Posts

Showing posts from 2011

రహస్యముగా....

మొండితనం మన ప్రమేయం లేకుండా మాటలతో కలబడితే
అల్లరి అలక హద్దులు చెరుపుకు కోపపు ముసుగుల జొరబడితే
రాతిరంతా తలలొంచిన నక్షత్రాల మౌనపు గుసగుసలే తప్ప
మనసులు ఊసులాడుకోవని - అప్పుడు ఊపిరాడదనీ తెలీదు.

కంటికి కనపడని గోడలేవో అడుగడుక్కీ అడ్డు పడుతున్నప్పుడు
తప్పొప్పుల తక్కెడ ముద్దాయిని చేసి తల దించమన్నప్పుడు
చుబుకాన్నెత్తి నుదిటిని తడిమిన నీ వెచ్చటి చేతి స్పర్శలో
అనురాగమొకింత తగ్గినట్లుండడం భ్రమేనేమో తెలీదు

కలవరం సద్దుమణిగి - కంటి ఎరుపులోని కోపాలు కరిగి
తపించే వెర్రి హృదయపు బెంగ బాధగా భారంగా మారినపుడు..
నవ్వులు పూయని శూన్యంలో..వెలుతురు సోకని లోకంలో
మళ్ళీ నిను చేరేందుకు నిరీక్షించాలో అన్వేషించాలో తెలీదు.


అదృష్టం వరమిచ్చి ఏ గుమ్మంలోనో ఎదురెదురు నిల్చినపుడు
విచ్చీ విచ్చని  పెదవుల కళ్ళూ కన్నుల పెదవులూ
అహాలనూ అపోహలనూ కరిగించే అమృతవర్షమే కురిపించినపుడు


నే మునివేళ్ళపై నిలబడేదెందుకో నీ పెదవులకు తెలుసు.
సిగ్గిలి జాబిలి మబ్బుల దాగుతుందని చీకటి రాతిరికీ తెలుసు.

రేయంతా సాగిన రహస్యపు జాగారాల్లో పరవశించిన క్షణాల్లో
కిటికి పక్క పారిజాత వృక్షం మౌనంగా పూలు రాల్చేస్తుందని తెల్సు
దోసిలి ఒగ్గి అవన్నీఅపురూపంగా అందుకోవాలని అవనికీ తెలుసు!

తెలుగు పాటలకు పట్టు పరికిణీలు

మలి ప్రచురణలు : నమస్తే ఆంధ్రా జనవరి 2012 సంచికలోనూ, జంధ్యావందనంలోనూ..


కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా
లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా.....
లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా
సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా.......

పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా? స్వప్న రాదారుల్లోకి పగలల్లా అలసిన మనసు పయనం మొదలెట్టబోయే క్షణాల్లో మీ చెవి పక్క రేడియో రహస్యంగా వినిపించిన రాగాలేమైనా గుర్తొస్తున్నాయా? నిజమే! ఇవన్నీ ఆ మళ్ళీ రాని, మదినొదిలి పోని రోజుల మధుర జ్ఞాపకాలే! అంతే కాదు,  ఆ అనుభూతులన్నింటి వెనుక, ఒకటే పాటల తోటలో పుట్టిన జట్టు చేసిన అద్వితీయమయిన కృషి, అన్యులకు సాధ్యం కానిదనిపించేంత చాకచక్యం చెలిమి చేసి ఉన్నాయి.

ఈ సరికే మీలో కొందరు సినీ అభిమానులకు ఇవి ఏ దర్శకుడి వరదానాలో అర్థమైపోయి ఉంటుంది .  సినీ గేయ రచయితలంటే అపార గౌరవం ఉండి, మనం ఒక పాటను తల్చుకున్న ప్రతి సారీ, సదరు రచయితనూ స్మరించి తీరాల్సిందేనన్న సూత్రాన్ని బజ్‌లో మనందరికీ పంచిన సాహితీ మిత్రులు భాస్కర్ వంటి వారికి మాత్రం, వేటూరి కలం కనపడి ఉంటుంది. దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతానికి…

చలం - అమీనా

చలం రచనలు ఇన్నాళ్ళూ నేనెందుకు చదవలేదో, ఇంతకు ముందొక సారిఇక్కడ రాసి ఉన్నాను. అలాగే, ఒక పాఠకురాలిగా నా పరిథిని పెంచుకోవడానికి ఇప్పుడొక్కొక్కటీ తీసి చదువుతున్నానని, ఈ బ్లాగ్ అడపా దడపా చూసే వారికి అర్థమైపోయి ఉంటుంది. ఇటీవలే నేను చదివిన మరో చలం కవిత్వం - "అమీనా". అమీనా నిజానికి ఒక నవల. కాకపోతే, అడుగడుగునా, అక్షరమక్షరానా, చలం హృదయం నుండి కాగితాల్లోకి నేరుగా సిరాగా పాకిన కవిత్వాన్ని చూపించే నవల.
చలం రచనలెటువంటివైనా, వాటిలోని తీవ్రతను మాత్రం అందరూ ఒప్పుకునే తీరాలి. అతని భావాలను, బాధలను, గుండెల్లోని అలజడినీ, ఆ మర్యాదపు ముసుగుల్లో మనిషి పడే సంఘర్షణనీ, చలాన్ని చదివే వాళ్ళు తప్పించుకుందామనుకుంటే, సాధ్యపడదు. లాగేస్తాడు..లోపల్లోపలికి...అతని అక్షరాల్లోకి. ఆహ్వానిస్తాడు..చేతులు విశాలంగా చాచి అతని అంతరంగపు లోతుల్లోకి. 
ఒక తొంభైఆరు పేజీల నవల, తొంభై నిముషాల లోపే పూర్తి చేసెయ్యడానికి అనువుగా ఉండే నవల, మనకి మునుపెన్నడూ పరిచయం లేని ఒక ముసల్‌మాన్ బాలిక పట్ల ఎంత అనురాగాన్ని, జాలినీ,  ఆత్మీయ అనుబంధాన్ని పెంచగలదో తెలుసుకోవాలంటే "అమీనా" చదవాలి. అమీనా ప్రారంభమే ఒక అద్భుతం. "ముందుమాట&quo…

అహోబిలం-యాత్రా విశేషాలు

Image
"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేం…

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కవిత్వం - "అనుభూతి గీతాలు"

"కలలు పండే వేళ,
మౌనపుటలల మీదుగా
గతాన్నీ, భవిష్యత్తునూ
కలిపే స్వప్న సేతువు
ఏకాంతం -"             అంటూ అందమైన భావాలతో సాగిపోయే కవితా సంకలనం "అనుభూతి గీతాలు"గా కాక మరింకెలా మన ముందుకొస్తుంది ?

ఇది సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచన. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా జన్మించిన వీరు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు.

నాకు మొదటి నుండి కవిత్వం పైన తగని మక్కువ. వచనమంటే లేదని కాదు. కానీ, కవిత్వంలో ఉన్నదేదో అందులో కనపడదు. పైకి సరళంగా, సంఘర్షణలేమీ లేని సరస్సులా కనిపించినా, సముద్రమంత లోతైన భావాన్ని కలిగి ఉండి, తేలిగ్గా అర్థం కాకుండా తరచి చూసిన కొద్దీ, కొద్ది కొద్దిగా అందాన్ని విప్పార్చి చూపే కవిత్వాన్ని నేను మొదటి నుండి ప్రత్యేకంగా చూసేదాన్ని. అక్షరాలలో అంతర్లీనంగా దాగి ఉండే అర్థాలను, పంక్తుల మధ్య నుండే ఖాళీలో ఒదిగీ దాగీ కవ్వించే అందాలను దొరకబుచ…

ఎవరు చెప్తారు నీకు...

కోల్పోయిన అనంతానంత క్షణాల కోసం హృదయం వెర్రిగా వెంపర్లాడటం మానలేనంటుంటే, ఓదార్చే ఏకాంతం కోసం పరితపించే ప్రవృత్తి పదే పదే మనసుని మెలి పెడుతుంటే, గతం ముల్లయి గుండెను గుచ్చిన ప్రతి సారి అనుభవాలు ఎర్రని రక్తపు చుక్కలై నా బతుకంతా మరకలు వేస్తున్నాయని నీకెవరు చెప్తారు.

ఎందుకు కలగన్నానో తెలీదు, శరద్రాత్రుల్లో కలిసి తిరుగాడినట్టు. స్వర్గ లోకాల ద్వారాలు, నీ చేతులు పట్టుకోగానే తెరుచుకున్నట్టు. సరోవరాలంత స్వచ్ఛంగా మెరిసే నీ కళ్ళల్లోకి చూసిన ప్రతిసారీ, కలిసి గడపబోయే జీవితం కోసం ఎందుకు ఆశ పడ్డానో తెలీదు! అజ్ఞాత తీరాల్లోని కాలాతీత స్నేహమణి కోసం, శాపం నుండి శోకం నుండి విముక్తురాలిని కావడం కోసం ఇంకా ఎన్నాళ్ళీ ప్రతీక్ష సాగాలో ఎవరు చెప్తారు నాకు!

ఈ శరీరానికి ఇన్ని శక్తులున్నాయి కానీ, మనసుకు రెక్కల్లేవు! ఉండుంటే ఈ దూరం ఇంత ధైర్యంగా, నిర్దయగా నా ముందు నిలబడగలిగేది కాదు! ఈ లోతుల్లోని భావావేశాలు నిన్ను చేరలేక మళ్ళీ మళ్ళీ మనసు అగాధాల్లోకే నిష్ఫలంగా జారిపోయేవీ కావు!

శ్రావణ మాసపు నిశీధిలో లోకమంతా కుంభవృష్టికి చివికిపోతునప్పుడు, రాత్రంతా మేలుకుని నీతో కబుర్లు చెపుతూ అలాగే నిద్రపోయిన రోజులు గుర్తు చేసుకుంటాను. …

మురళీ ప్రణయగాథ

"ముర్లీ, ప్లీజ్! నన్ను అర్థం చేసుకో; ఐ రియల్లీ లవ్ యు."

చెవులు మూసేసుకున్నాడు మురళి.

"కనీసం నా మాట వినడం కూడా ఇష్టం లేదా నీకు?" రోషంతో అడిగింది రమ్య.

" నా పేరును చంపేస్తుంటే చెవులప్పగించుకుని వినడం నా వల్ల కాదు"

" హబ్బా!!!! నాకు కొన్ని పదాలు పలకవు, అది కూడా పెద్ద నేరమేనా, అసలు ఆ వంక పెట్టుకుని పెల్లే వద్దనడం ...ఇట్ ఈజ్ జస్ట్ నాట్ ఫెయిర్"

"రమ్యా, ప్లీజ్, నువ్వు "పెల్లి" "మురలి" అనడం మాకపోతే - మన పెళ్ళి సంగతి వదిలెయ్, నీతో మాట్లాడటం కూడా మానేద్దామనుకుంటున్నాను.

" అంటే నాలుగేళ్ళ పరిచయం, కలిసి తిరగడం, అన్నీ మర్చిపోదామా?"

" ఊ..."

"ఏమైంది నీకు, ఇంత మొండిగా తయారయ్యావు, నీకు తెల్సు కదా, నేను చదువు కోసం ఇక్కడికి వచ్చిన దాన్ని. వచ్చి దాదాపు సెవన్ యియర్స్ అవుతోంది. నేను మాట్లాడేది వాల్లకి అర్థం అవ్వాలి అంటే, మాట తీరు దానంతట అదే మారిపోతుంది. దానికి నేనేం చెయ్యను? "

"ప్రయత్నం."

" కమాన్!!"

" రమ్యా, నేను ఇక్కడికి వచ్చిన నాలుగేళ్ళలోనూ, కనీసం నా పేరైనా సరిగ్గా పిలవమని నిన్ను ఎన్నో సార్లు అడిగ…

జీవన వసంతం

**********************

ఉత్సాహమో విజయ కాంక్షో
సగం దూరం నడక సాగాక
అలసటో అపజయమో
అడుగు పడక నిలిచిపోయాక...

కనురెప్పల కొసల కాచుకున్న
కోటి కలల కవ్వింపులకు
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయిందా..
నిజమవ్వాల్సిన స్వప్నాలకై ఆపలేని ఆరాటమిక!


రేయంచుకు ఊగిసలాడుతున్న
రేపటిని ఆశగా ఆర్తిగా స్మరిస్తూ
మరోసారి అడుగు ముందుకు పడిందా
విజయలక్ష్మి కౌగిళ్ళలో ఊపిరాడని బంధమిక!


ఆ అడుగులేయించగల తోడూ
ఆ కలను పరిచయం చేసేవాడూ
నిన్ను నీవు జయించిన అమృత క్షణాన
తెరలన్నీ తప్పించుకు తారసపడినప్పుడు

పండుటాకులు రాలినా..తృణపత్రాలను తుంపినా
ఒక్క గొడ్డలి వేటుతో నిలువెల్లా నరికినా
వడగాలులు వీచినా ..ఉప్పెనలు ముంచినా
అభివృద్ది పేరిట అడవంతా కొట్టేసినా..

కూలిన చెట్లన్నీ..వడలిన ఆకులూ పూలన్నీ
ఆశలన్నీ కూర్చుకు చిగుర్లు తొడగడంలోనూ
రెమ్మ రెమ్మా కలసి కొమ్మల దాగడంలోనూ
మళ్ళీ వసంతాలను విరబూయడంలోనూ...

అంతర్లీనంగా దాగున్న రహస్యమేదో ద్యోతకమవుతుంది...
మందకొడిగా సాగే కొన్ని మానవ జీవితాలకదే చెట్టంత బలాన్నిస్తుంది!************************ *తొలి ప్రచురణ హంసిని అంతర్జాల పత్రికలో.

క్రియేటివ్ ఆటలు-కొన్ని కులాసా కబుర్లు

ఇది నేను పూనె(హం, తుం, ఆప్, ఘర్, పానీ లాంటి పదాలు బట్టి కొట్టి పదో తరగతి హింది పరీక్ష గట్టెక్కిన నా లాంటి వాళ్ళకి కూడా, తమకు తెలీకుండానే పదాలన్నీ కలుపుకుంటూ వాక్యాలను నిర్మించగలిన శక్తిని, ఆ మహా నగరం మాత్రమే ప్రసాదించగలదు.)లో ఉండగా జరిగిన సంఘటన.  నేను ఆఫీసులో రిపోర్ట్ చేసిన మూడో రోజో, నాలుగో రోజో, మా బేచ్ అందరికీ హెచ్.ఆర్ మేనేజర్‌తో మీటింగ్ ఉంటుందని పిలుపొచ్చింది. యే గది, ఎన్నింటి నుండి ఎన్నింటి వరకూ తదితరాలతో కూడిన ఆ నాటి సమావేశం తాలూకు వివరాలన్నింటితో వెను వెంటనే మరో మెయిల్. 
నేను ఇలాంటప్పుడే నా తెలివితేటలను విచ్చలవిడిగా వాడేసుకుంటాను.  ఆ మీటింగ్ రూం దాకా వెళ్లాక, ముందు వరుసల్లో మొత్తం ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తూ నా స్నేహితులు అటు వైపు అడుగులు వేయబోతుంటే, వాళ్ళ చేతులు పట్టి ఆపి, అక్కడికి నేనేదో పది సంస్థల్లో ఇలాంటివి చూసేసినట్టు, "కాస్త వెనుక కూర్చుంటే నచ్చకపోతే నిద్రపోయే అవకాశమైనా ఉంటుంది. హెచ్.ఆర్ వాళ్ళ మాటలంటే కంపనీ గురించి డబ్బా తప్ప ఇంకేమీ ఉండదు" అని సెలవిచ్చాను. శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా వాళ్ళు నా వంక చూసి, వెనుకే వెనుక వరసలకు దారి కట్ట…

గోరింటాకు గురుతులు - గుప్పెట్లో చందమామ

'గోరింటాకు ' అనగానే అమ్మ చేతి గోరుముద్ద గుర్తొస్తుంది. ' మంచాల మీదకి చేరకండి ' అని ఒకటికి పది సార్లు చెబుతూ, పిల్లలందరి కోసం విడిగా నేల మీద పక్కలు పరిచే అమ్మమ్మ జ్ఞాపకం మనసులో మెరుపులా మెరుస్తుంది. అరుణ వర్ణపు రెక్కలతో ఆకాశం భూమి మీదకి వాలబోయే వేళ, అరచేతుల్లో విచ్చుకునే చందమామల నవ్వులు చెరిగిపోకుండా ఉండేందుకు తల వెనక్కు చేతులు పెట్టుకుంటూ తిప్పలు పడ్డ రోజులు గుర్తొస్తే, హృదయాన్ని కదిలించిన సంతోషపు తరంగమేదో, పెదవుల మీద ఆనవాలు వదిలే తీరుతుంది.
ఆకుపచ్చని టోపీలు, ఉంగరం వేలిని వెక్కిరిస్తూ మిగిలిన వేళ్లన్నింటికీ కూడా ఉంగరాలు, నెలవంకలో పూర్ణ చంద్రులో, చుక్కలో బంతాకులో, ఏవైనా పర్లేదు, ఎలా ఉన్నా వాదం లేదు. ఆ రోజు లేలేత చేతుల రంగులు మార్చుకోవడానికి ఒక రూపు కావాలంతే! పసితనానికి ఎల్లల్లేని సంబరాన్ని కానుకిచ్చేందుకే కదూ, గోరింటాకు చెట్టు కొమ్మ కొమ్మకూ ఆకులు చిగురించేది!

'కదిలితే నే పెట్టనిక! ', 'ఇలా చెరిపేసుకుంటే అందమేమైనా ఉంటుందా తెల్లారాక?' , ' అయ్యయ్యో ! ఆ గోడల మీద మొండి మరకలయ్యేదాకా చేతులాడించడం ఆపేది లేదా..' ఇలా వేల అరుపుల మధ్య, మరీ చిన్నప్పుడైతే మొట్…

మళ్ళీ మళ్ళీ నిన్నే...

పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వులు పులుముకు తిరిగాను..
మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..

మన గొడవలెంత బాధో రాసుకున్నాను
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు, దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
తీరా రాతిరయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
కలిసిపోయామని భ్రమించాను!
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను!

చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలు

నాకెందుకో మొదటి నుండీ విషాదాంతాలయ్యే కథలంటే తెలియని వెగటు.

ఏ కారణం చేతనైనా ఒక పుస్తకంలోనో, సినిమాలోనో చివరకు చెడు గెలవటాన్ని చూపించినా, మంచితనమో - నిస్సహాయతో శాపాలుగా మారి కథలోని ఏ పాత్రనో కబళించడం జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోలేక విలవిల్లాడతాను.

చిన్నప్పుడు అమ్మ/అమ్మమ్మ దగ్గర 'ఆవు-పులీ' కథ విన్న నాటి నుండీ ఈ నాటి దాకా నా ఆలోచనల్లో పెద్ద మార్పేమీ లేదనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే నేను చదవకుండా వదిలేసిన పుస్తకాలు, చూడకుండా తప్పించుకు తిరిగిన సినిమాలూ బోలెడున్నాయి. అయితే ఇటీవల రచనా వ్యాసంగం మీద నాకున్న ఆసక్తిని గమనించిన శ్రేయోభిలాషులు కొందరు మాత్రం, నా ఈ తత్వం కొన్ని మంచి కథలకు దూరం చెయ్యగలదని హెచ్చరించాక, అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రచనను కేవలం రచనగానూ, పాత్రల్లో కలిగే సంచలనం పాఠకుల్లో కలిగించే భావోద్వేగం రచయిత నేర్పుగానూ చూడాలని నిర్ణయించుకున్నాను. అతిగానూ, అనవసరంగానూ స్పందించడం నన్ను ఆదర్శ పాఠకురాలిని కాకుండా చేసి, రచనలను అనుభూతి చెందటం నుండి రెక్క పట్టుకు దూరం లాగుతోందన్న సందేహం కలగడమూ, నాలోని మార్పుకు కొంత కారణం.

ఇలా మార్పు ఒళ్ళో కుదురుకుంటున్…

చలం పురూరవ - నాకు నచ్చిన కొన్ని విషయాలు

పురూరవ ఒక సౌందర్యాన్వేషణ. సత్యాన్వేషణ. ఒకరి శాపం మరొకరికి అనుకోని వరమైన కథ.

సర్వ భూవలయ ఛత్రాధిపతినన్న అహంకారం నుండి మరలి, మానవ జాతికి చెందని ఒక దేవ వేశ్య ప్రేమ తననేం చేయబోతోందోనన్న బెంగ నుండి, అభద్రతా భావం నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఆమె చెప్పిన ప్రేమభావనను అర్థం చేసుకోలేక, ఆ దేవత ఆజ్ఞను మీరి, అపరాధిలా మారి, ఏళ్ళ తరబడి విరహంలో మగ్గిన పురూరవుడి ప్రణయ గాథ ఇది.

తన ఒళ్ళో ప్రేమతో పడుకోబెట్టుకుని, పురూరవుడికి ఊర్వశి చెప్పిన కబుర్లన్నీ, నిజానికి వినాల్సింది, ఆచరణలో పెట్ట ప్రయత్నించాల్సినదీ మనమే! ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఆణిముత్యాల్లాంటి మాటలవి!

సంభాషణల్లో అడుగడుగునా కనపడే తాత్విక చింతన చేతనైతే మన జీవితాల లోపలి పొరల వైపొకసారి తొంగి చూడమని తొందర పెడుతుంది. ప్రేమ కోసం కాదంటే, ఆ అసలు ' నిజాల ' కోసమైనా ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

" నీ దిగులేదో కాఠిన్యం కన్నా మార్దవమూ, ఔన్నత్యమూ అనుకుంటున్నావు. తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టిపడతారు మానవులు. జాలీ, దిగులు, చాలా కపటం, బలహీనం, ఉంది మీ లోకంలో. ప్రతి అడుగుకీ వ్యథ. జాలి. ఎవరికి …

భీత హరిణి

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత ఇది. నేను చదువుకునే రోజుల్లో కూడా ర్యాగ్గింగ్ ఉండేది.అందులోనూ మా కాలేజీ (సిద్ధార్థ, విజయవాడ) ఇటువంటి వాటికి పెట్టింది పేరు. అయినా చదువయ్యే సరికి కేవలం స్నేహాలే తప్ప గొడవలు గుర్తుండకపోవడం నా జ్ఞాపకశక్తి నాకిచ్చిన వరం ;)


ఈ కవితను, హంసిని వెబ్ పత్రిక వారు ప్రచురించారు.
http://hamsini.andhraheadlines.com/Sections/Details.aspx?CatID=5&AuthId=22&ArtId=65

*****************************************

అమ్మా నాన్నల అల్లారు ముద్దు పెంపకంలో
ఆకాశమే హద్దుగా సాగిన విజయ ప్రస్థానం నాది
కన్న వాళ్ళ శత కోటి కలలను నిజం చేసేందుకు
తొలిసారిగా గూడు వీడిన ఓ లేత గుండె చప్పుడిది

నన్ను చూస్తూనే.. మర్యాద ధ్వనించని చప్పట్లు
దగ్గరకు రమ్మంటూ కరడు గట్టిన గళాల పిలుపులు
నా మానస వీణలో   మెదిలిందేదో     అపశృతి
ఆకలి గొన్న సింహపు ముంగిట లేడి పిల్ల స్మృతి!

నిస్సహాయంగా నిల్చున్నాక విచారణ పేరిట వేధింపులు
వంద మందీ ఒక్కటయ్యాక వెర్రి ప్రశ్నలతో సాధింపులు
ఆధిపత్యం నిలబెట్టుకోను అర్థం లేని అరుపులు
తప్పేంటో తెలీనివ్వక క్షోభ పెట్టే ఎగతాళి చూపులు..

నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
న…

రెల్లు పూల పానుపు పైన..

అనుభవాలన్నింటికి అక్షరాల తొడుగులు తొడగడం నా వరకూ నాకు అసాధ్యమైన పనే! అయినా ఎందుకీ తాపత్రయం అంటే, ఆ అనుభవాలకు సంబంధించిన అన్ని విశేషాలనూ కావలనుకున్నప్పుడల్లా తరచి చూసుకోవడానికి; మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాల జారుడుబల్లనెక్కి, గతమనే ఇసుక తిన్నెల్లోకి తుళ్ళింతలతో జారిపడుతూ, జీవితం నన్నెంతలా సంతోషపెట్టిందో గుర్తు చేసుకుని, మరింతగా ఆమెను ప్రేమించడానికి!

మనం కాలంతో పాటు పరుగులు తీస్తూ తీరాలను దాటుకుంటూ ఎంత ముందుకు వచ్చేసినా, తొలి అడుగులు కొన్ని ఆ ఇసుక తిన్నెల్లో గాఢ ముద్రలు వేసే తీరతాయి. వర్షం వెలసిన మర్నాడు రెమ్మ రెమ్మకీ లాల పోసే చినుకులంత స్వచ్ఛంగా మనసులో నిలిచిపోతాయ్!

మొట్టమొదటి సారి కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, మొదటి జీతం అందుకున్న రోజు, మొదటి సారి విదేశంలో అడుగిడిన రోజు, తొలి ప్రేమ, తొలి ముద్దు..నిజానికి సౌందర్యమంతా ఆ కొత్తదనానిదేనేమో కదూ!

" I like beginnings..because they are so full of promises...
I like beginnings because i know,there is always more to come....."

ఎప్పుడో ఎక్కడో చదివి నేను దాచిపెట్టుకున్న ఈ వాక్యాలతో ఏకీభవించని వారు బహుశా ఎవ్వరూ ఉండరేమో! నచ్చినా,…

Historic Times : అన్నా హజారేకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

జాతీయ స్థాయిలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న అహింసావాద పోరాటానికి, నిరాహార దీక్షకు మద్దతుగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి, "యూత్ ఫర్ బెటర్ ఇండియా" సంస్థ అనేక మంది పౌరులను భాగస్వామ్యులను చేస్తూ, హైదరాబాద్ నగరంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తోంది.


ఏప్రిల్ 8వ తారీఖున, దోమల్‌గూడలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులతో పాటు, శేఖర్ కమ్ముల (సినీ దర్శకులు), చుక్కా రామయ్య ( విద్యావేత్త), బాబూ రావు వర్మ ( స్వాతంత్ర్య సమర యోధులు), రామ కృష్ణ రాజు (రాష్ట్ర కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ. కాంపైన్) తదితర ప్రముఖులు సైతం పాలు పంచుకోనుండటం ముదావహం.స్వాతంత్ర్య పోరాటం తదనంతరం, ప్రజలందరి లబ్ధికై జరుగుతున్న అతి పెద్ద ప్రజా పోరాటంగా మారుతున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి బాధ్యత కలిగిన పౌరులందరూ సంపూర్ణ మద్దతు నందించాలనీ, తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులై ముందుకు నడిపించాలనీ 'యూత్ ఫర్ బెటర్ ఇండియా' సంస్థ పిలుపునిస్తోంది.

అవినీతిని నిరోధించేందుకు, అంతమొందించేందుకు మనకున్న అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకోరాదనీ, ఈ పోరాటం ప్రజలందరి సహకారంతో మాత్ర…

ఆలింగనం

హోరెత్తిస్తున్న హారన్లు...ఆగకుండా అనౌన్సుమెంట్లు.. మనకంటూ మిగిలింది కేవలం మరికొన్ని క్షణాలు

గుప్పెట్లోని ముళ్ళ గులాబీలో అందం శూన్యం
ఆ చివరి ఆకుపచ్చ రెపరెపలకే మనసంతా భారం


విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు  చెమ్మగిల్లిన చూపులకటూ ఇటూ వేల ఊసుల ఉత్తరాలు   
వీడమంటూ మొండికేస్తూ ఐక్యమవుతున్న అరచేతులు
వసంతాలన్నీ వెలి వేసే వేదనతో రగులుతున్న ఎదలు

ఓపలేని ఒంటరితనాన కమ్ముకునే దిగులు తలపులు
రోజుల ఎడబాటూ వల్లకాదంటూ రాలిపడే కన్నీటిబొట్లు

కాలమిలా విషం చిమ్ముకుంటూ వెళ్ళిపోయేదే
వీడ్కోలులోని విషాదం ఉప్పెనలా ముంచి వేసేదే..

నువ్వైనా నాలుగు నవ్వుల్ని దోసిట్లో పోసి సాగనంపకుంటే
ఆఖర్లో ఆత్మీయ ఆలింగనం ఆసరాగా ఇవ్వక ఆగిపోయుంటే !!

ఆమె నవ్వాలి మళ్ళీ !

ఏకాంతపు కలయికలలో, కబుర్లలో తొలి అడుగులేసిన స్నేహం
శారద రాత్రుల కవ్వింపుల్లో కోరి పొడిగించుకున్న ప్రణయం
స్మృతి తిన్నెల్లో శాశ్వత ముద్రలేసే జ్ఞాపకాలయ్యాయో
పాల మనసును ముక్కలు చేసిన విషపు చుక్కలయ్యాయో

ఆమె ఎప్పటిలా నవ్వడం లేదిక
అన్నాళ్ళూ తోడొచ్చిన అల్లర్లూ, సందళ్ళూ లేవిక !

ఇప్పుడు మిగిలిందల్లా ..
కలసి పంచుకున్న క్షణాల నిట్టూర్పుల సాంగత్యమే!
కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో నుండి,
మెలకువలోకి మెల్లగా జారేందుకు, ఎడతెరిపి లేని పోరాటమే!

ఇక ఆమెకు కావలసిందల్లా..
మోహపు ముసుగులు జార్చుకున్నాక
బయటపడే నిజ రూపాలను భరించగల్గిన నిబ్బరం!
భయపు వాకిళ్ళ నుండీ, బాధల సంకెళ్ళ నుండీ
రేపటి ఉదయాన్ని విముక్తురాలిని చేసి
సరి కొత్తగా స్వాగతించాలన్న సంకల్పమూ, స్థిర చిత్తమూ..!!