మానస సంగమం


తొలిసారి కట్టుకున్న కంచి పట్టు చీర అంచుల కిందుగా
దోబూచులాడే  తడి ఆరని పారాణి పాదాల అడుగుల్లో..
కాటుక  కన్నుల  కదలికల్లో దాగనన్న మెరుపుల మధ్య
క్రొంగొత్తగా కాంతులీనుతోన్న కళ్యాణపు  తిలకంలో
ప్రవాహంలా  సాగుతున్న  వేద మంత్రాల  నడుమ
సుముహూర్తాన తలపై వెచ్చగా తగిలిన నీ చేతిస్పర్శలో
రాలిపడే  ముత్యాల  తలంబ్రాల జల్లుల్లో నుండి
రహస్యంగా రెప్పలార్పుకుంటూ చూసే చూపుల్లో
బరువెక్కిన  మరుమల్లెల  పూల జడ  క్రిందుగా
మూడు ముళ్ళతో మెడలో పడ్డ పసుపు తాడులో
ఒళ్ళంతా కళ్ళు చేసుకు వీక్షించిన అగ్నిదేవుడి సాక్షిగా
ఒకరి వెనుక ఒకరం తడబడుతూ నడచిన ఏడడుగుల్లో ..
నా చుట్టూ చుట్టుకున్న నీ చేతుల మధ్య ఒదిగి
ఆకాశంలోని అరుంధతిని చూసిన ఆ అర్థ రాత్రిలో
..అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
మనం సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణాలేవో దొరలిపోయాయి.
అందాకా అపరిచితుడవైన నిన్ను ప్రియసఖుణ్ణి చేసిన బంధమూ
ఇన్నేళ్ల దూరాన్ని దూరం చేసిన రహస్యమూ
అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయాయి.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....