26 August, 2016

ఆచంట జానకీరాం: నా స్మృతిపథంలో..సాగుతున్న యాత్ర

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది. 

"ఇవిగో! ఇంకా నిద్ర లేవని
మంచు తడి ఆరని, పారిజాతాలు!!
ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;
ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ
ఈ పరిమళము మన స్నేహసౌరభము!
అందుకోవూ.."

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది. ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం - పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు: 

" నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ
గవాక్షమందుండి యొక్క తారకామణి
మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు.."

"నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు
మమతతో కూయుచు మునిమాపువేళ
గువ్వతల్లియు తన గూడు చేరునపుడు
సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు
నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను
బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు
దూరమున దీపించు నా దివ్యతార
ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు"

" I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love.."  - ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, "మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?" అని అడిగారట శర్మ గారు. 


"అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది." అన్నారు ఆచంట.

"అల్లాగా ? ఈ పద్యం విన్నారా?" అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

"కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్"

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

"హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు." అని గుర్తు చేసుకుంటారు ఆచంట. 

"చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక..." అంటూ మొదలయ్యే మరో పద్యంలో, "ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్" అంటాడు కవి. ఇందులో మొదట 'చక్కెర బొమ్మ' అన్న పదం వినగానే, మగధీర చిత్రంలో, "పంచదారా బొమ్మా బొమ్మా" అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా: 

"ఒకనాడు బుచిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : " మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో."

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు. 

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

"రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది" అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు. 

 " నువ్వూ నేనూ కలిసి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా
నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా" అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, "మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల" అన్న దేవులపల్లి గీతాలనైనా, "కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?" అన్న బసవరాజు గేయాన్నైనా,  "వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను" అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, " గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!" అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న "చేతులార శృంగారము చేసి చూతు" నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.  

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

"ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది
మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది
లలితసుందర దివ్య లావణ్య నవజీవ
మధుమాస సుధలలో  హృదయమే పొంగినది"

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, "ఎముకలు కుళ్ళిన" అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.


ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

"అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో
పాల్గొనమని నన్ను ఆహ్వానించావు
నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!
ఆనంద గీతము చెవులారా విన్నాను.
ఈ మహోత్సవములో నా వాద్యమును
నా చేతనైనంత అందంగా వినిపించాను.."

* తొలి ప్రచురణ, సారంగలో.

17 May, 2016

చిరంజీవి

అర్ధణా ఇడ్లీ మొహంతో నువ్వలా
అమాయకంగా ఎటో చూస్తోంటే
నిన్ను చిటికెలతో నా వైపు తిప్పుకోవడం
బాగుంటుంది.
నీ ఎడమ కణత మీద
నా చిటికెన వేలొక చుక్కను దిద్దుతోంటే
నీ కనుపాపలు గండు మీనులై తత్తరపడడం
గమ్మత్తుగా ఉంటుంది.
పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నే నో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
రంగులకలలా ఉంటుంది.
నిదురలో నువ్వెందుకో
ఉలికిపాటుతో లేచి ఏడ్చినపుడు
అమాంతం గుండెలకు హత్తుకుని
బుజ్జగించి నిద్రపుచ్చేశాక
కన్నుల్లో నీరెందుకో చిప్పిల్లుతుంది.
“బారసాల పెళ్ళికొడుకువై…” అంటూ మొదలెట్టి
పెళ్ళి పెళ్ళికొడుకులా ఎలా ఉంటావో ఊహించి దీవించి
కాస్త సంబరపడీ, మరికాస్త కలవరపడీ,
ఊహల రెక్కలు విదుల్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది.
తన కోసం దాచుకున్న పేరుని నీకివ్వడం చూసి
తనే మళ్ళీ నీలా వచ్చాడని నమ్మే ఈ అమ్మానాన్నల్ని చూసి
స్వర్గంలో దేవుడి బొజ్జ మీద ఆడుకుంటూ పెరిగే పసివాడొకడు
సొట్ట బుగ్గలతో నవ్వుతూ ఉంటాడన్న ఊహే, 
ఉండుండీ మనసును కోసేస్తుంది.
తొలిప్రచురణ ఈమాట, మే-2016 సంచికలో..

06 April, 2016

"లిఖిత" - శ్రీకాంత్

మరపురాని కవిత్వాన్ని, మళ్ళీ మరొక్కసారి ఈమాట ద్వారా మరికొంతమందికి పరిచయం చేయాలని సంకల్పం. అందులో భాగంగానే, మార్చ్'16 ఈమాట సంచికలో, "కొన్ని సమయాలు" సంపుటి ద్వారానూ, "లిఖిత" బ్లాగు ద్వారానూ నాకు పరిచయమైన శ్రీకాంత్ కవిత్వాన్ని గురించి నాలుగు మాటలు వ్రాశాను. ఇది రేఖామాత్రపు పరిచయమే తప్ప, ఈ కవిత్వాన్ని గురించిన సంపూర్ణమైన విమర్శ కాదని మనవి.

ఏదో ఒక సూత్రానికి లోబడ్డ కవితలే పరిచయం చేయాలన్న నియమం లేకపోయినా, శ్రీకాంత్ కాలం మీద వ్రాసిన ఐదు కవితలు మచ్చుకు తీసుకున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు, అతని కవిత్వ సంపద కోసం "లిఖిత" చూడగలరు.

*

నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు, పూనిక గల కవి చేతుల్లో మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా రూపాంతరం చెందుతాయి. మనం విస్మరించే ఈ లోకపు సౌందర్యమంతా సహస్రముఖాలతో సరికొత్తగా సాక్షాత్కరించేదీ కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ నేర్పరుల చేతి చలువ వల్లే. "లిఖిత" శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషిలోని సంఘర్షణనీ, అతని మనసులో చెలరేగే ద్వంద్వాలనీ, అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. అనిర్వచనీయమనిపించే క్షణాలను అక్షరాల చట్రంలో శ్రద్ధగా బిగించి, మరికొంతమందికి కూడా అనుభవైకవేద్యం చేయడమే ఇతని కవిత్వంలో తొంగిచూసే ప్రత్యేక లక్షణం. సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా చూపెడుతుందనడానికి నిలువెత్తు తార్కాణం ఈ కవిత్వం. లోకంలోను, మనుషుల లోతుల్లోనూ, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదంటే జనసామాన్యం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్నను కలిగిస్తుంది శ్రీకాంత్ కవిత్వం. శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పుకణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. కవి మాటల్లోనే చెప్పాలంటే, ఊయలలూగి నిదురించే  "శిశువు పెదవిపై మిగిలిన పాల తడి" లాంటి ఇష్టాన్ని మిగిల్చే అనుభవం ఈ కవిత్వాన్ని చదవడం. వెన్నెల రాత్రినీ, మంచుబిందువులు పచ్చికను ముద్దాడే ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో, శ్రీకాంత్ తన అక్షరాల సాక్షిగా పరిచయం చేస్తారు. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా కవి రెండు వేళ్ళ మధ్యా ఒడిసి పట్టుకున్న తీరు తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది.

ఒక కవిత చదవగానే, "ఇది శ్రీకాంత్ కవిత" అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వ దారుల్లో తనదైన ముద్రలు వేస్తూ సాగుతోన్న శ్రీకాంత్ కవితలు ఐదూ- కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా  -  ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో..

05 April, 2016

ఓ వేసవి మధ్యాహ్నం

నిద్దుర ముంచుకొచ్చేముందు ఓ ఐదు నిముషాలు మొండిగా ఏడవడం అలవాటు నా బుజ్జాయికి. మా అత్తగారు, "తిక్క ఏడుపమ్మా, ఇక పడుకుంటాడు, రెండు నిముషాలలా తిప్పుకు తీసుకు రా" అంటూంటారు. నిన్న మధ్యాహ్నం వేళ అలాగే కాస్త మంకుపట్టాడని తిప్పడానికి బాల్కనీలోకి తీసుకు వచ్చాను. నీడపట్టునే నిలుచున్నా, చూడటానికే ఇబ్బంది కలిగించేంత ఎర్రటి ఎండ. వచ్చినంత వేగంగానూ లోపలికి నడవబోతూండగా, పొలికేక వినపడింది. ఉలిక్కిపడి వెనక్కి చూశాను. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చెట్లు కూడా సొమ్మసిల్లినట్టు ఏ కదలికా లేకుండా ఉన్నాయి. పక్షుల కిలకిలలు అసలే లేవు. అప్పుడొకటీ అప్పుడొకటీ అన్నట్టు వచ్చి పోతున్న కార్ల శబ్దాలే, బొయ్యిమంటూ మొదలై, వెళుతూ వెళుతూ మళ్ళీ ముందరి నిశ్శబ్దాన్ని వదిలేస్తున్నాయి. కనపడ్డంతలో అందరి ఇళ్ళ తలుపులూ మూసే ఉన్నాయి. ఇంకెవరు అరిచారో ఓ క్షణం అర్థం కాలేదు. అంతలోనే స్ఫురించి కిందకి చూశాను. నా నమ్మకం వమ్ము కాలేదు.

ఇద్దరు బుడతలు. పల్చటి చొక్కాలతో దుమ్ము కొట్టుకుపోయిన దేహాలతో ఆడుకుంటున్నారు. సరిగ్గా మా ఫ్లాట్స్ వెనుకే ఉంది ఈ ఖాళీ స్థలం. దానిని ఆనుకుని రోడ్డు. రోడ్డుకి అవతలి వైపు రెండు బొమ్మరిల్లుల్లాంటి అందమైన ఇళ్ళు. ఈ ఖాళీ స్థలం పక్కన కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వీళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలే అయి ఉండాలి.  

అక్కడి పనికి ఈ స్థలంలో ఇసుక, కంకర రాసులుగా పోసుకున్నారు వాళ్ళు. ఓ మూలగా బండరాళ్ళు పడి ఉంటాయి. ఎండుపుల్లల మోపులు మరోవైపు. ఖాళీ అయిన పెయింట్ డబ్బాలనే బకెట్లుగా వాడుకుంటూ, ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కుని పారబోసిన నీళ్ళు ఇంకో దిక్కున. వాళ్ళూ వీళ్ళూ విసిరేసిన చెత్తా, ప్లాస్టిక్ కాగితాలు మరోవంక. వీటన్నింటి మధ్యలో వాళ్ళిద్దరూ. చంకలో కర్రలు దోపుకు కూర్చుని, మట్టి తవ్వుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ ఏవో ఆటలు. రెండో అంతస్తు నుండి వాళ్ళనలా చూస్తూంటే, ఎందుకో చప్పున భాగవతంలో బాలకృష్ణుడు చల్దులారగించే ఘట్టం గుర్తొచ్చింది. చిన్నికృష్ణుడి చేతిలోని ఊరగాయకు బదులు ఇక్కడొకడి వేళ్ళ మధ్యలో ఎర్రటి బంతి. రెండోవాడు బలరాముడో, గోపబాలుడో!  

ఒక్కసారిగా విజయవాడలో మా ఇల్లు గుర్తొచ్చింది. సెలవ రోజుల్లో అక్కడ కూడా మా బాల్కనీలో నిలబడితే, సమయంతోనూ, సూరీడి ప్రతాపంతోనూ నిమిత్తం లేకుండా కింద కోలాహలంగా పిల్లలంతా క్రికెట్ ఆడుతూ కనపడేవాళ్ళు. ఇలాంటి వేసవిగాలుల మధ్యాహ్నాల్లో అమ్మలు ఎంత గోలపెట్టినా వినకుండా అందరూ అక్కడికే చేరేవాళ్ళు. వడదెబ్బ తగులుతుందనీ, ఎండకు మాడిపోతారనీ ఎవరెన్ని చెప్పినా లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. మా అపార్ట్మెంట్‌లో పిల్లలకి తోడు, వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళూ కూడా వచ్చేవారు. ఆఖరు పరీక్షలకు పాఠాలన్నీ అమ్మలకు అప్పజెప్పి, పై ఇళ్ళ వాళ్ళం కూడా గోడ మీద గడ్డం ఆన్చుకు తీరిగ్గా కూర్చుని, ఆటనీ, వాళ్ళ అల్లరినీ చూసేవాళ్ళం. ఆడని వాళ్ళు, మనుష్యులెక్కువై ఆటలో చేరలేని వాళ్ళు, కిందే పిట్టగోడ మీద కూర్చుండిపోయేవాళ్ళు. మా కాంపౌండ్‌ని ఆనుకునే కాలేజీ గ్రౌండ్, ఎప్పుడూ ఖాళీగా ఉండేది. వీళ్ళు కళ్ళు తిరిగే షాట్ ఏదైనా కొడితే, అదెక్కడ పడిందో పై ఇళ్ళల్లో కూర్చుని చూస్తోన్న మేమే చెప్పాలి. అలా ఎవరైనా షాట్ కొట్టాలనీ, దూరంగా ఎక్కడో పడితే మేం గమనించి చెప్పాలనీ భలే తహతహగా ఉండేది. అలా కాకుండా అప్పుడప్పుడూ కొందరు గుడ్డిగా కళ్ళు మూసుకు నిట్టనిలువుగా పైకి కొట్టేవాళ్ళు, అప్పుడు ఏ ఇంటి కిటికి అద్దాలో  భళ్ళుమని పగిలేవి. "మిట్టమధ్యాహ్నం వేళ వెధవ ఆటలూ మీరూనూ, శుభ్రంగా పోయి పడుకోక.." అని పెద్దవాళ్ళు కొందరు తిట్టినా, మగవాళ్ళు "చిన్నప్పుడు మేం ఆడినా ఇలాగే పగిలేవి, పోనిద్దూ" అని వదిలేసేవాళ్ళు. నిద్ర చెడగొట్టినందుకు మాత్రం కొందరి కళ్ళు చింతనిప్పులు కురిపించేవి. ఇబ్బందులే రానీ, ఆటగాళ్ళకి దెబ్బలే తగలనీ, చీకటి పడందే ఆట మాత్రం ఆగేది కాదు. మా ఫ్లోర్‌లో పడితే, చింటూ వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళింట్లో దూరి ఆ బంతి మళ్ళీ కిందకి వేసే పని నాకప్పగించేవారు. ఆ దొంగపని చేయడంలో ఎంత గర్వం! సందులో సందు, పక్కింటి మామ్మగారి తోటలో నుండి చేతికందిన కాయలు, జామకాయలో మామిడికాయలో, నాలుగు కోసుకుని తినేసేవాళ్ళు. కుదిరితే, మిగిలితే, మా పిల్లమూకకీ ఒకట్రెండు ముక్కలు ఇచ్చేవాళ్ళు. మామ్మగారి నూతిలో బంతి పడితే అప్పటికప్పుడు కొత్త బంతి తెచ్చుకుని ఆట సాగించుకునేవాళ్ళు. చెప్పిన మాట వినకుండా ఆటలకు వెళ్ళినందుకు శిక్షగా, చాలామంది ఇళ్ళల్లో తలుపులు తాళాలు వేసేసుకునేవారు. అంటే, ఆటలో పేచీ వచ్చినా, ఆట ఆగినా ఇంటికి వెళ్ళడం కుదరదన్నమాట. అప్పుడూ మళ్ళీ మేమే దిక్కు. పై నుండి చల్లటి నీళ్ళ బాటిళ్ళు విసిరేస్తే తాగుతూ కూర్చునేవారు. ఈ ఆటనిలా చూడటంలో ఎన్ని సాయంత్రాలు గడిచిపోయాయో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అలా ఒక పక్క వీళ్ళనీ, ఇంకో పక్క షార్జాలో సచిన్‌నీ చూసీ చూసే, అప్పట్లో సచిన్ మా ఇంటి వెనుక ఆడీ ఆడీ ఆ పిట్టగోడ మీదే అలసట తీర్చుకోవడానికి కూర్చున్నాడని కలగన్నాను. కలే, కానీ అందమైనది. తల్చుకున్నప్పుడల్లా భలే తమాషాగా అనిపిస్తుంది. ఈ ఆట లేని జీవితమా?! ఊహకే అందదు.

భుజం మీద నా బుజ్జాయి మాగన్నుగా జోగడం మొదలెట్టగానే వాడి మెత్తటి పక్క మీద హడావుడిగా పడుకోబెట్టి మళ్ళీ బయటి బలరామకృష్ణులను చూడటానికి వచ్చాను. ఇద్దరూ ఈ సారి సఖ్యంగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మళ్ళీ అనిపించింది, ఈ ఆట లేకపోతే మన దేశంలో పిల్లల బాల్యం పూర్తవ్వదేమోనని. ఏ నియమాలూ అక్కర్లేదు. పదకొండు మంది ఆటగాళ్ళూ, 22 గజాల కొలతలూ..ఊఊహూ..ఇవేమీ అక్కర్లేని జల్సా ఆట మనవాళ్ళది. వీళ్ళూ అంతే, దుందుడుకుగా చేతికి దొరికిన అట్టలతో, కర్రలతో ఆ పాతబంతిని బాదేస్తున్నారు. నేను చూస్తూండగానే ఒకడు కొట్టిన వేగానికి బంతి వెళ్ళి బండరాళ్ళ మధ్యలో పడింది. వాళ్ళిద్దరూ గొడవలోకి దిగిపోయారు. అంతదూరం ఎందుకు కొట్టావనో, అలా కొడితే అవుటనో..ఏమిటో వాళ్ళ గొడవ. నాకర్థం కాలేదు కానీ వాళ్ళని చూస్తూ అక్కడే నిలబడ్డాను. మరో ఐదు నిముషాలకి ఆ గొడవ చల్లబడ్డాక బంతి కోసం వెదకడం మొదలెట్టారు. రాళ్ళ అడుక్కి వెళ్ళిపోయి ఆ బంతి పైకి తేలిగ్గా కనపడం లేదు. బంతి పడ్డప్పుడు వాళ్ళ ధ్యాస అక్కడ లేదు కాబట్టి వాళ్ళకదెక్కడ పడిందో గుర్తు రావట్లేదు. అన్ని దిక్కులూ చూస్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు, కవ్వింపుగా మాటలనుకుంటున్నారు. నవ్వొచ్చింది. మనసు మళ్ళీ గతంలోకి తొంగి చూసుకుంది. "అటు వైపు.." - బిగ్గరగా అరిచి చెప్పాను - వాళ్ళు పైకి చూడగానే చేతితో ఎక్కడ పడిందో సైగ చేసి చూపించాను. అక్కడ చూడగానే ఇట్టే కనపడింది వాళ్ళకి. బంతి దొరగ్గానే గాల్లోకి ఎగరేసి నవ్వాడొకడు. అది అటునుండటే తన చేతుల్లోకి అందుకుటూ పరుగు తీశాడు రెండో వాడు. ఇద్దరూ మళ్ళీ నా వైపు చూళ్ళేదు. నేను లోపలికి వచ్చేశాను. పక్క సరిచేస్తుంటే కళ్ళు విప్పిన బుజ్జాయిని పదే పదే ముద్దాడాను. కింద ఆట ఆగలేదనట్టు చాలా సేపు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. 

04 April, 2016

ఇదే దారి


తెలిమబ్బు తొంగి చూసుకుంటుందని
కావి రంగు నీటి అద్దాన్ని
ఆకులు అదేపనిగా తుడిచే దారి

సరిగంగ స్నానాల్లో
కొబ్బరాకులు వణికి వణికీ
ఒళ్ళు విదుల్చుకు నాట్యాలాడే దారి

ఎవరో విసిరిన గచ్చకాయ
పచ్చిక పైపెదవిపై పుట్టుమచ్చలా
కవ్వించి ఆకర్షించే దారి

నీలి నీలి పూవులు
గరిక కురుల్లో నవ్వీ నవ్వీ
నీలాకాశపు తునకల్ని నేలకు దించే దారి

ఒక పసిపాప కేరింత, పేరు తెలియని పక్షి కూతా
నీరెండ కిరణాల్లా ఏ వైపు నుండో తేలి వచ్చి
ఉదయాన్నే హృదయాన్ని వెలిగించే దారి.

* తొలిప్రచురణ సారంగలో.