ఆరు ఋతువులు

ఆరు పాటలు. నా జీవితంలో ఆరు అధ్యాయాలు. ఏమీ తోచక నిన్న పాత పుస్తకాలు తిరగేస్తోంటే, ఆఖరు పేజీల్లో అల్లిబిల్లి అక్షరాలతో, అందమైన కవిత్వంలా...ఈ పాటలు. ఉన్నట్టుండి బెంగళూరులో నా గదిలో నుండి మాయమై, ఎన్నెన్ని దేశాలు, ప్రాంతాలు చూశానో, ఎన్నెన్ని అడవుల్లో పరిమళపు తుఫానులా తిరిగానో, ఎన్నెన్ని సాగర తీరాల్లో తడిసానో, ఎందరెందరు మనుషుల్ని కలిశానో, అదంతా పెద్ద తమాషా! ఇప్పటికే పసుపు రంగులోకి మారి పెళుసుబారిన కాగితాలు, అక్షరాలన్నీ చెరిపేసి, అనుభవాలను వెనక్కు తెచ్చుకోలేని దూరాల్లోకి విసిరేయకమునుపే, ఎందుకో ఇక్కడ రాసుకోవాలనిపించింది. దాచుకోవాలనిపించింది.

2005 డిసెంబరు, మైసూరు.

భవిష్యత్తును తెలివిగా తెరచాటునే దాచేసే వర్తమానం ఎంత నిర్దయగా నటిస్తుందో తెలియని అమాయకత్వంతో, కలగన్నదేదో దక్కేసిందన్న గర్వం చుట్టుముట్టిన సాఫల్య క్షణాలే శాశ్వతమని భ్రమిస్తూ, రెండు వందల యాభై మంది ట్రైనింగ్ కోసం సంబరంగా అడుగుపెట్టిన ప్రాంగణం. ఎకరాలకెకరాలుగా విస్తరించి ఉన్న సువిశాలమైన లోకంలో అణువణువునూ మా చూపులతోనూ అల్లరితోనూ కొలిచాం. ప్రతివారం జరిగే తప్పనిసరి పరీక్షల కోసం తప్పక చదివిన చదువుల్లో లైబ్రరీల్లోనే చంద్రోదయమయిపోతే, ఏ అర్థరాత్రో మత్తు కమ్ముకుంటునప్పుడు, నల్లని తెర మీద తెల్లని అక్షరాలు కనపడకుండా విసిగించినప్పుడు, కాఫీ మగ్గు, స్వైప్ కార్డూ తీసుకుని అక్కడి నుండి బయటపడి, అరకిలోమీటరు దూరంలో ఉన్న రూం కి, సైకిలు నేర్చుకోని బాల్యాన్ని నిందించుకుంటూ ఒంటరిగా నడవడం - బెంగలన్నింటి మధ్యా బంగారు లోకాన్ని కళ్ళ జూసిన కొత్త జీవితం తాలూకు తిరుగులేని జ్ఞాపకం. వెన్నెల మెరిసే తారురోడ్ల మీద ఆలోచనలే ఆత్మీయనేస్తాలై తొడొచ్చే వేళల్లో, నార్త్ వాళ్ళంతా పూల్ పక్కనో, ఫూడ్ కోర్ట్శ్ ముందో కూలబడి ఈ "కలియుగ్" పాట వింటూనో, పాడుకుంటూనో కనపడేవారు. ఆ మొదటి ఆలాపనకే హృదయం కరిగిపోయేది . పూర్తిగా పగలని రాళ్ళూ, పూర్తిగా విచ్చుకోని పూలూ అన్నీ అలసి నిద్దరోయే రాత్రుల్లో, ఆరని గుండె మంటల్లో జ్వలించే నిప్పు కళికలా లేస్తూ కాల్చేస్తూ అతని గొంతు.

గుబులుగా ఉంటుంది, దిగులుగా ఉంటుంది, వేనవేల జ్ఞాపకాలను ఒక్క పాటలో బంధించుకోవడం గుర్తొచ్చి అది వింటూ గతవర్తమానాల్లో ఊయలూగినప్పుడల్లా!

మైసూర్ అంటే చాలా చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కొంచం అయిష్టం కూడానేమో! ఇప్పటికీ అనిపిస్తుంది, మైసూర్ నా జీవితాన్ని చాలా మార్చిందని. కొత్తగా రెక్కలొచ్చిన గువ్వ పిల్లలా ఇల్లు దాటి వెళ్ళిన ఊరు కదా, అక్కడి నా రూం, ఆ చదువులు, సినిమాలు, పార్టీలు, తిరుగుళ్ళు, తెగిపోయిన చెప్పుల్తో రాజనగరిలో చక్కర్లు, చెప్పలేని కబుర్లన్నీ చెప్పుకు జాగారాలు చేసిన రాత్రులు, వీధి చివరి దాబాలో రోటీలు, లస్సీలు, వెన్నెల తడిపిన చిక్కని పచ్చిక చక్కిలిగింతలకు ఘల్లున నవ్విన మువ్వల పట్టీల పాదాల పరుగులు, వణికించే డిసెంబరు చలిలో ముడుచుకుని నిద్దరోయిన రాత్రుళ్ళు, చలికి పగులుతోన్న చేతులకు రాసుకున్న మాయిస్చరైజర్ పరిమళాలూ, కేంపస్లో మల్టీప్లెక్ష్లో మొట్టమొదటి షో చూడటానికి గుంపుగా వెళ్ళి పాటలు పాడిన తుంటరి గొంతులు, కళ్ళింతలు చేసుకుని మేం కుళ్ళుకున్న జంటలు, విడిపోయి ఒంటరిగా తిరుగుతూ కళ్ళల్లో కన్నీరైన జంటలు, జీవితంలో మొట్టమొదటిసారి పరీక్ష తప్పిన అనుభవాన్ని మిగిల్చిన డి.బి.యె ఆఖరు పరీక్ష, మైసూర్ జూ, ఆ రోజు రోజంతా అలసట లేకుండా తిరిగిన తిరుగుడు, హవుస్ కీపింగ్ వాళ్ళు వద్దు వద్దని ఎంత చెప్పినా రూంలో దొంగతనంగా చేసుకు తిన్న నూడుల్స్.. గిన్నెలనూ మనసునూ కూడా వదలని ఆ వాసనలూ, జీతం డబ్బులన్నీ రాగానే అమ్మమ్మ చెప్పిన మొక్కులు చెల్లించి, అమ్మ కోసం కొన్న నీలం రంగు మైసూర్ సిల్క్ చీర, ఆ మడతల్లో దాచుకున్న అమ్మ రాసిన ఉత్తరాలు, చిప్పిల్లిన కన్నీళ్ళలో చెదిరిపోయిన అక్షరాలు, చెదిరిపోని జ్ఞాపకాలు...
                                                          "జుదా హోకే భీ, తూ ముఝ్ మే కహీ బాకీ హో"

2006, ఏప్రిల్, హైదరాబాదు
మైసూర్లో ట్రైనింగ్ అతి కష్టం మీద ముగించి, మూడు నెలలలోనే ఆప్త మిత్రులైన అందరినీ వదలలేక వదలలేక పూణె DC వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళు కాలక్షేపం చేసిం మళ్ళీ హైదరాబాదు వచ్చేసిన కొత్తల్లో, వారం వారం మావయ్య వాళ్ళింటికో, నల్లకుంటలో పిన్ని, పెద్దమ్మ, అమ్మమ్మ - ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోవడం, తినడం, తిరగడం. ఏ చింతా లేని ఆ బంగరు రోజుల్లో ఒకపూట, నా ప్రాణస్నేహితులొకరు నీకో మంచి సినిమా చూపించాలి, రా వెళ్దాం అని రెక్క పట్టుకు లాక్కెళితే, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చూశానీ సినిమా. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఈ ఒక్క పాటా ఒక ఎత్తు. "తుం బిన్ బతాయే..లేకే చల్ హం కహీ" అంటుంటే మనసంతా ఏదోగా అయిపోతుంది. మితిమీరిన ప్రేమ, దానిలో నుండి పుట్టే ఆనందం ఎటు తీసుకుపోతాయో అన్న వెర్రి భయమొకటి అప్పుడప్పుడూ వెంట వస్తుంది. ఇది బహుశా అలాంటి భావన. లోకాతీతమైన ఆనందం, లోకంలోకి లాక్కొచ్చే సన్నని భయం, నిదుర రాని రాత్రుల్లో లాలి పాట ఇదే, నిదుర లేపిన కలల రాత్రి జాలిపాటా ఇదే. మిగుల్చుకున్న అనుభవానికి మాటలల్లిన పాటా, మిగుల్చుకోలేని జ్ఞాపకానికి పల్లవైన పాట. వెంటాడీ వేధిస్తేనే శాంతి. శాంతి. శాంతి.

                                    " మన్ కీ గలీ తూ ఫుహరూన్ సీ ఆ / భీగ్ జాయే మేరే క్వాబోన్ కీ కాఫిలా"

2007- సెప్టంబరు, సింగపూర్

శుక్రవారం సాయంత్రం రూంమేట్స్ తో కలిసి వారానికి సరిపడా సరుకులన్నీ కొనుక్కుని, ఇంటికి చేరవేసి, శనివారం బద్ధకంగా ముసుగుతన్ని పడుకున్నప్పుడు, ఎవరో(శరత్?) ఫోన్ చేశారు- మంచి సినిమా వచ్చిందట, టికెట్లు తీసేసుకున్నాం, మీరంతా వచ్చేయండి అంటూ. ఏ తెలుగు సినిమా వచ్చినా తెలుగు వాళ్ళందరం కలిసి చూడటం అలవాటు. దేశం కానీ దేశంలో ఒంటరిగా ఉండటమన్న ఒకే ఒక్క ఉమ్మడి కారణంతో, ఇట్టే స్నేహితులైపోయేవాళ్ళక్కడ అందరూ. నా ప్రతి శనివారాన్నీ నాకు కాకుండా చేసి మింగేస్తున్నారన్న పిచ్చి కోపంతో కావాలనే కాస్త ఆలస్యంగా వెళ్ళామేమో, నేనూ చందనా, కీర్తీ సర్దుకు కూర్చునేసరికి, "జతగా పిలిచే అగరుపొగల సహవాసం " అంటూ రాజేశ్ గొంతు. పొద్దున చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా లెంపలేసుకుని, మైమరచిపోతూ చూస్తోంటే మరికాసేపటికే, "నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ" అంటూ ఆశా. తెర మీద ముగ్ధలా కాజల్. ఏమిటి ఆ సన్నజాజి మొగ్గ కోరిక? "నిను చూస్తూ, ఆవిరవుతూ, అంతమవ్వాలనే...".అంతే..! "అన్ని నీవనుచు" అన్న చందాన ఏకమవ్వగలిగిన అపురూపమైన ప్రేమభావనలో మునిగి తేలుతున్న జంటను చూస్తే కృష్ణ వంశీ ఇలాంటి సందర్భాల్లో ఇంతకు ముందు తీసిన పాటలన్నీ వద్దన్నా గుర్తొస్తాయ్. "నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో, నీ రూపే నా వేచే గుండెల్లో", "నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు..", "నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా", " ప్రతీ శ్వాసలో ఉయ్యాలూగు నా పంచప్రాణాలు నీవే సుమా", "ఆకుపచ్చని ఆశని చిన్నబుచ్చకనీ" ,"ఉండుండిలా ఉబికొస్తుంటే వెచ్చనైన కన్నీరు, తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు?" ఇలా అన్నీ! దేశంకాని దేశంలో నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న స్నేహితులందరూ, ఈ పాట పల్లవితోనే నా మూడ్ బాగు చేసిన సాయంత్రాలూ, నేను ఈ పాట వినలేదనుకుని మెయిల్లో పంపి పాడి వినిపించమని అడిగిన నేస్తాలూ, ఇదే పాట వింటూ ఆల్జునీద్ లేన్లో కాళ్ళరిగిపోయేలా తిరగడం, తేనె కళ్ళ నవదీప్కీ, తేనె నవ్వుల కాజల్ కీ ఓట్లు వేసి వాదించుకోవడం... జీవితంలోనే అత్యంత మధురమైన భాగాన్ని, నా జల్సా జీవితాన్ని క్షణాల్లో కళ్ళ ముందుకు తెచ్చే పాట .
             “మౌనమే విరుగుతూ, మనసిలా మరుగుతూ, అవథులే కరుగుతూ… నిన్ను చూస్తూ.... నిన్ను చూస్తూ”
             
2008, సింగపూర్
శనివారం రాత్రికి రూమ్మేట్స్ కలిసి ఏదైనా సినిమా చూడటం అలవాటు. నేనొక నిద్రపిచ్చి మనిషిని. పది కాగానే తూలే కళ్ళతో వాలిపోతుంటే, ఈ రోజు నెత్తి మీద నీళ్ళు గుమ్మరించైనా సరే, నీ చేత ఓ సినిమా చూపించాల్సిందే అని పందెం కట్టి - లాపీ ముందు కూర్చోబెట్టారు. "అన్వర్" టైటిల్స్ మొదలయ్యాయి. అవి నాకెంత నచ్చాయంటే, నిద్ర నిముషాల్లో ఎగిరిపోయింది. లిండా జేమ్స్, ఉత్కళిక, నేనూ - ముగ్గురం దుప్పట్లు కప్పుకుని ముడుచుకు కూర్చుని చూడడం మొదలెట్టాం. రాలిపడే నెమలీకల్లో నుండీ టైటిల్స్ కనపడుతుంటే, వెంటాడే సంగీతం నేపథ్యంలో వినపడుతుంటే, అప్పుడొస్తాడు అతను - లేలేత కళ్ళల్లో కొండంత ప్రేమను కూర్చుకుని, అర్హత లేని అమ్మాయికి హృదయాన్ని అర్పిస్తూ. ఈ పాట మధ్యలో నెమలి పింఛం రంగులాంటిదేదో ఉన్న జూకాలను చూసి ఆ అమ్మాయి ముచ్చటపడితే, అతను కొనిపెడతాడు. తరువాతెప్పుడో వాళ్ళు కలిసినప్పుడు, పారే నదిలా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తున్న ఆమె ముందు కూర్చుని, ఆ జూకాలనే తన్మయత్వంతో చూసుకుంటాడు. వెర్రి ప్రేమతో (ఊహూ, మోహమనడానికి నా మనసొప్పుకోదు) తపిస్తోన్న అతగాడి కళ్ళకి ఆమె జూకాలు తప్ప మరేమీ కనపడకపోవడాన్ని ఎంత ఆర్ద్రంగా చిత్రించారో చూసి తీరాల్సిందే! ఈ పాటతో ఆపకుండా, సినిమా మొత్త చూసి పెద్ద తప్పు చేశానని ఈ క్షణానికీ అనిపిస్తూంటుంది. ఎంత బాధ! బాధ చిన్న పదమసలు!! సినిమా చూసి కుమిలిపోతూ గదిలో కెళ్ళి ముసుగు తన్ని పడుకున్న నావాలకం కనిపెట్టి,మళ్ళీ బయటకు లాగి, ఐస్క్రీం తినిపించి, రాత్రి మొత్తం కబుర్లు చెప్తూ గడిపారు నా నేస్తాలు. నాలో మిగిలున్న కొంత అమాయకత్వానికీ, ప్రేమకీ బహుశా అదే ఆఖరి సాక్ష్యమనుకుంటాను. లక్ష చెప్పండీ, ప్రతి మనిషి మనసులోనూ వారికి మాత్రమే సొంతమైన స్థలమొకటి ఉంటుంది. అది వారిది మాత్రమే. స్వార్థానికి మనిషి ఎంత పెద్ద గుడి కడతాడో తెలుసుకోవాలంటే ఆ గది తాళాలు బద్దలు కొట్టాలి. ప్రేమ ఎంత అబద్దమో, ఎంత తేలిగ్గా మనుషుల ప్రేమ ఒకరి మీద నుండి మరొకరికి మారిపోతుందో లోకంలోని ఇన్ని కోట్ల అమాయకులకి ఎలా తెలుస్తుందీ?
 ప్రేమ అంత తేలిగ్గా పుట్టదు.  అంత తేలిగ్గా చావదు. ఈ చావుపుట్టుకల సంధి కాలమే స్వర్గమైనా నరకమైనా. అన్వర్ చెప్పిందదే - గుర్తుండిపోతుందీ పాట.

                                                        'ముఝ్ సే యే హర్ ఘడీ మేరా దిల్ కహే, తుమ్ హీ హో ఉస్కీ ఆర్‌జూ '

2009, 2010 బెల్జియం, యూరప్


పెళ్ళి కుదిరిన మైకం; ఇద్దరం వెళ్తామనుకున్న ట్రిప్‌కి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి రావడం నరకం. రెండు సార్లూ హడావుడి. అప్పుడు ఆఫీసులో స్నేహితులొకరు రెహ్మాన్ కొత్త పాట విన్నావా అంటూ హెడ్‌ఫోన్స్ బలవంతంగా నా నెత్తి మీద పెడితే తోసేశాను.. వినే మనసు లేదు. వినాలన్న కోరికా లేదు. వీసా వచ్చిన మర్నాడే ప్రయాణం, అక్కడెవరూ తెలీదు. ఎక్కడుండాలో తేలదు. BCU (Belgacom Corporate University) ఎలా ఉంటుందో, పరీక్షలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలు. ఇన్ని భయాలనీ భుజం మీద లగేజ్ తో పాటే మోస్తూ ఆ నేల మీద అడుగుపెట్టానా, చిత్రం, ఆ గాలిలో ఏదో మాయ ఉంది. అదృష్టం కలిసొచ్చి ఓ భాగ్యలక్ష్మి ఆ రోజులన్నీ గలగల నవ్వుల్లో కరిగిపోయేలా చేసింది. దొరికిన ఒకట్రెండు వారాంతాల్లోనూ బ్రూజ్ సిటీ వెళ్తూ ఈ పాటలు విన్నానా, బెంగ మొత్తం పోయి అదో హుషారు. "విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా" అని అలా తారాస్థాయిలో పాడుకుంటూ ఈ పాటా, కుందనబ్బొమ్మా..ఈ రెండూ ఎన్ని వేల సార్లు విని ఉంటాం? లెక్కే లేదు!!ఇంకా ఆశ్చర్యకరమైనా విషయమేమిటంటే, నేను రెండో సారి యూరప్ వెళ్ళినప్పుడు నాకు ఆతిధ్యమిచ్చిన ఇద్దరూ తమిళ్ వాళ్ళు. ఈ పాటలు వాళ్ళకి ప్రాణమట. ఎప్పుడూ అవే వింటూ కనపడేవాళ్ళు. అలా రెండు సార్లూ యూరప్ ట్రిప్లలో నాకీ పాటతో గట్టి అనుబంధం ఏర్పడి, చివరికి ఈ పాట వింటున్నప్పుడల్లా, చలిచలి క్షణాల్లో స్వెట్టర్ల్లల్లో ముడుచుకుని, చిన్నప్పుడు బడిలో బెల్లు మోగగానే సంచి భుజాన వేసుకుని ఇంటికి నేస్తాలతో నడిచి వచ్చినట్టు, అక్కడ ఐదవ్వగానే బయలుదేరి ఇరవై నిముషాల కాలి నడకతో, కబుర్లతో ఇంటికి రావడం, చలి దేశంలో భాగీ చేతి కాఫీ, నా టీం, ఆఫీసులో సరైన తిండిలేక మాగాయ ముక్క కోసం అలమటించిన రాత్రులూ గుర్తొస్తాయ్. భాగీ, ఐశ్వర్య, అశ్విన్‌ల మంచి మనసులు కూడా! అప్పటికీ భంగం కానీ ఒక మౌన వ్రతం - ఒక స్నేహం కూడా!

                             "గాలిలో తెల్లకాగితంలా..నేనలా తేలియాడుతుంటే, నన్నే ఆపి నువ్వే పాడిన ఆ పాటలనే వింటున్నా...."
 వింటున్నావా?

2013 బెంగళూరు
 పెళ్ళైన కొన్ని రోజులకే "టి.వి ఉంటే ఇంట్లో మనుష్యులు మాట్లాడుకోరు తెలుసా, మనం కొన్నాళ్ళు టి.వి వదిలేద్దాం. కేబుల్, డిష్ ఏదీ వద్దు..సరేనా?" అని మెత్తమెత్తగా చెబుతూ నా స్నేహితులిచ్చిన  గిఫ్ట్ కూపన్స్ అన్నీ తను చల్లగా దాచేస్తోంటే బావురుబావురుమన్నాను. చిన్నప్పటి నుండీ ఇంట్లో అమ్మా నాన్నగారు చెప్పిన మాటేగా ఇదీ! అక్క మెడిసన్ చదువూ, నా ఇంజనీరింగ్ చదువూ, అయ్యాక మళ్ళీ దాని పి.జీ, అటుపైన ఉద్యోగాలూ, ఊళ్ళట్టుకు తిరగడాలూ..!!రిమోట్ చేతిలో పట్టుకు నచ్చిన ఛానెల్ చూడటమనేది ఇక ఈ జన్మకి నాకు కుదరదనే అనుకున్నాను. చాలా నెలల పాటు పంతం వీడలేదు మొండి మనిషి, అటుపైన మావయ్యగారో, మా నాన్నగారో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి విసుగొస్తుందని పట్టు సడలించుకుని, మెల్లిగా నా కల సాకారమయ్యేలా చేశాడు. అదిగో, అప్పుడు ఓ రాత్రి సూపర్ సింగర్స్ లో కృష్ణ చైతన్యా మాళవికా పాడుతుండగా చూశానీ పాటని. ఎంత బాగుంటుందో కదా! అసలు రెహ్మాన్ స్వరపరచిన మెలమెల్లని పాటల్లో బాగుండనివంటూ ఏమీ ఉండవేమో! ముఖ్యంగా ఇద్దరి గొంతులూ పెనవేసుకుంటూ సాగే భాగం నాకు చాలా ఇష్టం.

"పౌర్ణమి రేయి, పొగ మంచు అడవి, ఒంటరిగా సాగే నీతో పయనం
 ఇది మాత్రం చాలు..ఇది మాత్రమే! నాకింక చాలూ, నువు మాత్రమే!"

ఆ "నువు మాత్రమే చాలూ" అన్న పదబంధంలో వలపంతా కూర్చినట్టు అనిపించడం లేదూ? బెంగళూరులో మామూలుగానే చలి చాలా ఎక్కువ. అదీ గాక, కార్తిక మాసం మొదలైనప్పటి నుండి తెల్లవారుఝామున దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంటుంది. చలికాలంలో ఎప్పుడైనా తెల్లవారే వేళల్లో బైరాగి కవిత్వంలాంటి ఘాటైనదేదో పొగలు కక్కే కాఫీ కప్పుతో పాటే తెచ్చుకుని బాల్కనీలో కూలబడితే...నాకీ పాటే గుర్తొస్తుంది ముందు. ‘మానులు వణికే మంచుకు తడిసి..నెత్తురు నిలిచే చలికే జడిసి’ మళ్ళీ వెచ్చని రగ్గులోకి దూరేదాకా, రెహ్మాన్ సంగీతమే అమృతం ఈ ప్రాణానికి. అదే ఉష్ణం, అదే శీతలం.

                                                                     *****************

ఏం సైన్స్ ఉంటుందో కదా దీనంతటి వెనుకా? ఎనిమిదేళ్ళ క్రితం నాటి సంగతులు క్షణాల్లో కమ్ముకుంటూ ఇలా మాయ చేయడమెందుకూ? ఏమో, హృదయం గెలిచీ ఓడించే అనుభవాలను వేరే లెక్కలతో కొలవలేం, తూచలేం. వదిలేయాలంతే...హృదయానికి ఇంకా ఇంకా దగ్గరగా హత్తుకోవాలంతే! ఉత్సవ సంబరంతో జీవితాన్నిలానే సాగిపోనివ్వాలంతే! అలాంటి అపురూప క్షణాల్లోనే , ఎప్పుడో..
ఓ పసివాడి కన్నుల్లో శాంతీ, వసంతకోకిల గానంలో రహస్యం, రాలిపడ్డ తేనె చుక్క అసలు రుచీ, అన్నీ వలచి వరించి మనలో ఐక్యమవుతాయి.

19 comments:

 1. మొదటి ఋతువు అందంగా ఉంది :)

  ReplyDelete
 2. చాలా బాగుందండీ పోస్ట్ :)

  ReplyDelete
 3. కొన్ని నువ్వే రాయాలి పిల్లా! ఇంకెవర్రాసినా.. ఉహూ... ఇంత బాగోదు!
  sweeeeeeeet

  ReplyDelete
 4. నీ (కాలేజీ సీనియర్‌ని అన్న అహంకారంతో "మీ" నుంచి "నీ" కి దిగిపోయాను!) శైలిలో నేను గమనించినది ఏమిటంటే, భావుకత పుష్కళంగా గుప్పిస్తావ్. కొన్ని వ్యాసాలూ, కవితలూ చదివినప్పుడు, "ఏమిటీ అమ్మాయి ఇంత బాగా రాసేస్తోంది" అనిపించింది. వచనంలో కూడా కవిత్వం తొంగిచూస్తుంది. దైనందిన జీవితపు ఉదాసీనతలో నీ భావుకతే నీకు శ్రీరామరక్ష!

  వ్యాసం చిక్కగా ఉంది. ఒక చిక్కేంటంటే, నీ వ్యాసాలు అలా తేలిగ్గా చదివెయ్యడానికిలేదు. కొంచెం టైం తీసుకుని నెమ్మదిగా ఆస్వాదిస్తూ చదవాలి. ఇలా చదవడం అలవాటు తప్పిపోతున్న ఈ రోజుల్లో ఇది గొప్ప విషయమే! ఈ వ్యాసం వల్ల తెలిసిన ఒక కొత్త విషయం ఏమిటంటే, నువ్వు సింగర్‌వి కూడా అని! ఏమైనా
  లింకులు (SoundCloud వగైరా) ఉంటే పంపగలవు.

  అభినందనలు!

  ReplyDelete
 5. తృష్ణ గారూ, కుమార్ గారూ, హర్షా, సుజాతగారూ - ధన్యవాదాలు :))
  ఫణీంద్రగారూ - :))) తప్పకుండా! మీరలా పిలిస్తే నేనింకా చిన్నదాన్నే అన్న నమ్మకాన్ని పెంచిన వారవుతారు :)))(పెదగీత ముందు చినగీత సామెతలా) .

  వ్యాసాలు, కవితలకు సంబంధించి మీ మంచి మాటలకు కృతజ్ఞతలు. ఇక పాటల విషయమంటారా- అవేవో లల్లాయి పాటలు. అంతే..:) . థాంక్యూ.

  ReplyDelete
 6. హిందీ రాక పోవడం వల్ల నీ ఆరు ఋతువుల్లో కొన్ని ఋతువులు అర్ధం కాక పోయినా. పాటలతోనే గడిచిపోయే సంవత్సరాలు ఎంత చిన్నవైపోతాయో మళ్ళీ ఓ సారి గుర్తు చేసావ్. అలాంటి రెహ్మానులు, ఇలాంటి సీతారామ శాస్త్రులు ఉన్నంత కాలం మన జీవితాలు ఇలా కొత్త కొత్త రంగులు పులుముకుని పోతూ ఉంటాయేమో కదా. Narration చాలా బాగుంది మానసా, ఎప్పుడూ చెప్పెదే అయినా చెప్పక తప్పనిది కదా... :-)

  ReplyDelete
 7. హిందీ రాక పోవడం వల్ల నీ ఆరు ఋతువుల్లో కొన్ని ఋతువులు అర్ధం కాక పోయినా. పాటలతోనే గడిచిపోయే సంవత్సరాలు ఎంత చిన్నవైపోతాయో మళ్ళీ ఓ సారి గుర్తు చేసావ్. అలాంటి రెహ్మానులు, ఇలాంటి సీతారామ శాస్త్రులు ఉన్నంత కాలం మన జీవితాలు ఇలా కొత్త కొత్త రంగులు పులుముకుని పోతూ ఉంటాయేమో కదా. Narration చాలా బాగుంది మానసా, ఎప్పుడూ చెప్పెదే అయినా చెప్పక తప్పనిది కదా... :-)

  ReplyDelete
 8. చాలా బావుంది మానసా.. చదివేవాళ్ళని మీ వాతావరణంలోకి తీసుకుపోయి మీ జీవితోత్సవాన్ని కానుకగా ఇచ్చారు.
  'పూర్తిగా పగలని రాళ్ళూ, పూర్తిగా విచ్చుకోని పూలూ అన్నీ అలసి నిద్దరోయే రాత్రుల్లో,'
  'సువిశాలమైన లోకంలో అణువణువునూ మా చూపులతోనూ అల్లరితోనూ కొలిచాం.'
  'లోకాతీతమైన ఆనందం, లోకంలోకి లాక్కొచ్చే సన్నని భయం, ' వంటి వాక్యాలు మరీ మెరిసాయి.
  'నాలో మిగిలున్న కొంత అమాయకత్వానికీ, ప్రేమకీ బహుశా అదే ఆఖరి సాక్ష్యమనుకుంటాను.' ఆఖరి ఏమిటి, ఈ వాక్యం అమాయకత్వాన్ని ఇంకా మిగుల్చుకొన్నా రనటానికి సాక్ష్యమే కదా. ' 'ప్రతి మనిషి మనసులోనూ వారికి మాత్రమే సొంతమైన స్థలమొకటి ఉంటుంది.' లక్షా ఒకటి చెప్పైనా ఈ మాట ఒప్పుకొని లోకంలో ఈ వాక్యమూ సాక్ష్యమే కదా. :)

  ReplyDelete
 9. ** క్రాంతీ, అబ్బా, మేమంతా హింది వచ్చే సినిమాలు చూస్తున్నామా? :))) సబ్టైటిల్స్ ఉంటాయి కదండీ, నేను అవి మీకు మెయిల్ చేస్తాను:). మీరనట్టు, రెహ్మాన్ మాయ అలాంటిలాంటిది కాదు నిజంగా. కాకపోతే నాకు దానితో కలిపి అప్పటి అనుభవాలూ వాటితో ముడిపడి ఉన్న వ్యక్తులూ అవీ ప్రత్యేకమే. ఇంకా చెప్పాలంటే ఈ పాటలకు సంబంధించినంత వరకూ అవి కొంచం ఎక్కువ ప్రత్యేకం. :))

  ** ఆకాశాన్ని నేలకు దించిన మా కవిగారు ఓపిగ్గా చదివి స్పందించినందుకు ధన్యవాదాలు :)

  ReplyDelete
 10. Super....Krishna

  ReplyDelete
 11. Intha baagaa kadu kadu adbuthamgaa ela raastaro.. Mee secret naaku cheppeyandi..:-):-):-)

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. wowwwww... marvelous Manasa..
  Needi burralo annesi memories alaa ela store chesukuntaavo anipistundi..
  blog chaduvutunnantha sepu, chadivaaka kaasepu alaa flashback loki vellochaa.. :)

  Chaalaa mandi movies choostaaru.. songs vintaaru.. nuvvu cheppinavannee chestuntaaru..including me.. but, we dont realize how valuable they are.. ee blog chadivaaka anipistondi, 'santhosham' ekkado undadu.. manam 'choose vidhaanam' lo untundi ani..

  Thanks a lot for making us realize how beautiful this life is..

  Sarath..

  ReplyDelete
  Replies
  1. "Star Manager" గారికి ఇది చదివి స్పందించే తీరిక దొరికినందుకు సంతోషం :)).
   I relived each moment as I was writing this special article and your response made it even more special. Thanks a bunch, mate!

   Delete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...