19 April, 2019

పెళ్ళి కుదిరింది

"పెళ్ళి కుదిరింది" అనే మాట వినడానికి చాలా బాగుంటుంది. అమ్మాయి చెబితే అబ్బాయి గురించీ, అబ్బాయి చెబితే అమ్మాయి గురించీ అడిగీ అడగనట్టుండే మన ప్రశ్నలూ, రహస్యాలను దాచీ దాచకుండా వాళ్ళు చెప్పే సమాధానాలూ ఎక్కడ లేని ఆసక్తినీ మోసుకొస్తుంటాయి. "వీడని వియోగమున వేగు మ్రోడు మేను తలిరు తోరణమై సుమదామమాయె!" అంటూ పెళ్ళిపల్లకీ ఊహ మోసుకొచ్చే ఊసులన్నీ అమ్మాయిలు పంచుకుంటారని కాదు. "ఇదమిత్థమని నిర్ణయింపగారాని దే కోర్కియో రూపుఁగైకొన్నయట్లు, జన్మజన్మాంతర సంగతమ్మైన యాశా బలంబవధికి సాగినట్లు, ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకార మెనయించి దర్శనమిచ్చినట్లు.." అంటూ చూపులు కలిసిన శుభవేళల గురించి అబ్బాయిలు ఈకాలపు మాటల్లోనైనా వివరం చెప్పగలరనీ కాదు. కానీ, అసలు ప్రేమంటూ ఉంటే అది నిశ్శబ్దంలో పూచే నవ్వులగానో, కదిలిస్తే మాటల్లో మన్నన గానో, బయటపడుతూనే ఉంటుంది. దానిని గమనించడం బాగుంటుంది.
అబ్బాయి ఎవరు? ఎక్కడ చదువుతున్నాడు, యే ర్యాంక్ తెచ్చుకుంటాడు? లాంటి కాలేజీ రోజుల ప్రశ్నల్లోనే నేనింకా చిక్కుపడి ఉన్నప్పుడు, నాకన్నా ఏడెనిమిదేళ్ళు పెద్దదైన ఓ స్నేహితురాలు, తన జీవితంలోకి రాబోతోన్న మనిషి గురించి, "హి ఈజ్ ఎ జెంటిల్‌మాన్" అని చెప్పింది. ఆ సమాధానం ఎన్నాళ్ళో నాతో ఉండిపోయింది. చదువూ, ఉద్యోగమూ, కులమూ కుటుంబమూ కాక, ఎంత అనవసరమైందని నమ్ముతున్నా అందమూ కాక, మరొకటా? అని లోపల్లోపల ఆశ్చర్యంగా అనిపించేది.
అయినా చదువూ సంస్కారమూ వేరు కాదని అమాయకంగా నమ్మిన రోజులవి. పోకిరీవేషాలతో జులాయిగా తిరిగే వాళ్ళు ఎప్పటికప్పుడు మంచిమార్కులతో క్లాసులు దాటుకుంటూ పైచదువులకెట్లా పోతారంటూ పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలు చెవిన పడి, చెయ్యాల్సిన అన్యాయమంతా చేశాయి. పై చదువులు చదివేకొద్దీ, పెద్ద ఉద్యోగాలు, పదవులు దొరికే కొద్దీ, పక్కవాళ్ళని కష్టపెట్టకుండా, నెట్టకుండా బ్రతకడం, తోటివాళ్ళని గమనించుకుంటూ అవసరమైతే సాయం చెయ్యడం, గౌరవంగా, ఎవరి ముందూ ఉత్తపుణ్యానికి దేహీ అనకుండా బతకడం, - మనుష్యులకి ఇంత కష్టమైపోతాయా అన్న సందేహమూ మొదలైంది. చదువుతో ఇవన్నీ కలిసి రావని నేను కనుక్కునేసరికి నా చదువైపోయింది. కేరక్టర్ కనిపెట్టాలంటే కట్నం తీసుకుంటాడో లేదో తెలుసుకోవాలనీ, బుద్ధిమంతుడో కాదో తెలియాలంటే, మందూ సిగరెట్ అలవాట్లున్నాయో లేదో తెలిస్తే చాలనీ అమాయకంగా తీర్మానించుకున్న రోజులు గుర్తొస్తే, ఇప్పుడు భయమేస్తుంది.
ఈ కలలూ, మెలకువలూ పక్కన పెడితే, దగ్గర వాళ్ళైనా, కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉన్న వాళ్ళయినా, ఎవరైనా సరే, అసలు "పెళ్ళి కుదిరింది" అని చెప్పేటప్పుడు వినడం/ వాళ్ళని చూడటం, వాళ్ళ మాటలను బట్టి అవతలి మనిషి వ్యక్తిత్వాన్ని ఊహించుకోవడం నాకొక సరదా వ్యాపకం. బాగా గుర్తుండిపోయినవీ కొన్నున్నాయి -
ఏళ్ళకు ఏళ్ళు అవునూ కాదుల ఊగిసలాటలో గడిపిన ఒకమ్మాయి, ఓరోజున్నట్టుండి, పెళ్ళి కుదిరిందనీ, ఎట్టకేలకు 'ఎస్ ' చెప్పేశాననీ, సంబరంగా చెప్పింది. ఆ అమ్మాయిని ఒప్పించడానికి అతడెన్నెన్ని వాగ్దానాలు చేశాడో తెలియదు కానీ, చివరికి ఆమె నమ్మకాన్ని గెలిచిన మాటలో మటుకు, వాళ్ళిద్దరికీ సంబంధించిన సంగతులేవీ లేనేలేవుట. తన కుటుంబమూ జీవితమూ మరింత విశాలం కానున్నాయన్న భరోసా ఇచ్చే ప్రేమ, షరతుల్లేకుండా విస్తరించుకుపోయే ప్రేమ, ఎవరికి చేదు? మనసిచ్చిందంటే ఇవ్వదా మరీ? నేనైతే ఫిదా అయిపోయాను.
స్నేహమో ప్రేమో, రెంటికీ మధ్యనున్నదో, రెంటికీ మించినదో తేల్చుకోలేక ఎప్పుడు పలకరించినా "ఇప్పుడు నేనేం చెయ్యనే?" అని గోళ్ళు కొరుకుతూ ఆలోచనలో పడిపోయే నా ప్రాణస్నేహితురాలొకతె, ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి, " పెళ్ళి కుదిరిందే! నువ్వు అక్టోబరులో సెలవు పెట్టి వచ్చెయ్యాలి, సరేనా?" అని ఆరిందా పిలుపు మొదలెట్టింది. బొట్టూ కాటుకా తీసుకుని ఇంటికొచ్చి పిలుద్దువు కానీ, ముందా చిక్కుముడి విప్పిందెవరో చెప్పమన్నాను. అప్పటికింకా ఎంతో మందికి చెప్పలేదనుకుంటాను, ఇష్టంగానే గుర్తు చేసుకుంటూ విసుక్కోకుండా వివరంగా చెప్పింది. "నిన్ను గాక వేరే అబ్బాయిని చేసుకుని నేనెట్లా బతుకుతానసలు?" అని అమ్మయీమణి ఫోన్‌లో విరుచుకుపడితే, "నువ్వు నిజంగా ఆ మాటంటే నా అంత అదృష్టవంతుడు లేనట్టే" అని గొణిగాట్ట ఆ మిత్రరత్నం. "గట్టిగా ఏడవరాదూ..?" అని ఇది తిడుతుండగానే ఫోన్ కట్. కట్ చేస్తే, కోయంబత్తూర్‌లో ఉండాల్సిన మనిషి, అప్పటికప్పుడు ఫ్లైట్ తీసుకుని హైదరాబాదులో ప్రత్యక్షం. ఎదురుచూపులు పండాక, ఇంకేమవుతుందీ..పీ పీ పీ..డుం డుం డుం.."అతగాడొస్తాడాహా..." పాట వెయ్యి గొంతులతో దాని చెవుల్లో మోగింది.
నిన్న గాక మొన్న, ఆఫీసులో మాతో పని చేసే అబ్బాయికి పెళ్ళి కుదిరింది. మానిటర్ మీదకి ఎగిరెగిరి చూసి అందరినీ పలకరించే ఆ కళ్ళు, కీబోర్డ్ పక్కనే సర్దుకున్న ఫోన్‌లో నుండీ బయటకు రాకపోవడం, కళ్ళున్న అందరం గట్టిగానే గమనించాం. వేళాపాళా లేకుండా మోగుతున్న ఫోనూ, మారిన రింగ్‌టోన్, కాంటీన్‌లో కూర్చుని రమ్మని ఫోన్ చెయ్యబోతే కొత్తగా వినపడ్డ కాలర్‌ట్యూన్, అకారణంగా రోజంతా వెలిగిపోతోన్న అతని ముఖం, అసలు సంగతిని అతను చెప్పకపోయినా ఇట్టే పట్టించేశాయి. డెడ్‌లైన్లు మీదకొస్తున్నా, "బేచిలర్ గాణ్ణి, నేను గట్టిగా ఆదివారం ఓ గంట కూర్చుంటే సోమవారం పొద్దుటి మీటింగ్‌కి రెడీ అయిపోతుంది" అంటూ సాయిలాఫాయిలాగా తిరుగుతూ మా బి.పి లు పెంచిన మనిషి, శుక్రవారం మధ్యాహ్నానికల్లా పని ముగించి మా చేతిలో పెట్టి, ఎవరో పిలిచి సెలవిచ్చినట్టే అజాపజా లేకుండా తప్పించుకుపోవడమూ మొదలెట్టాడు. అట్లా చుట్టూ ఉన్న లోకం మొత్తాన్నీ దూరం పెట్టినన్నాళ్ళు పెట్టి, ఓ శుభముహూర్తాన స్వీట్‌బాక్స్‌తో వచ్చి, మళ్ళీ జనజీవనస్రవంతిలో కలిశాడు. ఫ్లోర్‌లో ఉండగానే ఫోన్‌లో దాచుకున్న ఫొటోలు కొన్ని చూపిస్తూ పెళ్ళి కబుర్లు చెప్పాడు. సెలవి నవ్వుతో, సిగ్గుతో, వాల్జడ బరువుతో ఒకింత వాలిన తలతో, చివరికంటా విచ్చిన పసిమొగ్గలను బంతిలా చుట్టి బుట్టలో కూర్చోబెట్టినట్టుందా పిల్ల. పారాణి పాదాలతో, కర్పూరహారాలతో పక్కపక్కన చేరి నిల్చున్న జంటను చూడగానే, ఘాటైన జ్ఞాపకాల పరీమళాలేవో చూస్తున్నవాళ్ళనీ చట్టున చుట్టుముట్టాయి.
ఆ సాయంకాలం నాలుగింటి వేళ కాంటీన్‌కి లాక్కెళితే, చాట్- / చాయ్ ఛోటా ట్రీట్ అన్నాడతను. టేబుల్ చుట్టూరా ఓ నలుగురం సర్దుకు కూర్చున్నాకా మళ్ళీ పెళ్ళికబుర్ల మీదకి గాలిమళ్ళింది. అయిన వాళ్ళని కూడా నిద్దర్లలో లేపి అక్షతలేయించుకోవాల్సిన అర్థరాత్రి ముహూర్తం కాక, హాయిగా రాత్రి ఎనిమిదింటికి సుముహూర్తమట. బంధువులూ స్నేహితులూ ఆత్మీయులూ అందరూ నిండి ఉండి, ఇసకేస్తే రాలనట్టైందట పందిరి. అమ్మాయి తరఫు వారూ, అబ్బాయి తరఫు వారూ అందరూ కూడి ఖణాయించి ఉండగా, "కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం" మంత్రాలు వినపడుతోండగా, సూత్రాలు కట్టాల్సిన పెళ్ళికొడుక్కి మాత్రం, చేతులు సన్నగా వణికాయట.
మాతో చెప్పడానికి తెలియని ఇబ్బందితో తలొంచుకుని, కాఫీ గ్లాసు అంచులను తడుముతున్న అతని వేళ్ళని, తదేకంగా చూస్తుండిపోయాము. ఇబ్బందిబ్బందిగా ముక్కలుముక్కలుగా చెప్పుకుపోయాడతడు. తన ప్రాణం పరవశమవుతోందనో, తనకంటూ శరత్తులిక విడిగా ఉండబోవనో కాదుట, అమాయకంగా తలొంచుకు కూర్చున్న ఆ అమ్మాయి సన్నని మెడ మీద, ఇదిగో - ఇతగాడి బరువేదో మోపుతున్న బెరుకట; బెంగట. తొలిచేస్తున్న దిగులునీ, తామిక ఒకరికొకరమని ఆసరికే కుదిరిన నమ్మకాన్నీ, కష్టమ్మీద మాటల్లోకి మార్చి అతను చెప్తుంటే అనిపించింది - సౌఖ్యజ్వాల అంటే ఇదేనేమోనని. కాసేపు నోటమాట రాలేదు. కులపాలికా ప్రణయపు మాధుర్యమేదో మాటల్లో తుంపుకున్నట్టైంది.
ఆ గొంతులో నిజాయితీనో, అసలట్లా ఎప్పుడూ ఎక్కడా ఏ మగవాడి దగ్గరా విని ఉండకపోవడమో తెలీదు కానీ, పాపం పొద్దున లేస్తే ఇట్లాంటి మొగుళ్ళ మీదేగా "జస్ట్ ఫర్ లాఫ్స్" అంటూ పిచ్చి ప్రేలాపనలన్నీ చేతులు మారేదీ అని, జాలిగా అనిపించింది. ఆ జాలిలో నుండి ఏమైనా మాటలు పొడిగించుకునేలోపే అక్కడికొక డిల్లీ స్నేహితుడొచ్చి చేరాడు. రావడంతోటే కొత్త పెళ్ళికొడుకు జబ్బ చరిచి, కన్ను గీటి, కొత్త జీవితమెలా ఉందీ, పెళ్ళాం వస్తే బ్రతుకెలా మారిందీ అని కుదిపి కుదిపి అడిగాడు.
"ఎక్కడ బాస్! ఇంకా బ్యాచిలర్ లైఫే, ఏం మార్పు లేదు" - "ఈ నెలంతా ముహూర్తాలు లేవుట" ఇకిలిస్తూ చెప్పాడీ అబ్బాయి.
తీరి కూర్చుని పానీపూరీలో రగ్డా, టీకామీటా జాగ్రత్తగా కలుపుకు వొంచుకు తింటోన్న నాకు పొలమారినట్టైంది. ఓరకంట చూస్తే ఆలూ సమోసా నోటి నిండా కొరికిన నా స్నేహితురాలూ ఉక్కిరిబిక్కిరవుతోంది.
క్షణాల్లో మా ఇద్దరి ముఖాలూ మాడిపోయాయ్. వాళ్ళ లోకంలో నుండి తలలు తిప్పి చూస్తే, ఓ మాట చెప్పి అర్జంటుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలని ఉంది మా ఇద్దరికీ. వాళ్ళ మాటలా, తెగట్లేదు.
"మరి హనీమూన్‌కి ఎక్కడికి వెళ్ళారు?" డిల్లీ అబ్బాయి ఆమాటాఈమాటా కానిచ్చి మళ్ళీ అడిగాడు.
ఈ అబ్బాయి తన ధోరణిలో తానున్నాడు. నా కుదురు తక్కువ స్నేహితురాలు నన్ను చూసి కిసుక్కున నవ్వింది. చెప్పేదీ, వినేది ఆపేసి, ఎదటి ఇద్దరూ మాకేసి చూశారు. ఎంత అదిమినా ఆగలేనట్టు మా ఇద్దరికీ నవ్వు తన్నుకుతన్నుకొచ్చింది.
"ఏమైంది మేడం?" కొత్తపెళ్ళికొడుకు కినుకగా అడిగాడు.
నేను మాట్లాడకుండా నా పానీపూరీ ప్లేటూ, టీ గ్లాసూ సర్దుకుని, టిష్యూతో టేబుల్ మొత్తం బరబరా తుడిచే పనిలో పడ్డాను.
"మేడం!" అతను రెట్టించాడు. ఎన్నడూ లేని ఆ కొత్త పిలుపులో కోపం, ఉక్రోషం, తెలుస్తూనే ఉన్నాయి.
"నువ్వు మార్పేం లేదని చెప్పినప్పటి నుండీ ఇద్దరూ నవ్వుతూనే ఉన్నార్రా!" ముందు నుండీ మాతో కూర్చున్న నాలుగో మనిషి కుతూహలంగా మమ్మల్ని మార్చి మార్చి చూస్తూ చెప్పాడు.
కోపంతో నోరెళ్ళబెట్టాం, "మేమా?" అన్నట్టు.
అన్న మాటలన్నీ అరక్షణంలో గుర్తుచేసుకుని, పెళ్ళికొడుకు తలపట్టుకున్నాడు.
"నేనన్నది బెంగళూరులో, ఇంటికి. అమ్మాయి గృహప్రవేశం చెయ్యడానికి ముహూర్తం చిక్కలేదని" ఎర్రగా కందిన ముఖంతో ఛీ కొట్టి కుర్చీ బర్రున తోసి అంగలు పంగలుగా వెళ్ళిపోయాడతడు.

13 April, 2019

ఈ చలి ఉదయం..

చుక్కలు పొడిచిన నొప్పిని వెన్నెల నవ్వుల మాటున భరించే రాతిరి, సౌందర్యవతి, ప్రేమమూర్తి అయిన రాత్రి, సోమరిగా కూలబడిన నన్ను ఊరడించాలని చూసీ చూసీ అలసిపోయింది. తన కోమలశీతలస్పర్శ నా నుండి దూరం జరిగిపోతోందన్న స్పృహ కలిగేసరికే ఆలస్యమైపోయింది. తన నీలోత్తరీయాన్ని నా వేలికి ముడివేసి, ఆమె వెళ్ళిపోయింది. నీడలునీడలుగా కొన్ని మాటలింకా ఇక్కడే తచ్చాడుతున్నాయి. నీటిబుడగల్లాంటి కలల్లో నిజాన్ని వెదుక్కునే పనిలో పడ్డ నన్ను కాలం ముల్లులా గుచ్చి మేల్కొల్పుతుంది. పల్చని పసుపు వెలుతురు కూడా కళ్ళకు భారమైపోతుంది. వసంతోత్సవైశ్వర్యం పొందకుంటే నిరుపేదలేనన్న మాటలు తల్చుకుని, బెంగటిల్లే హృదయం బయటకు చూస్తుంది. ఇంకా రాలని మంచుముద్దై శిశిరం అద్దపు తలుపుల అంచులను పెనవేసుకుని నిద్రిస్తూనే ఉంది. లేఎండ పొడకు మెల్లిగా కరిగిన మంచుపొర ఒకటి ఎండుకొమ్మని వెలిగించి జారిపోతుంది. రాదారుల మీద ఉప్పురాళ్ళనూ మంచురవ్వలనూ వేరు చేసి చూడలేని చూపు నిశ్చలత్వాన్నెరుగని లోలకమై కదిలి అలసిపోతుంది. బాహ్యస్పృహని వదిలించుకుని సౌందర్యంలో లీనమైపోలేని శాపంతో, వచ్చేపోయే వాహనాల వెలుగుల్లో చిక్కుపడి ఆలోచన కదిలిపోతుంది. విసురుగా తగిలి, అద్దాలను ఊపేస్తుంది గాలి. కంపించీ కుదురుకునే హృదయం పట్టుబడని రహస్యాల కోసం ఊపిరి బలంగా తీసుకుంటుంది. చూపుడువేలితో అద్దాల మీద దారులు గీసుకుని, ఆకశపు  సౌందర్యం ఆ హద్దులు దాటి విస్తరించడాన్ని చూపులతో వెంబడిస్తుంటాను. అంతూదరీ లేని అందమంతా సొంతమయ్యీ కానట్టుంటుంది. ఆగీఆగి ఉబికే ఆనందం ఏ దిక్కు నుండి వస్తుందో నాకే అర్థం కాకుండా ఉంది. నీకూ ఈ పద్యమర్థం కాకుంటే, ఈ చలి ఉదయంలో తలుపులు తీసి, నిన్ను నా పక్కకు ఆహ్వానించడం వినా మరేమీ చెయ్యలేను. ఎందుకంటే, ఈ ఉదయం నాకున్నదంతా ఈ చిన్ని అద్దపు తునక! దీని మీద నీకోసమేమీ ఈవేళ రాయలేనిక!

09 April, 2019

మిథిల


“ఇందూ, మీరు మాట్లాడి ఒప్పించాలి, ఇట్లా వదిలెయ్యలేం మనం, అరె, నాలుగేళ్ళ నుండీ ప్రోజక్ట్ లో ఉంది, ఇప్పుడు అవసరం పడితే వెళ్ళనంటే ఎట్లా!"

"తను వెళ్ళనంది. అయినా ఆల్టర్నేట్ రిసోర్స్ చూపించింది కదా, మీ ప్రోబ్లం ఏంటసలు?" ఎంతకీ తెగని ఈ మీటింగ్‌తో  పెరిగిన తలనొప్పితో కొంచం గట్టిగానే అడిగాను.

" ఏంటి ఆ ఆల్టర్నేటివ్, మూడేళ్ళైనా ఉందా ఆ సంజయ్‌కి ఎక్స్‌పీరియన్స్? ఆ పని, స్ట్రెస్ ఆ కుర్రాడెట్లానూ హేండిల్ చెయ్యలేడు.. ట్రస్ట్ మీ. మనకి మిథిల కావాలి. ప్లీజ్!  మీరామెతో మాట్లాడి ఒప్పించండి"

తల విదిలించాను.

"జరగదు. తనకి ఫేమిలీ కమిట్మెంట్స్ ఉన్నాయట. మూడు వారాలు కాదు, మూడు రోజులైనా ఆన్‌సైట్ వెళ్ళనని చెప్పేసింది. ఆ కొత్తబ్బాయిని తను ట్రెయిన్ చేసి, పనిలో హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఆ అబ్బాయేమో ఆన్‌సైట్ ఇవ్వకపోతే మానేస్తా అని బెదిరింపులు. ప్చ్, అసలే ప్రోజక్ట్ ఫేజ్ ఏం బాలేదు. మనమే ఓపిక పట్టాలి."

"మీ చిన్నప్పటి ఫ్రెండే కదా. ఏదోటి చెయ్యచ్చు కదా?"

మానిటర్ ఆఫ్ చేశాను. "మీరే చెప్పచ్చు కదా?!"

రాజేశ్ విసురుగా వెళ్ళిపోయాడు.
**********

"ఇందూ, దిస్ ఈజ్ అర్జంట్. అబ్దుల్‌తో మాట్లాడావా? నాకు రేపు సాయంకాలానికల్లా రిపోర్ట్ కావాలి."

"ష్యూర్ చంద్రా. ఆ పని మీదే ఉన్నాను"

"ఎన్ని మిలియన్ల ప్రోజక్టో ఎంతమంది రిసోర్స్‌లని పెట్టామో, బఫర్ కౌంట్,  అవర్ కాస్ట్ టీమ్ లీడర్‌లకి గుర్తు చెయ్యొకసారి."   
"ష్యూర్!"

కాబిన్ డోరు తన వెనుకే ఊగుతూ ఊగుతూ మూసుకుపోయింది.

డెస్క్‌టాప్ మీద చాట్ విండోస్ ఒక్కొక్కటిగా మెరుస్తూనే ఉన్నాయి.

"మీ టీమ్  లీడ్స్ ప్రమోషన్ లిస్ట్ రాలేదింకా!  ఎప్పుడు పంపిస్తారు? ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ డిస్కషన్ అవ్వాలి. గుర్తు చెయ్యడానికి పింగ్ చేస్తే రెస్పాన్స్ లేదు?”   హెచ్.ఆర్ టీమ్ నుండి కాల్.

"కొంచం అర్జంట్ మీటింగ్‌లో ఉన్నాను. రేపటికల్లా పంపేస్తాను." థాంక్స్ చెప్పి పెట్టేశాను.

ఇంతలో మళ్ళీ చంద్ర నుండి పింగ్. "ఇందూ. ఈ ప్రాజెక్ట్ మీద మనం జాగ్రత్తగా పనిచేసి రిపోర్ట్ పంపకపోతే ఇది చాలా దూరం వెళుతుంది. ఐ నో, మన టీమ్ కొత్తది. ఫ్రెషర్స్ అయినా మెరికల్లాంటి పిల్లలు, కాదనను కాని, క్లయింట్‌ని బట్టి టెక్నాలజీని బట్టి మారడం ఇంకా చాతకాటల్లేదేమో. ఎనీవే, అబ్దుల్‌తో మీటింగ్ మినిట్స్ అన్నీ నాకు అప్పటికప్పుడు తెలుస్తుండాలి. రేపు సాయంత్రానికల్లా నాకు ఫుల్ రిపోర్ట్ కావాలి."
అప్రైజల్స్ షీట్ పక్కన పెట్టి,  ఎవరెవరి మీద కంప్లయింట్స్ ఎస్కలేట్ అయ్యాయో, ఎందుకయ్యాయో రిపోర్ట్ తీసి చదివాను. రెండు నెలల్లో మొత్తం పదహారు. ఏ లెక్కన చూసినా, సర్వీసెస్‌లో ఈ అంకె చాలా పెద్దది. ఆఫ్టరాల్ రీజినల్ హెడ్‌ను, నాకే చదువుతుంటే ఇంత గాభరా పుడుతోందంటే, టాప్‌లెవెల్ మేనేజ్‌మెంట్ ఎలా రియాక్టవుతారో ఊహించగలను, అర్థం చేసుకోగలను.

లీడ్స్ అందరికీ ఏం జరుగుతోందో, వాటిని ఎలా టాకిల్ చెయ్యాలో కొన్ని పాయింట్స్ రాసి, రాత్రి మీటింగ్‌కి అందరూ ఏ టైమ్ జోన్ అయినా సరే అటెండ్ అవాల్సిందే అని మెయిల్ పంపాను.

మిథిల వెంటనే పింగ్ చేసింది.

"ఇందూ..నేను ఇంటి నుండి రిపోర్ట్ చేస్తాను."
"సాయంకాలం మన బెంగళూరు లీడ్స్‌తో మీటింగ్ ఉంది మిథిలా. నువ్వూ ఉండాలి, నాక్కొన్ని డిటెయిల్స్ కావాలి."
"నేను కాల్ అటెండ్ అవుతాను ఇందూ. ఇది షార్ట్ నోటీస్, నాకు వీలుపడదీ రోజు"

తలపట్టుకున్నాను. ఎలా అంటుందిలా, పద్దెనిమిది మంది రిపోర్ట్ చేస్తున్నారు తనకి. ఈ అకౌంట్లో నాలుగు సంవత్సరాలుగా పని చేస్తోంది. నేను అవ్వడానికి పై అధికారినే కానీ వచ్చి ఏడు నెలలు కూడా నిండలేదింకా. తను మీటింగ్‌లో ఉంటే చర్చించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ నాకు తెలుసు, నేను శాసించలేను. నిజానికి  నాకా అధికారం లేదు.

అయిష్టంగానే "ఓకే" అన్నాను.

అప్రైజల్ షీట్‌లో ప్రమోషన్స్ లిస్ట్‌లో మిథిల పేరు చుట్టూ అప్రయత్నంగానే ఎర్ర సున్నా చుట్టాను.

ఎదురుగ్గా ఉన్నా టీమ్ ఫొటోలో మిథిల మీదకి పోయింది నా చూపు. నల్లటి టీషర్ట్, మా కంపెనీ పేరున్నది. టీమ్ అందరికీ ఆర్డర్ చేసినా సైజులు కొంచం అటూ ఇటూ అయ్యాయి. చాలా మంది సరైన సైజ్ షర్ట్ రాలేదని , అసలు వేసుకోకా, వదిలేసీ, విసిరేసీ చేశారు. మిథిల అదో సంగతే కాదన్నట్టు, తనకు సరిగానే వచ్చిన షర్ట్ గొడవ చేస్తున్న ఇంకో అమ్మాయికి ఇచ్చేసి, పెద్ద సైజ్ షర్ట్ తీసుకుని వేసేసుకుంది. ఆ వదులు షర్ట్ లో తనని చూసి, "యు లుక్ సో కూల్" అని పొగిడారంతా. మిథిల అందం తన బట్టల్లో ఉండదు, లిప్‌స్టిక్ అంటని పెదాల్లోనూ, కాటుక తగలని తన కళ్ళల్లోనూ ఉండదు. మాట్లాడితే తన గొంతులో వినపడే స్థిరత్వం, పనిచేసే చోట తన నడవడిక-  మిథిల లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారంటారు మా నాన్న.  తనని పక్కింటి మనిషిలానే కాక, పదేళ్ళు చదువు చెప్పిన మేష్టారిగా కూడా చూసిన  ఆయన మాట కాదని తిప్పికొట్టలేను కానీ..ఎట్లా ఉండేదీ పిల్ల!

***********

ఈ నెల ఈమాట సంపాదకీయం గురించి:


"సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని" ఈ నెల ఈమాట సంచికలో వచ్చిన రచనలన్నింటికి labels/Tags తీసేసి ప్రచురించారు. ఇలా చెయ్యడం వల్ల, రచనను రచనగా చూడటం అలవాటవుతుందన్న ఆశ ఉందని కూడా చెప్పారక్కడ.
నిజంగానే కొన్ని రచనలను చదివినప్పుడు, వీటిని కథ అని ఎందుకు అన్నారు/ వీటిని కవితగా ఎందుకు ప్రచురించారు అని సందేహం కలుగుతూ ఉంటుంది. రచనల నాణ్యతతో పాటు, కొత్తగా కనపడ్డ ప్రతిదానికీ మనసు అంత తేలిగ్గా అలవాటు పడకపోవడమొక కారణం. స్వాతి కినిగె్‌లో అనుకోకుండా రాసే రోజుల్లో, మొదటి నెలల్లో "మీరేదో సగం సగం రాస్తున్నట్టు ఉంది, అవి కథలు కదా, ఇంకాస్త పొడిగించి రాయండి, ఇంకొంచం స్పష్టంగా రాయండి" - అని గొడవపడటం నాకింకా గుర్తుంది. కానీ, ఆ శీర్షిక ముగిసేవేళకి అవి నాకు ఉన్నవున్నట్లుగానే ఎంతగానో నచ్చాయి. ఆ చెప్పీచెప్పనితనం, కథకీ కవిత్వానికీ మధ్య ఊగిసలాడే గుణం ఆ శీర్షికని క్రమం తప్పకుండా చదివేలా చేశాయి. అదే శీర్షికతో అంతకు మునుపే నందకిశోర్ "నీలాగే ఒకడుండేవాడు" పుస్తకంలో ఒక ప్రత్యేక భాగాన్ని ప్రచురించినప్పుడు, దాన్ని కవిత్వంగా చూసేందుకు మరో ఆలోచన లేకుండా సన్నద్ధంగా ఉండటం, దాన్ని మొదటే "కవిత్వం"గా చేతుల్లోకి తీసుకోవడమేనా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. "నేనొక కథ చెప్తానిప్పుడు/రాశాను" అని చెప్పి మరీ చదివించే కొందరి కథల్లో ఆ వాక్యమే మొదటి ఇబ్బందిగా ఉండిపోవడం నాకైతే చాలా సార్లే అనుభవం. బ్లాగుల్లో చాలా కాలం రాసినవాళ్ళు, తరచుగా వాడే మాట ఒకటుండేది -"ఇది కథగా రాయాల్సిందండీ, దీన్ని ఇలా వదిలేశారేమి?" అన్నది. ఆ మాటను చాలాసార్లు ఆ రచనకు పొగడ్తగానే వాడేవాళ్ళు తప్ప, నిజంగా ఏవో మార్పులు చేసెయ్యమన్న అర్థంతో కాదు. "కథ" అన్న పేరు తగిలించి ప్రచురించమన్నది మాత్రమే చాలామంది సలహా. ఒక రచనను ఏ చీటీలూ లేకుండా చదివి అభినందించేశాకా, దాన్ని పాఠకులే ఒక ప్రక్రియగా గుర్తుపట్టాకా, మళ్ళీ దాన్ని పనిగట్టుకుని ఒక అరలోకి తొయ్యాల్సిన పనేముంది?
చాలా స్పష్టంగా ఇది కథ/వ్యాసం/కవిత్వం అని గుర్తుపట్టగలిగేలా ఉండే రచనలు కొన్ని ఉంటాయి. వాటిని పక్కనపెడితే, అసలు రచనలకు ఈ పక్రియలన్న పేర్లు పెట్టడం బొత్తిగా అనవసరమనీ, పెట్టకపోతేనే బాగున్నదనీ నాకు బలంగా అనిపించేలా చేసిన రచన: నేను ఈ మధ్యనే చదివిన "రియాలిటీ చెక్". ఆ పుస్తకం గురించి రాస్తూ, అరవై భాగాలుగా సాగిన ఆ విడి విడి రచనలను కథలనాలా వద్దా? అన్న మాట దగ్గరే నేనెంతో ఆలోచించాల్సి వచ్చింది. పరిశీలనా వ్యాసాలు అన్న మాట వాడాను కానీ, ఎన్నో భాగాల్లో జీవిత చరిత్రలే ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన మనుష్యుల కథలున్నాయి. తెలంగాణా వంటల గురించి రాసిన భాగమొక్కటీ నాకు నచ్చలేదు, అది ఆ పుస్తకంలో లేకుంటే బాగుండనిపించింది, నిజానికి ఇమడలేదనిపించింది. దానిని రిపోర్ట్ అనాలేమో అనిపించింది. అలా వేరే పేరు స్పురించడంతోనే దానిని వేరుగా చూడటం మొదలైంది. ఏ రచన కా రచన ఒక "సర్ప్రైస్ ఎలిమెంట్" ని మోసుకుంటూ వచ్చినందుకే ఈ పుస్తకం నాకింత నచ్చిందని చెప్తున్నా, ఇందులో కొన్ని కథలు అని నేను ఏ ప్రయత్నమూ లేకుండానే గుర్తుపట్టగలిగాను. అదే నేను, మళ్ళీ ఇదే రచయిత "చింతకింది మల్లయ్య" కథల సంపుటిగా ప్రచురిస్తే, అందులో "శ్రీమతి దినచర్య" ని చదివి, ఇదేదో రియాలిటీ చెక్‌లో ఉంటేనే బాగుండేది, కథలా అనిపించడం లేదనుకున్నాను. ఈయన రాసేవే మళ్ళీ ఈమాటలో "స్వగతం" శీర్షికన వస్తోంటే, ఆ label ఎంత చప్పగా ఉందో అని ఎప్పుడూ నిరుత్సాహపడిపోతుంటాను. అలా చూస్తే, ఈ పేర్లూ, వీటితో ముడిపడిన మన అంచనాలూ మన పఠనానుభవం మీద చూపిస్తోన్న ప్రభావాన్ని పూర్తిగా విస్మరించనూ లేమనిపిస్తోంది. ఇంతేనా, లేదూ, ఒక పత్రిక లేదా పుస్తకంలో ప్రచురణలంటే మనకున్న గౌరవమూ, అవి కొన్ని ప్రమాణాలని అందుకోవాలని మనకున్న ఆశా, అక్కడి రచనలను అతిగా పరీక్షించేలా చేస్తున్నాయా? ఫేస్‌బుక్‌లోనో, బ్లాగులోనో, అరకొర వాక్యాలైనా ట్విటర్‌లోనో రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనమింతగా రచనా ప్రక్రియల పేర్లని గమనిస్తున్నామా, అవీ ఇలా కొన్ని ప్రమాణాలతో ఉండాలని అనుకుంటున్నామా? నేనైతే అనుకోను, బహుశా అందుకే, ఈ ఈ మాధ్యమాల్లో రచనలని ఇంకా ఇష్టంగానే చదువుకుంటాను కూడా. చాలాసార్లు, వీటిలో నిజాయితీ కూడా నచ్చుతుంది, ఒక అనుభవాన్ని ఒక రచనాప్రక్రియగా మార్చడంలో జరిగే చిన్నపాటి కల్తీని దాటుకుని వచ్చి మనముందు ఉన్నందుకనుకుంటాను. సౌమ్య రాసిన మెట్రోకథల్లో ఒక కథలో, రెండు బోగీలు కలిసే ఇనుపచప్టా మీద కూర్చుంటే అలల దగ్గర కూర్చున్నట్లుందని అంటాడొకబ్బాయి. ఆ ఎపిసోడ్ ఎంత ఇష్టంగా, ఆశ్చర్యంగా, దిగులుగా చదువుకున్నానో. ఈ కథలకి పేర్లు కూడా పెట్టలేదామె.
ఈమాట ప్రయోగం వెనుక ఉన్న ఆలోచన నచ్చింది. పోతే, ఎక్కడైనా, ఎప్పుడైనా మనం దేన్నైనా సర్దుకునేది వీలు కోసం. వెదుక్కుంటే తిరిగి తేలిగ్గా అందుకోవడం కోసం. నెల గడిచాకైనా, వీళ్ళు ఈ నెల రచనలకు చీటీ తగిలించి దాస్తారా లేక సంచికను సంచికగానే చదువుకోమంటారా చూడాలి. 

06 April, 2019

ఉగాది శుభాకాంక్షలు

బాగా చిన్నప్పుడు, ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాది పొడుగూతా అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందనే నమ్మకం గట్టిగా ఉండేది. ఆ రోజు బాగా శ్రద్ధగా చదువుకుంటే, ఏడాదంతా అంతే శ్రద్ధగా చదువుకోవచ్చుననమాట. ఆ రోజు నవ్వుతూ ఉంటే, ఏడాదంతా సంతోషమే. ఆ రోజు అల్లరి చేసి తన్నులు తింటే, ఇదీ పూటపూటా జరిగే వ్యవహారమయిపోతుందన్నమాట. ఒక్క రోజుతో ఏడాది కాలాన్ని కట్టెయ్యడమనమాట! ఎంత తేలిక! ప్రయత్నమూ అక్కర్లే, ప్రాయశ్చిత్తమూ అక్కరలే! ఇంకొంచం పెద్దవాళ్ళమయ్యాక, ఆ రోజు చిన్నపాటి FriendshipDay కూడా అయింది. ఇష్టమైన వాళ్ళందరినీ, ఫోనులోనో, విడిగానూ, కుదిరితే రెండు రకాలుగానూనో కలుసుకోవాలి, రోజూ చెప్పుకునే కబుర్లే అయినా చెప్పుకోవాలి. అదొక కనపడని వాగ్దానం. నమ్మకంలా కనపడే ఇష్టం. చిరుచేదులు తగిలిన ఏడాదుల్లో ఎప్పుడైనా ఈ నమ్మకాలను ప్రశ్నించాలనిపించేది కానీ, మొత్తంగా చూస్తే మటుకు నాకిది ఇష్టంగానే ఉండేది. ఈ ఏడు రుచికరమైన ఉగాది పచ్చడి రహస్యం కూడా తెలిసినట్టే ఉంది :) (మావిడి ముక్కలు తరుగుతూ, పక్కింటి మామ్మగారి కొమ్మకున్న వేప పూవు దూసి తెమ్మంటే కొమ్మలు విరగొట్టుకు తెచ్చి, ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదుతూ తెలతెల్లని లేత పూరేకులు విదిల్చినప్పుడు తెలీలేదు గానీ, డాలర్లు పోసి కొన్న వేపమండల్లో పూవెక్కడా అని వెదుకుతుంటే ఇంకా చాలా రహస్యాలే తెలిసాయ్ ;) ) 
సరే, మన ఊహలని కదిలించడానికీ, కలవరపెట్టడానికి, చుట్టూ ప్రపంచం ఏదో కుట్ర పన్నుతోందని అన్ని దిక్కుల నుండీ అందరూ వాపోతున్న ఈ రోజుల్లో - ఒక్క రోజంతా మనం ఎలా అనుకుంటే అలా ఉండగలమన్న నమ్మకమూ, అవకాశమూ ఇచ్చే ఉగాది మంచిదే కదా! ఏడాదంతా సాగబోయే స్నేహానికి నా తరఫు మొదటిమాటగా - అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు! :)