మరో తోటలోకి...


మెలకువొచ్చేసరికి ఈ తోటలో..

నాలుగు దారులు, నాలుగు కూడళ్ళు.
 
ఏ దారిలో ఏ పూవులెదురొస్తాయో
ముందే తెలిసిన వాళ్ళెవరుంటారనీ?
ఏమీ వెంటతేని చేతులకూ ఆశలెందుకో
ఏనాడెవరాలోచించారనీ?
 
దారులు,మలుపులు..
దాహాలూ మోహాలూ
దోసిట్లో అయాచితంగా..
రాసుల్లా రాలిపడే బహుమానాలు.
 
పరుచుకునే చీకట్లలో మసకబారే మార్గాల్లో
వెంపర్లాట దోచుకున్నది సమయమొకటేనా?
బరువెత్తే భుజాల్తో సాగిపోయే ప్రయాణాల్లో
గాడిద కూలిపోయేదా గడ్డిపోచ బరువుకేనా?
 
మూసిన గుప్పెళ్ళని వదిలేయడమో
మూతలు తెరవని సంచీలిక విసిరేయడమో
తప్పనిసరి నడక కదా,
ఇప్పుడే ఇక్కడే తేలాలి, తేలికపడాలి.
 
ఆఖరు అడుగు పడే వేళకి
అమృతపు చుక్కొక్కటి దొరికినా...
మళ్ళీ రానీ తోటలోకి.


 ****************************

"రంజాన్ చంద్రుడు"

విజయవాడలో మొదటి నుండీ సందడికొచ్చిన లోటేమీ ఉండేది కాదు. అటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనో, ఘంటసాల సంగీత కళాశాలలోనో, బందరు రోడ్డులోని టాగోర్ లైబ్రరీలోనో..ఎప్పుడూ ఏవో సంగీత సాహిత్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉండేవి. ఇంజనీరింగ్ రెండో ఏడో..మూడో ఏడో...,వయసు "మరోప్రస్థానాని"కీ, మనసు "అమృతం కురిసిన రాత్రి"కీ ఓటేస్తున్న సంధికాలం. జావాలూ, "సి" నోట్సులూ గీతాంజలి కవితలతో నిండిపోయి లోకమంతటినీ కొత్తగా చూపెట్టిన కాలం. రోజూ వీచే గాలీ, ప్రతి రోజూ కనపడే సూర్యాస్తమయాలూ,  పొద్దున నవ్వి రాత్రికే వాడి నేల ఒడి చేరే పూవులూ...అన్నింటిలోనూ అందాకా తెలియని సౌందర్యాన్ని దర్శించిన రోజులవి. సహజంగానే కవిసమ్మేళనాలంటే కలిగిన ఆసక్తితో, ఒకరోజు స్నేహితురాలిని వెంటేసుకుని, ఒక సభకు వెళ్ళాను. వెళ్ళే దాకా బానే ఉన్నాను కానీ, వెళ్ళాక ఆ వాతావరణం అదీ చూస్తే గుబులుగా అనిపించింది. నిర్వాహకులు "రంజాన్ చంద్రుడు" అనే శీర్షిక మీద కవితలు వ్రాయమన్నారుట. చాలా మంది కవులు కవితలు వ్రాసుకు తీసుకు వచ్చారు. నేనేమీ వ్రాయనే లేదూ...పోనీ వెళ్ళిపోదామా అనుకుంటూనే తటపటాయిస్తూ ఉండిపోయాను. ఒక్కొక్కరూ వెళ్ళి, తమ కవితలు చదివి వినిపిస్తూండగా...ఒక మధ్య వయసు వ్యక్తి హడావుడిగా వచ్చి నా పక్కన కూర్చున్నారు. "చాలా సేపయిందా మొదలయ్యీ?" వినపడీ వినపడకుండా అడిగారు. "లేదండీ, ఇప్పుడే, ఓ పది నిముషాలైందేమో.." తలతిప్పకుండా బదులిచ్చి మళ్ళీ కవితలు వినడంలో మునిగిపోయాను. మరో ఐదారుగురు చదివాక, నా పక్కన కూర్చున్న వ్యక్తి స్టేజీ మీదకు వెళ్ళి తన కవిత చదవడం మొదలెట్టారు.  ఆయన గొంతు..ఆ పలుకుల్లో మెత్తదనం....ఆ కవిత, ఆ ఎత్తుగడ, వాడిన పదాలు..ముగింపూ....ఆయనలా చదువుతుంటే నేనొక కొత్త లోకానికి వెళ్ళిపోయాను. మనసంతా పట్టరాని ఆనందం.

అద్దేపల్లి కవిత్వం - "కాలం మీద సంతకం"

( అద్దేపల్లి కవిత్వ సంపుటిపై చిరు పరిచయ వ్యాసం; తొలి ప్రచురణ సారంగ వార పత్రికలో..) 

సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతున్న అనేకానేక పరిణామాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య, విమర్శనాత్మక కవితా బాణాల సంపుటి - "కాలం మీద సంతకం". అద్దేపల్లి కవిగా కంటే విమర్శకులుగా, అద్భుతమైన వ్యాసకర్తగానే నాకెక్కువ పరిచయం. పత్రికల్లో చదివిన వారి సాహిత్య వ్యాసాలు, "సాహిత్య సమీక్ష" వంటి పుస్తకాలు, "మా నాయిన" లాంటి ఎన్నో కవితా సంపుటాలకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వ్రాసిన ముందు మాటలూ, ఈయన కవిత్వం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయి.

మూఢత్వం మూలంగా నిస్తేజంగా మారిన జనజీవితాల్లోకి వెలుగు రేఖలను ప్రసరింపజేయడమే అభ్యుదయ కవుల లక్షణం. భారతీయ సాహిత్యానికి సంబంధించి, 1935వ సంవత్సరంలో భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అలహాబాదులో ఏర్పాటు చేయబడింది. 1936 ఏప్రిలులో ప్రసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన ప్రథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ లక్నోలో జరిగింది.  అదే సంవత్సరం సెప్టంబరులో ఈ కవి జన్మించాడు. అద్దేపల్లి 1960లలో కవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టారూ అనుకుంటే, అప్పటికి రాష్ట్రంలో అభ్యుదయ కవిత్వోద్యమ తీవ్రత మెల్లిగా సన్నగిల్లి, దిగంబర కవిత్వం ఉద్యమంగా మారుతోంది. (1965 లో దిగంబర కవులు తమ తొలి సంకలనాన్ని విడుదల చేశారు). 70-80 విప్లవ కవిత్వమూ, 80 తరువాత అనుభూతివాదమూ, మినీకవితలూ ఇతరత్రా జోరందుకున్నాయి. ఇన్ని ఉద్యమాలనూ దగ్గరి నుండీ గమనిస్తూ కూడా, అద్దేపల్లి కవిత్వం తొలినాళ్ళలో వ్రాసిన "అంతర్జ్వాల" మొదలుకుని, ఈనాటి "కాలం మీద సంతకం" వరకూ, శైలి-శిల్పంపరంగా అనివార్యమైన భేదాలు, అభివ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే పరిణతీ మినహాయిస్తే, మొత్తంగా అభ్యుదయ కవిత్వ ధోరణిలోనే సాగడం విశేషం.  "సమాజంలో ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు ప్రథానంగా ఉన్నంతకాలం అభ్యుదయ కవిత్వం ప్రథాన కవితా ధోరణిగా ఉండక తప్పదు" అని ఉద్ఘాటించిన ఈ కవి, దశాబ్దాలు దాటినా ఆ మాట మీదే నిలబడి కవిత్వ సృజన చేయడం ఆసక్తికరం.  నమ్మిన కవిత్వోద్యమం పట్ల ఈ కవికున్న నిబద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం. 

బేలూరు-హళేబీడు-చిక్కమగలూర్

కొన్ని ప్రాంతాలకు వెళ్ళడమంటే స్మృతుల తీగలను పట్టి ఊయలలూగడం. మన కలల మాలికలో నుండి రాలిపడ్డ పూలన్నీ దోసిలి ఒగ్గి ఏరుకోవడం.

హోయసలుల శిల్పకళారీతులకు కాణాచిగా పేరొందిన బేలూరు-హళేబీడులను చూడటం నాకు అచ్చంగా అలాంటి అనుభవమే మిగిల్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం, కొత్తగా పరిచయమైన మిత్రులతో కలిసి ఈ ప్రాంతాలన్నీ తిరిగి తిరిగి ఎంత మైమరచిపోయామో. అప్పుడు మేము తీసుకున్న ఫొటోల రీలులో ఏదో ఇబ్బంది రావడంతో, ఒక్క ఫొటో కూడా రాక, అన్ని గుర్తులూ చెరిగిపోయాయి (అప్పట్లో డిజి కెమెరాలు లేవు మా దగ్గర). ఓ గొప్ప చారిత్రక ప్రదేశం తాలూకు జ్ఞాపకాలను మాకు మిగలకుండా చేసాడని, కెమెరా తెచ్చిన నేస్తాన్ని మైసూర్‌లో ఉన్నంతకాలమూ మాటలతో హింసించేవాళ్ళం . అది మొదలూ మళ్ళీ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలనీ, కెమెరా కళ్ళతో కూడా ఆ అందాలను బంధించాలని నాకో కోరిక అలా మిగిలిపోయింది. మొన్న అనుకోకుండా మా వారి మేనత్త వాళ్ళు బెంగళూరు రావడంతో బేలూరు-హళేబీడు- చిక్కమగలూర్ వెళితే బాగుంటుందనిపించింది.     

నాలుగు గంటలకల్లా ఇంటి నుండి బయలుదేరాలని గట్టిగా తీర్మానించుకున్నాం.  ఈ తెల్లవారుఝాము చలిగాలుల్లో మొదలయ్యే ప్రయాణాల్లో ఓ గమ్మత్తైన మజా ఉంటుంది - నాకు వాటి మీద ఓ ప్రత్యేకమైన మోజు. షరామామూలుగా ఆరు గంటల దాకా మా వీధి మలుపు కూడా తిరగలేకపోయాం. సర్జాపూర్ నుండి బయలుదేరి హళేబీడు చేరేసరికి 10:30 అయిపోయింది. అక్కడ అడుగుపెడుతూండగానే మనమొక మహా సౌందర్యాన్ని కొన్ని క్షణాల్లో దర్శించబోతున్నామని తెలుస్తూ ఉంటుంది. నక్షత్రాకారంలో ఉన్న ఎత్తరుగు మీద ఠీవిగా కనపడే నిర్మాణం, అల్లంత దూరం నుండే మనసులను పట్టి లాగేస్తుంది. మహాలయ నిర్మాతలకు కేవలం శిల్ప పారీణత ఉంటే సరిపోదు, అంతకు మించినదేదో కావాలి. ఒక్కొక్క ఉలి తాకుకూ ఒక్కొక్క కవళిక మార్చుకుంటున్నట్లున్న శిల్పాలతో సందర్శకులను రంజింపజేయడానికి ఆ శిల్పులు ఎన్నెన్ని రాత్రులు నిద్రకు దూరంగా గడిపి ఉంటారో అన్న ఆలోచనే మననొక ఉద్వేగపూరిత లోకంలోకి నెట్టేస్తుంది. వాళ్ళు విశ్వకర్మను గుండెల్లో నింపుకు అహరహం ధ్యానించి ఉంటారు. నృత్యశాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ తిరగేసి ఉంటారు. శిలల్లో సంగీతాన్ని పలికించగల విద్యను ఏనాడో ఏ జన్మలోనో అభ్యసించి ఉంటారు. ఆ శిల్పులు, బహుశా భావుకులై ఉంటారు, ఒంటరులై ఆ కొలను ఒడ్డున కూర్చుని వ్రాసుకున్న కవిత్వాన్నే, మళ్ళీ శిలల్లో చెక్కి ఉంటారు.   

ఆ శిలలు ? 
వాటిని రాళ్ళనడానికి మనసొస్తుందా ఏనాటికైనా? రాతిలో అన్ని వందల మెలికలు మెరుపులు చూపించడం సాధ్యమవుతుందా ఏ సామాన్యుడకైనా? అది నవనీతమో మధూచ్ఛిష్టమో అయి ఉండాలి. అక్కడున్న స్త్రీమూర్తులందరూ గంధర్వలోకం నుండి శాపవశాత్తూ భూమి మీదకు వచ్చి శిలలైపోయుండాలి. ఎన్ని గంధపు చెక్కల్ని చుక్కల్లా మారేదాకా అరగదీసి శిలలను పరీక్షించి ఉంటారో కానీ, ఏ పసరులతో ఇనుపగుండ్లతో వాటికి ఒరిపిడి పెడుతూ రుద్దారో కానీ, ఈనాటికీ అన్ని విగ్రహాలూ నున్నటి నునుపుతో నలుపుతో నిగనిగలాడుతూంటాయి. హళేబీడులో పక్కన నీలాకాశాన్ని నిండుగా ప్రతిబింబిస్తోందే...ఆ కొలనులోనే అరగదీసిన గంధాన్ని ఒండ్రుమట్టిలా నింపి శిలలను ఒకటికి పదిసార్లు పరీక్షించారేమో!  లేదూ, ఆ కళాకారులంతా పగలల్లా పని చేసి రాత్రి ఆ నీటి ఒడ్డున పడుకుని ఆకాశంలోకి చూస్తూ, కనపడ్డ నక్షత్రాలకు లెక్కలు కట్టి, మర్నాడు అన్ని మెలికలతో జిలుగులతో కొత్త శిల్పాన్ని సృజించాలని కలగనేవారేమో!  ఇటువంటి ప్రేరణ ఏదీ లేకుండా, ఆ గర్భగుడి ముఖద్వారం, నంది భృంగి విగ్రహాలూ, ఆలయం లోపలి భాగంలో కనపడే పైకప్పుల్లోని సౌందర్యం అంత అద్భుతంగా చెక్కడం ఎలా సాధ్యం?!  

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...