Showing posts with label * ప్రణయవాహిని. Show all posts
Showing posts with label * ప్రణయవాహిని. Show all posts

నేలకు దూకిన జలపాతం


వర్డ్స్‌వర్త్ ఒక కావ్యంలో "కన్య జలపాతం చూస్తూ గడిపితే, ఆ జలపాతంలో లయ, క్రమము, ధ్వని, నాదము- వీటి సమ్మేళనం వల్ల ఏర్పడే సంగీతం, సౌందర్యం ఇవన్నీ కన్య శరీరంలో జొరబడీ ఆ కన్యని అందంగా చేస్తా"యంటాడు. ఇంకొకరి జీవితానుభవాలను, మరొకరి కవిత్వాలను మనం అర్థం చేసుకోగలమే కానీ, అవే భావోద్వేగాలను అదే స్థాయిలో అనుభవించడం సాధ్యమయ్యే పని కాదనిపిస్తుంది. బహుశా అందుకేనేమో, మొదటిసారి అది చదివి, అతనిది భలే చిత్రమైన ఊహ సుమా అనుకున్నానే కానీ, ఆ రహస్యం నాకర్థమవుతుందని మాత్రం కలగనలేదు. ఆశ్చర్యమేమిటో తెలుసా..."శివ సముద్రం" జలపాతాల దగ్గర నిను చూసినప్పుడు, ఆకాశపు కొస నుండి జారిపడుతోందా అన్నట్లున్న ప్రవాహం క్రిందుగా నిల్చుని నవ్వుతోన్న నీకు దగ్గరగా నడచినప్పుడు...అకస్మాత్తుగా వర్డ్స్‌వర్త్ మాటలకు అర్థం తెలిసింది నాకు. 

జలపాతమంటే నువ్వు..తెరలు తెరలుగా విస్తరించే నీ నవ్వు. తడిస్తే ఆ నవ్వుల్లో తడవాలి. జలపాతమంటే నువ్వు..నీ చిలిపి చిందులు...చేతనైతే ఆ అల్లరి ప్రవాహాన్ని అడ్డుకోగలగాలి. జలపాతమంటే...సఖీ..దానికి నిజమైన పర్యాయపదం నీ సౌందర్యం! అందులో మార్గం తెలియని సుమనస్సునై తేలిపోవాలి..లేదూ..నిశి నీలి పెదవిపై నుండి జారిపడే అమృతపు బిందువునై వచ్చి నీలో ఐక్యమవాలి. గమ్యం నీవే అయినప్పుడు, మార్గాలతో నాకేం పని ? 

మురళీ ప్రణయగాథ

"ముర్లీ, ప్లీజ్! నన్ను అర్థం చేసుకో; ఐ రియల్లీ లవ్ యు."

చెవులు మూసేసుకున్నాడు మురళి.

"కనీసం నా మాట వినడం కూడా ఇష్టం లేదా నీకు?" రోషంతో అడిగింది రమ్య.

" నా పేరును చంపేస్తుంటే చెవులప్పగించుకుని వినడం నా వల్ల కాదు"

" హబ్బా!!!! నాకు కొన్ని పదాలు పలకవు, అది కూడా పెద్ద నేరమేనా, అసలు ఆ వంక పెట్టుకుని పెల్లే వద్దనడం ...ఇట్ ఈజ్ జస్ట్ నాట్ ఫెయిర్"

"రమ్యా, ప్లీజ్, నువ్వు "పెల్లి" "మురలి" అనడం మాకపోతే - మన పెళ్ళి సంగతి వదిలెయ్, నీతో మాట్లాడటం కూడా మానేద్దామనుకుంటున్నాను.

" అంటే నాలుగేళ్ళ పరిచయం, కలిసి తిరగడం, అన్నీ మర్చిపోదామా?"

" ఊ..."

"ఏమైంది నీకు, ఇంత మొండిగా తయారయ్యావు, నీకు తెల్సు కదా, నేను చదువు కోసం ఇక్కడికి వచ్చిన దాన్ని. వచ్చి దాదాపు సెవన్ యియర్స్ అవుతోంది. నేను మాట్లాడేది వాల్లకి అర్థం అవ్వాలి అంటే, మాట తీరు దానంతట అదే మారిపోతుంది. దానికి నేనేం చెయ్యను? "

"ప్రయత్నం."

" కమాన్!!"

" రమ్యా, నేను ఇక్కడికి వచ్చిన నాలుగేళ్ళలోనూ, కనీసం నా పేరైనా సరిగ్గా పిలవమని నిన్ను ఎన్నో సార్లు అడిగాను. నువ్వు వినలేదు. మాటకి ముందో సారి 'హనీ ' వెనకోసారి 'హనీ'. నువ్వు ప్రయత్నం చేసిందెప్పుడసలు? మొన్న సెమినార్‌కి స్టాంఫోర్డ్ వెళ్ళి, అక్కడి నుండి కృష్ణ శాస్త్రి విరహ గీతం తెలుగులో టైప్ చేసి పంపిస్తే, వెంటనే కాల్ చేసి, అర్థం ఏమిటో చెప్పమన్నావ్! "

"అఫ్కోర్స్! నాకు మరి అర్థం కాలేదు"

"కాస్తందుకో, దరఖాస్తందుకో...ప్రేమ దరఖాస్తందుకో; ముద్దులతోనే ముద్దరలేసే...- అని ఆ రోజు నేను కూని రాగాలు తీసినప్పుడు ఏం చేసావు?"

ప్రేమే నేరమౌనా..

-
నా పట్ల అతనికున్న నిర్లక్ష్యాన్ని భరించే నిబ్బరాన్ని కోల్పోయాను.

నాకు నేను ఎన్ని సార్లు సర్ది చెప్పుకున్నా, ఈ గుర్తించబడని ప్రేమ ఎంత నిరర్ధకం! మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారికే ఈ ప్రేమ తాలూకు గాఢత తెలీకపోవడం ఎంత బాధాకరం.నా ప్రేమ అతడి గుండెలను తాకిందనీ , నా మనసు అతనికి అర్థమైనదనీ ఒక్క మాటా...కాదంటే నాకొక్క సందేశమో, అదీ  కుదరదంటే చూపులతో ఒక్క చిరునవ్వో  విసిరేస్తే, ఆజన్మాంతం అతడి తలపుల్లో బతకగల బలమేదో ఎలాగోలా కూడగట్టుకుంటాను కదా..!

"నను వినా గతి ఎవ్వరనుచు..నగువో లేక బిగువో..." - ఎవరైనా విన్నారా ఈ త్యాగరాజ కీర్తన..?

ఆ శ్రీ రామ చంద్రుడేమో కాని, ఇతనికి మాత్రం ఖచ్చితంగా నేనంటే ఏదో చిన్న చూపు ఉంది. నేను ఎదురు చూసినంత సేపు కూడా నా కళ్ళ ముందు ఉండడు. నీ లానే నా కోసం ఎదురు చూసే వాళ్ళు కోటినొక్క మంది ఉన్నారు లేవోయ్ అన్నట్టు గర్వంగా చూస్తూ ఎప్పుడూ ఏదో పని ఉన్నట్టు అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంటాడు. ఎవ్వరూ చూడకుండా అప్పుడప్పుడు నేను చేసే సైగలనీ, అతడికి మాత్రమే వినపడేలా నేను చెప్పిన రహస్యాలనీ అతడు గమనించాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో, నాకు తెలిసే అవకాశమేదీ కనపడలేదు.అంతు చిక్కని ఆవేదనంతా ఆవిర్లుగా మారి అద్దం లాంటి నా మనసును మసక బారేలా చేస్తోంది.మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది .

 ఎంత ఆశ్చర్యం కదా...! - వశీకరణ మంత్రమేదో వేసి ఉండకపోతే, నాకు తెలీకుండానే నా మనసు అతని కోసమెందుకు పరితపిస్తుంది?!

పెదవి దాటిన ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు. గుండెల్లో భద్రం గా దాచిపెట్టబడి మన ప్రతి చర్యలోనూ తానున్నంటూ పొంగి వచ్చే ప్రేమకున్న గొప్పతనం పొడి పొడి మాటల్లో ఏముంటుంది ?అయినా అన్నేసి గంటలు ఆత్రం గా ఎదురు చూసాక, చిట్ట చివరికి ఎప్పుడో చిలిపి నవ్వులతో ఎదురొచ్చాక, మెరిసే నా కన్నుల్లో అతను చదవలేని భావాలను, పదాల్లో పొందుపరచి వివరించి గెలవగలనంటారా?
ఏదేమైనా, ఇక  నాకు వేరే దారి లేదు..అతనికి నా ఇష్టం అంతా తెలియజెప్పాలన్న తపన నన్ను నిలువనీయడం లేదు.తొలి సారి ఎక్కడ నా మనసు అతన్ని చూసి తుళ్ళి పడిందో, అక్కడికే మళ్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.నెలలో ఒకటీ అరా రోజులు  తప్పిస్తే అతనక్కడికి క్రమం తప్పకుండా వస్తాడు. ఆ వేణు గోపాల స్వామి గుడి వెనుక కోనేటి దగ్గర ఎవరి కోసమో తచ్చట్లాడుతూ ఉంటాడు.

చివరికి నేను ఆశించిన ఘడియ రానే వచ్చింది. గుడి దగ్గర ఏ కారణం చేతో జనం పలుచగా ఉన్నారా వేళ..నేను ఒంటరిగా ఉన్నాను. అతడు కనిపించాడు..ఎదురుగా వచ్చాడు .ఇంత కన్నా మంచి తరుణం మళ్లీ దొరుకుతుందో లేదో అనుమానమే.కానీ నాకే...ఒక్క మాటా పెగలడం లేదు. అంత ఆవేదనా అక్కడే ఎక్కడో గొంతుకలో చిక్కుకు పోయింది.నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తోంది. రెప్పల కాపలాతో కన్నీటి  నాపుకుంటూ కోనేటి మెట్ల మీద మౌనంగా కూలబడ్డాను.

ఆశ్చర్యం.!

నేను ఊహించినట్టు అతడు నా మానానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు.నెమ్మదిగా నిశ్శబ్దం గా నా దగ్గరికి వచ్చి నన్ను చూసాడు. అతని కళ్ళలోకి చూసాను...
ప్రపంచమంతా మౌనం పరుచుకున్న అనుభూతి . అతడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదన్న కోరిక  ,ఆ క్షణం శాశ్వతం కావాలన్న అత్యాశ..అన్నీ ఒక్కసారే నన్ను చుట్టుముట్టాయి.నా కళ్ళల్లో కదలాడుతున్న భావాలను చదివినట్టుగా,ఇన్నాళ్ళూ నన్నింత బాధ పెట్టినందుకు నా క్షమాపణ వేడుతున్నట్టుగా నా పాదాల చెంతకు చేరుకున్నాడు.

అప్పుడే నేను ఒక పొరపాటు చేసాను.

నేను మామూలు స్థితిలో ఉన్నట్టలైతే అతన్నిముఖారవిందాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని కోరుకునేదాన్నేమో.కాటుక కళ్ళల్లో నా ప్రేమను కూర్చి , వణికే పెదవుల్లో వలపును చేర్చి తొలి ముద్దిచ్చేదాన్నేమో...కాని నా మనసులో ఏ మూలనో ఉన్నా బాధ నన్ను లోకాన్ని మర్చిపోయేలా చేసింది. అణువణువునా నిండిన వేదన అహంకారంలా మారి కాలు విదిలించేలా చేసింది....

అంతే..!!

నిశ్చలంగా ఉన్న నీరంతా ఒక్కసారిగా చెల్లా చెదురయిపోయింది .తెప్పరిల్లి చూసేసరికి , పాదాల దగ్గరకు వచ్చి నా అలక తీరుస్తాడనుకున్న నా వాడు ఎప్పటి లాగే మళ్లీ అందనంత దూరం లో ఆకాశంలో కనపడ్డాడు.

నా లాంటి అమ్మాయిలను ఎందరినో చూసిన గర్వంతోనో ఏమో..ఏమీ జరగనట్టే, ఏదీ ఎరగనట్టే  నీలాకాశంలో వెలుగులు కుమ్మరిస్తున్నాడు.

ఈ రోజీ శరచ్చంద్రికను  చూసి ఏ అమ్మాయి మనసు పారేసుకోనుందో...!!
*** 
                                                                          

సావిరహే ...

ఉన్నట్టుండి నువ్వీ రోజు నా పక్కన లేవన్న నిజం గుర్తొస్తుంది. చేస్తున్న పని ఇహ ముందుకు కదలలేనంటూ మొరాయిస్తుంది. ప్రతి సాయంత్రం వదిలి వెళ్ళే సూరీడు ...తెల్లారగానే తన ఒంటిపై వెలుతురు మెరుపులు అతికించేందుకు వచ్చేస్తాడని ఆశపడే సంద్రంలా, రోజూ లాగే నీ కోసం వేచి చూసే హృదయం, ఇంకో రోజు నీ తలపులతోనే సరిపెట్టుకోవాలని అర్థమయ్యీ అవ్వగానే , మబ్బు పట్టిన ఆకాశంలా దిగాలు పడిపోతుంది.జీవితాన్నిమధురానుభూతుల దొంతరలా మార్చిన అందమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటి లాగే నా ఊహల అంబరం పైన ఎవ్వరూ చెరపలేని హరివిల్లులా అమరి కూర్చుంటాయి.

గుర్తుందా నీకు ?

వాకిట్లో పరుపల్లే పరుచుకున్న వెన్నెల్లో నీ ఒళ్ళో పడుకుని తలారబెట్టుకుంటూ చుక్కలు పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటూ నేను..నా కళ్ళల్లో మెరిసే నక్షత్రాలని దర్శించుకుంటూ నీవు..మాటలు 'మాకిక్కడ చోటు దొరకడం లేదం' టూ అలిగి వెళ్ళిపోతుంటే..నిశ్శబ్దంగా నవ్వుకుని మన హృదయాలను ఊసులాడుకోనిచ్చిన రాత్రి గుర్తుందా నీకు ?నీ సాంగత్యంలో క్షణాల్లా గడిచిన ఆ శరద్రాత్రులని తల్చుకుని కదూ...కాలాన్ని నేనింత చిన్న చూపు చూసింది?ఇప్పుడు చూడు..నువ్వు పక్కన లేవన్న ధైర్యంతో, నిముషాల విల్లులను ఎక్కు పెట్టి, వాటిని జయించలేని అశక్తతతో నేను వాలిపోతుంటే..ఓడిపోతుంటే..పగలబడి నవ్వుతోంది పగబట్టిన కాలం.

కార్తీక మాసంలో...
కోనేటి మెట్ల దగ్గర కూర్చుని త్యాగరాజకీర్తన పాడుతూ..నీ అల్లరిచూపుల్లో చిక్కుకుపోయిన అలజడిలో..పదాలు తడబడుతున్న ఖంగారుని చూసి ఆపలేనంతగా నువ్వు నవ్వినప్పుడు...కోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?

 నువ్వొచ్చాక పున్నమినీ, వెన్నెలనీ ఆరాధించడం మానేసానని గుర్తొచ్చి కాబోలు ...వెండి మంట లాంటి వెన్నెలని ఒంటరిగా ఉన్న నా చుట్టూ ప్రసరింపజేసి..తన ప్రతాపమంతా ప్రదర్శించాలని తొందరపడుతున్నాడా చందమామ.అతనికేం తెలుసు.. రెప్పలు మూసుకున్న మరు క్షణం మగతలా కమ్ముకునే నీ ఆలోచనలను చేధించ రానివనీ .. కన్నులు తెరిచిన తొలి నిముషంలోనే నీ తలపుల వెల్లువలో తిరిగి తలమునకలవుతాననీ...మీటర్లలో మనుషులు కొలుచుకునే ఈ దూరం మనని వేరు చెయ్యలేక ఓడిపోతుందనీ .. అతనికెప్పుడూ ఒంటరిగా దొరకననీ..!

అయినా అమావాస్య వస్తే అదృశ్యమయిపోవడమే తప్ప అనుక్షణం నీలా హృదయాకాశంలో వలపుల వెన్నెలలు కురిపించగలిగిన నేర్పు అతగాడికేదీ ?

"ముందు తెలిసెనా ప్రభూ.." అని పాడుకునే అవకాశం ఇవ్వవు అని ఎలాగో తెలుసు....అయినా తరగని తపన . అకస్మాత్తుగా నువ్వొస్తావేమో అని....అనంతంగా సాగుతున్నట్టు తోస్తున్న ఈ క్షణాన్ని సంహరించేందుకు ఒక్క చిరునవ్వు వరమిచ్చేందుకు ఎదురవుతావేమోనని ఏదో ఆశ. ఎదను కోసేస్తున్న ఎడబాటును భరించలేక ..ఎడమైపోయినా ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంటే యదార్ధమేదో తేల్చుకోలేక....ఏకాంతపు వనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకుంటే... ముప్పిరిగొనే తేనెటీగలల్లే..అవిగో మళ్లీ....అక్కడా నీ జ్ఞాపకాలే..!!

ఎర్రబడ్డ ఈ కళ్ళ కింద నలుపు చారలు దిద్దుతున్న కాటుక సరిదిద్ది ..తడారని రెప్పల మీద ఒక వెచ్చని గుర్తేదో వేసేందుకు నువ్వొస్తావని నిరీక్షిస్తున్న నన్ను నిరాశ పరచవు కదూ..!స్వాతి వాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పనై నీ కోసం పరితపిస్తూన్న నన్ను చేరుకునేందుకు మెరుపులు దాచుకున్న మేఘమాలలో తేలి తక్షణమే వచ్చేస్తావు కదూ.. ?!

                                                                            ప్రేమతో,
                                                                            నీ..

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...