సత్యశోధకుడు గాంధి

గాంధి అన్నది ఇప్పుడు మనలో చాలా మందికి అతి సామాన్యమైన పేరు. మనం వినీ వినీ చలించకుండా పోయిన పేరు. మన ఊరిలో ఏ ప్రత్యేకతా లేని ఓ వీధి పేరు. మనం నిర్లక్ష్యంగా పారేసే రూపాయి నోటు మీది బొమ్మ పేరు. ఓ భగత్సింగ్ పేరు వింటే వెన్ను నిటారుగా అయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు, గాంధి పేరు చెబితే ఎప్పుడూ నాలో స్పందన కలిగేది కాదు. భగత్‌సింగ్ తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసిన రోజు “ ‘విప్లవమంటే భగత్‌సింగ్’ అని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చనిపోకపోయినా జీవితకాలంలో ఏ క్షణమైనా సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు దానిని వ్యక్తికి ఆపాదించరు. విప్లవ సిద్ధాంతానికి ఆపాదించి నిరసిస్తారు. కొన్ని వేల గుండెల్లో స్పూర్తిని నింపుతున్నాననుకుంటూ, నవ్వుతూ మరణించగలను” అన్న మాటలను, పసితనంలో అమాయకత్వంతో కురిసిన కన్నీళ్ళతోనూ, యవ్వనంలో ఆవేశంతోనూ, అటుపైన ఆ మాటల్లోని లోతైన భావానికి చలించి కృతజ్ఞతతోనూ కొనియాడినట్టు, గాంధిని మనస్పూర్తిగా అభినందించిన క్షణాలు నా జీవితంలో లేనేలేవు… “సత్యశోధన” పుస్తకం నా చేతుల్లో పడేవరకూ. అది కూడా ఎప్పుడు? మన లోలోపలి పేరుపెట్టలేని వేదనో వెలితో లేదా సందిగ్దతో మనను నలిబిలి చేస్తూన్నప్పుడు, ఓ అనుమానమో అవమానమో మనసును పట్టి కుదిపేస్తున్నప్పుడు, ఈ అనుభవాల నుండి ఏనాటికైనా బయటపడే మార్గముందా అని అడిగేందుకు కూడా మరొకరెవ్వరూ కనపడనప్పుడు, కనపడ్డా అడగాలని అనిపించనప్పుడు, ఇదుగో, ఈ సత్యశోధన లాంటి పుస్తకమొక్కటి మళ్ళీ మనని నిబ్బరంగా నిలబెట్టగలదు అనిపించింది.

పద్ధతిగా బ్రతకడమంటే పర్వర్షన్, ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించడం తమని తాము మోసం చేసుకోవడం; వ్యాయామం చేయడమంటే అనారోగ్యం కలిగి ఉండటం; దేవుణ్ణి నమ్మడమంటే పాపం చేసి ఉండటం; జీవితకాలపు సహచరుడి కోసం అలవాట్లు మార్చుకోవడమంటే పతివ్రతలా నటిస్తూ లోపల ఏడవటం; సంస్కారం మాయముసుగు; సంతోషం నటన; ఉద్యోగం అవసరం; ప్రేమ బలహీనత; మంచితనం మూర్ఖత్వం – ఈ రోజు మన చుట్టూ స్వేచ్ఛగా చలామణీ అవుతున్న ఈ నిర్వచనాలన్నీ చూస్తూ చూస్తూ, సత్యాన్ని శోధిస్తూ ఓ మనిషి తన జీవితంలోని ప్రతి తప్పుని అంగీకరిస్తూ దాన్ని దాటి వచ్చిన వైనాన్ని జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తూ విప్పి చెప్పాడంటే ఎంత ఆశ్చర్యమో! అసత్యం నుండి సత్యం వైపూ, భోగాల నుండి సరళజీవిత విధానం వైపు, ఆవేశం నుండీ ఉద్వేగం నుండీ సౌమ్యత వైపూ స్థితప్రజ్ఞత వైపూ జీవితపు చివరి క్షణాల వరకూ ప్రయత్నపూర్వకంగా ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళ్ళిన ఒక మహాత్ముడు, ఇక్కడే, ఈ నేల మీదే తిరిగాడంటే నమ్మశక్యం కాని కల్పనలానే అనిపించింది. రాజకీయంగా అతనేమిటో ఈ పుస్తకంలో నాకు దొరకలేదు. ఆ మరకలు తుడిపే ఆసక్తీ నాకు లేదు. కానీ, ఒక్క రామ మంత్రాన్ని నమ్ముకుని బ్రతుకుని పండించుకున్న మనిషి అందించగల స్పూర్తి ఇంతింతని మాత్రం చెప్పనలవి కాదు. తనకు తానే నియమాలు విధించుకునీ, తనను తానే కష్టపెట్టుకుని, సత్యంతో ప్రయోగాలంటూ తనకు మాత్రమే తెలిసిన, తెలియాల్సిన కోణాలను చూసే ఆసక్తి ఉన్నంతమందికీ చెప్పుకుని… ఏం సాధించాడయ్యా ఈ బక్కపల్చని మనిషీ అంటే… అందుకూ సమాధానమూ ఆ బ్రతుకు పుస్తకపు చివరి పుటలో దొరికింది నాకు. అజామిళోపాఖ్యానము చదివిన వారెవ్వరికైనా ఆఖరు క్షణాల్లో రామనామ స్మరణ ఎంత గొప్ప వరమో, ఎంత పుణ్యఫలమో అర్థం కాకపోదు.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....