Showing posts with label * పుస్తక పఠనానుభవాలు. Show all posts
Showing posts with label * పుస్తక పఠనానుభవాలు. Show all posts

రాగసాధిక

 ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్లలా నేనూ వస్తానని వెంటపడ్డాను. ఒకట్రెండు రోజులు రావాలంటే, ముందు పది రోజుల కోర్స్ పూర్తి చెయ్యాలన్నాడు.

వెబ్‌సైట్‌లో ఒక టిక్ మార్క్ కొట్టడమే కదా...అయిపోయిందని చెప్పి enroll చేసుకోనా అంటే తను చూసిన చూపు నాకిప్పటికీ గుర్తే.
"అబద్దాలు ఆడకూడదన్నది విపస్సన మొదటి నియమాల్లో ఒకటి. నువ్వు మొదలే కాని పని చేసి అక్కడకొస్తే, ఇంకేం నేర్చుకుంటావ్?" అన్నాడు. ఎప్పటిలాగే ఒక్కడూ వెళ్ళిపోయాడు.
తన నింపాదితనానికీ, మిన్ను విరిగి మీద పడుతోన్నా, ఏం కాదులెమ్మని నా వెన్ను నిమిరి తనిచ్చే భరోసాకి విపస్సన ఒక రహస్యమైన కారణం అనుకుంటాను కనుక, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి అని నాదో కుతూహలంతో కూడిన కోరిక. పది రోజులంటే అయ్యే పనేనా అని ఆగిపోతాను ఎప్పుడూ.
*
"మనుషులు కావాలి మనుషులు..." అని తపించినట్లుండే జాజిమల్లి గారు పది రోజులు అన్నీ విడిచి విపస్సన కి వెళ్ళారని చదవగానే నా ఆశ్చర్యానికి హద్దే లేదు. అనుకున్నపని చెయ్యడంలో ఆమె పట్టుదలను ఊహించగలను కానీ, అక్కడి నియమాలు తెలిసినదానిగా, ఎందుకు వెళ్ళాలనిపించిందో తెలుసుకోవాలనీ, పోనీ, వెళ్ళాక వారి అనుభవాలు, పాఠాలు ఎలాంటివై ఉంటాయో చూడాలనీ నాకు మరీ మరీ అనిపించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న స్నేహితులు పడుకున్నాక, ఉండబట్టలేక పుస్తకం చదివేశాను.
**
ఎప్పుడూ చదవకూడదదు అనిపించే కరోనా కాలంలోని సందిగ్ధతలు, అప్పటి ప్రశ్నల దగ్గర, అప్పటి ఊపిరి పోరాటాల, ఒంటరితనాల ప్రశ్నలు కదలాడిన పేజీల్లో నుండి ముందుకు సాగిన రచన ఇది. కాబట్టి, ఈ పుస్తకం చాలా వ్యక్తిగతమైన ప్రయాణం. బరువైన ప్రయాణపు అనుభవం.
"ఇందుకోసమే బతుకుతున్నాను అని యావగా బతుకుతున్న విషయాలు కూడా బలమైన సంశయంలో పడేవి. ఉనికి సమస్తమూ విశ్వాస, అవిశ్వాసాల నడుమనేనా అన్న అనుమానం కలిగేది.
నా జీవాభినయం మీద నాకే నవ్వు కలగడం - బాధ, భయం, కోపం, ద్వేషం ఏమీ కాదు - జస్ట్ ఆశాభంగం, నిరుత్సాహం. ఇంతేనా, ఇంకా ఏమైనా తీవ్రత ఉందా.."
నేను అనే ఏకాకితనంలోని గాఢతను, దాని తాలూకా నలిబిలిని ఏ భేషజాలూ లేకుండా విప్పుకుపోయిన ఈ మొదటి పేజీల దగ్గరే నాలో చెప్పలేనంత అలజడి మొదలైంది. ఎదుర్కునే ఆసక్తి లేక తప్పించుకు తిరిగే ప్రశ్నలేవో, ఒక ఇరుకైన దారిలో మనకి ఎదురుపడుతున్నప్పుడు, తప్పించుకునే వీల్లేనప్పుడు, లోపల నుండి కమ్ముకొచ్చే ఇబ్బందీ, అసౌకర్యం నన్ను చుట్టుముట్టాయి. కోరుకునేవాటికీ, అవసరమైనవాటికీ మధ్య గీత గీయడం మనకి తెలియక కాదు, ఆ గీతను చెరిపేసుకుని అటూ ఇటూ దూకగల స్వేచ్ఛ, అందులోని స్వార్థం కొన్ని గీతలను బలంగా గీయనివ్వవు. ఉన్నా చూడనీయవు. ఏదో ఒక వేడి, పొగమంచులాంటి ఆ స్వార్థాన్ని కరిగించి గీతని బలపరిచి చూపించినప్పుడు, భయంతో కళ్ళు మూసుకోవాలనిపించే స్థితి వస్తుంది. ఈ పుస్తకం మొదలెట్టినప్పుడు నాకట్లాంటి ఇబ్బంది.
ఒక స్నేహితురాలు తోడు ఉందని ముందు సంతోషంగా ఒప్పుకోవడం, చివరికి ఎవ్వరూ రాక, నా అన్న మనిషి పక్కన ఊరికే కనపడుతూ ఉన్నా దొరికే భరోసా కూడా దూరమై -ఒక్కతే వెళ్ళాల్సి రావడం ఈ ప్రయాణపు, అనుభవపు టోన్‌ని స్థిరపరిచాయి అనిపించింది.
ఈ పుస్తకంలోని కొన్ని మాటలు ఎదుటి మనిషిని నిలువునా చీరేసే నిజాయితీ తో రాసినవి. మొదటిది ఇక్కడికి వచ్చిన కారణం అని పైన రాశాను కదా. రెండవది, రాత్రి ఏ ఝాముకో నిద్ర పోయిన కళ్ళతో బయటకొచ్చినప్పుడు, ఓ సీనియర్ సాధిక అధికారం చూపించడానికి ప్రయత్నించే సందర్భం. "వలచి వేసుకున్న సంకెళ్ళే" అయినా సరే, మనిషికి తనవైన కొన్ని ఇబ్బందులూ, బలహీనతలూ ఉంటాయి. ఎంత ఏరికోరి ఎవరితోనూ సంబంధం లేని జీవితం వైపు అడుగులేసినా, ఎదుటి మనిషి పట్ల అక్కర చూపించకుండా మాట్లాడే మనిషి పట్ల వెగటు ఓపలేనిదే అయిపోతుంది. అది క్షణికమే కావచ్చు, "ఆమెకు తెలిసింది అదీ" అనుకోగల నెమ్మదితనం మళ్ళీ రావచ్చు, కానీ ఆ క్షణాల భంగపాటు గురించి మాట్లాడటం నావైన ఎన్నో అనుభావలను గుర్తు చేసింది. తర్వాతి నా ఒప్పుకోలు, పశ్చాత్తాపాలు కూడా.
ఇక మూడవది, భోజనం. ఈ పుస్తకంలో తిండి ప్రస్తావన ఉన్న ప్రతిచోటా, ఒక నొప్పి కూడా ఉంది. దొరికిన దాని పట్ల తృప్తి కన్నా ముందు వినమ్రత కావాలి అనిపించే అనుభవాలు. కొందరిళ్లల్లో భోజనాల దగ్గర, వడ్డనల్లో అహంకారం తప్ప ఏమీ కనపడని గుణం ఉంటుంది. ఆపాటి ప్రదర్శన గురించిన ఆలోచన కూడా లేనంత లెక్కలేనితనం కూడా కొందరి దగ్గర ఉంటుంది. వంద రకాల వంటకాలతో భోజనాలు పెట్టందే నామోషీ అనుకునే జనాభా పెరిగిన ఈ కాలంలో, ఇలాంటి అనుభవం ఏదో ఒకరకంగా కంటపడని వాళ్ళు అరుదే.
అంత వేలంవెర్రితనం లో నుండి పక్కకొచ్చి, అగ్గి చారికలు రాచుకున్నట్టు, నిప్పులు కుమ్మరించినట్లు ఒళ్ళంతా మంటలు రేగుతుంటే, కప్పు పెరుగు కోసం చేయి చాచినప్పుడు, "పర్మిషన్ తెచ్చుకోండి" అన్న మాట వినడం ఎలా ఉంటుందో ఊహించగలం కదా!
"పది రోజుల కాలాన్ని తరచి చూసుకుంటే భిక్షా పాత్ర నిండుగా ఊపిరి గట్టిగా పీల్చి వదిలిన నిట్టూర్పులే కనపడతాయి" అని రాశారు.
ఆ వాక్యం దాటి పోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
**
జాజిమల్లి గారి వచనం దేన్నైనా గాఢంగా అనుభవించిన పలవరింతలా ఉంటుంది. కాబట్టే ఇంత బరువైన పుస్తకం కూడా కొన్ని కొన్ని అపురూపమైన వర్ణనలతో మెరిసి ఆ బరువును కాస్త కాస్తగా తగ్గించింది.
"దూరం నుంచి జాయిగా వచ్చే గాలి రివ్వ - అన్ని వందల కొబ్బరిచెట్ల ఆకులను గలగలలాడిస్తూ మా నెత్తి మీదుగా దాటి పోయేది. గాలీ చెట్లూ కలిసి చెట్టాపటాలాడితే అంత సంగీతం పుడుతుందని నాకేమి తెలుసు!
తెలిసి ఉన్నా కూడా మరెన్నో నిర్మిత శబ్దాల ముందు ఆ జ్ఞాపకాన్ని పారేసుకుని ఉంటాను."
లాంటి అక్కడి ప్రకృతికి సంబంధించిన గమనింపులతో పాటు, శరీరం లోని సూక్ష్మ సంవేదనలను విపస్సన ద్వారా గుర్తిస్తూ, ఆ అనుభవాల గురించి మాట్లాడినప్పుడు, "ముక్కు నుండి మెల్లగా వదుల్తున్న గాలి, పై పెదవి మీది పలుచని నూగూరు మీదుగా వీచినప్పుడు, వరి పైరుని అల్లల్లాడించే గాలి తరగ స్పురించేది" అనడం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఉప్మా, వేడి జావల ఒక ఉదయపు ఉపాహారాన్ని గురించి రాస్తూ,
"ఆస్వాదిస్తూ తినడం తెలిసి కూడా వేగం, వడి, అలసత్వాలలో పడి మనం పోగొట్టుకున్న ఒక జీవనకళని దాని నిజ అర్థం లో అనుభవించాను" అనడం కూడా పుస్తకంలో చదువుతున్నప్పుడు, ఆ నిండైన అనుభవానికి అలవోకగా దగ్గరకు తీసుకెళ్ళింది.
**
ఈ పుస్తకం నేను చదవాలి అనుకోవడానికి ముఖ్యమైన కారణం, అనిల్ దగ్గర విన్నది ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడం కోసం. విపస్సన మొదలెట్టగానే (తీసుకునే ఆహారంతో సంబంధం లేకుండా), సంవేదనలు బయటపడుతూ ఉండటం వల్ల ఒక రకమైన వేడి మొదలవుతుందని నేను విని ఉన్నాను. అలాంటివి, ఆలాంటి ఇంకొన్ని, కొన్ని వేరే రకాలైన వివరణలతో ఈ పుస్తకంలో చూడటం ఆసక్తిగా అనిపించింది.
కానీ, పుస్తకం చదివాక మళ్ళీ నాకు నేను గుర్తుగా చెప్పుకుంటున్న మాట మాత్రం, వినమ్రత. humbleness. అది ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటే, ఈ పుస్తకం చదివితే కొంత అర్థమవుతుంది. నిద్రపట్టని రాత్రుల్లో, కిటికీ ఊచల్ని చూస్తూ స్వేచ్ఛను పణంగా పెట్టిన పోరాట యోధులను గుర్తు చేసుకున్న క్షణాలను చదివినప్పుడో, పది రోజులు భిక్షాపాత్రను చేతుల్లో ఉంచుకున్న అనుభవాన్ని గురించో ఈ పుస్తకంలో చదివినప్పుడు, అది ఎంతో కొంత స్థాయిలో అవగతమవుతుంది.
ఈ పుస్తకం చదివితే విపస్సన కి వెళ్తామనో, విపస్సన సూత్రాలు అర్థమవుతాయనో, అవలంబిస్తామనో చెప్పను. కానీ, ఈ మార్గంలో వెళ్ళిన ఓ మనిషి రాసిన అనుభవాలు లోపల కలుగజేసే అలజడీ, ప్రశ్నలు, చెల్లాచెదురు ఆలోచనలు ఏదో ఒక స్థాయిలో చదువరుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. ఆ ఆలోచనల మీదకి దృష్టి వెళితే, స్పష్టత కోసం ఎవరికి అవసరమైన మార్గం వాళ్ళకు ఎదురొస్తుంది. రాగద్వేషాలకు అతీతులమై ఉండటం, అదుపులో ఉంచుకోవడం, రెండూ కష్టమే. "but you can try.." అని గాంభీర్యం, మెత్తదనం జమిలిగా పెనవేసుకున్న గొంతుతో భరోసాగా పలికే పుస్తకం ఈ "రాగసాధిక".
No photo description available.
All reactions:
Somasekhararao Markonda, Vadrevu Ch Veerabhadrudu and 81 others

తేనీటి పుస్తకం - వాడ్రేవు చినవీరభద్రుడు

 అపరాహ్ణ వేళ, అలసిన మనసులకు ఊరట లాగా, ఎవరైనా ఒక టీ కప్పు చేతికి అందిస్తే, ఆ భోగమే వేరు కదా! ఈ పూట అలాగే ముసురుకున్న మేఘాలను చూస్తూ, చేతిలో ఈ "ఆవిరిపూల కొమ్మ"ను పట్టుకుని నింపాదితనాన్ని గుటకలుగా గొంతులోకి ఒంపుకుని మళ్ళీ పనిలో పడితే, ఈరోజు టీ డే అని వచ్చిపడిందో సమాచారం.

ఒకాకురొ కకుజో "ద బుక్ ఆఫ్ టీ" ని తేనీటి పుస్తకంగా అనువదించారు చినవీరభద్రుడు. అందులో చదవగానే పెదాల మీదకు నవ్వు తెప్పించే మాటొకటుంది -
"మద్యంలోని అహంకారం లేదు, కాఫీలోని స్వాతిశయం లేదు".
ఒక కప్పు తేనీటిని ఆయన అపురూపంగా ఆవిరిపూల కొమ్మ అని పిలుచుకున్నారు. ఆ వెచ్చని దయాప్రాసారంలో అందరూ ఓలలాలాడాలనుకున్నారు.
నేనేమో పోయి పోయి నిర్దయాసముద్రంలో పడ్డానోసారి. ఎప్పుడో లెండి!
కరోనా అప్పుడే తగ్గుతున్న రోజులు, పెద్దవాళ్ళకి భయం పూర్తిగా విడవని రోజులు. అనిల్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ కి అందరం కలవాల్సి వచ్చింది. కరోనా భయం వదల్లేదని చెప్పా కదా - అందుకనీ, అందరం ఒకేచోట ఎందుకని మాకోసం ప్రత్యేకంగా వాళ్ళ స్నేహితుల ఇంట్లో బస ఏర్పాటు చేశారు. మా కోసం అంటే, మేమూ, మా మరిది కుటుంబం. ఆ స్నేహితులు ఎంతో ఆదరంగా ఆహ్వానించారు, మర్యాదలు చేశారు, ఆ రాత్రి బ్రహ్మాండమైన భోజనం పెట్టి ఫెళఫెళలాడే దుప్పట్లు పరిచిన మంచాలిచ్చారు.
సరే మర్నాడు పొద్దున్నే నేను స్నానం చేసి హాల్‌లోకి రాగానే ఆవిడ ఒక కప్పుతో నా ముందుకొచ్చారు. ఆవిడ అనడం టీ అనే అన్నారు కానీ..అదొక బీభత్సం. కాఫీ టీ అలవాటు లేవు కనుక అనిల్, మా మరిది తప్పించేసుకున్నారు. మా తోడికోడలు రాలేదు. నేనొక్కదాన్నే బలి. కక్కలేను-మింగలేను అన్నది అక్షరాలా అనుభవంలోకొచ్చిన సంగతి.
"ఇందులో ఏమేం వేశానో గెస్ చెయ్యిరా..." గడ్డం కింద చెయ్యి పెట్టుకు నా ఎదురూగ్గా కూర్చుని అడిగిందావిడ నన్ను.
తల అడ్డంగా ఊపాను.
యాలకులు తెలిసాయా?
ఊ..
అల్లం?
ఊ..
లవంగం?
నాకు దుఃఖం మొదలైంది.
ఎంత మంది అడుగుతారనుకున్నావ్, ఆంటీ ఇందులో ఏవేం వేస్తారో చెప్పండీ అని..ఇదిగో చూడు, ఈ పుదీనా వేస్తే...
నేను నిటారుగా కూర్చున్నాను.
ఎన్నో కాదు..ఓ నాలుగు రెమ్మలు వేసి మరిగిస్తే..
టీలో పుదీనా!!
అందరూ అడుగుతార్రా, ఆంటీ ఈ టేస్ట్ ఎలా వస్తుందసలు అని..నేను ఎవరికీ చెప్పననుకో. అసలు మా ఇంట్లో ఎవరికీ కోవిడ్ రానిది కూడా ఇందుకేరా.
(నేను అడగలేదుగా ఎలా ఈ టేస్ట్ అని 🙁 )
ఇలా రా..జబ్బ పట్టి కిచెన్ లోకి లాక్కుపోయారు.
చిక్కం పట్టి చూపించారు.
మీరెలాగూ నమ్మరు కానీ, నేను నిజ్జంగా చెప్తున్నాను, నేను బిర్యానిలో కూడా అన్ని విచిత్రాలు కలపను.
ఆవిడ ఎదురూగ్గా కూర్చుని ఆ టీ రహస్యాలు నాకు చెప్తూనే ఉన్నారు - నాకు దేవుడు కనపడుతున్నాడు . ఆవిడ ఒక్కో దినుసు విడమరిచి చెప్పే కొద్దీ, పరగడుపున ఇవన్నీ తాగాను - నాకేమవుతుందో అన్న భయం నాలో అంతెత్తుకు పెరిగిపోయింది.
( తొ-టుంగ్ ఒక చీనా కవిట. ఆయన "ఆ తేనీటి మొదటి పాత్ర నా పెదాల్నీ గొంతునీ తడుపుతుంది. రెండవ పాత్రతో నా ఒంటరితనం తొలగిపోతుంది. మూడవపాత్ర నా శుష్కజీర్ణకోశంలో ప్రవేశించి ఐదువేల పూర్వ పద్యాల కోసం వెదుక్కుంటుంది...." అని రాసుకున్నాడు.
నాకు మొదటి గుటకకే తలుపులు తెరవని తిరుపతి గుళ్ళో ఉన్నట్టుంది. జన్మాంతరాల్లో చేసి మర్చిపోయిన పాపాలన్నీ ఎవరో నా ముందు కూర్చుని ఏకరువు పెడుతున్నట్టు ఉంది.)
సరే, పుణ్యం పుచ్చి అప్పుడే మా మరిది వచ్చాడు.
"నీకూ టీ తెస్తాను." ఆవిడ లేవబోయారు.
"ఏంటేదో స్పెషల్ గా ఉన్నట్టుందీ.." మా మరిది నా ఏడుపు మొహంలోకి చూస్తూ అడిగాడు.
ఆవిడ గండికోట రహస్యం చెప్పేంతలో మా మరిదే
అందుకుని, "ఆంటీ, పిల్లలకి పాలు కలపాలిట, చూపిస్తారా" అంటూ లేచాడు.
ఆవిడ "హార్లిక్స్ కావాలా, బూస్ట్ ఆ..." అని అడుగుతూ వంటింటి లోపలికెళ్ళగానే,
"ఆ బాల్కనీలో ఓ వాష్బేసిన్ ఉంది, అటెళ్ళు.." నాకు గుసగుసగా చెప్పి వంటింట్లో కెళ్ళాడు.
మా మరిదికి మార్కులు పడిన అరుదైన సందర్భాల్లో ఒకటిది 😉
*
ఆవిడని అప్పట్లో ఎన్నో మాటలనుకున్నాను కానీ, ఈ తేనీటి పుస్తకం చదివాక తెలిసిందేమంటే, అప్పట్లో టీలో నారింజ తొక్కలు, ఆఖరకు ఉల్లిపాయలు కూడా వేసేవారుట. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆదర్శ తేనీరు బండి బొక్క బోర్లా పడి జపాన్ కళలు తెచ్చుకోకూడదని ఏముంది?
సరే, పుస్తకంలో తేనీటివాదపు మర్యాద ప్రకారం నువ్వు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్తారు. ఒక్క పొల్లు కూడా ఎక్కువ పలకకూడదట. బిర్యాని టీ తాగిన పాపం కొద్దీ, నేను కాస్త ఎక్కువే మాట్లాడి ఉంటాను. ఈసారికింతే.
*
తేనీటి మర్యాద కోసం కాదు కానీ, ఈ పుస్తకంలో కనపడే నాలుగైదు లైన్ల జెన్ కథలు అలసి సొలసిన వేళల్లో అమాంతం శక్తినిచ్చే టీ చుక్కలంత మధురంగా, హాయిగా, రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. ఇంకా చదవని వాళ్ళు ఉంటే భద్రుడి గారి బ్లాగ్లో చదవండి.

జయమోహన్‌తో కాసేపు...రాజిరెడ్డీ, నేనూ

 రిలీజ్‌లు, దూరాలు, పేరెంట్ టీచర్ మీటింగ్‌లు...అన్నీ ఆ బుక్‌బ్రహ్మ ఫెస్ట్ టైంలోనే నాకు

🙂. అయినా మూడో రోజుకి ఎలాగోలా సమయం కుదుర్చుకున్నాను. భాస్కర్ ఆ ఉన్న కాసేపట్లోనేరాజిరెడ్డి గారితో పోట్లాడి, అలిగి ఆయన్ని వాళ్ళింటికి రప్పించుకున్నారు పొద్దున్నే. అక్కడి నుండి ముగ్గురం ఫెస్ట్‌కి వెళ్ళాం. రోజంతా ఎలా గడిచిపోయిందో తెలీలేదు. నెమ్మి నీలం పుస్తకావిష్కరణ తర్వాత, అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న జయమోహన్ దగ్గరికి వెళ్ళి, ఆయన కథలను ఎలా ఓన్ చేసుకున్నానో నాలుగు మాటలు చెప్పాను. పుస్తకం మీద సంతకం చెయ్యడానికి ఆగి, పేరేమిటని అడిగారు. నా జవాబు వింటూనే, ఇరవై ఆరు వేల పేజీలతో ఆయన రాసిన వెణ్మురుసు అనే బృహన్నవల మొదటి పదమే మానస అని చెబుతూ, నా పేరుతో ముడిపడ్డ విశేషాలెన్నో చెప్పారాయన. అప్పుడే ఆయన మాటల ప్రవాహంలో మునకలేయడం మొదలైందేమో.
కిందకి దిగాక, నాకిప్పుడు నిజంగానే గుర్తు లేదు, ఎందుకు బయటికి వెళ్ళామో. భాస్కర్, రాజిరెడ్డి, జయమోహన్ మిత్రులు ఇంకొందరు - ఫెస్ట్ జరిగిన కాలేజ్‌కు ఓ పాతికడుగుల దూరంలో ఉన్న చిన్న కాఫీ షాప్‌కి వెళ్ళాం. ఇక్కడ నేను రాసినవన్నీ అక్కడ మేం చెప్పుకున్న కబుర్లు. ఇంటర్వ్యూ చేసే ఆలోచనా లేదు, అంత పెద్ద రచయితను ప్రశ్నలతో పట్టి కూర్చోపెట్టగల ప్రిపరేషనూ లేదు. కానీ ఆయన కథలు చదివి ఉండటం ఒక్కటే నాకున్న వెసులుబాటు. మేం అడిగాం సరే, ఆయన ఎంత బాగా చెప్పారు సమాధానాలు, ఇలాంటి ప్రశ్నలు ఎంత మంది దగ్గర విని ఉంటారు - అయినా మాకు అంతే శ్రద్ధగా, అంతే ఇష్టంగా పంచుకుంటున్నట్టుగా చెప్పారు. ఆయన చెబుతోంటే, ఆ మాటలు వింటూంటేనే రాత అన్న ప్రక్రియ మీదే వల్లమాలిన ప్రేమ కలిగింది. చేతిలో ఓ పేపర్ లేదు, ఏం అడుగుతున్నామన్న స్పృహ లేదు. గుర్తు పెట్టుకోవాలన్న ధ్యాస కూడా లేదు. అసలు ఇదంతా రాసే ఆలోచనే లేదంటోంటే! అదొక మామూలు కాఫీ సమయం.
కానీ, ఆ మాటలు పుట్టించిన ఉత్సాహమో, అవి గుర్తు చేసుకుంటే, అందులో కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయన్న సంతోషమో కానీ, మొత్తానికిదంతా టైప్ చేశాను. భాస్కర్ చొరవ వల్ల ఈరోజు ఆంధ్రజ్యోతి వివిధలో ఇలా.
Thank you Team Vividha! ❤️
------
తమిళ రచయిత జయమోహన్‌లో చిత్రమైన ఆకర్షణ ఉంది, అది విజయవంతమైన రచయిత అయినంత మాత్రాన సాధించగల ఆకర్షణ కాదు. ఆయన నవ్వులో, పలకరింపులో, అప్రోచబుల్‌గా ఉండటానికి సందేహించని ఆయన మనస్తత్వంలో - మనుషులను అయస్కాంతంలా లాగగల ఆకర్షణ ఉంది.
కెత్తేల్ సాయెబు, ఏనుగు డాక్టరు, వంద కుర్చీల ఆఫీసరు- ఇలా మనసులో స్థిరపడే పాత్రలతో ఆసక్తిగొలిపే ఆయన కథల్లో కొన్నింటిని అవినేని భాస్కర్ "నెమ్మి నీలం" పేరుతో తెలుగులోకి పుస్తకంగా తెచ్చి, బెంగళూరు బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‌లో ఆవిష్కరించారు. అదయ్యాక, జయమోహన్‌తో మట్లాడేందుకు, నాకూ రాజిరెడ్డికీ కాఫీ టైం దొరికింది.
రాజిరెడ్డే మొదట మాట్లాడారు. "గెలుపు" కథను ప్రస్తావిస్తూ, ఆయన కథల్లో లేయర్స్ గురించీ, డీటైలింగ్ గురించీ.
మీరంత పెద్ద పెద్ద కథలెందుకు రాశారు? దానికి కొనసాగింపుగా అడిగాన్నేను.
కథంటే చిన్న కథే కావాలన్న మాట ఎవరు సృష్టించారో తెలీదు. అదేమీ నియమం కాదు. అలా ఉండటం గొప్ప విషయమూ కాదు అంటూ అమెరికాలో, ఆ మధ్య 64 పేజీలతో వచ్చిన ఒక కథ అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందటం గురించి చెప్పారాయన. రాజిరెడ్డి టాల్‌స్టాయ్ లాంటి ఉదాహరణలూ గుర్తు చేసుకున్నారు.
ఇంత పెద్ద కథలు ఎలాగూ రాస్తున్నారు కదా, రాయడం కూడా ఇష్టంగా అలవోకగా చెయ్యగలరని తెలుస్తూనే ఉంది, ఈ కథలను నవలలుగా కూడా మార్చగల అవకాశం ఉన్నప్పుడు, అలా ఎందుకు చెయ్యలేదని అడిగాం.
జయమోహన్ అన్నారూ, ప్రతి కథకూ ఆయన మనసులో, బలమైన ఆధారం లాంటి వాక్యం ఒకటుంటుందిట. ఉదాహరణకు, ఆ వంద కుర్చీల కథలో, ఆఫీసర్ వంద కుర్చీలు కావాల్సిందే అనుకోవడం. కూటి ఋణంలో అతను మొత్తాన్నీ సాయిబు దగ్గర ఇచ్చేయడం, అతడు కళ్ళెత్తి కూడా చూడకపోవడం - ఇలా. ఒకసారి ఆ మలుపు, ఆ వాక్యం దగ్గరికి వచ్చామంటే, కథ అయిపోయినట్టేట. అక్కడి దాకా ఎన్ని పేజీలన్నది ఆయనకు లెక్క లేదు. కానీ ఆ మలుపు తర్వాత ఆ కథలో ఇక చెప్పడానికేమీ లేదు. కాబట్టి ఇవన్నీ కథలయ్యాయి. నవల అంటే, ఆయన దృష్టిలో ఇలాంటి సందర్భాలు, కథనిట్లా మలుపులు తిప్పగల వాక్యాలు ఇంకా ఎన్నో ఉండచ్చు, ఉండాలి. కనుక ఇవి కథలే తప్ప నవలలు కాలేవన్నది ఆయన జవాబు.
జయమోహన్ కథల్లో ఏళ్ళకేళ్ళ జీవితాలు పరుచుకుని ఉంటాయి. ఇంత విశాలమైన జీవితాన్ని కాన్వాస్‌గా ఎందుకు తీసుకుంటారు, కథను చెప్పడం తేలిక చేస్తుందనా? అంత పెద్ద జీవితంలో నుండి ఏ తునకలనైనా ఎంచి చెప్పే వీలుంటుందనా? అని అడిగాను.
ఆయనకు మనిషి "ఎథికల్ కన్సిస్టెన్సీ" మీద దృష్టి పెట్టడం ఇష్టమట. అంటే ఏదో పుణ్యానికి ఓ రోజు మంచి చెయ్యడం, స్నేహమో సాయమో చెయ్యడం - ఇలా కాదు. ఏళ్ళ తరబడి నడిచే జీవితంలో ఆ పాత్ర ఏ ఆదర్శాలను నమ్ముకుని జీవిస్తుందో చెప్పడం, వాటికి నిలబడిందో లేదో చూపించడం, ఆయనకు ముఖ్యమని చెప్పారు.
(పుస్తకం మొదటి పేజీలోనే చెప్తారు - ధర్మం మూలాలకు సంబంధించిన ప్రశ్నలతో మొదలైన ఈ కథలన్నీ మానవత్వపు గెలుపును చాటి చెబుతాయని)
జయమోహన్ కథలకు భాస్కర్ అనువాదాలు చదివిన రీడర్స్‌లో చాలా మంది, మళ్ళీ వెనక్కు వెళ్ళి మరీ మూలరచయిత పేరు కూడా గమనించడం నాకు తెలుసు. చిన్నచిన్న కథలు, సంఘటనలు అందరి మీదా అన్నిసార్లూ బలమైన ముద్రను వేస్తాయని ఆశించలేం. కానీ నిడివి పెరిగే కొద్దీ, కథ బాగుంటే పాఠకుడు ఆ కథాజగత్తులో లీనమైపోతాడు. కొన్ని నిమిషాలపాటో, గంటలపాటో వేరే ప్రపంచంలోకి ట్రాన్స్‌పోర్ట్ అయిన పాఠకుడు, మళ్ళీ ఈ లోకంలోకొచ్చాక, ఆ ప్రభావం నుండి బయటపడ్డాక, రచయిత పేరు గమనించకుండా ఉండలేడు. ఆయన పేరు తెలుగు నాట కూడా ఇంత బలంగా నాటుకోవడానికి, ఈ కథల నిడివి ఒక కారణమంటే - ఆయన ఆ గమనింపుని ఒప్పుకున్నారు. రచయిత అట్లాంటి సాంద్రమైన పఠనానుభవం పాఠకులకు అందించాలనట్టు మాట్లాడారు.
డెలిబరేట్‌గా చేస్తారా అన్నాను.
తల అడ్డంగా ఊపుతూ అలా చేయాలని కూడా ఎప్పుడూ అనుకోనన్నారు. ఆయనకు కథ ఆర్గానిక్‌గా క్రియేట్ అవ్వాలి. అలాగే నడవాలి.
కరోనా లాక్డౌన్లో ‘కథల తిరనాళ్ళు’ అంటూ ‘వంద రోజులు, రోజుకో కథ’ అని ప్రకటించి మరీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తూ వచ్చారు. పరుగు పందేల్లో ఫినిష్ లైన్ చేరుకున్నాక కూడా మరికొంతదూరం పరుగెత్తినట్టు, ప్రకటించిన వంద కథలతో ఆగకుండా వందా ముప్పై కథలు రాశారు. అక్కడా నిడివితో నిమిత్తం లేదు.
రాజిరెడ్డీ నేనూ మళ్ళీ అడ్డు కొట్టేశాం. అలా ఎలా సాధ్యపడుతుంది? పోనీ గాలి మేడల్లాంటి కథలా అంటే అదీ కాదు. మంచి వస్తువూ ఉంటుంది. బలమైన చిత్రణా ఉంటుంది. ఆ ఊహకూ, అల్లికకూ, రాతకూ సమయమెలా సరిపోతుంది? ప్రత్యేకించి కథ బాగా రాబోతోందని తెలిసినప్పుడు ఇంకొంచం శ్రద్ధగా రాయాలనిపించడమూ రచయితలకు అనుభవమవుతూంటుంది కదా? అలాంటిదేమీ ఉండదా? అని అడిగాం. మరీ ముఖ్యంగా ఎడిటింగ్?
ఆయన చాలా అయిష్టంగా తిరస్కరించారు. ఎడిటింగ్ మొదలెడితే దానికిక ముగింపెక్కడ? ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తూనే ఉంటుందిక. నేను ఆ పని పెట్టుకోను. అంత నచ్చకపోతే డిలీట్ చేసేస్తాను తప్ప దిద్దుకుంటూ కూర్చోనన్నారు.
డిలీట్? డ్రాఫ్ట్స్ లో కూడా ఉంచరా? మళ్ళీ ఇంకోసారి చూసుకోరా?
నో. చూడను. అవి దిద్దే టైంలో కొత్త కథ రాసేసుకోవచ్చు అన్నారు నవ్వి.
ఎప్పటికప్పుడు కొత్తవి రాసేందుకు సమయమెలా సరిపోతుంది? - మా అనుమానం తీరలేదు.
" నాకింకో వ్యాపకం లేదు. రైటింగ్ ఈజ్ డ్రీమింగ్ విద్ లెటర్స్. నాకది ఇష్టం. తిరువనంతపురంనుండి బెంగళూరు రావాలంటే ఫ్లైట్లో ఒక నవల ఊహించుకుంటాను. నేనది రాయక్కరలేదు. ఊహగా నాలో మెదిలినా చాలు. ఆ ఊహలు నాకిష్టం. ఆ చిత్రణ ఇష్టం. అందుకని సమయం సరిపోలేదనో కష్టమనో ఇన్నేళ్ళలో ఎప్పుడూ అనుకోలేదు."
ఎప్పుడూ రాయాలనే ఉంటుందా?
"ఆహా! ఇదుగో ఇక్కడ ఉందే (మెదడుని చూపిస్తూ) - దీనిని తిట్టకూడదు. పిచ్చిగా వాడకూడదు. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అల్లోపతి మందులు తినేసి శరీరాన్ని పాడుచేసుకోకూడదు. ఇవి రెండూ బాలేదంటే రాయాలనే అనిపించదు. కాబట్టి అవి ముఖ్యం. నిద్ర ముఖ్యం.
మా అబ్బాయికి కరోనా వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసామొకసారి. రాత్రికి ఇంటికి చేరాక- ఒక్కణ్ణే ఉన్నానప్పుడు - ఒళ్ళంతా ఒకటే సంతోషం. నరాల్లోకి పాకిన తియ్యదనం. నాకు తెలుస్తోంది ఆ పొంగు. 36 గంటలు లేవకుండా కూర్చుని ఒక నవలిక రాశాను - కుమరితుఱైవి. ఎంతా ఏమిటీ అని కూడా చూడలేదు. సైట్‌లో మర్నాడు పబ్లిష్ అయ్యేలా సెట్ చేసి నిద్రపోయాను. అది చదివి మా అబ్బాయి నాన్నా, నువ్వొక కవివి అన్నాడు.
రాసే ఉధృతిలో ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు, పర్లేదు. రాసేశాక మాత్రం కంటి నిండా నిద్రపోవాలి."
తరువాతి సెషన్‌కి వేళయి అందరం బయటకు వచ్చేశాక మాకు అనిపించిందొక్కటే. జీవితం ముఖ్యం. ఈ రాత మొత్తం దాని కొనసాగింపు. ఆయన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. రాతనిట్లా ఆస్వాదిస్తున్నాడు.
ఆయన కథలింత బాగుండడంలో ఆశ్చర్యం ఏముంది?
For copies : https://chaayabooks.com /7989546568
All reactions:
Somasekhararao Markonda, Padmaja Suraparaju and 124 others

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...