అబద్ధం

కొండ కొప్పున తురిమిన
నెలవంకల మాలలా
ఘాట్ రోడ్
కాసేపు నలుపు, కాసేపు వెలుగు.

ముక్కలుగా మారి
చప్పుడు లేకుండా లోయ చీకట్లలో పడేముందు
హరివిల్లుగా వెలిగే రంగులు కాసేపు

ముప్ఫైఆరు మలుపులు తిరిగాక
మైదానాన్ని నిస్సిగ్గుగా కావలించుకు
పడుకున్న వెన్నెట్లో, రెండు చేతుల్తో…

                                                                     దొరకడు… నమ్ము

పట్టుకోవాలని తపించి
తపించి ఘడియలుగా దహించుకుపోయిన
రాత్రిని లాలించి
తప్పించి

సూరీడు నేలను ముద్దాడకుండా ఆపాలని
పైన్ చెట్ల నీడలు వెర్రెత్తినట్టు ఊగే
తోటల్లో చేరి, చీకట్లో, రెండు దీపాల్తో…

                                                                   ఒకవేళ దొరికినా…

నడిచి నడిచి ఏ వైపు నుండో
కమ్ముకున్న పొగ మంచులో నుండి
తేటగా ఎవరో కనపడీ
సంపెగ రెక్కలు మూతబడీ

కారు అద్దాలు కిందకి
అంతలోనే రయ్యిమని పైకీ
ఆ వంక ఆకాశం
నేలను కలిసేందుకు కిందకు వంగినట్టే వంగి…

                                                                     అబద్ధం

గత జన్మ కథేమిటో
చెప్పేందుకేమీ గుర్తు లేదు కాని,
ఇప్పుడు వైపర్ ఊగిసలాట పూర్తయ్యేలోపే
ముగిసిపోయిన కథ గురించి బాధేమీ లేదు కాని,

నా వేలి అంచుల్లో నిలిచి,
చూపు కొసలను తడిపి
పూల తీగల ఊపిరి తగిలేలా తల్లకిందులుగా ఊగించి,
వంచించి

లోయలోకి జారిపడ్డ చినుకుని పట్టలేక
ప్రాణమెందుకలా చితికిపోయిందో
ఒలికిపడ్డ నాలుగు చుక్కల యూకలిప్టస్ వాసన
ఊపిరి మడతల్లో నలిగి నలిగి ఎందుకు మరలిపోనంటోందో

ఎండిపోయిన జలపాతపు గుర్తుల్ని
ఎన్నేళ్ళైనా మోసుకు తిరిగే కొండల్ని
ఈ వైపు నుండి చూసినప్పుడల్లా
ఈ గుండె కదిలి కొట్టుకున్నప్పుడల్లా…

                                నేను ముందే చెప్పాను.


**తొలి ప్రచురణ, ఈమాట, జులై-2017 సంచికలో

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....