మా ఊరు - సుధ - రియాలిటీ చెక్

భీమడోలుకీ పూళ్ళకీ రెప్పపాటు దూరం. ఈ రెప్పపాటు దూరంలోనే మాయమైపోయే ఓ చిన్నపల్లెటూరుంది. మెయిన్ రోడ్ మీది సైన్ బోర్డ్ పైన ఊరిపేరున్నా, అదెవ్వరికీ కనపడదు. ఊరికొచ్చిన వాళ్ళో, వెళ్ళేవాళ్ళో చేతులెత్తితే తప్ప డ్రైవర్లు అక్కడ తమ బస్సులాపరు. ఆ నడిరోడ్డు మీద నుండి మట్టిరోడ్డు మీదకి రెండడుగులు వేసి, అటునుండీ ఓ సన్న చిన్న వంతెన ఎక్కి ఊళ్ళోకి దిగాలని తెలీక ఆ కనపడీకనపడని ఊరిమలుపు దాటి వెళ్ళిపోయిన కార్లు యూ టర్న్ లు కొట్టుకుంటూ ఉంటాయి. వంతెన దిగి కిందకొస్తే ఊరి మొత్తం మీద ఉండేవల్లా యాభయ్యో అరవయ్యో గడపలు. గుమ్మం దాటి వందడుగులేసే ఓపికుంటే, పచ్చగా కనుచూపుమేరా విస్తరించిన పొలాలు ఎదురొస్తాయి. ఊరి మొదట్లో గుర్రపు డెక్కతో నిండి ఉన్న చెరువు, దానినానుకుని ఉండే గంగానమ్మ గుడీ, ఊరి మధ్యలోని రామాయలమూ అక్కడివాళ్ళ ఉమ్మడి ఆస్తి. రెండు చిల్లర కొట్లు తప్ప ఏమీ ఉన్నట్టు కనపడని ఆ ఊళ్ళో, ఎవ్వరూ దేనికీ ఇబ్బంది పడుతున్నట్టే ఉండరు. ఇంటి పక్కనో సూపర్ మార్కెట్టూ, హోం డెలివరీలూ, ఆన్లైన్ షాపింగ్‌లూ లేనిదే బతుకు గడవదని నమ్మే లోకానికీ, ఈ ఊరికీ గట్టిగా లెక్క కడితే గంట దూరమైనా ఉండదు. ఆనపకాయలూ, గుమ్మడికాయలూ, వంకాయలూ, చిక్కుళ్ళూ, పచ్చిమిరపా, ములక్కాడలూ ఇలా కావలసిన కూరలన్నీ మెట్లను పట్టుకు పాకిన తీగల్లోనో పందిళ్ళలోనో ఇళ్ళ ముందరి దడుల్లోనో వేలాడుతూ కనపడుతుంటాయి. నా అరటికాయకు నీ బీరకాయివ్వమనడం తరచూ కంటపడే దృశ్యం. ఏ వీధిలో నడుస్తోన్నా తుంపుకుపొమ్మన్నట్టు మందారాలాదిగా ఏవేవో పూలచెట్లు ఊగుతూ పిలుస్తుంటాయి. ఆ పూల మొక్కలను బట్టి ఆ ఇంటి సింహాసనంలో పూజలందుకునేదెవరో చెప్పడమూ ఓ విద్యేనట. ఇప్పుడిప్పుడే వేసినట్టుండే ఆ ఊరి సిమెంటు రోడ్లన్నీ పిల్లలకు ఆటస్థలాలు. భయం తెలీని బాల్యం వాళ్ళది. అదను చూసి కోడి మెడ పట్టుకుని గింజల దగ్గరకు తీసుకుపోతారు, గడ్డి పరకలేరి దూడల మూతి దగ్గరుంచి తినమని బతిమాలుతుంటారు. పురుగూపుట్రా ఎదురైతే పాకించుకోవడానికి అరచేతుల్లో ఎప్పుడూ ఏవో ఆకులూ పుల్లలూ దొప్పలూ సిద్ధంగా ఉంచుకుంటారు. ఆకలికి వాళ్ళెవరైనా ఏడ్చినట్టున్నా, పొలాల వైపు వెళ్తున్నట్టున్నా, ఆ దోవన పోయే ఎవరో ఒకరు సైకిలెక్కించుకు తెచ్చి ఇంట్లో దింపేస్తారు. కులాలూ, రాజకీయాల ఊసుండదని కాదు కానీ, ఊరిలో మనుషులు ఒకరికొకరు పరాయి మాత్రం కారు. ముప్పైలలోపు వయసున్న మనుషులెవరైనా ఉంటారా ఇక్కడ? అన్న అనుమానం కలిగించే ఊరది. పెద్ద చదువుల ఊసులేని ఊరవడం వల్ల, వ్యవసాయానికి ఆవల ఉపాధీ దొరక్కపోవడం వల్ల, ఆ పొలాలతోనూ, ఆ నేలతోనూ ఇంకా ముడులున్న వాళ్ళే తప్ప ఎవరూ ఉండరక్కడ. ఒక తరంలోని పిల్లలంతా చక్కగా చదువుకుని దేశాలు దాటి వెళ్ళి పంపిన సొమ్ముతో  అక్కడి ఇళ్ళ హంగులూ, సదుపాయాలైతే మారాయి కానీ, సహజంగా సమృద్ధిగా ఉన్న పాడిపంటల వల్ల అక్కడి వాసనలు, వాతావరణమూ మారలేదు. పగలు పన్నెండింటి దాకా నేనున్నాను అన్నట్టు వినపడే రామాలయం గుడి గంటలూ, ఆ పైన సాయంకాలం దాకా కావుకావుమనే కాకుల గోలా, ఆవులూ, గేదెల అరుపులూ, ఝూమ్మని ముసురుకునే ఈగల రొదా, ముప్పొద్దులా కోళ్ళ అలికిడీ, మొహమాటపు ఛాయలు లేని గొంతులూ- ఆ ఊరికున్నదంతా ఇదే.ఏ ఇంటికైనా ఓ కారు రావాలంటే, వీధి వీధంతా ముందుగానే ఒక మాట అనుకోవాల్సిన ఆ ఊరిలోకి...పోయిన ఏడాది నన్ను వెదుక్కుంటూ వచ్చింది సుధ . స్టీల్ కేన్‌లో బుజ్జివాడికి లడ్డూలూ, నాకోసం లేత గులాబీ అంటు, ఎదురుపడ్డ ప్రతివాళ్ళకూ ఓ వెలుగు నవ్వూ ఇంకా...రాజిరెడ్డి పుస్తకాలు. ఇవన్నీ వెంటబెట్టుకుని, సెవెన్ సీటర్ ఆటోలో కుదుపుల ప్రయాణం చేసి దిగింది.

మొదటిసారి ముఖాముఖి కలిసిన ఆశ్చర్యాలు, పరిచయాలు, పిచ్చాపాటి కబుర్లూ, తెలిసిన వారందరి గురించిన విశేషాల బట్వాడాతో మా మధ్య గంటలు నిమిషాలవుతున్నాయి. రోజుల్లోకొచ్చేసిన మా అమెరికా తిరుగుప్రయాణానికి అత్తగారు దగ్గరుండి చేయిస్తున్న పిండివంటల జోరుకు ఇల్లంతా వేడెక్కి పోయి ఉంది. ప్రహ్లాద్ అడిగిన పాలకోవా బిళ్ళల కోసం మరిగిస్తోన్న పాల తీపివాసన వెగటుగా సోకుతోంది నాకు. ఆ సెగ తప్పించుకోవడానికి భోజనాలయ్యాక సుధా, నేనూ పొలాల వైపు నడిచాం. గట్ల మీద అర్థచంద్రంలా వంగిన కొబ్బరిచెట్లూ, ఓ వైపుగా గడ్డివాములూ, వాటి వంకనే విశ్రాంతిగా పడుకున్న దూడలూ, అంతెత్తుకు ఎగిరి దూకుతున్న కోళ్ళూ.... జాగ్రత్తగా ఒక్కో అడుగూ వేస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాం. ఆ మాటా ఈ మాటా అయి మళ్ళీ పుస్తకాల దగ్గరకే వచ్చాం.  "రియాలిటీ చెక్" కి తానే పబ్లిషరన్న విషయం అంతకు ముందే విన్నానేమో గుర్తు లేదు కానీ, ఆవిడ ఎందుకు పబ్లిషర్ అయిందో తెలిసింది మాత్రం ఆ రోజే, అప్పుడే.

"ఈ సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే ఒక అంకె తగ్గిపోవడం కాదు, ఆ ఒక్కడితో ముడిపడి ఉన్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం." అంటాడు రాజిరెడ్డి ఆ పుస్తకంలో ఒక చోట. అది మనకెలా అర్థమవుతుంది? చావుని వార్తగా, వార్తని వ్యాపారంగా మార్చుకున్న లోకంలో, మనకు సంబంధం లేని ఏ మరణమైనా ఎందుకు కదుపుతుంది? ఇలాంటి వాక్యం మననెందుకు తాకుతుంది?

కానీ, హృదయంలో బరువు మోస్తూ ఉందేమో..సుధను తాకింది. మరో లోకమెరుగనట్టు మేనల్లుడి చుట్టూ అల్లుకున్న ఆమె ప్రపంచమంతా అతని మరణంతో తునాతునకలైపోయిన దుఃఖంలో ఉందేమో, ఆ వాక్యం ఆమెకు అర్థమైంది. ఏ పుస్తకం దొరికినా ఆకలితో చదువుకుంటూ పోయే తాను, ఆ మరణం పుట్టించిన వెలితిలో దేనినీ చూడలేనట్టు, భరించలేనట్టు, దేని పట్లా ఆసక్తి లేనట్టు ఉన్న రోజుల్లో, యథాలాపంగా సాక్షి పేజీలు తిరగేస్తుంటే ఇదుగో, ఈ రియాలిటీ చెక్ శీర్షికన రాజిరెడ్డి వ్రాసిన మాటలు కంటపడ్డాయిట. Truth is stranger than fiction అని వింటూంటాం. ఇది అట్లాంటి అనుభవం. ఆమె ఆ రోజు చూసిన శీర్షిక "ప్రతీక్ లేని ఇల్లు". చనిపోయిన బిడ్డను తల్చుకుని తండ్రి పడ్డ వేదన ఆ రచన నిండా. పోయినోళ్ళ తీపిగుర్తుల్లా కాక విషాదముద్రల్లా మిగిలి ఉన్న ఆ తండ్రి బ్రతుకు మిగతావాళ్ళకు ఆశ్చర్యం మాత్రమే కానీ, సుధకైతే అనుభవం. ఇంకా ఆశ్చర్యమేమంటే, ఆ ప్రతీక్ చనిపోయిన రోజు..సుధ వాళ్ళ మేనల్లుడి పుట్టిన రోజు. ఆ పుస్తకపు ముందుమాటలో, సుధ అంటుందిలా:

ఈ రాజిరెడ్డి ఎవరో కోమటి రెడ్డి ఇంటికి కాక, నా ఇంటికే వచ్చి, నా దగ్గర కూర్చుని, నా చిన్ను గురించిన ప్రతి వివరాన్నీ అడిగి తీసుకుని, నా మనసులో పేరుకుపోయిన దుఃఖమంతా కరిగినీరయేలా ఒక ఆప్తమిత్రుడిలా ఓదార్చినట్టుగా అనిపించింది. కనిపించని బరువు మోస్తున్నట్టుగా ఉన్న నా మనసు కొంత భారం దించుకుని తేలికైంది.

"Read the lines as if they were unknown to you, and you will feel in your inmost self how very much they are yours"- అంటాడు రిల్క ఒక చోట. మిత్రులు సదాశివ గారితో సాగిన నా ఉత్తరాల్లో, ఆయన ఈ మాటలు గుర్తు చేసినప్పుడు, నాకు రియాలిటీ చెక్ చదివిన అనుభవమే గుర్తొచ్చింది.  ఒక మనిషినో, వస్తువునో, ప్రాంతాన్నో, అనుభవాన్నో దేన్నైనా చూసేటప్పుడు హృదయాన్ని తెరిచి ఉంచి నిష్పాక్షికంగా చూడగలిగితే అది నీకు చెప్పే అర్థాలు వేరు. రియాలిటీ చెక్‌లో రాజిరెడ్డి చూపు అలాంటిది. అలా చూసి ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. చాలా వివరంగా చెప్తాడు. తనకళ్ళను నమ్ముకుని చెప్పడమన్న పరిమితి ఉంటే ఉండవచ్చు గాక, కానీ ఎదురుగా ఉన్నది ఎంత బాధ అయినా, సంతోషాన్నిచ్చేదైనా, అసహ్యాన్ని కలిగించేదైనా, అంగీకరించలేనిదైనా, అతను దాని గురించి నిష్పాక్షికంగా చెప్పుకుపోవడం ఆపడు. నిజం దాని నిండు రూపంతో చదివే మనిషి కళ్ళ ముందుకు రావడానికి తనకు చేతనైనంతా శ్రమపడతాడు. అట్లా చెయ్యడంలో, ఎక్కడో ఆ సత్యంతో రాజీ కుదురుస్తాడు కూడా. ఈస్తటిక్స్, శైలీ, శిల్పం ఇవన్నీ కాదు. జీవితాన్ని పారదర్శకమైన అక్షరాల మీదుగా చూపెడతాడతడు. ఆ చూపించడంలో, చూడటంలో భయం గొలిపే నిజం పట్ల ఉండే వెగటూ, విరక్తీ తొలిగిపోయి దాన్ని అంగీకరించడమూ, దాన్ని దాటి ముందుకు వెళ్ళడమూ సాధ్యపడతాయి. ఏకాంతంలో ధ్యానం ద్వారా సాధించాలనుకునే స్థితి ఏదో, రియాలిటీ చెక్ ద్వారా అక్షరాల్లో సాధించాడు రాజిరెడ్డి.

అందుకే సుధ ఇంకా ఇలా చెప్పింది..

బయటకు కనిపించకుండా నన్ను ఆవరించుకుని ఉన్న దుఃఖపు తెరను తొలగించుకుని బయటకి రాగలిగాను. నా చుట్టూ ఉన్న మనుష్యులతో కలవడం, మాట్లాడటం, వారితో అనుబంధం పెంచుకోవడం చేశాను. అన్నిటికీ మించి నా పిల్లాడ్ని నేను దుఃఖంగా కాక ఆనందంగా తలుచుకోగలిగాను. వాడిని నా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. మళ్ళీ నా పూర్వపు ప్రపంచంలోకి, పుస్తకాల్లోకి, సాధారణ జీవితంలోకి రాగలిగాను.

నాకు ఈ మాటలు చదివినప్పుడల్లా, పంచుకో సాధ్యం కాని ఓ ఉద్వేగాన్ని మాటల్లోకి బట్వాడా చేస్తున్న రాపిడికి గరగరమంటూ పలికిన సుధ గొంతు చెవిలో వినపడుతుంది. మేమిద్దరం ఆ ఆకుపచ్చ పొలాల ముందు, చేతిలో గడ్డిపరకలతో ఎగుర్తుతోన్న పక్షులను చూస్తూ నిలబడి ఉండటం గుర్తొస్తుంది. ఈ అనంతమైన సృష్టిలో మనమూ, మన ఉనికీ ఎంత? మన చేతిలోనూ, మన కట్టడిలోనూ ఉన్న జీవితమెంత? చిన గీతల పక్కన పెద గీతలను గీసే బ్రతుకుని, పెనుమాయను కళ్ళముందు ఆడించి అంతా సౌఖ్యమే అని నమ్మబలికే మహామాయని ఎవ్వరమూ తప్పించుకోలేం. ఎందుకో ఈ ఆలోచనలు మెదిలిన ఆ రోజు వాతావరణాన్ని, ఆ ఊరి వాతావరణాన్ని, ఈ పుస్తకం నుండి విడదీసి చూడటం ఇన్నాళ్ళైనా నాకు సాధ్యపడటం లేదు.

ప్రశ్నలు, జవాబులు, కొట్టివేతలు ఇవన్నీ తప్పవు. అన్నీ దాటుకున్న విశ్రాంతిలోనైనా, అన్నిటిమధ్యా నడుస్తున్న హడావుడిలోనైనా, నమ్మకంగా అనిపించేది మాత్రం ఒక్కటే.

జీవనకాంక్ష కన్నా బలమైన, విలువైన కానుక లోకంలో మరేదీ లేనేలేదని.

అంతఃపూర్ణో బహిఃపూర్ణో పూర్ణకుంభ ఇవార్ణవే
అంతఃశూన్యో బహిఃశూన్య శ్శూన్యకుంభ ఇవాంబరే

అంటుంది ఉపనిషద్వాక్యం. అట్లాంటి పరమాత్మని, లోపలా వెలుపలా పరిపూర్ణమైన సముద్రంలోని నిండుకుండ లాంటి, లోపలా బయటా శూన్యమైన ఆకాశంలోని శూన్యఘటంలాంటి పరమాత్మని-  జీవించడంతోనే అనుభవించగలమని నా మనసుకి తోస్తుంది. జీవించడమొక్కటే జీవితానికి గురువనిపిస్తుంది. కొందరి అనుభవాలు , కొన్ని పుస్తకాలు , నీ నమ్మకం నిజమే సుమా! అని మృదువుగా భుజం మీద తట్టి చెబుతున్నట్టు ఉంటుంది.

పాకవిద్య

జీవితంలో కొందరు స్నేహితులను మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం. బహుశా వాళ్ళు జీవితకాలపు స్నేహితులు. నేను సింగపూర్ నుండి వచ్చేశాక కూడా, మా యూనిట్ ఒకటే కావడం వల్ల తను హైదరాబాద్ రావడమూ, తర్వాత నేను బెంగళూరు వెళ్ళడమూ, అతనికీ అక్కడి ప్రాజెక్టే రావడమూ, తర్వాత అతని పెళ్ళయాక, వాళ్ళావిడ విద్య పుట్టిల్లు మా ఇంటికి చాలా దగ్గర్లో ఉండడమూ లాంటి ఎన్నో కారణాల వల్ల మిత్రతో నా స్నేహం కొనసాగుతూనే ఉంది. పిల్లలు పుట్టినప్పుడూ, పుట్టినరోజులప్పుడూ, గృహప్రవేశాలూ పూజలూ చేసుకున్నప్పుడూ ఆ సందర్భాలొక మిషగా మేం కలుస్తూనే ఉన్నాం. విద్య నాకూ, ఉత్కళికకూ కూడా చాలా తొందరగా స్నేహితురాలవడం వల్లా, ఉత్కళిక ఎలెక్ట్రానిక్‌సిటీలో వాళ్ళ అపార్ట్మెంట్‌లోనే ఫ్లాట్ కొనుక్కోవడం వల్లా, కంపెనీలు మారాక కూడా మా ముచ్చట్లు తగ్గుముఖం పట్టాయే తప్ప పూర్తిగా నిలిచిపోలేదు.

అయితే పది పన్నెండేళ్ళ తర్వాత ఆ మిత్రశేఖరుడి ముచ్చట్లు ఇప్పుడు బ్లాగ్‌లో ఏకరువు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. మొన్నే అతను మా స్నేహితులందరికీ మెయిల్ పంపాడు. తనకి ఎప్పటి నుండో ఇష్టమైన వ్యాపకమైన వంట మీద ఒక యుట్యూబ్ ఛానెల్ మొదలెట్టానని. ఆ మెయిల్ చూస్తూనే ఇంగువపోపూ, అతనికి మాత్రమే చేతనైన కూరపొడుల వాసనలు, పసితనపు అల్లర్లలాంటి జ్ఞాపకాలూ నన్ను చుట్టుముట్టినట్టైంది.

వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో అనిల్, నేనూ ఓసారి వాళ్ళింటికి వెళితే వాళ్ళావిడ బ్రహ్మాండంగా వంట చేసి పెట్టింది. నేను లొట్టలేసుకుంటూ తినేసి మారు వడ్డించుకుంటుంటే ఆ అమ్మాయి మాత్రం మిత్ర మొహంలోకి చూస్తూ కూర్చుంది. ఏమిటి కథా..అని అడిగాను.

"ప్రద్దానికీ ఏదో ఒక సలహా పడేస్తాడబ్బా..ఇప్పుడేమంటాడా అని చూస్తున్నా" అంది నొసలు చిట్లించి.

ఓహో, వంట బాగా వచ్చిన మగవాళ్ళతో ఇదో గొడవా అనుకున్నాను. అప్పటిదాకా నా పొగడ్తలన్నీ వినీవినీ విసుగెత్తిపోయి ఉన్న అనిల్ ఆ మాటకి మొహం విప్పార్చుకున్నాడు.

"చూశావా...దీనిలో ఎన్ని సమస్యలున్నాయో.." అన్నట్టు కళ్ళెగరేశాడు.

క్షణాల మీద నలుగురం రెండు గ్రూపులుగా విడిపోయాం. ఒక్క వంటకి అన్ని చేతులు తగదనీ, ఒకరు వంట చేశాక వేలెత్తి చూపడం తగదనీ, ..ఎవరికి నచ్చిన థియరీ వాళ్ళు పక్కవాళ్ళు వినరని తెలిసీ చెప్పుకున్నాం.

సరే, ఇప్పుడా రోజులు కావుగా. ముప్పూటలా వేడిగా వండుకు తినడమొక్కటే ఉత్సాహపరిచే వ్యాపకంగా మారిన ఈ క్వారంటైన్ రోజుల్లో...చిన్నాపెద్దా ఆడామగా అందరూ వంటల మీద పడ్డారని నా వాట్సప్ కూడా పూటా ఘోషిస్తోంది. ఎవరిదాకో ఎందుకూ, నా పిల్లాడు వెనక్కీ-ముందుకీ అని మంత్రం చదువుతూ చపాతీలు ఒత్తిపెడుతున్నాడు. స్టెప్-1, స్టెప్-2 అని చెప్పుకుంటూ దోసలేస్తున్నాడు. నిన్నా మొన్నటి దాకా ఇడ్లీలలోకి పచ్చడి కూడా వేసుకోని పసిదానిలా ఉన్న మా అక్క కూతురు, ఇప్పుడు కుకర్ పెట్టి చిన్న చిన్న కూరలు చేస్తోందట. మా నాన్నగారు అమెజాన్‌లో దొరికింది దొరికినట్టు ఆర్డర్ చేసి, అవన్నీ వాడి వంటలు చేసి వాటాలు మా అక్కకీ (అది పక్క వీధిలోనే ఉంటుంది), ఫొటోలు నాకూ పంపేస్తున్నారు. వంటలో మా నాన్నగారి పద్ధతి తెలుసు కనుక, మా అక్క అదృష్టానికి కుళ్ళుకోవడం వినా నేనేం చెయ్యలేను. ప్రహ్లాద్ పిజ్జా అడిగితే చెయ్యను పొమ్మన్నానని, అనిల్ యూట్యూబ్ మొత్తం జల్లెడ పట్టి కావలసినవన్నీ కొనుక్కు తెచ్చుకుని వాడికీ, వాడి స్నేహితులకూ కూడా బ్రహ్మాండంగా చేసి పెడుతున్నాడు. అట్లా ఆ పిల్లలకొక హీరో అయిపోయాడు.

ఈ వంటలన్నీ సరే కానీ, పూటా గిన్నెలు తోమాలంటే మాత్రం పరమవిసుగు కనుక చాలా మంది వన్ పాట్ మీల్స్ చేసుకుంటున్నారు కదా. మా మిత్రది వాటిలో అందె వేసిన చెయ్యి. నేను ముందు పోస్ట్‌లో రాసిన చాలా వంటలు వివరంగా ఈ ఛానెల్‌లో అప్‌డేట్ చేశాడు. మీలోనూ వంట మీద కొత్త ఇష్టాలు పెరిగిన ఉత్సాహవంతులుండి ఉంటే, మా మిత్రుడి పాకవిద్య ఛానెల్ను ఓ సారి చూస్తారని ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఆసక్తి గలవారు సబ్స్క్రైబ్ చేసుకోండి..

https://www.youtube.com/channel/UCC5gZto1cSfRFeACs2ahDJw

అన్నట్టూ..నా పాత పోస్ట్ అంతా చదివి..నా దగ్గరేం ఫొటోలు లేవనుకుంటుంటే, తను పంపిన ఫొటో...
birthday@ECP

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....