శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం - "ఆకుపాట"

తొలిప్రచురణ :ఈమాటలో

కవిత్వంలో ఆధునికత అనే పదానికి ఏనాడూ ఒక స్థిరమైన నిర్వచనం అనేది దొరకదు. ఏ తరానికా తరం కొత్త కవిత్వాన్ని సృజిస్తూనే ఉంటుంది. వచన కవిత్వపు తొలి నాళ్ళతో పోలిస్తే, ఇప్పటి కవిత్వం ఎన్నో రకాలుగా మారింది. కొత్త ప్రతీకలు, కొత్త భావాలు, కొత్త రూపకాలు, సరికొత్త వాక్యనిర్మాణం, పదబంధాలూ - ఇవన్నీ కవిత్వంలో కొత్త కోణాలను చూపెడుతున్నాయి. కవుల సంఖ్య పెరుగుతోంది, ఎల్లలు చెరిగిన ప్రపంచంలో కవుల భాష కూడా స్వేచ్ఛను సంతరించుకొంటోంది. అభివ్యక్తి పరిథులు అంతకంతకూ విస్తృతమవుతున్నాయి. కవిత్వంలోని ఈ మార్పులకూ, కొత్త పోకడలకూ అద్దం పట్టే సంపుటిగా, శ్రీవాసుదేవ్ గారి "ఆకుపాట"ను చెప్పుకోవచ్చు.

మోహమకరందం

ఒకదానిపై ఒకటి
మరొకదానిపై ఒకటి
కౌగిలించుకుంటూ
కలియబడుతూ
ముద్దాడుతూ
మత్తెక్కుతూ
మరిన్ని, మరిన్ని,
మరిన్ని పోగవుతూ
ఆ నిశ్శబ్దపు వీథిలో
చివరి ఇంటి చూరుపట్టి
రెక్కలల్లార్చిన
తేటీగల అల్లరికి
విసుగంతా విదుల్చుకున్న
కిటికీ రెక్కల చప్పుళ్ళలో
మెల్లిగా మొదలైందో
మౌనప్రణయరాగం.

మెరిసిన కనులు; కలలు
ముసిరిన సంగీతం; వసంతం
“ఎంత ప్రమాదం”
అరిచారెవరో!
రాళ్ళు రువ్వారెవరో!

నల్లని మచ్చలు గోడకు మిగిల్చి
తేనెతుట్ట చెదిరిపోయింది.
తడితడి గుర్తులు ఊచలకొదిలి
మేడ గడియలు బిగుసుకున్నాయి.

కాటు పడిందని దిగులెందుకు,
తేనెచుక్క చిందే ఉంటుంది!
---------------------------
తొలిప్రచురణ - ఈమాటలో

రా!

ఏమో, బ్రతుక్కింకా
కలల్ని అమ్ముకుని
కన్నీళ్ళు దాచుకోవడం రాలేదు.
దాహాలు దాచుకున్న చూపుల్తో
దిక్కుల్ని మింగేయడమెలాగో తెలీలేదు
మోహాలు దేహాల్ని బంధిస్తాయని
విరహాల నెగళ్ళలో నిప్పులవడమూ నేర్వలేదు

అయినా చెప్పాలిప్పుడు,
రెక్కలెవరివో తెగిపడతాయని
వత్తుల్ని నలిపి వెలుగుల్నార్పేయకు
చుక్కలు రాల్తాయని భయపడి రాత్రిళ్ళు
వెన్నెల నడవితో నిద్రించమని వదిలేయకు
వెలుగు నీది! వెన్నెలా నీదే!

కార్చిచ్చల్లే లేస్తున్నాయా కోరికలు?
కావలింతల్లో ఊరటుంటుంది రా!
గాయాలవ్‌తాయనా? 
మొద్దూ,
మందుంది నా దగ్గర.
అన్నింటికీ.

ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల ...