Posts

Showing posts from September, 2011

చలం - అమీనా

చలం రచనలు ఇన్నాళ్ళూ నేనెందుకు చదవలేదో, ఇంతకు ముందొక సారిఇక్కడ రాసి ఉన్నాను. అలాగే, ఒక పాఠకురాలిగా నా పరిథిని పెంచుకోవడానికి ఇప్పుడొక్కొక్కటీ తీసి చదువుతున్నానని, ఈ బ్లాగ్ అడపా దడపా చూసే వారికి అర్థమైపోయి ఉంటుంది. ఇటీవలే నేను చదివిన మరో చలం కవిత్వం - "అమీనా". అమీనా నిజానికి ఒక నవల. కాకపోతే, అడుగడుగునా, అక్షరమక్షరానా, చలం హృదయం నుండి కాగితాల్లోకి నేరుగా సిరాగా పాకిన కవిత్వాన్ని చూపించే నవల.
చలం రచనలెటువంటివైనా, వాటిలోని తీవ్రతను మాత్రం అందరూ ఒప్పుకునే తీరాలి. అతని భావాలను, బాధలను, గుండెల్లోని అలజడినీ, ఆ మర్యాదపు ముసుగుల్లో మనిషి పడే సంఘర్షణనీ, చలాన్ని చదివే వాళ్ళు తప్పించుకుందామనుకుంటే, సాధ్యపడదు. లాగేస్తాడు..లోపల్లోపలికి...అతని అక్షరాల్లోకి. ఆహ్వానిస్తాడు..చేతులు విశాలంగా చాచి అతని అంతరంగపు లోతుల్లోకి. 
ఒక తొంభైఆరు పేజీల నవల, తొంభై నిముషాల లోపే పూర్తి చేసెయ్యడానికి అనువుగా ఉండే నవల, మనకి మునుపెన్నడూ పరిచయం లేని ఒక ముసల్‌మాన్ బాలిక పట్ల ఎంత అనురాగాన్ని, జాలినీ,  ఆత్మీయ అనుబంధాన్ని పెంచగలదో తెలుసుకోవాలంటే "అమీనా" చదవాలి. అమీనా ప్రారంభమే ఒక అద్భుతం. "ముందుమాట&quo…

అహోబిలం-యాత్రా విశేషాలు

Image
"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేం…

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కవిత్వం - "అనుభూతి గీతాలు"

"కలలు పండే వేళ,
మౌనపుటలల మీదుగా
గతాన్నీ, భవిష్యత్తునూ
కలిపే స్వప్న సేతువు
ఏకాంతం -"             అంటూ అందమైన భావాలతో సాగిపోయే కవితా సంకలనం "అనుభూతి గీతాలు"గా కాక మరింకెలా మన ముందుకొస్తుంది ?

ఇది సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచన. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా జన్మించిన వీరు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు.

నాకు మొదటి నుండి కవిత్వం పైన తగని మక్కువ. వచనమంటే లేదని కాదు. కానీ, కవిత్వంలో ఉన్నదేదో అందులో కనపడదు. పైకి సరళంగా, సంఘర్షణలేమీ లేని సరస్సులా కనిపించినా, సముద్రమంత లోతైన భావాన్ని కలిగి ఉండి, తేలిగ్గా అర్థం కాకుండా తరచి చూసిన కొద్దీ, కొద్ది కొద్దిగా అందాన్ని విప్పార్చి చూపే కవిత్వాన్ని నేను మొదటి నుండి ప్రత్యేకంగా చూసేదాన్ని. అక్షరాలలో అంతర్లీనంగా దాగి ఉండే అర్థాలను, పంక్తుల మధ్య నుండే ఖాళీలో ఒదిగీ దాగీ కవ్వించే అందాలను దొరకబుచ…

ఎవరు చెప్తారు నీకు...

కోల్పోయిన అనంతానంత క్షణాల కోసం హృదయం వెర్రిగా వెంపర్లాడటం మానలేనంటుంటే, ఓదార్చే ఏకాంతం కోసం పరితపించే ప్రవృత్తి పదే పదే మనసుని మెలి పెడుతుంటే, గతం ముల్లయి గుండెను గుచ్చిన ప్రతి సారి అనుభవాలు ఎర్రని రక్తపు చుక్కలై నా బతుకంతా మరకలు వేస్తున్నాయని నీకెవరు చెప్తారు.

ఎందుకు కలగన్నానో తెలీదు, శరద్రాత్రుల్లో కలిసి తిరుగాడినట్టు. స్వర్గ లోకాల ద్వారాలు, నీ చేతులు పట్టుకోగానే తెరుచుకున్నట్టు. సరోవరాలంత స్వచ్ఛంగా మెరిసే నీ కళ్ళల్లోకి చూసిన ప్రతిసారీ, కలిసి గడపబోయే జీవితం కోసం ఎందుకు ఆశ పడ్డానో తెలీదు! అజ్ఞాత తీరాల్లోని కాలాతీత స్నేహమణి కోసం, శాపం నుండి శోకం నుండి విముక్తురాలిని కావడం కోసం ఇంకా ఎన్నాళ్ళీ ప్రతీక్ష సాగాలో ఎవరు చెప్తారు నాకు!

ఈ శరీరానికి ఇన్ని శక్తులున్నాయి కానీ, మనసుకు రెక్కల్లేవు! ఉండుంటే ఈ దూరం ఇంత ధైర్యంగా, నిర్దయగా నా ముందు నిలబడగలిగేది కాదు! ఈ లోతుల్లోని భావావేశాలు నిన్ను చేరలేక మళ్ళీ మళ్ళీ మనసు అగాధాల్లోకే నిష్ఫలంగా జారిపోయేవీ కావు!

శ్రావణ మాసపు నిశీధిలో లోకమంతా కుంభవృష్టికి చివికిపోతునప్పుడు, రాత్రంతా మేలుకుని నీతో కబుర్లు చెపుతూ అలాగే నిద్రపోయిన రోజులు గుర్తు చేసుకుంటాను. …

మురళీ ప్రణయగాథ

"ముర్లీ, ప్లీజ్! నన్ను అర్థం చేసుకో; ఐ రియల్లీ లవ్ యు."

చెవులు మూసేసుకున్నాడు మురళి.

"కనీసం నా మాట వినడం కూడా ఇష్టం లేదా నీకు?" రోషంతో అడిగింది రమ్య.

" నా పేరును చంపేస్తుంటే చెవులప్పగించుకుని వినడం నా వల్ల కాదు"

" హబ్బా!!!! నాకు కొన్ని పదాలు పలకవు, అది కూడా పెద్ద నేరమేనా, అసలు ఆ వంక పెట్టుకుని పెల్లే వద్దనడం ...ఇట్ ఈజ్ జస్ట్ నాట్ ఫెయిర్"

"రమ్యా, ప్లీజ్, నువ్వు "పెల్లి" "మురలి" అనడం మాకపోతే - మన పెళ్ళి సంగతి వదిలెయ్, నీతో మాట్లాడటం కూడా మానేద్దామనుకుంటున్నాను.

" అంటే నాలుగేళ్ళ పరిచయం, కలిసి తిరగడం, అన్నీ మర్చిపోదామా?"

" ఊ..."

"ఏమైంది నీకు, ఇంత మొండిగా తయారయ్యావు, నీకు తెల్సు కదా, నేను చదువు కోసం ఇక్కడికి వచ్చిన దాన్ని. వచ్చి దాదాపు సెవన్ యియర్స్ అవుతోంది. నేను మాట్లాడేది వాల్లకి అర్థం అవ్వాలి అంటే, మాట తీరు దానంతట అదే మారిపోతుంది. దానికి నేనేం చెయ్యను? "

"ప్రయత్నం."

" కమాన్!!"

" రమ్యా, నేను ఇక్కడికి వచ్చిన నాలుగేళ్ళలోనూ, కనీసం నా పేరైనా సరిగ్గా పిలవమని నిన్ను ఎన్నో సార్లు అడిగ…

జీవన వసంతం

**********************

ఉత్సాహమో విజయ కాంక్షో
సగం దూరం నడక సాగాక
అలసటో అపజయమో
అడుగు పడక నిలిచిపోయాక...

కనురెప్పల కొసల కాచుకున్న
కోటి కలల కవ్వింపులకు
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయిందా..
నిజమవ్వాల్సిన స్వప్నాలకై ఆపలేని ఆరాటమిక!


రేయంచుకు ఊగిసలాడుతున్న
రేపటిని ఆశగా ఆర్తిగా స్మరిస్తూ
మరోసారి అడుగు ముందుకు పడిందా
విజయలక్ష్మి కౌగిళ్ళలో ఊపిరాడని బంధమిక!


ఆ అడుగులేయించగల తోడూ
ఆ కలను పరిచయం చేసేవాడూ
నిన్ను నీవు జయించిన అమృత క్షణాన
తెరలన్నీ తప్పించుకు తారసపడినప్పుడు

పండుటాకులు రాలినా..తృణపత్రాలను తుంపినా
ఒక్క గొడ్డలి వేటుతో నిలువెల్లా నరికినా
వడగాలులు వీచినా ..ఉప్పెనలు ముంచినా
అభివృద్ది పేరిట అడవంతా కొట్టేసినా..

కూలిన చెట్లన్నీ..వడలిన ఆకులూ పూలన్నీ
ఆశలన్నీ కూర్చుకు చిగుర్లు తొడగడంలోనూ
రెమ్మ రెమ్మా కలసి కొమ్మల దాగడంలోనూ
మళ్ళీ వసంతాలను విరబూయడంలోనూ...

అంతర్లీనంగా దాగున్న రహస్యమేదో ద్యోతకమవుతుంది...
మందకొడిగా సాగే కొన్ని మానవ జీవితాలకదే చెట్టంత బలాన్నిస్తుంది!************************ *తొలి ప్రచురణ హంసిని అంతర్జాల పత్రికలో.

క్రియేటివ్ ఆటలు-కొన్ని కులాసా కబుర్లు

ఇది నేను పూనె(హం, తుం, ఆప్, ఘర్, పానీ లాంటి పదాలు బట్టి కొట్టి పదో తరగతి హింది పరీక్ష గట్టెక్కిన నా లాంటి వాళ్ళకి కూడా, తమకు తెలీకుండానే పదాలన్నీ కలుపుకుంటూ వాక్యాలను నిర్మించగలిన శక్తిని, ఆ మహా నగరం మాత్రమే ప్రసాదించగలదు.)లో ఉండగా జరిగిన సంఘటన.  నేను ఆఫీసులో రిపోర్ట్ చేసిన మూడో రోజో, నాలుగో రోజో, మా బేచ్ అందరికీ హెచ్.ఆర్ మేనేజర్‌తో మీటింగ్ ఉంటుందని పిలుపొచ్చింది. యే గది, ఎన్నింటి నుండి ఎన్నింటి వరకూ తదితరాలతో కూడిన ఆ నాటి సమావేశం తాలూకు వివరాలన్నింటితో వెను వెంటనే మరో మెయిల్. 
నేను ఇలాంటప్పుడే నా తెలివితేటలను విచ్చలవిడిగా వాడేసుకుంటాను.  ఆ మీటింగ్ రూం దాకా వెళ్లాక, ముందు వరుసల్లో మొత్తం ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తూ నా స్నేహితులు అటు వైపు అడుగులు వేయబోతుంటే, వాళ్ళ చేతులు పట్టి ఆపి, అక్కడికి నేనేదో పది సంస్థల్లో ఇలాంటివి చూసేసినట్టు, "కాస్త వెనుక కూర్చుంటే నచ్చకపోతే నిద్రపోయే అవకాశమైనా ఉంటుంది. హెచ్.ఆర్ వాళ్ళ మాటలంటే కంపనీ గురించి డబ్బా తప్ప ఇంకేమీ ఉండదు" అని సెలవిచ్చాను. శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా వాళ్ళు నా వంక చూసి, వెనుకే వెనుక వరసలకు దారి కట్ట…