చలం పురూరవ - నాకు నచ్చిన కొన్ని విషయాలు



పురూరవ ఒక సౌందర్యాన్వేషణ. సత్యాన్వేషణ. ఒకరి శాపం మరొకరికి అనుకోని వరమైన కథ.

సర్వ భూవలయ ఛత్రాధిపతినన్న అహంకారం నుండి మరలి, మానవ జాతికి చెందని ఒక దేవ వేశ్య ప్రేమ తననేం చేయబోతోందోనన్న బెంగ నుండి, అభద్రతా భావం నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఆమె చెప్పిన ప్రేమభావనను అర్థం చేసుకోలేక, ఆ దేవత ఆజ్ఞను మీరి, అపరాధిలా మారి, ఏళ్ళ తరబడి విరహంలో మగ్గిన పురూరవుడి ప్రణయ గాథ ఇది.

తన ఒళ్ళో ప్రేమతో పడుకోబెట్టుకుని, పురూరవుడికి ఊర్వశి చెప్పిన కబుర్లన్నీ, నిజానికి వినాల్సింది, ఆచరణలో పెట్ట ప్రయత్నించాల్సినదీ మనమే! ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఆణిముత్యాల్లాంటి మాటలవి!

సంభాషణల్లో అడుగడుగునా కనపడే తాత్విక చింతన చేతనైతే మన జీవితాల లోపలి పొరల వైపొకసారి తొంగి చూడమని తొందర పెడుతుంది. ప్రేమ కోసం కాదంటే, ఆ అసలు ' నిజాల ' కోసమైనా ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

" నీ దిగులేదో కాఠిన్యం కన్నా మార్దవమూ, ఔన్నత్యమూ అనుకుంటున్నావు. తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టిపడతారు మానవులు. జాలీ, దిగులు, చాలా కపటం, బలహీనం, ఉంది మీ లోకంలో. ప్రతి అడుగుకీ వ్యథ. జాలి. ఎవరికి ఉపకారం ? మీ లోకంలో ఏడుపు ఒక ధర్మమైపోయింది. అందరూ సరే! నువ్వు ఈ అవివేకాలకి వశ్యుడివి కావడానికి వీలు లేదు.

ధీరాత్ములు, స్థితప్రజ్ఞులు, లోకంలో అసాధారణ వ్యక్తులు -వాళ్ళ జీవితాలు వాళ్ళ సొంతం కాదు. వాళ్ళ అల్పత్వాలని, వెర్రి వాంఛలని మించిన మహా శక్తి వాళ్ళని ఉపయోగించుకుంటోంది. గనుకనే వాళ్ళు మానవులలో ప్రత్యేకమైన వారైనారు. వాళ్ళు ధర్మాలకీ, నీతులకీ అతీతులు. వారి పథం అగ్నిహోత్రం. వారికి రెండో మార్గం కనపడనీదు......

ఉన్నత గమనమంటేనే పూర్వ బంధ నాశనమని అర్థం. "

ప్రేమనీ, విరహాన్నీ, దిగులునీ - దాపరికాన్నీ, తప్పొప్పుల లెక్కల్లో సతమతమయ్యే మానవ జీవితాన్నీ అక్షరాల్లో అలవోకగా చిత్రించగలగడం చలానికి చేతనైనట్టు ఇంకెవరికన్నా చేతనౌనా అనిపించింది చాలా సార్లు.

ప్రకృతి వర్ణనలున్న ప్రతి చోటా మనసుని లాక్కెళ్ళి అక్కడ నిల్చోబెట్టగలిగిన భావాలు. ఊహలు. ఒక్కసారి పురూరవుడిగా మారి, ఊర్వశి ప్రేమను క్షణమైనా అనుభవించాలన్న ఆశ! వంటింటిలోనూ, ఇంటి కింద పార్క్‌లో సిమెంటు బెంచీ మీద కూర్చుని పేజీలు తిప్పిన సెకన్లలోనూ, ఆమె ప్రేమభావను అర్థం చేసుకోలేని పురూరవుడి మీద అంతు లేని జాలి కలిగింది నాకు. అలాంటి అవకాశాన్ని మూర్ఖుడిలా వృధా చేసుకుంటున్న అతగాడి మానసిక దౌర్బల్యం మీద కోపం కూడా వచ్చింది.

కానీ, నిజ జీవితంలో మనమంతా చేస్తున్నదీ అదే కదూ! ఊర్వశిని కాసేపు పక్కన పెడదాం! ఏది శాశ్వతం కాదో దాని కోసం వెంపర్లాడడం, కళ్ళ ముందున్న "క్షణం" అనే స్వర్గాన్ని విడనాడి, భవిష్యత్ కోసం కలలు కంటూ లేదా భయపడుతూ, ఆశలోనో నిరాశలోనో, జీవితాన్ని నాశనం చేసుకునే అభాగ్యులు మన చుట్టు పక్కలెంత మంది లేరు గనుక!

ఊర్వశి ప్రేమను మించినదేదీ లేదంటుంది. "నిన్ను నీకు పరిచయం చెయ్యనా" అని పురూరవుడితో అంటూ ఉంటుంది. ఎన్నో ఆజ్ఞలూ పెడతానంటుంది. అవన్నీ పురూరవుడు తనని తాను మరవడానికి. అతడు ఆమే వాడై, ఇంకేమీ కాకుండా పోవడానికి. అంత అధికారాన్ని, దానిని మించిన ప్రేమనూ, అన్నింటిని అనుభవిస్తూ కూడా.."నువ్వెవరు" అన్న ప్రశ్నను విడిచిపెట్టలేని పురూరవుడికి ఇలా బదులిస్తుంది.

"యుగాలు వెదికి వెదికి నిన్ను చేరాను. ఈనాటికి నిన్ను గొప్ప అశాంతితో -ఈ లోకపు అశాంతి కాదు, వెయ్యి కన్నులతో, ఎక్కడ ? ఎక్కడ? అని కాలంతో ప్రతీ క్షణం ఎదురు చూసే సూర్య చంద్రులతో, అనంత దూరాన ఉన్న నక్షత్రాల కాంతితో కళ్ళు కలిపి వెతికే మధురమైన అశాంతితో, మాయ పొరలు చేధించి అనేక రూపాలలో, లోకాలలో, ఎవరు? ఎవరు ? నా ఆత్మనాథుడెవరు, అని దిక్కులు నిశ్శబ్దంగా మారుమ్రోగే అన్వేషణ ఫలితంగా కలుసుకున్నాను నిన్ను.

నన్ను మర్చిపోకు. మళ్ళీ నా చేతులని తప్పించుకుని అంధకారంలోకి జారినా నుంచి దూరమైపోకు. నీ అనుభవానికి నువ్వే విరోధివై నీకు నువ్వే అబద్దీకుడవై మనిద్దరి మధ్యా విరహ సముద్రాలని కల్పించకు.  నువ్వు నిరాకరిస్తే నిస్సహాయనైపోతాను,


ఎంతకూ రాని కాంతికై మౌనంగా పూవు రెక్కల మీద కన్నీరు కార్చే రాత్రివలే నా విరహంలో నేనే అణగిపోతాను. "

చదివేందుకు గట్టిగా అరగంటైనా పట్టని ఈ పుస్తకం, మననం చేసుకుంటుంటే మాత్రం రోజులు దాటిపోయేలా చేయగల అద్భుతం!

పురూరవుణ్ణి చదవకండి! ఏకాంతంగా కూర్చుని మనసారా అనుభవించండి!

ఊర్వశిలోని దైవత్వం నిండిన ప్రేమనూ, పురూరవుడి అల్ప మానవ మనస్తత్వాన్ని, మనం ఊహించలేని, సాధించలేని అపూర్వ ప్రేమ భావనలో మునిగి తేలండి!

ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకమని సూచించిన స్వాతిగారికీ, దొరక్క ఇబ్బంది పడుతుంటే, అవినేని భాస్కర్ గారి పేరు సూచించడమే కాకుండా ఆఫీసుకి తెచ్చి ఇచ్చిన "ఏకాంతం" బ్లాగర్ దిలీప్‌కు కృతజ్ఞతలు.

చలంగారి పుస్తకాలు బోలెడిచ్చి, నా మిగిలిన పుస్తకాలు, పనులు పక్కన పడేసేలా చేసిన భాస్కర్‌కు డబుల్ థాంక్స్. :)

12 comments:

  1. బాగుంది, చాల బాగుంది
    చలం గారిని చదివిన తీరు,లోతైన
    విశ్లేషణ సూపర్బ్.నాచిన్నప్పుడు
    నే చదువుకున్న చలం పుస్తకాలూ,లత
    సాహిత్యం గుర్తుకు తెచ్చారు

    ReplyDelete
  2. "పాపం", "ఆత్మార్పణ", "అనసూయ", "కళ్యాణి", "యవనవ్వనం", "ఆ రాత్రి" ..........ఒకటా రెండా చలం కలం నుంచి జాలువారిన సాహిత్య సుమాలు...చదువుతూ పేజి పేజి కి కాదు పదం పదానికి ఎన్ని సార్లు అట్ట మీద తెల్ల గడ్డంతో, తెల్ల జుబ్బాతో ఎమీ ఎరగనట్టు కూర్చున్న ఈ యోగి ని చుసానో.... "పురూరవ" నేనింకా చదవలేదు..

    Thank you very much for this post...I will read it immediately...Expecting many from you like this manasa garu...please let us know about these legends and their writings...

    ReplyDelete
  3. చలం గారి రచనలలో అన్నిటికంటే నాకు బాగా నచ్చినవి మైదానం & స్త్రీ పుస్తకాలు.

    ReplyDelete
  4. ఈ పుస్తకం నా దగ్గర లేదు. దైవమిచ్చిన భార్య చదువుతున్నా ఇపుడు, పూర్తి అవగానే రివ్యూ రాసేస్తా.

    ReplyDelete
  5. నీ సీను అంతేలే బాబు, నీకర్థం కాదు కాని ఊరుకో

    ReplyDelete
  6. ప్రురూరవ పుస్తకం గురించి చక్కగా రాశారు. పుస్తకం.నెట్ వారికి పంపండి ఇంకా ఎక్కువ పాఠకులకు రీచ్ అవుతుంది.

    ఈ టపా చదువుతుంటే, మఱోసారి పురూరవ చదవాలనిపిస్తోంది :-)

    ReplyDelete
  7. పురూరవ నచ్చిందనమాట
    http://www.eemaata.com/em/issues/200811/1350.html
    అదే పుస్తకం శ్రావ్యనాటికగా.

    ReplyDelete
  8. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    ReplyDelete
  9. @దర్పణం : కృతజ్ఞతలండీ! నేను చలాన్ని చదవడం మొదలెట్టిందిప్పుడే
    @ మోహన్ : అన్ని ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. తప్పకుండా మరిన్ని అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
    @ప్రవీణ్ : నేను చదవాల్సినవే అవి
    @శ్రీ " తప్పకుండా
    థాంక్స్ భాస్కర్
    భావకుడన్ గారూ : వచ్చే వారం వింటానది తప్పకుండా. ఇప్పటికే చాలా మంది దాని గురించి చెప్తున్నారు :)

    ReplyDelete
  10. చదవాల్సినవే అవి అంటే ఆ రెండూ ఇంకా చదవలేదనా? చలం గారి నవలలలో అన్నిటికంటే ప్రభావవంతమైనది మైదానం నవలే. 1934లో అని గుర్తు, చలం గారు మైదానం నవలని ఆంధ్ర విశ్వ విద్యాలయం రివ్యూకి పంపినప్పుడు ఆ నవలకి బహుమతి రాలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన సనాతనవాద నవల వేయి పడగలుకి బహుమతి వచ్చింది. వేయి పడగలు ఒక అభివృద్ధి నిరోధక నవల. సనాతన సంప్రదాయాలని అడ్వొకేట్ చేసే ఆ నవలని ఆధునికతని అడ్వొకేట్ చేసే మైదానంతో అసలు పోల్చనే లేము.

    ReplyDelete
  11. చిన్నప్పటి నుంచి నాకు స్త్రీవాద సాహిత్యం అంటే ప్రాణం. 2002-2006 మధ్యలో మా అమ్మానాన్నలు ట్రాన్స్ఫర్ రీత్యా తూ.గో. జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ స్త్రీవాద పుస్తకాలు దొరక్కపోతే నాకు ఎంత కష్టమనిపించిందో. అక్కడి నుంచి సాధ్యమైనంత తొందరగా వైజాగ్ లేదా స్వంత పట్టణం శ్రీకాకుళం తిరిగి వచ్చెయ్యాలనిపించేది. శ్రీకాకుళం తిరిగి వచ్చిన తరువాత స్త్రీవాద రచనలు తిరిగి చదివాను.

    ReplyDelete
  12. really i am so happy with chalam stories

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....