చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలు

నాకెందుకో మొదటి నుండీ విషాదాంతాలయ్యే కథలంటే తెలియని వెగటు.

ఏ కారణం చేతనైనా ఒక పుస్తకంలోనో, సినిమాలోనో చివరకు చెడు గెలవటాన్ని చూపించినా, మంచితనమో - నిస్సహాయతో శాపాలుగా మారి కథలోని ఏ పాత్రనో కబళించడం జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోలేక విలవిల్లాడతాను.

చిన్నప్పుడు అమ్మ/అమ్మమ్మ దగ్గర 'ఆవు-పులీ' కథ విన్న నాటి నుండీ ఈ నాటి దాకా నా ఆలోచనల్లో పెద్ద మార్పేమీ లేదనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే నేను చదవకుండా వదిలేసిన పుస్తకాలు, చూడకుండా తప్పించుకు తిరిగిన సినిమాలూ బోలెడున్నాయి. అయితే ఇటీవల రచనా వ్యాసంగం మీద నాకున్న ఆసక్తిని గమనించిన శ్రేయోభిలాషులు కొందరు మాత్రం, నా ఈ తత్వం కొన్ని మంచి కథలకు దూరం చెయ్యగలదని హెచ్చరించాక, అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రచనను కేవలం రచనగానూ, పాత్రల్లో కలిగే సంచలనం పాఠకుల్లో కలిగించే భావోద్వేగం రచయిత నేర్పుగానూ చూడాలని నిర్ణయించుకున్నాను. అతిగానూ, అనవసరంగానూ స్పందించడం నన్ను ఆదర్శ పాఠకురాలిని కాకుండా చేసి, రచనలను అనుభూతి చెందటం నుండి రెక్క పట్టుకు దూరం లాగుతోందన్న సందేహం కలగడమూ, నాలోని మార్పుకు కొంత కారణం.

ఇలా మార్పు ఒళ్ళో కుదురుకుంటున్న కొద్ది రోజులకే "బ్రాహ్మణీకం" నా చేతుల్లో పడటం కేవలం యాదృఛ్ఛికం!

బ్రాహ్మణీకం, నన్నడిగితే, లెక్కలేనన్ని స్త్రీ హృదయాలని, ఒక్క పాత్రలో చూపించిన విషాదం!
మంచితనానికీ, జాలికీ, సహనానికీ హద్దులు తెలుసుకోలేని అమాయకత్వం జీవితాన్ని కొండచిలువలా మింగేస్తుంటే, ఉక్కిరిబిక్కిరి అవ్వడమే తప్ప ప్రతిఘటించలేని స్త్రీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే కథ.

ఇల్లు తప్ప బయట ప్రపంచం ఎఱుగని ఒక ఆడపిల్లకు పెళ్ళి. మేడ పైని గదిలో, బయట ప్రపంచానికి ప్రవేశం లేకుండా తలుపులు మూసేసి, ఆమె సౌందర్యంతో పిచ్చి వాడైన భర్త పగలూ-రాత్రీ బేధం లేకుండా, రెండేళ్ళ పాటు సాగించిన సంసారం, చివరికి అతని ఆరోగ్యం చెడిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేడ దిగుతుంది.

అనారోగ్యంలోనూ భార్యను విడలేని వెర్రి మోహమా భర్తది. తల్లిదండ్రులూ, అత్తమామలూ వారిద్దరినీ విడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఆఖరుకు, భర్తకు జాతకరీత్యా ఉన్న ఆయుస్షు అంతే కనుక, తదనుగుణంగా చివరి ఘడియల్లో భర్త మనసుకు ఉల్లాశం కల్పించడమే మెఱుగన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.

చేసేదేమీ లేక వాళ్ళ ప్రాప్తానికి వాళ్ళని వదిలేస్తారందరూ.

భర్త చనిపోతాడు. అతనికి ఆస్థి ఉందని తెలిసినా, ఎలా రాబట్టుకోవాలో తెలీనితనం! భర్త చనిపోయాక ఎవరి పంచకు చేరాలో, ఎవరు ఆశ్రయం ఇవ్వగలరో, ఎవరిని అడగాలో తెలియని బిడియం!

ఈ లోపు తండ్రీ చనిపోతాడు. దిక్కు లేకుండా పోయిన తల్లీ కూతుళ్ళ సంగతీ తెలుసుకున్న మేనమామ, వారిద్దరికీ ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అలా వారింటికి ప్రయాణమవుతారు. దారిలో ప్రయాణం పొడుగునా వీళ్ళ వ్యవహార శైలిని చలం వర్ణించిన తీరు చదివి తీరాల్సిందే! ఇతర కులాల వారితోనూ, వర్గాల వారితోనూ సాగిన సంభాషణల్లో అగ్ర వర్ణాల వారి ఆలోచనల గురించి విసిరిన వ్యంగ్యోక్తులు మనకి తెలీకుండానే పెదవుల చివరల నవ్వులు పూసేలా చేస్తాయి.

ఇహ నా దృష్టిలో అసలు కథ మొదలయ్యేది సుందరమ్మ వీళ్లింటికి వెళ్ళాకనే! అక్కడ ఈమె పాలిటి శాపంలా ఒక సంగీతం మాష్టారు(చంద్రశేఖరం) తయారవుతాడు. అతనికి సుందరమ్మ అందం మీద వ్యామోహం! ఆమె కళ్ళల్లో కనపడే మెరుపు రహస్యాలు తెలుసుకోవాలనే ఉబలాటం!

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీ అన్న గౌరవమూ, ఆమె వైధవ్యం పట్ల జాలీ ఉన్నా, వాటిని మించిన మోహమే, ఆమె సౌందర్యం పట్ల తెలియని వ్యామోహమే ఆమెపై అతని ఆసక్తికి తొలి బీజం వేస్తుంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు అతడి ప్రయత్నాలు ఏహ్య భావాన్ని కలిగిస్తాయి. అలాగే, ఆత్మ విశ్వాసం, ధైర్యం లేని సగటు స్త్రీ మాటల్లో, పురుషుడు ఆహ్వానాన్ని ఎలా వెదుక్కుంటాడో, దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను ఎలా మభ్యపరుస్తాడో, చలం మాటల్లో చదవడం బాగుంటుంది.

ఆమె అమాయకత్వం మీద మొదట్లో మనకున్న సహృద్భావం కథ నడిచే కొద్దీ చిరాగ్గా మారుతుంది. మంచితనం, విషవలయంలోకి తీసుకుపోతోంటే మౌనంగా అనుసరిస్తున్న ఆమెను వెనక్కు లాగేందుకు, కథలో మనకీ ఒక పాత్రుంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

ఒకానొక రాత్రి సదరు చంద్రశేఖరం అతనికి కావల్సినదేదో దక్కించనే దక్కించుకుంటాడు. సుందరమ్మ గర్భవతి అవుతుంది. వితంతు బ్రాహ్మణురాలైన ఆమెకు ఇది మహాపరాధంలా తోస్తుంది. ఆమె భర్త గుర్తొస్తాడు. ఆచారాలతో, సాంప్రదాయాలతో అగ్ని లాంటి స్వఛ్ఛతతో గడచిన తన గతం గుర్తొస్తుంది. అంత క్రితం అతను పలు పర్యాయాల్లో కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు, చనిపోతానని అంటూ మొసలి కన్నీరు కార్చినప్పుడు, అతనికి సర్దిచెప్పే ప్రయత్నంలో వలలో పడిన సుందరమ్మకు, ఈ సంఘటన తర్వాత, ఆ కాస్త జాలీ కరిగిపోయి అసహ్యమే మిగులుతుంది.

మేనమామ చంద్రశేఖరాన్ని మెడలు వంచి పెళ్ళికి ఒప్పించడంతో, వివాహమవుతుంది. అయితే ఈ శేఖరానికి వితంతువుని పెళ్ళి చేసుకోవడం మింగుడు పడదు. అతనికి ఇలాంటి ఖర్మ పట్టినందుకు చింతిస్తూ ఉంటాడు. ఆమె మీద అందాకా ఉన్న మోజూ కనపడదు, గుదిబండన్న అభిప్రాయం తప్ప. మరో పక్క సుందరమ్మ వీటన్నింటి పట్లా నిర్వికారంగా ఉంటుంది.

బిడ్డ పుడతాడు. ఎవరి ఆసరా లేకుండా బిడ్డను పెంచడమెట్లానో సుందరమ్మకు తెలీదు. చెప్పేందుకు ఎవ్వరూ ఉండరు. ఇరుగు పొరుగూ ఈమె పట్ల మర్యాదగా వ్యవహరించరు. వీటన్నింటి వల్లా సుందరమ్మకు జీవితం పట్ల చెప్పలేని నైరాశ్యం కమ్ముకుంటుంది. పిల్లవాడికి జబ్బు చేస్తే తన పాప ఫలమని భ్రమిస్తూ ఉంటుంది. ఒక దేవతకు మొక్కు తీర్చుకుందుకు ప్రయత్నించబోగా, భర్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మరింత బెంగలో కూరుకుపోతుంది.

చివరకు, అనారోగ్యంతో ఆ బిడ్డ పరిస్థితి తీవ్రతరం అవ్వడమూ, విధిలేని పరిస్థితుల్లో మందుల షాపు వెదుక్కుంటూ వొంటరిగా వెళ్ళిన ఆమెకు, ధనం తక్కువవ్వడమూ జరుగుతాయి.

దగ్గర్లోని వ్యక్తిని అర్ధించగా, ఆ క్షణం దాకా మంచివాడుగా ఉన్నవాడు కాస్తా, ఆమె బ్రాహ్మణ వంశానికి చెందినదని తెలియడంతో, చిన్ననాటి వెర్రి పగ ఒకటి జ్ఞప్తికొస్తుంది అతగాడికి.

ఈ పిచ్చిపిల్ల మరో సారి మోసపోయి అది భరించే శక్తి లేక కన్ను మూయడంతో కథ ముగుస్తుంది.

*****************************

చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే రచయితకైనా, ఆ మాటకొస్తే అసలు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా!

రచన ఆసాంతం చలం ఆమె మానసిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరించాడు. రచనలో పెద్దగా వివరణలు గట్రా కనపడవు. ఆమె ఎందుకిట్లా చేస్తున్నదో తెర వెనుక నుండి ఎవ్వరూ చెప్పరు. రచయిత మధ్య మధ్యలో చొరబడి కథను నడిపించడమూ చూడము. కథ మొత్తం సుందరమ్మదే! చంద్రశేఖరంతో ఆమె చెప్పే నాలుగు ముక్కలే ఆమె తెలివికీ, ఆలోచనలకీ, ఆమె మంచితనానికీ, తేలిగ్గా మోసపోగల తత్వానికి ప్రతీకలని పాఠకులకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న వాక్యాలలోనే అనాదిగా కొందరు పురుషులు స్త్రీలోని యే కోణాన్ని, ఏ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసే ధైర్యం చేస్తారో చెప్పేశాడు చలం!

జీవితాలను మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకుని సగర్వంగా జీవించడానికి, మనోనిబ్బరంతో పాటు కాస్తంత లోకజ్ఞానం ఉంటే చాలేమో అని అనిపిస్తుంది బ్రాహ్మణీకం చదివితే ! ఆ కాలానికీ ఈ కాలానికీ మధ్య దశాబ్దాల దూరం ఉన్నా, ఇలాంటి వార్తలు అడపా దడపా ఈనాటికీ వింటూనే ఉన్నాం కనుక, ఆ బలహీనతల నుండి బయటపడే గుణం అందరికీ కలగాలనీ కోరుకోవాలి మనం!

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...