తోటమాలికో పూవు

అనుభవించడానికి మనసే మాత్రం సంసిద్ధపడని ఏకాంతం మనిషిని స్థిమితంగా నిలబడనీయదు. మనిషికి మనిషి ఎదురుపడే భాగ్యం లేని వేళల్లో మనం తెరవగలిదేల్లా హృదయపు తలుపులే.
ఉదయాన్నే వెలుతురునూ గాలినీ ఆహ్వానిస్తూ తెరలు పైకి లాగి గడియలు తీసినట్టు, పరాకుగానే మది తలుపులు తోశానీవేళ. తమ రెక్కల బలంతో కాలాన్నీ, దూరాన్నీ చెదరగొడుతూ, జ్ఞాపకాల పక్షులు కువకువలతో కళ్ళ ముందుకొచ్చాయి.
చుట్టూ ఏ అలికిడీ లేని నిర్జనప్రాంతంలో, నగరపు ఛాయలు వాలని చోట ఒంటరిగా ఉండేది మా పెద్దమ్మ ఇల్లు. అపార్ట్మెంట్‌లూ, చుట్టూ పెద్ద ఇళ్ళు కూడా లేని మారుమూల వీధి అది. తలెత్తి చూస్తే, ఏ అడ్డూ లేకుండా కనపడే ఆకాశపు నీలిమ. ఆ డాబా మీద, ఆ ఎలప్రాయంలో, సాయంసంధ్య కాంతులను త్రోసిరాజని మరీ పొదువుకున్న అక్షరాలు "నిర్వికల్ప సంగీతం"లోవి. ఆనాటి మైమరపులో గంటలు క్షణాలయ్యాయి. సుదూరాన నీలమణులు కెంపులయ్యాయి. ఆకు కదిలిన చప్పుడు తప్ప ఏదీ చెవిపడని ఏకాంతంలో ఆ గరుకుగచ్చు మీద అలౌకికానందంలో ఒక్కతెనూ నిలబడిపోవడం మాత్రం, ఆ రేయి చూసిన ఒంటరి నక్షత్రంలా హృదయాకాశంలో మిణుకుమిణుకుమంటూనే ఉంది. తొలిప్రేమానుభవం లాంటి జ్ఞాపకమది. దాన్ని దాటి మనమెంతదూరమైనా వెళ్ళాల్సిరావచ్చు, కానీ కంపించే హృదయాన్ని గుచ్చి, ప్రేమించేశక్తిని పరిచయం చేసిన అపురూపక్షణాలను మర్చిపోలేం.
చినవీరభద్రుడి వాల్ మీదకు తొంగిచూసినప్పుడల్లా, సముద్రంలోకి వెళ్ళిపడ్డ చేపపిల్ల తుళ్ళింతలా, నాలోనూ ఏదో సంబరం ననలెత్తుతుంది. పసిపిల్లలు ఉండుండీ ఇష్టంగా తడుముకుని హుషారు కొసరుకునే బొమ్మలప్రపంచంలా, ఆ వాల్ మీద నా ఉత్సాహాన్నీ, సంతోషాన్ని నిలిపిఉంచే నిధులేవో ఉంటాయి. వెళ్ళినప్రతిసారీ ఏ తలుపులూ లేకుండా నన్ను ఆహ్వానిస్తుంటాయి. ఆకాశంలో స్వర్ణకాంతుల ఉత్సవం కంటపడిన ప్రతిసారీ హృదయం మరికొంత తేటపడినట్టు, శుభ్రపడి బలపడినట్టు, వేకువలో ఆ వాల్‌ని అల్లుకుపోయే అక్షరాలను చూసినప్పుడల్లా తెరలుతెరలుగా హృదయానికి తేనెపూత. జీవితానుభవాలకు దోసిలి ఒగ్గి నిలబడగలిగే స్థైర్యం.
ప్రేమ మార్గం బహుఇరుకన్న కబీరూ...నువ్వీ తోటమాలి వికసింపజేసిన పూదోటలో నడిస్తే ఏమనేవాడివి?

Vadrevu Ch Veerabhadrudu - Dear Poet, Happy birthday and many more happy returns of the day! 💐💐

ఒక మెలకువలోకి

వర్క్ ఫ్రమ్ హోమ్
లర్న్ ఫ్రమ్ హోమ్
ఇంతింతైన భయానికి,
ఇల్లిల్లూ ఓ బందిఖానా.
మూసివేతలు, మళ్ళింపులూ
మలుపు కొత్తదైనప్పుడు -నెమ్మది
అవసరం, అనివార్యం.
ఇకపై ఉండేవారెవరో,
ఉన్నవాళ్ళని ఊరడించేదెవరో
ఊపిరాడని నిమిషాల కల్లోలం మరపురాక
బ్రతుకంతా తల్లడిల్లేదెవరో
ఇప్పుడైతే ఏం తెలీదు కానీ,
ఇదీ సమసిపోతుంది
అన్ని విపత్తుల్లాగే,
అన్ని యుద్ధాల్లాగే,
ఇదీ ముగిసిపోతుంది.
మూతబడిన స్వేచ్ఛాప్రపంచపు
తలుపులు, మళ్ళీ తెరుస్తాం.
వెలుతురుతో, లోకంతో,
కరచాలనాలు చేస్తాం.
కానీ ఈ ఆపత్సమయాల్లో
దయగా తాకిన పదాలు నేర్పినదేదో
బ్రతుకంతా గుర్తుంచుకోగలమా
అపరిచితుల స్వస్థత కోసం మోకరిల్లి
ఇలా ఇంకెప్పుడైనా ప్రార్ధించగలమా
చూసిన ప్రతి ఉదయానికీ,
చెరగా మారని ప్రతి రాతిరికీ
ఇలాగే కృతజ్ఞులమై ఉండగలమా,
దేహాన్ని హృదయం చేసి
సాటి మనిషి పిలుపునిలా వినగలమా
జాగురూకతతో శుభ్రతతో,
దేశాన్ని మనస్సుని మననివ్వగలమా
సమస్త మానవాళీ ఒకే కాంక్షతో
క్షణాలను దొర్లించడం ఊహించగలమా
నీ నుండి నాకింకా చాలా చాలా కావాలని
జీవితాన్నిలా జాలిగా ప్రాథేయపడగలమా
ముద్దాడకుండా, మాట్లాడకుండా
ప్రేమిస్తున్నామని ఎవరికైనా చెప్పగలమా
మిథ్యాప్రపంచపు రెక్కలు మూసి,
సొంత గూటిలోకి వాలిపొమ్మంటే
అనవసరపు ప్రయాణాలు మాని
ఉన్నచోటే ఉండిపొమ్మంటే,
ఉండగలమా
అన్ని తలుపులూ మూసి
నిండునిజంతోటి
రెపరెపలాడే హృదయం తోటి.
ఇలా, ఇంకెప్పుడైనా..?


* Published in Andhrajyothi, Vividha. 23-Mar-2020

కాటుకపిట్టలు

ఉగాది అని కృష్ణారెడ్డి చిత్రరాజమొకటుంది. రూపాయ్‌పావలా పెట్టి బడి దగ్గర బడ్డీ కొట్లో సినిమాపాటల పుస్తకం కొని పాటలన్నీ బట్టీ కొట్టే రోజుల్లో ఒకనాడీ సినిమా నా కంటపడింది. మంచి కవిత్వమెట్లా ఉంటుందో తెలీని వయసులో, సినిమాపాటల్లో వెదుక్కు చూసుకున్న కవిత్వం పట్ల, నిజానికా రోజుల్లో నాకే ఫిర్యాదులూ ఉండేవి కాదు. "వాసంత సంగీతాలై, వయ్యార సంకేతాలై, తుమ్మెదను పిలిచేటి పూలై.." మొదలు, "వలపులు నీ దరి చేరుటెలా, మోహపు పడవలే చేర్చునులే" వరకూ అట్లా నేర్చిన పదాలెన్నో. ప్రేమించిన పాటలెన్నో.
ఒక సెలవు రోజెప్పుడో తీరి కూర్చుని, పెదాలనెంత సాగదీస్తే కళ్ళు లైలా కళ్ళలా మూతబడతాయో చూద్దామని, తలొంచుకుని పుస్తకంలోకి చూస్తూ "డేడీ...కథ వినవా చెప్తాను.." అని నవ్వుతూ పాడుకుంటున్నాను. ఉన్నట్టుండి తల నా ప్రమేయం లేకుండానే పుస్తకంలోకి దూరిపోయింది. ఏమైందో అర్థమయ్యేసరికి అక్షరాలు నక్షత్రాలయ్యాయి.
"ఆ పాటలో తండ్రి గొంతు ఏమందీ, మీరేమన్నారు..తకిటతకిటథా..." అందామనుకున్నాను కానీ అప్పటికి కింగ్ రిలీజ్ కాలేదు . ఈలోపే పక్క నుండి మా అక్క కొక్కిరింత వినపడేసరికి నా పసిమనసు అతలాకుతలమైపోయి అన్ని మాటలూ మర్చిపోయింది.
ఆయనలా పక్కకు తిరగ్గానే, "నిన్నటి దాకా తెలియని నొప్పి తలెత్తింది డేడీ.." నా తలెత్తి పట్టి రుద్దుతూ పకపకా నవ్విందది. అప్పుడే కాదు, ఆ తర్వాత చాలా రోజుల పాటు, అలవాటు కొద్దీ "ఏం కాదు, నాంగారు నా మాటే వింటారు" అని నేను జట్టు కలపగానే, వెనుక నుండి "ఆఁ ఆఁ వింటారు..బేబీ, చెప్పెయవా వింటానూ.." అని మరీ వింటారు అని వెక్కిరింపుకి దిగేది. నేను మన్నుదిన్న పాములా ముడుచుకుపోయేదాన్ని. అక్కల humiliation చెల్లెళ్ళకు పుట్టినప్పటి నుండి మామూలే. అదేమంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. కానీ ఒకటో తారీఖు సాయంత్రం అమ్మకు బదులు నేను కాఫీ పెట్టేలా ఒప్పించేందుకు, నా ఆస్తంతా నీకే అని నానగారు తీర్మానించేప్పుడూ (అంటే ఎంతా అని ఎవరో రెట్టిస్తున్నారు! ఎంతుంటే అంతా!!), నెలాఖర్లో నా పుస్తకాలు వెదికేసి కొంచం అప్పివ్వు ప్లీజ్, తిరిగిస్తాగా అని నన్ను బతిమాలేందుకొచ్చినప్పుడూ, ఆనాటి అవమానాన్ని గుర్తు చేసి "జస్టిఫై" అని అడుగుతూనే ఉండేదాన్ని. ఆ అడగడంలో ఆ పల్చటి చవకరకం నల్లకాగితాల పాటల పుస్తకాన్ని పారేయకుండా దాచుకునేందుకు ఒప్పించుకున్నాను కూడా. అక్కా, నేనూ కోపాలు కొట్లాటలు లేకుండా సఖ్యంగా మాట్లాడుకునే వయసొచ్చాకా, ఈ పాట ప్రస్తావన వచ్చినప్పుడల్లా, కృష్ణారెడ్డి పాటలకే ఇలా బి.పి లు పెంచేసుకున్నారు, ఇహ వీళ్ళు కృష్ణవంశీ పాటలు వింటే ఏంటి పరిస్థితి అని బాఘా హాశ్చర్యపోయేవాళ్ళం.
అట్లా, నేను వదలకుండా దాచిన ఆ పుస్తకంలో, నన్నొదలని ఇంకో పాట కూడా ఉంది. అది "కాటుకపిట్టల మాదిరి కదిలే కన్నులు రెండు" అన్నది. ఆ పాట విన్నప్పుడల్లా నల్లగా ఉన్న రెండు గువ్వపిట్టలేవో అటూ ఇటూ బుడిబుడిగా నడుస్తున్న ఊహ లోపట మెదిలేది. ఆ పాట సాహిత్యం చూసినప్పుడల్లా, కాటుక పెట్టుకున్న కన్నుల నుండి చిందిపడే వెన్నెల గురించి రాశారనుకునేదాన్ని. "నల్లని కన్నుల వెన్నెల వల నిను అల్లుకోవచ్చు, మాటలకందని మూగసైగలతో మంత్రం వెయ్యచ్చు, నువు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరవచ్చు.." ఇలా సాగుతుందా పాట. ఏళ్ళకేళ్ళు గడిచాక కూడా, కళ్ళ చుట్టూ దట్టంగా కాటుకనలదుకున్న అమ్మాయిలను చూసిన ప్రతిసారీ, "కాటుకపిట్టల మాదిరి.." అన్న కూనిరాగం నా పెదాలనల్లుకుపోయేది.
నిన్నామొన్నటి దాకా ఈ కాటుకపిట్ట అన్నది కాటుక కన్నులను పట్టిన కవి ఊహగా అనుకుంటూ వచ్చిన నాకు, అనుకోకుండా తారసపడిన ఒక పద్యంతో, "కాటుకపిట్ట" అని ఒక బుల్లిపిట్ట నిజంగా ఉందని కొత్తగా తెలిసింది. ఆ పిట్ట తోక పట్టుకు ముందు వెళితే ఇంకా తెలిసిందేమంటే, కొన్ని ప్రాంతాల్లో, శకున శాస్త్రాల్లో, ఈ కాటుకపిట్టను అదృష్టానికి ప్రతీకగా భావిస్తారని. బిసరుహము, అంటే పద్మం మీద వాలిన ఒక్క కాటుకపిట్టను చూసినా, ఆ చూసినవారికి చతురంగబలాధిపత్యం దక్కుతుందట. మహరాజయోగమన్నమాట. సంభోగం కోసం కాటుకపిట్టలు కూడిన చోట, మహానిధులుంటాయని ఒక నమ్మికట.
మామూలుగా కన్నులను మీనులతోటో, పద్మపురేకులతోటో పోల్చడం కద్దు. వాల్మీకి రామాయణంలో రాముడు పంపాతీరంలో వసంతఋతుశోభను చూస్తూ, ఆ వసంతగాలుల ధాటికి తన సీత, పద్మపలాశాక్షి, మృదుపూర్వాభిభాషిణి, ప్రాణాలు తనపై నిలుపుకున్న వివశ, విరహవేదనలో ఏమైపోతుందోనని విలవిల్లాడతాడు. ఆ సరస్సులోని ప్రతి పద్మమూ సీత ముఖాన్ని, వాటి రేకులు ఆమె కన్నులను, అక్కడి చిరుచేపలు ఆమె కనుపాప కదలికలనూ గుర్తుచేస్తున్నాయని సౌమిత్రితో చెప్పుకు బెంగపడతాడు.
కానీ, మొన్న నేను చదివిన పద్యంలో, ఆ ప్రియుడు ఇష్టసఖి ముఖాన్ని పద్మంతో పోల్చడం దగ్గర ఆగలేదు. ఆమెకన్నులను కాటుకపిట్టలన్నాడు. పద్మం మీద వాలిన ఒక్క కాటుకపిట్ట దర్శనానికే రాజభోగం కదా, మరిప్పుడు ఆమె ముఖమనే పద్మం మీద చేరిన పక్షిద్వయాన్ని చూస్తున్నాడు. ఇహ తనకు దొరకనున్న అనంత నిధులేమిటో, అందనున్న భోగభాగ్యాలేమిటో అని ఆత్రపడుతున్నాడీ రసికుడు. ఆమె హృదయసామ్రాజ్యమూ, ఆమె దాచిన గుప్తనిధులు, ఆమె కన్నులను (ల్లోకి..) చూసినంతనే సొంతమవుతాయని కాబోలు ఆశ!!
మహాకవి కాళిదాస పద్యానికి మేళ్ళచెర్పు భానుప్రసాదరావు గారి అందమైన, సరళమైన అనువాదం -
బిసరుహము మీద కాటుకపిట్ట జూడ
కల్గు చతురంగబలమధికంబుగాను
నీ ముఖాంబుజంబున గంటి నేడు నేత్ర
ఖంజన యుగమ్ము నా భాగ్యగరిమ నెరుగ!
కాళిదాస శృంగార తిలకాన్ని అనువదించడంతో పాటు, ఉపయుక్తమైన అన్ని వివరాలతో గొప్ప వ్యాఖ్య కూడా అందించిన వీరి వసంత తిలకాన్ని చదువుతుంటే, ప్రత్యేకించి ఈ పిట్టలను జంటగా చూడాలన్న పై వివరాన్ని చదువుతుండగా స్పురించిన మరో ముచ్చట - పెళ్ళికి ముందు కొన్నాళ్ళు ఒక ఒరియా అమ్మాయితో ఫ్లాట్ షేర్ చేసుకునేదాన్ని. మా ఫ్లాట్ తొమ్మిదో అంతస్తులోనో పదో అంతస్తులోనో ఉండేది. అక్కడి నుండి చూస్తే కింద పచ్చటి తివాచీలా లాన్ కనపడుతూ ఉండేది. ఆ విశాలమైన లాన్‌కి అటువైపు వాకింగ్ ట్రాక్, ఇటువైపు గుండ్రటి సిమెంటు బెంచీల మీద ఫిక్స్ చేసిన కొన్ని కాలక్షేపం ఆటలూ (చైనీస్ చెకర్ లాంటివి..) ఉండేవి. ఆ ఆడుకునేవాళ్ళు తింటుండగా జారిపడినవో, కావాలనే పడేసినవో, ఏవైతేనేం, గడ్డి మీద వాలిన పక్షులు ఆ తినుబండారాల తునకల కోసంకొంచం కొంచంగా గంతులేస్తూ వచ్చి, వాటిని ముక్కుతో ఎత్తుకుపోయి ఇంకెక్కడో కూలబడి తింటూండేవి. నా ఒరియా స్నేహితురాలు పొరబాటున బాల్కనీలోకి వచ్చిందా, ఈ పిట్టల వైపు వెదుక్కుని మరీ చూసేది. రెండూ కనపడితే సరే, ఒకటే కనపడితే మాత్రం సర్వం మరిచినట్టు కిందకి పరుగెత్తేది. ఆ రెండో పిట్టను ఎలాగైనా దొరకబట్టి, దాన్ని తరుముకుంటూ మొదటిపిట్ట దగ్గరకు చేర్చి కానీ ఊరుకునేది కాదు. కాబ్ కోసం ఒక్క నిముషం ముందు దిగాలంటే, ఈ అమ్మాయి పిట్టల వెనుక పడి పోయి ఎక్కడాలస్యం చేస్తుందోనని నాకు ఒకటే గాభరాగా ఉండేది. వాటిని జంటగా చూసి "లక్ ఈజ్ మైన్" అని తన జబ్బ తానే చరుచుకోవడమూ, నేనేమైనా వేళాకోళం మాటనబోతే "కిక్ ఈజ్ యువర్స్" అని నన్నొక్క తన్ను తన్నడమూ అలవాటామెకు. ఉత్తపుణ్యానికి వచ్చి పడే నిధుల మీద నాకాశ లేదు కానీ, పిట్టలను జతచేర్చడంలో నా స్నేహితురాలి సంబరం దానికదే చూడముచ్చటగా ఉండేది. ఏనాటి కవిత్వంలోనో ఇంత సౌందర్యభరితంగా మెరిసిన ఒక నమ్మకం, ఈనాటికీ మిగిలుంది అని గుర్తు చేసుకుంటే - అంతే కదా, కవిత్వమంటే పదసంపదేనా, కవి సంస్కారమూ, కవి బ్రతికిన దేశపు సంస్కృతీ కూడా అనిపించి చిన్న గగుర్పాటు. కవులేం పరాయులా, వాళ్ళు మనవాళ్ళు.

Still I Rise - Maya Angelou కవిత

Still I Rise అనే ఈ Maya Angelou కవితను Women's Day రాగానే రకరకాలా platformsలో చూస్తూ ఉంటాను. కొన్ని అనువాదాలూ చూశాను. సెరీనా విలియమ్స్ లాంటి వాళ్ళు చెప్పడం కూడా విన్నాను.
కవితలు రాయడం లాగే, చదవడం కూడా కళ. కొన్ని కవితలు కవుల గొంతుల్లో వింటే, మనం చదివినప్పుడు ఊహించుకున్న సౌందర్యమేదో ఆవిర్లుగా కరిగిపోతున్నట్టు ఉంటుంది. మన విరుపుల్లో మనకు దక్కిందేదో చేజారిపోయినట్టు ఉంటుంది. ఆ కవిత చదువుతుండగా మన చుట్టూ నిర్మితమైన ప్రపంచమేదో తటాలున విరిగిపోయినట్టవుతుంది.
కానీ, ఈ కవితను, and still I rise అన్న మాయా కవితను ఆమె గొంతులో విన్నప్పుడు కలిగిన సంతోషం మాత్రం మాటల్లో పెట్టలేనిదైపోతోంది. ఆమె నవ్వుకా, నిర్లక్ష్యానికా, "and i dance like I have got diamonds at the meeting of my thighs" అంటూ చిటికలేస్తూ తూగిన వయ్యారానికా, నా అందం, ఆత్మవిశ్వాసం నీకెంత కంటగింపైనా నేనింతేనని నవ్వుతూ చెప్పిన ధైర్యానికా, నమ్మకానికా - తెలీదు. దేనికి దాసోహమన్నానో తెలీదు.
నేను చదివిన మాయా కవితలన్నింటిలోనూ కట్టిపడేసే నిర్మాణం ఉంటుంది. చాలా కవితల్లో దొరికే hook వల్ల కావచ్చు, ఆమె కవితలు తేలిగ్గా దొరికినట్టు అనిపిస్తాయ్, ప్రయత్నమేం లేకుండానే మనని తేలిగ్గా దగ్గరకు లాక్కుంటున్నట్టుంటాయ్. బహుశా అందుకే తేలిగ్గా అనువాదానికీ లొంగుతాయనిపిస్తాయేమో. కానీ, ఆమె కవితల spirit అందుకోవడానికి మాత్రం అదేం పెద్ద సాయపడదు. అన్ని మంచి కవితల్లానే ఒకటికి పదిసార్లు చదవాల్సిందే.
ఆమె ఒక సింగర్, పర్ఫార్మర్ కూడా అయి ఉండటం ఈ కవిత చదవడానికి ప్రత్యేకంగా లాభించిందని కూడా అనుకోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే, ఆమె రాసిన దాంట్లోనే ఆ అందమంతా ఉంది. అది చదివినప్పుడు మనం wow అనుకోం, అంతకు మించి, ఒక కేరింత తోడిగా తుళ్ళిపడతాం. ఆ లెక్కలేనితనం కానీ, `ఇప్పుడెలా మరి?` అని రెచ్చగొట్టే కవ్వింపు ధోరణి గానీ అనువాదాల్లో కనపడవు. దీన్ని ఈమెలా ఇంకెవ్వరూ మనకు చెప్పలేరు. మాయా! ఇది ఎప్పటికీ నీ కవిత!

1) ఈ వీడియో ఒకసారి మాత్రమే చూసి ఆపలేకపోవడం నాకొక్కదానికేనా?
2) ఈవిడ గొంతు మెరుపుకలలు సినిమాలో మదర్ గొంతులా ఉందనిపించడం నాకొక్కదానికేనా? )

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....