ప్రేమే నేరమౌనా..

-
నా పట్ల అతనికున్న నిర్లక్ష్యాన్ని భరించే నిబ్బరాన్ని కోల్పోయాను.

నాకు నేను ఎన్ని సార్లు సర్ది చెప్పుకున్నా, ఈ గుర్తించబడని ప్రేమ ఎంత నిరర్ధకం! మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారికే ఈ ప్రేమ తాలూకు గాఢత తెలీకపోవడం ఎంత బాధాకరం.నా ప్రేమ అతడి గుండెలను తాకిందనీ , నా మనసు అతనికి అర్థమైనదనీ ఒక్క మాటా...కాదంటే నాకొక్క సందేశమో, అదీ  కుదరదంటే చూపులతో ఒక్క చిరునవ్వో  విసిరేస్తే, ఆజన్మాంతం అతడి తలపుల్లో బతకగల బలమేదో ఎలాగోలా కూడగట్టుకుంటాను కదా..!

"నను వినా గతి ఎవ్వరనుచు..నగువో లేక బిగువో..." - ఎవరైనా విన్నారా ఈ త్యాగరాజ కీర్తన..?

ఆ శ్రీ రామ చంద్రుడేమో కాని, ఇతనికి మాత్రం ఖచ్చితంగా నేనంటే ఏదో చిన్న చూపు ఉంది. నేను ఎదురు చూసినంత సేపు కూడా నా కళ్ళ ముందు ఉండడు. నీ లానే నా కోసం ఎదురు చూసే వాళ్ళు కోటినొక్క మంది ఉన్నారు లేవోయ్ అన్నట్టు గర్వంగా చూస్తూ ఎప్పుడూ ఏదో పని ఉన్నట్టు అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంటాడు. ఎవ్వరూ చూడకుండా అప్పుడప్పుడు నేను చేసే సైగలనీ, అతడికి మాత్రమే వినపడేలా నేను చెప్పిన రహస్యాలనీ అతడు గమనించాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో, నాకు తెలిసే అవకాశమేదీ కనపడలేదు.అంతు చిక్కని ఆవేదనంతా ఆవిర్లుగా మారి అద్దం లాంటి నా మనసును మసక బారేలా చేస్తోంది.మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది .

 ఎంత ఆశ్చర్యం కదా...! - వశీకరణ మంత్రమేదో వేసి ఉండకపోతే, నాకు తెలీకుండానే నా మనసు అతని కోసమెందుకు పరితపిస్తుంది?!

పెదవి దాటిన ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు. గుండెల్లో భద్రం గా దాచిపెట్టబడి మన ప్రతి చర్యలోనూ తానున్నంటూ పొంగి వచ్చే ప్రేమకున్న గొప్పతనం పొడి పొడి మాటల్లో ఏముంటుంది ?అయినా అన్నేసి గంటలు ఆత్రం గా ఎదురు చూసాక, చిట్ట చివరికి ఎప్పుడో చిలిపి నవ్వులతో ఎదురొచ్చాక, మెరిసే నా కన్నుల్లో అతను చదవలేని భావాలను, పదాల్లో పొందుపరచి వివరించి గెలవగలనంటారా?
ఏదేమైనా, ఇక  నాకు వేరే దారి లేదు..అతనికి నా ఇష్టం అంతా తెలియజెప్పాలన్న తపన నన్ను నిలువనీయడం లేదు.తొలి సారి ఎక్కడ నా మనసు అతన్ని చూసి తుళ్ళి పడిందో, అక్కడికే మళ్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.నెలలో ఒకటీ అరా రోజులు  తప్పిస్తే అతనక్కడికి క్రమం తప్పకుండా వస్తాడు. ఆ వేణు గోపాల స్వామి గుడి వెనుక కోనేటి దగ్గర ఎవరి కోసమో తచ్చట్లాడుతూ ఉంటాడు.

చివరికి నేను ఆశించిన ఘడియ రానే వచ్చింది. గుడి దగ్గర ఏ కారణం చేతో జనం పలుచగా ఉన్నారా వేళ..నేను ఒంటరిగా ఉన్నాను. అతడు కనిపించాడు..ఎదురుగా వచ్చాడు .ఇంత కన్నా మంచి తరుణం మళ్లీ దొరుకుతుందో లేదో అనుమానమే.కానీ నాకే...ఒక్క మాటా పెగలడం లేదు. అంత ఆవేదనా అక్కడే ఎక్కడో గొంతుకలో చిక్కుకు పోయింది.నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తోంది. రెప్పల కాపలాతో కన్నీటి  నాపుకుంటూ కోనేటి మెట్ల మీద మౌనంగా కూలబడ్డాను.

ఆశ్చర్యం.!

నేను ఊహించినట్టు అతడు నా మానానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు.నెమ్మదిగా నిశ్శబ్దం గా నా దగ్గరికి వచ్చి నన్ను చూసాడు. అతని కళ్ళలోకి చూసాను...
ప్రపంచమంతా మౌనం పరుచుకున్న అనుభూతి . అతడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదన్న కోరిక  ,ఆ క్షణం శాశ్వతం కావాలన్న అత్యాశ..అన్నీ ఒక్కసారే నన్ను చుట్టుముట్టాయి.నా కళ్ళల్లో కదలాడుతున్న భావాలను చదివినట్టుగా,ఇన్నాళ్ళూ నన్నింత బాధ పెట్టినందుకు నా క్షమాపణ వేడుతున్నట్టుగా నా పాదాల చెంతకు చేరుకున్నాడు.

అప్పుడే నేను ఒక పొరపాటు చేసాను.

నేను మామూలు స్థితిలో ఉన్నట్టలైతే అతన్నిముఖారవిందాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని కోరుకునేదాన్నేమో.కాటుక కళ్ళల్లో నా ప్రేమను కూర్చి , వణికే పెదవుల్లో వలపును చేర్చి తొలి ముద్దిచ్చేదాన్నేమో...కాని నా మనసులో ఏ మూలనో ఉన్నా బాధ నన్ను లోకాన్ని మర్చిపోయేలా చేసింది. అణువణువునా నిండిన వేదన అహంకారంలా మారి కాలు విదిలించేలా చేసింది....

అంతే..!!

నిశ్చలంగా ఉన్న నీరంతా ఒక్కసారిగా చెల్లా చెదురయిపోయింది .తెప్పరిల్లి చూసేసరికి , పాదాల దగ్గరకు వచ్చి నా అలక తీరుస్తాడనుకున్న నా వాడు ఎప్పటి లాగే మళ్లీ అందనంత దూరం లో ఆకాశంలో కనపడ్డాడు.

నా లాంటి అమ్మాయిలను ఎందరినో చూసిన గర్వంతోనో ఏమో..ఏమీ జరగనట్టే, ఏదీ ఎరగనట్టే  నీలాకాశంలో వెలుగులు కుమ్మరిస్తున్నాడు.

ఈ రోజీ శరచ్చంద్రికను  చూసి ఏ అమ్మాయి మనసు పారేసుకోనుందో...!!
*** 
                                                                          

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...