స్కేట్ క్లాస్

 అనుకోకుండా వెళ్ళానక్కడికి. అయిష్టంగా.

చూడకూడదనుకుంటూనే చూశాను. వాడు పడుతుంటే చూశాను. లేస్తుంటేనూ.
శనాదివారాల్లో సాయంత్రాలు వెదర్ బాగుంటే పిల్లాడికి స్కేటింగ్ క్లాస్. కొన్ని పనులు ఎందుకో అనిల్‌కే అప్పజెప్పేస్తాను. సైకిల్ నేర్పించడం, స్కేట్ స్కూటర్, స్కేటింగ్, హెయిర్ కట్...కొత్త విద్యలు నేర్పించేటప్పుడో, మప్పితంగా మంచి అలవాట్లకు ఒప్పించేప్పుడో మాత్రమే కాదు, తలస్నానాలు చేయించడం, స్కూల్‌బస్ దగ్గర దింపడం లాంటి మామూలు పనుల్లో కూడా కొన్ని అనిల్‌కే ఇచ్చేస్తాను. వాడు ఇష్టపడడనో, ఇబ్బంది పడతాడనో గాయపడతాడనో అనిపించిన ప్రతి విషయానికీ నాకు తెలీకుండానే కొంత ఎడం పాటిస్తానని మొన్నెప్పుడో మేం మాట్లాడుకుంటుంటేనే అర్థమైంది. అలా తెలిసాక, ఊరికే ఆ ఇబ్బందిని కొంతైనా దాటడానికా అన్నట్టు, ఎప్పుడైనా నేనూ ఆ స్కేట్ క్లాస్‌కి వెళ్దామనుకున్నాను. అనుకోకుండా అనిల్‌కి వేరే పనిపడటంతో నిజంగానే నేను తీసుకెళ్ళాల్సి వచ్చింది.
అలా,
అనుకోకుండానే వెళ్ళానక్కడికి. కొంత అయిష్టంగానే.
చూడకూడదనుకుంటూనే చూశాను. వాడు పడుతుంటే చూశాను. లేస్తుంటేనూ.
దాదాపు గంటసేపు అక్కడి పిల్లలందరి దేహాలూ ఏ చప్పుళ్ళకూ అల్లర్లకూ చెదరని అపురూపమైన ఏకాగ్రతతో ఆ మైదానమంతా వలయాలుగా తిరగడం చూశాను. తేలిగ్గా, హాయిగా హేలగా వాళ్ళలా కాళ్ళ కింది చక్రాలతో కళ్ళ ముందు నుండి కదిలిపోవడం చూశాను. ఇష్టంగా ధైర్యంగా ఆ మైదానపు మూలల్లోకి చెదిరిపోవడం చూశాను. స్నేహంగా మళ్ళీ ఒకేచోటకు చేతులు పట్టుకు చేరిపోవడం చూశాను. కొందరి కళ్ళలో భయమూ చూశాను, కాళ్ళు పైనుండి కింద దాకా వణికిపోవడం చూశాను. జర్రున జారి, మోకాళ్ళ మీద పడిపోవడం చూశాను. పడి లేస్తుంటేనూ.
ఆట అయిపోయింది. హెల్మెట్ కింద, తడిసి అంటుకుపోయిన జుట్టు. మైదానమంతా వెలుగుతూ ఆరుతూ రంగు దీపాలు. బిగ్గరగా, పాదాలను ఆడించేంత సందడిగా, నరాలను తాకుతోందా అన్నంత దగ్గరగా -సంగీతం. ఆ ఉత్సాహపు లోకంలోకి వాడొక తుళ్ళింతై వెళ్ళిపోయాడు. తానూ అక్కడి స్వరకోలాహలంలో ఓ కేరింతై కలిసిపోయాడు. ఎదురుపడ్డ రంగుల లోయలోకి, నన్ను విడిచి, ఈకలా జారిపోయాడు.
రంగు దీపాల నీడలు నా మీదుగా కదిలి వెళ్ళిపోతున్నాయ్. మైదానం ఖాళీ అవుతోంది. రాత్రిని తోడు పిలుచుకున్న బెంగళూరు చలిగాలిలో ఉన్మత్తత మొదలవుతోంది.
దేహపు లోపలి వణుకుని స్వెటర్‌తో కప్పుకుంటూ చూశాన్నేను. చూస్తేనే అంటుకుపోయే ఆ పసిప్రపంచపు ఉత్సాహాన్ని. వాళ్ళ వాళ్ళ ఆటల్లో ఉన్నప్పుడు, ఒక్కరే ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఒకే మాటను మంత్రంగా చేసుకుని, ఒకే పల్లవిని పదే పదే పాడుకుని, లోలోపలి సంబరమంతా కొత్త కదలికై వాళ్ళని కుదిపేయడాన్ని నిశ్చింతగా అనుభవిస్తూ, సమయాన్ని ఆ లేతపాదాల కింద నొప్పి తెలీకుండా తొక్కిపెట్టడాన్ని, చీకటి వేళల చలిగాలి నిర్దయని, దీపాల నీడలని, నా చిన్ని తండ్రిని. ❤️
May be an illustration

మందారమా...మాటాడుమా...

మందారమా..మాటాడుమా...పొగమంచుకు తలుపులు తీస్తే పాటని తన చుట్టూ తిప్పుకుంటూ వస్తుంది దేవి. ఆమె గిన్నెలు తోముతున్నంత సేపూ ఆ రెండు మాటలే కూనిరాగాలై వంటిల్లంతా తిరుగుతాయి. మందారం మాటాడకుండా ఎందుకుంటుంది. రొమాన్సింగ్ అక్కా..నువ్వు చూళ్ళేదా కాంతారా! నవ్విపోతుంది. చందనపు చెక్క పట్టపగలే గుండెల్ని గుచ్చుకుంటుంది.

*
వెలుగూచీకట్లను బట్టి వేళను పోల్చుకోవాల్సిన కాంక్రీట్ జంగిల్ లో..వెళ్ళేప్పుడు ఉన్న ఉత్సాహం తిరిగి వస్తుంటే ఉండదు. సాయంత్రపు నడక.
సీజన్స్‌తో నిమిత్తం లేకుండా అన్ని పూలూ దొరికేస్తున్న కాలం...పూల బళ్ళ దగ్గర ఆగిపోవాలనిపించే పరిమళపు తుఫాను.
వీధి చివర. గుబురు చెట్ల నీడన భూమిని తవ్వుకుని చిన్న కుక్కపిల్లలు. ఆగి ఉన్న కారుని ఆనుకుని నిలబడి - పడుచు జంట.
జబ్ దీప్ జలే ఆనా...
*
పగటి పరుగు ఆపి రాత్రి దుప్పటిలోకి నిశ్చింతగా ముడుచుకోవాల్సిన వేళ. పిల్లల అరుపులు ఆగిపోయేసరికే రోజు పూర్తైన విశ్రాంతిలోకి ఒరిగి, మనసంతా అలజడుల జాడ లేని హాయి. ఐపోయిన హోంవర్క్‌ల దొంతర. నా వేళ్ళ మీద చల్లారి పిల్లాడి నోటిలోకెళ్ళే ముద్ద. బడి సంగతులు. పసి కోపాలు. నేర్చుకున్న విద్యలు. ప్రదర్శనలు. 'When I get older, I will be stronger...' పిల్లిమొగ్గై వాడు దూకబోతే పట్టి ఆపి...
*
ఒక రాగం నుండి ఇంకో రాగంలోకి. ఎప్పటికీ పూర్తిగా పట్టుబడని పాటై...జీవితం. ❤️

శివతాండవ సహాయవల్లి- పరిమి శ్రీరామనాథ్

 గొప్ప కవిత్వం అని దేన్నైనా పిలవడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క తూనికరాయి లోలో ఎగసే స్పందన. మంచి కవిత్వం చదువుతుండగానే నాకు అనుభవమవుతుంది, నాలో కంపన కలిగిస్తుంది. హృదయంలో నిర్లక్ష్యం చేయ వీల్లేని మోతాదులో ఉత్సాహం తుళ్ళిపడుతుంది. ఒక కొత్త మనిషితో ఇష్టంగా ఏర్పడ్డ పరిచయంలోని ఆహ్లాదమో, ఒక కొత్త పాఠం స్వయంగా నేర్చుకుని అర్థం చేసుకున్న సత్యం లోపల రేకెత్తించే ఉద్వేగమో, నరాల్లో పొంగులా ఉరకలెత్తే అకారణ సంతోషమో- మంచి కవిత్వాన్ని చదువుతున్నప్పుడు అనాయాసంగా అనుభవంలోకి వస్తుంది. తరచి, వివేచించి, తర్కంతో మేధతో ప్రతిపదార్థ తాత్పర్యాలను ఇంకించుకుంటూ విశ్లేషించుకునేలోపే, గొప్ప కవిత్వం నిశ్శబ్దంగా లోలోపల స్థానం స్థిరపరచుకుంటుంది. అయితే, ఒక బలమైన విమర్శ ఆ కవిత్వానికి దొరకడమంటే, క్షణికోద్రేకంలా ఎగసిన ఆ ఆవేశాలకు ఒక ఆమోదముద్ర దొరకడం లాంటిది. అట్లాంటి విమర్శ, పాఠకుడు పొందిన అపురూపమైన అనుభవానికి ఇంకాస్త బలాన్ని, జీవాన్ని, పొడిగింపునీ ఇస్తుంది.

సరస్వతీపుత్ర శ్రీనారాయణాచార్యుల వారి శివతాండవం అట్లాంటి మహాకావ్యమైతే, ఆ కవిత్వ బలిమిని వేయందాల ప్రకటించిన వ్యాఖ్య - మిత్రులు శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి శివతాండవ సహాయవల్లి.

వర్షాకాలంలో ఎత్తైన కొండల మీద నుండి ఉధృతమైన వేగంతో కిందకి దూకే జలపాతాలను మీరు చూసే ఉంటారు. కొండ రాళ్ళ మీద నుండి దూకుతూ మధ్యమధ్యన ఎగసిపడుతూ, ఆ ప్రవాహమలా అలా క్రిందకు మళ్ళిపోతుంది. ఈ వ్యాఖ్య చదవడానికి ముందు పుట్టపర్తి వారి స్వరంలో శివతాండవం విన్నాను. ఏమానందము భూమీ తలమున... అన్న మొదటి వాక్యం అచ్చు ఆ జలపాతపు మొదలే! ఆపైన ఆ పదప్రవాహాన్ని అచ్చెరువున గమనించడమే మిగిలింది. క్షణక్షణానికి కొత్తగా కనపడుతూ (క్షణేక్షణే యన్నవతాముపైతి తదేవరూపం రమణీయతాయాః ) ఈ శివతాండవమొక సౌందర్యస్వరూపమై ఆ కాసేపూ నా కళ్ళముందు కదిలింది.
అలలై బంగరు/కలలై, పగడపుఁ/బులుఁగుల వలెమ/బ్బులు విరిసినయవి/శివతాండవమట!/శివలాస్యంబట!
స్థూలంగా చెప్పాలంటే, భూమీతలమున ఒకానొక శుభదినాన సంధ్యాసమయాన జరిగిన శివతాండవ వర్ణనే ఈ కావ్యం. శివతాండవానికి ముందు ప్రకృతి సన్నద్ధమవడం, శివుడి వర్ణన, శివుడి నాట్యలీలా విశేషం, " విశ్వమంతా విభుని ప్రాణమందిరమైన.." అన్నట్టు, ఆ తాండవానికి ప్రకృతి ప్రతిస్పందనలూ, ఇక మునులూ, దేవతలూ, దిక్పాలకులూ ఆ శివ తాండవాన్ని చూసి రంజిల్లిన మనసుతో మహదానందంతో తూగిపోవడం, అటుపైన హరిహరాభేదదర్శనం దాకా ఒక ఎత్తు. అటుపైన శివాలాస్యం.
ఇక ఈ వ్యాఖ్య, మొదటే చెప్పినట్టు, ఈ కావ్యం చదువుతూండగా మనలో విరిసిన రసానందాన్ని పదిలపరుచుకునేందుకు, తేనెవాకలా సాగిన ఈ కావ్య మాధుర్య రహస్యాన్ని తనివారగ్రోలుటకు అయాచితంగా దక్కిన ఒక ఉపకరణం.
వృత్త నృత్త నృత్య నాట్యాల దగ్గర మొదలుకుని, కావ్య ఔచిత్య శిల్పాన్ని విప్పి చెప్పడం దాకా, పడ్డ ప్రతి పదపు అర్థం చెప్పడం మొదలు ప్రత్యేకించి ఆ పదమే వాడడంలోని విశేషాన్ని విపులీకరించడం దాకా, ఛందస్సుని చర్చలోకి తీసుకురావడం మొదలు, అనుమానమున్న చోట గురువు లఘువుల లెక్క సరి చూడడం దాకా, తెలిసిన పదాలను మననం చేయించడం నుండి, స్మృతిపథం నుండి దొర్లిపోయిన పదాలని కళ్ళ ముందు తెచ్చి, మరిచిపోయిన తెలుగు సౌందర్యాన్ని, తెలుగు పద్యపు సొగసుని, గాంభీర్యాన్ని, తెలుగు కవుల శక్తిని పుటల నిండా పరవడం దాకా, ఈ వ్యాఖ్య ఎన్ని బాధ్యతలు నెరవేర్చిందో లెక్కతేల్చలేం.
తలపైని జదలేటి యలలు దాండవమాడ
నలలత్రోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగురులు చెఱలాడఁ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప..
నిజానికి ఈ కావ్యంలోని ఏ పద్యం తీసుకున్నా కవి ఊహాచతుర్యానికి కైమోడ్చాల్సిందే. పై పాదాలు తాండవమూర్తి వర్ణనలోకి తీసుకెళ్ళే పంక్తులు. ఒక్కో పదంలో ఎనలేని అందం! చదలేరు అంటే ఆకాశగంగ. క్రొన్నెలపూవు బాలచంద్రుని పేరు.
శిరసుపైన గంగాదేవి అలలు తాండవిస్తుంటే, ఆ అలల తోపుడుకి అక్కడే శిరసుపైన ఉన్న బాలచంద్రుడు కదిలిపోవడమ్మనది ఎంత రమ్యమైన ఊహ!
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప - అన్న చోట మీకు కసినవ్వు పసి నవ్వుగా వినిపించకపోతే, చదువుతూండగానే మీకా అర్థం స్ఫురించకపోతే, మీరీ పుస్తకం కొని చదవాల్సిందే. భాషాపరంగా మనకి కొంత అన్ లర్నింగ్ కావాలని ఆ పాదాన్ని రెండోసారి చదువుతూ మరీ మరీ అనుకున్నాను.
ముడుచుకున్న తామరపువ్వు ఒక్కో రేకునీ విప్పి ఆ సౌందర్యాన్ని మన చేత పెట్టడం, ఈ వ్యాఖ్యానం. కేవలం కావ్యపు రేకురేకునీ వ్యాఖ్యానించడానికే పరిమితం కాలేదీ వ్యాఖ్యాత. మధ్య మధ్యలో సందర్భోచితంగా ఉదహరించిన పాదాలూ (ఉదాహరణకు ఆనందకుమారస్వామి పంక్తులు) పాఠకులకు ఎన్నో విశేషాలు చెబుతాయి, తాత్విక చింతనలో మునిగేలా చేస్తాయి. అలా చూసినప్పుడు, ఈ పుస్తకం ఒక పూటలో పూర్తి చేయగలిగేది కాదు.
కానీ, ఈ పుస్తకం అనూహ్యంగా నన్నలరించింది మాత్రం, ఈ శివతాండవం ముగిసే ఘట్టంలో. హరిహరాభేదం చూపిన ఘట్టంలో. అద్వైత భావాన్ని ముమ్మారు పలికి పాఠకుల్లో ప్రతిధ్వనింపజేసిన ఘట్టంలో.
పోతన హరిహరాభేదాన్ని ఊహిస్తూ భాగవతంలో "తనవున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱి భూతి పూతగాగ/ ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడికాని తునుక గాగ" అని అంటే, ఈ కవి ఏకంగా నలుపు కుత్తుక వాణ్ణి నీల మోహనుణ్ణి గావించి, అక్కడితో ఆగక, హరియె హరుడై, లచ్చి అగజాతై సరికి సరి తాండవములాడారన్నాడు. అప్పుడేమైంది! భేదభావాలన్నీ ప్రిదిలిపోయిన స్థితి సాకారమైంది. సమస్త భూమండలంలో అద్వైతమే ప్రతిధ్వనులీనింది.
"శోకమ్ము సంతోషమేకమ్ము, నరకంబు నాకంబు నేక, మ్మనంత ఆకాశమ్ము" - 'శోకమూ సంతోషమూ వేర్వేరు కావు. ఏకమే. నరకమూ నాకమూ వేరు కావు. ఏకమే. అనంతమైన ఆకాశం, ఈ పరిగతమైన భూమీ, నవనిథులూ, నీటిగుంటలూ, చెట్లూ విత్తనాలూ, కొత్తపూవులూ, పచ్చిమొగ్గలూ, గాఢాంధకారాలూ, విస్తృతకౌముదులూ; పరమ ఋషులూ, బ్రహ్మజ్ఞానం లేనివాళ్ళూ - ఇలా అందరికీ నేడున్నది ఒకటే. అదే అద్వైతము! అద్వైతము! అద్వైతము!'
మహనీయ వ్యక్తులు ప్రత్యేకంగా ఏ మాటా పాఠంగా చెప్పకపోయినా వారి జీవితమే ఒక ఉపదేశమైనట్టు, ఈ కావ్యం కూడా ఇక్కడ ఒక రహస్య సందేశాన్ని అందుకోగల పాఠకుల కోసం దాచి ఉంచింది. నేను వ్యాఖ్యాత మాటలని యథాతథంగా రాస్తాను.
"ఈ కావ్యాన్ని శివతాండవంపై కవి చేసిన స్తుతి అనుకుంటే, ఆ స్తోత్రానికి ఫలమిది. ఈ ఫలశ్రుతి ఏ పాపాలనో ఊరకనే తగలబెట్టేది కాదు. నవనిధులనూ, లౌకికభోగాలనూ అప్పనంగా కట్టబెట్టేది కాదు. కార్యసాధన కోసం చేయాల్సిన మానవప్రయత్నాన్ని మాయం చేయాలని చూడదు.
మానవుల మెదళ్ళలోని కుత్సిత భావాలను పగలదీసి, సంకుచితతత్వాలను భగ్నం చేసి, విశ్వవ్యాప్తమైన ఏకత్వదృక్కులను నేలమీదకు దింపాలన్నది ఈ కవికున్న కోరిక. "
ఎంత ఉదాత్తమైన కోరిక!
కావ్యప్రకాశ వ్యాఖ్యకు ముందుమాట రాస్తూ పుల్లెల వారు కావ్యానికి ఆనందం కలిగించడం ప్రధానమైనా అదొక్కటే ప్రయోజనం కాదనీ సన్మార్గోపదేశం కూడా కావ్యప్రయోజనం కావాలన్నది భారతీయ ఆలంకారికుల అభిప్రాయమనీ అంటారు. మనమున్న కాలానికి "ఉపదేశం" ఒక కాని మాట. ఆదర్శం అంటే అందుకోలేనిదేదో. అద్వైత భావాన్ని కళ ద్వారా లిప్తకాలానికైనా అనుభవంలోకి తెచ్చి హృదయక్షాళనకు ఉపకరించడం కన్నా ప్రయోజనమింకేముంటుంది. ఈ భావాన్నిలా ఎత్తి చూపించిన శ్రద్ధకు ఈ సహాయవల్లి శతవిధాల అపురూపం.
మనలో చాలామందికి తెలుగు భాష ఇష్టం. కవిత్వం ఇష్టం. రమ్యమైన పదాలూ, భావాలూ, కూర్పులూ ఇష్టం. కానీ ఒక్క బరువైన పదం కనపడ్డా దాని సౌందర్యాన్ని వెదికి సాధించుకోలేక వదిలేసుకుంటాం . పూర్తిగా అర్థం కాని ఊహ, ఎన్ని సంభ్రమరాసులను దోసిట పెట్టగలదో ఊహకందుతోన్నా అక్కున చేర్చుకోలేక పారేసుకుంటాం. ఆ శ్రమ, సమయం వెచ్చించాలనే కోరిక కొందరికుండదు. కోరిక ఉన్నా వెసులుబాటు ఉండదు కొందరికి. ఈ రెండూ ఉన్నా మార్గం తెలీక, ఉన్నతమైనదని ఎంత విస్పష్టంగా అర్థమవుతోన్నా గొప్ప సాహిత్యాన్ని అటకెక్కించేసే వారు ఇంకొందరు. అందుకే, మనికిప్పుడు మంచి కవిత్వంతో పాటు మంచి వ్యాఖ్యానాలు కావాలి. ఆ కవిత్వపు లోతులు, సౌందర్యాలు, అర్థాలు, సందర్భాలు చెప్పే విమర్శకులు కావాలి. అభిరుచిని, పరిధిని పెంచుకోవడానికి, సాహిత్య లోకపు రహస్య ద్వారాల తాళాలు చేజిక్కించుకోవడానికి, పొరబాటున నేర్చుకున్న అనవసరపు పాఠాలు కొన్ని మరిచిపోవడానికి ఇది ఒక అవసరం. తెలుగు భాష ఉనికిని కోల్పోతుందని ఉద్యమాలు చెయ్యక్కర్లేదు, తళుకులీనే తెలుగు భాషా సౌందర్యం ఎవ్వరి కంటా ఎందుకు పడట్లేదని విచారించక్కర్లేదు. ఇట్లాంటి కావ్యాలు, ఇలాంటి వ్యాఖ్యలు కొందరికి అందుబాటులో ఉంచగలిగితే చాలు. అది చేసే మేలు ఊహాతీతమనడానికి, ఈ పుస్తకం సాక్షిగా నేనెంతమాత్రమూ వెనుకాడను.
*
ప్రతులకు, మిత్రులు పరిమి శ్రీరామనాథ్(Parimi Sreeramanath) గారికి మెసేజ్ చేయగలరు లేదా.
నవోదయ బుక్స్‌లో ఈ లింక్ ఉపయోగించి ఆర్డర్ చేయగలరు.
May be an image of text that says "శివతాండవ శివతాండవసహాయవల్లి అనేక భాషలు జీర్జించుకొన్నవాడు అనేక సాహిత్యములు ఆకళించుకొన్నవాడు భారతదేశమంతయు తిరిగినవాడు సన్మానములందినవాడు సంగీత సాహిత్యములలో దిట్ట అతులిత శేముషీ విభావితుడైన వక్త సాహితీ మహామేరుపు నూటికి పైగా గ్రంథములు వ్ాసినవాడు వ్ాసిన పంక్షి అంతయును వెలగలవాడు సాహిత్యములో అన్ని పోకడలు పోయినవాడు గతమును మరువనివాడు భావి నాహ్వానించినవాడు భావుక చక్రవర్తి బహుభాషలకాదాన ప్రదానము లొసగినవాడు శివానంద సరస్వతితో "సరస్వతీపుత్ర" బిరుదునందినవాడు "మహాకవి" అని జనులచే గౌరవింపబడినవాడు "పద్మశ్రీ" పుట్టపర్తి నారాయణాచార్యులవారు. సరస్పత పుత్ర పుట్టపర్తి ప్రణీత శివతాండవ కావ్యవ్యాఖ్యు వ్యాఖ్యాత పరిమి శ్రీరామనాథ్"

Like
Comment
Share

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....