Posts

Showing posts from 2017

నేనంటే నేనే కాదు

ప్రతీపదం ఎక్కడో విన్నట్టే ఉంటుంది
ప్రతీ ముఖమూ చిరపరిచిత కథను మోస్తూ
కళ్ళ ముందే నడుస్తూ ఉంటుంది. 
ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకున్నట్టు,
భుజాలు తిప్పుకుని
ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయాక,
గది లోపలి గది లోపలి గదిలో
కళ్ళు పొడుచుకుని వెదుక్కుంటాను
తప్పిపోయిన ఏ మనిషి కోసమో
తెల్లవార్లూ కలల దారుల్లో కలియదిరుగుతాను చీకటి గడప దాటడానికి,
కలలు చిట్లే వేకువలోకి లేవడానికి
ఎన్నాళ్ళైనా భయపడుతూనే ఉంటాను
నది నిరంతరం ముద్దాడినా లొంగిపోని చేపపిల్లలా
ఆలోచన స్వాధీనంలోకి రాక వేధిస్తున్నా
మెదడులో మోసుకు తిరుగుతూనే ఉంటాను. ఆశ పుట్టిన రాత్రుల్లో, ఆశ చావని రాత్రుల్లో,
ముడుచుకుపోతున్న వేళ్ళన్నింటినీ పైకెత్తి
ఊహల్లోని బొమ్మలను విస్తరించి చుసుకుంటాను
పెదాల మధ్య నలిగి నెత్తురోడే పదాలని
అరచేతుల్లోకి తీసుకుని ప్రాణం పోసి చుసుకుంటాను వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతున్నానని
రాత్రి వెనుక రాత్రి జారినప్పుడల్లా
నా పాదాల ముందు గడియపడ్డ తలుపులు
కొత్తగా పుట్టుకొస్తున్నాయనీ
గమనించుకుంటూనే ఉంటాను. ఒకరెళ్ళినా, మరొకరు వచ్చి చేరినా
ఏ ఇబ్బంది లేని ప్రాణమని అనుకుంటాను కానీ,
నా అరచేతుల్లో ఓ ప్రపంచముందనీ
నా వేలి చివరల్తో నా లోకాన్ని
శాసించగలననీ అనుకుంటాను గ…

లోలకం

1)

రెక్క ఒకటి తెరిచే ఉంచుతాను
రాత్రికి రానని చెప్పే వెళ్ళావనుకో-
మరి వస్తేనో?

2)

నీదిగా చేసుకున్న గది అదుగో
నవ్వుల్తో, సూదంటు చూపుల్తో
నీ మౌనంతో
నువ్వు వెలిగించి వదిలేసిన
దీపం లాంటి గది ఇదిగో!

ఏ ఈదురుగాలికీ బెదరకుండా,
ఇలాగే, ఇక్కడే.

3.

సంద్రాన్ని కోసుకుంటూ పోయిన నౌకలా
మది మీద నవ్వు నురగలు వదిలే
నీ జ్ఞాపకం
మెత్తగా కోస్తుంది కదా,
ఎక్కడో నొప్పి.

4.

త్వరగానే వస్తావులే నువ్వు-
నేరేడు పళ్ళు రాలిన డొంకదారి మీద
అడుగేయడానికే అల్లాడిపోయే ప్రాణావివి
నన్ను తల్చుకుని,
నువ్వు లేని నన్ను ఊహించుకుని

రావా?

5.

ఋతువులు మారే కాలం
పూలు పూస్తాయో పూయవో
ఎగిరిపోతున్న పక్షులు
రేపీ వంక గొంతు విప్పేనో లేదో
అన్ని రంగులనూ తుడిచేసుకుని
నిశ్చలమైన నలుపులోకి తిరుగుతూ
ఆకాశం.
నిను హత్తుకుని పడుకున్నప్పుడు
కళ్ళ వెనుక ఊడ్చుకుపోయిన లోకంలా.

6.

ఉండచుట్టుకు పడిపోయిన వేల కాగితాల లోపల
ఎవరికీ ఎన్నటికీ చేరని భావంలా,
నాలోపల,
నువ్వలాగే!


**తొలిప్రచురణ -ఆంధ్రప్రదేశ్ సాహిత్య మాసపత్రిక, సెప్టెంబరు సంచికలో.

శిక్ష

ఏ తీగను నమ్ముకునో,
ఉత్తరమొకటి వచ్చి నా ఒళ్ళో వాలింది.

కాలం ఏం చేసింది!

సంబోధనలు మార్చేసింది.
సంతకాలు మార్చేసింది. ఒకప్పటి చివరిమాట, ఇప్పుడు
మొదటిమాట అయిపోయింది.
అక్కడితో, ఆ ఒక్కమాటతో,
ఉత్తరమే ముగిసిపోయింది.

కలిసిపట్టుకున్న సీతాకోకచిలుక
వేలు ఒకటి కదిలినందుకే
ఎగిరి ఎటో వెళ్ళిపోయింది
అడుగడుక్కీ పూలు పరిచి
నడిపించిన దారేమో
కాలు కాస్త బెసికినందుకే
నడిమినున్న అగాధాన్ని చూపిస్తూ చీలిపోయింది

ప్రేమ మాటెందుకు?
పదిలంగానే ఉండుంటుంది.
హృదయాలు మారితే ఏమి?
మనుషులు మారితే ఏమి?
ఎవరో ఒకరి గుండెలో ప్రేమ,
ఎవరో ఒకరి గుప్పెట్లో నువ్వూ..

జారిపోతున్న ఇసుకను
జాగ్రత్తగా పట్టుకోవడం తెలీని పాపానికి
పచ్చిపుండులా వేధించుకు తినే జ్ఞాపకమొక్కటే
శిక్ష!

శమంతకమణి

"వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా…"  ​ పెద్ద సౌండ్తో సెకండ్ ఫ్లోర్ కామన్ హాల్ మోగిపోతోంది. అప్పుడే మా వాళ్ళు  డేన్స్ ప్రాక్టీస్ మొదలెట్టేశారు.  డేస్కాలర్స్ అందరం క్లాసులు ఎగ్గొట్టి అక్కడికి వచ్చాం. కింద కాంటీన్‌లో మా లంచ్ బాక్స్ అక్కడి వాళ్ళకి ఇచ్చేసి,  అక్కడి ఆలూ మసాలా కూర, సాంబార్ తినేసి సుబ్బు రూం దగ్గర చేరాం. రూం అంతా రిన్ సబ్బు, సర్ఫు వాసన ఘాటుగా అల్లుకుపోయి ఉన్నాయి. సుబ్బు తలుపు బార్లా తీసి, బట్టలతో నిండిన బకెట్ ఒకటి తలుపు గాలికి పడిపోకుండా అడ్డు పెట్టింది.  తడి తువ్వాళ్ళూ, సరిగా మూయని పుస్తకాలూ, ఉండలు చుట్టిన దుప్పట్లూ, మేచింగ్ దొరక్క విసిరేసిన చున్నీలూ, అన్నిటింటినీ తోసుకుని, ఆ మంచం మీదే ఒక మూలగా సర్దుకుని కూర్చున్నాం.  ​ సుష్మ, శ్రావణి తుఫానులా లోపలికి తోసుకు వచ్చారు. 
"అదేమిటీ క్లాస్ కి  వెళతామన్నారుగా?"
"సాంబ సర్ రావట్లేదుట. ఇప్పుడెవస్తారో ఎందుకొచ్చిన గొడవలెమ్మని వచ్చేశాం. సినిమాకెళ్దామా?"
"లేదే, రికార్డ్స్ ఉన్నాయ్! వచ్చే నెలలో మనం చేసే పార్టీ సంగతి చెప్పండి ముందు. చీరలా? డ్రస్సులా?" మరో వైపు నుండి దివ్య అడిగింది. 
"చీరలే! మళ్ళ…