నేలకు దూకిన జలపాతం


వర్డ్స్‌వర్త్ ఒక కావ్యంలో "కన్య జలపాతం చూస్తూ గడిపితే, ఆ జలపాతంలో లయ, క్రమము, ధ్వని, నాదము- వీటి సమ్మేళనం వల్ల ఏర్పడే సంగీతం, సౌందర్యం ఇవన్నీ కన్య శరీరంలో జొరబడీ ఆ కన్యని అందంగా చేస్తా"యంటాడు. ఇంకొకరి జీవితానుభవాలను, మరొకరి కవిత్వాలను మనం అర్థం చేసుకోగలమే కానీ, అవే భావోద్వేగాలను అదే స్థాయిలో అనుభవించడం సాధ్యమయ్యే పని కాదనిపిస్తుంది. బహుశా అందుకేనేమో, మొదటిసారి అది చదివి, అతనిది భలే చిత్రమైన ఊహ సుమా అనుకున్నానే కానీ, ఆ రహస్యం నాకర్థమవుతుందని మాత్రం కలగనలేదు. ఆశ్చర్యమేమిటో తెలుసా..."శివ సముద్రం" జలపాతాల దగ్గర నిను చూసినప్పుడు, ఆకాశపు కొస నుండి జారిపడుతోందా అన్నట్లున్న ప్రవాహం క్రిందుగా నిల్చుని నవ్వుతోన్న నీకు దగ్గరగా నడచినప్పుడు...అకస్మాత్తుగా వర్డ్స్‌వర్త్ మాటలకు అర్థం తెలిసింది నాకు. 

జలపాతమంటే నువ్వు..తెరలు తెరలుగా విస్తరించే నీ నవ్వు. తడిస్తే ఆ నవ్వుల్లో తడవాలి. జలపాతమంటే నువ్వు..నీ చిలిపి చిందులు...చేతనైతే ఆ అల్లరి ప్రవాహాన్ని అడ్డుకోగలగాలి. జలపాతమంటే...సఖీ..దానికి నిజమైన పర్యాయపదం నీ సౌందర్యం! అందులో మార్గం తెలియని సుమనస్సునై తేలిపోవాలి..లేదూ..నిశి నీలి పెదవిపై నుండి జారిపడే అమృతపు బిందువునై వచ్చి నీలో ఐక్యమవాలి. గమ్యం నీవే అయినప్పుడు, మార్గాలతో నాకేం పని ? 


నల్ల రాతి బండల పైనా, నేల పైనా తడి అడుగుల గుర్తులనూ అనుభవాల నీడలనూ వదిలేసుకుంటూ పల్చని నీరెండ నర్తిస్తోన్న వీధుల్లో బద్ధకపు అడుగులేస్తూ...దట్టమైన అడవి మార్గాల గుండా గతుకుల రోడ్లను చేరి,తాకీ తాకని అరచేతులు తడబడుతూ ఎడమైన క్షణాలను గతానికి విడిచిపెట్టి...అక్కడి నుండి సోమనాథపుర ఎలా చేరుకున్నామో ఏమో..! చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి - నువ్వేమో ప్రతి శిల్పాన్నీ చూడాల్సిందేనంటూ మొండితనం! మిగిలిన వాళ్ళు విసుక్కుంటారన్న భయమైనా లేదే నీకు! ఎన్ని రాతి గుండెలను తాకినా రతనాలేం రాలిపడవని చెబ్దామనే నీ వైపు అడుగులేశాను. తల పైకెత్తి చేతి మునివేళ్ళతో శిల్పాల పాదాలు తడుముతూ అవ్యక్తానందం పొందుతూ కనిపించావు. నిజం చెప్పనా, నా కళ్ళకు నువ్వే మోహినిలా అనిపించావు. " ఒక్కో రాతి శిలని శిల్పంగా మార్చడం ఎన్ని నిద్రలేని రాత్రులకు, లోకాన్ని విస్మరించగల అంకిత భావానికీ బహుమతో కదూ" అని అంటునప్పుడు, అకారణంగా నీ చెక్కిలి మీదుగా క్రిందకు జారిన కన్నీటి బొట్టు, నాలో ఎందుకంత విషాదాన్ని రేఫిందో తెలీలేదు. ఇప్పటికీను. పక్కకు తిరిగి చూశాక, ఆ నల్లనయ్య, విష్ణుమూర్తి, శ్రీమహాలక్ష్మీ, అప్పటిదాకా అర్థం కానీ ఒక్కో చిన్న గురుతూ, ఒక్కొక్క మెలికా, ఎంత అద్భుతమనిపించాయో; ప్రతి శిల్పం వెనుకా ఉన్న అవిశ్రాంత శ్రమ, ఓ కళాకారుడి తపన -- నిరూప్యములు కాని ఉద్వేగాలను అనుభవించగల సున్నితత్వాన్ని నీ చూపులో చేతలో మార్చాయని నీకెప్పుడూ చెప్పలేదు కదూ!

బెంగళూరు తిరిగి వచ్చేస్తుంటే రామ్నగర్ దాకా వచ్చాకా కారాపిన ముసలాయన గుర్తున్నాడా? అల్లంత దూరం నుండే అతని వాలకాన్ని పసిగట్టి, "ఈ దారి నిండా దొంగలూ మోసగాళ్ళూనూ, చావగొట్టి డబ్బులెత్తుకుపోయే రకం"అని పరాకుగా అనేస్తే ఎంత వింతగా చూశావు? "ఈ పండు ముదుసలి నిన్నేం చేస్తాడు?" అని అమాయకంగానే నువ్వడిగిన మాటలో ఎన్ని వేల ప్రశ్నల తూటాలో! అప్పటికప్పుడు ఆగిపోయింది - నాలుగు చక్రాల బండి, అలాగే నన్నెప్పుడూ తరిమే ఓ  అపనమ్మకపు ఆలోచనా స్రవంతి! అటుపైన అతడు బెంగళూరులో దిగుతూ ఇద్దరికీ ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయినా బెంగనిపించలేదు. నీ నవ్వుల్లో, నీ కంటి మెరుపుల్లో ఇన్నాళ్ళూ తోచీతోచకుండా నను కవ్వించిన  రహస్యం అతడి ద్వారా కనుక్కోగలిగిన ఉత్సాహమేమో మరి.

రెండు రోజుల్లో పెళ్ళి పెట్టుకుని, ఇప్పుడీ ప్రణయలేఖ లేవిట్రా అని వేధిస్తోన్న మిత్రబృందం బారి నుండి తప్పించుకుపోవడం నాకు పెద్ద పనేం కాదు కానీ, నీకు మాత్రం చెప్పాలనిపిస్తోంది -

స్నేహితురాలివే...ఎన్నాళ్ళుగానో నన్ను ఎరిగున్న దానివే..."ఊహల్లో కురిసిన ఊహించని వానకు, రాలిపడే పారిజాత పుష్పానివి నీవు! ఆషాడ రాత్రుల్లో ఊసులాడే జాబిలి కళ్ళల్లో తదేకంగా చూసిన క్షణాల్లో, మెఱుపులా మెరిసి మాయమయ్యే జ్ఞాపకానివీవు. దోసిలి ఒగ్గి నిల్చుంటే, దరహాసాల వరాలిచ్చి ధన్యుణ్ణి చేసే దేవతవు నీవే. దహరాకాశంలో అనుక్షణం విహరిస్తూ, విసిగిస్తూ దరికి చేరని హృదయం లేని ప్రియురాలివీ నీవే. " అని టీనేజీ రోజుల్లోనే నా చేత కవిత్వాన్ని రాయించిన గడుసరి అమ్మడివే!  ఓరకంట చూపులతో కవ్వించి నీ ప్రేమంతా పెదవి చివరి నవ్వులతోనూ, నా సాంగత్యంలో సిగ్గిలి కందిన బుగ్గల ఎరుపులతోనూ చెప్పించి ఒప్పించిన జాణవే! కానీ ఈ కొద్ది నెల్లల్లోనూ కొత్తగా కనిపించావు. ఎంతగా అంటే జీవితం పంచుకోవాలనిపించేంతగా, నువ్వు లేని జీవితం నన్ను మళ్ళీ శిలగా మారుస్తుందా అని భయపడేటంతగా..!

ప్రేమ లక్షణమేమిటో తెలుసా, మన కలలను మనకే కొత్తగా పరిచయం చేయడం. మన జీవితకాలపు అన్వేషణను అర నిముషంలో ఒక కొత్త మలుపు తిప్పడం.  నువ్విలాగే ఉండాలనీ, ఓ జలపాతంలా, ఓ కళలా, మూర్తీభవించిన నమ్మకంలా, మానవత్వంలా నాలో నిండిపోవాలనీ ఆశపడ్డాక, రెండక్షరాల బంధం మనసులునూ, జీవితాలనూ ముడి వేయడం వినా మన జీవితాల్లో మేలి మలుపుంటుందా?

ఏ సంబోధనా, ఏ సంతకమూ పట్టివ్వలేని ప్రేమను దాచుకున్న గుండె నాది. అందుకే అలా మొదలెట్టేశాను - అలుగవుగా?! మూడక్షరాల నీ పేరుతో పిలవడమేం పెద్ద కష్టం కాదు కానీ, ఆ పేరు నా వరకూ ఓ మధుర మంత్రం; అలా పైకెలా బిగ్గరగా పలికేదీ..? నీ తాటంకాలను తాకుతూ, నీ ముంగురులు సవరిస్తూ...మెలిమెల్లిగా ఆ అక్షరాలను స్మరించగల సమ్మోహన క్షణాల కోసం రెండు రోజులేగా ఆగాలీ, ఓపిక పడతాను.

( "ప్రేమను ప్రేమించు ప్రేమకై" నిర్వహించిన ఓ ప్రత్యేక శీర్షికకై గత నెలలో సమర్పించిన లేఖ..)

15 comments:

  1. Words worth english lo antha andam gaa varninchaado ledo teleedu kaani Telugu lo intha andam gaa chepachhu ani nee lekha chadivithe artham ayyindi :)

    ReplyDelete
    Replies
    1. Subbu, Thank you :-).

      ఏడేళ్ళ క్రితం నాటి ఓ జ్ఞాపకం - శివసముద్రం జలపాతాల్లో తడవడం.

      Delete
  2. ఎంత బావుందో ! మాటల్లో చెప్పలేను. ఎన్ని బహుమతులైనా ఈ శైలి కి గులాం కావాల్సిందే!

    ReplyDelete
  3. Rathi banda lona ragilindi jwala
    chethi jotha lona olikindi jaala (beauty)
    ompu ompunan jaaredu sirimallelimpu
    gaanchana merupule anuvanuvulo
    Impukadaa mana ghanashilpi nerupu
    Rathi gundenu thaakina rathanala orupu (beautiful)


    MEE POST CHUSAKA MANSU ILA SPANDINCHINDI


    ( telugu font andubatulo ledandi...)
    TELUGU GRAMER MISTAKES UNTE MNNINCHANDI



    ReplyDelete
  4. ప్రేమ లక్షణమేమిటో తెలుసా, మన కలలను మనకే కొత్తగా పరిచయం చేయడం. మన జీవితకాలపు అన్వేషణను అర నిముషంలో ఒక కొత్త మలుపు తిప్పడం. _________________ అవును నిజం!

    శివ సముద్రం దగ్గర కావేరి హొయలు చెప్పనలవి కాదు. అన్నేసి పాయలు వెన్నెల ధారల మల్లే దూకుతూ..అటేపు తిరిగినా అవే కనిపిస్తూ..ఆ దుమ్ము కొట్టుకున్న పార్కింగ్ లాట్ అంచున ఉన్న రెయిలింగ్ పట్టుకుని అక్కడే వేళ్ళాడాలనిపించే సౌందర్యం...!! అక్కడికి చేరే దారే పచ్చ పచ్చని చెట్లతో..అంతందం ఎంతందం!

    అవునూ, ఒక్క ఫొటో అయినా పెట్టావు కావేం మానసా జలపాతం ది ?

    ReplyDelete
  5. వనజ గారూ, థాంక్యూ! :-):-)
    విజయ్ గారూ - బాగుందండీ, తెలుగులో చదువుకున్నాను;
    సుజాత గారూ -:) నిజ్జం! శివసముద్రం సౌందర్యం చెప్పరానిది. అసలు కర్ణాటకలో అందాలకేం కొదువ లేదు. జలపాతాలకు దగ్గరగా వెళ్ళడం, తెప్పల్లో జలపాతపు క్రింది దాకా వెళ్ళి నిండా తడవడం...కొన్ని ఒక్కసారి చూసి వచ్చేస్తే సరిపోయే ప్రాంతాలు కావు. ఫొటోలూ...upload చేస్తానండీ, సోమనాథపుర గురించి ప్రత్యేకంగా వ్యాసం వ్రాయాలని ఆలోచన, అప్పుడు..! and Thank you, each time you visit my blog, you take me back to those days again along with you and make me relive those moments. :-)

    ReplyDelete
  6. :-)
    మీ వర్ణన చాలా బాగుంది. కర్ణాటకలో చూడవలసిన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నట్టున్నాయి, శివసముద్రం లిస్ట్ లో పెట్టేసుకున్నాను.

    --శ్రీనివాస్

    ReplyDelete
    Replies
    1. అయ్యో, శ్రీనివాస్ గారూ, మీరు సోమనాథపుర వదిలేస్తానంటే ఎలా? :)) అదీ చూడాల్సిందే! :))

      Delete
  7. ప్రేమ లక్షణమేమిటో తెలుసా, మన కలలను మనకే కొత్తగా పరిచయం చేయడం. మన జీవితకాలపు అన్వేషణను అర నిముషంలో ఒక కొత్త మలుపు తిప్పడం..................నిజ్జంగా నిజం

    ReplyDelete
  8. ఆ గ్రూప్ నిర్వహించిన పోటీలో ఈ ప్రేమలేఖ ప్రత్యెక బహూమతి గెల్చుకోవడం సబబే. బెస్ట్ ఎక్కడ ఉన్నా అది జ్వలించకమానదు.దాని సెగలు అంటుకోకామామనవు మానసగారూ. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే భాషా, ఒక్కసారికే హత్తుకునె భావమూ మీ శైలి లక్షణాలని నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారూ - మీ గ్రూప్‌లో ఈ శీర్షిక వివరాలు చూసినప్పుడు, నేను మిత్రులొకరు ఇచ్చిన గోపీచంద్ సాహిత్య వ్యాసాలు చదువుతున్నాను. నేను వ్రాసిన లేఖలోని మొట్టమొదటి వాక్యం, నిజానికి గోపీచంద్ అనువాదం. ఆ మాట చదువుతూనే శరవేగంతో ఇదంతా వ్రాసాను. మనం చదివే ఒక్కొక్క కొత్త పుస్తకమూ, ఒక్కో వాక్యమూ ఎంత స్ఫూర్తివంతంగా ఉంటుందో తెలిపేందుకు ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఉంటుందనుకోను.

      మీ బహుమతీ, అలాగే ప్రోత్సాహకరంగా వ్రాసిన మీ అందరి స్పందనలూ బోనస్ నాకు. థాంక్యూ! :-)

      Delete
  9. ప్రేమ లక్షణమేమిటో తెలుసా, మన కలలను మనకే కొత్తగా పరిచయం చేయడం. మన జీవితకాలపు అన్వేషణను అర నిముషంలో ఒక కొత్త మలుపు తిప్పడం.....superb

    ReplyDelete
  10. మానస గారు, జాజిమల్లి బ్లాగు లో ఇంటర్వ్యూ చదివాను. మీ బ్లాగు లాగే మీ ఇంటర్వ్యూ కూడా చాలా అందం గా ఉంది. ఈ భావుకతని జీవితాంతం నిలుపుకోవాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. Krishnapriya Garu, Very glad to hear from you! I really do wish I can retain this sensitive and sensible attitude. :))
      Thanks a lot for the wonderful wishes.

      Warm Regards,

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....