ప్లవ

ప్రేమించు మిత్రమా!

ప్రేమించు రేపటి నీ రోజుని. నీ ఉగాదిని.
నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు
నీ కలలనూ కోర్కెలనూ ప్రేమించుకున్నట్టు
ఇష్టంగా బలంగా నమ్మకంగా ప్రేమించు;
ఆహ్వానించు.

నమ్ము మిత్రమా!
నమ్ము రేపటి నీ రోజుని, నీదైన ఈ ఉగాదిని.
నీ వాకిలిని అయాచితంగా పూదోటగా మార్చే
పసుపుపూల చెట్టుని దిగాలు క్షణాల్లో నమ్మినట్టు
మునిచీకట్లలో కనపడని వెన్నెలదీపాన్ని నమ్మినట్టు
కోప్పడిన అమ్మ లాంటి కాలం, దైవం లాంటి కాలం
మళ్ళీ తానే దగ్గరకు లాక్కుంటుందనీ,
అన్నీ తానై నిన్ను లాలిస్తుందనీ, నమ్ము.

అన్నీ అక్కర్లేదు మిత్రమా, నీకైనా, నాకైనా
ఇరుక వంతెన మీద నడక లాంటిదీ జీవితం,
బరువులు మోసుకునే నడకలో మిగిలేదల్లా- అలసట.
సౌందర్యాన్ని వెదుక్కునే తీరిక లేని వేసట.  

సూర్యచంద్రులొస్తూ వస్తూ ఆకాశంలోని రంగులన్నీ చెరిపేసినట్టు  
సముద్రం ఎప్పటికప్పుడు తీరాన్ని తుడిచేసినట్టు
కలలో హత్తుకున్న అనుభవాన్ని మెలకువలో మర్చిపోయినట్టు
గాయపడ్డ క్షణాలని, దూరమైన బంధాలని
పూర్తి కాని ఆశలని, పూరించుకోలేని దూరాలని
గుండెల్లోని గుబులంత బరువుని
లోయలోకి ఈకని వదిలినట్టు వదిలి

కులాసాగా దాటుదామీ శార్వరీ వంతెన-
అదిగో ప్లవ - చేయందిస్తోంది.

రసానందం

 నా చిట్టి ప్రహ్లాదుడికి ఏడాదీ రెండేళ్ళ వయసున్నప్పుడు..మెత్తగా గుజ్జుగా నోట్లో పెడితే కరిగిపోయేట్టున్నవే తినేవాడు - ఆ ఈడు పిల్లలందరిలాగే.

మధ్యాహ్నం ఓ కునుకు తీసి హాయిగా రెండక్షరాల మాటలేవో వాడిలో వాడే చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఆ కబుర్లలో జత కలిపి ఎత్తుకు బాల్కనీలోకి తెచ్చుకునేదాన్ని. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, గిన్నెలోకి తీసుకున్న అరటిపండు గుజ్జునో, పాలసపోటా తొనలనో, మామిడి రసాన్నో, చల్లటి బంగినపల్లి ముక్కలనో ఇంతింతగా నోట్లో పెడుతుంటే, ఇష్టంగా తినేవాడు. మామిడిపండు కంటపడ్డప్పుడల్లా, దానిని తానే స్వయంగా చేతుల్లోకి తీసుకు తినాలన్నది వాడి ఆశగా నాకర్థమవుతూ ఉండేది. ఆ చిట్టి చేతుల్లో పట్టదనీ, ఇల్లూ ఒళ్ళూ ఆగమాగం చేస్తాడనీ తినేత్తక్కువా పూసుకునేదెక్కువా అవుతుందని, ఇచ్చేదాన్ని కాదు. వాడికింకాస్త ఊహ తెలిసి, ఇవ్వకపోతే ఊరుకోనని హఠం చేయడం వచ్చేశాకా, ఓ వేసవి మధ్యాహ్నం చొక్కా విప్పేసి, చేతుల నిండా పట్టేట్టున్న నూజివీడు మామిడి రసం వాడికందించాను. మహదానందంగా అందుకున్నాడు. 

సగం తిన్నాకా ఆయసపడుతూ 

"ఊఁ..ఊఁ..బాందీ అమ్మా.." అని నా మీదకు ఎగబాకిన సంబరపు పసి ముఖం ఇంకా నా కళ్ళ ముందే ఆడుతోంది.

"తియ్యగా ఉందా నాన్నా?" తీపివాసనలు లోపలికంటా పీలుస్తూ అడిగాను

రెండు చేతులూ బార్లా చాచాడు. "చాలా" అన్నట్టు.

"ఏదీ చూడనీ?" మామిడి వాసనల మృదువైన దేహాన్ని హత్తుకుని వాడి బుగ్గల మీదకు వంగాను. 

నాకు నా పిల్లాడే తియ్యగా అనిపించాడంటే ఇంట్లో అందరూ నవ్వేవారు. కళ్ళంతా విప్పార్చుకుని నా మాటలు వినే  తీయతేనియమామిడిపండుగాడు  కూడా.

***

జిహ్వకో రుచి అంటారు కానీ, అమ్మనయ్యాక నా జిహ్వకు రెండు రుచులు. ఏం వండుతోన్నా మనసులో ఇది పిల్లాడి నాల్క మీద ఏం నాట్యాలు చేస్తుందోనన్న ఆలోచన పోదు. ఏ మామిడికాయ పప్పో వండుతున్న రోజు, పప్పు మెదుపుతుంటేనే వాడి లొట్టలు నా ఊహల నిండా తిరుగుతుతాయి. ఆ పులుపుకి వంకర్లు పోయే వాడి ముఖం చూడటానికే కొన్ని ప్రత్యేకం ఏరిఏరి కొనుక్కొస్తాను. అనిల్ వాళ్ళ బావగారు మొన్నొకసారి వారి స్నేహితులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారని, చూపించడానికి మమ్మల్నందరినీ తీసుకెళ్ళారు. అక్కడి పొలం గట్లన రాలిపడ్డ చిట్టి ఉసిరికాయలను పిల్లలు సంబరంగా ఏరుకున్నారు. పక్కనే పారుతున్న కాలవలో కడిగి నోట్లో వేసుకుంటుంటే, దగ్గరపడ్డ వాడి కనుబొమలూ, మూతపడే కళ్ళూ, ఠ్ఠ్ఛా అన్న చప్పుడుతో నాలుకను అంగిలికి ఆనించి వాడు చేసే శబ్దమూ గమనిస్తూంటేనే పెదాల మీదకో సన్ననినవ్వు పాకేది. మామిడిరసాలు తెస్తే దాని పులుపునీ తీపినీ బేరీజు వేసుకుంటూ ఆ పసిముఖం పడే కష్టాలు చూడటం నాకు మాచెడ్డ సరదా! నిమ్మళపు మధ్యాహ్నాల్లో ఎండల్లోకి పరుగులు తీయకుండా, చల్లటి షరబత్ గ్లాసు ఇస్తే, దానిని అరచేతుల మధ్య బంధించుకుని కుదురుగా చుక్కచుక్కా జుర్రుకునే వాడి తీరికదనం నాలో చిత్రమైన శాంతిని నింపుతుంది. పెసరకట్టు రాత్రుల్లో ఆఖరు ముద్దకు వాడు నా చేయి లాక్కుని వేళ్ళు చప్పరిస్తుంటే, మనసు నిండిపోవడమేమిటో అనుభవమవుతుంది. వాక్కాయ ముక్కలో, మెంతికాయ తుడిచిన ముక్కలో వాడు అదాటున అందుకుని నోటపెట్టుకుంటే రసాలూరే వాడి ఎర్రెర్ర పెదవులు పిండి ముద్దాడడం - అమ్మనయినందుకు మాత్రమే దక్కిన భోగం కనుక ఈ జీవితానికి మోకరిల్లాలనిపిస్తుంది.

***

"ఇంక చాలమ్మా..."

"ఈ ఒక్క ముద్దే కన్నా..."

"ఊహూఁ.."

"ఆఖరు ముద్దలో అమృతం ఉంటుందని చెప్పానా లేదా...తిప్పకలా మెడా..."

"కాం పెడుతోందీ..."

"ప్చ్..ఏయ్..? ఒక్క ముద్దే నాన్నా.."

"నిజమమ్మా..హా హా...మంటా.."

"ఒరే పెరుగన్నంరా ఇదీ.."

"అందుకే కాం..నాకిదొద్దసలు.."

"వేషాలమారి!! పెరుగన్నం కారంగా ఉంటుందా ఎక్కడైనా?"

"నువ్వు చేస్తే ఉందిగా"

"ఓహో..సరే, కాస్త తేనే, పంచదారా కలిపితే తియ్యనవుతుందా, తెచ్చేదా అయ్యగారికి?"

"అవి కాదు.."

"మరి?"

".."

"చెప్పూ..."

"..ఆవకాయ పెచ్చు తేమ్మా"

"!!!!"

"ప్లీజ్ మా...నువ్వు లే ముందు..తేమ్మా..తేమ్మా వెళ్ళీ..."


***


* తొలిప్రచురణ మామ్స్‌ప్రెస్సో తెలుగు ఎడిషన్‌లో.. 

 


అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....