సచిన్ టెండూల్కర్

"50 .."
లోలోపల ఎగసిపడుతున్న సంతోషపు తరంగాలని ఆపుతున్న ఒక సందేహం..
"70 "
చేతిలో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ..
"80 "
ఒక్కొక్కరుగా లేచి హాల్లోకీ, వంటింట్లోకి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతూ..
"95.."

హాల్లో టి.వి ముందు ఎవ్వరూ ఉండరు. ఇల్లు ఖాళీ..మనుషులెక్కడో బాల్కనీల్లో చీకట్లో నిలబడి కనపడని చుక్కలు లెక్కపెట్టుకుంటూ..సెకను సెకనుకీ మరింత స్పష్టంగా వినపడుతున్న గుండెను బుజ్జగిస్తూ...

ఆ నిశ్శబ్దంలో నుండి..కింద ఇళ్ళల్లో అకస్మాత్తుగా ఒక కోలాహలం, అరుపులు, కేకలు వినపడేవి. అంతే! అందాకా సంశయంతో ఆగిపోయిన చేతులు కలిసి చప్పట్లతో ఇంటిని హోరెత్తించేవి ! క్షణాల్లో మళ్ళీ హాలు నిండిపోయేది. ఆ కాసేపూ మనుష్యులు లోకాలు మర్చిపోయేవారు. కోపాలు మర్చిపోయేవారు. జీవితాల్లోని అసంతృప్తులు మర్చిపోయేవారు.

హెల్మెట్ తీసి, బరువైన బ్యాట్‌ను ఆకాశం కేసి చూపిస్తూ వినమ్రంగా తల వచి, కుడి భుజంతో నుదురు తుడుచుకుని మళ్ళీ అతడు క్రీజ్‌లోకి వెళ్ళడం...

ఆ క్షణాలు ఎంత అనిర్వచనీయమైనవో చెప్పడానికి నాకు భాష సరిపోదు.

****************
పరీక్షలకు తీసుకెళ్ళే అట్టలను బాట్‌లగానూ, పచ్చి జాంపళ్ళను బాల్స్‌గానూ, కనపడిన ప్రతి గోడ మీదా బొగ్గు ముక్కతో నిలువు నామాలు దిద్ది, వాటిని వికెట్లుగా నమ్మి క్రికెట్ ఆడుకున్న పసితనం నాలోనూ కొంత ఉంది. కాలంతో పాటే అదీ చేజారిపోయింది.

మళ్ళీ ఎప్పుడు ?

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....