శమంతకమణి

"వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా…" 
పెద్ద సౌండ్తో సెకండ్ ఫ్లోర్ కామన్ హాల్ మోగిపోతోంది. అప్పుడే మా వాళ్ళు  డేన్స్ ప్రాక్టీస్ మొదలెట్టేశారు.  డేస్కాలర్స్ అందరం క్లాసులు ఎగ్గొట్టి అక్కడికి వచ్చాం. కింద కాంటీన్‌లో మా లంచ్ బాక్స్ అక్కడి వాళ్ళకి ఇచ్చేసి,  అక్కడి ఆలూ మసాలా కూర, సాంబార్ తినేసి సుబ్బు రూం దగ్గర చేరాం. రూం అంతా రిన్ సబ్బు, సర్ఫు వాసన ఘాటుగా అల్లుకుపోయి ఉన్నాయి. సుబ్బు తలుపు బార్లా తీసి, బట్టలతో నిండిన బకెట్ ఒకటి తలుపు గాలికి పడిపోకుండా అడ్డు పెట్టింది.  తడి తువ్వాళ్ళూ, సరిగా మూయని పుస్తకాలూ, ఉండలు చుట్టిన దుప్పట్లూ, మేచింగ్ దొరక్క విసిరేసిన చున్నీలూ, అన్నిటింటినీ తోసుకుని, ఆ మంచం మీదే ఒక మూలగా సర్దుకుని కూర్చున్నాం. 
సుష్మ, శ్రావణి తుఫానులా లోపలికి తోసుకు వచ్చారు. 

"అదేమిటీ క్లాస్ కి  వెళతామన్నారుగా?"

"సాంబ సర్ రావట్లేదుట. ఇప్పుడెవస్తారో ఎందుకొచ్చిన గొడవలెమ్మని వచ్చేశాం. సినిమాకెళ్దామా?"

"లేదే, రికార్డ్స్ ఉన్నాయ్! వచ్చే నెలలో మనం చేసే పార్టీ సంగతి చెప్పండి ముందు. చీరలా? డ్రస్సులా?" మరో వైపు నుండి దివ్య అడిగింది. 

"చీరలే! మళ్ళీ డ్రస్సులేంటి చిరాగ్గా, అదీ ఫైనల్ యియర్ కి వచ్చి?! హాస్టల్ వాళ్ళందరం కొత్త చీరలతో రెడీ అయిపోయాం!" రవళి చెప్పింది. చెప్తూనే అక్కడున్న చిన్న చెక్క బీరువాలో నుండి తన బ్లవుజులు తీసి చూపించింది.

నేను వాటిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాను. ఎంత వర్క్ ! ఎంత అందంగా ఉన్నాయి! నాకు కళ్ళు చెదిరిపోయాయి. 
"1200/- అయింది" గర్వంగా చెప్పింది రవళి. 

నాకు కళ్ళు తిరిగినంత పనైంది. 90 రూపాయలకి సాయి టైలర్స్‌లో కుట్టే జాకెట్ ముక్కకి పన్నెండొందలా? అమ్మ ఏమంటుందో ఊహిస్తే నవ్వొచ్చింది. మనసులో కొంచం బాధ కూడా కలిగింది. రవళి ఇంత ఖర్చు పెట్టడం ఆశ్చర్యమేమీ కాదు. తను ఆ వయసుకే కారు సొంతగా డ్రైవ్ చేసుకుంటూ కాలేజికొచ్చేది. ఇంటర్నల్స్‌లో ఫుల్ మార్క్స్ వచ్చాయని సరదాగా ఎవరన్నా పార్టీ అడిగితే, "స్వీట్‌మేజిక్"కు తీసుకు వెళ్ళి మంచూరియాలూ, నూడుల్సూ ఇప్పించేది. పేస్ట్రీలూ, కూల్ డ్రింకులూ ఆమెకో లెక్కే కాదు. నా మనసుకు ఇవన్నీ గుర్తు చేస్తూ, నచ్చజెబుతూ దానిని కాస్త ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాను. అయితే, ఈ దర్పం రవళి ఒక్కతిదే కాదని కాసేపట్లోనే తెలిసింది. హాస్టల్ ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఒకరిని మించి ఒకరు డబ్బులు పోసి, కావాల్సినట్టు కుట్టించుకున్నారు కాబోలు. నాకిప్పుడే తెలియడం. అందరి చీరలూ, వర్క్ చేసిన బ్లవుజులు నా చేతుల్లోకి వచ్చి పడుతున్నాయ్, అక్కడున్న వాళ్ళ చేతులు మారి.

డే స్కాలర్స్ అందరం అలాగే ఉన్నాం, బిక్క మొహాలతో.

ఇంకో గంట గడిచింది. సలహాలూ సంప్రదింపులూ అయ్యాయి. పాటలకీ, డేన్సులకీ ప్రాక్టీసెప్పుడు చెయ్యాలో నిర్ణయాలయ్యాయి. మేం అన్యమస్కంగానే తలలాడించాం. నాలుగు దాటితే కాలేజ్ అయిపోతుంది. క్లాసులెగ్గొట్టిన వాళ్ళం, అందరితో కలిసి వెళితే బాగోదని కాస్త ముందే బయలుదేరాం. 

"నీ కుడి నాకు ఎడమైంది సైయ్య్య్" మారిన పాటలు ఫ్లోర్‌ని దడదడలాడిస్తున్నాయ్. 

**

ఒకటో నంబర్ బస్ వచ్చింది. అది బందరు రోడ్డులోనే వెళ్తుంది. మామూలుగా అయితే, నేను 28 నంబరు బస్ కోసం ఎదురుచూడాలి,  ఏలూరు రోడ్డు వెళ్ళే బస్సు అదొక్కటే కనుక. కానీ, ఆ రోజు స్నేహితులను విడవాలనిపించలేదు. ఆ బస్ ఎక్కితే బెంజ్ సర్కిల్ నుండి స్టెల్లా కాలేజీ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి నేను. అయినా పట్టించుకోలేదు. 

బస్ కాస్త ఖాళీగానే ఉంది. నేను, దీప్తి, రమ్య, హరిత ఒకే వైపు వెనుకా ముందూ సీట్లలో కూర్చున్నాం. "అసలు జిప్ పెట్టించుకోవడం ఏంటే, సినిమాల్లో హీరోయిన్స్ లా?" మొహం చిరాగ్గా పెట్టి అడిగింది దీప్తి. 

ఔను, అందరం ఆ మాట కోసమే చూస్తున్నాం. 
ఎలా మొదలెట్టాలీ? ఏం తిట్టాలీ? మా అసూయ బయటపడకుండా దాచి, ఈర్ష్యనంతా ఎలా కక్కాలీ? 
"జిప్ పెడితే ఇలా మన డ్రస్సుల మీద చున్నీ వేసుకున్నట్టే హాయిగా ఉంటుందట. పంజాబీ డ్రస్సులకి మాత్రం అదివరకు ఉన్నాయా వెనుక జిప్పులు? ఇప్పుడు రావట్లా? ఇదీ అంతే!" 

"స్టెప్స్ పెట్టుకోదుట, ఒంటి పొర మీద ఆ సిల్కు చీర కడుతుందిట. కుడి భుజం మీద ఆ మామిడి పిందె మధ్యలో రాళ్ళు ధగధగా మెరుస్తూ కనపడతాయట. "

"అసలు ఇదంతా దానికేం తెలుసు? అరుణా ఫేషన్స్ వాళ్ళే చెప్పారుట, ఇలా కట్టుకోవాలని. అక్కడే చీర కొందిట. అక్కడే కుట్టించుకోవడం కూడా. దాన్ని చూసే అందరూ తయారయ్యారు."

"ఒకళ్ళకి పెట్టిన మోడల్ ఇంకొకరికి పెట్టడుట ఆ టైలర్. లక్నో నుండి వచ్చాడుట, తెల్సా?"

"మనమూ వెళ్తేనో?" దాదాపు అందరం ఒకేసారి పైకే అన్నాం. 

"పోనీ ఇంట్లో అడిగి చూద్దాం" మాకు మేమే సర్దిచెప్పుకుంటున్నట్టు, మళ్ళీ పైకే అన్నాం.

ఈనాడు ఆఫీసు వచ్చేసింది. నేనొక్కదాన్నే దిగిపోయాను. అక్కడి నుండి మా ఇంటికి పదిహేను నిముషాల నడక. 

ఈడ్చుకుంటూ నడవడం మొదలెట్టాను. కళ్ళ ముందు కోటి రంగులు తిరుగుతున్నాయ్. ఆలోచనలు ఎటో పోయి తిరిగొస్తున్నాయ్. 
అమ్మకి చెప్పాలి. ఎలాగైనా "అరుణా ఫేషన్స్" కి తీసుకెళ్ళమని అడగాలి. ఏదో ఒకటి చేసి అమ్మని ఒప్పించాలి. ఎలా?  ఎలా?

నిర్మలా కాన్వెంట్, బేకర్స్-ఇన్, హవేలి, కేసినేని ట్రావెల్స్, విజయకృష్ణా సూపర్ మార్కెట్, అశోక్ బుక్ సెంటర్- ఒక్కోటీ దాటుకుంటూ వస్తున్నాను; ఆలోచనలు తెగట్లేదు. అలాగే ఎడమ వైపు తిరిగి ఇంకో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకున్నాను.
**
"మొన్న వెళ్ళమన్నావ్, వెళ్ళాను. నిన్న కూడా చూసి వచ్చాను. వాళ్ళింట్లో ఉండరమ్మా.ప్లీజ్! ప్లీజమ్మా! కాంధారి పక్కనే పెట్టార్ట, పెద్ద షాపు. ఈ ఒక్కసారికీ అక్కడికి వెళ్దామమ్మా. బీసెంట్ రోడ్ అంటే దూరం. ఇది దగ్గరే కదమ్మా. మా వాళ్ళంతా అక్కడే కొనుక్కుంటున్నారు. నేనూ అక్కడికే వెళ్తా అమ్మా. అమ్మా ప్లీజ్"
ఆ సాయంత్రం అమ్మ ఎటు వెళ్తే అటు వెనకాలే వెళ్తూ వీలైనంతా ప్రాథేయపడుతున్నా. 
అమ్మ వినేట్టేం లేదు. ఇంకో పది నిముషాల తర్వాత అప్పటి దాకా నేను చెప్పినవేవీ వినపడనట్టే, 

"మణిగారి దగ్గరికి మళ్ళీ ఓ సారి వెళ్ళొద్దాం పద, నేనూ వస్తాను" అంటూ బయలుదేరింది. ఎంత కోపం వచ్చిందనీ నాకు! తమాయించుకుని అమ్మ వెనుకే నడిచాను.

*
మునివేళ్ళలో నా మర్యాదంతా దాచుకుని, తలుపు తట్టాను.  సమాధానం లేదు. గుమ్మం పక్కనే చిన్న కిటికీ. దానికి పూర్తిగా సరిపోని ఓ చీర చెరగు కర్టెన్లా కట్టుకున్నారు. నాకు ఆలస్యమయ్యే కొద్దీ విసుగు పెరిగిపోతోంది. వద్దు వద్దనుకుంటూనే ఆ కర్టెన్ కూడా పక్కకి తోశాను. గుడ్డ ముక్కలు. త్రిభుజాకారంలో. సన్నగా, పొడవుగా, చీలికలుగా. ముక్కలు ముక్కలుగా. పోగులు పోగులుగా. రంగులు రంగులుగా. వాటన్నింటి మధ్యలో, ఓ కుట్టు మిషన్. దాని మీద వేలాడుతున్న చీర. లోపలికి ఇంకో చిన్న గదేదో ఉన్నట్టుంది. కానీ మనుషుల అలికిడి లేదు. ఇంకో ఐదు నిముషాలు గడిచాయి. నాకు లోపల్లోపల సంతోషంగానే ఉంది. 

సున్నబ్బట్టీల దగ్గర కూరలు తీసుకుని ఇటు వద్దామంది అమ్మ. నేను మణిగారు ఉన్నారో లేరో చూసి చెప్తానని ఇటు వచ్చేశాను. ఇంకొక్క సారి కొట్టి, ఆవిడ లేకపోతే అమ్మని అటు నుండటే సిద్ధార్థ కాలేజీ మీదుగా ఖాంధారి దగ్గరికి తీసుకు వెళ్ళాలి. నా ఉత్సాహం రెక్కలు కట్టుకుని ఆకాశం దాకా ఎగిరేదే, వెనుక నుండి మణిగారు, అమ్మ కలిసి రావడం కనపడకపోతే.

ఆవిడ చేతిలోని సంచులు రెండూ గుమ్మం దగ్గరే పెట్టేసి, మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారు. 
రెండు గదుల ఇల్లు. రెండూ గదులూ ఒకేలా ఉన్నాయ్. ఓ వైపంతా చీరలు. జాకెట్లూ, కుట్టు మిషనూ; చిన్న మంచానికి మగ్గం పని చెయ్యడానికి అమర్చుకున్న సాదా బట్టలు. ఇంకో వైపు గోడకు ఎత్తేసిన మంచం. గోడల నిండా ఏవో ఇంగ్లీషు కొటేషన్లున్న పోస్టర్లు. నేను వాటిని మనసులో తెలుగులోకి తర్జమా చేసుకుంటూ లోపలి గదిలోకి తొంగి చూశాను. నాలుగు పాత్రలు. స్టవ్, ఎవో సమాను. చింకి చాప మీద పరిచిన చిరుగుల బొంత మీద అమ్మ సద్దుకు కూర్చుండిపోయింది. నా మొహానికో ముక్కాలి పీట, ప్లాస్టిక్‌ది పడేశారు. యాభై కేజీల నా బరువు అది మోయగలదో లేదో అర్థం కాక, నేను కాసేపటికే జారి కింద కూర్చుండిపోయాను.

వాళ్ళిద్దరూ చాలా సేపే మాట్లాడుకున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో చొరబడకూడదన్నది చిన్నప్పటి నుండీ నూరిపోసిన అలవాటు కనుక, నా పాత్ర లేనప్పుడు నేను వినడమెందుకని చుట్టూ చూడటం మొదలెట్టాను. బయటకి ఓ అడుగేశానో లేదో, ఓ మూణ్ణాలుగేళ్ళ పిల్లవాడు, ఏడ్చీ ఏడ్చీ చారికలు కట్టిన బుగ్గలతో, సరిగా తినక మూతి నిండా పూసుకున్న పెరుగన్నం గుర్తులతో, ఓ ముసలావిడ చంకలో నుండి కిందకు దూకాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఆవిడ బలం సరిపోక కాస్త విసుగ్గానే వాణ్ణి బిడాయించి పట్టుకుంటోంది. మణి గారు వాళ్ళిద్దరినీ చూసీ పెద్ద పట్టించుకోలేదు. ముసలావిడ పిల్లాణ్ణి రెండో గదిలోకి తీసుకెళ్ళి తలుపేసుకుంది. లోపల నుండి పసివాడి ఏడుపు వినపడుతూనే ఉంది. 

అమ్మ కళానికేతన్ గుడ్డ సంచీలో నుండి నాకు కుట్టాల్సిన బట్టలు తీసి ఆవిడకు ఇచ్చింది. ఆవిడ అడవి లాంటి ఆ ఇంట్లో టేపు కోసం ఓ ఐదు నిముషాలు వెదికి, ఎట్టకేలకు కొలతలు తీసుకుంది. 

ఆవిడ వచ్చేముందు రకరకాల చీరలు చూపెట్టారు. అమ్మ పట్టుకుని చూసి, రంగులూ , నాణ్యతా బాగున్నాయనీ, కాస్త వీలుగా ఉన్నప్పుడు, మరోసారెప్పుడైనా తప్పకుండా తీసుకుంటానని మాట ఇచ్చి వచ్చేసింది. 

"కాస్త ముందు చెప్పక్కా, వచ్చే నెల బొంబాయి వెళ్తున్నా. ఏ రేటులో కావాలో చెప్పి డబ్బిస్తే, నీకు నప్పేవి వెదికి తెచ్చి ఇచ్చే పూచీ నాది" గేటు దాకా వెనుకే వస్తూ చెప్పింది. 

ఇంటికి వచ్చేస్తుంటే మనసంతా అసంతృప్తి. నిన్న బస్సులో అందరం అరుణా ఫేషన్స్‌కి వెళ్ళాలనుకోవడం గుర్తొచ్చింది. ఆ ఏ.సీ రూములు, కూల్ డ్రింకులు, మోడల్ పుస్తకాలూ, అద్దాల గదులూ...ఏమీ లేని మణిగారిల్లు! ఆ మాసిపోయిన పరుపుల మధ్యలో, ఆ హడావుడి కొంపలో నా బట్టలు కానీ తప్పిపోవు కదా అని దిగులొకటి మొదలైంది.

**
అంత భయపడ్డట్టు ఏం జరగలేదు. ఆవిడ అన్న వేళకే చిన్న డిజైన్ కుట్టి నా బట్టలిచ్చేశారు. నా చేతిలోకి తీసుకోగానే గరగరమంది జాకెట్టు. విప్పి చూశాను, న్యూస్‌పేపరుంది లోపల. గొప్ప వర్క్ కాదు కానీ, మేమిచ్చిన డబ్బులకి అందంగా, కుదురుగా, మర్యాదగా చేసిన వర్క్.

**

నా చదువు అయిపోయింది. మా పార్టీ ఊహించినదానికి వెయ్యి రెట్లు గొప్పగా జరిగింది. మా క్లాస్ అబ్బాయిలు సొంత డబ్బులు వేసుకుని చెయ్యబట్టి అంత బాగా జరిగిందని తర్వాత తెలిసింది. స్వర్ణాపాలెస్ ఫంక్షన్ హాల్లో , ఆ రాత్రి ముప్పై సీతాకోక చిలుకలు సందడిగా తిరగడాన్ని మరో ముప్పై జతల కళ్ళు కళ్ళ నిండా నింపుకున్నాయి. సంతోషాన్నీ, దిగులునీ, కొన్ని కొత్త క్రష్‌లనీ అరవై గుండెలూ దాచుకుని బరువెక్కి ఇళ్ళకు చేరాయా రాత్రి.

**
మరో మూణ్ణెళ్ళకి, నేను మళ్ళీ మణి గారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్క పెళ్ళి పనులు, నాకు ఉద్యోగం వచ్చేసింది, క్యాంపస్ సెలక్షన్‌లో.ఇద్దరికీ డ్రస్సులూ, చీరలూ. నాకు నచ్చిందే నీకు కావాలనీ, నీకు నచ్చిందే నాదనీ, అలవాటైన పోట్లాటలతోనే అక్కా నేనూ షాపింగ్ చేసుకున్నాం. 

మణిగారు ఇల్లు మారారని చెప్పి, కొత్త ఇంటి అడ్రెస్ ఇచ్చి, బట్టలు కుట్టించుకు రమ్మని, తను ఇంటి పనుల్లో ఉండిపోయింది అమ్మ.

"మరీ ఒంటికంటుకుపోయేలా వద్దు. ఆవిడకి గట్టిగా చెప్పండి" మళ్ళీ ఇంకోసారి వెనుక నుండి అరిచి గుర్తు చేసింది.

కొత్త ఇల్లు చాలా బాగుంది. 2 బి.హెచ్.కె నే కానీ, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంది. అక్కడ నాలుగు మంచాల మీద రంగు రంగుల, ఖరీదైన చీరల మీద చంకీలు, పూసలు, ఏవో డిసైన్లు, దారాలు పెట్టుకుని మెడలు పడిపోయేలా పని చేస్తున్నారు - నలుగురు అమ్మాయిలు.

మణిగారు మమ్మల్ని చూసి ఎప్పట్లాగే ప్రేమగా పలకరించారు. మా సూచనలన్నీ విని, ఫలానా రోజు రమ్మని పంపేశారు. నేను వెనక్కి వచ్చేస్తోంటే గడప దగ్గర పెట్టాననుకున్న నా చెప్పులు కనపడలేదు. ఆనుకుని ఉన్న సందులోకి వెళ్ళాను. గదిలో ముసలావిడ పిలాణ్ణి కూర్చోబెట్టుకుని వాడి కబుర్లు వింటూ నవ్వుతోంది. నన్ను గమనించనే లేదు.

**

మణి గారు అన్నవేళకి బట్టలేవీ ఇవ్వలేకపోయారు. మా బట్టల సంగతి గుర్తు చెయ్యడానికి పదే పదే వాళ్ళింటికి వెళ్ళాల్సి వచ్చేది. అది నాకు విసుగ్గానూ, చిరాగ్గానూ ఉండేది. అక్కడ కొత్తగా ఇద్దరు హింది కుర్రాళ్ళు పనికి కుదిరారు. ఆవిడ వాళ్ళతో వచ్చీ రాని హిందీ మాట్లాడుతూ పని పురమాయించేది. అసలే దక్షిన భారత హింది ప్రచార సభ పరీక్షలు కట్టి ఉన్నానేమో, ఆవిడ భాష నాకింకా చిరాకు తెప్పించేది. స్వభావసిద్ధమైన మొహమాటం నన్ను ఏ భావమూ పైకి కనిపించనీయకుండా అడ్డుకునేది. 

ఆవిడ ఎప్పటికో పని పూర్తి చేసి, 'అక్కకి సారీ చెప్పానని చెప్పరా! పని బాగా ఎక్కువైపోయింది', అన్నారు నా చేతులు పట్టుకుని. నేను తలూపి వచ్చేశాను.

ఇంటికి వెళ్ళేసరికి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కొందరు మా ఇంట్లోనే ఉన్నారు. చీరలు చూస్తూ, నగలు పరికిస్తూ సందడి సందడిగా ఉంది ఇల్లంతా. చింటూ వాళ్ళ మమ్మీ నా చేతుల్లోని కవరు లాక్కుని ప్రతి చీర మీదా, డ్రస్సు మీదా బ్లవుజు మీదా మణిగారు చేయించిన పనంతా పట్టి పట్టి చూశారు.

"మణిగారెప్పుడూ చెప్పిన టైంకి ఇవ్వరండీ, నేనావిడకు ఇవ్వడం మానేశాను" అన్నారొకావిడ.

"డబ్బులు కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారండీ, పని బానే ఉంది కానీ…" ఇంకో ఆంటీ కలిసారు.

"మాటలతో నడిపించేస్తున్నార్లెండి" మరొకావిడ నవ్వుతూ చేతిలో ఉన్న బ్లవుజులు టీపాయి మీదకి విసిరి కొట్టారు.

"కుకర్ విజిల్ రావట్లేదెందుకో...చూసొస్తా ఒక్క నిముషం" అమ్మ హడావుడిగా లోపలికెళ్ళిపోయింది.

మంచినీళ్ళ కోసం లోపలికెళ్ళిన నాకు, అమ్మ బాల్కనీలో చీకట్లో నిలబడి ఎటో చూడటం తెలిసింది.

*
ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోతున్నాయి. నా పెళ్ళి అయి బెంగళూరు వచ్చేశాను. అక్క వాళ్ళ అత్తమామల హాస్పిటల్‌కు దగ్గరగా ఉంటుందని విజయనగరం షిఫ్ట్ అయిపోయింది. నేను బట్టల విషయంలో మణి గారిని నమ్ముకోవడం ఏనాడో మానేశాను. నా అభిరుచులు మారాయి. కాస్త స్వతంత్రం వచ్చింది. డబ్బు చేతుల్లో పుష్కలంగా ఆడుతోంది..సహజంగానే బట్టల విషయంలో అమ్మ నుండి కాస్త మినహాయింపు దొరికింది.

అయితే, అమ్మకి ఇన్నేళ్ళలోనూ, ఇంకో టైలర్‌ని పరిచయం చెయ్యలేకపోయాను. చేసిన ఒకరిద్దరి పనీ అమ్మని మెప్పించలేదు. ఎన్ని నెలలైనా ఎదురు చూస్తుంది కానీ, వేరే వాళ్ళకి బట్టలివ్వడానికి ఒప్పుకోదు. 

"బీరువా నిండా నిలువెత్తు చీరలు. కట్టినవీ, కట్టనివీ, పెట్టినవీ ..అన్నీ రాసుల్లా పోస్తున్నాను, ఇప్పటికప్పుడు కుట్టించుకుని ఈ రోజే కట్టుకోవాల్సిన చీరలేమున్నాయ్ కనుక." అని తీసి పారేస్తుంది. మణి గారు వీలు చిక్కినప్పుడెప్పుడో కుట్టి అమ్మకిచ్చేస్తారు. ఆవిడ బిజినెస్ ఇప్పుడు పెద్దదైందని విన్నాను. అయినా ఈ సాదా జాకెట్లు ఇంకా ఎందుకు కుడుతుందో ఆవిడ - ఆశ్చర్యమనిపిస్తుంది.

**

దసరాకి ఇంటికెళ్ళినప్పుడు, కుట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయని, అమ్మ పట్టుబడితే ఆ సాయంత్రం మణి గారి దగ్గరికి వెళ్దామనుకున్నాం.

సాయిబాబా గుడికి వెళ్ళి, ధునిలో కొబ్బరికాయ వేసి, గుడి ఎంత మారిందో అనుకుంటూ, మణిగారి ఇల్లు వెదుక్కుంటూ బయలుదేరాం. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.

బాగా ధనవంతులుండే రెసిడెన్షియల్ ఏరియాలో నాలుగంతస్తుల భవనంలోకి మారారావిడ. ఆ కాలనీలోకి తిరగ్గానే ఓ ఆరేడేళ్ళ పిల్లవాడు హేండిల్ అటూ ఇటూ ఊపేస్తూ మా మీదకొచ్చాడు. తూలి పడబోతూ, కాళ్ళు నేలకాంచి నిలదొక్కుకున్నాడు. వెనుక నుండి వాళ్ళ అన్నయ్యో స్నేహితుడో రొప్పుకుంటూ వచ్చాడు. "నీకింకా పూర్తిగా రాలేదురా, పడిపోతావ్ " వాణ్ణి పట్టుకుని సైకిల్తో సహా ఓపిగ్గా నడిపిస్తున్నాడు. వాళ్ళ అమ్మ గుమ్మంలోనే నిలబడి "కన్నయ్యా, ఈ రోజుకిక చాలు నాన్నా, ఇంకా ముందుకి వెళ్ళకు, మెయిన్ రోడ్ వస్తోంది, ఒక్కడివే వెళ్తే ఇంకా ఏమైనా ఉందా?" అంటూ ఆపకుండా అరుస్తూనే ఉంది.
మణి గారి ఇల్లెక్కడో ఆమెనే అడిగాం. అక్కడికి మూడో ఇల్లేనని చెప్పింది. చప్పునే దొరికింది.

ఆ ఇల్లు చూస్తే నాకు మతిపోయింది.  మొదటి అంతస్తులో టైలరింగ్, బిల్లింగ్. రెండో అంతస్తు నిండా పనులు. మూడో అంతస్తులో ఎగ్జిబిషన్, సేల్.గ్రవుండ్ ఫ్లోర్ లో వాళ్ళు ముగ్గురూ ఉంటున్నారు. మణి గారితో మాట్లాడాలంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఉండాలట. అదృష్టవశాత్తూ మేం వెళ్ళినప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉన్నారు. అమ్మను చూస్తూనే పరుగు పరుగున బయటకు వచ్చి, మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకు వెళ్ళారు. నేను తలెత్తి ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నాను. అక్కదీ అదే స్థితి. అమ్మా, ఆవిడా చాన్నాళ్ళకి కలిసిన స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. మణి గారి చేతిలో ఫోన్లు మోగిపోతున్నాయి. ఆవిడ ఒక ఫోన్ ఎత్తి ఏదో మాట్లాడి అక్కడ ఎవర్నో పిలిచారు. ఒకమ్మాయి చెంగుచెంగున వస్తే, ఏదో పురమాయించి పంపేశారు.  

నేను కూర్చున్న సోఫా మెత్తగా కిందకు దిగుతోంది. నా మనసు ఒక్కసారిగా పదేళ్ళు వెనక్కి వెళ్ళి, మొట్టమొదటిసారి వాళ్ళింటికి, మా వెనుక వీధిలోని రెండు గదుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన మాసిపోయిన చిరుగుల పరుపుని గుర్తు తెచ్చింది. ఎ.సి. గాలులు విజయవాడ ఉక్కపోతను మర్చిపోయేలా చేస్తున్నాయి. ఇందాక కనపడ్డ అమ్మాయి మా ముగ్గురికీ గాజు గ్లాసుల్లో నింపి కూల్ డ్రింక్సు తెచ్చింది. మేం వద్దన్నా వినలేదు. ఒద్దికగా నిలబడి, "తీసుకో అక్కా" అంది.

మణిగారి ఫోన్ ఆగకపోవడంతో, ఆవిడకి వెళ్ళక తప్పలేదు.

నేను రహస్యంగా అమ్మతో "అమ్మా, షి ఈజ్ ఆసమ్. ఎన్ని కోట్ల టర్నోవరంటావ్? ఓ మై గాడ్, దిస్ ఈజ్ అన్‌బిలీవబుల్.." చెప్పుకుపోతున్నా కానీ, నా గొంతులో ఎంత వద్దన్నా ఉద్వేగం దాగట్లేదు. 

అమ్మ నవ్వింది.

"షి మస్ట్ బి ప్రౌడ్ నౌ… కదమ్మా?" మళ్ళీ అడిగాను. 

లోపలి నుండి ముసలావిడ వచ్చారు, అమ్మని చూసి గుర్తుపడుతూ.

"బాగున్నావా తల్లీ?" అని పలకరించారు.

అమ్మ లేచి ఎదురెళ్ళి, ఆవిడను కుర్చీలో కూర్చోబెట్టి,

"బాగున్నానండీ, మొన్నే రిటైర్ అయ్యాను. మీకు ఒంట్లో కులాసాగా ఉంటోందా?" అని అడిగింది.

ఆవిడ రెండు చేతులూ ఆకాశానికేసి చూపించి, నిర్లిప్తంగా నవ్వింది

అంతలోనే, "ఇల్లంతా చూశారా? నచ్చిందా? పైకి కూడా వెళ్ళండి, ఎంత పట్టు బట్టి చేయించుకుందో మణి..."

"బ్రహ్మాండంగా…" అమ్మ మాట ఇంకా పూర్తవనే లేదు, 

"ఎంత కష్టం ఓర్చిందోనమ్మా, ఇన్నాళ్ళకిలా. ఒళ్ళు హూనం చేసుకుంటోంది. ఆపమందామంటే భయం, మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటుందేమో, ఎవరికీ చెప్పా చెప్పదు. ఒంటరిగా అంత బాధా మింగుకుని ఏమైపోతుందోనని.."

కూల్ డ్రింక్ తాగుతున్న నాకు పొలమారినట్టైంది. తల ఎత్తలేదు.

అమ్మ తెలిసిన విషయాలే వింటునట్టు తలాడిస్తోంది.

"ఎంత ప్రేమించిందో అంత మోసపోయింది, ఎంత నమ్మిందో అంత ఏడ్చింది. పిల్లాడి ముఖం చూసి కూడా మళ్ళీ దగ్గర కాలేదమ్మా వాడు. అందరూ దీన్ని తిట్టేవాళ్ళే, అందరూ దీన్ని పొమ్మన్నవాళ్ళే, ఆడదిగా పుట్టినంత మాత్రాన తప్పు దీనిదే అవుతుందా తల్లీ?
ఏ జన్మ బంధమో, ఏమీ కాని నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఒక్క ముద్ద అన్నం పెట్టిన పుణ్యానికి..నన్నిప్పుడు..నా తల్లి.."

నా నోరంతా చేదుగా ఐపోయింది. మణిగారు తిరిగొచ్చారు.

"ఏమంటోంది అమ్మ..?" నవ్వుతూ అడిగారు

"ఆరోగ్యం జాగ్రత్త మణీ, ఏం తినట్లేదని బెంగ పడుతున్నారు" అమ్మే చెప్పింది.

"దీనికేం ఢోకా లేదులే అక్కా.." తీసిపారేశారు.

ఇంతలోనే గుంపుగా ఆడవాళ్ళొచ్చారు. మణి గారు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది.

"పోనీ ఇంకో పెళ్ళంటే వినదు. చిన్నప్పుడే చేసిన పెళ్ళి కదమ్మా, దానికిప్పుడు ఏమంత వయసనీ? ఒంటరిగా బతగ్గల్గిన రోజులేనా ఇవీ? నాలుగేళ్ళ క్రితం బోలెడు సరుకూ, డబ్బూ తీసుకుని ఇద్దరు పారిపోయారు. వడ్డీ అడక్కుండా మీలాంటి వాళ్ళు లోన్లు పెట్టి మా అభిమానం కాపాడారు. గుజరాత్ నుండి వచ్చిన టైలర్ ఒకడు పని మానేసి దీన్ని వేధించుకు తిన్నాడు. పనిలో మాటలు పడాలి. ప్రయాణాలు ఒంటరిగా చెయ్యాలి. ఎన్నని తట్టుకుంటుంది, ఎందర్ని ఎదిరిస్తుంది? ఎన్నాళ్ళిలా?"

"పిచ్చిదమ్మా, దానికసలేం తెలీదు, ఒక్కత్తీ ఇంత కష్టం పడుతూంటే, చూళ్ళేక... భగవంతుడు దానికో దారి చూపిస్తే" ఆవిడ గొంతు పూడుకుపోతోంది, ముక్కలు ముక్కలుగా మాట్లాడుతోంది.

అమ్మ ఆవిడ చెయ్యి నిమురుతూ ఉండిపోయింది.

మణిగారు హడావుడిగా లోపలికొచ్చి, "అమ్మా! మొన్న లక్నో నుండి తెప్పించిన స్టాక్ ఎటు పంపావు? పోయినవారం ఇచ్చిన డబ్బుల్లో పాతికవేలు కావాలి, తీసి ఉంచు. పైన కొత్త పార్టీ వచ్చింది, కలిసి ఇప్పుడే వచ్చేస్తాను" అని మావైపు తిరిగి,

"సారీ అక్కా, ఈ రోజు మరీ హడావుడిగా ఉంది, ఏమనుకోవుగా!" అని మా వైపు తిరిగి, ముగ్గురి దగ్గరా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. 

మేమూ ఇంకాసేపు కూర్చుని, కింద మా బట్టలిచ్చి బయటికొచ్చేశాం.

వీధి మొత్తం లైట్లతో వెలిగిపోతోంది.సాయిబాబా గుడి నుండి భజనలు వినపడుతున్నాయి. మేం ఇందాక చూసిన పిల్లవాడు ఇంకా సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నాడు. వాడికి ఒంటరిగా వెళ్ళడంలో మజా తెలిసింది. అమ్మ ఎంతసేపు కాపు కాస్తుంది, ఆవిడ వెళ్ళినా వీడి ఆట వీడిదే. మేం చూస్తూండగానే కిందపడ్డాడు. మళ్ళీ లేచాడు. చీరుకున్న మోచేతిని, మరోచేత్తో గట్టిగా రుద్దేసుకున్నాడు.

నేను వాడినే గమనిస్తున్నాను. అక్క ఆటో మాట్లాడింది. మా ఆటో మెయిన్ రోడ్ మీదకు వచ్చింది. సైకిల్  పిల్లవాడు మేం చూస్తూండగానే మమ్మల్ని దాటుకుని ముందుకెళ్ళిపోయాడు. కార్లు, లారీలు, బస్సులు..అన్నింటి మధ్యా వీడు. ఒక్కడు. ఇంకా విద్య పూర్తిగా రానివాడు.

అయినా పర్లేదు, వాడికేం కాదు. ఏమైనా వాడు తట్టుకుంటాడు. వాడు ముందుకే వెళ్తాడు.
*
తొలి ప్రచురణ, మధురవాణి త్రైమాసిక పత్రికలో..

2 comments:

  1. ఇది కథ లేదా మీ స్వంతమా అన్నది కొంత అర్థం అవ్వలేదు. అయితే రచన బావుంది కంటే ఒక మెట్టు పైన ఉంది. నేను ఖచ్చితంగా చెప్పాలేను కానీ ఎక్కడో కొంత అస్పష్టత ఉంది

    ReplyDelete
  2. ఎంత బావుందో.. ఆవిడ కధ. సక్సెస్ తెచ్చిన గుర్తింపు ఎంత బావుంటుందో మాత్రమే మనకి తెలుస్తుంది. దాని వెనుక కష్టం మాత్రం ఎంత అత్భుతమైన అనుభవమో బాగా రాసారు.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....