పి వచ్చి మళ్ళీ చదివిన కథ "రంగు వెలిసిన రాజు గారి మేడ కథ". కథ అల్లిక ఇలా కదా ఉండాలనిపిస్తుంది. ఆ కుమ్మరి వాడి ఇల్లు ఊహల్లో ఎంత స్థిరంగా ఉండిపోయిందంటే - అట్లాంటి ఇల్లొకటి చూడాలనిపించేంత.

మెహెర్ వాకిలిలోనూ, తరువాత రస్తాలోనూ కూడా కథలు వ్రాశాడు. నాకు లోకంలోనీ, మనుషుల్లోనీ చీకటి, రుచించదు. చేదుగానే అనిపిస్తుంది. మెహెర్ కథల్లో చేదు ఉగాది పచ్చడిలో తప్పని రుచిలా, కొండొకొచో ముఖ్యమైన రుచిలా, ఏ తొడుగూ లేకుండానే కనపడుతుంది. "లోకంలో ఇట్లా జరక్కుండా ఉంటే బాగుండు కదా, ఎవ్వరికీ ఈ కష్టం రాకుండా ఉంటే బాగుండు కదా! అప్పుడిలా చెయ్యరు కదా!" అని నాకు పదే పదే అనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆశల హోరుతో, ఇలా కాక ఇంకెలా ఉండి ఉండాలోనన్న నా సొంత ఆలోచనలతో, నేను ఆ తరహా కథలనసలు చదవలేను.  కానీ, ఒరాంగుటాన్ మెహెర్ నుండి వచ్చిన అత్యుత్తమమైన కథ అనిపిస్తుంది. ఆ మనిషి పొడవాటి చేతులతో అలా కళ్ళ ముందు ఊగుతూ ఉంటాడు. పాత్రని ఇలా ప్రాణశక్తితో ముందుకు తెచ్చి మన ముందు నిలిపే రచయితలు ఎంతమంది ఉన్నారో నాకనుమానమే. చెక్కే వాళ్ళు చాలా మంది ఉండచ్చు. కానీ ప్రాణం అన్నిట్లోనూ దొరకదు. పాత్రల ఉనికిని ఇంతలా అనుభవంలోకి తెచ్చుకోగలిగేలా రాయడం ఎంత కష్టమో ప్రయత్నం చేస్తాను కనుక నాకు తెలుసు. ఒరాంగుటాన్ గొంతు, అతని నంగిరితనం, ఆ రాత్రి చీకట్లో అతని గొంతులో వ్యంగ్యం అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడతాయి, వినపడతాయి. అతని పాత్రలకు నటించడం చేతకాడు. నటించామని బయటపడటానికీ వెనుకాడరు వాళ్ళు.

కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని స్పురణకు తెచ్చే శక్తి ఉంటుంది. వాక్యం పోకడను బట్టి కరుణ రసమా, భయానక రసమా మనం చెప్పగల్గుతాం, చాలా సార్లు. కానీ మెహెర్ వాక్యం ఎప్పుడూ మీదకొచ్చి దబాయిస్తున్నట్టే ఉంటుంది. అన్ని వాక్యాలూ ఏవో సీరియస్ విషయాలను ప్రతిపాదిస్తున్నట్టే ఉంటాయి. ఇతని కలంలో కరుణ రసం అనేది అవ్వని పని అనిపించేది ఓ కాలంలో. అతను ముక్కు పగలగొట్టేలా రాయగలడు, దాపరికం లేకుండా తాననుకున్నది చెప్పగలడు, కానీ ఏదైనా ఒక సీరియస్ టోన్‌తోనే.. అంతే. మనసు లోతుల్లోని తడి తెలియబరచేందుకు అతనికి మాటలున్నాయా అనిపించేది.

రెండు కథలు. ఇదెంత పిచ్చి ఆలోచనో చెప్పాయి.  1) కన్నా గాడి నాన్న. 2) చంటోడికి లేఖ? (ఇదేనా పేరు?-)

కన్నా గాడి నాన్న - బిడ్డని చిన్నప్పుడే పోగొట్టుకుని, జీవితంలో ఆశను పోగొట్టుకున్న ఓ వెర్రి తండ్రి కథ. అతని బాధ ఎంత బలమైనదో చెప్పేందుకు గుర్తుండేందుకు కథలో ఓ వాక్యం ఉంటుంది, వాళ్ళ భార్య గురించి. ఆమె ఇదంతా మర్చిపోయి చెత్త గొడవల్లో పనికిరాని వాటి గురించి ఆశపడటం, అదివరకట్లానే చాడీలు చెప్పడం, - ఇలా ఏదో ఉంటుంది. ఇంత పెద్ద బాధ ముందు, వెలితి ముందు, జీవితంలోని చిల్లర విషయాలు ఎలా కనపడుతున్నాయామెకు అన్నది ఇతని బెంగ. ఆ చిరాకుతోనే ఆమెకీ దగ్గరకాలేకపోతాడు. ఆ నిసహాయత మెహెర్ మాటల్లోనే చదవాలి. ఒరాంగుటాన్‌ని తోసిరాజన్న కథ ఇది, నావరకూ.

మెహెర్ మొదట్లో రాసిన కథలకూ, తరువ్వాత్తర్వత రాసే కథలకూ, నేను పోల్చుకోగల్గిన పెద్ద తేడా ఇలాంటి వాటిలోనే. మొదట్లో అతను చెప్పినవన్నీ భౌతికమైన వర్ణనలు. ఒక సన్నివేశం మెహర్ చెప్పాడంటే, అది మన కళ్ళ ముందుకు రావాల్సిందే. అట్లతద్దికి వాళ్ళమ్మ చెరువు మీదకి సాగేలా ఉయ్యాలూగిందని రాస్తే, ఎన్ని డిగ్రీల్లో ఉయ్యాల వంపు తిరిగిందో కూడా కనపడి, మనమూ ఏట్లో పడి పైకి లేవాలి ;). ఆఫీసుకు పోతూ పోతూ షాప్ వాళ్ళమ్మాయి సాయి(?)తో ఇసుక గూళ్ళు కట్టాడంటే మనకు ఎత్తూ లోతూ తెలియాలి. కానీ, తర్వాత్తర్వాత, ముఖ్యంగా ఈ కన్నాగాడి నాన్న కథలో, కాలంతో పాటు గడ్డకట్టిన్నట్టయ్యే ప్రేమల్ని, బాధల్ని, అవి బ్రతుకులో నింపే నిస్తేజాన్ని, ఎంత నమ్మశక్యమైన డ్రామాతో చెప్తాడో. నాకింకా ఆశ్చర్యమనిపించిందేమంటే - ఆ పిల్లాడు చనిపోయాడనేది, కథ మొదట్లోనే, మేటర్ ఆఫ్ ఫేక్ట్లా చెప్పేస్తాడు. అందులో దాపరికమేం లేదు. పొరలు పొరలుగా విప్పి, పాఠకులకూ కొంత పని పెడదాం లాంటి గోలేం లేదు. చాలా సరళంగా, మామూలుగా చెప్పుకెళ్తాడు. చావు అతని కథలో రహస్యం కాదు. ముడి కాదు. అది కూడా ఆ కేరక్టర్ లో పొదిగిన నిజాయితీలా కనపడి కథ మరింత నచ్చేలా చేసింది.

ఇంకోలా చెప్పాలంటే, మొదట్లో కథలు అతను చూసినవి చూసినట్టు చెబుతున్నట్టుంటే, ఒరాంగుటాన్, ఈ కన్నగాడి నాన్న లాంటి కథల్లో- రచయిత వాళ్ళతో ఎన్నాళ్ళో ప్రయాణం చేసి, ఆప్తుడై, అన్నీ అయి, మనం ఎక్కడ కలిస్తే అక్కడ నుండి మొదలెట్టి కొంత కొంతగా చెప్పుకుంటూ పోతాడు. ఇందులో కనపడే ప్రయత్నమంతా ఆ పాత్రల్ని గుచ్చి గుచ్చి చూడటంలోనో, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలనూ, మనుషులనూ భూతద్దం వేసినట్టు పాఠకులకు చూపించడంలోనో లేదు. - మనం కలిసిన చోటు నుండి కథను  చెప్పుకుపోవడంలో ఉంది. మొదలూ తుదీ అనచ్చేమో. పాత్రల మనఃస్థితులను వీలైనంత తేలిగ్గా పట్టి ఇచ్చే ప్రయాణపు భాగాలను అందివ్వడంలో ఉంది.

చింతల్లికి ఉత్తరం చదివినప్పుడు, అందరూ "ఆహా! నాన్న మనసు, నాన్న మనసు!" అన్నారు అందరూ. ఎంత అబద్ధం! అందులో కనపడిందల్లా నాన్న లేకుండా పెరిగిన కొడుకు బెంగ. ఎన్ని రకాలుగా చెప్పాడా మాటని! మంచో చెడో నాకో ఉదాహరణ ఉంటే, దాన్ని బట్టి నేనెలా ఉండాలో తెలిసేది అన్న మాటలు చదివినప్పుడు, ఎంత నొప్పి మనకి.

తండ్రి అయ్యాక పిల్లల భాష పట్టుకోవడంలో తేలిగ్గానే -కానీ గట్టి పట్టు వచ్చేసినట్టుంది - పైన చెప్పిన సాయి తో ఆడుకున్నప్పటి కబుర్లకూ, తరువాత రాసిన స్కూలెల్లను, ఈ ఉత్తరం, తప్పిపోయినట్టు నటించే పిల్లాడి కథ - లాంటి వాటికీ ఎంత తేడానో. వీటిలో మెహెర్లోని రచయిత పిల్లల మనసుతో చిందులేశాడు. తెలుగులో పిల్లల సాహిత్యమంటే పిల్లల భాషే ప్రధానమన్నట్టు రాస్తారు. అవి చాలా సార్లు వెగటు పుట్టిస్తాయి. రచయితల తెలివి, పిల్లాళ్ళ భాషలో ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా కాకుండా, పిల్లల మనసు పట్టుకుని రాసిన రాతలు మెహెర్ వి.  ఆ తప్పిపోయినట్టు నటించిన పిల్లాడి కథలో, ఓపెనింగ్ సీన్ లోనే పిల్లాడు దొడ్లోక్కూర్చుని నీటితో కార్ల బొమ్మలు గీస్తున్నాడనీ గాజు పురుగులని చూసి భయపడి ఎగిరాడనీ ఉంటుంది. పిల్లల కథల్లో ఇట్లాంటి పరిసరాలూ, అక్కడ ఇలాంటి వర్ణనలూ చేసిన కథకులున్నారా మనకు? ఎక్కడేపని చేస్తున్నా తమలోని కుతూహలాన్నీ, భయాన్ని, దాచుకోలేని పిల్లలనిలా పట్టిచ్చినవాళ్ళు?

మెహెర్ కథల్లో ప్రేమ విచ్చలవిడిగా పడి ప్రవహించదు. కోపమో, లెక్కలేనితనమో ఎదురుగ్గా వచ్చి పలకరించినట్లు సున్నితమైన ఉద్వేగాలేవీ సున్నితంగా కనపడటం ఉండదు. కానీ, ఆ మొండి గోడలు దాటుకుంటూ వచ్చి తాకిన చెమ్మ కూడా పాఠకులను వరదలా ముంచేస్తుంది అనడానికి ఈ రెండూ కథలూ గొప్ప ఉదాహరణలు.

చేదు పూలు(*కాదు, తరళ మేఘఛాయ..) కథ కినిగె్‌లో ప్రచురించారు - వేరే పేరుతో. నేను అది కనిపెట్టి మెసేజ్ చేశాను. అది మీరే కదా అని. అందుకు నాకు నేనే చప్పట్లు.

అలాగే ఇంకోటి గుర్తొస్తోంది - నేనూ ధీరజ్ చాలా సార్లు అనుకున్న వాక్యం  -" రాత్రంతా నిద్రపోనట్టు ముఖం వడిలిపోయి ఉంది, కానీ దుఃఖమంతా బైటకు తోడేసాక మిగిలే తేటదనమూ ఉంది"   - భాగ్యనగర్ కాలనీ కథలో అనుకుంటానిది. కథలకు సరుకు కోసమని కాకుండా, మనుషులను గమనించడం, రచయితగా ఉండటం, ఈ రెండూ తెచ్చి పెట్టుకున్న లక్షణాలుగా కాకుండా,  మనిషికి స్వభావసిద్ధమైపోతే, అప్పుడూ, ఇలాంటి వర్ణనలు పాఠకులకు దొరికేది!!

నీలా టీచరులో- ఆ టీచరు మీద బొత్తిగా ఆసక్తి కలగలేదు, ఆవిడ ముక్కు తప్ప. :) ఆ పెద్ద కళ్ళమ్మాయి కథ ఆ చిన్న పిల్లాడి చూపులో -96 సినిమాని గుర్తు తెచ్చింది. పదిలంగా దాచుకున్న తొలిప్రేమ కథ, అలా అపురూపంగానే ఉంది.

ఇంకా కొన్ని కథలున్నాయి - కొన్ని మరీ నా గొంతు దిగనివి. చదివాను కానీ, నాకు గుర్తుండిపోలేదు. అట్లా నాకంతగా రుచించని కథల్లో కూడా కొన్ని వర్ణనలు, వాక్యాలు ఎంత బలంగా తాకాయంటే - అవి నాకు గుర్తుండిపోయాయి. ఆ అనుభవం పకడ్బందీగా పాఠకులకు చేర్చడమే రచయితగా నా పని తప్ప,  దేహ వర్ణనలతో కామపు స్పృహ కల్గించడం నా పని కాదన్నట్టు రాసిన వాక్యాలవి. రక్తమాంసాలతో సహా మనిషిని ముందుంచడమంటే ఏమిటో "పింక్ మాంసం" అన్న పదం చదివినప్పుడు తెలిసింది. మీకు జుగుప్స కలిగిందా, ఇంకేమైనా అనిపించిందా అన్నది తరువాతి సంగతి. ఆ వర్ణన మీలో కలిగించే స్పృహ, తొట్రుపాటు - అవి అనూహ్యం.

ఏవైనా రచయిత రాసేది రాయాలన్న వాళ్ళ బలమైన కోర్కెకు లోబడి. పాఠకులుగా మనకున్న పరిమితులకూ వాటికీ ఏ సంబంధమూ ఉండకూడదు కదా.

--

మెహెర్ కథలొస్తున్నాయని పోయినేడు ధీరజ్ నాకు చెప్తే, అప్పుడు విజయనగరంలో ఉండబట్టి వెంటనే కాల్ చేసాను - "నా కాపీ ఉంచాలి మీరు" అని. నెమ్మది గొంతుతో మర్యాదగా సరేనన్నారు. అసలు నా జలుబు గొంతు అర్థమై ఉండదు. మొదటిసారి కినిగె్‌కు రచనల కోసమని చేసినప్పుడూ అంతే, నేను ఆఫీసులో క్యూబికల్ నుండి ఎగిరి దూకి బయటపడి, మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా గొంతు రాదే. పుట్టెడు జలుబు ఆ రోజూనూ. అయినా "మీ బ్లాగ్ ఇష్టం" అని చెప్పే కాల్ ముగించాననుకోండీ.

మెహెర్ కథలొస్తున్నాయంటే - సారీ, వచ్చాయంటే, అది, బ్లాగింగ్ ఒక మెట్టు పైకెక్కినట్టనిపించే సందర్భం నాకు. స్వాతి లాంటి నా మిగతా మిత్రులూ పుస్తకాలు తెచ్చారు. అప్పుడూ ఇదే సంతోషం. మనం వెదుక్కు చదువుకున్న బ్లాగ్ ఇంకా బాగా ముస్తాబై వెదుక్కోన్నక్కరలేకుండా ఒళ్ళో పుస్తకమై వచ్చి పడుతున్నట్టు..

( సుధామయి ఇప్పుడే చెప్పారు -  మెహెర్ పుస్తకం వచ్చేసిందనీ, ఈ రోజే సభ అని; ఒక వరుసాగిరుసా ఏమీ లేకుండా ఏదో రాసేశాను...)

(స్మృతి పీఠం ముందు కూర్చుని రాశానని చెప్పాను కదా - తప్పులు దొర్లి ఉండచ్చు. కథలూ గట్రా ఏమున్నాయో, ఏం లేవో నాకింకా తెలీదు. అయితే సారీలవీ చెప్పను.. :-) - అమెజాన్ లో పుస్తకం కొనుక్కుని, ఈ తప్పులనిక్కడ వదిలి, ఒప్పులు మీరు పట్టుకోండి. )

కంగ్రాట్స్ మెహెర్!
& థాంక్యూ!

17 September, 2019

శ్రీకాంత శర్మ సాహితీప్రస్థానం

నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం/ ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే/ గానంగా కరిగిపోయే కోకిలాన్ని/ ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు!‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ‘పండిత పుత్ర…’ అన్న లోకోక్తిని తిప్పికొడుతూ, కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.
కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, వి.ర.సం. సాహిత్య ఆధిపత్య ధోరణులపై ఎక్కుపెట్టిన విమర్శగా, శర్మగారి తొలి కవితా సంపుటి అనుభూతి గీతాలును పరిగణించవచ్చు. ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని, మెచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. సొంత అనుభూతి మాత్రమే కవిత్వ ప్రకటనకు బాణీ కావాలన్న శర్మగారి మాటలు, అరువు గొంతులతో గుంపుల్లో దూరిపోతున్న ఈ కాలపు కవులకూ అశనిపాతాలే. వచన కవిత్వం ఒక సాహిత్య ప్రక్రియ మాత్రమేననీ, ఒక ధోరణిని ఉద్యమంగా నడపడం అనవసరమైన పని అనీ, తెలుగు కవిత్వానికి అది మేలు కంటే కీడే చేస్తుందనీ అనడం, ఆ ఉద్యమకర్త కుందుర్తిని విమర్శించడం, సాహిత్యానికి సంబంధించి శర్మగారి ముక్కుసూటితనాన్ని పట్టిస్తాయి. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. కవిత్వానికి సంబంధించి ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు. అంతగానూ అనుసరించారు కూడా. ‘గతాల శ్రుతులు సరిచేస్తూ/నా నరాల ప్రకంపనల్లోంచీ/అనుభూతి గీతాలు ఆలపిస్తాను‘ అన్నదందుకే. అలాగే మరొక కవితలో,
బ్రతుకంతా ఏదో సడి, తడి, అలజడి –
నువ్వు గుర్తించలేనంత సున్నితంగా
ఒకప్పుడు
ఒళ్ళు జలదరిస్తుంది-
ఒకానొక అనుభవం
నీలో ఘనీభవించే
మౌక్తిక క్షణమది-
అప్పుడు నువ్వు
కాళిదాసువి
తాన్సేన్‌వి
మైకేలేంజిలోవి-
అంటారు. కవిత్వం, అట్లాంటి మౌక్తిక క్షణాలను ఒడిసిపట్టుకోగల మెలకువతోనే సాధ్యమన్నది శర్మ గారి భావనగా అర్థమవుతుంది. వ్యక్తే శక్తికి ఆధారం కనుక, అదే ఇతివృత్తంగా యువ నామ సంవత్సరం నుండి, యువ నామ సంవత్సరం దాకా వచ్చిన కవిత్వం నుండి ఎంపిక చేసిన ఆధునిక కవితలతో ఆయన వెలువరించిన యువ నుండి యువ దాకా సంకలనం, దానికి వారు వ్రాసిన ముందుమాట, ఈ భావనలను బలపరుస్తాయి.
కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి ఆ కాలంలోని మంచి కవులు, చలనచిత్ర రంగాన్ని చేరడం కద్దు. కవులకు ఛందస్సు కూడా తెలిసి ఉండటం గీతరచనలో ఒక అదనపు ప్రయోజనం. నిజానికి శర్మగారి వచన కవిత్వంలో కూడా శబ్ద సౌందర్యం చాలా చోట్ల స్పష్టంగా కనపడుతుంది. కళ్ళను ‘క్రూర కాంక్షా ఫణుల మణులవి/ ధీర వాంఛా మదన సృణులవి‘ అన్నప్పుడూ, తనకిష్టమైన గౌతమీ తీరాన్ని, ‘కలల తళుకు టలల వణుకు గోదావరి గళం తొణికి/ కథలు కథలుగా గీతులు గగనంలో మెదులుతాయి‘ అని వర్ణించినప్పుడూ, ఆ శబ్ద, లయజ్ఞానం మనకూ అర్థమవుతుంది.
తనపై ఎంతో ప్రభావం చూపిన కృష్ణశాస్త్రిగారి పంథాలోనే, ఇంద్రగంటి కూడా చలనచిత్ర రంగాన్ని చేరి, చెవుల్లో తేనె సోనలు నింపే గీతాలను వ్రాశారు. పద్య సాహిత్యంలోనూ కృషి చేసి ఉండటం వల్ల, స్వతహాగా లయజ్ఞానం ఉండటం వల్ల, మీటర్‌కు వ్రాయడం శర్మగారికి కష్టమైన విషయమేమీ కాలేదు. కవి కావడం వల్ల చేయగలిగిన గారడీ ఒకటి కలిసి, ఆయన వ్రాసిన చలన చిత్ర గీతాలను గుర్తుండిపోయేలా చేసింది. విపరీతమైన అధ్యయనం వల్ల ప్రోది చేసుకున్న పదసంపద, పద లాలిత్యం, వెలకట్టలేని ఆస్తుల్లా ఆయన కాలూనిన ప్రతి రంగంలోనూ వెన్నంటి నిలిచాయి. విరివిగా ఒక పోలిక జనాల్లో నాటుకుపోయాక, దానిని అటుదిటు చేసి చెప్పడం కూడా ఒక్కోసారి అపూర్వమైన వెలుగునిస్తుంది. ‘తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా/ మెరుపులతో మెరిసింది వానకారు’ పాటలోని ఐంద్రజాలికత అదే. ‘కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది’ అన్నా, ‘సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ/ నీ అగులుచుక్కా సొగసు అద్దానికీసు’ అన్నా, ఈమధ్యనే వచ్చిన సమ్మోహనం సినిమాలోని పాటలో, ‘తనివాఱ నాలో వెలుగాయె/ చిరుయెండ చాటు వానాయె‘ అని వ్రాసినా, ఆయనలోని కవికి సాగిలపడటమే రసహృదయాలు చెయ్యగలిగినది. తొలినాళ్ళలోనే జంధ్యాల వంటి దర్శకుల దగ్గర సింగిల్ కార్డ్ గేయ రచయితగా నిలబడ్డా, తరువాత కాలంలో సినిమాలకు దూరంగా వచ్చి, ఆకాశవాణి ఉద్యోగంలోనే స్థిరపడిపోయారు. తన సాహితీ స్వేచ్చని హరించని వాతావరణంలో ఆయన సృజనాత్మకత రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన లలితగీతాల్లో, ‘బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే/ నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే’ ‘ఆనాటి నీపాట ఎదను తాకి గుబులు రేపు…’, ‘ఒక గాలి తేలీ ఉయ్యాలలూగీ నడిచేవా ఓ గోదావరీ’, ‘పూరింటిలో గడప పొదిగిటను నిలచి/ పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు (సూర్యుడొచ్చాడమ్మా)’ లాంటి గీతాలూ, వాక్యాలూ ఒక ఎత్తయితే, ఒకే ఒక దేశభక్తి గీతం వ్రాసినా, ఆ తేనెల తేటల బాణీ ఈనాటికీ తెలుగు బాలబాలికలందరి నాల్కల పైనా ఆడుతుండటం, వారికి మాత్రమే దక్కిన గొప్ప గౌరవం.
76’లో విజయవాడ ఆకాశవాణిలో చేరినది మొదలూ ఆయనలోని కళాకారుడి బహుముఖీయమైన ప్రజ్ఞ వెలుగులీనుతూ వచ్చింది. సంగీత సృజనాత్మక రూపకాల్లో శర్మగారూ, వారి బృందమూ జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకోవడమొక ఆనవాయితీగా మారింది. నాటక పక్రియ పట్ల తొలినాళ్ళ నుండీ అపరిమితమైన ప్రేమా, ఆసక్తి ఉన్నాయని ప్రకటించుకున్న ఇంద్రగంటి, తెలుగు నాటక రంగానికి సంబంధించి చేసిన కృషి, విమర్శ వారి సాహిత్య సృష్టి మొత్తానికీ మణికిరీటంగా నిలబడదగ్గవి. తెలుగునాట నాటకరచన తన ప్రాభవాన్ని కోల్పోవడంలో, నాటక రచన, చదువుకునేందుకు వీలుగా కాక, ప్రదర్శనకు వీలుగా ఉండాలన్న ధోరణి ప్రబలబడమొక ముఖ్యకారణమన్నది శర్మగారి ప్రధానమైన విమర్శ. పరిషత్తు నాటకాలు తెలుగు నాటక రంగానికి చేటు చేశాయనీ, నేడు ప్రతి నాటకానికీ మూల రచనా, ప్రదర్శనా ప్రతి భిన్నంగా ఉన్నాయనే ఇంద్రగంటి గమనింపు చాలా ముఖ్యమైనది.షుమారు నలభై అద్భుతమైన నాటకాలతో, అలనాటి నాటకాలు పేరిట ఆయన వెలువరించిన పుస్తకం, ఆ నాటకాలన్నింటి మూల కథలనూ, మార్పులనూ, ఆ నాటకాల గొప్పతనాన్ని వీలైనంతగా వివరిస్తూ నడుస్తుంది. మహాకవి కాళిదాస మాళవికాగ్నిమిత్రమ్ నాటకాన్ని, మాళవిక నవలగా తిప్పి వ్రాయడంలోనూ నాటకాల మీది శర్మగారి ప్రేమ విస్మరించరానిది.
ఆలోచన పేరిట శర్మ గారు వ్రాసిన సాహిత్య వ్యాసాలెంత విలువైనవో, ‘తెలుగు కవుల అపరాధాలు’ పేరిట ప్రచురించిన సాహిత్య విమర్శ కూడా అంతే విలువైనది. ప్రత్యేకించి ‘అపర కవులు -అంతరార్థశోధకులు’ వ్యాసంలో రచనను దాటి వెళ్ళి, విమర్శా స్థలాన్ని తమ ప్రతిభా ప్రదర్శనకు వాడుకునే విమర్శకులను, రచన ఎక్కడా ఉద్దేశించని అర్థాలను తమకు తాముగా వెల్లడి చేయాలని చూసే విమర్శకుల అత్యుత్సాహాన్ని ప్రశ్నించడం, ఈ బాపతుకు చెందిన విమర్శకులకు కాస్త చురుగ్గానే తగిలిన దెబ్బ.
శర్మ గారు శిలామురళి కావ్యం వ్రాశారు, మూడు కవితా సంపుటులు ప్రచురించారు, కథలు వ్రాశారు, ఎన్నో యక్షగానాలు కూర్చారు, పత్రికల్లో శీర్షికలు నిర్వహించారు, సీరియల్ వ్రాశారు. ఉపనిషత్తులకు తేట తెలుగులో, సరళమైన వ్యాఖ్యానాలు చేశారు. విశ్వగుణాదర్శము లాంటి ప్రబంధాలకు శర్మగారి తెలుగు వ్యాఖ్య చాలా అవసరమైనదీ, అరుదైనదీ, గొప్పదీ కూడా. సంస్కృత సాహిత్యానికీ, తెలుగు పాఠకులకూ వారధి నిర్మించగల వారిని ఒక్కొక్కరిగా మనం కోల్పోతూ వస్తున్నాం. పాఠకాదరణ వినా, ఇట్లాంటి శ్రమకు ఐచ్చికంగా పూనుకునేలా అటు రచయితను గానీ, ఇటు పబ్లిషర్స్‌ను గానీ ప్రేరేపించే సాధనాలు మరేవీ ఉండవు. ఇంద్రగంటి సాహిత్య ప్రస్థాన సింహావలోకనం మనకీ సందర్భంలో అందిస్తోన్న బలమైన హెచ్చరిక ఇదే. ఇన్ని సాహిత్య పక్రియల్లో ఆయన ప్రయోగాల్లా ఏవో చేయడం కాదు, ఈ పక్రియల వైవిధ్యాన్ని గుర్తించి, తన రచనలకు ఏది నప్పుతుందో విశ్లేషించుకుని, ఆ ప్రక్రియను ఎంచుకోవడం వల్ల,ఇన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రను వెయ్యగలిగారు. కవిత్వంలో ఆధునికత ఎట్లా చూపగలమో చెబుతూ ప్రస్తావించిన, పురాణమిత్యేవ నసాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యమ్‌, సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః–శ్లోకంలో మాదిరిగానే, ఆయన ప్రాచీనమైనదంతా స్వీకరించలేదు, కొత్తది కదా అని ఉదాశీనంగా చూసి దేనినీ తిరస్కరించలేదు. వివేకవంతుల్లా, అన్నింటిని గమనించి, విశ్లేషించి, ఏది ఉత్తమమైనదో దాని పట్ల అభిమానాన్ని ప్రకటిస్తూ వచ్చారు. తన రచనలన్నింతినీ ఇదే తటస్థ బుద్ధితో చూస్తూ, పునః ప్రచురణలప్పుడు కవిత్వాన్ని ఎడిట్ చేసుకున్నారు. సాహిత్యంలో అవలంబించిన ఇదే విమర్శనా దృష్టినీ, నిష్పాక్షపాత ధోరణినీ జీవితంలోనూ అనుసరించారని, ఆయన ఆత్మకథ ఇంటిపేరు ఇంద్రగంటి చెబుతుంది. ‘నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు, కానీ నాకు నేను సవరణలు చెప్పుకున్నాను’ అనడం, పుస్తకంలో పంచుకున్న విషయాలు, విజయాలు, అన్నీ కలిసి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మను దాపరికాలెరుగని, దాచాల్సిన అగత్యమెరుగని నిండు వ్యక్తిత్వంతో మన ముందు నిలబెడతాయి. తనవారైనా, వేరెవరైనా–అన్ని బంధాలనూ నిర్మోహంగా గమనించుకోవడమూ, నిస్సంకోచంగా విమర్శించుకోవడమూ, తనకు కావలసిన ఏ విషయంలోనైనా తులనాత్మకంగా ఆలోచించుకుని, రాజీపడని ధోరణితో నిర్ణయాలు తీసుకోవడమూ–అది ఉద్యోగం కావచ్చు, చదువూ, పెళ్ళీ కావచ్చు; కుటుంబ సభ్యులతో బంధాలు కొనసాగించుకోవడమో, తెంచుకోవడమో కావచ్చు; సాహిత్య ప్రభావాలు కావచ్చు; జీవితం, ఉద్యోగం తనకు అందించిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ తన ప్రతిభను ఇష్టానుసారంగా మలుచుకోవడం లాంటి విశేషాలు ఇంద్రగంటి ఆత్మకథ పట్ల ఆకర్షణను కలిగిస్తాయి.
మర్రి చెట్టు నీడలో మరే వృక్షమూ ఎదగదంటారు, ఆ ఛాయలను దాటుకుని తనదైన విద్వత్తుతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఇంద్రగంటి ప్రతిభ తెలుగు సాహిత్యానికి కొత్త సొబగులద్దిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన తొట్ట తొలి కావ్యమైన శిలామురళిని తండ్రికి అంకితమీయడంతో మొదలై, అటుపైన తన జీవితంలో సింహ భాగంగా స్థిరపడ్డ ఇంద్రగంటిసాహితీ ప్రస్థానం, చిట్టచివరి కవితను తన తండ్రి పేరిటే ‘ఏరు దాటిన కెరటం’గా ప్రచురించడంతో ఒక ఆవృతాన్ని పూర్తి చేసుకుని నిండుతనాన్ని సంతరించుకుంది.
కొండరాళ్ళ మీద నుండి
వర్షధారలు జారిపోయినట్టు
ఎన్నేళ్ళు గడిచాయో కదా!
అయినా కొండగొప్పు మట్టి చుట్టూ
మొలిచిన పచ్చగడ్డి పువ్వులంటి
మీ జ్ఞాపకాలు!
జీవితంలో మీరు వదిలేసిన ఖాళీలను పూరించడానికో
మీ ప్రేమ వైఫల్యాలు, భగ్న స్వప్నాలూ,
తనివితీరని లోకాలోకనాలు
సమీక్షించడానికో
బహుశా నా ఈ కొడుకుతనం!
అంటారా కవితలో.
హద్దుల మధ్య జీవితం
జబ్బులా వార్ధక్యంలా,
బెంగ పుట్టిస్తుంది కాబోలు!
అందుకే, మనస్సు ఇంకా ఇంకా
వెన్నెల రెక్కలు తొడుక్కుని,
ఆకుపచ్చని యౌవన వనాల వైపు
పరుగులు తీస్తుంది!
అంటారింకొక కవితలో.

అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.

21 August, 2019

మారిన పాట

గొంతులో,
చీకటి కొసలు తగిలి
ఆవహించిన మత్తు.

“ఇంకొక్కటి…”

ప్లే లిస్ట్‌లో తరువాతి అంకె.

“మనం మొదటిసారి కలిసినప్పుడు
కాఫీషాప్‌వాడు వినిపించిన పాట!”

జ్ఞాపకాల అలికిడికి
చలించే వర్తమానం.

పెదవి మెత్తదనం పెదవే తేల్చే ఉసురు
శాంతించీ సర్దుకునీ లేచే వేళకి
నిదుర చాలని కన్నుల్లో
పట్టలేనంత వెలుగు.

ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…

తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?

నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశాన్ని ఆగి అడగడమా!

ఇప్పుడు చుట్టూ తిరుగుతున్న పాట
ఇప్పటిదో రేపటిదో
ఈ క్షణానికి తెలుసా?

పోనీ నీకు?


*తొలి ప్రచురణ: ఈమాట, జులై-2019 సంచికలో..

16 July, 2019

మీకు తెలియందేం కాదు

మంత్ర నగరి ఒకటి
పిలిచి పిలిచి లాక్కెళుతుంది

ఆ ఊరి పొలిమేరల దగ్గరే ఆకాశం
పాత డైరీల్లోని కాగితాలతో ఆహ్వానమందిస్తుంది

కాళ్ళను పట్టి లాగి అక్కడి నది
వయసు వెనక్కు మళ్ళే మందేదో నోట్లో వేస్తుంది. 

మలుపు మలుపుకీ జ్ఞాపకాలక్కడ
గుర్తులుగా ముద్రించబడి ఉంటాయి

ఏనాడో సగంలో వదిలేసిన రాగాలను
వీధులు వేయి నోళ్ళతో వినిపిస్తుంటాయి

రాతి కొండల హృదయాల్లో పేర్లు,
చెట్ల తొర్రల్లో రహస్యాలు, అక్కడ
భద్రంగా దాచబడి ఉంటాయి

ముక్కలుగా లోలో మిగిలిన అనుభవాలన్నీ
ఒక్కరిగా రూపు కట్టి అడుగడుక్కీ హత్తుకుంటాయి

ఊపిరాడటానికీ, ఊపిరాగడానికీ మధ్య
పోగేసుకునేదల్లా ఆ కౌగిట్లో దక్కిన పరిమళం

మీకు తెలియందేం కాదు,
తొలిప్రేమ ఒడిలో ఆడించిన మంత్రనగరికి వెళితే

ప్రతి ఉదయమూ కొత్తకలల సంతకమవుతుంది
ప్రతి రాత్రీ మోహపు వెన్నెలలో మేల్కొనే ఉంటుంది.

తొలి ప్రచురణ - 2019, జులై సారంగ తొలిసంచికలో


02 July, 2019

అమ్మ వెళ్ళిన రాత్రి


మళ్ళీ నాలుగు రోజులకు సరిపడే దోసెల పిండీ,
డబ్బాల నిండా కారప్పొడులూ,
కొత్తిమీరా, గోంగూరా పచ్చళ్ళూ..
అమ్మ ఊరెళుతూ కూడా
కొంత కష్టం నుండి తప్పించే వెళ్తుంది.
పగిలిన తన పాదాల కోసం
నే కొన్నవన్నీ వదిలేసి,
విరిగిపోతున్న గోళ్ళకు అద్దుకోమని
నేనిచ్చిన రంగులన్నీ వదిలేసీ,
కొంత దిగులునీ, కొన్ని కన్నీళ్ళనీ
నాకు వదిలేసి
అమ్మ వెళ్ళిపోతుంది
మళ్ళీ వస్తానుగా అన్న పాత మాటనీ
ఏమంత దూరం, నువ్వైనా రావచ్చులెమ్మనీ..
తనను కరుచుకుపడుకున్న నా చెవిలో
ధైర్యంలా వదిలేస్తూ,
నన్నిక్కడే వదిలేస్తూ
అమ్మ వెళ్ళిపోతుంది.
అమ్మ వెళ్ళిన రాత్రి,
నిద్ర పిలువని రాత్రి,
బాల్కనీలో తీగలను పట్టుకు
ఒక్కదాన్నీ వేలాడుతోంటే,
ఆరలేదని అమ్మ వదిలిన చీర
చెంపల మీద తడిని ముద్దాడి పోతుంది.
మసకబారిన మొహాన్ని దాచుకోబోతే
అద్దం అంచు మీద అమ్మ బొట్టుబిళ్ళ
తన కళ్ళతో సహా కనపడి సర్దిచెబుతుంది.
అలవాటైన అమ్మ పిలుపు వినపడక
ఖాళీతనమొకటి చెవులను హోరెత్తిస్తోంటే
తను పిలిస్తే మాత్రమే పలికే ఇళయరాజా పాట
రింగ్‌టోన్‌లా ఇల్లంతా మోగిపోతుంది.

( * ప్రచురణ: తెలుగు వెలుగు, జులై 2019 )

28 June, 2019

ఊపిరి

స్టాపర్‌ను తోసుకు తోసుకు
మూతపడాలనుకునే తలుపులా
నీ తలపు తోసీ తోసీ
లోకాన్నంతా నెట్టేస్తుంది.

లోపలి ప్రపంచంలో
నువ్వూ నేనూ.
ఆపే బలం గురించి అడుగుతారు వాళ్ళు-

ఈదుతూ ఈదుతూ మధ్యలో
గాలి కోసం తల తిప్పినట్టు
ఏ పని చేస్తున్నా నీకోసం వెదుక్కోవడం
ఊపిరి నిలిపే వ్యాపకం నాకు.

31 May, 2019

పలుకుసరులు (చిన్నపిల్లల కోసం తెలుగు పద్యాలు)

ఇంట్లో పసివాళ్ళుంటే కాలమెట్లా పరుగులు తీసేదీ తెలియను కూడా తెలియదు. వాళ్ళ చివురు ఎరుపు పాదాలను బుగ్గలకు ఆన్చుకుని ఆ మెత్తదనానికి మురిసిపోవడాలూ, ఇంకా తెరవని గుప్పిళ్ళలో వేలు ఇముడ్చుకుని మైమరచిపోవడాలూ, పాలుగారే చెక్కిళ్ళనూ, పాలు కారుతుండే పెదవి చివర్లనూ చూస్తుండిపోవడాలూ ..వీటిలో పడితే చూస్తూ చూస్తూండగానే రోజులు వారాలు, వారాలు నెలలూ అయిపోతాయి. బోర్లాపడితే బొబ్బట్లు, పాకితే పాయసాలూ, అడుగులకు అరిసెలు, పలుకులకు చిలకలూ – దివ్యంగా వాళ్ళ పేరన పంచుకు తినడాలైపోతాయి. పొత్తిళ్ళలో పడుకుని అమ్మ చెప్పే కథలన్నింటికీ ఊఁ కొట్టడాలతో, తొట్టిగిలకలకేసి కాళ్ళను విసురుతూ ఉక్కూ ఉంగాలతో, ఉంగరాల జుత్తు మీద అందీ అందని చేతులు జోడించి “ఓవిందా” పెట్టడంతో, అత్తా తాతా అమ్మా నాన్నా..బోసి నవ్వులు, బుజ్జి బుజ్జి మాటలతో తోసుకుంటూ తోసుకుంటూ ఏడాది రివ్వున గడిచిపోతుంది.
ఇదిగో..ఈ ఏడాది నుండీ రెండేళ్ళ కాలం భలే గడ్డు కాలం. ఇంకా నడక కుదురే రాలేదని మనమొక వంక బెంగపడుతోంటే, వాళ్ళు మాత్రం అన్ని దిక్కుల్లోనూ పరుగులు తీసి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తారు. వాళ్ళ అత్తిరిబిత్తిరి మాటలు అర్థమయ్యే లోపే ఇంకో పది ప్రశ్నలు మన దోసిట్లో పోస్తారు. ఆ వయసులో బట్టలు ఇట్టే పొట్టైపోయి నెల తిరిగేసరికి మరిక వాడటానికి వీలుకానట్టు, వాళ్ళకు నేర్పేవి కూడా ఇట్టే పాతబడిపోతునట్టు ఉంటాయి. ఏది చెప్పినా కళ్ళింతలు చేసుకు వినే వాళ్ళ ఆసక్తీ, ఎలా చెప్పినా ఇట్టే నేర్చుకుని వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఆడే పద్ధతీ చూస్తే, రోజూ రాత్రి వేళ మనమూ వాళ్ళ కోసం ఏదో ఒక హోంవర్క్ చేసి తీరాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేస్తాం.
కానీ, ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమీ తెలియవు కాబట్టి ఏమైనా చెప్పచ్చు కానీ, అన్నీ రుచులనూ పరిచయం చేసే వయసు కాదు. కనీసం రెండేళ్ళైనా వస్తే, “నీ పాద కమల సేవయు..” అంటూ ఓ దణ్ణం పెట్టుకుని, భాగవత పద్యాలో, శతక పద్యాలో, శ్లోకాలో మొదలెట్టవచ్చు కానీ..ఈ లోపో?
అదుగో, అప్పుడు తెలుస్తుంది తంటా! మనకసలు తెలుగులో ఈ వయసు వాళ్ళకు నేర్పేందుకు ఏం ఉన్నాయి?
“తారంగం తారంగం” అంటూ వాళ్ళ చిన్మయ రూపాన్ని చూస్తూ చెప్పినంత సేపు పట్టదు, చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడానికి. అటు పైన “చేత వెన్నముద్ద” చేతిలో పెడతామా, గుటుక్కున మింగేస్తారు. “చందమామ రావె” అంటూ రాత్రిళ్ళైతే రామకథను కూడా గరిపి జోకొడతామనుకోండీ! “బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళితివీ..” అంటూ రెండు చేతులతో అమాంతం ఎత్తుకుని గాలిలో ఊయలూపబోతే, తోటమాలి వస్తున్నట్టే దూకి తుర్రుమంటారు వాళ్ళు. ఈ లోపు తొలకరులు పడితే వానావానా వల్లప్పా అంటూ వాకిలంతా చుట్టబెడతారు కూడా.
“ఒప్పులకుప్పా వయారి భామా” నాకు వెగటుగా అనిపిస్తుంది ” రోట్లో తవుడు, నీ మొగుడెవరు” అన్న మాటలూ చంటివాళ్ళ నోట్లో వినడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. “బుర్రు పిట్ట బుర్రు పిట్ట” పాటతోనూ ఇలాంటి ఇబ్బందే. చంటిపిల్లలకి “మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది” అన్న సంగతెందుకో, కోరి వాళ్ళకి మొగుడి చేత మొట్టికాయ తినేవాళ్ళ గురించి నేర్పడమెందుకో, అందులో సరదా ఏమిటో అస్సలు అర్థం కాదు. పాడబుద్ధీ కాదు, పిల్లలకు నేర్పబుద్ధీ కాదు.
ఇట్లాంటి ఆలోచనలతో, కొన్ని మంచి తెలుగు పాటలు, పద్యాలు, సరదాగా సాగే వాటి కోసం చూస్తూన్నప్పుడు, మిత్రులొకరు ఒక పుస్తకం పంపారు. పారనంది శోభాదేవి గారు వ్రాసిన ఈ చిన్నపిల్లల పద్యాల పుస్తకం పేరు “పలుకుసరాలు”.
చూడగానే పిల్లలకు నేర్పాలనిపించేలా, కొన్ని పద్యాలు చాలా బాగున్నాయి. తేలిక పదాలతో వెనువెంటనే ఆకట్టుకున్నాయి.
మచ్చుకి కొన్ని:

సెనగ బెల్లపచ్చూ
తినగ తినగ హెచ్చూ
చిన్ని పొట్ట నొచ్చూ
డాక్టరపుడు వచ్చూ
చేదు మాత్రలిచ్చూ”
అలాగే ఆటల్లో ఆటగా తెలుగు అంకెలు కూడా నేర్పేయవచ్చు
“ఒకటీ రెండూ మామిడిపండూ
మూడూ నాలుగూ పారా పలుగూ
ఐదూ ఆరూ కొబ్బరి కోరూ
ఏడూ ఎనిమిది పాకం చలిమిడి
తొమ్మిదీ పదీ లడ్డూ బూందీ”
అలాగే “ఎవరా పాప” కూడా ముద్దుగా ఉంది.
చెంపకు చారెడు ముద్దుల పాపా
పొంగిన బూరెల బుగ్గల పాపా
చిట్టీ చిట్టీ నడకల పాపా
నవ్వుల పువ్వుల వెన్నెల పాపా”
ఆ పాప ఎవరో కనుక్కోమనడం, అమ్మ చెప్పననడం – ఊహ అందంగా ఉంది. ఎత్తుకుని పిల్ల చెంపలను చెంపలకానించుకున్న బొమ్మ అందంగా అదే పేజీలో అమరిపోయింది. ఆడపిల్లల అమ్మలందరూ హాయిగా నేర్పుకోగలిగిన మరొక ముచ్చటైన పద్యం “పావడా”. 
పుస్తకంలో ప్రాసలు మరికాస్త అందంగా అమరితే బాగుండని అనిపించింది. కొన్ని పద్యాలు మరీ పెద్దవైనాయి. అవి నేర్పడం పెద్దవారికీ, అంత పద్యాన్నీ వల్లె వేసి ఆటగా చెప్పుకోవడం పసివారికి, ప్రయాసవుతుంది. ఇట్లాంటి పుస్తకాలకి అటువంటి లక్ష్యం ఉంటుందని ఊహించలేం కనుక, ఆ పెద్ద పద్యాలను మినహాయించి ఉండవచ్చుననిపించింది. పుస్తకానికి పేరుగా పెట్టిన “పలుకుసరులు” పద్యం నిరుత్సాహపరిచింది.  ఎక్కువ పద్యాల్లో పిల్లలు రోజువారీ జీవితాల్లో చూసే వాటిని చొప్పించడం బాగుంది. ఆ పదాలు దొర్లినప్పుడల్లా పిల్లలకు ఒక కుతూహలపు చూపుతో వాటికి చెవులప్పగిస్తారు. అలాగే, వీలైనన్ని జంతువులూ, పిట్టలను  పద్యాల్లో ప్రవేశపెట్టడం కూడా పిల్లల ఆసక్తుల పట్ల రచయిత్రికి ఉన్న గమనింపుని పట్టి ఇస్తాయి. పుస్తకం పొడుగుతా, ఒక్క పద్యంలో పిల్లల పేర్లకు మినహాయిస్తే, ఒక్క సంయుక్తాక్షరమూ పడకపోవడం గొప్ప తెరిపినిస్తుంది. ఈ విషయంలో రచయిత్రి శ్రద్ధకు అభినందనలు.
ఐదేళ్ళ లోపు తెలుగు పిల్లలకు లేదా ఆ వయసు పిల్లలున్న పెద్దవాళ్ళకు, ఇలాంటి పుస్తకాలు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్‌ల జాడ్యం దండిగా అంటుకుపోయింది కనుక, పిల్లలకు ఈ తరహా పుస్తకాలిస్తే అవే చేతులు మారి పద్యాలు నోళ్ళల్లో నానుతుంటాయి. ఐ.పాడ్ లేనిదే అన్నం తినమని మొండికేస్తున్న పిల్లలకూ, అది ఇస్తే తప్ప అన్నం పెట్టలేని అమ్మలకూ ప్రయత్నిస్తే ఇలాంటి పుస్తకాలు, ఈ కొత్త రాగాల్లోని కొత్త పద్యాలు, కనీసం కొన్ని పూటలకైనా ప్రత్యామ్నాయంగా నిలబడగలవు. కొత్తదనాన్ని పిల్లలు ఆహ్వానించినంత సాదరంగా మనం ఆదరించలేం. ఈ సాహిత్యం వాళ్ళది కనుక, వాళ్ళకు అందజేసే బాధ్యతొక్కటీ మనది.
*తొలిప్రచురణ: పుస్తకం.నెట్ లో..

పారనంది శోభాదేవి, “పలుకుసరులు”,
వెల: 65/-,
మంచి పుస్తకం ప్రచురణలు,

ఫోన్: 9490746614

13 May, 2019

మే రెండో ఆదివారం వంకన..

బాగా ఇష్టమైన వాళ్ళను కళ్ళు మూసుకుని ఊహించుకుని వెనువెంటనే చూడటం దాదాపు అసాధ్యమనీ, వాళ్ళలా కనపడాలంటే, వాళ్ళతో గడిపిన క్షణాల్లో బాగా ఇష్టమైన సందర్భాలను తల్చుకుంటూ, కెమెరా ఫోకస్ మార్చినట్టు మెల్లిగా వాళ్ళ మీదకు చూపు మరల్చుకోవడమొక్కటే మార్గమనీ, ఒకసారెవరో చెప్పారు.
ఆ ఆటలో నిజానిజాలు నాకూ తెలియవు కానీ, అలా అమ్మను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఫ్లాష్‌కార్డ్స్‌లా గుర్తొచ్చే జ్ఞాపకాలైతే కొన్ని ఉన్నాయి.
*
చిననాటి ఉదయాలన్నీ దాదాపు ఒకే విధంగా గడిచేవి. గట్టిగా హారన్లు మోగిస్తే వినపడే ఐదో నంబరు రూట్‌లోని వాహనాల రొద, గాలికి ఎగిరే గుమ్మం దగ్గరి కర్టెన్లను దాటుకుని లోపలికి రానే వచ్చేది. తెలవారుతూండగానే వచ్చే నారాయణ (సూర్యుడు కాదు, మా చాకలి) సందులో పంపు దగ్గర బట్టలు బాదుతూ ఉండేవాడు. కుకర్‌లు చుయ్ చుయ్ మంటూ ఈలలు వేస్తూనే ఉండేవి. మూడు ఈలల లెక్క మా ఇంట్లో ఎన్నడూ లేదు, సరిగా పని చెయ్యవని మేమనుకునే ఆ కుకర్ ఈలల లెక్కేమిటో మా అమ్మకొక్కతికే తెలుసు. గిన్నెలు, గరిటెల చప్పుళ్ళు అవిశ్రాంతంగా వినపడుతూనే ఉండేవి. ఆకుకూరలమ్మొచ్చే వాళ్ళు బుట్టలతో గుమ్మాల ముందు ఆగి పేర్లన్నీ ఏకరువు పెడుతుండేవారు. పాలవాళ్ళో, మరొకళ్ళో, ఏదో ఒక ఇంటి ముందు నుండీ పిలుపులూ, వాటికి సమాధానాలూ సందళ్ళతో, ఉదయాలెప్పుడూ మోయలేని హడావుడితోనే ఉండేవి.
ఇంతటి రసాభాసలో వంటింటి గుమ్మం దగ్గర, కత్తిపీట మీద కూర్చుని ముక్కలు తరిగిపోస్తూ, నేను పొద్దున్నుండీ చదివినవన్నీ అప్పజెప్పించుకునేది అమ్మ. నేను గొంతెత్తి అన్నీ చెప్పడం, తను వింటూ సరిదిద్దడం, వెనుక వెనుక తిరుగుతూ, పొయ్యి పక్కకెళ్ళి నిలబడితే, పోపు చిటపటామంటుదని చేయి చాపి తానడ్డుండటం..మొత్తం పాఠమంతా చెప్పేస్తే తన తడి చేతులంటకుండా నన్నే ముందుకు వంగమని ముద్దీయడం..
*
చాలా చిన్నప్పుడు, అమ్మ బెజవాడ పక్కనున్న నిడమానూరులో పని చేస్తున్నప్పుడు, బడికీ మా ఇంటికీ చిన్న బల్లకట్టు దూరం మాత్రమే ఉండేది. సాయంకాలాలు నేను ఆ స్కూల్‌గ్రౌండ్‌లోకి పరుగు తీసి ఆడుకునే వేళల్లో, దూరంగా ఒక మూలకి ఉన్న కోర్టులో టీచర్లు బాడ్మింటనో టెన్నికాయిటో ఆడుతూ కనపడేవారు. కొంగులు నడుం చుట్టూ తిప్పుకుని కోర్ట్ అంతా చకచకా పరుగులెడుతూ వాళ్ళాడుతుంటే, అంత పెద్ద గ్రౌండ్‌లో ఏ మూలనున్నా వాళ్ళ అరుపులు, కేరింతలు వినపడేవి. సంజెకెంపులు ఇక మొదలవుతాయనగా నేను దుమ్మోడుతోన్న బట్టలతోనే స్టాఫ్‌రూంకి వెళ్ళి బ్యాగ్ తెస్తే, అదే గుర్తుగా తాను కోర్ట్ నుండి బయటకు వచ్చేది. ఐదంటే ఐదే నిముషాల్లో ఇల్లు చేరేవాళ్ళం. తాళం తీస్తుండగానే మా ఆకలి కేకలు మొదలయ్యేవి. మాతో పాటే కాళ్ళు చేతులూ కడుక్కునే అమ్మ, మేం సర్దుక్కూర్చునేలోపే పొద్దుటి అన్నంలో పులిహోర పోపు కలపడమో, ఓ ఆవకాయ ముక్కతో దోశలో చపాతీలో, జీలకర్ర, ఉల్లీ,పచ్చిమిర్చీ వేసి పొద్దుటి ఇడ్లీపిండితో ఓ దిబ్బరొట్టో సిద్ధం చేసి చేతిలో పెట్టేది.
నారింజ రంగు ఆకాశం, విశాలమైన అరుగు మీద అక్కా, నేనూ తగువులాడుకుంటూ తినడం, వెనుక విశ్రాంతిగా టీ తాగుతూ పొద్దున వదిలేసిన పేపర్ చదువుతూ అమ్మా...
*
తాను గుంటుపల్లి్‌లో పని చేసేప్పుడు, ఒక్కోసారి సాయంకాలాలు ఇద్దరం బస్సులో కలిసేవాళ్ళం. నా చేతిలోని వైరు బుట్ట, భుజాల మీది బ్యాగు అందుకుని, నన్ను పక్కన కూర్చోబెట్టుకునేది. సున్నబ్బట్టీల దగ్గర బస్సు దిగితే, ఓ ఐదూ పది నిముషాల నడక మా ఇంటికి. కూరల కొట్లో కావాల్సినవి సంచీలో వేయించుకుని, వైరు బుట్ట ఊపుకుంటూ బళ్ళో కబుర్లు చెప్పుకుంటూ, ఒక్కోసారి ఏమీ మాట్లడుకోకుండానూ - నేను గబగబా నాలుగడుగులు వేసినప్పుడల్లా నన్ను తన ఎడమవైపుకు తెచ్చుకుంటూ నా దగ్గరికి వస్తూ -
సైకిళ్ళూ, స్కూటర్లూ, స్కూల్బస్సులూ, సిటీబస్సులూ, అన్నీ రయ్యిరయ్యిన పోయే ఆ చిన్న రద్దీ రోడ్డు మీద, ఒక నిలువు గీత గీసి అది మా ఇద్దరికీ రాసిచ్చినట్టు, తానూ-నేనూ..
*
చిన్నప్పుడు బాగా దెబ్బలు పడేవి నాకు. అన్నం తినలేదనే ఎన్నో సార్లు..
ఎనిమిది దాటేదాకా ఇడ్లీలను ముక్కలుముక్కలుగా తుంచీ, పాలను చుక్కకొక్కటిగా ఉన్న నాలుగు కుండీల్లోనూ, తులసి మొక్కలోనూ వొంచీ (తప్పే..అప్పుడు తెలీదు..) ఐ.టి.ఐ గ్రౌండ్‌లోకి అరటిపళ్ళని విసిరేసి (ఈ పాపం అప్పుడే పండిపోయి, జన్మభూమి కింద ఊరంతా ఊడ్చి వచ్చేవాళ్ళం  ) ఏవేవో తిప్పలు పడుతుండేదాన్ని.
ఎనిమిందింపావు దాకా "అయిందా?" "తిన్నావా?" "నే వచ్చానంటే వీప్పగిలిపోతుంది.." "కానీయాలి త్వరగా.." - ఇట్లా ఆ గదిలో నుండి ఈ గదిలోకి తిరుగుతూ అమ్మ అరిచే అరుపులు చెవిన పడుతూనే ఉండేవి. అయినా ముద్ద దిగేది కాదు. చివరికి ఉరిమి ఉరిమి చూస్తూ నా మీదకొచ్చి, ఆ ఇడ్లీ ముక్కల ప్లేటు సింక్‌లో పడేసి, అప్పుడే దించిన అన్నంలో తోటకూర పప్పు, చారెడు నెయ్యి వేసి కలుపుతుంటే, ఆ అన్నం మెతుకుల వేడి అమ్మ వేళ్ళ మీదే చల్లారి నా నోట్లో గోర్వెచ్చని ముద్ద జారేది.
నేనలా మొండి వేషం వేసిన ప్రతిసారీ, చల్లారిన కాఫీ గొంతులోకి వొంపుకుని పరుగు తీసే అమ్మ...
*
గన్నవరం జిల్లా పరిషద్‌ హై స్కూల్‌లో లో రిటైర్మెంట్. మైక్ ముందు నిలబడి ముప్పయ్యారేళ్ళ ఉద్యోగ జీవితాన్నీ, దానిని ఒరుసుకుంటూ పోయిన ఉద్యోగపరమైన అనుభవాలనీ, జ్ఞాపకాలనీ, నింపాదిగా చెప్పుకుపోతోంది. నీరెండలో పద్ధతిగా బాసెంపట్టు వేసుకుని కూర్చున్న వందల మంది పిల్లలకు వెనుకగా నిలబడి, ఫొటోలు తీసుకుంటున్నాను. సభ ముగిసింది. పూలదండలు చేతుల్లోకి మార్చుకుంటూ స్టేజ్ దిగి వస్తోంది, అమ్మని అందుకుంటూ అక్క. తరువాతి ప్రోగ్రాం వివరం చూస్తూ, చెబుతూ నానగారు. ఓ తొమ్మిదో తరగతి పిల్లవాడికి ఏం తోచిందో..పరుగు పరుగున దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకుని మాట్లాడుతున్నవాడల్లా ఉన్నట్టుండి ఒక చేత్తో కళ్ళు రుద్దుకుంటూ బావురుమన్నాడు.
కెమెరా అసమర్థత అర్థమైన క్షణం...వాళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తూండిపోయాను.
ఏం జరుగుతోందో అర్థం కాక అవాక్కై, అంతలోనే బిగ్గరగా నవ్విన అమ్మ...
*
జ్ఞాపకమున్న ప్రతి సందర్భం వెనుకా, నాకూ అబ్బితే బాగుండనుకునే గుణాలున్నాయి, నిర్లక్ష్యం చేయకూడదని తెలీక చేసిన తప్పులున్నాయి. అమ్మంటే ఓపికనీ, అమ్మంటే సహనమనీ, అమ్మంటే ఆకలెరుగనిదనీ, విశ్రాంతి కోరనిదనీ అందరిలాగే అమాయకంగా నమ్మిన అబద్ధాలున్నాయి. ఆ అమాయకత్వాన్ని క్షమించిన అమ్మ దయ ఉంది.. మన పశ్చాత్తాపం, మన క్షమాపణలు అమ్మ కోరదేమో కానీ, కాలం చెవులు మెలివేసి మరీ నేర్పిస్తుంది. చెప్పిస్తుంది.
అమ్మకు కోపం తెలీదని కాదు. తన మౌనంతోనే మనం తలపడలేని యుద్ధం చెయ్యగలదని తెలీకా కాదు. "చెంపకు చేయి పరంబగునపుడు కంటికి నీరు ఆదేశంబగు.." అన్న సూత్రం వంటబట్టిస్తే మిగిలినవన్నీ నేర్పడం తేలికని తెలియనిదనీ కాదు. కానీ, జ్ఞాపకంగా ఇవి మాత్రమే ఉండే బాల్యాన్ని ఇవ్వనందుకు అమ్మకు ఆలింగనాలు.
ఏపూటకాపూట మారిపోయే తెలిసీతెలియనితనాల లెక్కలు పక్కనపెడితే, ఊహ తెలిసిన నాటి నుండీ, ఇప్పటి దాకా, "ఇది మాత్రం నిజం" అనిపించిందేమైనా ఉందా అంటే..ఉంది.
అది, అమ్మ ఇచ్చే ధైర్యమే ఇప్పటికీ నా సంతోషానికి మొదటి మెట్టవడం.
అమ్మ సంతోషమే నా ధైర్యమవడం!
Happy Mother's Day!!  

13 April, 2019

ఈ చలి ఉదయం..

చుక్కలు పొడిచిన నొప్పిని వెన్నెల నవ్వుల మాటున భరించే రాతిరి, సౌందర్యవతి, ప్రేమమూర్తి అయిన రాత్రి, సోమరిగా కూలబడిన నన్ను ఊరడించాలని చూసీ చూసీ అలసిపోయింది. తన కోమలశీతలస్పర్శ నా నుండి దూరం జరిగిపోతోందన్న స్పృహ కలిగేసరికే ఆలస్యమైపోయింది. తన నీలోత్తరీయాన్ని నా వేలికి ముడివేసి, ఆమె వెళ్ళిపోయింది. నీడలునీడలుగా కొన్ని మాటలింకా ఇక్కడే తచ్చాడుతున్నాయి. నీటిబుడగల్లాంటి కలల్లో నిజాన్ని వెదుక్కునే పనిలో పడ్డ నన్ను కాలం ముల్లులా గుచ్చి మేల్కొల్పుతుంది. పల్చని పసుపు వెలుతురు కూడా కళ్ళకు భారమైపోతుంది. వసంతోత్సవైశ్వర్యం పొందకుంటే నిరుపేదలేనన్న మాటలు తల్చుకుని, బెంగటిల్లే హృదయం బయటకు చూస్తుంది. ఇంకా రాలని మంచుముద్దై శిశిరం అద్దపు తలుపుల అంచులను పెనవేసుకుని నిద్రిస్తూనే ఉంది. లేఎండ పొడకు మెల్లిగా కరిగిన మంచుపొర ఒకటి ఎండుకొమ్మని వెలిగించి జారిపోతుంది. రాదారుల మీద ఉప్పురాళ్ళనూ మంచురవ్వలనూ వేరు చేసి చూడలేని చూపు నిశ్చలత్వాన్నెరుగని లోలకమై కదిలి అలసిపోతుంది. బాహ్యస్పృహని వదిలించుకుని సౌందర్యంలో లీనమైపోలేని శాపంతో, వచ్చేపోయే వాహనాల వెలుగుల్లో చిక్కుపడి ఆలోచన కదిలిపోతుంది. విసురుగా తగిలి, అద్దాలను ఊపేస్తుంది గాలి. కంపించీ కుదురుకునే హృదయం పట్టుబడని రహస్యాల కోసం ఊపిరి బలంగా తీసుకుంటుంది. చూపుడువేలితో అద్దాల మీద దారులు గీసుకుని, ఆకశపు  సౌందర్యం ఆ హద్దులు దాటి విస్తరించడాన్ని చూపులతో వెంబడిస్తుంటాను. అంతూదరీ లేని అందమంతా సొంతమయ్యీ కానట్టుంటుంది. ఆగీఆగి ఉబికే ఆనందం ఏ దిక్కు నుండి వస్తుందో నాకే అర్థం కాకుండా ఉంది. నీకూ ఈ పద్యమర్థం కాకుంటే, ఈ చలి ఉదయంలో తలుపులు తీసి, నిన్ను నా పక్కకు ఆహ్వానించడం వినా మరేమీ చెయ్యలేను. ఎందుకంటే, ఈ ఉదయం నాకున్నదంతా ఈ చిన్ని అద్దపు తునక! దీని మీద నీకోసమేమీ ఈవేళ రాయలేనిక!

09 April, 2019

ఈ నెల ఈమాట సంపాదకీయం గురించి:


"సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని" ఈ నెల ఈమాట సంచికలో వచ్చిన రచనలన్నింటికి labels/Tags తీసేసి ప్రచురించారు. ఇలా చెయ్యడం వల్ల, రచనను రచనగా చూడటం అలవాటవుతుందన్న ఆశ ఉందని కూడా చెప్పారక్కడ.
నిజంగానే కొన్ని రచనలను చదివినప్పుడు, వీటిని కథ అని ఎందుకు అన్నారు/ వీటిని కవితగా ఎందుకు ప్రచురించారు అని సందేహం కలుగుతూ ఉంటుంది. రచనల నాణ్యతతో పాటు, కొత్తగా కనపడ్డ ప్రతిదానికీ మనసు అంత తేలిగ్గా అలవాటు పడకపోవడమొక కారణం. స్వాతి కినిగె్‌లో అనుకోకుండా రాసే రోజుల్లో, మొదటి నెలల్లో "మీరేదో సగం సగం రాస్తున్నట్టు ఉంది, అవి కథలు కదా, ఇంకాస్త పొడిగించి రాయండి, ఇంకొంచం స్పష్టంగా రాయండి" - అని గొడవపడటం నాకింకా గుర్తుంది. కానీ, ఆ శీర్షిక ముగిసేవేళకి అవి నాకు ఉన్నవున్నట్లుగానే ఎంతగానో నచ్చాయి. ఆ చెప్పీచెప్పనితనం, కథకీ కవిత్వానికీ మధ్య ఊగిసలాడే గుణం ఆ శీర్షికని క్రమం తప్పకుండా చదివేలా చేశాయి. అదే శీర్షికతో అంతకు మునుపే నందకిశోర్ "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో ఒక ప్రత్యేక భాగాన్ని ప్రచురించినప్పుడు, దాన్ని కవిత్వంగా చూసేందుకు మరో ఆలోచన లేకుండా సన్నద్ధంగా ఉండటం, దాన్ని మొదటే "కవిత్వం"గా చేతుల్లోకి తీసుకోవడమేనా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. "నేనొక కథ చెప్తానిప్పుడు/రాశాను" అని చెప్పి మరీ చదివించే కొందరి కథల్లో ఆ వాక్యమే మొదటి ఇబ్బందిగా ఉండిపోవడం నాకైతే చాలా సార్లే అనుభవం. బ్లాగుల్లో చాలా కాలం రాసినవాళ్ళు, తరచుగా వాడే మాట ఒకటుండేది -"ఇది కథగా రాయాల్సిందండీ, దీన్ని ఇలా వదిలేశారేమి?" అన్నది. ఆ మాటను చాలాసార్లు ఆ రచనకు పొగడ్తగానే వాడేవాళ్ళు తప్ప, నిజంగా ఏవో మార్పులు చేసెయ్యమన్న అర్థంతో కాదు. "కథ" అన్న పేరు తగిలించి ప్రచురించమన్నది మాత్రమే చాలామంది సలహా. ఒక రచనను ఏ చీటీలూ లేకుండా చదివి అభినందించేశాకా, దాన్ని పాఠకులే ఒక ప్రక్రియగా గుర్తుపట్టాకా, మళ్ళీ దాన్ని పనిగట్టుకుని ఒక అరలోకి తొయ్యాల్సిన పనేముంది?
చాలా స్పష్టంగా ఇది కథ/వ్యాసం/కవిత్వం అని గుర్తుపట్టగలిగేలా ఉండే రచనలు కొన్ని ఉంటాయి. వాటిని పక్కనపెడితే, అసలు రచనలకు ఈ పక్రియలన్న పేర్లు పెట్టడం బొత్తిగా అనవసరమనీ, పెట్టకపోతేనే బాగున్నదనీ నాకు బలంగా అనిపించేలా చేసిన రచన: నేను ఈ మధ్యనే చదివిన "రియాలిటీ చెక్". ఆ పుస్తకం గురించి రాస్తూ, అరవై భాగాలుగా సాగిన ఆ విడి విడి రచనలను కథలనాలా వద్దా? అన్న మాట దగ్గరే నేనెంతో ఆలోచించాల్సి వచ్చింది. పరిశీలనా వ్యాసాలు అన్న మాట వాడాను కానీ, ఎన్నో భాగాల్లో జీవిత చరిత్రలే ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన మనుష్యుల కథలున్నాయి. తెలంగాణా వంటల గురించి రాసిన భాగమొక్కటీ నాకు నచ్చలేదు, అది ఆ పుస్తకంలో లేకుంటే బాగుండనిపించింది, నిజానికి ఇమడలేదనిపించింది. దానిని రిపోర్ట్ అనాలేమో అనిపించింది. అలా వేరే పేరు స్పురించడంతోనే దానిని వేరుగా చూడటం మొదలైంది. ఏ రచన కా రచన ఒక "సర్ప్రైస్ ఎలిమెంట్" ని మోసుకుంటూ వచ్చినందుకే ఈ పుస్తకం నాకింత నచ్చిందని చెప్తున్నా, ఇందులో కొన్ని కథలు అని నేను ఏ ప్రయత్నమూ లేకుండానే గుర్తుపట్టగలిగాను. అదే నేను, మళ్ళీ ఇదే రచయిత "చింతకింది మల్లయ్య" కథల సంపుటిగా ప్రచురిస్తే, అందులో "శ్రీమతి దినచర్య" ని చదివి, ఇదేదో రియాలిటీ చెక్‌లో ఉంటేనే బాగుండేది, కథలా అనిపించడం లేదనుకున్నాను. ఈయన రాసేవే మళ్ళీ ఈమాటలో "స్వగతం" శీర్షికన వస్తోంటే, ఆ label ఎంత చప్పగా ఉందో అని ఎప్పుడూ నిరుత్సాహపడిపోతుంటాను. అలా చూస్తే, ఈ పేర్లూ, వీటితో ముడిపడిన మన అంచనాలూ మన పఠనానుభవం మీద చూపిస్తోన్న ప్రభావాన్ని పూర్తిగా విస్మరించనూ లేమనిపిస్తోంది. ఇంతేనా, లేదూ, ఒక పత్రిక లేదా పుస్తకంలో ప్రచురణలంటే మనకున్న గౌరవమూ, అవి కొన్ని ప్రమాణాలని అందుకోవాలని మనకున్న ఆశా, అక్కడి రచనలను అతిగా పరీక్షించేలా చేస్తున్నాయా? ఫేస్‌బుక్‌లోనో, బ్లాగులోనో, అరకొర వాక్యాలైనా ట్విటర్‌లోనో రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనమింతగా రచనా ప్రక్రియల పేర్లని గమనిస్తున్నామా, అవీ ఇలా కొన్ని ప్రమాణాలతో ఉండాలని అనుకుంటున్నామా? నేనైతే అనుకోను, బహుశా అందుకే, ఈ ఈ మాధ్యమాల్లో రచనలని ఇంకా ఇష్టంగానే చదువుకుంటాను కూడా. చాలాసార్లు, వీటిలో నిజాయితీ కూడా నచ్చుతుంది, ఒక అనుభవాన్ని ఒక రచనాప్రక్రియగా మార్చడంలో జరిగే చిన్నపాటి కల్తీని దాటుకుని వచ్చి మనముందు ఉన్నందుకనుకుంటాను. సౌమ్య రాసిన మెట్రోకథల్లో ఒక కథలో, రెండు బోగీలు కలిసే ఇనుపచప్టా మీద కూర్చుంటే అలల దగ్గర కూర్చున్నట్లుందని అంటాడొకబ్బాయి. ఆ ఎపిసోడ్ ఎంత ఇష్టంగా, ఆశ్చర్యంగా, దిగులుగా చదువుకున్నానో. ఈ కథలకి పేర్లు కూడా పెట్టలేదామె.
ఈమాట ప్రయోగం వెనుక ఉన్న ఆలోచన నచ్చింది. పోతే, ఎక్కడైనా, ఎప్పుడైనా మనం దేన్నైనా సర్దుకునేది వీలు కోసం. వెదుక్కుంటే తిరిగి తేలిగ్గా అందుకోవడం కోసం. నెల గడిచాకైనా, వీళ్ళు ఈ నెల రచనలకు చీటీ తగిలించి దాస్తారా లేక సంచికను సంచికగానే చదువుకోమంటారా చూడాలి. 

06 April, 2019

ఉగాది శుభాకాంక్షలు

బాగా చిన్నప్పుడు, ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాది పొడుగూతా అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందనే నమ్మకం గట్టిగా ఉండేది. ఆ రోజు బాగా శ్రద్ధగా చదువుకుంటే, ఏడాదంతా అంతే శ్రద్ధగా చదువుకోవచ్చుననమాట. ఆ రోజు నవ్వుతూ ఉంటే, ఏడాదంతా సంతోషమే. ఆ రోజు అల్లరి చేసి తన్నులు తింటే, ఇదీ పూటపూటా జరిగే వ్యవహారమయిపోతుందన్నమాట. ఒక్క రోజుతో ఏడాది కాలాన్ని కట్టెయ్యడమనమాట! ఎంత తేలిక! ప్రయత్నమూ అక్కర్లే, ప్రాయశ్చిత్తమూ అక్కరలే! ఇంకొంచం పెద్దవాళ్ళమయ్యాక, ఆ రోజు చిన్నపాటి FriendshipDay కూడా అయింది. ఇష్టమైన వాళ్ళందరినీ, ఫోనులోనో, విడిగానూ, కుదిరితే రెండు రకాలుగానూనో కలుసుకోవాలి, రోజూ చెప్పుకునే కబుర్లే అయినా చెప్పుకోవాలి. అదొక కనపడని వాగ్దానం. నమ్మకంలా కనపడే ఇష్టం. చిరుచేదులు తగిలిన ఏడాదుల్లో ఎప్పుడైనా ఈ నమ్మకాలను ప్రశ్నించాలనిపించేది కానీ, మొత్తంగా చూస్తే మటుకు నాకిది ఇష్టంగానే ఉండేది. ఈ ఏడు రుచికరమైన ఉగాది పచ్చడి రహస్యం కూడా తెలిసినట్టే ఉంది :) (మావిడి ముక్కలు తరుగుతూ, పక్కింటి మామ్మగారి కొమ్మకున్న వేప పూవు దూసి తెమ్మంటే కొమ్మలు విరగొట్టుకు తెచ్చి, ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదుతూ తెలతెల్లని లేత పూరేకులు విదిల్చినప్పుడు తెలీలేదు గానీ, డాలర్లు పోసి కొన్న వేపమండల్లో పూవెక్కడా అని వెదుకుతుంటే ఇంకా చాలా రహస్యాలే తెలిసాయ్ ;) ) 
సరే, మన ఊహలని కదిలించడానికీ, కలవరపెట్టడానికి, చుట్టూ ప్రపంచం ఏదో కుట్ర పన్నుతోందని అన్ని దిక్కుల నుండీ అందరూ వాపోతున్న ఈ రోజుల్లో - ఒక్క రోజంతా మనం ఎలా అనుకుంటే అలా ఉండగలమన్న నమ్మకమూ, అవకాశమూ ఇచ్చే ఉగాది మంచిదే కదా! ఏడాదంతా సాగబోయే స్నేహానికి నా తరఫు మొదటిమాటగా - అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు! :)

20 March, 2019

చంటిపిల్లల చేతుల్లో ఫోన్లు

ఫొటోల కోసం చంటిపిల్లల అమ్మలు ఆత్రపడరు. ఆత్రపడరు అంటే తీసుకోరు అని కాదు, తీసుకున్నవి చూసుకోలేరు, బయటి మనుష్యులతో పంచుకోలేరు. మేం ముగ్గురమే ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి గుర్తుగా ఉంటుందని ఒక ఫొటో తీయమని దారిన పోయే పుణ్యాత్ముడిని పిలిచి ఫోన్/కెమెరా వాళ్ళకిచ్చి ఫొటోలు తీయమని అడిగేప్పుడు, ఒకటికి నాలుగు సార్లు ఫోటోలు క్లిక్కుమనిపించండని చెప్పడం రివాజైపోయింది. అంతా చేసి, అందులో కొన్నింటిలో నా చూపుడు వేలు నా పిల్లాడిని కెమెరా వైపు చూడమని బతిమాలుతూ ఉంటుంది. అవెలాగూ blur అయిపోయి ఉంటాయి, దాచుకు చూసుకునేందుకు పనికిరావు. ఇంకొన్నింటిలో బుజ్జాయి మా వైపు తిరిగిపోయి ఇద్దరినీ ప్రశ్నలడుగుతూ ఉంటాడు - ఆ ఫలానా ఆంటీ/అక్క/అంకుల్/అన్నయ్య మన ఫోన్ ఎందుకు తీసుకున్నారని. మేమిద్దరం కెమెరా వైపు చూడ్డం మానేసి, మా వాడికి చరిత్ర విప్పి చెబుతూ ఉంటాం; 'మన ఫొటో తీయడానికే కన్నులూ, నువ్వు ఇలా 'ఈ..' అని నవ్వావంటే మన ఫోన్ మనకిచ్చేస్తారూ' అని. ఈ లోపే వాడు మా మాటలు గాలికొదిలేసి పరిసరాల్లో వాడు కొత్తగా మరిదేన్నో గమనించిన ఉత్సాహంలో చంకలోంచీ దూకబోతుంటే దొరకబుచ్చుకుని, '- పోనీ నువ్వు తీసుకో' అనో - 'ఇలా తే, నా మాటైతే వింటాడు వాడు' అనో అనుకుంటో , అనిల్, నేనూ మాలో మేమే కబుర్లాడుకుంటూ ఉంటాం. ఇవి కూడా ఫొటోలకెక్కిపోతూనే ఉంటాయ్. ఎలాగోలా అన్ని గొడవలూ సద్దుమణిగి, ఇప్పుడు రెడీ అనబోయేంతలో ఆ ముందరి క్షణాల్లో ఎప్పుడో మొదలెట్టిన అకారణ కన్నీళ్ళ ప్రహసనానికి ముక్కు కారిందని మా వాడి బుజ్జి బుర్ర కనిపెట్టి, నా చున్నీనో, చీర కొంగో చటుక్కున లాక్కుని ముక్కు తుడిచేసుకుంటాడు లేదూ వాడి ముక్కుని నా భుజాల మీద చరచరా రుద్దేసుకుంటాడు. ఫోటోలో "నో, నీ కర్చీఫ్" అని నోరంతా తెరిచి అరుస్తున్న నా మొకమే ఉంటుంది. ఆయా ఫొటోల్లో నేను వాణ్ణి దించేయబోతూ మళ్ళీ అసలలా ఎందుకు నిల్చున్నామో గుర్తు తెచ్చుకుని వెనక్కు లాక్కోబోతూ ఉంటాను. వీటినీ దాచుకోలేమని మీకీసరికే అర్థమయిపోయింది కదా! సరే, ఆ గండమూ దాటుకుని 1-2-3 రెడీ అని చెప్పి తీసుకున్న ఫొటోల్లో నేనూ, అనిల్ ఇద్దరమూనో ఎవరో ఒకరమో కళ్ళు మూసేసుకుంటాము. ఫొటోలు తీసే వాళ్ళు "ఓసారి చూసుకోండి, ఇంకోటి తియ్యమంటారా పోనీ?" అంటారు కానీ, అపటికి ఎంతసేపటి నుండీ సాగుతోందా భాగోతం! సిగ్గే కదా! 'పర్లేదండీ, థాంక్యూ!' అని కృతజ్ఞతా భారంతో ఒకింత వంగి చెప్పి గబగబా అక్కడి నుండి పక్కకి కదులుతాం.  లేచి నిలబడ్డాకా, అసలు వీడి జ్ఞాపకాలన్నీ కెమెరాలో కాదు, మన గుండెల్లో ఉండాలి అని కొత్త పాట పాడినా పాడతాం.

ఈ రోజు ఫోన్ మెమరీ ఫుల్ అని నా ఫోన్ ఏడ్చి మొత్తుకుంటోందని కాస్త ఫొటోలు గట్రా backup తీసుకుందామని కూర్చున్నాను. అవన్నీ తీసేయాల్సినవే తప్ప దాచుకునేవి కాదని తొందరగానే తెలిసింది. మా వాడివో మావో కాలి బొటన వేళ్ళు, మోకాళ్ళు, మా ఫ్లోరింగ్ డిజైన్లూ, ఫేన్లూ, వీడి ముక్కుపుటాలూ, కనుబొమ్మలూ, ములక్కాడలా పెట్టిన మూతీ, గడ్డాలూ తప్ప ఏమీ లేవక్కడ. ఇక వీడియోలైతే ఎంత ఓపిగ్గా చూడాల్సి వచ్చిందో! ఆ నలనల్లటి స్క్రీన్ మధ్యలో నుండి ఏమైనా మహత్తర సన్నివేశాలొస్తాయేమో, నా పిల్లాడి బాల్యం నేను భద్రపరచకుండా చెత్తబుట్టలో వేయొద్దు వేయొద్దనుకుంటూ ఏ క్షణాన్నీ వదలకుండా కళ్ళప్పజెప్పాను. ఎక్కడో చివర్లో " నువ్ ఫోన్ ఎప్పుడు పట్టుకున్నావ్ నాన్నా" అని ఆశ్చర్యంగా, కోపంగా అరిచే నా గొంతూ, "ఇప్పుడేగా అమ్మా" అని అమాయకంగా పలుకుతోన్న వాడి పసి గొంతూ తప్ప ఏమీ లేవక్కడ! 

04 March, 2019

అర్బన్ ప్రపంచాన్ని మోహరించిన కొత్త చూపు


పూడూరి రాజిరెడ్డి గారి "రియాలిటీ చెక్" పుస్తకం గురించిన నా ఆలోచనలు కొన్ని..ఈవేళ్టి ఆంధ్రజ్యోతి- వివిధలో..

http://www.andhrajyothy.com/artical?SID=727585

14 February, 2019

ఇప్పుడంతా ...

డెస్క్ దగ్గర కూర్చుంటే,
కళ్ళకడ్డం పడుతూ -
స్టికీ నోట్స్.

చెయ్యాలనుకున్నవీ, చెయ్యలేకపోతున్నవీ.
అడుగున ఎక్కడో నీ సంతకం. 
మాటలతో పనిలేని గురుతులూ.

"నీకేమైందసలు?" 

ట్రిప్ అడ్వైజర్స్, గ్రూప్ ఫొటోస్
అరణ్యాలు, సముద్రాలు
పగలో రాత్రో, నిద్రపోని ఆకాశాలూ
నీ కళ్ళల్లో..

"ఏయ్! ఎక్కడున్నావ్" 

*
"ఎట్లా తయారయ్యావో తెలుసా!?" 

అడుగులకడ్డం పడే బొమ్మలు
పిల్లాడి అల్లర్లకి కుదురుకోని ఇల్లు. 

అద్దం మీద 
రవ్వలురవ్వలుగా రాలిపడే మంచు
ఎదురుగా నువ్వు. 

లోకం మన్నిస్తుంది. 
నిన్నూ నన్నూ,
ప్రేమనూ..

*

30 January, 2019

పిన్ని

"మేనమామల ముద్దు మేలైన ముద్దు.." అని లోకంలో ఓ మాటుంది కానీ, నన్నడిగితే పిన్ని ముద్దును మించిన ముద్దు ఈ లోకంలోనే లేదు. కావాలంటే మా అక్క పిల్లలను సాక్ష్యానికి పిలుస్తా. :)

పిన్ని రోల్ పలకడానికీ, వినడానికీ, చూడటానికీ చాలా తేలిగ్గా కనపడుతుంది కానీ, నిజానికి కాదు. అసలు అన్నాళ్ళూ చిన్నవాళ్ళుగా కొద్దో గొప్పో మనకంటూ ఉన్న పేరుని ఎత్తుకుపోవడానికి ఒకరొస్తారా, (నాకైతే ఒకేసారి ఇద్దరు.) కళ్ళ ముందే జరిపోతున్న అన్యాయానికి నోరెత్తడానికి ఉండదు. ఉన్నట్టుండి ఇంట్లో పార్టీలు, ప్రయారిటీలు మారిపోతుంటాయ్. చెప్పకేం, "నేనో అరగంట పడుకుంటానే...వీళ్ళు లేస్తే నన్ను లేపవా" అని నిద్దరోతున్న నెలల పిల్లల పక్కన మనని కాపలాగా పడేసి అక్క వెళ్ళిపోతుందా, "నిదురలో పాపాయి బోసినవ్వు" చూసినప్పుడో, "ఊయలలూగి నిదురించే శిశువు పెదవిపైని పాలతడి"ని చూసినప్పుడో, ప్రేమలో పడకుండా ఎలా ఉంటాం? 

Thankless job అండీ ఇది. దాదాపు అమ్మమ్మల పక్కన తలెత్తుకు నిలబడాల్సిన రోల్. అక్కల దాష్టీకం వల్లే దక్కాల్సినంత పేరు దక్కలేదనిపిస్తుంది. కనపడ్డానికి బుడతల్లా అంతే ఉంటారు కానీ వాళ్ళ గుండెల్లో చోటు సంపాదించడానికి ఎన్ని అవమానాలు పడ్డామో ఎవరు పట్టించుకున్నారు?

మా అక్కకి కొన్ని పిచ్చి లెక్కలుండేవి. పిల్లలకి స్నానాలు చేయిస్తేనూ, అన్నాలు పెడితేనూ, కథలు చెప్పి నిద్రపుచ్చితేనూ, సుసు లాంటి పనులకి నవ్వు మొహంతో వెంట వెళితేనూ బాండింగ్ బాగుంటుందని దాని అనుకోలు. 'పాతిక రూపాయల్లో ఇంతకు మించిన మహత్తరమైన దారుంది తెలుసా?" అంటే దానికి కోపం వచ్చేది.

ఓసారెప్పుడో పాపం ఎప్పుడూ ఇద్దరి పనితో సతమతమైపోతూ కనపడుతోందని, "ఈ పూట స్నానాలు నే చేయిస్తాలేవే" అని అభయహస్తం చూపించాను. ఎవరికి ఏ సబ్బో ఏ టబ్బో ఏ టవలో చూపించి మాయమైపోయింది. పది నిముషాల తరువాత ఇల్లంతా అతలాకుతలమైపోతోంది. చేసిన పాపం తెలియని అమాయకపు ముద్దాయిలా గది మధ్యలో మోకాళ్ళ మీదకు జరుపుకున్న చుడీ పాంటుతో, ముఖమంతా నీళ్ళతో నిలబడి ఉన్నాన్నేను. బట్టల్లేకుండా పిల్లలిద్దరూ అరుపులు. పరుగుపరుగున వచ్చింది మా అక్క.

"ఏం చేశావ్?"

"వాళ్ళనడగవే?"

"పసివాళ్ళు వాళ్ళేం చెప్పగలరు?" 

"అమ్మా, పిన్ని హర్ష టవల్ నాకిచ్చింది, సబ్బు వద్దంటున్నా నాకు పూసేసింది. గదిలో ఎ.సి ఆపు చలి అంటే వినట్లేదమ్మా" టపాటపా నేరాలు చెప్పేశారు.

అదప్పటికే ఫేన్‌లూ యె.సి లూ ఆపేసుకుంటోంది. 

"అంత ఇర్రెస్పాన్సిబిల్‌గా ఎలా ఉంటావే? పిల్లలకు చలేస్తుందని తెలీదూ?"

"రిమోట్ కోసం వెదుకుతున్నా.."

"షటప్"

**
ఒకరోజు ఎనిమిదింటివేళ ఎవరో మెడికల్ రిపోర్ట్స్ చూడమని తెచ్చారు. పిల్లలని నిద్రపుచ్చడానికి వెళ్ళిన అక్కని బయటికి పిలిచి, నేను చూసుకుంటాలే పిల్లలని, నువ్వెళ్ళుపో అన్నాను.

ఆ మాట వింటూనే వంటంతా అయిపోయినా వంటింట్లోకి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ. కొంచం అనుమానం వచ్చింది నాకు. నాన్నగారి వైపు చూస్తే, సరిగానే ఉన్న న్యూస్‌పేపర్లు బొత్తంలా బయటకు లాగి నీట్‌గా వరుసలో పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ మార్చిమార్చి చూశాను.

" ఒకటికి రెండు కథలైనా చెప్పు. బావ వచ్చేసరికి పిల్లలు పడుకోవాలి. తెలిసిందా?" హుకుం జారీ చేసి డాక్టర్ గారు వెళ్ళిపోయారు.

నాలోని రైటర్ సగర్వంగా పాక్కుంటూ పాక్కుంటూ వాళ్ళ దుప్పట్లోకి దూరింది. 

"చెప్పండి, ఏ కథ కావాలి మీకు?" 

ఇద్దరూ సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన పదాలు వాళ్ళు కీ-వర్డ్స్ లా విసిరేస్తున్నారు. ఆ కాంబినేషన్ అందుకోవడం నా లాంటి బచ్చా రైటర్ తరం కాదు. 

నేనే పంచతంత్రం కథలందుకున్నా. నేను మొదటిలైన్ చెప్పేసరికే వాళ్ళు గోలగోలగా కథంతా చెప్పేస్తున్నారు.  ఇలా కాదని భాగవతం కథలందుకున్నా.  అక్కడా అదే తంతు. గజేంద్రుడుని ఎలిఫెంట్ కింగ్ అనీ, క్రోకోడైల్ క్రూయల్ అనీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీషు పదాలతో ఈ కథా ఆ కథా ఒక్కటేనా అనే అనుమానం వచ్చేలా చెప్పేశారు.   

రాజుల కథలు, సిండ్రిల్లా కథలు..ఊహూ.. ఐదేళ్ళకి వాళ్ళకిన్ని కథలు అసలు ఏ టెంప్లెట్ లో చెప్పుకుపోతోందో నాకర్థం కాలేదు. అయినా వెనుదిరిగి చూడటం నా చరిత్రలోనే లేదు. 

పేర్లు మార్చేసి, కొద్దిగా-అతికొద్దిగా కారక్టెర్లు మార్చి, ఓ కొత్త కథ చెప్పడం మొదలెట్టా. కాసేపు బానే విన్నారు. బెసికినప్పుడల్లా గాల్లోంచి ఓ కొత్త పాత్రని కథలో కలిపేస్తున్నా. గాడిలో పడ్డట్టే ఉన్నారనుకునేంతలో, తలుపు భళ్ళున తెరుచుకుంది. 

తలుపుకడ్డంగా అక్క. ఇద్దరూ దుప్పట్లనెగరేసి నన్ను తొక్కుకుంటూ దాని దగ్గరకుపోయారు.

"అమ్మా, పిన్ని అన్ని పిచ్చి కథలే చెబుతోంది. ఒక్కటి కూడా కొత్త కథ చెప్పలేదు.." ఇద్దరు కుంకలూ నా మీద నేరాలచిట్టా విప్పారు.

"ఏం కథ చెప్పావే? ఒక్కపూట పిల్లలని పడుకోబెట్టలేకపోయావా, వేస్ట్‌ఫెలో"

"అది మొన్న నాన్న చెప్పిన కథమ్మా.."

పడుకోబెట్టబోయిందల్లా చిటుక్కున నా వైపు తిరిగింది.

బావా ఈ కథే చెప్పాడా? ఎలా ? హౌ?!

"అక్కా..నేన్ చెప్పింది.."

"ఏం సినిమా!!" గుడ్లురిమి చూసింది.

"జగదేకవీరుడు-అతిలోక.." - పూర్తవుతుండగానే గదిలో నుండి బయటకు గెంటింది.

తల కింద చేతులు పెట్టుకుని పక్క గదిలో హాయిగా పడుకుని ఉన్నారు అమ్మా నాన్నగారూ.

***

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందిలే కానీ, ఒకటా రెండా ఎన్నని చెప్పుకుంటాం! అసలు రహస్యమేంటంటే..
పదేళ్ళ అవిరామ శ్రమ తరువాత నాకూ ఈ బంగారు పంట చేతికొచ్చింది. :) నా పిల్లాణ్ణి ఒక్క మాటా అనకుండా ఆడించడం, వాడి అల్లరిని, వాడి స్నేహితులతో సహా నిలబడి కాచుకోవడం, 'అమ్మకు చెప్పకుండా కొనుక్కు రా పిన్నీ' అని చెవిలో మంతనాలాడటం, "పిన్ని నేను నాలుగున్నరకల్లా వస్తాను, నాకు కట్లెట్ చెయ్" అని హర్షా గాడు ఆర్డరేసి పోవడాలూ -  రెండింటి నుండీ నిద్రమానుకుని, వాళ్ళొచ్చేసరికి వేడివేడిగా వండి ప్లేట్‌లో ఇచ్చి..'బాగుందారా, గాడిదా?'  అని పక్కన కూర్చుని ఎంత అడిగినా 'ఊ' ఐనా కొట్టకుండా పెదాలు కదుపుతూ తింటూ పోతారే - అయినా మొట్టబుద్ధి కాని ప్రేమ లోకంలో పిన్నిది ఒక్కటే. :)

పిన్ని ప్రేమ అడిగితే వచ్చేది కాదు. చేయగాచేయగా వచ్చేది. :)) మంచిపిన్నులందరికీ వందనాలు. మనం లేకపోతే అక్కలేమైపోదురో!!
x

29 January, 2019

ప్రయాణానికి ముందూ వెనుక..

అటు నుండి ఇటైనా, ఇటునుండి అటైనా, ప్రయాణమంటే మనసెప్పుడూ ఒక ద్వైదీభావంతో ఊగిసలాడుతూనే ఉంటుంది. వెళ్తున్న ప్రాంతం పట్ల, అక్కడి మనుష్యుల పట్ల లేదా అక్కడి విశేషాల పట్ల ఎంత మోజుతో సంబరపడిపోతున్నా, అక్కడి అవసరాలకు తగ్గట్టు పెట్టెలు సర్దుకోవడం పట్ల అంతే విసుగుతోనూ, విరక్తితోనూ ఓ పిసరు బద్ధకంతోనూ వెనక్కు గుంజుతూ ఉంటుంది. పిల్లలు పుట్టాక, ప్రయాణాలకి అర్థమే మారిపోయింది. 'చలో ఓ నాలుగు రోజులు కిచెన్ బంద్" అనుకోవడానికి లేకుండా, పిల్లాడక్కడ తినడానికి ఏమైనా ఉంటాయో లేదో అనుకుంటూ, ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నుండే ఓ పెట్టె తెరిచి పడేసి, అందులో గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు పడెయ్యడం రివాజైపోయింది. ఆరేడు గంటల లోపు ప్రయాణాలకీ కారులోనే తిరగడం వీలనుకుంటున్నాం కనుక, పిల్లాడి మెత్తటి దుప్పట్లు, బుజ్జి దిండ్లు, వాడు ఇంట్లో తినే చిరుతిళ్ళు నాలుగు రోజుల ముందు నుండీ మళ్ళీ వండుకోవడాలూ, బిస్కట్లూ, పళ్ళూ, నీళ్ళూ, బుజ్జి ఎలక్ట్రిక్ కుకరూ - పెసరపప్పూ, బియ్యం, నెయ్యి; అమ్మో పిల్లలతో ప్రయాణం అనుకుంటూ ఒకటికి ఒకటికి బట్టల జతలు కలుపుకుంటూ పోతే చివరికి బండెడు బట్టలవుతున్నాయి. ఏది చూసినా చంటివాడికి అవసరమైతేనో అనిపిస్తుంది. వాడి దుప్పటి వాసన దొరక్క, వాడు నిద్దరొచ్చాక మంకుపడితేనో అని జాలి కమ్ముకుంటుంది. నిదురలో కదిలి వాడికిష్టమైన బొమ్మ కోసం తడుముకుని బావురుమంటేనో అన్న భయమొకటి, వాడికిష్టమైన నాలుగు బొమ్మలనీ ప్రయాణానికి లేవగొట్టేలా చేస్తుంది.  'కారేగా, మన కారేగా..' అన్న మంత్రం ఉండనే ఉంది. పెట్టెలు మోసేందుకు అనిల్ ముందుకొచ్చి " ఎక్కడికెళ్తున్నాం మనం, ఈ సామానేంటి, ఏం పెట్టావ్, ఇంత బరువేంటసలు?" అని నొసలు చిట్లిస్తే భుజాలు రుద్ది ముందుకు తోసెయ్యడమే!

వెళ్ళేప్పుడు ఒక తంతైతే వచ్చేప్పుడు ఇంకో బెంగ. మన ఇంటికో, అత్తారింటికో, స్నేహితుల దగ్గరికో, ఇష్టమైన ప్రాంతాలన్నీ చూసొచ్చాకో, పెట్టెలు విప్పుతుంటేనే మనసంతా దిగులు దిగులుగా అయిపోతుంది. బట్టలని కమ్ముకుని ఉండే అక్కడి సబ్బుల వాసనలు, అమ్మ ఇచ్చిన పొడులూ పచ్చళ్ళ వాసనలూ, పిల్లలకి, మనవలకి నాన్నలూ, మావగార్లూ ప్రత్యేకంగా చేయించి కట్టించిన మిఠాయిలూ, తినుబండారాలూ, తీపి వాసనల్లో కూడా చిరు చేదు కమ్ముకుంటూ ఇక్కడి బుడుగూ బుడుగూ బతుకుల్లోని వెలితినంతా చూపెడతాయి. వాళ్ళు కనుకొచ్చిన ఎల్.ఐ.సి పేపర్లూ, లోన్ స్టేట్మెంట్లూ - 'మెయిల్‌లో ఉన్నాయండీ' అన్నా వినకుండా పాత పద్ధతిలోనే వాళ్ళు చేసే బండెడు పనంతా, మన కోసం. మనకిదే వీలని నమ్మే వాళ్ళ ప్రేమకి సాక్ష్యం. ఎట్లా పారెయ్యబుద్ధవుతుంది, ఆ కాగితాలని? చేతులు రావు, సమయం రావాలి.

ప్లాస్టిక్ కవర్లలో ఆఖరి రోజు కుక్కిన విడిచిన బట్టలన్నీ తీసి వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటే, అక్కడి వాసనలన్నీ వదిలించుకుంటున్నట్టే ఉంటుంది. ఇంటిలో మాసిపోయిన దుప్పట్లూ, కర్ట్నెలూ, డోర్‌మేట్లూ, వేటికవి వేరు చేసి ఆపకుండా వాషింగ్ మెషీన్ లోడ్ వేస్తున్నప్పుడూ, తీస్తున్నప్పుడూ మళ్ళీ ఈ ఇంటిలో జీవితానికి మనని మనం సిద్ధం చేసుకుంటునట్టే ఉంటుంది. ఆగకుండా సాగే ఆ రొదలోనే కలిసిన వాళ్ళూ, కలవాలనుకుని కలవని వాళ్ళూ, వాళ్ళ మాటలూ, నవ్వులూ తెరల్లా చెవుల్లో వినపడిపోతుంటాయి.

వంటింటి అరల్లో పాత కాగితాలు తీసే పనిలో పడాలి, జిడ్డుపడ్డ పోపులపెట్టెను సింక్‌లో వేస్తుంటే ఆవాలు జారిపడి కాలి కింద ఎంత అడ్డొచ్చాయో. కానీ ఆవాలు పనికడ్డం అనుకుంటామా? ఫ్రిడ్జ్ వెళ్ళే ముందు ఖాళీ చేసేశామనుకున్నా ఏ పెరుగు గిన్నో, చింతపండు గుజ్జో మిగిలే తీరుతుంది. ఎండిన కారెట్లూ, ఎండి రాలిపడ్డ కరివేపాకు రేకులూ, కాగితాల్లో చుట్టి మర్చిపోయిన పుదీనా, కొత్తిమీరా కలిసిపోయి ఘాటైన వాసనొస్తూ, ఫ్రిడ్జ్. తడి బట్టా, పొడి బట్టా రెండు చేతుల్లోనూ ఉంచుకుని, తెల్లగా అన్ని అరలూ మెరిపించుకుని కొత్త సామాన్లన్నీ ఒక్కొక్కటిగా చేరుస్తుంటేనే హాలిడే అయిపోయిన భారమంతా మీద పడుతున్నట్టుంటుంది.

వచ్చిన రోజు అన్నమ్మొకటీ వండుకుని, అమ్మ ఇచ్చిన పొడులూ, పచ్చళ్ళూ, దారిలో వస్తూ తెచ్చుకున్న పెరుగు కప్పుతో భోజనమయిందనిపించే రోజులు పోయాయ్. వాటితో పాటే పాలూ, కూరలూ, పళ్ళూ కూడా బుట్టలతో దిగి రావాల్సిందే. ప్రయాణమంతా వెర్రి ఆటలాడి ఏమీ తినకుండా తప్పించుకుపోయాడనీ, బుగ్గలు ఈసరికే లోపలికి పోయాయని నాలోని అమ్మ లెక్కలు కడుతూనే ఉంటుంది. వేణ్ణీళ్ళ స్నానాలూ నిద్రలూ కన్నా, పిల్లాడు రెండు పెరుగన్నం ముద్దలైనా తిని నిద్దరోతే బాగుండు అని ఆశగా పనిలో పడటమే జీవితానికి పెద్ద మార్పు. ఏ ఊరుపోనీ, ఎవ్వరింటికైనా వెళ్ళనీ, తిరిగొచ్చి, నాలుగు చెంబుల నీళ్ళు గుమ్మరించుకుని, మడతలు విప్పి హాయి వాసనల దుప్పటినలా పరుపు మీద పరిచి, మన బాత్‌రూం, మన బెడ్‌రూంలో ఉన్న సుఖమింకెక్కడా ఉండదని చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ ఓ తోడుండటమే బతుకుని ఆని ఉన్న అదృష్టం.

ఏవేవో ఆలోచనలతో, మనసులోనూ, చేతుల్లోనూ ఇంతింత బరువుతో తాళాలు తీస్తామా? కాళ్ళు కడిగేలోపే ఇక్కడి స్నేహితులొచ్చి కూడి నాలుగు రకాల వంటలు హాట్‌పేక్‌లలో సర్ది ఇచ్చి 'హాయిగా తిని అలసట తీరేలా నిద్రపొండి, రేపటి నుండి బోలెడు కబుర్లు చెప్పాలి" అని ధనాధన్ తలుపులేసి వెళ్ళిపోతే గాడిలో పడక ఏమవుతాం? అటు నుండి ఇటు ప్రయాణమైనా, ఇటు నుండి అటు ప్రయాణమైనా ప్రయాణాలూ, పెట్టెలే బరువు తప్ప, జీవితం ఎక్కడైనా తేలిగ్గానే ఉంది.

(జీవితాన్ని వెలిగించే నేస్తాలకు, కవితకు, ప్రేమతో..)


26 January, 2019

అప్పుడూ ఇప్పుడూ

వేదాద్రి కృష్ణా జిల్లాలోని లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. అనిల్ వాళ్ళ తాతగారి తాతగారికి పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోతోంటే, ఎవరో చెప్పగా విని, ఈ క్షేత్రానికి వచ్చి మొక్కుకుంటే, అప్పుడొక్క పిల్లవాడు బతికి బయటపడ్డాడట. అప్పటినుండీ ఇంటిల్లిపాదికీ ఏటా ఇక్కడకు రావడం అలవాటట. ఏ బస్సూ రావడానికి వీల్లేని ఆ కాలాల్లో, వీళ్ళ తాతముత్తాతలు పొయ్యిలతో సహా అన్నీ అక్కడే ఏర్పాటు చేసుకుని, ఇంటి నుండీ తెచ్చుకున్న పప్పుప్పులతో, నలభయ్యేసి రోజులు అక్కడే దీక్షగా ఉండిపోయేవారట.

అనిల్‌కీ నాకూ శ్రావణమాసంలో పెళ్ళైంది. మొదటి ఏడు నోములు పట్టే వీలుంటే మానకూడదని, మాకిచ్చిన మూడు వారాల సెలవుల్లో రెండు వారాలు ఆ నోమూ ఈ నోమూ పట్టించి, శ్రావణ పట్టీ చేతిలో పెట్టి, శ్రావణ శుక్రవారాలు కానిచ్చేశారు. మూడో వారం కాస్త ఊపిరాడే వేళకి, వేదాద్రి వెళ్ళి రమ్మన్నారు. ఇద్దరం బయలుదేరాం. 

అనిల్ అప్పటికొక ఆరు నెలల ముందు నుండే తెలుసు నాకు. హైదరాబాదులో ఆఫీసు పక్కనే స్నేహితులతో తనూ, కూకట్‌పల్లి్‌లో సింగిల్ బి.హెచ్.కె లో, ఒంటరిగా నేనూ ఉండేవాళ్ళం. సాయంకాలాలు గచ్చిబౌలి దాకా వచ్చి తను బైక్ మీద ఇంటికి తీసుకువస్తే, టీ తాగి స్వాగత్‌లోనో చిల్లీస్‌లోనో కూర్చుని, పదకండింటికి వాళ్ళిక బయలుదేరమంటే కదిలేవాళ్ళం. పేపర్ నాప్కిన్స్ నిండా పేర్లూ, తారీఖులూ, అరచేతుల నిండా కలిసిన వేళ్ళ కనపడని గురుతులూ..

ఆ హైదరాబాదు రద్దీ రోడ్లూ, హడావుడీ, అన్నీ చీకట్లోకి జారి, తను నా ఇంటి ముందు మళ్ళీ దించేసరికి మమ్మల్ని చూడటానికి కొబ్బరాకుల వెనుక చందమామొక్కడూ కాచుక్కూర్చునేవాడు.  నేను పైకి వెళ్ళి బాల్కనీలోకి పరుగెడితే, మెయిన్ రోడ్ మీద స్లో అయిన తన బండీ, సొట్ట పడ్డ బుగ్గల్తో సన్నని నవ్వూ వీధి దీపపు పసుపు వెలుతుర్లో అంత దూరాన్నీ కోసుకుంటూ నాకు కనపడేవి. కొన్ని సార్లు మరీ ఆలస్యమైతే కావాలనే బండి ఎక్కడో ఆపేసి నడుచుకుంటూ ఇంటికొచ్చేవాళ్ళం. అలా మెట్ల మీద కూర్చుని, నిద్ర కమ్ముకునే వేళకి కదిలి, మళ్ళీ బాల్కనీలో నేను నిలబడితే ఫోన్‌లో ఒకరినొకరు చూసుకుంటూ మెల్లిగా చెప్పుకోవాల్సినవి చెప్పుకుని..

షాపింగ్‌లూ, పెళ్ళి కార్డ్‌లూ, ఎన్ని పనులున్నా తిరిగిందంతా హైదరాబాదే కనుక, కొత్తేం అనిపించేది కాదు. కానీ, వేదాద్రి నేను ఎప్పుడూ చూడని ఊరు. గుడిని ఆనుకుని పారే కృష్ణానది ఓ వైపు, ఉగ్రనారసింహుడు కొలువైన కొండ ఇంకోవైపు. కొండెక్కుతుంటే వందల వందల కోతులు నా మీదకే దూకుతున్నట్టుంటే, భుజాలు నొక్కి పట్టుకుని మెట్టుమెట్టుకీ వెనక్కు గుంజినట్టే తన వెనుక నడిచిపోయానప్పుడు. నదిలో దిగితే ఒడ్డునే వేలవేల చేపలు పాదాల మీద గంతులేస్తుంటే, వేళ్ళలో వేళ్ళు బిగించి పట్టు తప్పకుండా జాగ్రత్తపడ్డాను. ఆ చేపలూ, అల్లరీ - శృంగేరికి పోటీగా ఉండే దృశ్యమది. కాళ్ళు తడుపుకుంటూ ఆడినంత సేపు ఆడి, సాయంకాలం దర్శనమయ్యాకా, 'నది దాటదామా?' అన్నాడు. 

పడవ వచ్చింది. నది మీద నారింజ వెలుగులు పడుతున్నాయప్పటికే. నది మీది గాలి చల్లగా తాకుతోంది. తీరానికావల గుబురు చెట్ల మధ్య నుండీ వెనక్కు ఏదో దారి ఉంది. మమ్మల్ని దింపి మళ్ళీ ఎప్పుడు రావాలో అడిగి, పడవవాడు పరుగుల మీద ఆ దారిలోకి నడిచి మాయమైపోయాడు. ఇసుకలో కూర్చున్నాం ఇద్దరం. చిన్న చిన్న అలల్లా నీరు వచ్చి చాచిన పాదాలను తాకుతూ పోతోంది. అప్పుడొకటీ అప్పుడొకటిగా గుడి గంటల శబ్దం. గుంపుగా కొండంచును పట్టి జారే కోతుల కిచకిచలు కొన్నిసార్లు. అంతే. మనుషుల పొడ లేదు. పారిపోతునట్టే క్షణాల్లో మాయమయ్యేవి ఆకాశంలో పక్షులు. నే పాడుకున్న ఇష్టమైన రాగమొక్కటే ఇప్పటికీ నా చెవుల్లో, జ్ఞాపకాల్లో...ఏం మాట్లాడుకున్నామో గుర్తు లేదు కానీ, మొహమాటంగా వెనక్కి పోదామా అని అడగలేక పడవ దగ్గరే నిలబడ్డ మనిషి రూపు గుర్తుందింకా. జీబుగా కమ్ముకుపోతోన్న చీకట్లను చూసి కదిలాం. ఇంకో వైపు కూడా వెళ్ళచ్చనీ, ఇంకా బాగుంటుందనీ, ఈ వేళప్పుడు ప్రమాదం కనుక డబ్బులిప్పిస్తే రేపు తీసుకెళ్తాననీ హుషారుహుషారుగా అతనంటుంటే మొహమొహాలు చూసుకుని నవ్వుకోవడం కూడా గుర్తుంది. అలా అలా హాయిగా ఊగుతూ ఒడ్డుకు చేర్చింది పడవ. దిగి మెట్ల మీద నిలబడి చూస్తే, కృష్ణ మీద మెరుస్తూ తేలుతూ ఊగుతూ నక్షత్రాలు. అన్ని దిక్కుల నుండి అంతకంతకూ పెరుగుతూ కీచురాళ్ళ రొదలు. 

*

ఇన్నాళ్ళకు, నా ప్రహ్లాదుడిని తీసుకుని వెళ్ళడం కుదిరింది. ఊరికి మంచి రోడ్డు వచ్చింది, కార్లూ బస్సులూ గుడి ముందు దాకా వెళ్తున్నాయి. ఏ వేళన ఎవ్వరు వెళ్ళినా ఆశ్రయమిచ్చేందుకు, వండి వడ్డించేందుకు ఇప్పుడొక మంచి బ్రాహ్మణ సత్రమూ ఉంది. అదే నది, అదే గాలి, అదే కొండ, ఆవలి తీరాన అవే చెట్లు, మేం బిగించి పట్టిన ఇసుక. అవే కోతులు, కిచకిచలు, అల్లర్లూ, గుడిగంటల చప్పుళ్ళూ.

నా పక్కన నా వాడు. ఒళ్ళో నా పిల్లాడు. ఆ దేవుడికి మొక్కకుండా ఎలా ఉంటాన్నేను?

*

02 January, 2019

"నిమగ్న" - మైథిలి అబ్బరాజు

కవులనూ రచయితలనూ మనసు గుర్తుపెట్టుకునే తీరు చాలా చిత్రంగా ఉంటుంది. మననీ వాళ్ళనీ కలిపి బంధించే లతల మొదళ్ళు చాలా సార్లు మనమసలు గమనించుకోము కూడా. మీరు చెప్పండి, మీకిష్టమైన రచయితలను మీరెలా గుర్తుచేసుకుంటారో? నాకైతే, చూరు నుండి వేలాడే వానబొట్లు చూసినప్పుడల్లా ఇస్మాయిల్ గుర్తొస్తారు. పల్లెటూర్లో బస్సు దిగగానే కనపడే సోడాబండిని చూస్తే, శ్రీరమణ గుర్తొస్తారు. ఇసుక తిన్నెలు, ఒడ్డున ఉన్న పడవలు చూస్తే టాగోర్ చప్పున స్ఫురణకొస్తారు. ఆకుపచ్చ రిబ్బన్లు కట్టుకుని ఆకతాయిగా బడి బయట తిరిగే ఆడపిల్లలను చూస్తానా, చలం జ్ఞాపకం మెరుపులా మదిలో మెదులుతుంది; ఆ వరుసలోనే, పూరేకుల మీద వాలే సీతాకోకచిలుకలను చూసినప్పుడు, మైథిలిగారి రచనలు...   
*
సారస్వతవ్యాసాలూ, నోట్స్ కలిపి 230 పేజీల సంకలనంగా మైథిలి అబ్బరాజు గారి "నిమగ్న" ప్రచురింపబడి రెండేళ్ళు కావస్తోంది.  సౌందర్యమూ, సున్నితత్వమూ - ఈ రెండూ మైథిలిగారి రచనలను ఇట్టే పట్టిస్తాయి, సునాయసంగా ఆ రచనల్లోకి మనని తీసుకునిపోతాయి. ఆ పదాల్లోని మృదుత్వమూ, ఆ భావాల్లోని నైర్మల్యమూ ఇట్టే కట్టిపడేస్తాయి కూడా. కానీ, ఆ సౌందర్యస్పృహ అలవాటయ్యాక మెల్లిగా అర్థమవుతూ వచ్చేది మాత్రం సునిశితమైన గమనింపులూ, అవి చెప్పేందుకు ఎంచుకున్న విధానమూ. లెక్కకు బహుతక్కువగా ఉన్న వ్యక్తిగత అనుభవాలను పక్కన పెడితే, వాసికెక్కిన ఎందరో కవుల, రచయితల రచనల గురించి విపులమైన, విలువైన వ్యాసాలు, ఈ పుస్తకంలో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ, ఆయా రచనల మంచి చెడ్డలను విడగొట్టి వివరించి చర్చించిన విమర్శలు కావు. నచ్చినవన్నీ ఏకరువు పెడుతూ వ్రాసిన సమీక్షా వ్యాసాలూ కావు. ఆయా పుస్తకాలను తానెలా సమీపించారో, ఎలా ఏ కారణాలకు దగ్గరయ్యారో ఎన్నదగిన కారణాలేవో మాత్రం ఆసక్తికరంగా చెబుతూనే వచ్చారు.  నిజానికి, ఇందులో ఉన్నవెక్కువ భాగం సుప్రసిద్ధ రచనలే కనుకా, విమర్శా ధోరణిలో ఆయా రచయితలు/రచనల గురించిన వ్యాసాలు వెలువడి ఉన్నాయి గనుకా, వారి గురించైనా, వారి రచనల గురించైనా ఇప్పుడు కొత్తగా కొత్త పాఠకులకు చెప్పేందుకు మైథిలి ఎంచుకున్న పద్ధతే బాగుంటుందని నాకనిపించింది. 


ఈ పుస్తకంలో వినపడే గొంతు స్థిరమైనది, అంతకు మించి స్థిమితమైనది. పగలు చదివిన పుస్తకాల గురించి రాత్రి నిద్రమానుకుని వ్రాసిన ఆలోచనలు కావీ వ్యాసాలు. ఇందులో ప్రస్తావించబడ్డ రచనల్లో చాలా మటుకు రచయిత ఎన్నోసార్లు చదివినవి, మరికొన్ని చిననాటి నుండి పరిణత క్రమాన్ని పరిశీలించుకుంటూ పునశ్చరణ చేసుకున్నవి. అంటే, వీటి వెనుక రమారమీ ముప్పై నలభయ్యేళ్ళ సాహిత్యానుభవం ఉంది, పునఃపునః పఠనాల ద్వారా రచనలను స్వంతం చేసుకున్న అధికారంతో, కొత్త లోచూపుతో మరో తరానికి ఆ రచనను పరిచయం చెయ్యగల ప్రజ్ఞా ఉంది. ఆ  ప్రజ్ఞా, సుదీర్ఘ సాహిత్యప్రయాణానుభవమూ ఆమె పదాల్లో తొణికిసలాడుతూనే ఉంటాయి. ప్రధానంగా శాంతరసంలో స్థిరపడ్డ ఆలోచనలు, ప్రతిపాదనలు, గంభీరమైనవి, ఒక్కోచోట చర్చకు తావిచ్చేవీ. ఆ స్వరఛాయల నుండి బయటపడి మరొకలా ఆలోచించడానికి మనకు కొంత వ్యవథి పడుతుంది. అది ఇబ్బంది కాదు, పాఠకులుగా మనకు మనం సాధించుకోవాల్సిన మెలకువ.


ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన రచనలన్నీ, 90' ల తరువాతి పిల్లలకు బహుశా పూర్తిగా కొత్తవి, అడుగూ చూపూ కూడా వెనక్కి మళ్ళించుకుని చూడవలసినవీ, చదువవలసినవీ. సాహిత్య విలువలపరంగా ప్రాసంగికత చెడని రచనలే ఎంచుకోబడటం నేను ఈ పుస్తకంలో గమనించిన ముఖ్యమైన విషయం. సాహిత్యపఠనంలో మనిషిమనిషికీ భిన్నమైన వైఖరులుంటాయి. సాహిత్యం వెలుగును చూపేదై ఉండాలనీ, చీకట్లోకి నెట్టేది కారాదనీ అనుకున్నవారిగా, మైథిలి గారి రచనలు ఏ పక్షానికి చెందుతాయో తేలిగ్గానే ఊహించగలం. కరుణ ఉన్న రచనలున్నాయి గానీ, జీవితపు చీకటి కోణాలపై పట్టుపట్టి వెలుగు ప్రసరింపజేసిన రచనలేవీ ఈ పుస్తకంలో నాకు తారసపడలేదు. కనుక, తేలిక మాటల్లో చెప్పాలంటే, హృదయాహ్లాదకరమైన రచనలు, మాటలు మాత్రమే మనమిందులో ఆశించగలం. ఈ స్పష్టత పాఠకులకు ఒక వెసులుబాటు. ఇచ్ఛాపురపు జగన్నాథరావు కథలు, బాలాంత్రపు రజనీకాంతారావు గేయాలు, ఆచంట 'నా స్మృతిపథం' వంటి వారి రచనల్లోని నాజూకుదనాన్ని, ఆయారచయితల సౌందర్యాన్వేషణని స్పష్టంగా చూపెట్టడం ఎంతగానో ఆకట్టుకుంది. వీలు కుదిరినచోటా, అవసరమైన చోటా, ఆ కాలపు పోకడల మీదుగా సాగిన వ్యాఖ్యానం అదనపు సొబగు.

నేను ప్రధానంగా కవిత్వాన్ని ప్రేమించే మనిషిని కనుక, కృష్ణశాస్త్రి, రజనీకాంతారావు, మరికొన్ని ఆంగ్లకవితల వ్యాఖ్యానం ఇష్టంగా చదువుకున్నాను. "నవ్వు చూడు తుమ్మెదకి, పువ్వు పువ్వు కోసమయి, ఆ ధూర్తపు కదలిక అంత ఝుమ్మంటూ ఉందెందుకు?" అంటూ మోహలాలసని ఒలికించిన ఆరాధనా గీతాలను కూడా తరచితరచి ఈ కవయిత్రి మాటల్లో చూసుకున్నాను, భద్రపరుచుకున్నాను.  పత్రికల్లో కవితల సంపుటి మీద వ్యాసం వచ్చిందంటే, అన్నింటి గురించీ మాట్లాడాలన్న తాపత్రయంతో, మోయలేని బరువుతో, కవితలోని అందమంతా తాము ఆస్వాదించలేకా, ఒకవేళ ఆస్వాదించినా తిరిగి ఆ మేరకు పాఠకులకు అందివ్వలేకా సతమతమవుతున్నారనిపిస్తుంది మనకాలపు సమీక్షకులు, విమర్శకులు. ఒక కవిత మనని నిజంగా తాకినప్పుడు, దానిలోని అక్షరమక్షరం గురించి తాదాత్మ్యతతో చెప్పుకోనిది, అదేమి స్పందన?  ఫేస్‌బుక్‌లో  ఈ మధ్య మిత్రులు కొందరు నచ్చిన కవితల గురించి తమ తలపోతల నుండి ఎన్నో విషయాలతో పెనవేసి కవితనూ, అది తమను కుదిపిన అనుభూతిని, తద్వారా ఆ కవితల్లోని ప్రత్యేకతలనీ ఎంతో గొప్పగా చెబుతున్నారనిపిస్తుంది. అది, ఆ కవిత గుర్తుండిపోయేలా చేసే పద్ధతి.
*

'నా విశ్వనాథ' అంటూ విమర్శలతో సహా ఆయన్ని స్వంతం చేసుకుని, ఆ మాటను బహిరంగంగానే ప్రకటించారామె.  అయితే విశ్వనాథవారిని ఇంతింత అన్న కొలతలతో బంధించడానికో లేదా అట్లా ఉన్న కొలతల నుండి విముక్తుణ్ణి చెయ్యడానికో కాక, కొన్ని మెరుపుల్లాంటి పద్యాలు వివరించి వదిలేశారీ రచయిత. ఏమిటీ పద్యాల ప్రత్యేకత? ఇవి పదహారణాల తెలుగు పద్యాలు. తెలుగు నుడికారాన్ని పాదాల్లో కుదుర్చుకున్న పద్యాలు. భయమో భక్తో ఆయన రాసినదేమిటో మనసులోకి పూర్తిగా ఎక్కించుకోకుండానే 'ఏదేదో రాసేరులెమ్మని' దూరం పెట్టేసే పాఠకులకి - ఇలాంటివి చదివినప్పుడు కొత్తగా ఆశ్చర్యమూ, కుతూహలమూ కలిపి మొదలవుతాయి. ఆ సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయి. నిజానికి ఏ సాహిత్య వ్యాసమైనా చెయ్యాల్సిన మొదటి పని సాహిత్యాన్ని పాఠకలోకానికి దగ్గర చెయ్యడమే కదా! గుణదోషచర్చలూ, విమర్శలూ అవన్నీ అటుపైని మాటలే. ఒక ఇజాన్ని నెత్తిన పెట్టుకోవడమో లేక ఖండించడమో మాత్రమే పనిగా పెట్టుకునే సమకాలీన సాహిత్య వ్యాసాలు ఏం చెయ్యలేకపోతున్నాయో, ఈ వ్యాసాలు నా మీద నెరిపిన ప్రభావం ద్వారా తెలుసుకున్నట్టైంది. Robert Frost గురించి వ్రాసిన సుదీర్ఘమైన వ్యాఖ్యలోనూ ఇట్లా కవినీ పాఠకులనీ ఒక చోట కూర్చి 'చదివిచూడండ'ని చెప్పే ప్రోద్బలమే కనపడింది నాకు. నిజానికి ఈ ఎడమే, ఈ సౌలభ్యమే నాకు గొప్ప తెరిపినిచ్చింది. 

"మజ్జారే! చక్కిలిగిలి బుజ్జాయికి
బొజ్జ మీద ముద్దిడుకొన్నన్
బొజ్జ గలవేమో బుజ్జికి
ముజ్జగముల కిలకిలారు ముద్దుల నవ్వుల్" ,
"పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండుకొనును,
నీవేమో పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు!"

శ్రమపడకుండానే అర్థమయ్యే ఇట్లాంటి పద్యాలూ, వాటికి మైథిలి గారి వ్యాఖ్యానమూ చూశాకే నేనూ కల్పవృక్షం పద్యాలు చదువగలనన్న నమ్మకం కుదిరింది. అన్నీ అర్థమయిపోతాయని కాదు- అర్థం చేసుకోవడానికి ఒక మొదలూ, వెదికేందుకొకింత బలమూ, నాకు "నిమగ్న"లో దొరికాయి.  అలాగే, హృదయాహ్లాదిని కుందమాల, తప్పనిసరిగా చదువవలసిన మరొక వ్యాసం. రాముడి వ్యక్తిత్వాన్ని, సీత పట్ల అతని అనురక్తినీ ఎంత గొప్పగా ఈ వ్యాసంలో పొందుపరిచారో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. వివాదాల అయోధ్యా రాముడి ప్రస్తావన ఇప్పుడిక్కడ అప్రస్తుతమే కానీ, నేను అంటున్నదల్లా ఒక పాత్రగా రాముడిని ఎట్లాంటి ప్రేమికుడిగా చిత్రించారో గమనించమనే.  
"సుఖము నందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై(ఆమె) ఆత్మయందున్నది. దోషమునకుగాని, గుణమునకుగాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది."  - అన్న మాటలు ఏ ప్రయత్నమూ అక్కరలేకుండానే నా మనసులో ముద్రించుకుపోయాయి. 
*
"ఏమీ లేని గగనం లో హరివిల్లొకటి విరిసే వేళ , ఆ క్షణమే నా కల - వేకువకి మేల్కొంటుంది.
వాగు మీంచి వీచే తెమ్మెర - ఆనందాలన్నీ పేనిన వేణుగానమయి నిమిరి వెళుతుంది
వసంతానికి జ్ఞాపకాలూ తియ్య తియ్యగా చివురులు పెడతాయి. నా సుఖ స్వప్నాల కి సూర్యకాంతిలా నువ్వు వెలిగిపోతుంటావు
పురివిప్పిన నెమలికాటు కి రాత్రంతా వలపు అలజడి - కాని, సొగసా - నీ ఆకృతి ఒకటే ఆకర్షణ కవతలి హద్దు"
అన్న మలరే పాట అనువాదం చదివింది మొదలూ,  మైథిలిగారి పేజ్‌ని బుక్‌మార్క్ చేసుకున్నాను. ఫేస్‌బుక్ విధిగా మన స్నేహాలను గుర్తుంచుకుని మనకూ గుర్తుచేసి సంబరాలు చేస్తుంది కానీ, ఇక్కడి పరిచయాలు ఆసక్తులుగానూ, ఆకర్షణలు ఆత్మీయంగానూ మారే ఉద్విగ్నక్షణాలేవో దానికి తెలీవు. అవిట్లా మనకు మనంగా చెప్పుకుంటేనే తప్ప బయటపడని రహస్యాలు.

#mythilipoetry పేరిట గత కొద్ది నెలలుగా ఆంగ్ల కవితలకి అనువాదాలు చేస్తున్నారీ రచయిత, వాటిలో కొన్నైనా ఈ పుస్తకంలో ఉంటాయని ఆశించానేమో, చిన్న ఆశాభంగం! అవన్నీ త్వరలోనే ఒక ప్రత్యేక సంచికగా రావాలి.  నవల, నాటకం, గేయం, కథ, కవిత - ఇలా సాహిత్యరూపాలెన్నింటినో స్పృశిస్తూ లోతైన ఆలోచనలతో ప్రతిపాదనలతో వివరణలతో ప్రవాహసదృశ్యమైన రచనావేగాన్ని చూపెడుతూ సాగిన ఈ పుస్తకంలోని కాగితాలు నా కళ్ళ ముందు రెపరెపలాడినప్పుడల్లా, " కుడిఎడమలే కానరాని  తుదిమొదళ్ళే తోచబోని  స్వప్నమధువుల జడుల లోపల  స్వాంతమున జ్ఞాపకపు పొరలు, పొరల లోపల తెరలు తెరలుగ.." అన్న రజని గీతం అప్రయత్నంగా నా పెదాలనల్లుకుంటోంది.