Posts

Showing posts from January, 2014

ముత్తెపు ముంగిట

"ముగ్గు" అనుకోగానే, అబ్బే! మన కాలానికి సంబంధించిన సంగతి అస్సలు కాదనిపిస్తుంది. తెల్లవారుఝామున ఐదు నిముషాల సమయం దొరికితే, ఎంచక్కా ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెబుతూ కాఫీ వేళలు పొడిగించుకోవాలని అనిపిస్తుంది కానీ, ముగ్గులేం వేయాలనిపిస్తుంది? "ఆవుపేడా తెచ్చి అయినిళ్ళు అలికి, గోవుపేడా తెచ్చి గోపురాలలికి.." అని పాడుకుంటూ ముగ్గులేసుకోవడానికి ఎవరికైనా వీలెక్కడుంటోందీ? నేను ఆఖరు సారి ముగ్గులెప్పుడు వేశానో కనీసం గుర్తు కూడా లేదు. బహుశా బడికెళ్ళిన రోజుల్లో వేశానేమో.అది కాదంటే ఎదురింటి పిల్లలతో కలిసి న్యూఇయర్ కోసం రంగవల్లులేవో వేసి ఉంటాను. అటుపైన  ఆఫీసులో "పూక్కొలం" (మళయాళీల పండుగ) జరిగినప్పుడు, అఖిల 'నాకు తోడురావూ' అని బతిమాలితే రంగులు నింపి వచ్చేశాను. అంతే. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మోజేమిటీ అనా? చెప్తాను.
మన చుట్టూ ఉన్నవాళ్ళు మనమెట్లా ఉండాలో, లేదా ఎట్లా ఉండకూడదో నేర్పుతారని అంటారు కదా. ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. ఈ ఫ్లాట్స్‌లోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. మా ఫ్లోర్‌లో వాళ్ళతో కూడా ఎప్పుడూ అరకొర నవ్వులే. అపార్ట్మెంట్ పార్టీల్లో, సమావేశాల్లో, లంచులూ, డిన్నర్లూ అ…

ఘర్షణ

తొలిప్రచురణ ఈమాటలో. పాడలేని పాట
తోడురాని దారి
కవ్వింపులాగవు.
నలిగే మనసు గుచ్చుకునే పూలు
ముద్దుపెట్టే ముళ్ళు
తప్పుకుపోనీయవు.
రగిలే వయసు కలల పంతాలు
వంతుల జీవితాలు
కలువవెన్నటికీ.
మరిగే ప్రాణం ఫలించీ ఫలించని అన్వేషణల్లోనే
ఘర్షణ.
అగ్గిరాజుకునే దాకా
తెలుసుగా, అసహనం నేరం.

ఆరు ఋతువులు

ఆరు పాటలు. నా జీవితంలో ఆరు అధ్యాయాలు. ఏమీ తోచక నిన్న పాత పుస్తకాలు తిరగేస్తోంటే, ఆఖరు పేజీల్లో అల్లిబిల్లి అక్షరాలతో, అందమైన కవిత్వంలా...ఈ పాటలు. ఉన్నట్టుండి బెంగళూరులో నా గదిలో నుండి మాయమై, ఎన్నెన్ని దేశాలు, ప్రాంతాలు చూశానో, ఎన్నెన్ని అడవుల్లో పరిమళపు తుఫానులా తిరిగానో, ఎన్నెన్ని సాగర తీరాల్లో తడిసానో, ఎందరెందరు మనుషుల్ని కలిశానో, అదంతా పెద్ద తమాషా! ఇప్పటికే పసుపు రంగులోకి మారి పెళుసుబారిన కాగితాలు, అక్షరాలన్నీ చెరిపేసి, అనుభవాలను వెనక్కు తెచ్చుకోలేని దూరాల్లోకి విసిరేయకమునుపే, ఎందుకో ఇక్కడ రాసుకోవాలనిపించింది. దాచుకోవాలనిపించింది.

2005 డిసెంబరు, మైసూరు.

భవిష్యత్తును తెలివిగా తెరచాటునే దాచేసే వర్తమానం ఎంత నిర్దయగా నటిస్తుందో తెలియని అమాయకత్వంతో, కలగన్నదేదో దక్కేసిందన్న గర్వం చుట్టుముట్టిన సాఫల్య క్షణాలే శాశ్వతమని భ్రమిస్తూ, రెండు వందల యాభై మంది ట్రైనింగ్ కోసం సంబరంగా అడుగుపెట్టిన ప్రాంగణం. ఎకరాలకెకరాలుగా విస్తరించి ఉన్న సువిశాలమైన లోకంలో అణువణువునూ మా చూపులతోనూ అల్లరితోనూ కొలిచాం. ప్రతివారం జరిగే తప్పనిసరి పరీక్షల కోసం తప్పక చదివిన చదువుల్లో లైబ్రరీల్లోనే చంద్రోదయమయిపోతే, ఏ అర్థరాత…

బంధాలు

తొలి ప్రచురణ- వాకిలి అంతర్జాల పత్రికలో. ఎంత ప్రేమగా గింజలు చల్లినా
పంజరంలో పావురాయి నవ్వదు,
ఎగరెయ్ ఆకాశంలోకి.
దాని రెక్కల చప్పుడులోని
స్వేచ్ఛా సంగీతాన్ని
వినిపించొకసారి హృదయానికి. ఎన్నెన్ని మొగ్గలు వికసించినా
మొదలంటా నరికేస్తే మిగలదేదీ,
వాటినలా వదిలెయ్.
పూదోటలో నడిచెళ్తుంటే
వసంతమెలా కమ్ముకుంటుందో
అనుభవించి చూడు. ఎందరెందరు దోసిళ్ళు పట్టినా
అరచేతుల్లో ఒక్క చుక్కా నిలవదు
ఆకాశం ఊరికే కిందకు దిగదు
అడ్డు తొలగు
ఏదో ఒక రోజు
ఏటి ఒడ్డునే సేద తీరాలి. వదలనివి కొన్నుంటాయి
వదల్లేనివీ కొన్నుంటాయి
వదులయ్యే కొద్దీ బిగుసుకునేవి మాత్రం
అపురూపమైనవి
నిజానికవి
వదిలిపెట్టకూడనివి

సంయోగము

ప్రపంచానికి అర్థమైనా కాకపోయినా, ప్రతి కవిత వెనుకా, కవిని వెంటాడి వేధించిన అనుభవమో ఆలోచనో తప్పకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కవి కావాలనే పాఠకులను దూరం నెట్టేస్తాడు. అప్పుడు కవిత కేవలం కవిది మాత్రమే అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం కవిత కవిది కాకుండా పోయి సంపూర్ణంగా పాఠకులదవుతుంది. ఆ కవిత మనలో నిద్రాణంగా ఉన్న భావాలెన్నింటినో ఒక్క మాటతో తట్టి లేపేస్తుంది. మనని గతపు దీవుల్లోకి పదాల పడవల్లో నెట్టుకెళ్తుంది. మన కలలు వేరొకరి కవితలై కవ్వించినప్పుడు, మన ఆశలే వేరెవరో శ్వాసిస్తున్నప్పుడు, అదొక చిత్రమైన అనుభూతి. ఇదిగో, ఈ Robert Browning కవిత "Meeting at night" నావరకూ అలాంటి ఒక కవిత. మొదటిసారి ఇది కినిగేలో చూసీ చూడగానే, నిశ్చయంగా తెలిసింది, పోటీకి పంపినా పంపకపోయినా , దాని అనువాదం నా డైరీ పేజీల్లో మాత్రం చోటు సంపాదిస్తుందని.  సముద్ర తీరం, స్వర్ణకాంతులీనే చంద్రబింబం, పడవలో ప్రియురాలి కోసం ప్రయాణం, ఆమె ఉంటున్న విడిదికి ప్రయాణం, అద్దాల కిటికీపై మునివేళ్ళ చప్పుడు, రాజుకున్న అగ్గిపుల్ల, నీలిమంట....  - ఎప్పుడైనా, ఒంటరిగానైనా జంటగానైనా, ఒక సాగరతీరంలో కనీసం రెండు మూడు గంటలైనా గడిపి ఉంటే, …