అఫ్సర్ కవిత్వంలో అమూర్తభావనలు

 ఈ సాయంత్రానికి

ఈ చలీ ఈ వానా కలగలిసి
ముంచుకొస్తున్న చీకటిలోకి
కాస్త నిబ్బరంగా నడిచివెళ్ళడానికి
ఏదో ఒక సాకు వెదుక్కుందాం
ప్రస్తుతానికి దాని పేరు కవిత్వం అనుకుందాం


అంటాడు అఫ్సర్. నిజమే, చాలా మందికి ముసిరే చీకట్లలోకి నిబ్బరంగా నడిపించే తోడు కవిత్వం. మన లోపలి ధైర్యాన్ని తోడు పిలుచుకోవడానికి ఒక సాకు కవిత్వం. ఈ లోలోపలి భావనలను పిలిచే ఒడుపు తెలిసిన అరుదైన కవిగా అఫ్సర్ కనపడతాడు.


అఫ్సర్ పేరు వినగానే చాలా మందికి అస్తిత్వవాద కవిత్వం గుర్తొస్తుంది. తొలినాళ్ళ కవిత్వంలోని రాజకీయ భావాలు, ధిక్కార స్వరమూ గుర్తొస్తాయి. నాకు వీటిని దాటుకుని "ఇంటివైపు" మళ్ళిన కవిత్వంలోని సుతిమెత్తని కొత్త గొంతే స్పురణకొస్తుంది. అది అన్ని అస్తిత్వాలనుండీ విడివడి, అంతర్యానం చేసిన మనిషి గొంతు. నువ్వూ-నేనూ అంటూ మాట్లాడిన ఒక మిత్రుడి గొంతు. మామూలు చూపుకీ, మాటవరసకు సాగే సంభాషణకీ లొంగని అమూర్తభావాలను వాటి అతి నిర్మలమైన రూపంతో అక్షరాల్లోకి ఒంపిన కవి గొంతు. ఈ గొంతులో ఈ ధోరణితో అఫ్సర్ ఎన్నో కవితలు రాసిఉండకపోవచ్చు. కానీ, కవిగా అఫ్సర్‌లోని ఈ పార్శ్వం ఆకట్టుకున్నట్టు, మరే ఇతర పార్శ్వమూ నన్ను ఆకట్టుకోలేదు. పోలికలూ ప్రతీకల జోలికి పోకుండా, పదాలు బరువు చూసి వాడుతున్నాడా అనిపించేంత తేలిగ్గా రాసుకుపోయిన ఆ కవిత్వం లోతు తెలిసిన కొద్దీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చింది. "చెప్పకూడదు;చూపించాలి" అనే నినాదం కవిత్వాన్ని అసాధారణ స్థాయిలో ప్రభావితం చేసిన సాహిత్య వాతావరణాల్లో, ఏ ప్రతీకల సాయమూ లేకుండా మాట్లాడినప్పుడు, అది కవిత్వంగా గుర్తింపబడకపోయే ప్రమాదమూ ఎక్కువే. ఆ ప్రమాదానికి వెరవకుండా చేసిన ప్రయత్నం సహజంగానే నన్నాకర్షించింది. పొడిపొడి మాటలతోనే మానసికావస్థలను కళ్ళకు కట్టడం, ఆ సాదా పదాలకొక కవిత్వ పరిమళమద్దడం గొప్ప నేర్పుగా నన్ను తాకింది.  


అమూర్తమైనవి, అవ్యక్తమైనవి, కళ్ళకు కనపడనివీ అమూర్తభావనలుగా చెప్పబడతాయి. కళ్ళతో కొలవలేని అందం; అరిచి చూపించలేని నొప్పి; స్పర్శతో నిమిత్తం లేని దగ్గరితనం లేదా దూరం;  మొదలైనవన్నీ ఇవే కోవలోకి వస్తాయి. ఇలా ఇంద్రియాలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రానివాటిని కవిత్వంలోకి తీసుకురావడం తేలికైన పని కాదు. ఎంత దిగులో చెప్పాలంటే ఎవరి దిగులు లోతునైనా కొలవగలిగి ఉండాలి. కన్నీటి చుక్క ఎవరికెంత బరువో ఊహించగలిగి ఉండాలి. ఇక్కడికిదే కవి సున్నితత్వానికి పరీక్ష అనుకుంటే, ఏ మూర్తమైన ప్రతీకల ఆసరా తీసుకోకుండా, ఈ అమూర్త భావనలను అమూర్త భావనతోటే నడిపించాలనుకున్నప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. తేడా ఏమిటో తేలిగ్గా అర్థమయ్యేందుకు వాల్మీకి రామాయణం నుండి, సుందరకాండలో హనుమ సీతను తొలిసారి చూసిన సందర్భాన్ని గమనించవచ్చు. ఇది భద్రిరాజు కృష్ణమూర్తిగారు మూర్తామూర్తభావనలను వివరించేందుకు తన వ్యాసంలో ఎంచుకున్న ఉదాహరణే.
అప్పుడు సీత మలినవస్త్రాలతో ఉంది, దుఃఖంతో ఉంది, రాక్షసస్త్రీల మధ్య చిక్కుబడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ఆమెను పద్మాలు లేని సరస్సులా ఉంది అనో, శుక్లపక్షపు నెలవంకలా ఉందనో అన్నప్పుడు, మనకు చప్పున పోలిక అందుతుంది. ఆమె కళావిహీనంగా ఉందనీ, కృశించిపోయి ఉందనీ అర్థమవుతుంది. ఇరవైకి పైగా పోలికలతో సాగిన ఆ వర్ణనలలో, సీత గుర్తు రాని జ్ఞాపకంలా, సడలిన నమ్మకంలా, అభ్యాసలోపంవల్ల శిధిలమవుతున్న చదువులా ఉందని అమూర్త ప్రతీకల సాయంతో కూడా వర్ణిస్తాడు వాల్మీకి. ఈ పోలికలు ముందువాటంత వేగంగా అందవు. ముందువాటంత స్పష్టమైన చిత్రాన్ని పాఠకుడి మనోఫలకం మీద ముద్రించవు.


అమూర్తకవిత్వాన్ని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, కవిత ఏం చెబుతున్నదో ఏం ప్రతిపాదించదలచిందో స్పష్టంగా చూపెట్టకుండా యథేచ్ఛగా నడిచే కవిత్వం. ఈ తరహా కవిత్వంలో పాఠకుడు శ్రమపడ్డా కవిని చేరగలడని చెప్పలేం, నిర్ధారించలేం. అలా కాకుండా, ఒక అమూర్తభావనను ఆధారంగా చేసుకుని, దాని తాలూకు ఆవరణను సృష్టించే లక్ష్యంతో సాగే కవితలు రెండో రకం. కవిత శక్తివంతమైతే ఆ ఆవరణ పాఠకుడిని తనలోకి లాక్కుంటుంది. ఆ మానసిక ఉద్వేగం తాలూకు బలమేదో పాఠకుడికీ అనుభవంలోకి వస్తుంది. ఇందులో అర్థం కానితనమేదీ ఉండదు కానీ, అర్థమవ్వడం ఈ కవిత్వానికి ముఖ్యం కాదు, కవి గొంతులోని తీవ్రతా, సున్నితత్వం పాఠకుడికి ఎంత బలమైన అనుభవంగా మారుతున్నాయన్నది ముఖ్యం. అదీ కవికి సవాలు. అఫ్సర్ కవిత్వంలో అర్థం కానితనమేదీ ఉండదు కనుక, ఇక్కడ చర్చించబోయే కవితలన్నీ రెండవరకానికే చెందినవని అనుకుంటాను. ఈ కవితలు బిగ్గరగా ఏమీ చెప్పవు, చూపెట్టవు. చేసేదల్లా ఒకానొక మానసిక ఆవరణలోకి పాఠకుడిని తీసుకుపోవడం, నిద్రాణమైన మానసికావస్థను మేల్కొల్పడం. 


నాస్టాల్జియా, విరహం, అకారణమనిపించే దిగులు లాంటి భావాలన్నీ లోపల ఎంత స్పష్టంగా సుడులు తిరిగినా వాటి మొదలూతుదీ తెలీవు కనుక వరుసలోకి లాక్కొచ్చి కాగితం మీద పెట్టడం కష్టం. ఒక్కోసారి కొలనులోకి విసిరేముందు రాయిని చూసినట్టు, ఈ భావనలకు ఒక ట్రిగ్గర్ పాయింట్‌లా ఒక సంఘటన కనపడుతూ ఉండచ్చు, కానీ దాని ప్రభావం అలలు అలలుగా తిరుగుతున్నప్పుడు ఆ వైశాల్యాన్నంతా పట్టుకోవడం కష్టం.
 
అఫ్సర్ కవిత రాసే పద్ధతిలో, ప్రత్యేకించి ఇట్లాంటి కవితలు రాసే పద్ధతిని గమనించినప్పుడు, ఆసక్తికరమైన పంథా కనపడుతుంది. ఈ ట్రిగర్ పాయింట్ అని దేన్నైతే అంటున్నామో, అది కవితకు శీర్షిక చేస్తాడు.(ఉదా: స్నేహితుడి దిగులు) ఈ మొదలూతుదీ పట్టుకోలేమనిపించే చెదురు మదురు ఊహలకు ఏకధాటిగా రాసే పద్ధతి ఎలాగూ నప్పదు కనుక, ఒకే కవితను ఖండికలుగా చేస్తాడు. 1. 2. 3. అంటూ ఆ ఖండికలకు అంకెలు వేస్తాడు. కవితను ఇట్లా విడగొట్టే పద్ధతి, అఫ్సర్‌కు ఉపయోగపడినట్టు చాలా తక్కువ మందికి, తక్కువ సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఈ అంకెలు వేయడం, ఖండికలుగా విడగొట్టడం, ఏదో ధ్యాసలో కొట్టుకుపోయే ఆలోచనలు మనసుల్లో ఎలా గంతులు వేస్తాయో, ఆ దాటు ని చూపించడానికి, పాఠకుడిని కూడా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు అలాగే అకస్మాత్తుగా లేపి తీసుకుపోవడానికి సాయపడతాయి. కొన్ని సార్లు ఈ భాగాలు ఒక దానికొకటి కొనసాగింపుగానూ కొన్ని సందర్భాల్లో ఒకదానినొకటి పెనవేసుకున్నట్టుగానూ ఉంటాయి. ఒకే రంగు పరిచే తీరును బట్టి ఒకసారి పల్చనై, మరొకసారి గాఢమై పూర్తిగా వేరే రంగులలోకి మారిపోయినట్టు, ఒక్కోసారి గుర్తుపట్టలేనంత దూరంలో, ఈ ఆలోచనలు ఎడంగా నిలబడి కనిపిస్తాయి. మనుషులు ఉండుండీ ఏదో ధ్యాసలో మునిగిపోయి కాసేపటికి అసలు విషయమేమిటో పూర్తిగా మర్చిపోయి వేరే జ్ఞాపకంలోకి, వేరే సందర్భంలోకి మేల్కొన్నట్టనమాట. ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సౌందర్యం అదేమి చెబుతుందన్న దాని కన్నా, ఎలా చెప్పినదన్న దాని మీదే ఆధారపడ్డట్టు, అఫ్సర్ కవిత్వంలో ఈ అమూర్తభావనల మీదుగా నడిచిన కవిత్వ సౌందర్యమంతా, ఆ చెదురుమదురు ఆలోచనలను పరిచిన తీరులోనూ, ఆ ఊహల మధ్య దూరమూ, దగ్గరితనంలోనూ, ఆ కలివిడితనం పాఠకులలో రేకెత్తించే స్పృహలోనూ ఉంది. 


స్నేహితుడి దిగులు అన్న కవిత పైన చెప్పిన పద్ధతికి చక్కటి ఉదాహరణ. ఇందులోని ప్రతి ఖండికా ఒకే సంఘటన తాలూకు రకరకాల స్థితులను పట్టిస్తుంది. "నీ నడకలోని ఉద్వేగాన్ని కొలిచేదేదీ నా దగ్గర ఉంటుందని తెలియక" అంటాడు మొదటి ఖండికలో. 


"ఎక్కడెలా గాయపడ్డావో
నిన్ను నొప్పించి అయినా అడగాలనుకుంటాను
తాకి చూడటానికి ఆ దిగులుకొక
శరీరం ఉంటే బాగుండనీ అనుకుంటాను
నువ్వు ఏ ఏ పదాల్లో దీన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తావా అని
ఎదురుచూస్తూ ఉంటాను


నీ కళ్ళల్లో
నీ కదలికల్లో
నీ పెదవివిరుపుల్లో
యీ గాయం ఎలా తెరుచుకుని
తన కథ చెప్పుకుంటుందా అని చూస్తూ ఉంటాను"


నొప్పించి అయినా అడగాలనుకునే తాపత్రయం, అతని కదలికలతో కారణాన్ని అందుకోవాలనే ఆత్రం, ఆ స్నేహితుడు మాటలతో ఏదో చెప్పడం, ఉండలేక వెళ్ళిపోవడం,  అటుపైన ఆ దిగులును మోసుకుంటూ కవి ఒక్కడూ తెల్లవారుఝాములో "యే దిగులునీ యే గాయాన్నీ నేనెప్పటికీ యేమీ చెయ్యలేనని" అర్థం చేసుకోవడం - ఇలా దశలుదశలుగా సాగిన కవిత. పైన చెప్పినట్టు, ఒకే ఉద్వేగం రంగులు మార్చుకుంటూ ఒక కొత్త మెలకువగా ఉదయించిన కవిత. 


పికాసో అంటాడు - కళను అర్థం చేసుకోవాలని అందరూ అనుకుంటారు; పక్షి పాటను అర్థం చేసుకోవాలనుకోరేం? రాత్రినీ, పూలనీ, మన చుట్టూ ఉన్న అన్నిటినీ అర్థం చేసుకోకుండానే ప్రేమిస్తాం కానీ, కళను మాత్రం అర్థం చేసుకోవాలనుకుంటాం, ఎందుకూ?  - అని. నిజమే, కళలు పాఠాలు కావు, చెప్పింది అర్థం చేసుకుని ఒకే రీతిన ఒక్కటే సమాధానమన్నట్టు మరెవరికో అప్పజెప్పాల్సిన అవసరమూ లేదు. ఒక అనుభవంగా అది మనను ఎంత బలంగా, లోతుగా తాకగలుగుతోందన్నదే ప్రశ్న. ఒక లాండ్స్కేప్ చూస్తే వెంటనే అర్థమైనట్టు, ఒక నైరూప్యచిత్రం అర్థం కాదు. మొదటి దానిలో మనం చిత్రంలో పొందుపరిచిన వివరాల ద్వారా తాకిన సౌందర్యాన్ని అనుభవంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే, నైరూప్య చిత్రం మొదటే ఒక అనుభూతిగా తాకుతుంది. ఇది ఏం చెప్తోంది? అన్న ప్రశ్న కళను అర్థం చేసుకోవడానికి పనికొస్తుందని కొందరంటారు కానీ, అది అవరోధంగానే ముందుకొస్తుంది. కనీసం అది మొట్టమొదటి ప్రశ్న అయితే కాకూడదని అనుకుంటాను. కవి అంటున్నాడు : నిర్వచనాలు కష్టం, కష్టపెట్టి ప్రతి క్షణాన్నీ విడమరచి చెప్పలేను/విడమర్చి చెప్పిన క్షణాన/అది ఒడ్డు మీద ఆత్మాహుతి చేసుకునే చేపపిల్ల.
 
అందుకే, "దగ్గరా దూరం" కవితలో, వొంటరిగా ఉన్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను అంటాడు.
 
ఆ ఒంటరి పక్షి అన్న మాట చదువుతుండగానే పాఠకుడి కళ్ళముందుకో చిత్రం వస్తుంది. పక్షి ఎక్కడైనా ఉండచ్చు, కానీ అది ఒంటరి పక్షి అనగానే దరిదాపుల్లో మరే ఇతర పక్షీ కనపడనంత మేర అన్నీ చెరుపుకోవడం అసంకల్పితంగా జరిగిపోతుంది. ఆ ఖాళీతనం మనలో కలిగించే సంవేదన- ఈ వాక్యం రహస్యంగా మన మీద పని చేసే తీరు. మామూలుగా ఉన్న మనమే ఈ ఖాళీతనపు స్పృహను మోసే ప్రయత్నం చేస్తుంటే, ముందే ఒంటరి అయిన కవి నేను ఒంటరి పక్షిని చూడనే లేను అనడమెందుకో మెల్లగా అనుభవమవుతుంది. సమధర్మమున్న రెంటిని కలపడంలో వచ్చిన బలమిది. కవిత మననొక కొత్త మానసిక ఆవరణలోకి తీసుకుపోవడం అంటే ఇదే. చదవడానికి బహుతేలిక వాక్యమే కానీ, వాక్యం ముగుస్తూండగానే కళ్ళ ముందుకొచ్చే ఏదో ఏకాకి పక్షి, ఒంటరితనం తాలూకు భయానకమైన నొప్పిని నోటకరుచుకుని కనిపిస్తుంది. "ఇదంతా ఇంకేమీ కాదు/నువ్వు దేనికీ అలవాటు పడలేదని ఇంకోసారి తెలుస్తుంది" అని కూడా అంటాడు వెంటనే. నిరాశకూ, భంగపాటుకూ, ఎదురుచూపుకూ, ఏకాకితనానికీ ఎలా అలవాటుపడాలి? ఎదురుపడ్డ ప్రతిదానిలోనూ మనలోపలి ఒంటరితనాన్ని గుచ్చి చూపే శక్తి కనపడుతోంటే, అలవాటుపడటం అయ్యే పనేనా? "అలా అని పెద్ద బాధా లేదూ.." అనుకున్నట్టే, "ఇదంతా ఇంకేమీ కాదు/కాస్త అలవాటుపడాలి, అంతే!" అనుకోవాలి. అంతే. అప్పుడు ఆ నిర్లిప్తత ఒప్పుకోలుగా మారి అడుగు ముందుకు పడేట్లు చేస్తుంది. 
 
దూరంగా ఉన్నప్పుడే/ నా వొంటిని నేనే తాకి తాకి / కొలుస్తూ ఉంటాను, నీ జ్వరాన్ని-  అని ముగిస్తాడీ కవితను. కవిత మొత్తంలో ఈ నువ్వు ప్రస్తావన ఎక్కడా లేదు. ఉన్నదంతా నా ఒంటరితనమే. కానీ చివరిలో తెలుస్తున్నదేమిటి? ఇది తాను ఒక్కడై ఉండటంవల్ల కలిగిన ఒంటరితనం మాత్రమే కాదు. తనవాళ్ళెవరో జ్వరగ్రస్తులై ఉంటే, ఆ నుదుటిని స్వయంగా తాకలేని బెంగ కలిగించే ఉక్కిరిబిక్కిరితనం. ఆ ఇద్దరి మధ్యా దూరం పెంచిన దిగులు. తన వొంటిని తానే తాకి తాకి చూసుకుటూ అవతలి మనిషి జ్వరాన్ని కొలవాలనుకునే ప్రేమ. ఒంటరి పక్షి ఎవరో ఎందుకంత ఇబ్బంది పెడుతోందో ఇప్పుడు కదా అర్థమవుతోంది. కాబట్టి ప్రశ్నల నుండి, అంచనాల నుండి విడివడి కవితతో ప్రయాణం చేయగల హృదయం ఉంటే అప్పుడు ఆ కవిత స్పృశించే ఉద్వేగాలు, కదిల్చే అవస్థలు, జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా పాఠకుడిని కమ్ముకుంటాయి. మన లోపలి మనతో సంభాషణలా సాగే కవితలివన్నీ. ప్రయత్నపూర్వకంగా కాకుండా స్వాభావికంగా, ఆకస్మికంగా చెప్పుకుపోతున్నట్టు ఉండే ఈ కొన్ని కవితల్లోనూ, కవిగా నన్ను విస్మయపరచగల అఫ్సర్ కనపడ్డాడు. "ఇదంతా ఏమీ కాదు, కాస్త అలవాటుపడాలి, అంతే" అని పై కవితలో చూపెట్టిన తాత్వికత ఒక ఎత్తైతే, "కాస్త అలా లోపలికి వెళ్ళొద్దామా?" కవిత దాని తారాస్థాయి.


అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
యివాళ ఒక్క వానచుక్కయినా రాలలేదు
-పోనీ యెవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు
 
కనీసం ఒక్క అసహనపు చూపైనా దక్కి ఉంటే, ఆలోచన కాసేపు దాని చుట్టూ తిరిగేది. అయిష్టమైనదైనా నొప్పెట్టేదైనా సరే, తన ఉనికిని గుర్తించేవారికోసం, తనకే గుర్తుచేసేవారికోసం ఆ పూట అతని వెంపర్లాట. లోకంతో సంధి తెగిన ఏకాకితనాన్ని కవి ఇక్కడ సూచిస్తున్నాడు. మనం ఎవ్వరి దగ్గరికీ, ఎవ్వరూ మన దగ్గరికి రాని, రాలేని స్థితి. వానచుక్క కూడా రాలలేదు అనడంలో, ఇలాంటి ఒక పొడిబారిన, ఆశావిహీనమైన స్థబ్ధ వాతావరణపు స్పృహ మెదులుతోంది.
 
ఇట్లా మొదలైన కవిత "ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం" అనడం దాకా సాగింది. నాలుగు పాదాల కవితలో కవి సాగించుకున్న అంతర్యానం, సాధించుకున్న స్థితి ఇక్కడ గమనించాల్సినవి.  


ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబమంటే ఏమిటి? "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం.." అంటారు ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్త్రోత్రంలో. ఎవరు అంతర్ముఖులై లోతుల్లోకి ప్రయాణం చేసి ఆత్మసాక్షాత్కారర జ్ఞానం పొందుతారో, వాళ్ళకి ప్రపంచం అద్దంలోని ప్రతిబింబంలా కనిపిస్తుంది. కొండ అద్దమందు చిన్నదై ఉన్నట్లు, ఇంత సువ్యాప్తంగా కనపడుతున్నదీ అల్పమైపోతుంది. అంటే, దీనంతటికీ అతీతమైన, వీటికన్నా ఉన్నతమైన, స్థితికి చేరుకున్నట్లు. కవి చేరినది ఇట్లాంటి స్థితినే. మరొక విధంగా చూస్తే, ఎప్పుడు మనం ఒక మౌన స్థితిని (ఈ క్షణపు నిశ్శబ్దానికి ఏదో ఒక రంగు), చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమవగల్గిన ధ్యాన స్థితిని ( నా కంటి రెప్పపై/నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు) పొందుతామో, అప్పుడు బయట ఉన్నదానికీ, లోపల ఉన్న "నేను"కీ అభేదం. అప్పుడు నీలో ఉన్నదే బయటా ఉంటుంది. కాబట్టి బయటదేదైనా నీ ప్రతిబింబమే అవుతుంది. కవి ఇంకో మంచి మాటన్నాడు - "నువ్వు దాచేసిన" అని. కాబట్టి వెదికి చూస్తే కానీ తిరిగి కనపడదది.
 
ఎదురుచూపులతోనూ, ఏదీ లేదన్న వెదుకులాటతోనూ, ఒంటరి క్షణాల పట్ల నిరాసక్తతోనూ మొదలైన ఈ కవిత, ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలను ఒప్పుకుని, ఆ క్షణాలకు రంగులద్దుకోవడం ద్వారా , ఆ క్షణంతో మమేకమవ్వడం ద్వారా ఆ క్షణంలోకి మేల్కోవడం ద్వారా ఒక ధ్యాన స్థిని చేరుకుని, సమస్త విశ్వాన్ని తన ప్రతిబింబంగా చూసుకోవడంతో ముగుస్తుంది.  సుప్రసిద్ధ సూఫీ కవి రూమీ అన్న“Do not feel lonely, the entire universe is inside you. Stop acting so small. You are the universe in ecstatic motion." మాటలను గుర్తు చేసే కవిత ఇది. సూఫీయిజం లోతులు పట్టుకోవడానికి అఫ్సర్ చేసిన కృషిని తల్చుకోవడం ఇక్కడ అసందర్భం కాదు.  
 
ఈ కవితలో నన్ను ఇబ్బంది పెట్టిందల్లా నస్రత్ పాట ప్రస్తావన. కొన్ని గొంతులు మనలోపలి లోకాలను కదిలిస్తాయి, కొత్త అనుభూతులేవో సాక్షాత్కారమయ్యేలా చేస్తాయి, నిజమే. కానీ, ముందు పాదంలో, "కొన్ని క్షణాలు ఇలాగే ఉండనీ, ఎవరూ రాని, ఎవరికీ ఎవరూ ఏమీ కాని క్షణాలు" అని చెప్పాక ఈ పాదాలు రావడమూ, తన లోపలి, తన చుట్టూరా ఉన్న నిశ్శబ్దాన్ని వినేంత సున్నితత్వంలోకి మేల్కొనే ప్రయాణంలో " నస్రత్ పాడుతూనే ఉన్నాడు" అనడమూ సముచితంగా కనపడవు.
  
ఇక్షుక్షీరగుడాదీనం మాధుర్యస్యాన్తరం మహత్ 
తధాపి న తధాఖ్యాతుం సరస్వత్యాపి శక్యతే  
 
పాలు, చెఱకురసం, బెల్లం అన్నీ మధురంగానే ఉన్నా, వాటిలోని మాధుర్యాలు వేరు వేరు. ఆ తేడా ఏమిటో సాక్షాత్తూ సరస్వతైనా చెప్పలేదంటాడు దండి. 
అఫ్సర్ ముస్లిం అస్తిత్వ వేదనలను కవిత్వం చేశాడు. సామాజిక సందర్భాలను తన పుస్తకాల్లో పాదాలుగా నడిపించాడు. తనకిష్టమైన గొంతులనూ, కవులనూ, కళాకారులనూ అక్షరాలలోకి వొంపుకుని దాచుకున్నాడు. ఇంత విస్తృతమైన వస్తు పరిధితో సాగిన అఫ్సర్ నలభయ్యేళ్ళ సాహిత్య ప్రస్థానంలో నుండి, వాటన్నింటినీ కాదని లెక్కకు ఎన్నో లేని ఈ తరహా కవిత్వంవైపే  మనసు మొగ్గడం నన్ను కూడా ఆలోచనలో పడేసింది. `కవిత్వం ఎదుట నా భాష` అన్న కవిత చదివాక నాకొక సమాధానం దొరికినట్టైంది. అందులో, తన భాష `ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశమై వినపడుతుంద'ని అంటాడు. అదీ మాట. "శిశువు ఆక్రోశం"; పాలు అందని శిశువు ఆక్రోశం. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు కాండిన్స్కీ కళను ఒక ఇన్నర్ నెసెసిటీ అని చెప్పుకుంటాడు. ఆ పదబంధం చిత్రకళను వ్యక్తీకరించే దారిలో ఒక ఉద్యమస్పూర్తిని నింపిందని అంటారు. తన పుస్తకం "The spiritual in art"లో అతనంటాడు : కళాకారుడికి రూపం మీద మాస్టరీ కాదు, తాను చెప్పదల్చుకున్నదేదో దానికి తగ్గట్టుగా రూపాన్ని దిద్దుకోవడమే ముఖ్యం అని.
 
కవిత్వంలో తన భాష ఎంతకీ పాలు అందని శిశువు ఆక్రోశం లాంటిది అని అఫ్సర్ అన్నప్పుడు, అది అట్లాంటి తప్పనిసరి అవసరమని అర్థమవుతుంది. అందులో, అలా తప్ప ఇంకెలానూ చెప్పలేని అసహాయత, అవసరం వినపడతాయి. దానిని వివరించలేడు, నొక్కిపెట్టి తగ్గుస్వరంలోనో, రాద్ధాంతంగానో చెప్పలేడు. అది ఇంకా లౌక్యం నేర్చుకుని పసితనపు ఉద్వేగమేదో. దానిని ఎవరు అలక్ష్యం చెయ్యగలరు? ఇలాంటి ఉద్వేగం, అదనపు మాటలందించే ఏ భాషా ఇంకా నేర్చుకోని పసితనం, ఈ వ్యాసంలో చర్చించిన అమూర్తభావాలకు సంబంధించిన కవితల్లో స్ఫుటంగా కనపడతాయి. అందుకే ఆ కవితలు అలా ప్రత్యేకంగా నిలబడతాయి.  శైశవ ఆక్రోశం విని ఎవ్వరూ ఊరడించకుండా తప్పించుకుపోలేనట్లే, ఈ కవితల దగ్గర ఆగకుండా ఈ సంపుటినీ పూర్తి చెయ్యలేరు. 


వీటిలో కనపడే ఈ ధోరణే, మొత్తం కవిత్వం గురించి మాట్లాడాల్సి వచ్చేసరికి, బలహీనతగా కూడా తోస్తుంది. పక్కవాద్యాల హోరుతో పాటలు వినడం అలవాటైన గొంతుకి, ఒక లేత గొంతేదో లయలో పాడుకుపోతుంటే వినడానికి సమయం పడుతుంది. కానీ, అందులో సౌందర్యం అర్థమైన కొద్దీ, వెనుకటి దారిలోకి వెళ్ళడం అసాధ్యమైపోతుంది. అఫ్సర్ కవిత్వంలో సరళతతో నిండిన పైతరహా కవిత్వం ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, అటుపైన ఏ కవితలో ఆర్భాటం చూసినా అది అబద్ధమనే అనిపిస్తుంది. ఒక్క పదం బరువుగా కనపడినా దాని లోతుతో నిమిత్తం లేకుండా, సారళ్యపు సున్నితత్వాన్ని వదులుకున్న వాక్యమై మొరటుగా వాడిగా పాఠకులను తాకుతుంది. వాడాలా వద్దా అన్న పెనుగులాట బహుశా కవికీ ఉంది.
 
అవతల నువ్వు చాలా మర్యాదగా,
ఎంతో గౌరవప్రదమైన పదాల మధ్య
ఒక్కో వాక్యమూ కొలుస్తున్నావ్, తెలుస్తూనే ఉంది!
..
 నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
యీ ఒక్కసారికీ మన్నించు.
 
యింకా నాకు రానే రాని
ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను.
 
కాని, నా బాధల్లా వొక్కటే:
ఆ తరువాతి తయారీ భాషలో నువ్వు వినిపిస్తావా?
 
పోనీ,
నాకు నేను వినిపిస్తానా?
 
తయారీ భాషలో కవి వినపడడనే నేనంటాను. అఫ్సర్ అయినా కాదనగలడని అనుకోను.
 




https://archive.org/details/TheSpiritualInArtByWassilyKandinsky 


https://eemaata.com/em/issues/201109/1814.html/6

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....