"నిర్వికల్ప సంగీతం"- వాడ్రేవు చినవీరభద్రుడు


విమర్శలకు, విశ్లేషణలకూ దోసిలి ఒగ్గి నిల్చోవడం, నా దృష్టిలో కవిత్వపు లక్షణమే కాదు. కనుక, ఈ వ్యాసం నేనెంతగానో అభిమానించే ఒక పుస్తకానికి ఆత్మీయ పరిచయమే తప్ప వేరొకటి కాదు.

సాహితీ ప్రక్రియలన్నింటిలోకీ నాకు సమున్నతంగా కనిపించేది కవిత్వం. కథలు, కథానికలు గురించి బాగా వ్రాశారనో, వ్రాయలేదనో, మరింత మెఱుగ్గా వ్రాసేందుకు అవకాశముందనో తేలిగ్గా చెప్పేయగలం కానీ, కవిత్వం దగ్గరకొచ్చేసరికి, ఈ లెక్కలేవీ సరిపోవు. ప్రతిపాదించబడ్డ సిద్ధాంతాలూ, కవితలంటే ఇలానే ఉండాలన్న సంకుచిత భావాలూ, పదాడంబరాలకు ప్రజలు పెట్టుకున్న తప్పుడు తూనిక రాళ్ళు, అన్నీ, ఇవన్నీ కవితను చదవడం పూర్తయిన క్షణంలో మనకు కలిగే అనుభూతి ముందు తేలిపోవాల్సిందే, ఆఖరు స్థానాలు పొందాల్సిందే!

కవి ఏ అంతర్మథనానికి లోనయ్యి కవిత్వాన్ని సృజించాడో, కవిని, ఆ అక్షరాలను అర్థం చేసుకుంటే తప్ప మనకు అవగతమయ్యే అవకాశం లేదు. మనకు చప్పగా తోచింది మరొకరికి మహాద్భుతంలా కనిపించవచ్చు. మనకు కంట నీరు తెప్పించిన పంక్తులు, వేరొకరికి తోచీ తోచని పదాల అల్లికలా కనపడవచ్చు. ఒక్కోసారి సదరు కవికే తాను చెప్పదల్చుకున్నది చెప్పగలిగానా లేదా అన్న సందేహమూ కలుగవచ్చు - నా కవితలో నిజంగా ఇంత భావవైశాల్యం ఉందా అని తత్తరపడనూవచ్చు.

అయితే, నాకు సంబంధించినంతవరకూ, ఇవన్నీ పాఠకులకు అనవసరమైన విషయాలు. (సాధికారంగా విమర్శలు చేయగల సాహితీవేత్తలకు మాత్రమే మినహాయింపు). కవితలు వ్రాయడంలో మనిషి మనిషికీ శైలి మారుతూ పోయినట్లే, కవితను చదవడమూ, అనుభవించడమూ కూడా ప్రతి పాఠకునికీ ప్రత్యేకమైనవే. ఇది నేను బలంగా నమ్మిన కారణానికేమో, మరికాస్త ధైర్యంగా ముందడుగు వేసి, కవితల అందం ఇనుమడించేది, అందులోని సౌందర్యాన్ని దొరకబుచ్చుకు అనుభవించగల పాఠకుల వల్లనే నని మిత్రులతో అంటూ ఉంటాను.

ఊహలకందని బహుమతులొస్తే...


"నాకు ప్రైజులన్నా, సర్ప్రైజులన్నా చిరాకు" అని మొహమంతా ముడుచుకుని చెప్పే బ్రహ్మానందం మున్ముందుగా గుర్తొచ్చేస్తాడేమో మీ అందరికీ! :). నాకు మాత్రం ఆ రెండూ భలే ఇష్టం. "వేళ కాని వేళా.." ఎవరో మన ముందుకొచ్చి ఊహించని రీతుల్లో సంబరపెట్టి ఉబ్బితబ్బిబ్బవుతున్న మనను చూసి మనసారా నవ్వేస్తోంటే, ఆ నవ్వుల వెన్నెల్లో తడవాలనుకోని వారెందరుంటారు ? తడి తడి చూపుల మరకలు తుడుచుకుని, విస్మయమంతా మెల్లగా లోలోపల దాచుకుని, విప్పారే పూబాలలమై కళ్ళెత్తి చూస్తుంటే లోకం ఎంత స్వచ్ఛంగా కనపడుతుందో కదూ!

ఒక వయసొచ్చే దాకా, ఇంట్లో చిన్నపిల్లలుగా పుట్టిన నాబోటి వారికి, తీసుకోవడమే తప్ప ఇవ్వడమంటే ఏమిటో తెలిసే అవకాశమే ఉండదు. ఏదైనా ఇవ్వకపోతే అరిచి గోలెట్టడం, ఆ పంతాన్నెవ్వరూ పట్టించుకోకపోతే కాసేపు బెంగపడ్డట్టు నటించి నిద్దరోవడమూ తప్పిస్తే, ఇవ్వడం గురించి అన్నన్ని ఆలోచనలూ ఏమీ ఉండేవు కావు.

చిన్నప్పుడు త్యాగాలంటే ఏం ఉంటాయి ? అరిటాకు కంచం కోసం ప్రతిరాత్రీ యుద్ధం చేయకుండా అక్కకి ఇచ్చేయడం; అమ్మ దుప్పట్లో అక్క కంటే ముందు దూరిపోయి, తల మాత్రం బయట పెట్టి వెక్కిరించే అలవాటుని అప్పుడప్పుడూ మానుకోవడం; సన్నటి సెగ మీద గులాబీ రంగులోకి వచ్చేదాకా మరగ కాచిన పాలతో, కాఫీ పొడి ధారాళంగా వేశాక వేడి వేడి నీళ్ళు తాకీ తాకగానే బొట్లు బొట్లుగా క్రిందకి జారే అమృతం లాంటి డికాషన్ తో, పొగలు కక్కుతున్న అమ్మ చేతి కాఫీను అర చేతుల మధ్య పెట్టుకుని, ఆదివారం ఈనాడు కథను చదవడం దేనికీ సాటి రాదని తెలిసినా, అమ్మ కోసం త్యాగం చేయడం; ప్రతి నెలా ఒకటో తారీఖు పరిపరి విథాల మెప్పించి సాధించిన "పాకెట్ మనీ"ని మట్టి కుండలో నింపుకుని గలగలలాడించి చూసుకుంటుంటే, నెల చివర్లో నాన్నగారు వచ్చి, వడ్డీతో సహా ఇచ్చేస్తానని నమ్మబలికితే తలాడించి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడం; బెదురుతూ బెదురుతూనే బిట్‌పేపర్ చూపించమని అడిగిన నేస్తానికి ధైర్యం చేసి జవాబులు చెప్పేయడం.

ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల ...