"సత్యం వద్దు, స్వప్నమే కావాలి" - శివలెంక రాజేశ్వరీదేవి

*తొలిప్రచురణ : ఈమాట, జనవరి-2017 సంచికలో

మనం చూడాలనుకున్న, చూడబోతున్న సినిమా కథను వేరెవరైనా చెప్పబోతుంటే, చేతులడ్డు పెట్టి వారించేస్తాం. ఆ అనుభవమేదో మనమే పొందాలని, ఆ ఉద్వేగం కొత్తగా మనకే చేరాలని, వేరొకరి కళ్ళతో చూడటాన్ని వీలైనంతా దాటుకుంటూ వచ్చేస్తాం. అయితే, శివలెంక రాజేశ్వరీదేవి (16/1/1954 – 25/4/2015) కవిత్వం నాకంత వెసులుబాటునివ్వలేదు.

శివలెంక రాజేశ్వరీ దేవి
(1954 – 2015)
ఆమె గురించి మొదట విన్నదే, ‘ఈ రోజు ఉదయం, హాస్పిటల్‌లో రాజేశ్వరీదేవి మరణించింది,’ అన్న మాట ద్వారా. మానవ సహజమైన సానుభూతితో అటుపైన కనబడ్డ నల్ల అక్షరాల వెంట వెళితే, ఆ శోకఛాయల మీదుగానే నాకొక కొత్త ప్రపంచం కనపడింది. సత్యం వద్దు, స్వప్నమే కావాలి అనుకున్న స్వాప్నికురాలు, ఆ కలలకు కూడా దూరంగా ఉన్న రాత్రుల్లో రాసుకున్న కవితలు కనపడ్డాయి.
తెలుగు కవిత్వంలో దిగులు అన్న పదం వినగానే తట్టే మొదటి కవయిత్రి రేవతీదేవి. అకారణంగా కాదు, కొన్ని విషయాల్లో సుస్పష్టంగా కనపడే భావసారూప్యత వల్ల, మొదటి పేజీల్లోనే రేవతీదేవి గుర్తొస్తుంది.
దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు
అన్న రేవతీదేవి మాటలొక వంక, రాజేశ్వరీదేవి కవిత శైవలిని (పు:61) ఒక వంక ఉంచితే, వీళ్ళిద్దరి కవిత్వంలో సారూప్యమేమిటో, ఎందుకు ఎలా వీరిద్దరూ ఒకరికొకరు భిన్నమో తెలిసిపోతుంది.
ఈ కవిత ఎత్తుగడలోనే రాజేశ్వరీదేవి ఇలా అంటుంది.
స్నేహితుడా!
అడగడానికైతే అడిగావు
రెండే రెండు చిన్న ప్రశ్నలు
హౌ ఆర్ యూ? హౌ ఈజ్ లైఫ్
చెప్పటానికేం లేదు
చెప్పుకోటానికి చాలా ఉంది

సత్యం వద్దు స్వప్నమే కావాలి
రాజేశ్వరీదేవికి ఈ దిగులు ఒక దిగుడుబావి అని, దిగి ఎవరి పూడిక వారే తీసుకోవాలనీ తెలుసు. ఉన్నవన్నీ పాకుడు మెట్లని, అడుగున ఎక్కడో నీళ్ళమీద తేలుతోన్న నాచుతెట్టు వల్ల తన ప్రతిబింబం (తన అసలు ముఖం, తన సంతోషం) ఏవీ కనపడటం లేదనీ తెలుసు. అయినా, ఆ పాకుడుమెట్ల దారి మీదుగా వెళ్ళి, పూడిక ఇక ఎన్నటికీ తీసుకునే వీల్లేదన్న బెంగ మాత్రం లేదు. నిరాశ లేదు. నమ్మకమే ఉంది. వర్షం వస్తుందని, అప్పుడిక బావిలో నీరు పొంగి పొర్లి, ఏ పూడికతీతా అక్కర్లేకుండానే కల్మషాలన్నీ కొట్టుకుపోతాయనీ ఆమె విశ్వాసం. అపారమైన నమ్మకంతో, ‘అప్పుడిక ఆకాశ ప్రతిబింబమే కనిపిస్తుంది’ అని ముగిస్తుంది కవితని. అదీ రాజేశ్వరీదేవి. ఒంటరితనం, ఒక్క మాట కోసం పరితపించిపోయే ప్రాణం, ఏ క్షణంలోనూ కారణం తెలీనివ్వని దిగులు, ‘దేవతలు అలా వెళ్ళారో లేదో, దెయ్యమై చుట్టుకునే నిజం’ లాంటి పగటి పట్ల వెరపూ ఉన్నా, అంతటిలో నుండీ ఆశను వెతుక్కోవడం ఈమె కవిత్వపు జీవలక్షణం. రేవతీదేవికి వినడం కావాలి, రాజేశ్వరీదేవికి పక్కవాళ్ళు మాట్లాడటమే ముఖ్యం. మూగవోయిన గొంతు అన్న కవితలో ‘నాకూ చెప్పాల్సిందేదో ఉండి ఏదో చెప్పబోతే, ఎవ్వరూ వినిపించుకోరు. అందుకో మరెందుకో…’ అని రేవతీదేవి మాట్లాడటమే మానుకుంటే, ‘ఎవ్వరూ హృదయం ఒంపి మాట్లాడరెందుకని?’ అన్నది రాజేశ్వరి ఆరోపణ.
ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి-
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
 (అట్లా చేశానా, పు:41)
రాజేశ్వరీదేవి తాకగానే చిట్లిపోయే గాజుబొమ్మంత సున్నితమైన మనిషిలా ఉందని వెనుకమాటల్లో మిత్రులొకరు అంటారు. అదే భావన ఆమె కవితలూ కలిగిస్తాయి. ఆమెలో ఎదుటి వ్యక్తిలో ఉన్నది ఉన్నట్లుగా తీసుకోగల హృదయం ఉంది. మార్పు అనివార్యమన్న ఎరుక, ఒక స్థిరత్వాన్ని, స్థిరచిత్తాన్ని అన్నివేళలా ఆశించడం అవివేకమన్న మెలకువ ఉన్నాయి.
అప్పుడలా ఉన్నావు వెన్నెలలా
ఇప్పుడిలా ఉన్నావు చీకటిలా
ఏం చెబుతాను చెప్పు
ఎప్పుడూ ఒకేలా ఎలా సాధ్యం
 (ఏదో అలా అలవోకగా ఆలాపనై, పు:53)
అని వాపోయింది అందుకే.
ఆమె కోర్కె చాలా చిన్నది. ఆమె మాటలు కోరుకుంది. మర్యాద కోసం ఓ మాట, మొహమాటానికి వెలిగిన నవ్వు, ఆమెకు తృప్తినివ్వలేదు. బ్రతుకంతా ‘హృదయం ఒంపి మాట్లాడే స్నేహాని’కై ఎదురుచూసింది.
ఆకలేసి అన్నం అడగలేదు నిన్ను
దాహమయి మంచినీళ్ళు అడగలేదు
బట్టల్లేక దుస్తులూ అడగలేదు
ఒక్క చిరునవ్వు అడిగాను
బజారులో సిగ్గులేక
అని ఒక్క చిరునవ్వు కోసం, బాహాటంగానే దోసిలి పట్టి నిల్చుంది. అటువంటి సందర్భాల్లో ప్రస్తుత సమాజం తనకి ఏ రకంగా బదులిస్తుందో కూడా నిష్ఠూరంగా ఇలా రాసుకుంది.
లోతుగా గాయపడిన వేళ
మనసు సాచి ఇంటింటికీ తిరిగినా
ఏ తలుపూ తెరుచుకోదు
మాతృభావన ఎరగని మార్కెట్ సమాజం
ముఖం తిప్పేసుకుంటుంది
ఆమె స్త్రీవాద రచయిత్రులతో స్నేహంగా మసలినా ఆమె నిజానికి ఒకే వాదంలో చిక్కుపడ్డ మనిషి కాదు. స్త్రీవాదులు కోరుకునే స్వేచ్ఛను ఆమె బలపరిచి ఉండవచ్చు కాని, అంతకు మించి మనుషులందరి మధ్యా మానవీయ సంబంధాలు ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాలని కలలు కన్న కవిత్వం ఆమెది.
స్వేచ్ఛ కావాలి ప్రేమ కావాలి
రెండూ కళాత్మక స్వప్నాలు
వాటివెంట పడమంటే
ఎండమావుల వెంట పడటమే
పెనుగాలికి బయటా ఊపిరాడదు
ఉక్కపోతకి లోపలా ఊపిరాడదు
రక్షణ మాత్రమే
 (అసలు సంగతి పు:75)
ఆమె కవిత్వ ధోరణిని గురించి ఈ కవిత క్లుప్తంగా చెబుతుంది. ఆమె కవిత్వంలో అర్థం కాని ప్రతీకలు కానీ అర్థం కాని పదాలు కానీ కనపడవు. ఈ కవితనే తీసుకుంటే, ముందు వాక్యాల్లో తలుపులన్నీ వేసి ఉంచినా – అన్నది చదివాక, బయటా లోపలా ఊపిరాడదు అన్నది సామాన్యమైన అర్థంలో ఏమంత గొప్ప భావన కాదు. కానీ, రాజేశ్వరి ఇక్కడ, అడుగు బయట పెట్టాక దొరికే అతి స్వేచ్ఛని పెనుగాలితోనూ, మూసిన తలుపుల వెనుక మాత్రమే దొరికే ప్రేమని ఉక్కపోతతోనూ పోల్చింది. ‘పెనుగాలిలా మారని స్వేచ్ఛ,’ ‘ఉక్కపోతనివ్వని ప్రేమ’ – ఈ రెండూ సాకారమయ్యే లోకం ఆమె కల. ఎంత అస్థిమితమైన మనసునైనా ఆమె ఇలా స్థిమితంగా కాగితం మీద పెట్టగలదు. ఎంతటి అయోమయాన్నయినా అమాయకపు పసిపిల్ల ప్రశ్నలానే మనముందుంచగలదు. కానీ, ఆ ప్రశ్నలు అంత సూటిగానూ ఉంటాయి. తరాలుగా ప్రశ్నించకుండా పనిచేసుకుపోతున్న పెద్దవాళ్ళకి, అకస్మాత్తుగా పిల్లలు ప్రశ్నించినప్పుడు కలిగే కలవరమే పాఠకుల్లోనూ కలుగుతుంది. ఆ రకంగా, ఈ కవిత్వం పైకి కనపడేంత సరళమైనదని చెప్పలేం. ఎంచుకున్న విషయం మానవసంబంధాల గురించైనప్పుడు, హృదయ సంబంధి అయినప్పుడు, ఇలాంటి సరళత నిజానికి మరింతగా భయపెడుతుంది. పిల్లల ప్రశ్నలకి మన దగ్గర జవాబులు లేవని కాదు, అవి అన్నివేళలా మనమే ఒప్పుకోలేక కలిగే కలవరము; మారే ఉద్దేశ్యం ఉన్నా మారనివ్వని పరిస్థితుల వల్ల మనలో కలిగిన జడత్వాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలీక ఎదురయ్యే ఇబ్బంది, సరిగ్గా ఇవే, రాజేశ్వరీదేవి కవిత్వం మనకు కలిగించే భావాలు.
పైన పంక్తుల్లో పేర్కొన్న కవి వాక్యాలు, సినిమా పాటల్లో మాటలు, పుస్తకాల పేర్లు, ఇవన్నీ రాజేశ్వరీదేవి తన కవితలకు తానే స్వయంగా అద్దిన మణిపూసలు. ఈ కొసరు సొగసుల్లో విస్తృతి, వైవిధ్యము, అప్పటి ఉద్వేగానికి సరీగ్గా సరిపోయే పదాల ఎంపికలోని చాతుర్యం, ముచ్చట కలిగిస్తాయి. ‘ఏకాంతమూ సాయంత్రమూ ఎద నీకై వేచినదీ,’ మొదలుకుని ‘లాలి లాలి అను రాగం సాగుతుంటే,’ దాకా, ‘జిగిరీ’ నుండి ‘ఆకుపచ్చ లోయ’ దాకా, రాగాల మీదుగా, రంగుల లోకాల మీదుగా ఆమె సారించిన చూపు గమనించదగ్గది.

సం: నామాడి శ్రీధర్.
ప్రేమలేఖ ప్రచురణలు, 2016.
అత్యుత్సాహం ఒక్కోసారి వరదలా మాటలు పొంగిస్తుంది. అది కవిత్వానికి సుగుణం కాదని మనకు తెలుసు. నిరుత్సాహమూ పదాల్లో కొన్ని సార్లు సరిగా బయటకు రాలేక తడబడుతుంది. కొన్ని సందర్భాల్లో అది కవితాభివ్యక్తికి, అది అందజేయదలచిన ఉద్వేగానికి న్యాయం చేసినట్లు అనిపించినా, ఒక సంపుటిలో కనపడ్డప్పుడు, అది ఎందుకు ఆకర్షించలేకపోతుందో, ఎందుకు మనకి ఎడంగా నిలబడుతోందో తేలిగ్గానే తెలుస్తుంది. రాజేశ్వరీదేవి మరణానికి కొన్ని రోజుల ముందు ఆంధ్రజ్యోతికి పంపిన కవితలో కూడా ఏదో మహోద్వేగం ఉంది, పైకి స్పష్టంగా కనపడని విషాదం ఉంది, కానీ అది కూడా మనని తనలో కలుపుకునే ప్రవాహధోరణిలో సాగింది కాదు. అది బహుశా ఆంతరంగికులకే అర్థమయ్యే భావం, వెరసి కవిత్వానికి కొంచం దూరం.
మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిథి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీ చూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది. మనకి మన యుద్ధం మనం చెయ్యడం మటుకే అలవాటయ్యింది. ఇలాంటి ఒక కాలంలో, ఒకరి మాట కోసం దిగులు పడ్డామని, మరో మనిషి కోసం కన్నీరొలుకుతోందని ఎవరైనా అంటే, అది వారి వ్యక్తిగత సమస్యగానే పరిగణించడం నేరమేమీ కాదు. ఇలాంటి సందర్భంలోనే కవిగా రాజేశ్వరి పలికిన రెండు గొంతులు గమనించదగ్గవి. అది తన దుఖఃమైతే, ‘ఎవరి దిగులు బావి పూడిక వారే తీసుకోవాలని’ సరిపెట్టుకున్న మనిషి, పరుల బాధ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చూపిన సహానుభూతి అపురూపమైనది. నీకోసం (పు:86), జాగరణ (పు:95), పద బాధల మధువుల్ని తాగుదాం (పు:101), అన్న మూడు కవితల్లోనూ కవి హృదయం స్పష్టంగా తెలుస్తుంది. ‘నీకోసం మళ్ళీ పుట్టాలనుంది’ అంటూ, ‘నీకు అమ్మనవడానికి నా మాలిన్యాన్నంతటినీ కడిగేసుకోవాలనుంది,’ అనడంలో స్త్రీ సహజమైన ప్రేమ ఒక్కటే ఉంది అనుకున్నా –
ఎవరినో ప్రేమిస్తాం
ఎవరినో ద్వేషిస్తాం
ఎవరినో పూజిస్తాం
ఇంకా ప్రేమిస్తూ ద్వేషిస్తూ పూజిస్తూ కూర్చునే వేళా ఇది
ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను
నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో (జాగరణ, పు:95)
అన్నప్పుడు, మరెవరి బాధలకో స్పందిస్తూ ‘పద, బాధల మధువుల్ని తాగుదాం’ అన్న మఖ్దూమ్ వాక్యం గుర్తు చేసుకున్నప్పుడు – అప్పుడు, మనకు నిజంగా తెలుస్తుంది, ఇలాంటి ఒక స్పందనకు మామూలు స్త్రీ హృదయం సరిపోదని. తనకంటూ నలుగురు మనుషుల్ని కుటుంబంలా సమకూర్చుకుని, వాళ్ళను తనకు బందీలుగానో, తాను వాళ్ళకి బందీగానో ఉండే స్త్రీ ఎన్నటికీ ఈ తరహా కవిత్వం రాయలేదు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా?’ అని పదే పదే పాడుకున్న దయాళువైన స్త్రీ ఒక్కతే ఈ కవిత్వం రాయగలదు. అలాంటి స్త్రీ ఒక్కతే, తానెంత బాధలో, నిస్పృహలో ఉన్నా, మరొకరికి ఆసరా కాగలదు. అమ్మ కాగలదు. ఆ మాతృత్వ భావన ఆమెకు అనాయాసంగా అందిన వరం. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా నొక్కిచెప్పాల్సి వచ్చినప్పుడు ముద్దుపేరుతో పిలిచే తల్లిలా, మహాకోపంగా మాటలాడుతూ కూడా నచ్చజెప్పే గొంతులోకి తనకు తెలీకుండానే తిరిగిపోయే తల్లిలా, రాజేశ్వరి ఉండుండీ ‘చిన్నా’ అని పిలవడం సంపుటిలో కనపడుతుంది. అదీ రాజేశ్వరీదేవి స్వభావం.
కొందరి కవిత్వాల గురించి మాట్లాడేటప్పుడు, కవి ఇలా అన్నాడు, కవిత చెబుతున్నదిదీ అని వ్యక్తి నుండి కవిని వేరు చేసి చెప్పడం రివాజు. కొందరి విషయాల్లో ఆ పద్ధతిని అనుసరించడం అసాధ్యం. ఎందుకంటే, వీళ్ళ వ్యక్తిత్వమే వీళ్ళు రాసిన కవిత్వం. తన నుండి తాను వేరుపడి రాసి వొదిలిన దొంగ ఉద్యమగీతాలో, తను ఎన్నడూ అనుభవించని ఉద్వేగాలకి రంగులద్దగా ఒలికిన స్వప్నగీతాలో కావు వీళ్ళ కవితలు. వీళ్ళు చూపించిన (లేదా చూపించదలుచుకున్న) జీవితమే వాళ్ళ అక్షరాల్లోనూ ఉంటుంది. సంపుటి మొత్తం ఒకే ధోరణిలో, ఒకే భావజాలంతో వెలిగిపోతుంది. పాఠకులుగా మనం ఆగి చూడక్కర్లేదు, ఒక అనుభూతి చట్రం నుండి విడివడి మరొకదానిలోకి ప్రవేశించవలసిన కష్టం లేదు. బ్రతుకంతా ఒక్క మాట కోసమే పరితపించే మనిషి, ఏ ఏటికాయేడు తనను తానెట్లా నిలబెట్టుకుంటూ వచ్చిందో పుట వెనుక పుట తిప్పుతూ తెలుసుకుంటామంతే.
మోసపోయాననిపించినపుడు, ‘ఆకాశానికి కూడా బట్టలు తొడిగే నాగరికత’కి ఆశ్చర్యపడినప్పుడు, నిస్తంత్రీవీణెలు ఉన్నట్టుండి తెగిపోయినప్పుడు, ఒక్క పాటతో, ఒక్క నక్షత్రపు మెరుపుతో, ఒక్క కలతో, ఒక్కటంటే ఒక్కటే ఆశతో, అన్నేళ్ళ జీవితాన్ని ఒంటరిగా దాటడమెలానో చెప్తుంది రాజేశ్వరీదేవి కవిత్వం. ఈ సంపుటి మూర్తీభవించిన ఆమె అమాయకత్వం. ఏదో ఒక రాత్రి అకస్మాత్తుగా తలుపు మీద మునివేళ్ళ చప్పుడు వినపడుతుందని, కేవలం మన గొంతు వినడానికే ఒకరు పలకరిస్తారని, అమానవీయమైన లోకం మీద రాజేశ్వరి పెంచుకున్న పిచ్చి నమ్మకానికి మిగిలిన ఆఖరి గుర్తు, సత్యం వద్దు, స్వప్నమే కావాలి. ఇప్పుడిక, ‘రాత్రి కవితై పెనవేసున్న అక్షరాలు, పగలు వచనమై విడివడతాయని’ బెంగటిల్లిన రాజేశ్వరీదేవికి, తన కవితలు రేపవళ్ళు వెలిగే నక్షత్రాలై కాంతులీనుతున్నాయని ఎవరు చెప్తారు?

3 comments:

  1. :( వెనుక,ముందు మాటలు పూర్తిగా తీసేయల్సింది, జాలి వానలో కవిత్వం కొట్టుకుపోయిందీ పుస్తకంలో.

    ReplyDelete
  2. నేనూ కొంతవరకూ ఏకీభవిస్తానండీ..కాశీభట్ల అభిప్రాయమో, బదులో- ఏమనాలో దాన్ని - అటువంటివన్నీ ఉంచకపోతే బాగుండేదనే నాకూ అనిపించింది. కానీ, కవిత్వం నివురు గప్పిన నిప్పులా అన్నింటిమధ్యనా వెలిగిందని కూడా అనిపించింది.

    ReplyDelete
  3. శివలెంక రాజేశ్వరీదేవి గారి గురించి చాల బాగా చెప్పారు.మీ రైటప్ అద్భుతః ..నాకు నిజంగా ఆమె గురించి తెలియదు ఇదంతా చదివాకా ఆమె రచనలు చదవాలని ఉంది.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....