శరత్ రాత్రి ..

శరత్ రాత్రి ..

నల నల్లని మేఘాల కొంగుల్లో దాక్కుని చందమామ తొంగి చూస్తుంటే..
ఆ వెన్నెల సోయగాల మధ్య ఆశల పాన్పు  పరిచి నీవలా నన్ను ఆహ్వానిస్తుంటే..
నీ వాడి చూపుల సంకెళ్ళలో  చిక్కుకు బందీ అవుతానని బెంగ పడుతోంది నా హృదయం..
మాటకు చోటు లేని  మౌనసంద్రంలో అలనై ఎగసి అలసిపోతానని కలవరపెడుతోందో  భయం!
తేల్చి చెప్పవా ప్రణయమా..

వలపు విరి తోటలో ఉదయించి వాడిపోను కదా
తలపులను అల్లుకుపోతున్న నీ మాయలో పడి తల్లడిల్లిపోను కదా..!!
   

పాటల పల్లకిలో...

ఒక్కో సారి ఉదయాన్నే లేవగానే ఎక్కడి నుండో ఒక అందమైన పాట వచ్చి, నా  తలపులని అల్లుకుపోతుంది. ఇక ఆ రోజంతా నేను ఏం పని చేస్తున్నా , నా మనసులో నుండి ఆ పాట మాత్రం వెళ్ళిపోదు. కొన్ని వందల సార్లు "పాడిందే పాట..."లా పాడుకున్నాక, నాకు బుర్ర వెలుగుతుంది.. ఛ..ఛ...విసుగు విరామం లేకుండా ఇదే పాట ఇన్నేసి  సార్లు ఏం  పాడుకుంటాం లే  అనిపించాక, బలవంతం గా ఆ పాటని మార్చేస్కుంటాను. నా తోటి వాళ్ళు అప్పుడు 'హమ్మయ్య..బతికిపోయాం బాబోయ్' అనుకుని సంబరపడతారు.

అందరికీ ఎలా అనిపిస్తుందో  తెలీదు కాని, నాకు మాత్రం ప్రతీ  పాట ఒక జ్ఞాపకాల పందిరే. ఒక్కో పాట వింటుంటే, ఆలోచనలు మొదటి సారి ఆ పాట విన్న రోజుల్లోకి అనుకోకుండానే వెళ్ళిపోతాయి. ఉన్నట్టుండి కాలం సినిమాల్లో చూపించినట్టు గిర్రున వెనక్కి తిరిగి గతంలోకి జారుకున్న అనుభూతి కలుగుతుంది.

మొత్తం నాకు తెలిసిన జనాభా అందరిలోకి, ఈ రోజు దాకా, పాటల్లో మా అక్క కి ఉన్నంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు నాకు ఎదురు పడలేదు. పాట ఇంకా మొదలవ్వకుండానే, మ్యూజిక్ ని బట్టి పాట చెప్పెయ్యగల దిట్ట.
అలా మా అక్క అంత  తెలివితేటలు  నాకు కూడా ఉన్నాయి అనిపించుకోవాలని చిన్నప్పటి నుండి నాకు బోలెడు ఆశగా ఉండేది. చదువులో ఆ తెలివి ఎలాగో లేదని అప్పటికే అందరూ నిర్ణయించేశారు కాబట్టి , సినిమాలు- పాటల విషయం లో అయినా 'అక్క ని  మించిన చెల్లి'  అని పేరు తెచ్చుకోవాలని  మనసులో బలంగా నిర్ణయించుకున్నాను .
నేను ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే అదృష్టం నన్ను వెదుక్కుంటూ వచ్చి నా తలుపు తట్టింది. నా గొప్పతనాన్ని  నిరూపించుకునేందుకు నాకొక గొప్ప అవకాశం లభించింది.
అక్కా నేను  మాములుగా అయితే ఎప్పుడూ బద్ధ శత్రువులలానే మాట్లాడుకుంటాం . అలా కాకుండా మేము ప్రేమగా మాట్లాడుకున్నాం అంటే , అది మహా గొప్ప శుభ దినం అయినా అయ్యి ఉండాలి, లేదంటే అమ్మ మా గొడవలు భరించలేక అక్షింతలో, వీపు మీద అప్పాలో వేసి, ప్రేమగా ఉండాలి అని అప్పుడే తిట్టి వెళ్లి ఉండాలి.
అక్క-నేను అలా  సఖ్యంగా ఉన్న అరుదైన రోజుల్లో ఒకసారి, నేను పట్టుకోక పట్టుకోక పుస్తకం పట్టుకుని చదువుతుంటే,  "ఈ పాట ఏ సినిమా లోదో  చెప్పుకుంటే, నా కొత్త డ్రెస్ నీకో సారికి ఇస్తాను" అని ఆఫర్ ఇచింది.  అక్క డ్రెస్ అంటే ఐషు డ్రెస్ అంత గొప్పదని గుడ్డిగా నమ్మే నేను, జీవితం లో అంతకు ముందెప్పుడూ లేనంత ఏకాగ్రత తో ఆ టేప్ రికార్డర్ మీద పూర్తిగా పడిపోయి మరీ పాట వినదానికి రెడీ అయిపోయాను . కరోడ్పతి ప్రోగ్రాం లో ఆఖరు ప్రశ్నకి సిధమైన వాళ్ళకి ఉన్నంత టెన్షన్ ఉంది నాలో.
అప్పుడు గుర్తొచింది నాకు...ఒకవేళ నేను సమాధానం చెప్పకపోతే?! ....అమ్మో, అక్క అసలే నా కన్నా చాలా తెలివైనది. ఈ విషయం అమ్మ వాళ్ళ దగ్గర ఒప్పుకోకపోతే నష్టమేం లేదు కాని, నాకు నేను ఒప్పేసుకోవాలి కదా. లేదంటే ఏదో ఒక అపాయం వచేస్తుంది.
ఇలా తెలివి గా అలోచించి, "ఒక్క నిముషం" అంటూ అక్క చెయ్యి పట్టి ఆపేసాను.
"ఒకవేళ నేను పాట చెప్పుకోలేకపోతే...?" అనుమానంగా అడిగాను.
"నేను చెప్తాలే..దానికేముంది.." నా తెలివైన ప్రశ్న ని తేలిగ్గా తీసిపారేస్తూ అక్క దేవతలా బదులిచ్చింది.ఇలాంటి మంచి అక్కనా అనుమనిన్చావు అని నా మనసు నన్ను మందలించడం అయిపోయాక, 'సరే, పాట వినిపించు మరి' అంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చేసాను.
చక్కటి సంగీతంతో మొదలై, సరిగ్గా పాట వినపాడే సమయానికి, అక్క 'స్టాప్' బటన్ నొక్కేసింది :(
నేను అయోమయం గా చూసాను. 'ఊ చెప్పు...' అంటోంది అక్క.
"పాట ఎక్కడ మొదలైంది అక్కా, మ్యూజిక్ వినిపించావ్ అంతే ఇప్పటి దాకా.." ఈ విషయం దానికి తెలుసని తెలిసినా ఏమిటో మరి అలా అడిగేసాను.
"అదే కదా మరి పందెం...మ్యూజిక్ విని పాట  పట్టేయ్యాలి, చెప్పు చెప్పు.."
అయిపోయింది. అనుకున్నదంతా అయిపోయింది. అయినా  నా పిచ్చి  కాని, అక్క ఏంటి, దాని కొత్త డ్రెస్ ఫస్ట్ టైం  నన్ను వేసుకోమనడం ఏంటి....! ఈ పాట చెప్పుకోవడం నా వాళ్ళ కాదు అని అర్థం అయిపోయింది.
ఎదురుగా ఉన్న అక్క నీలం రంగు డ్రెస్ నాలో ఎక్కడ లేని బాధని కలిగిస్తోంది.అక్క కి ఇళయరాజా అంటే చాలా ఇష్టం అని తెలుసు కాబట్టి, ఆఖరు ప్రయత్నంగా , బాగా సంగీత జ్ఞానం ఉన్న దానిలానే చూస్తూ...'ఏదో ఇళయరాజా పాటలానే అనిపిస్తోంది, జస్ట్ పేరు గుర్తు రావాలి అంతే..'  అని ఒక రాయి వేసి చూసాను. 'ఇళయరాజానా...కనీసం సంగీత దర్శకుడి పేరు కరెక్ట్ గా చెప్పినా నువ్వే గెలిచావు అని ఒప్పుకునేదాన్ని...కాని నీ బాడ్ లక్', అని తేల్చేసింది.
దిగాలు మొహం తో,
'ఈ లెక్కన ఆ పాట కనిపెట్టడం నా వాళ్ళ కాదులే ' అని మర్యాదగా ఒప్పేసుకుని, పాట వినిపించమని అడిగాను. అప్పుడు నేను విన్న సూపర్ సాంగ్, "సఖి" సినిమా లోది. ఒక్కో పాట , ఆ సంగీతం మనసుని తాకుతున్నట్టు అనిపిస్తుంటే, అమ్మ వాళ్ళు పడుకున్నాక,మా ఇద్దరికీ మాత్రమే వినపడేలా ఈ పాటలు పెట్టుకుని వింటూ చదువుకునే వాళ్ళం.
అంతా బానే ఉండేది కాని, పొద్దున్నే చిక్కొచ్చి పడేది. అక్క కి పాటలు పడే అలవాటు లేదు. కాని నాకు ఉంది.
ముందే చెప్పినట్టు ఏ పాట పట్టుకుంటే దానిని విసుగు లేకుండా ఎంత సేపైనా పాడగలను. అప్పుడు కూడా అలాగే  పొద్దున్నే లేచి ,పుస్తకాలూ ముందేసుకుని  'రహస్య స్నేహితుడా...చిన్న చిన్న హద్దు మీర వచునోయి '  అని కూని  రాగాలు తీస్తుంటే మా నాన్నగారు వినేసి, " ఈ పాపిష్టి పాటలు ఇంకోసారి ఇంట్లో విన్నాఅంటే ఊరుకునేది లేదు" అంటూ వార్నింగ్  ఇచ్చారు.
కొత్త సినిమా పాటల గురించి అస్సలే మాత్రం తెలీని  అమ్మ కూడా, నేను 'స్నేహితుడు' అనగానే 'ఆ మగ వెధవల గురించి పాటలు పాడకని చెప్పానా' అని మళ్లీ ఒకసారి గుర్తు చేసి వెళ్ళిపోయింది, అదేదో అక్కడికి ఆ పాట నేనే రాసేసినట్టు.
ఎవరైనా తిట్టినప్పుడు క్షణ కాలం చెవులు మూసుకుని, ఆ తర్వాత అవన్నీ దులిపేసుకోవాలని నేను చాలా చిన్నప్పుడే నిర్ణయం తీసేసుకున్నా కాబట్టి, వాళ్ళ మాటల తూటాలు  నన్ను బాధ పెట్టలేదు.
కాని, సడన్ గా ఒక డౌట్ నా మెదడు తోలిచేస్తుంటే, లేడి పిల్లలా దూకుతూ  వంటింట్లో పని చేసుకుంటున్న అమ్మ దగ్గరికి  వెళ్ళాను.
"అవునమ్మా..మీరెందుకు ఎప్పుడూ ఏమీ పాడుకోరు పాపం?  నీ గొంతు స్వీట్ గా ఉంటుంది కదా, నువ్వు పాడచ్చు కదా అమ్మా..చిన్నప్పుడు కూడా పాడేదానివి కాదా.."  అమ్మ చీర కొంగు మెలిపెడుతూ ఆడుకుంటూ అడిగాను,

"ఎందుకు పాడే దాన్ని కాదు..ఇలాగే ఒకసారి చిన్నప్పుడు, 'ఊహలు గుస గుస లాడే' పాట లేదూ...ఆ పాట పాడుకుంటున్నా ఇంట్లో. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మమ్మ  'వలదన్న వినదీ మనసు...కలనైన నిన్నే తలచు' అని నేను పాడుకోవడం విని నానా రకాలుగా తిట్టింది. అప్పటి నుండి వినడమే మిగిలింది.." నవ్వుకుంటూ చెప్పింది అమ్మ.
"అమ్మమ్మ నీలో ఉన్న సింగెర్ గొంతు నొక్కేసింది అమ్మా. నువ్వా తప్పు మళ్లీ చెయ్యకు,ఎంచక్కా  నన్నుఅన్ని పాటలు పాడుకోనిచ్చావు అనుకో, నీ గురించి అన్ని తరాల వాళ్ళకి గొప్ప గా చెప్తాను .." దొరికిందే ఛాన్స్ అని నేను చెప్పాల్సింది చెప్పేసాను.

"నీ దొంగ నాటకాలు నాకు తెలీనివి కాదులే కాని, వెళ్లి పుస్తకాలూ పట్టుకో పద పద, చేసిన కాలక్షేపం చాలు' అంటూ అమ్మ నన్ను ఇంట్లోకి పంపేసింది.
సఖి పాటలు విన్నప్పుడల్లా ఈ అందమైన జ్ఞాపకాలు నన్ను చుట్టూ ముడుతూనే ఉంటాయి..ఎప్పటికీ..!

మాటే మంత్రమా...

మధుమానసం


పాలనురుగుల నవ్వుల్లా, లతానెలతల నాలింగనం చేసుకున్న ముత్తెపు చినుకుల్లా - స్వచ్ఛంగా మెరిసే అక్షరాల ఆసరాతో కొత్త ప్రపంచంలోకి అడుగుడిడానికో చిరు ప్రయత్నం ...

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....