చుక్కలతో మెరిసిన రాతిరి ఒకటి

ఇంజనీరింగ్ రోజుల్లో స్నేహితులందరం కలిసి పూనేలో ఏవో ఇండస్ట్రీస్ చూసే వంకన బొంబాయి రైలెక్కాం. గడియారం పది గంటలు కొట్టగానే సోలిపోయే నేను, ఆ వేళ నిద్ర కాచుకుని స్నేహితులతో సైడ్ లోవర్‌లో కూర్చుని ముచ్చట్లాడుతున్నాను. బయట నుండి చలిగాలి రివ్వురివ్వున తోసుకొస్తోంది. ఊచల మీద వాలిన మా అరచేతులు మంచుముద్దలవుతున్నాయ్. గాలి ఒదుగుకి బుడగలా పైకి లేస్తున్న పల్చటి సిల్కు చున్నీలను నొక్కి ఒళ్ళంతా తిప్పి చుట్టుకుంటున్నా, లోపలి వణుకు తెలుస్తూనే ఉంది. అయినా మేం తలుపులు మూయలేదు. కాసేపటికి రైలుబండి నడక లయతో పాటుగా చెవులకు లోబడిపోయింది. చిన్నచిన్న ఊర్ల చిరువెలుగులు కూడా మెలమెల్లగా మాయమవుతున్నాయి. లోకం నిద్రపోతే తప్ప ఆవరించుకోని ప్రశాంతత ఏదో అనుభవంలోకి వస్తోంది. లాంతరు వెలుగును ఎవరో దగ్గరుండి పెద్దది చేసి అదే వడిన ఆర్పేసినట్లు, ఏదైనా స్టేషన్ దగ్గరకు వస్తుంటే ఉండీఉండీ కళ్ళల్లో పడే వెలుగు. దాటగానే మళ్ళీ కుదురుకునే చీకటి. ఆ చీకట్లోకి చూపు సారిస్తే, అకస్మాత్తుగా ఎవరో తెర వాల్చినట్టు, ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్రాలు. కిటికి దగ్గర్నుండి లేచి, తలుపు దగ్గర వేలాడుతూ నిలబడి, ఆ రాత్రి చూసిన నల్లటి ఆకాశం, ధగధగా వెలిగిన తారల మెరుపు...ఇదిగో...ఈ పోస్టర్ చూస్తే ఈరోజెందుకో మరీ మరీ గుర్తొచ్చాయి. 



అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....