జాబిలి తునకా!

 నిన్ను కనిపెట్టమని ఎందరినైనా కవ్వించు. ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఎంతకైనా బెదిరించు. మాయముసుగు సరిచూసుకుంటూ ఎన్ని దూరాలైనా పరుగెట్టు. మసక సంధ్య కొసల్లో గుమ్మంలో నిలబడి నేనిలాగే ఎదురుచూస్తుంటాను. నా వేల ఊహల్లో నుండి రూపు కట్టుకు జారిపడ్డ జాబిలి తునకా! మోచేతి ఒంపులోకి ఆత్రంగా నిన్నందుకున్న ఆ తొలి నెలల్లో, నా కళ్ళల్లోకి వెదుకుతూ నువు చూసిన చూపులు జ్ఞాపకమున్నంత కాలం, ఎన్ని వందల ముసుగులు ఎదురుపడనీ, నీ రూపును అప్పటి క్షణాల సాక్షిగా పోల్చుకుంటాను. కలిసి నా లోపల, కదిలి కొన్నాళ్ళలా, పచ్చి వాసనలతో నువ్వు నా పక్కన చేరి కేర్ర్...ర్ర్..మన్నప్పుడు...ఆ అలవాటు లేని దగ్గరితనానికి దడదడలాడిన ఈ గుండె కొట్టుకున్నంతకాలం, ఎన్నిశబ్దాలు చుట్టుముట్టనీ, నీ సన్నటి గొంతులోని రవ్వల మెరుపుల్ని జల్లెడ పట్టుకు గుర్తుపడతాను. దోగాడిన నీ బాల్యమ్ముందు నా సమస్త జీవితాన్నీ ఆటగా పరిచి పాలనవ్వులు ఏరుకున్నదాన్ని, తేనెగారే నీ మోవి మాటలు తాకాకే ఈ జీవనమాధుర్యాన్ని పట్టి చూసుకున్నదాన్ని. ఒరేయ్, ఊగే నీ చేతుల్లోని అల్లరిని పట్టి ఆపడం నాకెంతసేపు పని! అన్ని ఆటలూ పూర్తైన అలసటలో నా పక్కన ఒదిగి పడుకుంటావు, అరచేతిని చెంప కిందుగా పరుచుకుని, అచ్చం మీ నాన్నలాగే. నుదుటి మీదకు వాలుతోన్న ఉంగరాల జుత్తును వెనక్కి తోస్తోంటే, పూలకొమ్మలు ఊగినట్టు నవ్వుతావు, నిదురలోనే. కోమలమైన నీ నవ్వు నా రాత్రిని హత్తుకుంటుంది. మినమినలాడే వెన్నెలచినుకుల్లో రేకూ రేకూ విప్పుకుంటోన్న పరిమళ పుష్పం లాంటి ఈ రాత్రిని...నీ నవ్వు...మృదువుగా...

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....