కొండలు

ఆకాశం మీద
పసివాడొకడు
ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు
కొండలు
నిలువెత్తు బద్ధకంతో
మత్తగజమొకటి
మోకాళ్ళ మీద కూలబడినట్టు
కొండలు
మెలికల నది దారుల్ని దాస్తూ
యవ్వనవతి సంపద లాంటి
ఎత్తుపల్లాల్ని మోస్తూ
అవే కొండలు.
పసిడికాంతుల లోకాన్ని
పైట దాచి కవ్విస్తూ
పచ్చాపచ్చటి నున్నటి దేహాన్ని
వర్షపు తెరల్లో తడిపి చూపిస్తూ
సిగ్గెరుగని దూరపు కొండలు!
___________________
తొలిప్రచురణ - ఈమాటలో
నవంబరు, 2014

టీ కప్పు

మొన్న ట్రెయిన్‌లో వస్తూంటే ఎదురు బెర్త్‌లో ఒక అబ్బాయి అందరికీ భలే సాయం చేస్తున్నాడు. సామాను సీట్ల క్రిందకు తోయడం, మంచినీళ్ళ బాటిల్స్‌కి చిల్లర లేని వాళ్ళకి ఇవ్వడం, పై బెర్త్‌ల వాళ్ళకి క్రిందకు దిగనక్కర్లేకుండానే సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టడం, సెల్ అందివ్వడం, స్టేషన్‌లో ఆగినప్పుడల్లా "ఇదే ఊరో" అని ఊరికే పైకి అడిగిన వాళ్ళందరికీ అదేం ఊరో చూసి వచ్చి చెప్పడం..ఇలా. అతను తెచ్చిన టైంస్ పేపర్‌ను అందరం పంచుకు చదివేశాం (ముక్కలుగా చించడం ఒక్కటే తక్కువ), ఇంకేదో పేపర్ కూడా మరొకరు అతని దగ్గర లాక్కుని సుడోకు నింపి ఇచ్చేశారు.

సాయంకాలం ఛాయ్ వాడు రాగానే అందరం తలో కప్పూ తీసుకు కూర్చున్నాం. తాగేశాక కొందరం వెళ్ళి కప్పు డస్ట్బిన్‌లో పడేసి వచ్చాం. కొందరు వాళ్ళ దగ్గర ఉన్న కవర్లలో తోసి మూటగట్టేసి కూర్చున్నారు. అటుగా వెళ్ళినప్పుడు పడేద్దాం అని కాబోలు. ఒక అమ్మాయి మాత్రం, ఓ పావు వంతును వదిలేసిన కప్పును చక్కగా సీటు కిందకి, ఈ సహాయ ఉద్యమం చేస్తున్న అబ్బాయి చెప్పులను కాస్త వెనక్కి తోసి అక్కడ పెట్టేసి చేతులూ, మూతీ తుడిచేసుకుని కూర్చుంది.

నేను కూర్చున్న చోటు నుండీ చూస్తే ఆ కప్పు ఎవరైనా తన్నేస్తారేమో అని నాక్కాస్త భయం వేసింది. ఎలా చెప్పాలీ? ఐదు నిముషాలు ఆ కప్పు వైపే ఎవరెప్పుడు తన్నేస్తారో అని భయం గా చూస్తూ, అటుపైన మర్చిపోయాన్నేను.

మరికాసేపటికి ఆ అబ్బాయి క్రిందకు దిగి చెప్పులు వేసుకోవడానికి చూశాడు. అడ్డుగా టీ కప్పు. నేనతని వైపే చూస్తున్నాను. అతడు శ్రద్ధగా వంగి, ఆ కప్పు పక్కకు పెట్టి,  తన చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. బెర్తుల క్రింద మొత్తం సూట్కేసులు, సంచులు, ఏవో గిఫ్ట్ పేకులూ ఉండటంతో, ఆ కప్పు సహజంగానే చాలా అంచులో ఉంది. ఆ అబ్బాయి తిరిగి వచ్చేసరికి, ఎవరో ఆ కప్పును తన్నడమూ, అదంతా క్రింద ఒలికిపోవడమూ జరిగిపోయింది.

"మేడం జీ" గట్టిగా, మొహమాటం లేకుండా అతని గొంతు స్థిరంగా పలికిన తీరుకి నేను కళ్ళెత్తి చూడకుండా ఉండలేకపోయాను.
"జీ?" మర్యాదగా పలికిందామె.

"మీరు తాగి వదిలేసిన కప్పు, దారికి అడ్డంగా వదిలేసిన కప్పు, ఎవరో తన్నారు. టీ ఒలికి క్రింద పడింది. ఇందులో ఇంకా కొంచం మిగిలిపోయింది కూడా. నేను తీసుకెళ్ళి పడేస్తున్నాను." చాలా సూటిగా హింది్‌లో చెప్పి నిజంగానే ఆ కప్పు తీసుకున్నాడు. టీ ఒలికిన చోట టిష్యూ పేపర్లు వేసి ఒత్తి మునివేళ్ళతో తీసి కప్పులో పడేసి రెంటితోనూ కలిసి వెళ్ళిపోయాడు.

ఆ అమ్మాయి కొంచం అసహనంగా మొహం పెట్టింది. తన బెర్తు మీద కప్పిన తెల్ల దుప్పటి మీద ఉండీ లేనట్టున్న దుమ్ము దులుపుకుంది. అరచేతులతో మెత్తగా పామింది ఆ దుప్పటంతా. రగ్గు కప్పుకుని చేతిలో సెల్‌ఫోన్ వైపు చూసుకుంది.

సైడ్ బెర్త్‌లో కూర్చున్న ఇంకో పెద్దమనిషి.."మోదీ ఎఫెక్ట్ అనుకుంటానండీ, అందరూ నీతులు చెప్పేస్తున్నారు, స్వచ్ఛ్ భారత్ కాబోలు" అన్నాడు ఆమెకేసి ఆసక్తిగా చూస్తూ.

"వహీ తో.." నిర్లక్ష్యంగా చెప్పిందామె.

" ఇంకో పావుగంటలో బోగీ ఊడ్చి తుడిచేస్తార్లెండి.." లేచి కూర్చున్నాడతను.

ఈ సారి ఆమె బదులివ్వలేదు. ఫోన్‌లో ఆడుకోవడంలో మునిగిపోయింది.


చీకటి


చిమ్మచీకటి.
అగ్గిపుల్ల కొస వెలుగు.
గాలిని తోసే నీడలు
నీడల్ని నమిలే
చీకటి. మళ్ళీ
వెలుతురు. ఆపై అంతా
చీ.క.టి.
వెలుగుతూ
ఆరుతూ
వీథి దీపాలు.
అర్థరాత్రి.
అలికిడి.
తడబడి
విడివడి
దూరందూరంగా…
దూరంగా… దూరంగా.
చీకట్లో వెలిగి,
చీకట్లోనే మిగిలే
మిణుగురులు.
ఉదయం.
వెలుతురంతా
చీకటి మిగిల్చిన
కథ.
                                                                -------------------------------------------
                                                                 తొలి ప్రచురణ : 'ఈమాట' నవంబరు, 2014 సంచిక

ఓ దిగులు గువ్వ

1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్నట్టూ
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోయినట్టూ..గుర్తు.

3

చుక్కలు నవ్వితే ఇష్టమే కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి కవ్వించేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..
                                                                                                                   * తొలి ప్రచురణ సారంగలో.
Special thanks to Nandu:) and Swathi

వాన వెలిశాక..


విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి

డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు


దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.


జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.


వానపడ్డంతసేపూ బుడబుడా నవ్వుతుంది, ఈ నేల
ఆ కాస్త ప్రేమకే మెత్తబడి కరిగిపోతుంది
ఎంత బాధ లోలోపల కొంపుకుంటుందో,
వాన వెలిశాక అదేపనిగా కళ్ళు తుడుచుకుంటుంది.


* తొలి ప్రచురణ వాకిలి సెప్టెంబరు, 2014 సంచికలో

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....