కొండలు

ఆకాశం మీద
పసివాడొకడు
ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు
కొండలు
నిలువెత్తు బద్ధకంతో
మత్తగజమొకటి
మోకాళ్ళ మీద కూలబడినట్టు
కొండలు
మెలికల నది దారుల్ని దాస్తూ
యవ్వనవతి సంపద లాంటి
ఎత్తుపల్లాల్ని మోస్తూ
అవే కొండలు.
పసిడికాంతుల లోకాన్ని
పైట దాచి కవ్విస్తూ
పచ్చాపచ్చటి నున్నటి దేహాన్ని
వర్షపు తెరల్లో తడిపి చూపిస్తూ
సిగ్గెరుగని దూరపు కొండలు!
___________________
తొలిప్రచురణ - ఈమాటలో
నవంబరు, 2014

టీ కప్పు

మొన్న ట్రెయిన్‌లో వస్తూంటే ఎదురు బెర్త్‌లో ఒక అబ్బాయి అందరికీ భలే సాయం చేస్తున్నాడు. సామాను సీట్ల క్రిందకు తోయడం, మంచినీళ్ళ బాటిల్స్‌కి చిల్లర లేని వాళ్ళకి ఇవ్వడం, పై బెర్త్‌ల వాళ్ళకి క్రిందకు దిగనక్కర్లేకుండానే సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టడం, సెల్ అందివ్వడం, స్టేషన్‌లో ఆగినప్పుడల్లా "ఇదే ఊరో" అని ఊరికే పైకి అడిగిన వాళ్ళందరికీ అదేం ఊరో చూసి వచ్చి చెప్పడం..ఇలా. అతను తెచ్చిన టైంస్ పేపర్‌ను అందరం పంచుకు చదివేశాం (ముక్కలుగా చించడం ఒక్కటే తక్కువ), ఇంకేదో పేపర్ కూడా మరొకరు అతని దగ్గర లాక్కుని సుడోకు నింపి ఇచ్చేశారు.

సాయంకాలం ఛాయ్ వాడు రాగానే అందరం తలో కప్పూ తీసుకు కూర్చున్నాం. తాగేశాక కొందరం వెళ్ళి కప్పు డస్ట్బిన్‌లో పడేసి వచ్చాం. కొందరు వాళ్ళ దగ్గర ఉన్న కవర్లలో తోసి మూటగట్టేసి కూర్చున్నారు. అటుగా వెళ్ళినప్పుడు పడేద్దాం అని కాబోలు. ఒక అమ్మాయి మాత్రం, ఓ పావు వంతును వదిలేసిన కప్పును చక్కగా సీటు కిందకి, ఈ సహాయ ఉద్యమం చేస్తున్న అబ్బాయి చెప్పులను కాస్త వెనక్కి తోసి అక్కడ పెట్టేసి చేతులూ, మూతీ తుడిచేసుకుని కూర్చుంది.

నేను కూర్చున్న చోటు నుండీ చూస్తే ఆ కప్పు ఎవరైనా తన్నేస్తారేమో అని నాక్కాస్త భయం వేసింది. ఎలా చెప్పాలీ? ఐదు నిముషాలు ఆ కప్పు వైపే ఎవరెప్పుడు తన్నేస్తారో అని భయం గా చూస్తూ, అటుపైన మర్చిపోయాన్నేను.

మరికాసేపటికి ఆ అబ్బాయి క్రిందకు దిగి చెప్పులు వేసుకోవడానికి చూశాడు. అడ్డుగా టీ కప్పు. నేనతని వైపే చూస్తున్నాను. అతడు శ్రద్ధగా వంగి, ఆ కప్పు పక్కకు పెట్టి,  తన చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. బెర్తుల క్రింద మొత్తం సూట్కేసులు, సంచులు, ఏవో గిఫ్ట్ పేకులూ ఉండటంతో, ఆ కప్పు సహజంగానే చాలా అంచులో ఉంది. ఆ అబ్బాయి తిరిగి వచ్చేసరికి, ఎవరో ఆ కప్పును తన్నడమూ, అదంతా క్రింద ఒలికిపోవడమూ జరిగిపోయింది.

"మేడం జీ" గట్టిగా, మొహమాటం లేకుండా అతని గొంతు స్థిరంగా పలికిన తీరుకి నేను కళ్ళెత్తి చూడకుండా ఉండలేకపోయాను.
"జీ?" మర్యాదగా పలికిందామె.

"మీరు తాగి వదిలేసిన కప్పు, దారికి అడ్డంగా వదిలేసిన కప్పు, ఎవరో తన్నారు. టీ ఒలికి క్రింద పడింది. ఇందులో ఇంకా కొంచం మిగిలిపోయింది కూడా. నేను తీసుకెళ్ళి పడేస్తున్నాను." చాలా సూటిగా హింది్‌లో చెప్పి నిజంగానే ఆ కప్పు తీసుకున్నాడు. టీ ఒలికిన చోట టిష్యూ పేపర్లు వేసి ఒత్తి మునివేళ్ళతో తీసి కప్పులో పడేసి రెంటితోనూ కలిసి వెళ్ళిపోయాడు.

ఆ అమ్మాయి కొంచం అసహనంగా మొహం పెట్టింది. తన బెర్తు మీద కప్పిన తెల్ల దుప్పటి మీద ఉండీ లేనట్టున్న దుమ్ము దులుపుకుంది. అరచేతులతో మెత్తగా పామింది ఆ దుప్పటంతా. రగ్గు కప్పుకుని చేతిలో సెల్‌ఫోన్ వైపు చూసుకుంది.

సైడ్ బెర్త్‌లో కూర్చున్న ఇంకో పెద్దమనిషి.."మోదీ ఎఫెక్ట్ అనుకుంటానండీ, అందరూ నీతులు చెప్పేస్తున్నారు, స్వచ్ఛ్ భారత్ కాబోలు" అన్నాడు ఆమెకేసి ఆసక్తిగా చూస్తూ.

"వహీ తో.." నిర్లక్ష్యంగా చెప్పిందామె.

" ఇంకో పావుగంటలో బోగీ ఊడ్చి తుడిచేస్తార్లెండి.." లేచి కూర్చున్నాడతను.

ఈ సారి ఆమె బదులివ్వలేదు. ఫోన్‌లో ఆడుకోవడంలో మునిగిపోయింది.


చీకటి


చిమ్మచీకటి.
అగ్గిపుల్ల కొస వెలుగు.
గాలిని తోసే నీడలు
నీడల్ని నమిలే
చీకటి. మళ్ళీ
వెలుతురు. ఆపై అంతా
చీ.క.టి.
వెలుగుతూ
ఆరుతూ
వీథి దీపాలు.
అర్థరాత్రి.
అలికిడి.
తడబడి
విడివడి
దూరందూరంగా…
దూరంగా… దూరంగా.
చీకట్లో వెలిగి,
చీకట్లోనే మిగిలే
మిణుగురులు.
ఉదయం.
వెలుతురంతా
చీకటి మిగిల్చిన
కథ.
                                                                -------------------------------------------
                                                                 తొలి ప్రచురణ : 'ఈమాట' నవంబరు, 2014 సంచిక

ఓ దిగులు గువ్వ

1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్నట్టూ
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోయినట్టూ..గుర్తు.

3

చుక్కలు నవ్వితే ఇష్టమే కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి కవ్వించేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..
                                                                                                                   * తొలి ప్రచురణ సారంగలో.
Special thanks to Nandu:) and Swathi

వాన వెలిశాక..


విరగబోయే కొబ్బరిమట్ట మీద కూర్చుని
ముక్కుతో పొట్ట పొడుచుకుంటూ
దిగులుగా ఊరంతా చూస్తుంది
ఒంటరి కాకి

డాబా మీది తూము నుండి నీళ్ళు
ధారల్లే క్రిందకు పడుతోంటే
తలంతా తడుపుకుంటూ ఇకిలిస్తాడు
బట్టల్లేని బుడతడు


దండేనికి వేలాడుతోన్న చినుకులన్నింటిని
చూపుడువేలు గాల్లోకి విసిరేశాక
ఏడుపు మొహాలతో బయటకొస్తాయ్
ఆరీఆరని బట్టలు.


జీరాడే కుచ్చిళ్ళు జాగ్రత్తగా
బురద నీళ్ళకు దూరంగా జరిగాక
పసుపు మరకల పట్టీలతో పేరంటానికెళ్తుంది
అమ్మలాంటి ఓ అమ్మ.


వానపడ్డంతసేపూ బుడబుడా నవ్వుతుంది, ఈ నేల
ఆ కాస్త ప్రేమకే మెత్తబడి కరిగిపోతుంది
ఎంత బాధ లోలోపల కొంపుకుంటుందో,
వాన వెలిశాక అదేపనిగా కళ్ళు తుడుచుకుంటుంది.


* తొలి ప్రచురణ వాకిలి సెప్టెంబరు, 2014 సంచికలో

నిప్పులు

ముక్కాలిపీట మీద ముడుచుక్కూర్చుని
ఆరుబయట పెనం సిద్ధం చేస్తుందామె
చుక్కలు మెరిసే వేళకి
నిప్పులు రాజుకుంటాయి
సన్నని సెగలో కాలే కోర్కెల్ని దాస్తూ
ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
ఏవో ఆశల్ని పరుస్తాడతను.
రొట్టెలొత్తే చేతుల ఎర్రమట్టిగాజులు
గలగలలతో లయగా ఊకొడుతూంటాయి.
రగులుతూంటాయి నిప్పులు.
కండలు తిరిగిన మగడి దేహంలో
పగటి కష్టాన్ని పరికించి చూస్తూ
మునివేళ్ళతో అతని పెదవులకు
ప్రేమనంతా ముక్కలుగా అందిస్తుందామె
ఎంగిలిపడటం మొదలవుతుంది
ఆకలి పెరిగి పెద్దదవుతుంది
నిప్పులు పొగలు కక్కుతూంటాయి
గాలులు వేడెక్కిపోతాయి
నులకమంచం మీద మసకవెన్నెల
వెల్లికిల పడుకుని వేడుక చూస్తుంది
చిట్టిచేమంతులు మడుల్లో లేచి నిలబడి
కంటి చికిలింపుల్లో కథలు దాచుకుంటాయి
నడిరేయి ఏ ఝాముకో
చలిగాలులు వీస్తాయి.
కుంపట్లో నిప్పులు వాటంతటవే
ఆరిపోతాయి.
* తొలి ప్రచురణ - ఈమాట సెప్టెంబరు, 2014 సంచికలో.

మానసచోరుడు

ధారాళంగా గాలి వీస్తున్నా ఆ మందిరంలో ఎవ్వరికీ ఊపిరాడటం లేదు. అందరి చూపూ ఒకే యువతి మీద. నిన్న లేని అందమేదో ఆమెలో అకస్మాత్తుగా కనపడి స్థాణువులుగా మార్చింది వారందరినీ. ఆ ఒంపుసొంపులూ వయ్యారాలూ సరే, రాజ్యమంతా జల్లెడ పడితే చూపు తిప్పుకోనివ్వని అందగత్తెలకేమంత కొదువ లేదు. వాళ్ళని ఆకర్షిస్తున్నది ఆ మచ్చెకంటి కన్నుల్లోని మెరుపు. ఆమె పగడపు పెదవులపైని సిరినవ్వు. ఈ అదనపు ఆభరణాల విలువేమిటో తెలిసినదానిలా అతిశయంగా కూర్చుని ఉందామె. ప్రియసఖులందరి మధ్యా ఉన్నదన్నమాటే కానీ, ఉండుండీ ఆ నగుమోములో మెరుస్తోన్న నవ్వొకటి ఆమె మనసక్కడ లేదనీ, మరెక్కడో చిక్కుకుని ఊగిసలాడుతోంటే, ఈమె తీయని అవస్థేదో ఇష్టంగా అనుభవిస్తోందని చెప్పకనే చెబుతోంది.

"ఇంతకీ ఎవరతను?" కుతూహలాన్ని అణచుకోలేని ఓ చెలి ప్రశ్నించింది.

ఆ ప్రశ్న వినపడ్డ వైపు ఇష్టంగా చూసిందామె. అటు తిరిగి సర్దుకు కూర్చుంది. కాలిమువ్వలు ఘల్లుమన్నాయి. మెడలోని హారాలు, చేతి గాజులు సన్నగా సవ్వడి చేసి ఆమె చెప్పబోయే సంగతులకు శ్రుతి సిద్ధం చేశాయి. 

"ఏ రాజ్యమో తెలిసిందా"
"దేవలోకమే అయి ఉంటుంది కదూ"
"జగదేకవీరుడట? మచ్చలేని చందమామట?"

జలజలా రాలుతున్నాయి ప్రశ్నలు.

ఆమె వెంటనే బదులివ్వలేదు. మరపురాని కలను తల్చుకుంటునట్టుంది. 

"ఎదురు చెప్పాడని ఓ చాకలివాణ్ణి ఠపీమని బుర్ర మీద కొట్టి ఒకే దెబ్బతో నేల కూలేలా చేయలేదూ..? అప్పుడు చూశాను" మెల్లిగా చెప్పింది. 

"ఓహ్!..అతగాడా?" ఆ పరాక్రమవంతుడి రూపాన్ని గుర్తుచేసుకుని ఆశ్చర్యపోయిందో అలివేణి.

"ఊ..చూశానా?!...చూపు తిప్పుకోలేను. తప్పుకుని ముందడుగూ వేయలేను. ఆగి పలకరించేంత భాగ్యమీ జన్మకెలానూ లేదు. మరేం చేయనూ?"

"మరేం చేశావూ?" లేలేత యవ్వనాల ఇందుమతి ఒకతె అల్లరిగా నవ్వి అడిగింది.

"ఈనాటి పున్నెమయి ఉండదులే! వేయిన్నొక్క జన్మల తపఃఫలాన్ని అతని చూపు సోకితే చాలని దాచుకుని ఉంటాను. అందుకేగా చూశాడతడు నన్నూ."

ఉయ్యాల మీద నుండి లేచిందామె. పట్టు కుచ్చిళ్ళు పసిడి పాదాల పైని పారాణిని ముద్దాడుతున్నాయి. ముంగురులు అల్లనల్లన కదులుతున్నాయి. కన్నుల్లో ఏవో మెరుపు కలలు.

"దాటుకు వెళ్ళిపోలేదూ?"

"ఊహూ! నువ్వు నమ్మవు శాంభవీ. తిన్నగా నా దగ్గరికే వచ్చేశాడు.
'పద్మాక్షీ' అని పిలిచాడు. 
నన్ను. 
ఈ నిర్భాగ్యురాలిని. 
కన్నెత్తైనా ఏ పురుషుడూ చూడడే! కనపడితే దాటుకు పోతారే! కన్నులు పొరబాటున కలిస్తే నిందలేస్తారే..అలాంటి నన్ను.." ఉద్వేగంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి - "ఎవడమ్మా వీడు, ఇదో రకం వెక్కిరింపే సుమా అనుకున్నాను. ఆమాటే అడిగాను కూడా!"

" నిజం చెప్పాడా మరి?"

" 'నీతో పరిహాసాలెందుకు చినదానా, ఉన్నమాటే అన్నాను. ఆ చేతిలో ఏమిటవీ, చూడవచ్చునా?' అన్నాడు.

ఏమీ గుర్తు లేదు. మైపూతలివి అన్నానా, నేను ఫలానా అని చెప్పానా! చెప్పలేదా..ఏమో! 

నా చేతిసంచీ నుండి చొరవగా నచ్చినవి తీసుకున్నాడు. నాకేమయిందో తెలీదు. మనసు సరే, మోహపువరదలో కొట్టుకుపోతోంది. ఈ దేహం కూడా! ఇలా ఎలా మారిపోయిందో తెలీలేదు. మునివేళ్ళపై నిలబడి నా నడుం పట్టి సాగదీసినట్టున్నాడు. నా కన్నుల్లోకి చూశాడా? నవ్వాడా? కలగన్నానా? తెలియలేదు. వెనుతిరగబోతోంటే చేయిబట్టి ఆపాను. 'పని మీద వెళుతున్నా, వస్తూ వస్తూ ఆగుతాగా' అంటూ సున్నితంగా విడిపించుకున్నాడు. నా బేలకన్నుల్లోకి చూసి నవ్వుతూ బుగ్గన చిటికె వేసి వెళ్ళిపోయాడు.

అతని దయ, కరుణ, నిష్కల్మష ప్రేమ - ఈ జన్మను ఆ కమలాక్షుడి పాదారవిందాలకు సమర్పణ చేసినా  ఆ క్షణమాత్రపు సౌఖ్యానికి బదులు తీర్చుకోలేను. నా బ్రతుకంతా కన్న కలలను అతని పిలుపొక్కటి తీర్చింది. హృదయంలోని ఇన్నేళ్ళ పరివేదనా అతని ప్రేమకు కరిగిపోయింది. అయినా ప్రేమంటే ఏమిటి? బ్రతుకంటే మిగిలిన ఆశ. అంతేగా? నాకది దొరికింది, నిథిలా. అతనిలా. 

నాకిక దుఃఖం లేదు. అతగాడి సాంగత్యం వినా వేరొక ఆశ లేదు. కేవలం అతని చూపు సోకే నా మనోవికారాలన్నీ మాయమయ్యాక, అతని స్పర్శకు ఈ దేహంలో మువ్వంపులు మాయమైపోవడం ఆశ్చర్యమా? "  

కాదనలేని ఆశ్చర్యంతో, ఔననలేని అపనమ్మకంతో వింటున్నారు జలజాక్షులందరూ. "ఎలా వెళ్ళనిచ్చావు? మళ్ళీ వస్తాడని ఎలా నమ్మావు నీవు? తనువు ప్రాణదీపానికి దూరమైపోతే, బ్రతుకు చీకటైపోదూ?"   

సమ్మోహనంగా నవ్విందామె.

"నెచ్చెలీ! . ప్రాణదీపం పరంజ్యోతి అని నమ్మాక, దిగులెందుకు? అతని కృప నేనడిగితే వచ్చిందా? అతని దయ, ప్రేమ నేనాతని ముందు మోకరిల్లితే వచ్చి వరించాయా? అయినా శివకామినీ! ఆ భగవంతుడే వచ్చి, నే మళ్ళీ వస్తానని మాటిస్తే శంకించమంటున్నావా? నా అల్పమైన ప్రేమని పోగులుగా మలచి ఆ అపార ప్రేమమయిని బంధించమంటున్నావా?

అతనిక రాకపోనీ. నన్నిక మరచేపోనీ. అతని కరస్పర్శ నా తోడిదే ఉంది. ఆ చూపులు నన్ను విడిచిపోవు. ఆ నవ్వులు నన్నొదిలి మరో వైపు వెళ్ళలేవు. వెళుతూ వెళుతూ అతను వాయించిన మురళీ గానం, అమృతమై ఇంకిపోయింది నాలోకి. వేరు పడలేదు.

చెప్పండి. ఇంకా దైన్యం నిండాలా? వలపు సంకెళ్ళతో బంధించాలన్న తలపు ఉండాలా? అతన్ని చూశాకా? కలిశాకా? అతనొక వరమై నన్ను తాకాకా? నా మనసాతనిలో ఐక్యమయ్యాకా? ఊహూ! అనల్ప సంతోషమిది. అల్పమైన కోరికలతో మామూలు దాన్ని కాలేను" 

" సరే, జగదేకవీరుడంటున్నావు, సరిలేని అందగాడంటున్నావు. నిన్నెందుకు చూశాడో తెలీదు. మనిషిని అమాంతంగా మార్చేయగల మాయనెలా సొంతం చేసుకున్నాడో తెలీదు. సరి సరి, ఇంతకూ..మళ్ళీ వచ్చాడా మానసచోరుడు?"

" మాట మీరేవాడా ఆ మోహనమురళీధరుడు? వచ్చాడు. వెన్నెల రాత్రి వెంటాడే పాటేదో గొంతులో మోసుకుంటూ వచ్చాడు. కాసేపు కబుర్లతో నవ్వించాడు. ఇంకాసేపు చూపులతోనే కవ్వించాడు. నేనొక మురళిననుకున్నాడేమో, మునివేళ్ళతో తాకుతూ గిలిగింతలిచ్చాడు. మునిపంట నలిగిన నా సిగ్గుని దోచుకోగలనంటూ పందెమేశాడు. దాగుమూతలాడాడు, దొంగ, గంతలు కట్టకుండానే నా రెప్పలు మూసుకుపోయే కబుర్లేవో గుసగుసగా చెప్పాడు.

ఆతిథ్యం నచ్చిందన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు." 

"మరి నువ్వు?" ఆసక్తిగా ముందుకు వంగి అర్థోక్తిలో ఆగారందరూ.

" ఏమనగలను? మొదలెట్టిన ఆటలన్నీ పూర్తి చేయమన్నాను. ఓడీ గెలిచే ఆటలుంటాయని నాకు మాత్రం తెలియదా? వలరాజకేళీతరంగాల్లో ఊయలూపమన్నాను."

నివ్వెరపోయారందరూ.

" అయ్యో! వెర్రితల్లీ. నీవే అంటివే పరమాత్ముడనీ! నీవే చెప్పావే అతడు మాట మీరని పురుషోత్తముడనీ, ఏమడిగినా ఇస్తాడనీ. ఇదేనా నువ్వు కోరుకున్నది?" నిరాశ ఉట్టిపడుతున్న గొంతుతో అపేక్షగా పలికారొకరు. 

ఆశ్చర్యంగా చూసిందామె. "ఇంకేం కావాలీ?"

"మోక్షం. కాదూ?"
"ఇంతకు మించినదా అది? అసాధ్యం. కాదూ? " పరవశమవుతూ పలికిందామె. 

ఎవ్వరి భాగ్యమెంతో ఎవ్వరు తేల్చగలరు. భారమైన హృదయాలతో నిష్క్రమించారందరూ.

శ్రావణసమీరాలకు మబ్బులు విరవిరా విచిపోతున్నాయి. మేఘాల అడ్డు తొలగిన చంద్రుడు మరింత ప్రకాశవంతుడై కాంతులీనుతున్నాడు. కొలనులో నీళ్ళు మెరసిపోతున్నాయి. దాని పొంతనున్న చంద్రోపల వేదికపై నవ్వు మోముతో శ్యామసుందరుడు కూర్చునట్లు తోచిందామెకు. లోకాలను విస్మరించిన ప్రేమలో అక్కడికి పరుగు తీసింది భామిని. 

శివం సుందరం - గోకర్ణం

శ్రావణమాసం!

గోకర్ణం అని బస్ వాడు పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి క్రిందకు  దిగగానే పన్నీటి చిలకరింపుల ఆహ్వానంలా కురిశాయి తొలకరి జల్లులు. ‘చంద్రుణ్ణి చూపించే వేలు’లా, మట్టి రోడ్డు ఊరిలోకి దారిని చూపిస్తోంది. మనసును పట్టిలాగే మట్టి పరిమళం వెంటే వస్తోంది. పచ్చటి పల్లెటూరు గోకర్ణం. భుజాల మీదకు బ్యాగులు లాక్కుంటూ మేం వెళ్ళవలసిన హోటల్‌కు నడక మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు. ముందురోజు గోకర్ణం వచ్చాకే రూం తీసుకోవచ్చునన్న హోటల్ వాళ్ళు, తీరా వెళ్ళాక, రూములేవీ ఖాళీల్లేవన్నారు. చేసేదేమీ లేక, ఒక హోం స్టేలో  అద్దెకు దిగాం. 

ఇక్కడ ఇళ్ళన్నింటికీ చిత్రంగా రెండేసి తలుపులు. ఒకటి గుమ్మం బయట మోకాళ్ళ వరకూ. రెండవది మామూలుగా- గుమ్మానికి లోపలివైపు. దాదాపు పగలంతా, ఎవరూ లోపలి తలుపు వేసుకున్నట్టే కనపడలేదు. బహుశా, దొంగల భయం ఉండి ఉండదు. రూం ఏమంత సంతృప్తికరంగా లేకపోయినా త్వరత్వరగా స్నానాలవీ ముగించి మహాబలేశ్వరుడి గుడికి బయలుదేరాం. చిన్న ఊరే కావడంతో అన్నీ నడచి వెళ్ళగల్గిన దూరాలే. గుడికి నాలుగడుగుల ముందు, రవికల్లేకుండా, కుడిపవిటతో, నడినెత్తిన కొప్పులతో ఉన్న కొందరు యువతులు మమ్మల్ని అటకాయించి, అధికారంగా చేతుల్లో తామరాకు పొట్లమొకటి ఉంచి, "ముందు ఇటు" అంటూ దారి మళ్ళించారు. గుప్పెడు గరిక, దోసెడు పూలు. తామరాకు పొట్లాన్ని భద్రంగా పట్టుకుని, వాళ్ళు చెప్పినట్టే గణపతి దర్శనానికి వెళ్ళాము.  గోకర్ణ ప్రాముఖ్యత అంతా అక్కడి ప్రాణలింగంలోనే ఉందని అంటూంటారు. ఈ ప్రాణలింగం సామాన్యమైనది కాదు. సృష్టిలోని చరాచర జీవుల సత్వశక్తితో మహాశివుడు మూడు కళ్ళు, మూడు కొమ్ములు ఉన్న ఒక విశిష్ట మృగాన్ని తయారుచేస్తాడొకానొకప్పుడు. రెండు కొమ్ములు బ్రహ్మ, విష్ణు శక్తులుగా మారగా, మూడవది ఈ ప్రాణలింగం. సాక్షాత్తూ రుద్రాంశ. దీని శక్తిని గుర్తెరిగిన రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి, శివానుగ్రహంతో దీనిని సాధించి తీసుకు వెళ్ళిపోజూస్తాడట. భక్తుల యోగ్యత చూసి, భోళాశంకరుడి వరాలను అవసరమైతే పట్టి వెనక్కు లాగే శ్రీహరి, ఈసారీ రంగంలోకి దిగి, రావణాసురుడి నుండి ప్రాణలింగాన్ని దూరం చేయదలచి, తన చక్రాన్ని అడ్డు పెట్టి, సూర్యాస్తమయమైన భ్రమ కలిగిస్తాడట లోకాలకు. విజయగర్వంతో ప్రాణలింగాన్ని తీసుకుని ప్రయాణిస్తోన్న రావణాసురుడు, కమ్ముకుంటోన్న అరుణవర్ణాన్ని చూసి, సాయంసంధ్య వేళయిందని నమ్మి, సంధ్యావందనం చేయగోరి, భూస్పర్శ సోకితే లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుందన్న శివుని వాక్కు గుర్తొచ్చి, ఇహ ఎక్కడ పెట్టాలో తెలీక, చుట్టూ చూస్తాడట. ఈ లోపు, బొజ్జ గణపయ్య అక్కడికి గోవులకాపరి వేషంలో వచ్చి, గోవులను చూస్తునట్టు నటనమాడుతాడట. రావణాసురుడు ఉన్న కథంతా చెప్పి, తానొచ్చేవరకూ లింగాన్ని భూస్పర్శ సోకకుండా కాపాడమని అర్థిస్తే, లంబోదరుడు తాను చిన్నవాణ్ణి కనుకా, లింగం బాగా బరువుగా ఉంది కనుకా, మోయలేననిపిస్తే ముమ్మార్లు పిలిచి క్రింద పెట్టేస్తానని హెచ్చరించి, ఆ భారాన్ని అందుకుంటాడట. రావణుడు సంధ్య వార్చడమిలా మొదలెట్టీ మొదలెట్టగానే చకచకా మూడుసార్లూ పిలిచేసి, లింగాన్ని నేల మీదకు దించేస్తాడట గౌరీసుతుడు. ఆ ప్రాంతమే ఈ గోకర్ణం. రావణాసురుడు రాక్షసుడు, గర్వి, కోపిష్టి. ఊరుకుంటాడా మరి? పట్టరాని ఆవేశంతో గణపతి శిరసుపై పిడికిలితో మోదుతాడట. మహాబలేశ్వరుడి దర్శనానికి ముందు, ఆ కొండయువతులు మమ్మల్ని చూడమన్నది, ఈ గణపతినే. శిరసు మీద పిడికిలి గుర్తులు సుస్పష్టంగా కనపడుతోన్న ఇక్కడి "చింతామణి గణపతి"కి మనసారా మొక్కి, మహాబలేశ్వరుడి గుడివైపు నడక సాగించాం. 
మహాబలేశ్వరుడి గుడిలో ఉదయం 6-12 వరకూ, సాయంకాలం 6-8 వరకూ భక్తులందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఆత్మలింగాన్ని స్వహస్తాలతో స్పృశించి అభిషేకం చేయగల మహదవకాశమూ లభిస్తుంది. సువర్ణనాగాభరణవిశేష పూజ చేయించదలచిన మా జంటని, పూజారులొకరు వచ్చి వారి తరఫున అంతరాలయంలోకి తీసుకువెళ్ళారు. పంచామృతాలతో పరమశివుడికి అభిషేకం చేయడం కాసేపటికి పూర్తయింది. "త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్" అనుకుంటూ మారేడు దళాలను సమర్పించుకోవడమూ అయింది. అప్పుడు,  
"లింగరూప తుంగ, జగమాఘనాశన
భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ
                            శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే"                           
అని మహాబలేశ్వరుణ్ణి అందరూ కీర్తిస్తూండగా, దాదాపు మూణ్ణాలుగు బిందెల నీళ్ళను, మన ముంజేయి లోతులో ఉన్న బిలంలో ధారగా వదిలారు అర్చకులు. వచ్చినంత నీరు బయటకు రాగా, లోపల మిగిలిన నీరు నిశ్చలమైపోగా, మమ్మల్ని అందులోకి తొంగి చూడమన్నారు. తాకి మొక్కుకోమన్నారు. ఆత్మలింగం!! రుద్రాంశ! దేవతలందరూ కొలిచిన కొమ్ము. సమస్త లోకాలకూ రక్షణైన కొమ్ము. రాముడు నమ్మిన క్షేత్రం. రావణుడోడిన క్షేత్రం. అక్కడ..ఆ క్షణంలో, దానిని తాకి పరవశించగల సౌభాగ్యంతో మేము. 'ఆత్మనొక దివ్వెగా' ఈ పరమేశ్వరుని పాదాల చెంత వెలిగించాలనుందన్న ఓ కవిమిత్రుని మాటలు అప్రయత్నంగా  గుర్తొచ్చాయి. ఆ శ్రావణమేఘాల తడిజాడలేవో నా కన్నుల్లోనూ మెరిశాయి.
     
 అటుపైన 'కడల్ బీచ్‌'కు వెళ్ళి, కడలి ఒడిలో కాసేపు ఆటలాడి, అక్కడి భోజనం వెగటు పుట్టిస్తోన్నా శక్తినంతా సముద్రానికి ధారపోసిన పాపానికి తినకుండా ఉండలేక, ఎలాగో అయిందనిపించి, మురుడేశ్వర్ వెళ్దామని బయలుదేరాం. 2000/-కు మారుమాట లేని బేరమైతే తీసుకువెళ్తామని టాక్సీల వాళ్ళు ముందుకొచ్చారు. బస్‌స్టాండ్ అట్టే దూరం కాకపోవడంతో, బస్సులేమైనా ఉన్నాయేమోనని కనుక్కోవడానికి వెళితే, నేరుగా ఏం లేవనీ, కుంటాలో దిగి మారవలసి ఉంటుందనీ చెప్పారు. ఇక టాక్సీ తప్పదనుకుంటూండగా మా వద్దకొక ఆటోవాలా వచ్చి వివరమడిగాడు. ఇవన్నీ వద్దనీ, మూడున్నరకు మురుడేశ్వర్‌లో దింపే రైలొకటుందనీ, అది ఎక్కితే గంటలో వెళ్ళిపోతామనీ చెప్పాడు. మాకొక్క గంటే సమయముంది. అతని ఆటోలోనే ఎక్కి స్టేషన్‌కు బయలుదేరాం. దారంతా అతను అక్కడి గుడుల గురించీ, అక్కడి మనుష్యుల మంచితనాన్ని గురించీ కథలుకథలుగా చెబుతూనే ఉన్నాడు. పచ్చిక బయళ్ళ దగ్గరా, ఉప్పు నీటి మడుల దగ్గరా మెల్లిగా పోనిస్తూ వాటి విశేషాలన్నీ విప్పి చెప్పాడు. అనుకున్న వేళకి పది నిముషాల ముందే మమ్మల్ని స్టేషన్‌లో దించేశాడు. రైలు నిజంగా ఉందో లేదో నన్న అనుమానం నన్ను వదల్లేదు. ఐదువందల రూపాయల నోటు చేతిలో రెపరెపలాడుతోంటే, అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగానతన్ని. అతడేమనుకున్నాడో, ఏమనిపించిందో నాకు తెలీదు కానీ, "నమ్మకం ఉండాలి మేడం! అది లేకుండా ఏ ప్రయాణమూ పూర్తి కాదు" అన్నాడు, చిల్లర లెక్కపెడుతూ. అతడు మామూలుగానే అన్నా, "ప్రయాణం" అన్న పదం, అతను పలికినంత తేలిక అర్థంలో అయితే నాకు స్ఫురించలేదు. చాలా సేపు ఆమాట నా ఆలోచనలను అంటిపెట్టుకునే ఉంది. ఆ ఒక్కమాటా కలిగించిన వేల ఆలోచనలు, గుర్తు చేసిన వేనవేల సందర్భాలూ, మనుష్యులూ, అన్నీ, మురుడేశ్వర్ ఆలయాన్ని చూసీ చూడటంతోనే, అక్కడి గోపురాల్లో నుండి చివాలున రెక్కలు విదుల్చుకుంటూ ఎగిరిపోయి శాంతిని వదిలే పావురాలల్లే చెల్లాచెదురైపోయి, నన్నొక నిశ్శబ్దంలోకి నెట్టేశాయి. దాదాపు ఇరవై అంతస్తుల మహాఆలయం. నిగర్వులమై తలపూర్తిగా వెనక్కు వాల్చితే తప్ప కనపడని గోపురం. అది దాటి వెనక్కు వెళితే, సముద్ర తీరాన అంతెత్తులో, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద శివుడి విగ్రహం.  ఆ శివుడి విగ్రహం దగ్గర నిలబడి చూస్తే అనంత జలరాశితో ఎగసెగసిపడుతూ అరేబియన్ సముద్రం. అస్తంగత సూర్యుడు తన బంగారు కాంతులన్నింటినీ ఆప్తుడని కాబోలు, సముద్రుడికే ధారపోశాడు. వాతావరణం ఉన్నట్టుండి చల్లబడిపోయింది. తలెత్తి చూస్తే పరమేశ్వరుడి శిరసుపై ఠీవిగా కనపడుతోన్న చంద్రవంక. " చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమాం!" 

గుంపులు గుంపులుగా మనుష్యులు. చిన్నా-పెద్దా, పొట్టీ-పొడుగూ, నలుపూ-తెలుపూ..ఏవో భేదాలు. ఏవేవో పోలికలు. ఆ గుడిమెట్ల దగ్గరే కొన్ని జంతువులు మూగగా నిలబడి చూస్తున్నాయి. అశుచిగా ఉన్న చోట్ల ఈగలూ దోమలు ముసురుకుని చెదరిపోతున్నాయి. పక్షులు కొన్ని అక్కడే ఉన్న పొడుగాటి చెట్ల గుబుర్లలో చేరి కిచకిచమంటున్నాయి. కలకలం రేపుతున్నాయి. గట్టిగా ఆరేడు నెలలైనా నిండి వుండని పసివాడొకడు అమ్మ చేతుల్లో నుండే చిన్ముద్రలో ఉన్న మహాదేవుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడు. 

ఏం కోరుకోవాలీ పరమేశ్వరుణ్ణి?
ఏమని మొక్కాలి? 

"నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ-
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ||"

                                                                                    *************************

ఆరున్నరకు తిరిగి గోకర్ణం చేర్చే రైలు పట్టుకుని వెనక్కు వచ్చేశాం. వచ్చీ రావడంతోనే   మర్నాడు ఉదయమే ఐదు గంటలకు దూద్‌సాగర్ జలపాతాలకు వెళ్ళేలా కార్ మాట్లాడుకున్నాం.    అటుపైన ఆ రాత్రి మేం పట్టుమని నాలుగు వీథులైనా కనపడని గోకర్ణమంతా చెట్టాపట్టాలేసుకుని తీరిగ్గా తిరిగాము. కోటి తీర్థం, భద్రకాళి గుడి, శ్రీకృష్ణ మందిరం - - అడుగుకో గుడి, అరుగుకో బ్రాహ్మడు అన్నట్టుందా ఊరు. ఎవరి ముఖంలోనూ ఖంగారు లేదు. ఎత్తరుగుల ఇళ్ళ వాకిళ్ళలో పిల్లలు గుంపులు గుంపులుగా చేరి ఆడుకుంటున్నారు. ఊరు ఊరంతా తొమ్మిది గంటల వేళకే నిద్రించండానికి సమాయత్తమైపోయింది. ఒకానొక కూడలిలో మాకు వేంకటరమణుడి ఆలయమొకటి కనపడింది. మేం ఎక్కడ నడుస్తూన్నా, ఆ శ్రావణ మాసపు రాత్రి, నిర్జన వీధుల్లో నుండి శ్రీకృష్ణ సంకీర్తనలు తేలివచ్చి మమ్మల్ని తాకిపోతున్నాయి. వాటిని పరిపూర్ణంగా లోలోపలికి ఒంపుకుంటూనే, కనపడ్డ ప్రతి షాపులోకీ తొంగి చూస్తూన్నాన్నేను. స్త్రీసహజమైన బేరాలాడే బుద్ధి ఏనాడూ కలిసొచ్చిన జ్ఞాపకం లేకపోయినా, ఆకుపచ్చని ఆశని గుండెలో దాచుకుని, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న సూత్రం - సగానికి సగం ధర తగ్గించి అడగడమే బేరం - అని గుర్తు చేసుకుని, నచ్చిన ప్రతి కుర్తాకోసమూ ఓ మాట వదిలి చూశాను. కొట్టు కట్టేసే హడావిడిలో ఉన్న ఓ ఆసామీ నా మాట మన్నించాడు. ఆ విజయగర్వంతో , ఆ మిగిలిన డబ్బులతో - స్వీట్ కోసం ఓ చిన్న షాపు ముందు ఆగాం. అది నిజానికి హోటల్. అక్కడున్న రెండు నిముషాల్లోనూ నన్ను ఆకర్షించింది - అక్కడ పనిచేస్తోన్న అమ్మాయిలు. లంగాఓణీల్లో పద్ధతిగా, ధైర్యంగా, చిత్రంగా మెరుస్తోన్న కన్నులతో హోటల్ తమదే అన్నట్టు కలియదిరుగుతున్నారు వాళ్ళందరూ.  మామూలుగా అమ్మాయిలు ఎక్కడో లోపల నక్కి గిన్నెలు తోమడమో, వంటింట్లో కూరలు తరగడమో చూశాను కానీ, ఇలా ఇదీ-అదీ అన్న భేదం లేకుండా  వంట నుండీ-కేష్ కౌంటర్ దాకా, తయారుగా ఉన్న పదార్థాల గురించి ఉత్సాహంగా చెప్పడం మొదలు- వాటిని శ్రద్దగా మననం చేసుకుని అంతే శ్రద్ధగా అందించేదాకా, అన్ని పనులూ గట్టిగా ఇరవయ్యేళ్ళు కూడా నిండి ఉండని అరడజను మంది అమ్మాయిలు నేర్పుగా చేసుకుపోవడం ఇక్కడే చూశాను. మాటల్లో మన్నన, చేతల్లో చురుకుదనం - అక్కడున్న కాసేపూ నా కళ్ళు వాళ్ళ చేష్టలని వెంటాడుతూనే ఉన్నాయి. నాతో పాటుగా అక్కడి అరడజను బల్లల మీది అంతమందినీ, అన్నిరకాల చూపుల్నీ గడుసుగా తప్పించుకుంటూ తమ పని తాము చేసుకుపోతున్నారు వాళ్ళు. టేబుల్ క్లీన్ చేస్తున్న అమ్మాయిలో కూడా ప్రస్ఫుటంగా కనపడ్డ సంతోషాన్నీ, శ్రద్ధనీ చూస్తే, మార్టిన్ లూథర్కింగ్‌ను మాటలను కానీ వీళ్ళు చదివారా అనిపించింది.  మనుష్యుల్లోని ఏ లక్షణాలు వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయో, అభిమానాన్ని, గౌరవాన్ని కలిగించి గుర్తుండిపోయేలా చేస్తాయో, మరొక్కసారి నేర్చుకున్నట్టైంది. మేమడిగిన స్వీట్‌తో పాటు చిల్లరనూ, చలాకీ నవ్వులతో చుట్టబెట్టి ఇస్తూన్నప్పుడు, తళుక్కుమన్న ఆ అమ్మాయి ముక్కెర మెరుపును ఆ రాత్రి ఆఖరి జ్ఞాపకంగా మార్చుకుని, రూంకొచ్చేశాం.   

మా అనుమానం నిజం చేస్తూ, 11 దాటాక,  ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. వాన చాలా ఎక్కువగా పడుతోందనీ, ఈ వాతావరణంలో ప్రయాణం మంచింది కాదనీ, దూద్‌సాగర్‌లో కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటే జలపాతాల దగ్గరికి ఎవ్వరికీ అనుమతి ఉండదనీన్నూ. ప్రయాణం రద్దయింది. నిరాశతోనే తెల్లవారింది.
  
                                                                                         ************************
శ్రావణ బహుళ అష్టమి. 

చీకటి ముసుగులా పల్లెనింకా వీడనే లేదు. సన్నగా జల్లు కురుస్తూనే ఉంది. జంధ్యప్పోగులు సరిచేసుకుంటూ బ్రాహ్మలు వడివడిగా మమ్మల్ని దాటుకుపోతున్నారు. మహాబలేశ్వరుడి గుడి ఎదుటి దుకాణాల్లో నుండీ లింగాష్టకం లీలగా వినపడుతోంది. మట్టి రోడ్లే అన్నీనూ. అయినా రాత్రంతా కురిసిన వర్షానికి ఏ  వీథిలోనూ నీరు నిల్చిపోయిన దాఖలాల్లేవు. అక్కడి మనుష్యుల శుభ్రతనూ, ఉన్నంతలోనే జాగ్రత్తగా మసలుకోవాలన్న మెలకువనూ అభినందించుకుంటూ నడుస్తూండగానే..అల్లంత దూరాన తరగల నురగలతో నవ్వుతూ పిలుస్తూ సముద్రం. ఆ సాగరఘోషలో అంతులేని ఆకర్షణ ఉంది. అర్థమయీ అవని విషాదమూ దాగుంది. "సముద్రం సంగతి" అంటూ, దేవిప్రియ ఓ కవితలో ఇలా అంటారు -

"వేయి తలల నాగులా
అలల నాలుకలు చాచుకుని
పైపైకి వస్తోంది సముద్రం
నా పాదాల మంత్రదండాలు తగిలితే
పడగల్ని రాతి గట్టుకేసి కొట్టుకుని
మళ్ళీ నీటిపుట్టలోకి నిష్క్రమించడానికి"

దేవిప్రియ ఏ సముద్రం ముందు నిల్చుకుని ఇంత చమత్కారంగా ఆలోచించారో అనుకుంటూ, చర్చించుకుంటూ, ఆ సాగరతీరంలో మేమిద్దరం నడక మొదలెట్టాం. నిర్మానుష్యంగా, నిర్మలంగా, తడిగా, ఒకింత గట్టిగా ఉన్న ఆ ఒడ్డు వెంట..ఎన్ని మైళ్ళు నడిచినా అలసట రానివ్వని మహత్తేదో ఉంది. ఏ అలల చప్పుళ్ళు విన్నా, ఏవో కథలు వినపడుతూనే ఉంటాయి. వాన పెరుగుతూ తగ్గుతూ ఉంది. అలలు మెదిపిన తీరాల మీద చినుకులేవో అర్థమవని చిత్రాలు గీయడం మొదలెట్టాయి. సుడులుసుడులుగా లోతుగా, స్పష్టంగా - క్షణికాలే కానీ, చూసి తీరాల్సిన బొమ్మలవి. సముద్రంలో వాన చినుకుల చప్పుళ్ళు సంగీతమైతే, తడితడి తీరాల పెదవుల మీద చినుకుల ముద్దు ముద్దరలన్నీ చిత్రలేఖలే. 

మరికాసేపటికి ఎటు నుండి వచ్చిందో - ఓ కాకి ఆ తీరానికి వచ్చింది. కాకిని, అందులోనూ ఒంటరి కాకిని చూస్తే, నాకు బషో గుర్తొస్తాడు. లోకం చలికాలపు దిగులు సాయంకాలమవుతుంది. కానీ, ఆనాటి కాకి కథ వేరు. అల వచ్చేవరకు నిశ్చలంగా నిలబడి సముద్రం వైపే చూడటం; అల మీదకు రాగానే గంతులతో అడుగులు వెనక్కు వేయడం. ఇసుక మీద పడటం వల్లో, అలల తుంపరల వల్లో - ఆగీ ఆగీ రెక్కలు విదుల్చుకోవడం. మళ్ళీ సముద్రం వైపు నాలుగడుగులు..మళ్ళీ వెనక్కు, మళ్ళీ తపతపా రెక్కల చప్పుడు..మళ్ళీ ముందుకు..! దాని ఈ చేష్టితాలన్నీ చూస్తూ చూస్తూ ఫొటోలు తీస్తూ ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఈ మధ్యే చదివిన రోబర్ట్ ఫ్రోస్ట్ కవిత "డస్ట్ ఆఫ్ స్నో" కూడా గుర్తొచ్చింది. అందులోనూ ఇంతే, గన్నేరు చెట్టు మీద తీరి కూర్చున్న కాకి, తుషార ధూళిని విదుల్చుకున్న తీరే కవి హృదయానికి కొత్త గతినిచ్చిందట. విషాదంలో మగ్గాల్సిన ఓ రోజు నుండి అతనిక్కొంత ఉపశాంతినిచ్చిందట. ఇది అతిశయోక్తి అని ఏ పాఠకులకైనా అనిపించిందీ అంటే, అట్లాంటి ఓ అనుభవం వారికి జీవితంలో ఎదురుపడలేదని అర్థమన్నమాట. చాలా తేలిగ్గా కనిపించే ఇలాంటి కవితల వెనుక ఎంత సున్నితమైన రసస్పందనలు ఉంటాయో, ఎలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలు ఉంటాయో తెలుసుకోగల్గడమే, ఆనాడు గోకర్ణం సముద్రతీరంలో నే నేర్చుకున్న పాఠం. నా ఉనికిని నిర్లక్ష్యం చేస్తూ తీరమంతా కలియదిరిగిన ఆ కాకి, బహుశా నాకు చెప్పాలనుకున్నదీ అదే కావచ్చును.   

ఇంకా ఎన్ని గంటలలా గడిచిపోయేవోకానీ, అందాకా ఆహ్లాదంగా కురిసిన వర్షం జడివానగా మారి చలి మొదలవ్వడంతో, వెంట తెచ్చుకున్న గొడుగులో ఒదిగి వెనక్కు మళ్ళాం.  ముందు రాత్రీ, ఆ వేళా, వేంకటరమణుడి గుడి నుండి ఆగకుండా భజనలెందుకు వినపడ్డాయో, చిన్నపెద్దా గొంతులు అన్నేసి భాషల్లో కృష్ణగీతాలెందుకు ఆలపించారో, "కృష్ణా నీ బేగనే బారో" అంటూ ఎందుకంతలా తపించారో గుడిలోకి అడుగుపెట్టేదాకా తట్టనేలేదు మాకు. ఆ వేళ కృష్ణాష్టమి. మేం వెళ్ళిన కాసేపటికే అక్కడికొక విశాలమైన వెండి ఉయ్యాలనూ, దాని తోడిదే సందళ్ళనూ మోసుకుంటూ యువకులు కొందరు దూసుకొచ్చారు. మండపం మధ్యలో అందరూ నిలబడి చూసేందుకనువుగా క్షణాల్లో ఊయలను వేలాడదీశారు. చామంతి, మల్లె, మరువం, కనకాంబరాలతో ఒద్దికగా అల్లిన మాలలను ఉయ్యాలకు బయటివైపు అన్ని దిక్కుల్లోనూ వేలాడదీసి దానిని వర్ణరంజితం చేశారు. పట్టుపరుపులు, తలగడలు తరలి వచ్చాయి. మరి చిన్ని కృష్ణుడెక్కడున్నట్టూ? నాలో అంతకంతకూ పెరుగుతోన్న ఉత్సుకతకు తగ్గట్టే, భజన వేగమూ పెరిగింది. తాళం అంతకంతకూ మారిపోతోంది. శ్రీకృష్ణ స్మరణతో సభామండపం మారుమ్రోగిపోతోంది. నేనిక కుతూహలాన్ని అణచుకోలేక, పాడుతున్న పాటనలా గాలికి వదిలి, ఊయల వద్దకెళ్ళి తొంగి చూశాను. ఆశ్చర్యం! బాలకృష్ణుడక్కడే పడుకుని హాయిగా నిద్దరోతున్నాడు. వేనవేల గోపికలను "బిగియార కౌగిట మనంబలరారగ జేర్చి"న కొంటెకృష్ణుడేమీ కాదు సుమా, యదుకుల క్షీరవారాశి పూర్ణచంద్రుడితడు. యదుసింహ కిశోరుడు. అంగుష్ఠమాత్రమైనా లేని పసిడి విగ్రహమై, పసివాడై వామహస్తాన్ని నెన్నుదిటిపై వాల్చుకుని పట్టుపరుపుల మధ్య పవ్వళిస్తున్నాడు. "లోకములు నిదురవోవగ జోకొట్టూచు నిదురవోని సుభగుడు" మళ్ళీ ఇలా మనబోటి మామూలు మనుష్యుల ఉత్సవసంబరాన్ని చిన్నబుచ్చకుండా ఉండేందుకు నవ్వుతూ నిదుర నటిస్తున్నాడు. "జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజోకృష్ణా!!  జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన! జోజో" అంటూ, అలనాడు యశోద, గోపికలు ఏ విశ్వాసంతో, ఏ అనురాగంతో ఆ బాలకృష్ణుని నిదురపుచ్చారో, అదే భావనతో, అదే నమ్మికతో మేమూ వెండి ఉయ్యాల నూపుతూ జోలపాడాము. భజన అలా నిర్విరామంగా సాగుతూనే ఉంది. మేమా గుడి నుండీ, గోకర్ణం నుండీ వెనక్కు రావలసిన వేళ దగ్గరపడుతోంది. తులసిమాలల మధ్య ఒత్తిగిలిన నందనందనుణ్ణి వీడుకోలువేళ మెల్లగా తాకి చూశాను. గోకర్ణం రేపల్లెగా మారింది. హృదయం బృందావనియై నవ్వింది. తృప్తి.  
***************************

గోకర్ణం నుండీ ఇటు మూకాంబిక, ఉడిపి, అటు వెళ్తే గోవా ఇవన్నీ దగ్గర దగ్గరే. ఏవి చూడాలీ, ఏవి వదలాలన్నది పూర్తిగా మన ఆసక్తులకు సంబంధించిన విషయం. గోకర్ణం నావరకూ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం, నాగరిక ఛాయలు పడని స్వచ్ఛ సౌందర్యం.  ఓం బీచ్‌లోనూ, కడల్ బీచ్‌లోనూ కూడా విచ్చలవిడితనం లేదు. గుడినీ, సముద్రాన్నీ మినహాయిస్తే, ఇక్కడ చూడటానికీ, చేయడానికీ ఏమీ లేదు. అది కొందరికి నిస్తేజాన్ని, కొందరికి ఉత్తేజాన్ని కలిగించవచ్చు. బెంగళూరుకు తిరిగి ఒకే ఒక్క రైలు ఉంది. అదీ నాలుగ్గంటలకే. తిరుగు ప్రయాణంలో "Value Vision consultancy " స్థాపించిన పూర్ణిమ నా ముందు కూర్చున్నారు. ఇరవైరెండేళ్ళ తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఆటుపోట్లనీ, ఆవిడ వాటిని దాటుకొచ్చిన తీరునీ ఆసక్తిగా చెబుతోంటే, నాకసలు సమయం తెలీలేదు. బహుశా, చాలా చోట్ల నన్ను నేను చూసుకోవడం వల్ల అయి ఉండవచ్చు. మర్నాడు తెల్లవారు ఐదుగంటలకే లేచి, అందరం ఫ్రెష్ అయిపోయి, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని కాఫీలు తాగుతూ "ఆల్టర్నేటివ్ కెరీర్ ప్లాన్స్ ఫర్ విమెన్" చర్చించుకున్నాం. మద్దూర్ రాగానే రైల్లోకి వడలమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళని ఆపి, మమ్మల్నీ కొనుక్కోమని సూచించారావిడ. మద్దూర్ వడకంత పేరు ఊరికే రాలేదని మొదటి ముక్కకే అర్థమయిపోయింది.

బెంగళూరు చేరిపోయాం. కొత్త అనుభవాలూ, పాతబడని జ్ఞాపకాలూ, కొందరు మంచి మనుష్యులు, మనసులో ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్వేగపు కెరటాలు - అన్నింటి తాకిడినీ పరిపూర్ణంగా అనుభవిస్తూ, "మండే మార్నింగ్"ని కూడా ప్రేమిస్తూ...’నమ్మ బెంగళూరు’లో – ‘మస్త్ మజా మాడి’ అనుకుంటూ. 

"ఏకాంత జీవితంలో లోతు ఎక్కువవుతుంది, సమాజజీవితంలో వెడల్పు ఎక్కువవుతుంది" అన్న సంజీవ్‌దేవ్ మాటలెంత సత్యం!
* తొలి ప్రచురణ -సారంగలో


మురుడేశ్వర్
  
Anil At Gokarna 

ఇలాక్కూడా

ఒక్కోసారి ఒంటరిగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎవరూ లేని బోగీలో, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని, ఒక్కరమే, రాత్రంతా గడపాల్సి రావచ్చు.
చవితి చంద్రుణ్ణి చూస్తూ, నక్షత్రాలు లెక్కపెడుతూ, నీడల్లా వెనక్కు మళ్ళుతోన్న చెట్లను చూస్తూ, గంటలు కరిగించుకున్నా,

అంత తేలిగ్గా తెల్లవారకపోవచ్చు.

హాండ్బాగును సీటు క్రిందకు నిర్లక్ష్యంగా తోసి, వెంట తెచ్చుకున్న కవిత్వాన్ని మాత్రం గుండెలకు పొదువుకుని, నిన్ను నీకు దూరం చేసిన ఆ ఒకే ఒక్క కవితను- లేదా నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసిన ఆ ఒకే ఒక్క కవితను విప్పారిన కళ్ళతో మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిండుగా కప్పుకుంటూ..నువ్ నిద్రలోకి జారుకోవచ్చు.

తెల్లవారాక, నువ్వు కాఫీ కప్పు పట్టుకుని పేజీలు తిరగేసే వేళకి, పైబెర్తు నుండి క్రిందకు దిగిన మనిషి, "కవిత్వం ఇష్టమా తల్లీ?" అని చిరునవ్వుతో కబుర్లు మొదలెట్టినప్పుడు..మొదట ఒకింత ఆశ్చర్యంతోనూ, అటుపైన పట్టిచ్చిన పుస్తకం గుర్తొచ్చి ఒకింత సంతోషంగానూ, ఇంకాస్త హుషారుతోనూ,

నచ్చిన కవిత్వం గురించీ, నచ్చే కవుల గురించి, ఎప్పటిలాగే నువ్వు కబుర్లు చెప్పవచ్చు.

ఊ కొట్టాల్సిన మనిషి అకస్మాత్తుగా మాయమై, మాయమైనంత వేగంగానూ తిరిగి ప్రత్యక్షమై..."నచ్చే కవితో మాట్లాడి చూడు మరీ" అంటూ తన ఫోన్ నీ చెవికి అందించి నవ్వు మొహంతో చూస్తూన్నప్పుడు,

నువ్వే కవి పట్ల అభిమానమన్నావో,
ఎవరి కవిత్వం నీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుందన్నావో,
ఎవర్ని చదువుతూ లౌకికమైన బాధలకు ఎడంగా కొన్ని క్షణాలు నువ్వు బతకగలనన్నావో,
ఎవరు నీకో స్వాప్నిక జగత్తును పరిచయం చేసారని మురిశావో..

ఆ కవి గొంతు వినపడి, నీ జవాబు కోసం ఆగి ఉన్నప్పుడు,

ఆ అకస్మాత్తు అనుభవం నీ వేయిన్నొక్క మాటలనూ నిశ్శబ్దంలోకి తోసి,
నీ ఉద్వేగాగలన్నింటినీ మౌనంలో తొక్కి పెట్టి..

ఏమో, అభిమానాన్ని కవికి చేరవేయనూ వచ్చు,
చేరవేయలేక ఓడిపోనూ వచ్చు,

పర్లేదు, మాటలకందని తృప్తి ఒకటి వీటన్నింటికీ అతీతమైనదన్న ఎరుక నీలో కలగనూ వచ్చు.
— feeling wonderful.

తామరాకుపై నీటిబొట్టు


గులాబిముళ్ళను దాటి మెత్తని రేకుల తాకలేని చూపుల్తో
మిటారివెన్నెల నీడల్ని వదిలి జాబిలిని పట్టలేని జీవితాల్తో
కోర్కెల చిదుగులు పోగేసి చింతల చితి రాజేస్తున్నప్పుడు
తనవైనవన్నీ త్యజిస్తూనే తనవి కానివేవీ లేవనే విరాగిలా
ఎవరో కనిపిస్తారు, కదిలిస్తారు
మన అత్యాశల మీద అసహ్యాన్నికలిగిస్తారు.

త్రిశంకుస్వర్గాన చీలిపోయే గెలుపు నిచ్చెనపై వణికే దేహంతో  
కోరివెళ్ళిన మార్గాల్లో కోల్పోయిన వర్ణాలకై మరిగే ప్రాణంతో
దిగులుకలుగులో చేరి నిరాశానిప్పుల్లో దహనమౌతున్నప్పుడు
శిశిరోత్తర వేళల్లోనూ వసంతాన్ని స్వప్నించగల లతానెలతల్లా
ఎవరో ఎదురొస్తారు, నిలదీస్తారు
మనలోని లోటునీ లోలోపలి చీకట్లనీ పరిహసిస్తారు.

సంఘర్షణ మొదలవుతుంది, జీవితం మారదు
దాహం తీరదు, మోహపాశమూ తెగదు
సంద్రపునీరెంత ఉప్పనో గొంతు దిగందే నేర్వరెవ్వరూ.
అంతర్యానం కొనసాగుతుంది - దుఃఖం ఆగదు
బ్రతుకంతా అలవాటో పొరబాటో తెలిసిరాదు
ఎడారిలో పరుగెందుకాపాలో విప్పి చెప్పరెవ్వరూ.

సంఘర్షణల రాపిడికి
స్వర్ణకాంతులీనుతోన్న హృదయంతో,      
ఏ చీకటి లోతుల్లోనో
వెలుగులు చూసిన ఉద్వేగంతో,
ఎదురుచూడని ఏదో మలుపులో, జ్ఞానం-
కాలం పొత్తిళ్ళలో కళ్ళువిప్పుతుంది.

ఆత్మ ముందు నిగర్విలా మోకరిల్లే ఆ పూర్ణక్షణాల్లో
జతపడ్డ చేతులే జల్లెళ్ళై జీవితాన్నివడకడుతోంటే
తామరాకుపై నీటిబొట్టులా మసలడమూ  
చీకటింట వెలుగురవ్వలా మెరవడమూ
ఎవరికి వారే నేర్వగల్గిన మర్మవిద్యలై
జీవనసౌందర్యాన్ని పునర్నిర్వచిస్తాయి.

* తొలి ప్రచురణ: ఆటా జ్ఞాపక సంచిక- అక్షరలో 

సరే, గుర్తుచేయన్లే!

తొలిప్రచురణ -సారంగలో.
గుర్తొస్తూంటాయెపుడూ,

వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి 
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,

లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,

లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు- 

నీకూ గుర్తొస్తాయా, ఎప్పుడైనా...

శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు,

కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు,

గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు -

సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.
పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

కొండదారిలో...

ఆ దారి వెంట నడచిపోతోంటే
సూరీడి ఏటవాలు కిరణాలు
నీడలను నాట్యాలాడిస్తుంటాయి.
గాలులు చేలో మొక్కలతో
అంటుకునే ఆట కాబోలు
అలసట లేకుండా ఆడుతూంటాయి.
రెక్కలు చరుచుకుంటూ
పొగలా లేచిన పక్షుల గుంపొకటి
మబ్బుల్లోకి ఎగిరి మాయమౌతుంది.
ఎవరో పేనిన ఊడల ఉయ్యాల
ఊగేందు కెవరూ రారేంటని
కొమ్మలను కుదిపేస్తుంటుంది.
కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,
ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.
కడవల్లో నీలాకాశాన్ని మోసుకుంటూ
వడివడిగా నడచిపోయిన ఆ
కొండయువతి కడియాల చప్పుడు
ఘల్లుమని ఈ గుండెల్లో
మోగడమాగదు!                                                                                              --------------------                                                                                                 తొలి ప్రచురణ - ఈమాటలో.

చిన్నికృష్ణా..!

చెప్పవూ, ఎప్పుడు వస్తావో! నీ మీద బెంగతో నిద్ర మరలిపోయింది. ఎర్రబారిన కనులలో ఆశ మిణుకుమిణుకుమంటోంది. నలనల్లని ఉంగరాల ముంగురులు పసివేళ్ళతో వెనక్కు తోసుకుంటూ, ధూళిధూసరితదేహంతో చిందాడుతూ, చెదరిన ముత్యాలహారాలతో, నడుము ఒంపులో దోపిన మోహనమురళితో పరుగుపరుగున వచ్చి ఒడిలో వాలి, నా కన్నుల్లోకి చూసి నవ్వే మాయామోహనమురళీధరుణ్ణి చూడాలనే అహరహం నిరీక్షణ.

ఈరోజైనా నువ్వొస్తావనో, లేదా నిన్ను చూస్తాననో ఆశే శ్వాసగా తెల్లవారుతుంది. తమాల వృక్షాల క్రింద నీడలు చిక్కనవుతూ చీకటిలో కలిసిపోయేవేళ, రాత్రీ నిన్ను చూడకుండానే గడవాలన్న ఆవేదనే ఆలోచనలన్నింటా కమ్ముకుంటుంది. తప్పదుఎదురు చూడాలి. తెలిసో తెలియకో తప్పో తప్పకో రేపల్లెను విడిచి వెళ్ళావుకానీ, పని ముగిసిన మరుక్షణం పరుగుపరుగున వచ్చి నీవీ వాకిట్లో నిలబడ్డ క్షణాన, కప్పురపు హారతితో ఎదురొచ్చి నేనేగా నీకు దిష్టి తీయాలీ?

సర్దుమణిగిన రేపల్లె వీథుల్లోకి చందురుడు తేరిపార చూస్తున్నాడు. యమున పరవళ్ళు లయగా వినపడుతున్నాయి. ఎన్నాళ్ళయింది యమునా తరంగాల సంగీతాన్ని విని మైమరచి! శతకోటి నోముల పంటగా నువు పుట్టి, నట్టింట బోసినవ్వులు చిందించావన్న వార్త తెలిసింది మొదలు, రేపల్లె మొత్తం తరలి రాలేదూ! పసికందుగా ఉన్న నిన్ను అపురూపంగా ఎత్తుకు పొదువుకుని, గులాబి గుప్పిళ్ళను విప్పి చూసి, పాలుగారే చెక్కిళ్ళు చిదిమి, ముద్దులమూట పుట్టాడమ్మా అంటూ మురిసిపోయిన ఇందరిందరి హృదయాలలో ఎగసిపడ్డ సంతోష తరంగాల జోరులో యమున మరుగున పడటం ఏమంత ఆశ్చర్యంఏరీ ఆ యదుకులోత్తములందరూ? ఎక్కడున్నారా గోపబాలురు, గోపికాలలామలు? రారే?! అవునులే, శిశిరోత్తరాన పూతేనియల కోసమాశపడి తుమ్మెదలొస్తాయా? వసంతాన్ని వెంటేసుకుని మళ్ళీ నువ్వొచ్చేదాకా, బ్రతుకుకీ వేదన తప్పదు! అల్లంతదూరాన నిను చూస్తూనే చెంగనాలేస్తూ నీ చుట్టూ చేరే లేగలూ, ఖణిల్లుమని రంకెలు వేస్తూ ఉరుకులతో నిను సమీపించే వృషభరాజాలూ, అంబారావాలతోనే పలకరించి అభిమానాన్ని పండించే అలమందలూ – చూడిప్పుడు, అన్నింటిలోనూ మూర్తీభవించిన మౌనమే!

వెలుగు మూటలు విప్పి లోకాల వజ్రపు కాంతులు జల్లే సూరీడు, పశ్చిమానికి ఒరిగే వేళల్లో మళ్ళీ వెలుగంతా వెంటబెట్టుకెళ్ళినట్టు, నువ్వొస్తూ వస్తూ ఇంత సందడినీ, సంతోషాన్నీ జతగా పిలుచుకుని నువ్వు లేని లోకాన్ని మాత్రం శూన్యం చేస్తావు కదా కృష్ణా! అన్నీ  నీలోనే, నీవెంటే!

దిగులుదిగులుగా క్షణాలు జారవిడుస్తోన్న నను చూసి జాలిగా పలకరించి ఇంటికి పిలిచింది రేవతీదేవి.  చేయిపట్టి పెరడులోకి నడిపించుకు వెళ్ళి ఊయలబల్ల మీద కూర్చుండబెట్టింది.  ఏముందక్కడ? హృదయం ఉలికులికిపడింది. నా అనుమానం గ్రహించి చల్లగా నవ్వింది సఖి –“రహస్యం చెప్పనా యశోదానందనందనుడు మెచ్చిన చోటిదిఅంటూ.  చటుక్కున కన్నుల్లో నీరు చిప్పిల్లింది. అలవోకగా కదిలే వేలికొసల మధ్య ఒదిగిన వేణువులో నీ ఊపిరి సంగీతమవుతుందిట. నీవక్కడ ఆడే వేళల్లో నవ్వు మోము మీద జలతారు వెన్నెల పారాడుతుందట. నీ సాంగత్యంలో హృదయం బృందావనిగా మారిపోతుందట. ఎంత అతిశయం మాటమాటలోనూ! ఆశ్చర్యపోతూ విన్నాను. ఆశ్చర్యపోతూనే ప్రాంతమంతా పరికించి చూశాను

వెన్నెదొంగవంటూ నీ మీద నేరాలు మోపినప్పుడు, కాచుకు తీసుకు వెళ్ళడానికి ఎన్ని సార్లీ చోటికి రాలేదూ..!   రోజు విన్న సౌందర్యం, రోజు ఉందనిపిస్తోన్న సౌందర్యం ఆనాడూ ఇక్కడే ఉందా? తెలిసిసొస్తోందిప్పుడే!  నాకు సౌందర్యమంటే నువ్వే! నీ నవ్వే! సౌందర్యమంటూ ఉంటే అది నీవెంటే! నీలోనే! నీతోనే! లోపమంటూ కనపడదు, నిజం, లోకమంతా కనపడదు నాకు నీ మాయలోనెచ్చెలికి వీడ్కోలు పలికి, ఇంటికి చేరాక అనిపించిందికృష్ణా! నీలోకమెంత పెద్దదీ..
నేనొట్టి వెర్రి తల్లినినా స్థానం చాలా చిన్నది 

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....