రోజూ పొద్దున అందరి స్నానాలూ అయ్యాక ఏదో ఒక టైం చూసుకుని వాషింగ్ మెషీన్ వెయ్యడమూ, పొద్దుటి మీటింగ్‌ల హడావుడి, పిల్లాడి లాగిన్ అయ్యాక ఓ పది నిమిషాలు దొరగ్గానే ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి ఆరేయడం- నా దినచర్యలో భాగమైపోయింది. బాల్కనీల్లో ఆరేసే కన్నా పైన ఎండకి చప్పున ఆరతాయనిపిస్తుంది. కొరోనా మొదలయ్యాక, అసలు బయటకెళ్ళేందుకు మిగిలిన చిన్న చిన్న దారుల్లో ఇదొకటి కనుక, నేనే కాదు, అపార్ట్మెంట్‌లో అంతకు ముందు ఎన్నడూ కనపడనట్టున్న చాలా మంది ఇలాగే పైకి వచ్చి ఆరేయడం చూస్తున్నాను. సాయంత్రం నా టీ అయిపోగానే పిల్లాడిని అనిల్ కి అప్పజెప్పి మళ్ళీ పైకి వచ్చి ఆ ఫెళఫెళలాడే బట్టలు దులిపి మడతపెట్టడం నాకిష్టమైన వ్యాపకం. కాస్త అటూఇటూగా పొద్దున ఆరేసిన అందరం మళ్ళీ ఆవేళకే అక్కడికి చేరతాం. మాస్క్‌లు తీసేసిన నవ్వు ముఖాలు, అస్సలే ప్రత్యేకతా లేని రోజువారీ ముచ్చట్లు ఇప్పుడిప్పుడే దక్కుతోన్న స్నేహఫలాలు.
ఒక మామూలు సాయంత్రం
మడతలు పెట్టిన బట్టలను బొత్తిలా అక్కడే పక్కన పెట్టుకుని, క్లిప్స్ అన్నీ చిన్న బుట్టలో వేసి దాని మీదే సర్దుకుని, ఓ అరగంట అక్కడే నడిచి...మళ్ళీ కిందకి. అమ్మా, అక్కా, అత్తగారూ, తోడికోడలూ..దాదాపు అందరికీ ఆ టైంలో నేను ఖాళీ అని తెలుసు కనుక ఫోన్‌లో పలకరిస్తూంటారు.
ఈ రోజు ఒక నేస్తం కాల్ చేస్తానంటే కాస్త ఆలస్యంగానే పైకి వెళ్ళాను. మసక మసక వెలుతురు పోగుపడుతోంది. వెళ్తూనే బట్టల వైపు నడిచాను. పగలు ఆలస్యంగా ఆరేశానేమో తడి ఆరలేదు. అలమరాల్లోనూ వాసనొస్తాయ్ మళ్ళీ. అన్నీ తాకి, వాసన చూసి వదిలేశాను. వస్తుందనుకున్న ఫోన్ రాలేదు.
ఒక్క నక్షత్రమే అంత ఆకాశాన్నీ వెలిగిస్తోంది. చిట్టి పిట్ట ఒకటి టాంక్ మీద కూర్చుని లోకమంతా పరికిస్తోంది. అవతలి డాబా మీద ఫోన్ లో మాట్లాడుతూ ఒక్కడే ఆ నిశబ్దాన్నంతా ఉండుండీ చెదరగొడుతున్నాడు. వీధికవతలి డాబాలన్ని క్రిస్మస్ దీపాల సౌందర్యాన్ని మోస్తున్నాయి.
చలి గాలి మొదలైంది. చెవుల్లోకి పాకుతోన్న ఇబ్బంది. చల్లబడుతోన్న చెంపలు. వేళ్ళు. ఊపిరి.
అయస్కాంతంలా నా చూపుల్ని పట్టుకుంటోన్న ఆకాశాన్నే చూస్తూ అటూ ఇటూ తిరిగాను కాసేపు. ఇంకా చీకట్లు ముసురుకున్నాయి. కోలాహలంగా నా తల మీద నుండే పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఇందాకటిలా విడదీసి చూపలేనంతగా వెలుగూచీకట్లూ నా కళ్ళ ముందే అందంగా అల్లుకుపోతున్నాయి.
ఎన్నాళ్లైంది నేనెవరికోసమన్నా ఎదురుచూసి. ఏ గొంతు విందామనైనా ఓపిగ్గా కూర్చుని. అవకాశం సరే, అవసరం కూడా లేదుగా. బస్‌స్టాప్‌ల దగ్గారా, ఆఫీసు ఫూడ్‌కోర్ట్స్ లో, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఏ హోటల్స్ దగ్గరో, పెట్రోల్ బంక్ ల బండ గుర్తుల దగ్గరో...
"సారీ, ఇంకా లేట్ అయ్యేట్టుంది..రేపు చేస్తాను.." చడీ చప్పుడు లేకుండా కూర్చున్న ఫోన్ ఒక్కసారిగా వెలిగింది.
"థాంక్యూ.." బీటింగ్ హార్ట్ కలపకుండా వేళ్ళూరుకోలేదు.
Subscribe to:
Posts (Atom)
అల
అలల పొత్తిళ్ళలో అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....