ఉగాది శుభాకాంక్షలు

బాగా చిన్నప్పుడు, ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాది పొడుగూతా అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందనే నమ్మకం గట్టిగా ఉండేది. ఆ రోజు బాగా శ్రద్ధగా చదువుకుంటే, ఏడాదంతా అంతే శ్రద్ధగా చదువుకోవచ్చుననమాట. ఆ రోజు నవ్వుతూ ఉంటే, ఏడాదంతా సంతోషమే. ఆ రోజు అల్లరి చేసి తన్నులు తింటే, ఇదీ పూటపూటా జరిగే వ్యవహారమయిపోతుందన్నమాట. ఒక్క రోజుతో ఏడాది కాలాన్ని కట్టెయ్యడమనమాట! ఎంత తేలిక! ప్రయత్నమూ అక్కర్లే, ప్రాయశ్చిత్తమూ అక్కరలే! ఇంకొంచం పెద్దవాళ్ళమయ్యాక, ఆ రోజు చిన్నపాటి FriendshipDay కూడా అయింది. ఇష్టమైన వాళ్ళందరినీ, ఫోనులోనో, విడిగానూ, కుదిరితే రెండు రకాలుగానూనో కలుసుకోవాలి, రోజూ చెప్పుకునే కబుర్లే అయినా చెప్పుకోవాలి. అదొక కనపడని వాగ్దానం. నమ్మకంలా కనపడే ఇష్టం. చిరుచేదులు తగిలిన ఏడాదుల్లో ఎప్పుడైనా ఈ నమ్మకాలను ప్రశ్నించాలనిపించేది కానీ, మొత్తంగా చూస్తే మటుకు నాకిది ఇష్టంగానే ఉండేది. ఈ ఏడు రుచికరమైన ఉగాది పచ్చడి రహస్యం కూడా తెలిసినట్టే ఉంది :) (మావిడి ముక్కలు తరుగుతూ, పక్కింటి మామ్మగారి కొమ్మకున్న వేప పూవు దూసి తెమ్మంటే కొమ్మలు విరగొట్టుకు తెచ్చి, ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని ఊదుతూ తెలతెల్లని లేత పూరేకులు విదిల్చినప్పుడు తెలీలేదు గానీ, డాలర్లు పోసి కొన్న వేపమండల్లో పూవెక్కడా అని వెదుకుతుంటే ఇంకా చాలా రహస్యాలే తెలిసాయ్ ;) ) 
సరే, మన ఊహలని కదిలించడానికీ, కలవరపెట్టడానికి, చుట్టూ ప్రపంచం ఏదో కుట్ర పన్నుతోందని అన్ని దిక్కుల నుండీ అందరూ వాపోతున్న ఈ రోజుల్లో - ఒక్క రోజంతా మనం ఎలా అనుకుంటే అలా ఉండగలమన్న నమ్మకమూ, అవకాశమూ ఇచ్చే ఉగాది మంచిదే కదా! ఏడాదంతా సాగబోయే స్నేహానికి నా తరఫు మొదటిమాటగా - అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు! :)

4 comments:

 1. 🌱🌱ఉగాది శుభాకాంక్షలు🌱🌱

  ReplyDelete
 2. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు

  ReplyDelete
 3. ఉగాది శుభకామనలు, మానసా!

  ReplyDelete
 4. భానోదయం గారూ : ధన్యవాదాలండీ..! :)

  బులుసు గారూ, లలిత గారూ - థాంక్యూ! మీ ఉగాది రోజు బాగా గడిచిందనీ, ఈ ఏడంతా అంత ఆనదంగానూ గడవాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :)

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...