సంయోగము

ప్రపంచానికి అర్థమైనా కాకపోయినా, ప్రతి కవిత వెనుకా, కవిని వెంటాడి వేధించిన అనుభవమో ఆలోచనో తప్పకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కవి కావాలనే పాఠకులను దూరం నెట్టేస్తాడు. అప్పుడు కవిత కేవలం కవిది మాత్రమే అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం కవిత కవిది కాకుండా పోయి సంపూర్ణంగా పాఠకులదవుతుంది. ఆ కవిత మనలో నిద్రాణంగా ఉన్న భావాలెన్నింటినో ఒక్క మాటతో తట్టి లేపేస్తుంది. మనని గతపు దీవుల్లోకి పదాల పడవల్లో నెట్టుకెళ్తుంది. మన కలలు వేరొకరి కవితలై కవ్వించినప్పుడు, మన ఆశలే వేరెవరో శ్వాసిస్తున్నప్పుడు, అదొక చిత్రమైన అనుభూతి.
ఇదిగో, ఈ Robert Browning కవిత "Meeting at night" నావరకూ అలాంటి ఒక కవిత. మొదటిసారి ఇది కినిగేలో చూసీ చూడగానే, నిశ్చయంగా తెలిసింది, పోటీకి పంపినా పంపకపోయినా , దాని అనువాదం నా డైరీ పేజీల్లో మాత్రం చోటు సంపాదిస్తుందని. 
సముద్ర తీరం, స్వర్ణకాంతులీనే చంద్రబింబం, పడవలో ప్రియురాలి కోసం ప్రయాణం, ఆమె ఉంటున్న విడిదికి ప్రయాణం, అద్దాల కిటికీపై మునివేళ్ళ చప్పుడు, రాజుకున్న అగ్గిపుల్ల, నీలిమంట....  - ఎప్పుడైనా, ఒంటరిగానైనా జంటగానైనా, ఒక సాగరతీరంలో కనీసం రెండు మూడు గంటలైనా గడిపి ఉంటే, లేదా గడిపినట్టు ఊహించుకుని ఉంటే, ఈ కవిత మిమ్మల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టదు. అలాంటి మాయ నిండారా కూర్చుకున్న కవిత ఇది. సరసమైన కల్పనలతో జరజరా నడిచిన కవిత.
ఎంచక్కని అనువాదాలతో ఎన్నో పరభాషా కవితలను తెలుగులోకి అనువదిస్తున్న మూర్తి గారికి కినిగే పోటీ లింక్ పంపాను మొదట. వారు  "అయ్యో నేనెందుకు తల్లీ, మీరు ప్రయత్నించండి, నాకస్సలు ఆసక్తి లేదు " అని ఇబ్బందిగా, మొహమాటంగా దీన్ని పక్కకు నెట్టేశారు. మర్నాడు ఉదయం మళ్ళీ మెయిల్ చేశారు, "ఇది ఇంతకు ముందే అనువాదం చేసేశానమ్మా, మీకు సహాయపడుతుందేమో చూడండీ" అంటూ.  నాకు నా అనువాదం కంటే మూర్తిగారి అనువాదమూ, నాగరాజు రామస్వామి గారి అనువాదమూ నిజంగా చాలా నచ్చాయి. ముఖ్యంగా మూర్తిగారు "పర్ర" అని వ్రాశారు చూడండీ, ఆ పదం అనువాదానికి గొప్ప శోభను తెచ్చినట్టు నాకనిపించింది. నాకా పదం తెలీనందుకు, తట్టనందుకు చాలా బెంగపడిపోయాను :)). "తర్జమాలో తప్పిపోయేదే కవిత్వం" అంటారు కానీ, కొన్ని కవితలు గమ్మత్తుగా కవ్విస్తాయ్, ఉడికిస్తాయ్,"రాయవోయీ" అంటూ. అందుకే చేతులు కాల్చుకోవడం.
ఎన్నటికీ వదిలిపెట్టని ఒక స్మృతిని Robert సాయంతో నా భాషలోనూ రాసుకున్న తృప్తి మిగిలింది. మీకేమనిపిస్తుందో మీరే తరచి చూసుకోండి. మూల కవిత, దానిని అనువదించేందుకు నేను చేసిన ప్రయత్నమూ, నాగరాజు రామస్వామిగారి అనువాద కవితా కినిగె లో ఇక్కడ చూడండి.

5 comments:

 1. అభినందనలు మానస గారు.నాకు నాగరాజు రామస్వామి గారి అనువాదం బాగా నచ్చింది.మీ అనువాదం కంటే మరొకరి అనువాదం బావుందని మొహమాటం లేకుండా చెప్పడం మీ గొప్పదనం.

  ReplyDelete
 2. మానస గారూ,
  మన కలలు వేరొకరి కవితలై కవ్వించినప్పుడు, మన ఆశలే వేరెవరో శ్వాసిస్తున్నప్పుడు, అదొక చిత్రమైన అనుభూతి... ఇది చాలా విలువైన మాట. అలా అనగలగడానికి ఒక రసహృదయం కావాలి. రాబర్ట్ బ్రౌనింగ్ మాటల విషయంలో మహా పిసినారి అని ప్రతీతి. కవితలో కథనం చెప్పగల దిట్ట. మంచి అనువాదం అందించిన మీకూ రామస్వామి గారికీ హృదయపూర్వక అభినందనలు.
  అభివాదములతో

  ReplyDelete
 3. అనువాదాలు బాగున్నాయి. కొంత సహజత్వం లోపించినట్టు అనిపించింది, అన్ని అనువాదాల్లోనూ. ఇంగ్లీషు పదచిత్రాలని తెలుగు చెయ్యడం వల్ల కావొచ్చు.

  మీ అనువాదం ఎంపిక అయ్యినందుకు అభినందనలు!

  కవితానువాద పోటీలు కూడా జరుగుతున్నాయన్న మాట! interesting. ఈసారి నేనూ సరదాగా ప్రయత్నిస్తా.

  ReplyDelete
 4. లోకేశ్ శ్రీకాంత్ గారూ, మూర్తిగారూ, ధన్యవాదాలండీ!
  ఫణీంద్రగారూ - అవునండీ, అదే అనుభూతిని అంత సహజంగా మన పదాల్లో పట్టుకోవడం కొంచం కష్టమే :)). అందుకే వ్రాశాను, చేతులు కాల్చుకోవడం అని :)))

  వచ్చే నెల మీ అనువాదం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాను. ఈ నెల కవిత చాలా బాగుంది .
  (అసలు లోకేశ్ శ్రీకాంత్ గారు కూడా ప్రయత్నించవచ్చు, కవిత్వం అంటే ఆసక్తి మెండు కనుక, వ్రాస్తూంటారు కనుకా)

  ReplyDelete
 5. Ala anti anubhavam Naku mi kavitalato 1 amazing ammo eme nakosame e kavita rasindi ani anipinchindi

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...