కవితాసంకలనాలు / కవితత్వాలు

"అసాధ్యమైన ఏకాంతం అంటూ ఏమీ లేదు. ప్రపంచ రహస్యాలను  రూపకాలంకారాలతో తప్ప హేతువాదంతోనో, తర్కంతోనో విప్పి చూపలేము" - నోబుల్ స్వీకారోపన్యాసంలో  నెరూడా చెప్పిన మాటలివి.

కవిత్వం నా వరకూ చాలా ప్రశ్నలకు ఒప్పించగల సమాధానమైంది. దేవరహస్యాలను విప్పి చెప్పిన మహామంత్రమైంది. కనుక, ఆ రహస్తంత్రులు మీటే రసవిద్య నేర్చిన కవుల పట్ల కూడా సహజంగానే నాకు వల్లమాలిన ఆసక్తి, గౌరవం, ప్రేమ. ఓ ఐదారేళ్ళ క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు, "కవితా దశాబ్ది" అనే పుస్తకం కంటబడింది. నూటయాభై కవితలు - సుమారు ఓ దశాబ్ద కాలంలో వచ్చిన వందల కవితలను వడబోసి ప్రచురించారు సంపాదకులు ఎస్వీ సత్యనారాయణ గారు, పెన్నా శివరామకృష్ణ గారు. ప్రతి కవితకూ చివర, మూణ్ణాలుగు వాక్యాల్లో  ఆ కవి గురించి చిన్న పరిచయం కూడా జత చేశారు. ఆ చిరుపరిచయం ఆసక్తి రేకెత్తించిన మాట వాస్తవమే కానీ, సామాన్యంగా కవితా సంకలనాలు నన్నట్టే ఆకర్షించవు.  ఒక్కో కవిదీ ఒక్కో కవిత - ఏం సరిపోతుంది? కవి తత్వం అర్థం కాదు, కవి గొంతు బలంగా వినపడ్డట్టు ఉండదు, కవి మనసుల్లో చొరబడి మాయ చేసినట్టుండదు. కేవలం పొగమంచులా కమ్ముకునే కొన్ని ఆలోచనలు మిగులుతాయంతే. అది నాకు నచ్చదు. కవిత్వాన్ని కాలక్షేపం బఠానీ అనుకోలేకపోవడమనే బలహీనతే కాదు, తారసపడ్డ ప్రతి కవీ షడ్రసోపేతమైన విందుభోజనం లాంటి అనుభవమే తన కవిత్వం ద్వారా మిగల్చాలన్న దురాశ కూడా కలదాన్ని.

చంద్రకాంతమణి


తొలి ప్రచురణ ఈవేళ్టి (09-02-2014) ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో  

వాడు 'రా నానా' అంటూ గారాలు తొడుక్కుని
గాలికి విరిగే కబుర్లలో నను నడిపించుకెళ్తాడు.
ఉప్పునీటి తీరంలో ఉరికే ఉద్వేగాలన్నీ
చెదరగొట్టిన ఏడు పెంకుల్లో ఏరుకోమంటాడు.
తుళ్ళేటి అలలపై తెలివెన్నెలై తేలివచ్చి
సముద్రపు హోరంతా శంఖంలో దాస్తాడు.
ఎగిరే గాలిపటాల దారాలు తెంపేసి
ఎల్లల్లేని గగనానికి కొత్త రంగులద్దుతాడు
ఇసుక గూళ్ళలో పట్టని దేవుళ్ళందరినీ
పెదవి ఒంపులో ప్రతిష్టించుకుని
తారలు తలలొంచే నవ్వులతో
చిందాడీ పాడీ అలసిపోయాక
మూపు మీద ఉప్పుమూటై వాలిపోతాడు.
ఎదురు చూస్తున్న పెరుగన్నం ముద్దకి
వణుకుతోన్న తడిదేహా నప్పజెప్పేప్పుడు,
బిగిసిన పసి గుప్పిట్లోంచీ నున్నటిదేదో
చంటిగాడి ఉలికిపాటుతోనే జారిపడ్డప్పుడు, 
అలవాటైన అనుమానపు చూపులతో
ఆ రాయినలా ముట్టుకుంటానో లేదో
సముద్రమంత చల్లదనం నాలోకి ప్రవహిస్తుంది.
ఇంత క్రితం తీరాన మెరసిన వెన్నెలేదో
ఉన్నట్టుండి పరుచుకుంటుంది, 
మా ఇరుకిరుకు గదుల్లో, మనసుల్లో.

సరాగ తీరాల్లో

.తొలి ప్రచురణ - పాలపిట్ట సాహిత్య మాస పత్రిక, జనవరి- 2014 సంచికలో


అనాదిగా అదే దృశ్యం

తరగల నులివెచ్చని ముద్దుల్లో
తడారని పాదాల నురుగల నవ్వులను
పెదాల మీద మెరుపుల్లా అంటించుకుంటాడతను.

భుజం మీద వాలి దిగంతాల్లోకి చూస్తూ
ఆకాశం సముద్రంతో సరసాలాడడాన్ని
కళ్ళతో జుర్రుకుంటుందామె.

తడిపొడులు శరీరాలతో దోబూచులాడుతుంటాయి
వెలుగు నీడలు కళ్ళల్లో వచ్చిపోతూంటాయి
గుప్పెడు ఇసుకను వేళ్ళ సందుల్లోంచీ వదిలేస్తూ
గుండెల్లోని ఊసులన్నీ ఇచ్చిపుచ్చుకుంటారు.

సంధ్య హారతి ముగిసేవేళకి అతని ప్రేమంతా
మహానైవేద్యమై ఆమె పాదాల ముందు మోకరిల్లుతుంది
ఆమె చొరవ చీర చూపించే కొంగొత్త అందమంతా
మహోజ్వలమై అతని హృదయాన్ని వెలిగిస్తుంది.

చీకటి విప్పిన వెలుగుల మూటలు
చూడలేని వాళ్ళంతా వాదించుకుంటారు,
ఆకాశమూ అర్ణవమూ
ఏనాటికైనా ఎలా కలుస్తాయని.

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...