Posts

Showing posts from January, 2017

"సత్యం వద్దు, స్వప్నమే కావాలి" - శివలెంక రాజేశ్వరీదేవి

Image
*తొలిప్రచురణ : ఈమాట, జనవరి-2017 సంచికలో
మనం చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా కథను వేరెవరైనా చెప్పబోతుంటే, చేతులడ్డు పెట్టి వారించేస్తాం. ఆ అనుభవమేదో మనమే పొందాలని, ఆ ఉద్వేగం కొత్తగా మనకే చేరాలని, వేరొకరి కళ్ళతో చూడటాన్ని వీలైనంతా దాటుకుంటూ వచ్చేస్తాం. అయితే, శివలెంక రాజేశ్వరీదేవి (16/1/1954 – 25/4/2015) కవిత్వం నాకంత వెసులుబాటునివ్వలేదు.
శివలెంక రాజేశ్వరీ దేవి
(1954 – 2015) ఆమె గురించి మొదట విన్నదే, ‘ఈ రోజు ఉదయం, హాస్పిటల్‌లో రాజేశ్వరీదేవి మరణించింది,’ అన్న మాట ద్వారా. మానవ సహజమైన సానుభూతితో అటుపైన కనబడ్డ నల్ల అక్షరాల వెంట వెళితే, ఆ శోకఛాయల మీదుగానే నాకొక కొత్త ప్రపంచం కనపడింది. సత్యం వద్దు, స్వప్నమే కావాలి అనుకున్న స్వాప్నికురాలు, ఆ కలలకు కూడా దూరంగా ఉన్న రాత్రుల్లో రాసుకున్న కవితలు కనపడ్డాయి. తెలుగు కవిత్వంలో దిగులు అన్న పదం వినగానే తట్టే మొదటి కవయిత్రి రేవతీదేవి. అకారణంగా కాదు, కొన్ని విషయాల్లో సుస్పష్టంగా కనపడే భావసారూప్యత వల్ల, మొదటి పేజీల్లోనే రేవతీదేవి గుర్తొస్తుంది. దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు అన్న రేవతీదేవి మాటలొక వంక, రాజేశ్వరీదేవి కవి…

సంక్రాంతి

గొబ్బెమ్మలు లేవు,
భోగిమంటలూ ఈ చేతులతో వెయ్యలేదెప్పుడూ
అపార్ట్మెంటు జీవితం అందివ్వని భోగాల్లో
ఇవీ ఉన్నాయన్న బెంగ కూడా లేదు
పండగంటే, కొత్తబట్టలు, పిండివంటలూ
బొమ్మల కొలువులూ, నా నలుగురు స్నేహితులు-
ఇంతే,
మాటల్లో చెప్పుకోవటానికి ఇంతకన్నా ఏం లేదు కానీ

అక్షతలతో కలిసిన భోగిపళ్ళు, బంతిపూరేకులు
తలమీద నుండి ఇలా జారుతాయో లేదో
కుర్చీల్లో నుండి చప్పున కిందకు దూకి
చప్పుడు చేసిన రాగిబిళ్ళల కోసం వెదికే పిల్లల్లా
ఒకదానివెనుక ఒకటి దీవెనల్లా సాగిపోతున్న రోజుల్లో కూడా,
సంక్రాంతి పేరు వినపడగానే,
కోల్పోయిన జ్ఞాపకాల కోసం
గతంలోకి వంగి వంగి చూస్తాయి ఆలోచనలు

ఎక్కడ చిక్కుకుంటే ఏం,
దారపు కండెను వదిలి వెళ్ళిన గాలిపటాలను
ఇప్పుడు కాసేపైనా గమనించాలని ఉంది

"బియాండ్ కాఫీ" - ఖదీర్‌బాబు

మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లోకంలోకి మనని తీసుకు వెళ్ళి, అక్కడి వాళ్ళని, వాళ్ళ చేష్టల్నీ, ఒక్కోసారి వాళ్ళ మనసుల్ని కూడా, చూపించి, మళ్ళీ మన దోవన మనని వదిలిపోయే రెక్కల గుర్రం లాంటిది కథ.  మనని ఎంత నమ్మిస్తే అంత మంచి కథ. మన దోవ మనకు గుర్తు రాకుండా, మన సమయం గురించి మనకిక ఆలోచన లేకుండా, కథే నిజమన్న నమ్మకం కుదిరిస్తే, అది మంచి కథ. కానీ, కొన్ని కథలుంటాయి. ఖదీర్‌బాబు "బియాండ్ కాఫీ" లాంటి కథలు. సత్యానికీ, సత్యం అని మనం నమ్మే దానికీ మధ్య నున్న పల్చటి తెరని, అక్షరాలతో మెల్లగా పక్కకు జరుపుతూ పోయేవి. అన్నిలోకాలనూ ఒక్కటి చేసేవి. ఉన్నచోటే నిలబెట్టి, మన చుట్టూ ఉన్నవే, మనం చూసీ చూడనట్టున్నవే, బలవంతంగా మన కళ్ళకు చూపించేవి. చేదుగా ఉండేవి. భయాన్ని, బాధను కలిగించేవి. ఆలోచన ఒక్కటే ఆఖరి బహుమతిగా మిగిల్చేవి.
మనకి మన చుట్టూ ఏదో జరుగుతోందని తెలుసు. తప్పకుండా తెలుసు. పేపర్లలో చూస్తున్నాం, టి.వి. లలో వింటున్నాం. అలా విన్న వాటి గురించీ, చూసిన వాటి గురించీ తప్పొప్పులు ఎవరికి చేతనైనంత వాళ్ళు చెప్పుకుంటున్నాం. 'ఇలా ఏలా చేశాడు'? అనో, 'ఇలా మనమెప్పటికీ చెయ్యకూడదు' అన…