పుస్తకాలను పెనవేసుకున్న కబుర్లు


విజయవాడ వెళ్ళడమంటే నాకూ మా అక్కకీ మహా సరదా! అల్లుళ్ళిద్దరూ వస్తున్నారంటే అమ్మ చేతి అమృతపు రుచి పదింతలు కావడం ఒక కారణమైతే, నాన్నగారితో కలిసి ప్రతి సాయంకాలమూ అక్క-నేనూ పుస్తకాల ప్రదర్శనకు కాళ్ళ నొప్పులొచ్చే దాకా తిరగడమన్నది రెండో కారణం. పి.డబల్యూ.డి గ్రౌండ్స్‌లో అక్క పిల్లల చేతులు పట్టుకు పరుగెడుతూ, వాళ్ళ మూడ్ మారిపోక మునుపే వీలైనన్ని పుస్తకాలు కొనాలని ఉబలాటపడుతూ, సిమ్లా బజ్జీల వాసనకు ఒకసారి, గాలిలో తేలి వస్తున్న మసాలా ఛాట్‌ ఘుమఘుమలకు మరో సారి, ముంత జున్ను కోసం ముచ్చటగా మూడోసారి, పుస్తకాల నుండి కాస్త పక్కకు జరిగి, ఇంట్లో సరిగా తినకపోతే అమ్మ చంపేస్తుందన్న మాటను ఒకటికి వందసార్లు విధిగా గుర్తు తెచ్చుకుంటూనే ఇవన్నీ తినేస్తూ తిరగడం, జీవితంలోని అత్యంత మధురమైన అనుభవాల్లో ఒకటి. అబ్బా, సొంత ఊరిలో ఏం మహత్యం ఉందో కానీ, తల్చుకుంటే చాలు ఎన్ని వేల కబుర్లు ఉప్పొంగుతాయో!

ఒకానొక మల్లాది నవలలో, హీరో ప్రతి ఏడాదిలానే పుస్తక ప్రదర్శనకు వెళ్ళి, ఎప్పటిలానే ఎంతగానో వెదికి వెదికి, చిట్టచివరకు ఒకేఒక పుస్తకంతో ఇంటికి చేరతాడుట. నిద్రపోయే ముందు పుస్తకం మూసి, తన లైబ్రరీలో పెట్టబోతూ, ఎందుకో గత సంవత్సరం ఏం కొన్నానోనని చూడబోతే, అది - "జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎలా" అన్న పుస్తకం. ఆశ్చర్యపోతూ ఆ రోజు కొన్న పుస్తకం పేరు చూస్తే, అదే ఇది. వెంటనే రెండేళ్ళ క్రితం కొన్నది, మూడేళ్ళ క్రితం కొన్నదీ, అసలంతకు ముందు కొన్నవన్నీ లాగి చూడబోతే...ప్రతి పుస్తకం మీదా ఇదే పేరు వెక్కిరిస్తూ కనపడుతుందట. హీరోగారికి అన్నేళ్ళలోనూ పెరిగిన జ్ఞాపకశక్తి అదీ!

అచ్చుగుద్దినట్టు ఇదే కథ కాకపోయినా, ఈ స్థాయిలో కాకపోయినా, మిత్రులకు బహుమతులుగా ఇచ్చేసి కొన్ని, మరీ దగ్గరవాళ్ళు వేడుకోళ్ళు సైతం వినకుండా విదిల్చికొట్టి లాక్కుపోయినవి కొన్ని, పోగొట్టుకున్నవి కొన్ని -ఏతావాతా కొన్నవే కొంటూండటం నాకూ మా అక్కకూ రివాజు. ఈ సారి సఖ్యంగా ఒక ఒప్పందానికి వచ్చాము. "నాదనేదీ నీదేనోయ్--నీదనేదీ నాదే.." అంటూ ప్రేమలు ఒలకబోసుకుని, మార్మిక కవిత్వాలూ(నా కోటా..) - పిల్లల పుస్తకాలూ(మా అక్క వాటా) మినహాయించుకుని, మిగిలినవన్నీ ఇద్దరం కలిసి కొనుక్కోవాలని రాజీకి వచ్చి, సంచీల నిండుగా కొనుక్కుని విప్పారిన మొహాలతో ఇంటికెళ్ళాము. వాటిలో కొన్ని ఎంపిక చేసిన పుస్తకాల గురించి - ఏవో నాలుగు మాటలు - అవి నాకు మిగిల్చిన అనుభవాలూనూ!

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....