దక్షిణం వైపు ఇల్లు

రెండవ ఝాము రాత్రి
సన్నగా కురుస్తూ వాన.

వీధి దీపపు పసుపు కాంతి
పాకీ పాకీ ఆ వాకిలి దాకా వస్తుంది
సీతాకోక రెక్కల గేటు క్రింద
ఆకులు వలయాల్లో తిరుగుతాయి.
చందమామనెవరో చూరుకి వేలాడదీసినట్టు
వరండాలో ఊగుతూ లాంతరు
గోడ మీద ధ్యానముద్రలో బుద్ధుడు;
లక్ష్మణ రేఖలాంటి తారురోడ్డుకవతలి ఇంట్లోకి
గాజుపెంకులు గుచ్చిన గోడకవతలి వైపుకి
ఈ రెండో అంతస్తులో నుండి చూసినప్పుడల్లా
గుచ్చుకునేదొక్కటే..

నిండా విరిసిన
            ఓ పూల చెట్టు!
 
               *
కాసేపు విసురుగా కాసేపు జాలిగా
అలకలో ఉన్న ప్రేయసి మాటల్లా
వర్షపు చినుకులు.
రయ్యిమని గాలిని కోసుకుపోతూ
వాహనాలు మిగిల్చిన నిశ్శబ్దం.
పియానో మెట్ల మీద నుండి,
కొక్కేనికి పట్టుకు చిరిగిన
పరదా సందుల్లోంచీ
సీతాకోకరెక్కల మీదుగా తప్పించుకుని
పైపైకి పాకుతూ వస్తుందో రాగం.

కనపడని వేళ్ళ క్రింద పడి
మనసు నలిగిపోతుంది.

*
కోరుకున్న పూల మత్తే
ఊపిరంతా చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
రెక్కలు విప్పుకున్న సీతాకోకలన్నీ
కనురెప్పల మీదమీదకి సవారీకొస్తాయి
నీలంగా మారుతోన్న చందమామను
కళ్ళార్పకుండా చూస్తాడు బుద్ధుడు
నా అరచేతుల్నిండా గాజుపెంకులు...

విలవిల్లాడుతూ లేస్తాను కానీ..

చుక్కలుచుక్కలుగా కారే రక్తం
ఎంత ఒత్తినా ఆగదు.
మరకలంటని పూలచెట్టుని
మళ్ళీ చూసేందుకు మొహం చెల్లదు.

వాన నిలిచిపోయినట్టేనా?


*
*తొలిప్రచురణ : 01-0-2017 ఆంధ్రజ్యోతి వివిధలో.

అఫ్సర్ కవిత్వంలో అమూర్తభావనలు

  ఈ సాయంత్రానికి ఈ చలీ ఈ వానా కలగలిసి ముంచుకొస్తున్న చీకటిలోకి కాస్త నిబ్బరంగా నడిచివెళ్ళడానికి ఏదో ఒక సాకు వెదుక్కుందాం ప్రస్తుతానికి దాని ...