" తెరతీయగరాదా" - కథా విశ్లేషణ - Thanks to Kathajagat :)

Updated :
వంద కథల్లో ఏ కథను ఎంచుకోవాలో అని చాలా బెంగ పడ్డాను మొదట. చివరికి వరుసలో అమ్మ ఇంటి పేరు కనపడగానే ఆగిపోయి కథా అంతా చదివాను. నా ఆలోచనలన్నీ  వరుస క్రమం లో పెడితే, ఇదిగో...ఇలా ముస్తాబయ్యింది.
దీనికి కథా జగత్ విశ్లేషణా  పోటీల్లో రెండవ బహుమతి రావడం ఒక బోనస్ లా ఉంది. దానికి వాళ్ళు నగదు బహుమతి కూడా ప్రకటించడం తో ఆశ్చర్యం రెండితలైంది.Details here -
http://turupumukka.blogspot.com/2010/07/blog-post_28.html
Many thanks to the organizers for giving me a reason to celebrate today! :)
-------------------------------------------------------------------------------------------------------------------------
గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన.

కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది.

వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..!

స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ  పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో..

ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి.

కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది.

ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ  కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో  సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..!

ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను.

"మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం.

ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.." Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి.

"తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/teratiyaga-rada---koduri-శ్రీరామమూర్తి

ఏకాంతమో...ఒంటరితనమో..


వంద మంది నడుమ ఉన్నా  
ఒంటరితనమేదో బాధిస్తుంది
ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.

నేను తప్ప లోకమంతా విశ్రమిస్తుంది
సెలయేరు తన గలగలలాపి నిద్రపోతుంది
ఆకుల్లో ఇందాకటి అలజడి కనపడదు
ఈ గాలిలో పగలున్న వేడి జాడ తోచదు

శరన్మేఘం తన నలుపు చీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది

నిశీధి నిశ్శబ్దంగా నా ముందే కరిగిపోతుంది
నక్షత్రాలింకో లోకానికి వెళ్ళిపోతున్నాయి
లోలోని సంఘర్షణకు సాక్షిగా . . . . .
అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.                                                                                  
                                                                                                                        
                    

"నిను వినా.."

                                  
ఎవ్వరూ లేని సాగర తీరంలో పరుచుకున్న వెన్నెల్లాగా 
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు చుట్టుముడతాయి..
వర్తమానం ఒంటరిదై ముడుచుకుంటుంటే.
ఆలోచనలు పసిపిల్లలల్లే బాల్యంలోకి పరుగులెడతాయి..
పందిరి పై దాకా పాకిన సన్నజాజి తీగల్లాగే..
నా జీవితంలోని ప్రతి ఘడియా నీ ప్రేమతో ముడిపడి ఉంది
కాలం కౌగిట్లో కరిగిన ఒక్కొక్క క్షణం ..అమ్మా!! .
నీ అనురాగ ధారలలోనే తడిసి ముద్దయిపోయింది..!

ఆటల్లో పడి సమయం తెలీకుండా నేనాడి   అలసిపోతుంటే
వందల సార్లు నువ్వు విసుగు లేకుండా నన్ను పిలుస్తుంటే..
అయిష్టంగానే ఇంటికొస్తాను, నీరసంతో నీ ఒడిలో సోలిపోతాను
నువ్వు లేపి ముద్దలు పెట్టే దాకా, మూతి తుడిచి మళ్లీ నిద్ర పుచ్చే దాకా!

అనుకోకుండా ఏ అర్ధ రాత్రో  చదవాలని నేను లేచి కూర్చుంటే
అలసటతో  గాఢనిద్రలోకి జారుకున్న నీకెలా మెలకువొస్తుందో
అంత మగతలోనూ నన్నుత్సాహ పరిచేందుకు ఓపికెలా వస్తుందో
ఆనాడిచ్చిన తేనీటి వెచ్చదనం ఈనాటికీ హృదయాన్ని తాకుతోందిదిగో..

 క్షేమానికై  ఆరాటపడడాన్ని ఆంక్షల చట్రంలో బంధించే యత్నమని భ్రమించి
రెక్కలొచ్చాయన్న ధైర్యంతో రివ్వున ఎగిరిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి
నన్ను వెనక్కి లాగి పొదివి పట్టుకున్నది నీకున్న ప్రేమే తప్ప పంతం కాదని
ఇన్నేళ్ళ తర్వాత అర్థమయ్యాక నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుందెందుకో!

నా జీవితం పూరించలేని సమస్యలా మారి
ప్రతీ ఉదయం భయంతో మొదలైనప్పుడు
వరుస ఓటములతో  ప్రపంచం మసకబారి
ఒంటరితనంతో  దహించుకుపోతునప్పుడు...

ముడుచుకున్న పెదవుల మీద నవ్వులు పూయించిందీ
నా ఉహల చిత్రాన్ని మళ్లీ ఆశల వర్ణాలతో నింపింది నువ్వే!
అపజయాలను దాటుకుని గెలవగల సత్తా ఉందని  నమ్మిందీ
నేను విజేతలా అందరి ముందు వస్తానని విశ్వసించింది నువ్వే !

ఉద్యోగమంటూ  ఒంటరిగా ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడినప్పుడు
వెన్ను తడుతూ నువ్వు వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు
నీ చెంపలను ముద్దాడిన నా పెదవుల నంటిన ఉప్పదనం ......
నీ కన్నీళ్లను దాచిందేమో   కాని  గుండెల్లోని ప్రేమను కాదు !!

నీ అంత ప్రేమను జీవితాంతం పంచే మనిషి కోసం
రేయింబవళ్ళు పరితపించి నాకో సరిజోడు వెదికినా 
నీకు మాత్రం తెలీదా అమ్మా....
నిన్ను మించగల్గిన వాళ్ళు సృష్టిలో ఇంకెవ్వరూ లేరని...ఉండరని....!

*****************         **************************          ****************
published in Koumudi: http://koumudi.net/Monthly/2010/july/index.html       

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....